ఇసక-2

ఆదివారం చీకట్నే దొడ్డ గొప్ప సమరోత్సాహం తోటి గట్టిగా హనుమాన్‌ చాలీసా వల్లించుకుంటూ ఇడ్లీల పొయ్యి పెట్టింది. భాస్కర కుమార్‌ ఇట్నించొచ్చి ఒకటీ అట్నుంచొచ్చి ఒకటీ కొబ్బరి ముక్కలు తినెస్తుంటే ‘ పచ్చడి రుబ్బీవరుకూ ఆగవా? ‘ అని విదిల్చుకుంటూ, ” ఇంటి నిండా ఈ ఇసకేఁవిట్రా వాళ్ళిసక వాళ్ళని పట్టూపొమ్మను సుమీ చెప్తునాను భాస్కరా ఇదీగోటి! ” అని సణుక్కుంటూ. సూక్ష్మ రూప ధరి సియహి దిఖావా వికట రూప ధరి లంక ఉజావా అని ఆతీ ప్రకాష్‌ మీద గెలవబోతున్న యుద్ధానికి మనసులోనే రిహార్సల్స్‌ వేసుకుంటున్నాది తొన్నాడు రాత్తిర్నుండీ. శనివారం సీటీవో గారూ వాళ్ళూ వచ్చినప్పుడు సీటీవో గారబ్బాయి దొడ్డ పెట్టిన మిక్చర్‌ ఎత్తి నోట్లో వేసుకుంటూ ‘ ఇది మనూరైపోయింది గానీ ఇదే విజైవాడా సైడైతే ముందు ఒక్కాలో జబ్బో తీయించేసేసి ఆనక మాటాడతారు మామ్మ గారూ! ‘ అని రౌడీల్ని బెత్తాయించి ఒక జబ్బ, లేకపోతే ఒక కాలు ఎలాగ తీయించెస్తారో గొప్ప పరాక్రమంతో అభినయం చేసి చూపిస్తే ‘ ఔను మరీ! మరి తీసీరా…. ‘ అని. నందగోపాల్‌ రాత్రే వచ్చి కబుర్లు వింటూ పడుక్కున్నాడు కాని దొడ్డకి అతని మీద పెద్ద అభిప్రాయం ఏమీ లేదు. ” ఆ రేడియో అబ్బాయినెందుకురా శ్రమ పెడ్తావు పాపం? బెల్లం కొట్టిందిమ్మ లాగ అలా వొచ్చి కూచుంటాడు రాఁవ రాఁవా? ” అని తీసి పారీసింది. ‘ ఇసక పంతులు గారి జట్టు ఉండబట్టి గాని బండారు వాడి మొహం చూసీ నంద గోపాల్‌ మొహం చూసీ ఎవడు ఖాళీ చేస్తాడు? ‘ అని పైకే అన్నాది. దొడ్డ ప్రపంచం నిండా పెద్ద పొజీషన్లో ఉన్న వాళ్ళు, పెద్ద ఆఫీసర్లు, ‘ ఇప్పుడు వోరుగంటి సుబ్బాబు గారనీసి బొంబాయి ఇన్కంటేక్స్‌ లో పెద్ద ఆఫీసరు గారు మన పెదరత్నాజీ పెళ్ళానికి అంతర పింతర మేనమాఁవ? ‘ అని అటువంటి మహాత్ములూ, చక్కతనాలుగా ఉండేవాళ్ళూ, శ్రీమంతులూ, ఏసీటీవోలు, డీసీటీవోలు, కేసీటీవోలూ, ‘ కిధరపూరు లోన ఇప్పుడూ తోటలో చిట్టి కాఁవుడు గారనీసీ … వాళ్ళాయన వొవ్వో పెద్ద ప్రొఫెసరు గారనీసి ఆ రోజుల్లోన ఎత్తాయిసుగా చెప్పుకునీవారు, వాళ్ళ పిల్లలు ముగ్గురూ అమిరికా లోనే పెద్ద పొజీషన్లో వున్నారు! ‘ అని అటువంటి పూజ్యులూ మేధావులూ పుస్తకాలు రాసిన వాళ్ళూ విశ్వనాధ కవిరాజు గారూ కవిరేణం జోగారావు గారూ జోగన్నవలస కారేపూడి అయ్‌బాబు గారూ మహీంద్రా ఎండ్‌ మహీంద్రా డీలర్‌షిప్పు తీసుకున్న వేదుల నీలకంఠం గారూ వాళ్ళూ దాని లోకం నిండా. ఇలాటి మనుషులందర్నీ గొప్ప ప్రయత్నం చేసి తప్పించుకుంటూ భాస్కర కుమార్‌ లోకంలో ఎంచేతనో చిన్నప్పట్నుండీ సొట్ట నాకొడుకులూ, గుడ్డి నాకొడుకులూ, వెర్రి నాకొడుకులూ, బెజ్జుగాళ్ళు, నానుముచ్చుగాళ్ళు, టొప్పాసి నాకొడుకులూ, తిత్తా పప్పా గాళ్ళూ, ఉడుద్బుద్బో అని మాటాడే నత్తి నాకొడుకులూ, తోస్తే పడిపోయీ ముసిలి వాళ్ళూ, ‘ ఆయే అప్పా బావా డక్కాజీ….లోకసు లోలోనీ! ‘ అని పెరళ్ళలో దొనిగర్రలు పట్టుకుని ఇగటాలాడుకుంటూ కరేపాకు అమ్ముకుంటూ తిరిగే రెల్లివాళ్ళూ, కిళ్ళీ వుమ్మి కార్చుకుంటూ తెలివితేటలైన గౌరవాలన్నిటి మీదా ‘ థూ నివ్వు పోయే నియ్యమ్మా ముత్తరాసి రండ నాయాలీ ముండా! ‘ అని ఊస్తున్నట్టు శూన్యం లోకి చూస్తూ కూర్చునే కేశవరాజులు, ‘ అనామినారే డబకు డబా రే ‘ అని పందుల్ని అదిలించే చచ్చడి గుంటలూ, ‘ పుణుకులేయ్‌ కజ్జిపుండ్లేయ్‌ ‘ అని బస్సుల కిటికీలంట పరిగెట్టే గుంట్నాకొడుకులూ, వంటలు చేసుకుంటూ అమృతాంజనం కాకనూని ముక్క వాసన వేసే దేవుళ్ళమ్మలూ, పిలవకుండా రైల్లోకొచ్చి టర్రు టకచిక టకచిక టకచిక టకచిక మని పలక చిడతలు తిప్పి కనుగుడ్లు తేలవేస్తూ ‘ వింటారా మీరంతా? వినుపించుతాను కొంతా?? మన యేసు చరితము అంతా…! ‘ అని పాడే మూర్ఛ వాళ్ళూ, బస్సుకి దిగబెట్టడానికి పెట్టెలు తలకెత్తుకుని చెప్పుల్లేకుండా రవికెల్లేని చంకల దగ్గిర ముడతల పచ్చబొట్ల చర్మం వేలిపోతూ ఊగుతూ నడిచే వాళ్ళూ. ‘ అమిరికా నుండి అందరి పిల్లలూ వీడియాలూ డీవీ ప్లేయర్లు తెస్తే మా పిల్లడు చేతులూపుకుంటూ వొచ్చేడు. వీడి సాటివాళ్ళు దిల్‌సుఖ్‌నగర్‌లో పదహారేసి లక్షలు పెట్టి ఎపార్ట్‌మెంట్లు కొనుకుంటునారు…. వీడికి చేతా కాదూ వాతా కాదూ ‘ అని విసుక్కుంటుంటే తనని గురించి expectations ఉన్న అందరికీ ఇచ్చినట్టే దొడ్డకీ వెర్రి చూపులు సమాధానంగా ఇచ్చి ‘ ముచి ముచి నవ్వుల లోనా ‘ పాట పాడి నవ్వించి ప్రసన్నం చేసుకుంటాడు భాస్కర కుమార్‌. ” దొడ్డకి మనం యుద్ధానికి తగిన allies కాఁవు గోపాల్‌ ” అంటే ” అందుకే ఇసక పంతులు గారున్నాడు కదా ఆయన చూసుకుంటాడు ” అని పెదవులు విడకుండా నవ్వుతూ ఒకరోజు గడ్డం తడుముకుంటూ ముగ్గుల్ని చూస్తున్నాడు నంద గోపాల్‌.

సూర్యుడి కంటే, ఇసక పంతులు గారి కంటే ముందు హైమవతి గారు వొచ్చింది. తాడు కట్టిన ఫైళ్ళు సంచీలోంచి పైకి తీసి “చూడండి?! Rent Control Act! ” అని చూపిస్తున్నాది. “మా ఫ్రెండ్‌ ని కనుక్కున్నాను. కొళాయి గొట్టాలు dysfunctional అయితే అవచ్చు! Thats a separate issue… కానీ ఇల్లు ఖాళీ చెయ్యకుండా మీ దొడ్డని harass చెయ్యటానికి అతనికేం rights లేవు…! అంటే legally speaking… ” అని బాల్‌ పెన్ను తిప్పుతూ. పన్నీ రాజరత్నం, కె. రమణ కుమారి, పలగర మరియ ఇలాంటి పేర్లుండే అమ్మాయిలు పుస్తకాలు వినమ్రంగా గుండెలకి హత్తుకుని ఇటూ అటూ నడుస్తుంటే ప్రజాస్వామ్యం మానవ సంబంధాలు చారిత్రక శక్తుల మధ్య ఘర్షణ ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు వెతికిస్తూ ఆవిడ ఆర్స్ట్‌ కాలేజీ జేగురు మెట్లు దిగుతూ వుంటే చక్కని తల్లికి చాంగు బళా అన్నట్టు వుంటుంది. ఎండలకి ఎండుతున్న చెట్లు బుర్రలు ఊపి చల్లబాటి వేళ ఊపిర్లు పీల్చుకుంటాయి. కలెక్టరేట్‌ డౌన్‌ దెగ్గిరా వీసీ గారి బంగళా పక్కల్లంటా రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ దగ్గిర టెంట్లు వేసి ఎండుగా హవాయి చెప్పులూ నిరాశ మొహాలూ వేసుకుని పీజీ కోర్సుల వెయిటింగ్‌ లిష్టుల్లో పేర్లు చూసుకుని లాస్ట్‌ బస్‌కి తిరిగి వాళ్ళ ఊళ్ళు వెళిపోయే పిల్లల కళ్ళు ఈవిడ్ని దూరం నుండి చూసే దీపాల్లా వెలుగుతాయి. తెల్లటి పువ్వుల బెంగాల్‌ కాటన్‌ చీరలు కట్టుకుని ఎర్ర గొడుగులు వేసుకుని ఎండల్లంట చెమట్లు తుడుచుకుంటూ మధుర మీనాక్షి మొహాన్న చిన్న వంగిన ఆల్చిప్పల్లాగ నవ్వి ” ఊఁ! చెప్పండి…సోషియాలజీ జాయిన్‌ అయిపోతారా? లేకపోతే పబ్లిక్‌ ఎడ్మిన్‌ష్ట్రేషనే కావాలంటే మేషారికి మీ పేరు వెయిటింగ్‌ లిష్ట్‌లో పెట్టీమన్చెప్తాను…? ఊఁ…? ” అని బుజ్జగించే ఇలాటి తల్లుల చీర చెంగుల నీడల్లోన ధర్మం కుంటి కాలు ఈడ్చుకుంటూ, పోలియో కాలు ఈడ్చుకుంటూనే ఇంకా బతుకు మీద ఆశ ఒగిలీ కుండా కేంటీన్లో వన్‌ బై త్రీ టీ లు అరువు చెప్పుకుంటూ UPSC చలాన్లు కట్టుకుంటూ సోడాలు తాక్కుంటూ సొట్ట సొట్టగా ఇటూ అటూ తిరుగుతోందంటే అది ఇటువంటి తల్లుల భిక్షే. ఇవన్నీ ఏఁవీ స్పృహలో లేకుండా చూరు కిందికి వంగి గుమ్మంలోకొచ్చి ” రండ్రండి… దింపెస్తాను రండి! ” అన్నాది. “ఇడ్లీలు తినీసెలిపోదాము రండి” అని పిలిచేడు. ఇడ్లీ ముక్క తుంపి పళ్ళ మధ్యన పెట్టుకుని “ఆతీ ప్రకాష్‌ గురించి … ఊఁ? …..డోంట్‌ వరీ! అతను educated అన్నారు కదా? ఇదిగో చూడండి లీగలీ మీకేం రైట్‌ లేదు ప్లీజ్‌ వెకేట్‌ …” అని ఎలా చెప్పొచ్చో ఇడ్లీతో అభినయం చేస్తూ. “ఎడ్యుకేటెడేనండీ అదే వొచ్చీసింది ఎదవ గొడవ!” అంటే పడీ పడీ నవ్వింది. అలాంటి ప్రజాస్వామ్యవాది తోటి ‘ ఆతీవోడింటి మీదికి దండయాత్రకి వెళ్తున్నాము ‘ అని ఎలాగ చెప్పాలా అని అవకాశం కోసం చూస్తూ కూర్చున్నాడు భాస్కర కుమార్‌.

బండారు బేకుగాడు సొట్టనాకొడుకు. అవంతి గరెల్లి అరుగు పక్కన ఆపి ఇంట్లోకి మెట్లెక్కి రాడానికి వాడు కష్టపడుతుంటే హైమవతి గారు లేచి చెయ్యి అందించింది. ‘ కోవిలకెళ్ళి సంబారాలిచ్చీసొచ్చేను ‘ అని సంజాయిషీ ఇచ్చి ఇడ్లీ అందుకున్నాడు. ” ఏట్రా రామజన్మభూమీకి ఎల్తనట్టు ఇంతలెక్కన చిందూర బొట్టు పెట్టీసేవు? ” అని జబ్బలు పట్టుకుని కుదిపితే ఎత్తు పళ్ళు ఇకిలిస్తూ ” ఎహే ఎల్లబే! ఆంజనేస్వాం నామంబే నీ యబా!! ” అని చాలా సరదా పడిపోయేడు. గొట్టీ పిక్కలు సూటిగా కొట్టడానికి, ASDFGF అని, ‘ వకరపషా వకరపషా ‘ అనీ టైపు కళ్ళు మూసుకునైనా పట పట పటా జోరుగా కొట్టడానికీ వాడికి చాలా పేరుండేది. వాడి అసలు పేరు భండారు దక్షిణామూర్తి. చిన్నప్పుడు పోలియో చుక్కలు తేడాలొచ్చీసి వాడి కుడి కాలు మెడ్డుకుంటూ ‘ బ్రేక్‌ ‘ నొక్కినట్టు నడుస్తాడని వీధిలో గుంట్నాకొడుకులందరూ వాడికి బ్రేకుడని పేరు పెట్టేరు. వీధిలో పాడీ సూదిగా విసిరి సిరగట్టు ముక్కల పేక దొంతర్లు గెల్చుకుని విజయోత్సాహం తోటి వాడు ఒక చెయ్యి నడుమ్మీద వేసుకుని రెండో చేతిలో గెల్చుకున్న పేకముక్కలు ప్రదర్శిస్తూ “మేరీ సప్పూనక్కూ రానీ కబ్బూ ఆయేగిత్తూ….” అని సొట్టకాలు ఎగరేసుకుంటూ గుండ్రంగా వలయాలు తిరుగుతూ డేన్స్‌ చేస్తుంటే సంతోషం పట్టలేక ‘ మేరీ బండ్రిగిత్తా ఆయేగిత్తా ఆయేగిత్తా! ‘ అని వాడ్ని కావిలించుకున్నప్పట్నుంచీ భాస్కర కుమార్‌ ఏ యుద్ధం వచ్చినా బేకుడ్ని వెంటపెట్టుకుని వెళ్తాడు. బేకుగాడు నిజానికి ఏ యుద్ధానికీ పనికిరాడు. అంటే వాడికి ‘ ఏ వల్లకాడూ ‘ తెలీదు. యుద్ధం దాకా ఎందుకు, జీవన సమరానికే పనికి రాడు. మందుల షాపులో పద్దులు రాసి టైపులు కొట్టే ఉద్యోగానికే తప్ప. కాని వాడు తలంటు పోసుకుని ఉన్న రోజు సొట్ట కాలు మెడ్డుకుంటూ చెప్పా పెట్టకుండా కర్టెన్‌ తోసుకుని ‘ బాచీ! బాచీ?! ‘ అని అరుచుకుంటూ ఇంట్లోకొచ్చెస్తే వాడి నవ్వు జనావళికి శుభం పూచి పునాదిగా ఇక ఇళ్ళు లేచి శాంతి కాంతి క్రాంతి లాగ కల్మషం లేకుండా తెలివితేటలు లేకుండా ఎన్ని ‘ గ్రీటింగ్స్‌ ‘ ఇచ్చుకున్నా, ‘ ప్రేమతో మీ.. ‘ అని ఎన్ని రకాలుగా రాసుకున్నా, I am O. K.! You’re O. K.! They’re not O. K.! అని కొత్త కొత్తవి ఎన్ని చదివీసొచ్చినా సరే మనిషికీ మనిషికీ మధ్య ఎప్పుడూ అక్కడే క్రీనీడలో రహస్యంగా తుప్పు పట్టిపోయి ఊగుతూ ‘ థడ్‌ ‘ మని బరువుగా గుద్దుతుండే బండ లాటిది అది ఏదో లేనే లేకుండా హాయిగా ఉంటుంది.

” ఇంటి నిండా ఈ ఇసకేఁవిటిరా? ఇసకెందుకు వేయించీసేవు అడ్డసుడిగాను..? ” అని సణుక్కుంటూ దొడ్డ కళ్ళాపి చల్లి ముగ్గులు పెడుతుంటే నందగోపాల్‌ లేచి ఇంట్లోకి రాకుండా ఆ ముగ్గులు చూస్తూ నిలబడ్డాడు. లారీ హడావిడిగా రివర్స్‌ చేయించి ‘ ఏటండీ రడీయా? ‘ అని కేకేసుకుంటూ ఇసక పంతులు గారొచ్చేడు. భవానీ మాల వేసుకున్నప్పటి ఎర్ర తువ్వాల మెడలో వేసుకుని వీభూతి బొట్టు పెట్టుకుని అక్కిరెడ్డి పాలెం జట్లు బండిలో వేసుకుని. ఎర్రలుంగీ ఉషారుగా మడత పెట్టి ముడేసుకుంటూ ‘ అమ్మాయే సన్నగా… అర నవ్వే నవ్వగా…. ‘ అని ఉషారుగా విజిల్‌ పాట పాడుకుంటూ. ముందు కోరీ లారీ వెనకాల కార్లు ఆ వెనక రాజ్‌ దూత్‌ వెనక అవంతీ గరెల్లి చీకట్నే గుమ్మం ముందు నిలబెట్టి ‘ ప్రకాష్‌ గారూ? ప్రకాష్‌ గారు?! ‘ అని తలుపులు కొడితే ఆతీ ప్రకాష్‌ వాళ్ళ వెర్రన్నదమ్ముడొచ్చి తలుపు తీసేడు. బక్కగా ఒక తెల్ల లుంగీలోనే ఎప్పుడూ గుండెల మీద ఎముకలు కనిపిస్తూ ఉంటాడు. స్నానం చేసి తువ్వాలు ఆరేసుకుంటూ వచ్చి. ఎప్పుడూ నవ్వుతున్నట్టే మీది పళ్ళన్నీ పైకి కనిపిస్తూ సూటిగా ఏమీ బెరుకు లేకుండా కళ్ళల్లోకే చూస్తూ ఉంటాడు. ఇసక పంతులుగారు అతన్ని తప్పించుకుని లోపలికెళ్ళి జాబిరీలో లైటు తనే వేసి మర్యాదగా ” అన్నయ్యుంటే పిలమ్మా! ” అని ఆజ్ఞాపించేడు. భవానీ మాల తువ్వాలు మెళ్ళోంచి తీసి అక్కడున్న రెండు కుర్చీలు, ఒక బల్ల బోర్లించిన పేకేజీ డబ్బాని దులిపి ‘ రండిలాగొచ్చియ్యండి! కాదు ఇవాళాదివారం తొందర్లేం లేవు. కూర్చోని….! తాపీగా…!! ‘ అని బోధిస్తూ బేకుడ్ని నంద గోపాల్ని భాస్కర కుమార్ని దొడ్డని హైమవతి గార్ని ఆ కుర్చీల మీద బల్లల మీదా సర్ది తను రెండు చేతులూ గుమ్మం మీద పెట్టి గదిలోకీ వాకట్లోకీ ఊగుతూ ఆతీ ప్రకాష్‌ కోసం కళ్ళు చికిలిస్తూ. పొట్టప్పారావు కోరీ జట్టుని డ్రైవర్నీ బండి దింపి అరుగు మీదే నిలబడుంటే ” అక్కడే ఆగిపోతావేటమ్మా అప్పా ఱా..? రండిలాగొచ్చియ్యండి..! ” అని అందర్నీ చేతులు పట్టుకుని, భుజాల మీద నెట్టుతూ గదిలోకి తెచ్చి నిలబెట్టేడు. పొట్టప్పారావు, కూలీలు ముగ్గురూ తలచుట్టలు చేతుల్లోకి తీసుకుని ఒక వారకి నిలబడి వినోదం ఆశ్చర్యం నిండిన మొహాలతో నారింజపండు రంగులో OUM! SWEET OUM!! అని పెద్దక్షరాలు రాసి ఉన్న ఫొటోనే తదేకంగా చూస్తున్నారు. వెర్రన్నదమ్ముడు ‘ మీరందరూ మా ఇంటికెందుకొచ్చేరు? ‘ అని నవ్వు మొహంతోనే అడుగుతున్నట్టు నడి వాకట్లో తిరగలి ఉండే దగ్గర నిలబడ్డాడు. తెల తెలవారుతున్న వెల్తుర్లోన భాస్కర కుమార్‌ ఇంట్లోంచి ఆ వీధినీ చుట్టూ ఉండే పేటలనీ ఇష్టంగా చూసుకున్నాడు. ఆతీ ప్రకాష్‌ ఇల్లు ఖాళీ చేసీసినట్టూ, మళ్ళీ ఇష్టమైన ఈ పేటల్లోంచీ సందుల్లోంచీ మళ్ళీ రంపప్పొట్టు పొయ్యిలు వండుతున్న వాసనలు ఉప్పు బండీలు డౌన్లో పరిగెడుతున్న చప్పుళ్ళూ లోతుగా పాతాళానికి ఉండే వీధి నూతుల్లోన చేదలు దూకుతున్న సందడీ పెద్ద పెద్ద చేపలు ఒకొక్కటీ రిక్షాల్లో కదులుతున్న దృశ్యాలూ నిర్భయంగా చూసుకుంటూ నడుస్తున్నట్టూ.

ఆతీ ప్రకాష్‌ కళ్ళు నులుపుకుంటూ రేబాన్‌ కూలింగ్‌ గ్లాసెస్‌ బొట్టూ ఏమీ లేకుండా వచ్చి అందర్నీ చూసి ‘ ఇదంతా ఏంటి? ‘ అన్నట్టు ఆరోపణగా దొడ్డని చూస్తూ నిలబడ్డాడు. సహజ కవచ కుండలాలు ఏమీ లేకుండా బనీనూ లుంగీతో నిద్దట్లో లేచొచ్చి నిలబడ్డ వాడ్ని దొడ్డ ఎప్పటికంటే కూడా మరింత మర్యాదగా నెమ్మదిగా ” ఏంటి ప్రెకాషూ! నీతోటి కొంచెం మాటాడాలి మా వాడు….! ఓసారి ఇలాగ రా! కూర్చో! ” అంటుంటే అతను ఇందరు కొత్త మనుషుల ఈ అయోమయం ఎలా తట్టుకోవాలని ఒక నవ్వు తెచ్చిపెట్టుకుని ” ఏంటి సండే మోర్నింగొచ్చీసేరు? ” అని అంతే మృదువుగా అంటున్నాడు. దొడ్డ ఠీవిగా కుర్చీలో సర్దుకుని ” సండే అయితే ఏఁవీ? మావాడికి నీతోటి పనున్నాదిట..! ” అని చిరునవ్వుతోటే అన్నాది. ఆతీ ప్రకాష్‌ బెదురుతూనే బింకంగా ” ఏంటండీ మీవాడి తోటీ….? ఆఁ…. కాదు ఏంటి? అసలు పొద్దున్నే వీళ్ళందరూ ఏంటి అసలు ఏంటసలు మీ ఉద్దేశం….? ” అని అప్పటికప్పుడు యుద్ధ వ్యూహం తడబడుతూ ఆలోచించుకుంటున్నాడు. ఈ సందడికి ఆతీ వాళ్ళ చిన్నమ్మలు, ఆ వెనకే ప్రకాష్‌ వాళ్ళమ్మ వచ్చి వాకిట్లో నిలబడ్డారు. దొడ్డ ఇంకా మర్యాదగా ” కాదు ఉద్దేశాలకీ దీనికీ ఏఁవిటున్నాది? నువ్వు అద్దిల వాడివి… మేఁవు ఇల్లుగల వాళ్ళం. కొంచెం మాటాడుకుందాఁవు రమ్మన్నాం. అంతకంటే ఉద్దేశాలకీ దీనికీ ఏఁవిటున్నాది…. ” అంది. ఆతీ ప్రకాష్‌ గొంతులోకి క్రమంగా ధైర్యం తెచ్చుకుని వాళ్ళవిడ అందించిన చొక్కా తొడుక్కుని ” ఏ ఉద్దేశాలూ లేకుండానే వీళ్ళందర్నీ వేసుకునొచ్చేరా? అర్ధం పర్ధం లేకుండా మాటాడకండి…! ” అని గద్దించేడు. దొడ్డ ఇంక ‘ మర్యాద ‘ గా ఉండలేక ” నన్ను దబాయిస్తావేవిటి? నా ఉద్దేశం కాదు అసలు నీ ఉద్దేశఁవేఁవిటి? కధంతా నడిపిస్తూ ఏఁవీ ఎరగనట్టు అదుగో ముంగి లాగ నిలబడ్డాది నీ పెళ్ళాం దానుద్దేశఁవేవిటి? ముసిలి దొంగవెడి కూతురు దీనికి అద్దీ ఇవ్వొద్దూ ఇల్లు ఖాళీవీ చెయ్యావొద్దూ దీనికి దిక్కూ మొక్కూ ఎవళున్నారో చూతాఁవనీసి కాదూ నీ ఉద్దేశం…? కాదు ముందు మీ ఉద్దేశాలు చెప్పి ఆనక మాటాడు. ఉద్దేశాలు చెప్పాలిట ఉద్దేశాలు! ” అని ‘ బరష్ట్‌ ‘ అయిపోయింది. ఆ సంకేతాన్ని అందుకుని ఆతీ చిన్నమ్మలు కుంకం చెదిరిన నుదురు తుడుచుకుని చేతిలో తువ్వాలు దండెం మీదికి విసిరీసి అత్తగార్ని తోసుకుని ముందుకొచ్చి ఇది వరకే దొడ్డతో తను చేసి ఉన్న పోరాటాలని అప్పుడు జరిగిన అవమానాలనీ అన్నీ ఒకేసారిగా జ్ఞాపకం తెచ్చుకుని ఉగ్గబట్టుకోలేని కోపంతో ఊగిపోతూ ” ఇదుగో మా ఆయనా నువ్వూ తేల్చుకొండి నన్నన్నావో మర్యాద్దక్కదు.. ” అని దొడ్డ మీదికి రాబోతుంటే ఇసక పంతులు గారు కలగజేసుకుని ఆతీ ప్రకాష్‌ కాలర్‌ గుండీని సున్నితంగా సర్దుతున్నట్టు అతని మీద చెయ్యి వేసి ” తమ్ముడూ! లేడీస్‌ తోటి ఏటమ్మా?! జష్టే మినిట్టు…! ” అని భాస్కర కుమార్ని చెయ్యి పట్టుకుని కుర్చీలోంచి లేపి ” ఇదుగో! ఇతను నా స్నేహితుడు. నువ్వు మంచితనంగా మరియాదగా ఇల్లు ఖాళీ చేసి ఆ ముసిలావిడిల్లు ఆవిడికొగ్గీసి నీ మానాన్నువెళిపో. ఈ ఇల్లు ఇతను నాకు వొప్పజెప్పీసేడు! ఏండీ అంతేనా? ” అని దొడ్డని అడిగితే దొడ్డ కళ్ళు మూసుకునే ‘ ముమ్మాటికీ అంతేనూ ‘ అన్నట్టు తల విసిరింది. ‘ మీ అందరితోటీ నాకేఁవిటి ఇసక పంతులుగారే నా వకాలత్‌ ఆయనే నా భరోసా! ‘ అని అర్ధం వచ్చేలాగ కళ్ళు మూసుకుని నిగ్రహం నటిస్తూ గాల్లోకి నమస్కారం పెడుతూ.

ఆతీ ప్రకాష్‌ ఇసక పంతులుగారి చెయ్యి విదిలించుకుని ” మీతోటి నాకనవసరం! అసలు మీరెవరో కూడా నాకు తెలీదూ! ” అని భాస్కర కుమార్‌ కేసి తిరిగి ” ఏంటండీ అలగా కలగా జనాల్ని వేసుకుని ఇంటి మీదకొచ్చెస్తే జడిసిపోడానికి ఇక్కడెవరూ గాజుల్తొడుక్కోని లేరు. యూ హేవ్‌ టు థింకెబౌట్‌ ఐ సే! మీరు లా మీ వోన్‌ హేండ్స్‌ లోకి తీసుకుంటే దేరీజే లా యండార్డర్‌ దేరీజే కోర్స్ట్‌ ” అని లాయర్‌ విశ్వనాధ్‌లో లాగ ఆవేశంగా వేళ్ళు చూపిస్తుంటే ఇసక పంతులు గారు ” ఎవరు వై అలగా జనాలు? ఇంగ్లీష్‌ టాక్‌ చేస్తనాడు! గివ్‌ రెస్పెక్ట్‌ ఎండ్‌ టేక్‌ రెస్పెక్ట్‌! అతన్తోటి కాదు నాతోటి టాక్‌ చెయ్యి. ఈ ఇల్లు నాది! నేను కొనుకుంట్నాను. ఎడ్వాన్సిచ్చీసేను పారీకత్తులు రాస్సేరు. వెకేట్‌ చేయించటానికి రైట్‌ ఫుల్‌ వోన్రని కాబట్టే మావోల్తోటొచ్చేను. నీ నోటంట మర్యాదగా ఖాళీ చేసెల్తాను అన్న మాటొచ్చిందా సరేను. లేకపోతె ఎలాగ ఖాళీ చేయించాలో అలాక్కాళీ చేయించుకుంటాను ఇంకా మరేదకి రడీ అయిపో! ” అని మొఖం మీద మొఖం పెట్టి నిలబడ్డాడు. హైమవతి గారు తెల్లబోయి కుర్చీలోంచి లేచొచ్చి ” భాస్కర కుమార్‌! ఇదంతా అన్నెస్సరీ…! ఇదిగో ప్రకాష్‌ గారు కదండీ?! మీరు అనవసరంగా ఎందుకు కాంప్లికేట్‌ చేస్తారు? Rent Control Act ప్రకారం చూసినా మీకేం rights లేవు. ఆవిడ మీకు eviction notice ఇచ్చి సిక్స్‌ మంత్స్‌ అయింది కదా? మీరు వెకేట్‌ చేసి… ఊఁ…? ” అని నచ్చచెప్పటం మొదలు పెట్టింది. ఆతీ ప్రకాష్‌ చిన్నమ్మలు ఇచ్చిన కాఫీ గ్లాసు అందుకుని చాలా నమ్రతగా ” కాదు సిష్టర్‌ …! మీరెవరో ఏంటో నాకు తెలీదు కానీ….మీరు చూడ్డానికి ఎడ్యుకేటెడ్‌ లాగ మర్యాదస్తుల్లాగున్నారు..! ఏంలేదు జష్ట్‌ ఏజె సింపిల్‌ మేటర్‌ లెట్‌ మీ షో యూ సంథింగ్‌…! ” అని ఆవిడ చెయ్యి పట్టుకుని కొళాయి గొట్టాలుండే సందులోకి తీసుకెళ్ళేడు. అక్కడ తుప్పు పట్టిన కొళాయి గొట్టం చూపించి ” మంచి తనంగా మర్యాదగా ‘ అమ్మా అత్తయ్యగారూ! కొళాయి గొట్టాలు కారిపోతునాయీ…..రిపేర్‌ చేయించియండీ! ‘ అని బతిమాల్తే ఆవిడేంటన్నాదో ఆవిడికే అడగండి! నో..నో…! కాదు యూ ప్లీజ్‌ ఎంక్వైర్‌ హెర్‌ ఫష్ట్‌ యెండ్‌ దెన్‌ టాక్‌ టు మీ..? ” అని విసురుగా దొడ్డ దగ్గిరికొచ్చి ” గొడ్డుమోతు దానికి నీకు పిల్లలా పీచా ఏపాటి నీళ్ళు కావాలి నీకు అన్నాదీవిడి! ఏఁవిండీ? అన్నారా లేదా? ” అని నిలదీసేడు. ” అన్నాది! ముమ్మాటికీ దేనిమీద ప్రమాణం చెయ్యమంటే దానిమీద ప్రమాణం చేస్తాను! అన్నాది! ” అని ఆతీ చిన్నమ్మలు దండెం ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో కళ్ళు తుడుచుకుంటుంటే ఇసక పంతులు గారు ” ఏవిండమ్మా మీరా ముక్కన్నారా? ” అని దొడ్డని అడిగేడు. ” దేవీ మీద ప్రమాణం చేసి ఆ మాటన్లేదని ఆవిడ్ని చెప్పమనండి..ఇదుగో… ఈ క్షణాన్ని ఖాళీ చేసి వెళిపోతాఁవు ఈ ముష్టి కొంప! మనిషన్నాకా మాట మీద నిలపడాలి! మాట తప్పిన బతుకెందుకే నీ వెధవ ముష్టి బతుకూ? ” అని తర్కిస్తూ పళ్ళు కొరుక్కుంటూ ఆతీ చిన్నమ్మలు రైజైపోతుంటే వాళ్ళ అత్తగారు అపుతుంటే.

తెల్లగా తెల్లవారి పోయింది. పక్కింటి డాబా మీద కూరెళ్ళ జోగారావూ భార్యా, ఎదురింటి డాబా మీద మిల్కినస్పెక్ట్రు గారూ వాళ్ళావిడా పిల్లలూ, అక్కిరెడ్డి పాలెం కోరీ లారీ జట్లూ, ఎమ్సెట్‌ ప్రేవోట్లనుండి ఇళ్ళకి తిరిగి వెళ్తున్న పిల్లలూ అందరూ టీవీ రామాయణ్‌ లాగ చూస్తున్నారు. దొడ్డ లేచొచ్చి ఇప్పుడు ఇంక సంధి చేసుకుందాము అన్న ధోరణిలోన ‘ అసలు నేనెంతో సౌమ్యురాల్ని ‘ అని రూపించేలాగ లోగొంతుకతో, చాలా నెమ్మదిగా ” పోనీగాని ప్రెకాషూ చెప్తునాను ఇదీగోటి….మీ ఆవిడ నన్ను ఎన్ని మాటలన్నాక నేనా మాటన్నాను? ముసిల్దానా రేవిట్నక్క లాగ రాలి పడిపోతునావు ఇల్లు ఖాళీ చెయ్యన్నీ దిక్కున్న చోట చెప్పుకోవే అన్నాది! అన్నాది దాన్నే అడుగు అన్నాదో లేదో? అడగండి పోనీగానీ ఇదీగోటి! ” అని ముందు అందరూ ఈ నిజం తేల్చుకుందాము అన్నట్టు నిలబడింది. ఇసక పంతులుగారు కలగజేసుకుని ” లేడీస్‌ లేడీస్‌ ఎప్పుడో అనుకున్నదానికి లెక్ఖేటివై? అవన్నీ అలాగొదిలీయండి! ” అని అవన్నీ ఎలాగ తుడిచి అవతల పడీయొచ్చో చూపించేడు. మళ్ళీ అందరి దృష్టీ ఆతీ ప్రకాష్‌ మీదకి తిప్పించి ” ఇవాళ డిసెంబరు ఏడో తారీఖు ఆదివారం మంచిగా మర్యాదాగా నిన్ను ఖాళీ చెయ్యమనీసి తగుమనుషుల్ని పెట్టుకోని ఇతనొచ్చేడు! దీనికి నీ సమాధానఁవేటి? ఖాళీ చేస్తావ? చెయ్యవా?? ఒకటే ప్రశ్నా… ఒకటే సమాధానం?! నువ్వు కొళాయి గొట్టల్చూపించీసి లేడీస్‌ లేడీస్‌ చేత మాట్లనిపించీసుకున్నంత మాత్రాన….కాదుండు ముందు నీన్చెప్పీది విను! నువ్వు కొళాయి గొట్టాలు చూపించీసినంత మాత్రాన కేసు నీకు రైటయి పోతాదనుకుంటే చాలా అమాయకుడివనుకోవాల. మంచి వాడు, మర్యాదస్తుడు, మన ఆతీ గార్డు గారబ్బాయనీసి నీకు రెస్పెక్టిచ్చినందుకు ఆ రెస్పెక్ట నిలబెట్టుకోవాలి! ఇంతకంటె నీన్నీ గుమ్మాలంటొచ్చి చెప్పవలిసింది లేదు. చేసి చూపించ వలిసింది చూపించీసేక అప్పుడు అమ్మా బాబూ అంటే ఇంకుపయోగం లేదు. ఏ మాటంటావో ఏటో మీ భార్యా భర్తలుభయులూ బాగా ఆలోచించుకోని మరీ అనండి. ఇవాళాదివారం! ఇంకా ఏడుంపావయ్యింది!! మాకెవ్వళ్ళకీ ఏఁవ్హీ తొందరల్లేవు! చూడు నీ డెష్షను, నీ ఇష్టం! ” అని హెచ్చరించేడు. ఆయన గుంటలు పడిన దుబ్బు మొహం రొయ్య మీసాలు చిన్న కళ్ళు మొహం మీదే ఆడుతుంటే ఆ వాలకం చూసీ వాకట్లో నిలబడ్డ అక్కిరెడ్డి పాలెం జట్టుని చూసీ ఆతీ ప్రకాష్‌ అమ్ముల పొదిలో అస్త్రాలు అన్నీ అయిపోయినట్లు తడబడుతున్నాడు. అప్పుడు చిన్నమ్మలు కలగచేసుకుని ” అయితే వీళ్ళే గనక తగుమనుషులన్న ముక్క నిజఁవే అయితే మరెందుకు మొహమాటం? ఆ కార్డు చూపించీయండీ?! ” అని వాళ్ళాయన్ని గద్దించింది. ఆతీ ప్రకాష్‌ గబ గబా ఇంట్లోకెళ్ళి ఒక L.I.C డైరీ తెచ్చి దాన్లోంచి ఒక జెరాక్స్‌ కాయితం పైకి తీసి భాస్కర కుమార్‌ చేతిలో పెట్టి ” ఐ హేవ్‌ సింపుల్‌ రిక్వష్ట్‌ ! యూ ప్లీజ్‌ కైండ్లీ రీడ్‌ దిస్‌!! ” అని ఆజ్ఞాపించేడు. ఆ కాయితం మీద ఒక పోస్ట్‌ కార్డు కాపీ చేసుంది. ఆ దస్తూరి ఎంత చించుకున్నా భాస్కరకుమార్‌కి అర్ధం కాక నందగోపాల్‌ చేతిలో పెట్టేడు. నందగోపాల్‌ మొహమాటంగా కళ్ళద్దాలు సవరించుకుంటూ కూడబలుక్కుని ఆ కాయితం చదివేడు :

” శ్రీరామ.
శ్రీరస్తు చిరంజీవులైన ఆతీ ప్రకాషు, ఆతీ చిన్నమ్మలుకి దీవించి వ్రాయునది. కొన్ని కారణాల వలన మీరు ఇల్లు అద్దిలు ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చెయ్యకుండానూ తిప్పిస్తున్నారు. ఇది మీకు భవిష్యత్తులోన ఏ విధంగానూ మంచిది కాదు. ఇంత కాలం ఇల్లు అనుభవించినందుకు మిమ్మల్ని ఎవరూ ఏ ఇబ్బందీ పెట్టలేదు. ఇప్పుడు ఇవతలి వాళ్ళ అవసరానికి మీరు ఖాళీ చెయ్యకుండా ఏడిపించడం మీకు ఎంత మాత్రం భావ్యంగా లేదు. కాబట్టి ఈ ఉత్తరం మీకు అందిన నెల రోజుల్లోగా ఆరు నెలల అద్ది బకాయీలూ చెల్లించి మీరు ఖాళీ చెయ్యకపోయినట్లైన తదనంతరం జరిగే కష్ట నష్టాలకి మీరే పూర్తీగా బాధ్యతా వహించ వలిసి ఉంటుంది.
ఇట్లు
మీ శ్రేయోభిలాషి
ఆకాశ రామన్న ”

ఇలాగ చదువుతూ నందగోపాల్‌ సోడాబుడ్డీ కళ్ళద్దాల వెనక కళ్ళతోనే నవ్వుతున్నాడు. డ్రైవరు గారు ఉండబట్టక ” ఈ బాబు గొంతెక్కడో విన్నట్టుగున్నాది? ” అన్నాడు. ఇసకపంతులు గారు నందగోపాల్నే చూస్తూ ” మార్కెట్‌ ధరలు…చింతపండు గుమ్మలక్షింపురంలో మూడువందలేభై రూపాయలు, విజయనగరంలో మూడువందలరవయ్యి….? ” అంటే నందగోపాల్‌ ” ఆఁ ఆఁ అవును.. ” అని ఒప్పుకున్నాడు. డ్రైవరు గారు ” ఆకాశవాణి కదండి? వారు చదువుతుంటె రేడియాలో చదివినట్టిగే ఉన్నాది… ” అని సరదా పడిపోయేడు. ఆతీ ప్రకాష్‌ ఆ కాయితం నందగోపాల్‌ దగ్గర్నుండి లాక్కుని దొడ్డని భాస్కర కుమార్నీ చూసి ” ఊఁ ఏఁవండీ? దీనికేం సమాధానం చెప్తారు? ” అని నిలదీసేడు. ఆతీ చిన్నమ్మలు విజయ గర్వంతోటి ” ఆకాశరామన్నెవళ్ళు? శ్రేయోభిలాషెవళ్ళు?? తగుమనుషులు నలుగుర్లోనా తేల్చండీ ముందూ! ” అని ఒక అరిచేతిలో ఇంకో చేత్తో కొట్టుకుంటూ ముందుకొచ్చి నించుంది.

‘ ఎవరు దొడ్డా ఈ ఆకాశవాణీ? ‘ అని అడగబోతున్న భాస్కరకుమార్‌ కళ్ళలోకి చూడ్డానికి అవకాశం ఇవ్వకుండా దొడ్డ కళ్ళు మూసుకుని విరసంగా ‘ అసలు ఇప్పుడిది అనవసరం ‘ అన్నట్టు తల ఇటూ అటూ తిప్పుతోంది కాని ఏమీ మాటాడదు. అప్పుడు బేకుడికి అయిడియా వొచ్చి ” ఎక్స్‌ రాక్స్‌ కాపీలు ఎన్నోటి లేవు. అది ఎవర్రాసేరో? ఆల్దొడ్డే రాసిందనీసి గేరంట్రీ ఏంటి? ” అన్నాడు. ఆతీ ప్రకాష్‌ బేకుడికేసి తిరస్కారంగా చూసి ” ఇక్కడంత వెర్రివాళ్ళెవళ్ళెవరూ లేరండీ! మీకిలాటి అత్తెలివి అనుమానాలొస్తాయనీసే వొరిజినల్స్‌ సేఫ్‌ గా ఉంచేను. మీరిలాగ రండీ నాతోటి! ” అని భాస్కర కుమార్ని చెయ్యి పట్టుకుని లేపి కొళాయి గొట్టాలు, మేడ మెట్లుండే సందులోకి జబర్దస్తీగా లాక్కెళ్ళేడు. అక్కడ గుమ్మం మీద కొండ చీపుళ్ళు, PVC పైపు ముక్కల మోపులు గోనెలు దాచిన అటక మీదికి అతి కష్టం మీద సాగి నిలబడి గోనె పట్టా అడుక్కి చెయ్యి చాచి ఒక ప్లాష్టిక్‌ కవరు లాగబోయి బేలన్స్‌ కుదరక తూలి పడిపోబోతే భాస్కర కుమార్‌ కంగారుగా అతను పడిపోకుండా పట్టుకున్నాడు కానీ అప్పటికే పైపు ముక్కలు కొండ చీపుళ్ళూ గోనెలు వాటి నిండా పూతికలతోటీ ఇద్దరి మీదా జారి పడిపోయేయి. భాస్కర కుమార్‌ పైకి లేవబోతే ఒక పెద్ద కేలండర్‌ లాటి పెయింటింగ్‌ అడ్డంగా మొహం మీద పడింది. ఆతీ ప్రకాష్‌ అతనికి చెయ్యి అందించి చీపుళ్ళ మధ్య తెల్లటి కేలండర్‌ చుట్టల మధ్య నుండి పైకి లేపి చేతిలో పాల పేకెట్ల కవర్లోంచి ఒరిజినల్‌ పోష్టు కార్డ్‌ ని భధ్రంగా పట్టుకుని పూతికలు దులుపుకుంటూ నిలబడ్డాడు. భాస్కర కుమార్‌ లేచి కూడా ఆసక్తిగా ఆ పెయింటింగ్‌నే చూస్తూ ” ఇదేంటండి? ఇదెవరిది …ఇది వాటర్‌ కలరు కదండి? ” అంటే ఆతీ ప్రకాష్‌ ” మావేనండీ …. అవి మీవి కావు! మావి!! ” అని ఆ పెయింటింగ్‌ చుట్టలన్నీ చికాగ్గా ఏరి అటకమీద పొయ్యడానికి ట్రై చేస్తున్నాడు. భాస్కర కుమార్‌ బోర్లా పడిన పెయింటింగ్‌ వాన పడి ముసురుగా తుఫానుగా ఉన్న ఉదయం సముద్రం బురద రంగుగా అయి దాని వెనక దూరంగా నాటు పడవలోన జాలార్లు వానలో చిక్కుకున్న దృశ్యం. ఉప్పటి నీళ్ళు మొఖం మీద కొడుతుంటే తడి జుత్తు వెనక్కి తోసుకుంటున్న జాలారి మొహం. అది చూసి గొప్ప ఎడ్మిరేషన్‌ తోటి కింద కుడిచేతివైపు కార్నర్‌ లో చూస్తే A.S.P. అని బ్రష్‌తో సంతకం ఉంది. ఆతీ ప్రకాష్‌ కోపంగా చికాగ్గా ఆ చుట్టలు చీపుళ్ళు గోనెలు కర్రలు అన్నీ ఒక వారకి తోసీసి ” ఇదుగో ఒరిజినల్‌ కార్డు. దీనికేటి సమాధానం చెప్తారు? ఇదెవరి దస్తూరో ఇక్కడ కాదు … క్త్లోరోనే తేల్చుకుందాఁవు! అలాగే….! కాదలాగే!! ” అని వాకట్లోకి కేకేసుకుంటూ మళ్ళీ యుద్ధ విన్యాసానికి వెళ్తుంటే కష్టం మీద అతన్ని సందులోనే ఆపి ” ASP అంటే ఎవరండీ ఆర్టిష్టు? ” అని అడిగేడు భాస్కర కుమార్‌ . కర్రలు పడిపోయిన చప్పుడు వినొచ్చిన వాళ్ళ వెర్రన్నదమ్ముడు ముందుకొచ్చి ” ఏఎస్పీ అంటే మా అన్నయ్యేను ఆతీ సూర్య ప్రకాషు … ఏజీయెస్‌ అంటే నేనూ … ఆతీ గౌరీ శంకరు! ” అని గర్వంగా అందరికీ ప్రకటించేడు.

(ఇంకా ఉంది)

(ఈ కధలో పేర్లు, సన్నివేశాలూ అన్నీ కల్పితము. నిజాలు కావు. రచయిత)