[సెప్టెంబరు 20, 2008 డెట్రాయట్ తెలుగు లిటరరీ క్లబ్ దశమ వార్షిక సమావేశంలో ఇచ్చిన ఉపన్యాసపు వ్యాస రూపం. ఈ వ్యాసం లిటరరీ క్లబ్ వార్షిక సమావేశపు ప్రత్యేక సంపుటిలో ప్రచురింపబడుతుంది. ]
Every feeling is attached to an a priori object, and the presentation of the latter is the phenomenology of the former.
— Walter Benjamin in ‘The Origin of German Tragic Drama’.
తన కవిత్వం కష్ట భూయిష్టం అని మార్క్సిస్టులు ఆరోపిస్తే , విశ్వనాథ సత్యనారాయణగారు ఇచ్చిన సమాధానం:
తొలినాళుల పద్యార్థము
తెలియనిచో పాఠకునిది తెలియమి. ఈనా-
ళుల వ్రాసిన కవి దోషము.
కలి గడచిన కొలది చిత్రగతులన్ చెలగన్.
పూర్వపు రోజుల్లో పద్యానికి అర్థం తెలియకపోతే, పాఠకుడిది దోషం! ఈ రోజుల్లో అది కవి దోషం. కలికాలం గడుస్తున్నకొద్దీ, చిత్రవిచిత్రంగా ఉంటోంది!
అంటే, కవిత్వాస్వాదనకు ఉపయోగపడే పరికరాలు తిరిగి గుర్తొచ్చే వెనకటి జ్ఞాపకాలు – recovered memories. ఒక కవిత చదవగానే పాఠకుడికి వెలికి వచ్చిన జ్ఞాపకాలు, ఆ కవితని అనుభవించి ఆనందించడానికి ఉపయోగపడే సాధనాలు.
ఆయనే గనక ఈ రోజుల్లో వస్తూన్న వచన కవిత్వం చవి చూసి ఉంటే, పాఠకుడిది దోషం అని అనేవాడు కాదు. కచ్చితంగా కవిదే దోషం, అని ఒప్పుకొని ఉండేవాడు.
నేను విమర్శకుడిని కాదు; కవిని అసలే కాదు. నేను ఒక సాధారణ పాఠకుణ్ణి.
ఈ మధ్య కాలంలో వస్తున్న కవితలు, కవితా సంకలనాలు చూస్తుంటే, ఎవరైనా ఒక కంప్యూటర్ మేథావి “కవిత్వానికి వెలకట్టే” కలన యంత్రం -కంప్యూటర్ ప్రొగ్రాము – ఒకటి ఎంత త్వరగా తయారు చేస్తే అంత బాగుంటుందనిపిస్తుంది. ఈ యంత్రం లోకి కవితని పంపిస్తే, కొద్ది క్షణాల్లో అది కవితకి మార్కులు వేసి వెలకట్టి “పాసో” “ఫేలో” చెప్పుతుందన్న మాట! అందుకు కొన్ని ప్రామాణికాలు – విజ్ఞులు వాదించి, విమర్శించి, పరామర్శించి సరే అని ఒప్పుకున్న ప్రామాణికాలు: భాష , మాటల పొందిక, విషయం, అలంకారాలు, గతి ఛందస్సు, సంగీతం, ఉపమానాలు, ఇంకా కావాలంటే కించిత్ పాలు సామాజిక దృక్పథం, మరి కొంచెం సమకాలీనత, సమానత, అసమానత, నవ్యత, భవ్యత, వగైరాలు – ఏవి ఎంత మోతాదులో ఉంటే, నూటికి నూరు మార్కులు ఆ కవితకి వస్తాయో ముందుగానే నిర్థారించుకోవాలి. అప్పుడు, ఈ యంత్రంలోకి ఒక కవితని ఇన్‌పుట్ చేస్తే , అది మనం పంపిన కవితని కొలిచి, చీల్చి చెండాడి, బేరీజు వేసి, రేట్ చేసి పెడుతుంది, అవుట్‌పుట్ గా. అప్పుడు, ఒక సమీక్షకుడు వ్రాసిందో , మరో విమర్శకుడు చెప్పిందో నమ్మక్కరలేదు; వాళ్ళ పాక్షికతకి మనం అమ్ముడు పోనక్కరలేదు.
అటువంటి ప్రక్రియలు, సాధనాలూ ద్రాక్షా సారాయి(wine) పరంగా ఉన్నాయి. Ann Noble అనే రసాయన శాస్త్రవేత్త 1984 లో ప్రయోగాత్మకంగా తయారు చేసిన Wine Aroma Wheel, ఇందుకు నిదర్శనం. నా బోటి సాధారణ వ్యక్తులు, ఎవరో సొమెల్యే (Sommelier) చెప్పినది నమ్మక్కర లేదు! ద్రాక్షసారాయపరిమళం (Wine Aroma), వాసన, రుచుల భేదాల కోసం తయారైన అనంతకోటి పదజాలం తెలియక తబ్బిబ్బు పడనక్కరలేదు! నిజంగా వాళ్ళు వాడే పదజాలం చూస్తే పిచ్చెక్కి పోతుంది. ఉదాహరణకి, మంచి వైన్ అమ్మే షాపుల్లో, మీరు చూసే వుంటారు, వైన్ కవిత్వం: “Gorgeous notes of chocolaty creme de cassis, somewhat spicy, high quality toasty oak, a rich, plush, savory, expansive mid-palate, and a long heady finish with elevated glycerin and plenty of sweet tannin and fruit”. ఈ రోజుల్లో కవితా సంకలనాలకి వచ్చే పరిచయ వాక్యాలు ఇంతకన్నా మధురాతిమధురంగా వ్రాయబడి, పాఠకుడిని మభ్యపెట్టి తబ్బుబ్బు చేస్తాయి.
నోబుల్, ఆవిడ అనూయాయులూ, “వైనికు” లందరికీ వాడుకలో ఉన్న 12 లక్షణాలు, 94 వర్ణన పరిభాషా పదాలు పోగుచేసి వాటి మేలు కలయిక తో వైన్ అరోమా చక్రం తయారు చేశారు, – ప్రతిఒక్కరూ తేలికగా వాడుకొని వైన్‌లకి ఆబ్జెక్టివ్‌గా విలువకట్టడానికి ఈ చక్రం ఉపయోగపడుతుంది. నోబుల్ తయారు చేసిన ఈ పరిమళచక్రం Do-It-Youself పుస్తకం లాంటిది. అట్లాగే మరొక పద్ధతి కూడా ప్రచారంలో ఉన్నది. సారాయానికి పరిమళం, రుచి మొదలైన కొన్ని లక్షణాల ఆధారంగా, 80 నుంచి 99 మధ్యలో మార్కులు వేసి, సారాయాన్ని రేట్ చెయ్యడం. (చూ: Wines: Their Sensory Evaluation, Maynard Amerine and Edward Roessler, 1976) ఇంత శాస్త్రీ యంగా కాకపోయినా, సుమారు ఇలాంటి పద్ధతే సెంట్లు, సుగంధ ద్రవ్యాలు, పెర్ఫ్యూములకి కూడా ఉన్నది. (చూ: Perfumes: The Guide, Luca Turin and Tania Sanchez, Viking 2008. ఈ పుస్తకం నాకు చాలా ఉపయోగపడింది.) వైనికులు, పెర్ఫ్యూమెర్లూ రెండు రకాల గొంతుకలతో వాళ్ళ ప్రచార సాహిత్యం రాస్తారు. మొదటిది: వస్తుపర వ్యాఖ్యానం. అంటే వైనులోను, పెర్ఫ్యూములోనూ ఉన్న ముడిసరుకులని సాంకేతిక భాషలో రసాయన శాస్త్ర పదజాలం గుప్పించి వర్ణించడం. రెండవది: ఆకర్షక ప్రతిమలతో (attractive imagery) నిండిన భాషతో వర్ణించడం. సాధారణ వ్యక్తులకి ఈ రెండు రకాల వర్ణనలూ ఒక పట్లాన అర్థం కావు. సరిగ్గా, ఈ రెండు పద్ధతులూ నేటికాలపు కవిత్వంపై వస్తున్న సమీక్షలు విమర్శలలో మోతాదుకి మించి ఉంటున్నాయి!
అందుకనే, ఇప్పుడు వస్తూన్న ఆథునిక కవిత్వానికి నోబుల్ తయారు చేసిన వైన్ అరోమా చక్రం లాంటి సాధనం అత్యవసరం. అదే గనక వస్తే అప్పుడు, ఈ కవిత ఎందుకు చదవక్కరలేదు, ఎందుకు ఫలానా కవిత మంచి కవిత, లేకపోతే ఫలానా కవిత ఎంత చచ్చు కవిత, అని నాబోటివాడు తేలిగ్గా తెలుసుకోవచ్చు. చదవడం, చదవకపోవడం నిర్ణయించుకోవచ్చు. ఫలానా వైన్ కొందామా, రుచి చూద్దామా వద్దా అని నిర్ణయించుకోటానికి, ఆ వైన్ కి వచ్చిన మార్కులు చూసి నిర్ణయించుకున్నట్టు!
ఇలాంటి సలహాలకి చిర్రెత్తి, కవిబ్రహ్మలు మూక ఉమ్మడిగా ఒక మాట అనచ్చు. “మేము, నువ్వు, అంటే సాధారణ పాఠకుడు, చదవడం కోసం కవిత్వం సృష్టించడం లేదు. మా ఆనందం కోసం వ్రాసుకుంటున్నాం. నువ్వు చదివితే ఎంత? చదవకపోతే ఎంత?” అని. ఇది వట్టి భేషజం!
అసలు విషయం: కవికి పాఠకుడు కావాలి; అందులోనూ ‘సహృదయుడ’యిన పాఠకుడు కావాలి. భావకుడైన విమర్శకుడు కావాలి. భేషజానికి కవులెన్ని మాటలన్నా నాబోటి పాఠకుడు కవులకు కావాలి. పీరియడ్. సహృదయుడు అన్నా కదూ! అంటే, నా ఉద్దేశంలో, కవి వ్రాసినప్పుడు ఏ అనుభూతిని పొందాడో, పాఠకుడు కూడా అదే అనుభూతిని పొందడం సహృదయత అని నా భావం.
సరే! ఇప్పుడు అసలు విషయానికొద్దాం.
వైన్‌లకి, పెర్ఫ్యూములకీ వెలకట్టే పరిభాష ఉన్నది; అందుకని అది సాధ్యం అయ్యింది, మరి కవిత్వానికి అటువంటివి ఉన్నాయా అని సందేహం వెలిబుచ్చవచ్చు. కవిత్వానికి వెల కట్టే, లక్షణాలు, వర్ణనల పరిభాష మనకి లేక కాదు. కావలసినదానికన్నా ఎక్కువే ఉంది! సంస్కృతంలో దరిదాపు 870 పైచిలుకు లక్షణ గ్రంధాలున్నాయట! అందులో కొన్ని పుస్తకాలకి, ఒక్కొక్క దానికీ పాతిక పైచిలుకు వ్యాఖ్యానాలు! గ్రాంథిక ఆంధ్రంలో ఉన్న శాస్త్ర గ్రంధాలు 27 పైచిలుకు అని చెప్తారు! అందుకనే, వీటిలో లక్షణాలన్నీ క్రోడికరించి, జల్లించి, సారం – అంశం పట్టుకొని, ద్రాక్షసారాయానికి తయారు చేసినట్టుగా ఒక చక్రం తయారు చేస్తే అప్పుడు, సాధారణ పాఠకుడైనా సరే, చెయ్యి తిరిగిన సంపాదకుడైనా సరే, ఏ కవినీ, కవితనీ ఒక ప్రత్యేక చట్రంలో, అంటే – స్త్రీ, దళిత, ముస్లిం, మైనారిటీ, మెజారిటీ , విప్లవ, అవిప్లవ, అభ్యుదయ, నియో, నయా, ఉత్తర-ఆథునిక, తెలంగాణా, ఇలా – సవాలక్ష వాదాల బందిఖానాల్లో బంధించనక్కరలేకండా, సాధ్యమైనంత ఆబ్జెక్టివ్‌గా విలువ కట్టచ్చు; ఆ విలువని బట్టి సంపాదకుడు సదరు కవితని, తన పత్రికలో అచ్చెయ్య వచ్చు, లేదా మానచ్చు. అలాగే, పాఠకుడు చదవచ్చు; ఫెయిల్ మార్కులొస్తే చదవడం మానెయ్యచ్చు. ఎందుకు ఫెయిల్ మార్కులొచ్చాయో కనుక్కునేందుకు నాలాంటి ప్రబుద్ధులు కొంతమంది చదవచ్చు కూడాను! ఇలాంటి పరికరం మూలంగా, పాఠకులు పెరుగుతారే తప్ప తగ్గరు! అదేగా, అందరికీ కావలసింది?
ఈ పని సులభం కాకపోవచ్చు; కానీ, అసాధ్యం కాదు, అసంభవం అంతకన్నాకాదు. ఇటువంటి సాధనం లేకపోబట్టే, ఎవరో ఎక్కడో చెప్పిన కాసిని పడికట్టు మాటలు భట్టీ పట్టి అవే వల్లించి వల్లించి, మన కవితలకు వెల కట్టడం ఒక వేలంవెర్రిగా పరిణమించింది.
కవికి కవిత్వం వ్రాయడానికి ఏదో ఉద్వేగం, ఉద్రేకం ప్రేరణ అని చెప్పారు. విమర్శకూ ప్రేరణ ఉన్నదనే అన్నారు. ప్రస్తుతం వీరి ప్రేరణ సామాజిక విలువలు, సంఘ శ్రేయస్సు, నిబద్ధత వగైరా! ఇవన్నీ పడికట్టు పదాలే! వీటి అర్థం ఏమిటయ్యా అని నిలదీసి అడిగితే, ఎవడికి తోచిన అర్థం వాడు చెప్తాడు. అందుకని, ప్రస్తుతానికి వీటిని వదిలిపెట్టండి. సాధారణ పాఠకుడికి, ఈ కవిత్వం చదవడానికి ప్రేరణ ఏమిటి? ప్రస్తుతానికి, సాధారణ పాఠకుడు ఉబుసుపోక, తన తృప్తి కోసం ఈ కవిత్వం చదువుదామనుకోవడమే ప్రేరణ అనుకుందాం. అలా చదివిన తరువాత, తన జ్ఞాపకాలని తన సహజజ్ఞానం( Intuition) తో మేళవించి, కవిత్వాస్వాదన అనే “కళ” కి తనకి సాధ్యమయినంతలో ఒక “సిద్ధాంతం” తయారు చేసుకోవడం, ఇక్కడి ముఖ్యవిషయం. మరోరకంగా చెప్పాలంటే, ఒక కవిత చదవగానే పాఠకుడికి వెలికి వచ్చిన జ్ఞాపకాలు, ఆ కవితని అనుభవించి ఆనందించడానికి ఉపయోగపడే సాధనాలు.
అంటే, కవిత్వాస్వాదనకు ఉపయోగపడే పరికరాలు/సాధనాలు తిరిగిగుర్తొచ్చే వెనకటి జ్ఞాపకాలు – recovered memories- పాత జ్ఞాపకాలు అని చెప్పుకుందాం. ఈ జ్ఞాపకాలు, నాబోటి సాధారణ పాఠకుడికే కాదు, చదువుకున్న అంటే విద్యాధికుడైన పాఠకుడికి గూడా కవిత్వాన్ని అనుభవించడానికి, ఆనందించడానికీ ఉపయోగపడే పరికరాలు అని నా గట్టి నమ్మకం. ఒక పెర్ఫ్యూమ్ యొక్క పాత పరిమళం ఆ పెర్ఫ్యూమ్ మరొకసారి కొని అనుభవించడానికి సాధనంగా ఉపయోగపడుతుంది. (నిజం చెప్పాలంటే, నోటితో చవి చూసే రుచిని, ముక్కుతో అనుభవించే వాసననీ వేరు చెయ్యడం తప్పు. వాసనకి, రుచికీ అవినాభావ సంబంధం ఉన్నది. రుచి లేని వాసన ఉండవచ్చేమో కాని, వాసన లేకండా రుచి ఉండదు.) ఒక వ్యక్తి జ్ఞాపకంలో ఉన్న పాత రుచి, ఒక వైన్ కొని అనుభవించడానికి సాధనంగా ఉపయోగపడుతుంది. అట్లాగే జ్ఞాపకాలు కవిత్వాస్వాదనకి కూడా సాధనాలు!
కవిత్వంలో ఈ తిరిగొచ్చే జ్ఞాపకాలు అనేవి స్వయంగా కేవలం నీ అనుభవంలో, వాసనలు, రుచులనుంచే వచ్చినవే కానక్కరలేదు. ఎప్పుడో వేరొకరు, బహుశా మీ తొలి తెలుగు మేష్టారు చెప్పినవో, ఎక్కడో ఎప్పుడో విన్నవో, చదివినవో, కావచ్చు. ద్రాక్ష సారాయం విషయంలో కూడా అంతే! మొట్టమొదటిసారి ఒక ప్రత్యేక సారాయ పరిమళాన్ని ఆఘ్రాణించి, ఆ తరువాత చప్ప రించి రుచి చూసి నప్పుడు, ఒక కొత్త అనుభవం కలగచ్చు. ఎవరో మహానుభావుడు, అనుభవజ్ఞుడు, ఈ అనుభవాన్ని మాటలలో పెట్టవచ్చు. అవి సరికొత్త మాటలు. ఇంతకుముందు నీ భాషా పరిధిలో లేని మాటలు. అప్పటినుంచి, ఆ పరిభాష నీకు కూడా అబ్బుతుంది.
ఇలా అనుభవపరిధి పెరిగి, జ్ఞాపకాలు పెరగడంతో, నీవు విద్యాధికుడవవుతున్నావు. అది మంచిదే. కానీ, దీనితో ఒక చిక్కు లేకపోలేదు. నీకు సరికొత్త పదజాలం అబ్బుతుంది అన్నాం కదూ! దానితో, నీ స్నేహపరివారం తగ్గుతుంది. ఎందుకంటే, నీ పరిభాష అర్థం చేసుకొనే వాళ్ళు, సరిగ్గా నీకు మల్లే అనుభవించి, ఆనందించిన వాళ్ళే అవుతారు. మిగిలినవాళ్ళకి నీ పరిభాష పరమ అరుచి కలిగిస్తుంది. నిన్ను స్నాబ్ అనో, రియాక్షనరీ అనో తిరోగమనవాది అనో లేబెల్ చేసే ప్రమాదం కూడా లేకపోలేదు!
తిరిగి వచ్చిన జ్ఞాపకాలే కవిత్వాస్వాదనకి పరికరాలు/ సాధనాలు అన్నాను కదూ! ఈ క్రింది కవిత[1]విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం నుంచిచూడండి.
విస్తరిమీద వంగబడ వేయక మానెదరేమొ సూదకుల్
విస్తరిపైని వంగుటకు వెన్నును వంగదు పొట్టవంగదున్
హస్తము నడ్డముంచినను నాగక వడ్డన చేతురన్నియున్
గస్తిగ నట్లె తిందు రవుగాదనలేక క్రతుప్రసాదముల్.
ఇపుడె గుండిగ దింపి ఇగురుబెట్టితి
బొడిపొళ్ళాడు నీ యన్నము దినుండు
పూర్ణమ్ములేకుండ బునుకులుగా వేసితిమి
కరకరలాడు తినుడు వీని
గాలుచునున్నది గాబోలు క్షీరాన్నమిదె
దొన్నెలను దెచ్చి యిత్తు నుండు
డిది గడ్డపెరుగు మీరింక కొంచెము వేసికొనవలె
చలువ చేయును గదండి
యనుచు బతిమాలి బతిమాలి యవనినాథ
సూదకులు కొల్లలుగతెచ్చి చూఱయీయ
నన్నమును నాదరంబున దిన్నకడుపు లెన్న
నెడదలు నుబ్బిపోయెదరు జనులు.
అన్నంపు రాసులు చిన్న తోమాలెల కై సన్నజాజులు పోసినట్లు
సన్నఖర్జూరపు చాపలపై సూపరాసులు గంధమ్ము తీసినట్లు
ఎఱ్ఱవాగుగను వేయించినప్పడములు పునుగు కుంకుమ కుప్పవోసినట్లు
వంగపండుల పేళ్ళ వరుగు చోష్యపు గుబాళింపు లత్తరుల నొల్కించినట్లు.
తెలుగు దేశంలో, పాత రోజుల్లో, అంటే కేటరింగ్ లేని రోజుల్లో పెద్ద పందిళ్ళల్లో ఐదురోజుల పెళ్ళిళ్ళు చేసే వాళ్ళు. గాడిపొయ్యిలు తవ్వించి పెద్ద పెద్ద గుండిగలలో వంటలు చేయించేవాళ్ళు. కొన్ని వందలమందికి అప్పుడే కోసి తెప్పించిన అరిటాకుల్లో వడ్డనలు చేసే వాళ్ళు. వద్దు వద్దంటూ, చేతులడ్డంపెట్టినా, బతిమాలి బతిమాలి వడ్డించేవాళ్ళు. ఈ జ్ఞాపకాలు లేని వారికి ఈ కవితని ఆస్వాదించడం ఎంత కష్టమో ఊహించండి! కొందరికి ఇవి ఎంతో చక్కని జ్ఞాపకాలు!
మరో కవిత[2]శ్రీశ్రీ భిక్షువర్షీయసి కవిత. ఆఖరి మూడు చరణాలు – ఇది జ్ఞాపకాల పుట్టే!
“ఆ అవ్వే మరణిస్తే
ఆ పాపం ఎవ్వరి” దని
వెర్రిగాలి ప్రశ్నిస్తూ
వెళిపోయింది!
ఎముక ముక్క కొరుక్కుంటూ
ఏమీ అనలేదు కుక్క
ఒక ఈగను పడవేసుకు
తొందరగా తొలగె తొండ.
క్రమ్మె చిమ్మ చీకట్లూ,
దుమ్మురేగె నంతలోన.
“ఇది నా పాపం కా” దనె
ఎగిరి వచ్చి ఎంగిలాకు.
ఎంత అందమైన ఛందస్సు! మాటల ఒద్దికలో, మాటల పేర్పుతో వచ్చిన గతి, గమకం చూడండి/వినండి. ఈ జ్ఞాపకం జాలి. ఇది సమకాలీన అనుభవం. కవి, పాఠకుడూ ఒకే అనుభూతి పొందడం. ‘కవితని చదవడం వలన నీ హృదయంలో బాహ్యవిషయ జ్ఞానం మరుగున పడి, నీ హృదయం అద్దంలా మెరుస్తుంది. అప్పుడు ఆ కవితలో వర్ణించబడ్డ విభావాదులు (determinants, stimulants) సూటిగా ఆ అద్దంలో ప్రతిఫలిస్తాయి. అప్పుడే సహృదయుడికి కావ్యగత నాయకాదులతో తన్మయత్వం కలుగుతుంది. అటువంటి వాళ్ళే సహృదయులు!’ తనని తాను మరిచిపోయి ప్రపంచాన్ని మరిచి, కవి అనుభవించిన అనుభూతి పాఠకుడు కూడా అనుభవించడం – దీనినే సాధారణీకరణం అని అంటారు.
మాటలు పేర్చడం, మాటల ఒద్దిక (పదగుంభనం) గురించి పైన చెప్పాం కదూ! శబ్దాల పేర్పుతో వచ్చే రుచి శయ్య అంటారు. దీనినే శబ్దపాకం అంటారు. ‘పూల మాల కట్టే వాడు ఏ పువ్వుతో ఏ పువ్వు జోడిస్తే బాగుంటుందో బాగా ఆలోచించి మాల కడతాడు. అలాగే కవి కూడా ఏ పదానికి ఏ పదం జోడిస్తే అర్థవంతంగా అందంగా ఉంటుందో తెలిసికొని కవిత్వం వ్రాయాలి’ అని. ఈ మాటే పింగళి సూరన్నగారు కూడా చెప్పాడు “పొసగు ముత్తెపుసరుల్ పోహళించిన రీతి, తమలోన దొరయు శబ్దములు గూర్చి” అని! ఈ విషయం, రసాయన శాస్త్రజ్ఞులకి తెలియనిది కాదు. ఒక్క మాలెక్యూల్ మంచివాసన (రుచి) ఉన్న పుదీనాలా వుంటే, దాని ప్రతిబింబం వాసన లేని బెండులా అవుతుంది. ఇది శాస్త్రజ్ఞులకి కూడా అంతు పట్టని విశేషం!
పోతే, అర్థంతో వచ్చే రుచిని అర్థపాకం అంటారు. మన ప్రాచీన లాక్షణికులు చాలా మంది అర్థపాకాలు మూడు రకాలని చెప్పారు. ద్రాక్షా పాకం, కదళీ పాకం, నారికేళ పాకం. రాజశేఖరుడనే లాక్షణికుడు కావ్య మీమాంసలో, నవవిధ పాకాలని ప్రస్తుతించాడు. ఇది ఫలానా రుచి అని చెప్పగలగటానికి ఆధారం తిరిగివచ్చిన జ్ఞాపకమేకదా! రాజశేఖరుడు చెప్పిన రుచులు వరుసగా ఇవి: పిచుమంద -వేము/వేప, బదర – గంగ రేగి, మృద్వీకా – ద్రాక్ష, వార్తాక – వంకాయ, తింత్రిణీ – చింతకాయ (చింతపండు), సహకార – మామిడిపండు, క్రముక – పోకచెక్క, త్రాపుష – దోసకాయ, నారికేళ – కొబ్బరి.
ఇలా సాగిపోయే కవిత్వాన్ని బబుల్‌గమ్ కవిత్వం అనచ్చు. పిప్పి నమిలిన కొద్దీ రుచి పెరగదు కదా! ఈ కొత్త ప్రామాణిక రుచి మీ జ్ఞాపకాల పరిధిలోకి వెళ్ళితే, ఇక నుంచి ఇటువంటి కవితలకి మీ అంతట మీరే వెల కట్టుకోవచ్చు
కవిత్వంలో వేము, వంకాయ, పోకచెక్క పాకాలని సర్వదా విసర్జించమని, రేగి, చింత, దోస పాకాలు కాస్త సంస్కరించి మెరుగు పరిస్తే ఆస్వాద యోగ్యాలవుతాయని, ద్రాక్ష, మామిడి, కొబ్బరి పాకాలని ఎల్లవేళలా ఆస్వాద యోగ్యాలేనని రాజశేఖరుడు చెప్తాడు.
అయితే పదాల ఒద్దిక తెలిసినంత మాత్రాన, కవి కాడు; అతగాడు వ్రాసింది కవిత్వం కాదు. అందుకని, అనుప్రాస భూయిష్టంగా ఉండటమో, alliterativeగా మాటలు పొందు పరిస్తేనో, అబ్బో! ఇందులో శయ్య బహు గొప్పగా ఉన్నది అనీ, అది కవిత్వం అనీ మోసపోకూడదు. పదాల ఒద్దిక బాగుంటే చాలు, ఇది కవిత్వం అని భ్రమ పడకూడదు. ఏది శయ్య కాదో చెప్పడం బోలెడు సులువు. ఉదాహరణగా ఈ కవిత[3]సింగిరెడ్డి నారాయణరెడ్డి కాలం అంచుమీద అన్న సంకలనం నుంచి – చినుకు అన్న కవిత చూడండి:
ఆకాశం ఆశీస్సు చినుకు
మబ్బు మమకారం చినుకు
చీలిన నేల పెదవి పైన
చిరునవ్వు ముత్యం చినుకు.
మగతను తాగే కళ్ళల్లో
రగిలే మెరుపు చినుకు
మంటల్ని ఉతుక్కునే గుండెల్లో
మౌన హాసం చినుకు.
మోడు ముఖాన్ని చీల్చే
మొదటి చిగురు చినుకు.
గోరీ నెత్తిలో మొలిచే
పూరిగరిక చినుకు.
ఇదే వరస! ఇలా సాగిపోయే కవిత్వాన్ని బబుల్‌గమ్ కవిత్వం అనచ్చు. పిప్పి నమిలిన కొద్దీ రుచి పెరగదు కదా! ఈ కొత్త ప్రామాణిక రుచి మీ జ్ఞాపకాల పరిధిలోకి వెళ్ళితే, ఇక నుంచి ఇటువంటి కవితలకి మీ అంతట మీరే వెల కట్టుకోవచ్చు! ఇదే పద్ధతిలో మచ్చుకి మరి కొన్ని కవితలు వినిపిస్తా. సాధారణ పాఠకుడిగా నా జ్ఞాపకాలు కూడా చెపుతా!
వక్కపొడి లాగా మొట్ట మొదట్లో చాలా ఆకర్షకంగా ఉండి, చివరలో చప్పగా ఉండే కవిత ఇంకో రకం. ఉగ్ర వామ పక్షీయుల్లో చాలామంది గత 25 ఏళ్ళుగా వ్రాసిన చాలా కవితలు ఈ కోవకే చెందుతాయి.
ఒక రకమైన కవిత చప్పగా మొదలై, చప్పగా ముగుస్తుంది. దీనికి ఉదాహరణలు కోకొల్లలు. బాగా చల్లారిపోయిన చికెన్ సూప్ లో పదేళ్ళ క్రితం కొన్న మిరియాల పొడి వేసిన రుచి జ్ఞాపకం వస్తుంది, ఈ కవితలు వింటే.
ఆథునిక బృహత్కవితలు చదవడమంటే కొంచెం భయం వేస్తుంది. పొడుగ్గా సాగే వచన పద్యం వంద పేజీలుంటే, ఒకటి: ఏకబిగిన చదవడం కష్టం, రెండు: చదివింది అర్థం చేసుకోవడం అంతకన్నా కష్టం. ఓపికచేసి, మొత్తం చదివిన తరువాత, “ఇంతకీ ఈ కవి ఏమంటున్నాడు?” అన్న ధర్మసందేహం రాక మానదు.
ఉదాహరణకి, ఒక బృహత్కావ్యం[4]సింగిరెడ్డి నారాయణరెడ్డిగారి విశ్వంభర, బృహత్కావ్యం నుంచి నుంచి మచ్చుకి కొన్ని చరణాలు వినిపిస్తా.
…. ఇంతకూ నేనెవణ్ణి ?
ఏ మింటి ఇంటి వాణ్ణి ?
ఏ కాలపు చంటి వాణ్ణి ?
వెర్రెత్తిన ఏ శక్తి
విసిరేసిన కందుకాన్ని?
ఎందుకిలా దొర్లుతున్నాను?
ఈ పొరలను ఒంటికి చుట్టుకొని
ఎందుకిలా నిలువెత్తుగా పొర్లుతున్నాను?
ఇలా కొన్ని పేజీలు సాగి పోతుంది. మొదటి నాలుగు భాగాలు ఇదే తంతు. డిటెక్టివ్ నవల ఆఖరి పేజీలు చదివేస్తే, హంతకుడెవరో తెలిసిపోతాడన్నట్టుగా ఐదవ భాగానికెళ్ళి ఆఖరి పేజీలు చదివాను.
నిన్నటి మట్టిబెడ్డలేనా
నేడు మండుతున్న స్ఫులింగాలు.
నిన్నటి గడ్డిపరకలేనా
నేడులేస్తున్న ధ్వజస్తంభాలు.
నిన్నటిమేషకంఠాలేనా
నేడుగర్జిస్తున్న కంఠీరవాలు.
నిన్నటి దూదిపింజలేనా
నేడు ప్రతిఘటిస్తున్న పర్వతాగ్రాలు
… … …
సంస్కృతికీ దుష్కృతికీ
స్వఛ్చందతకూ నిర్బంధతకూ
సమార్ద్రతకూ రౌద్రతకూ
తొలిబీజం మనస్సు
తులారూపం మనస్సు.
మనస్సుకు తొడుగు మనిషి
మనిషికి ఉడుపు జగతి.
ఇదే విశ్వంభరా తత్త్వం
ఇదే అనంతజీవిత సత్యం!
అమ్మయ్య, అయిపోయిందా? అనిపించింది. అంతే కాదు; పూర్తి అవకముందే నాకొచ్చిన మరో జ్ఞాపకం ఇది: చిన్న గదిలో పదహారు లౌడ్ స్పీకర్లు పెడితే వచ్చే అర్థంకాని ప్రతిధ్వనుల కీచు, రణగొణ ధ్వని. ఈ కవిత రాజశేఖరుడు చెప్పిన ‘పిచుమంద’.
ఈ కింది రకం కవిత మొదట్లో కాస్త స్వాదువై ఉన్నా, చివరకి ఏ ఆకర్షణా లేకుండా పోతుంది.
నాన్న కొట్టినపుడు [5]ఎండ్లూరి సుధాకర్ నల్ల ద్రాక్ష పందిరి నుంచి – గ్రీష్మ గోదావరి అన్న కవిత
ఒకమూల ముడుచుకొని పడుకున్న అమ్మలా వుంటుంది.
ఎండాకాలపు గోదావరి
నీటికొవ్వు కరిగిపోతూ
పలచ బడుతున్న జలచర్మంతో
ఎనీమియా పేషంటులా
ఎంతో జాలి గొలుపుతుంది. …
(ఇంతవరకూ బాగానే ఉన్నది సుమా అని అనిపిస్తుంది. తరువాత ఊక దంపుడుగా సాగుతుంది. చివరకి, నలభై ఐదు లైన్ల తరువాత…)
జీవితం రుతువులుగా మారిపోయిన వాళ్ళకి
కాలంతో కాపురం చెయ్యక తప్పదు.
ఏసీ గదులూ, ఏ సౌకర్యాలూ లేని వాళ్ళకి
గోదావరి పెంపుడు తల్లయి
ప్రేమగా సేద దీరుస్తుంది.
స్నానం చేస్తూంటే షాంపూ పొరపాటున నోట్లోకి వెళ్ళిన రుచి – నా జ్ఞాపకం! ఈ కవిత రాజశేఖరుడు చెప్పిన ‘వార్తాక’ (వంకాయ).
వక్కపొడి లాగా మొట్ట మొదట్లో చాలా ఆకర్షకంగా ఉండి, చివరలో చప్పగా ఉండే కవిత ఇంకో రకం. ఉగ్ర వామ పక్షీయుల్లో చాలామంది గత 25 ఏళ్ళుగా వ్రాసిన చాలా కవితలు ఈ కోవకే చెందుతాయి. అందుచేత ప్రత్యేకంగా ఏ ఒక్క కవితనీ ఉదహరించడం లేదు. వీళ్ళ కవితలన్నీ రాజశేఖరుడు చెప్పిన క్రముక (పోకచెక్క) రుచినిస్తాయి.
గంగరేగి పండు తింటే ఉన్నట్లు, ముందు చప్పగా మొదలై, చివరలో కొంచెం ఆకర్షణీయంగా ఉండగలిగే కవిత ఇది. ఉదాహరణకి:
అక్షరాలన్నీ అలిగి వెళ్ళాయి[6]శివపురం శైలజ మచ్చు తునకలు సంకలనం నుంచి
నాతో సహకరించనని.
నేను చేసిన పాపమేంటో
తెల్లకాయితం కూడా తెలియదు పొమ్మంది.
కలాన్ని అడిగాను ఏమీ తెలియదని అడ్డంగా తల ఊపింది.
ఓ ప్రేమామృత ధార గా , గుండెలనిండా నిలిచే అనుభూతిగా,
ఓ యెంకి పాటగా, ఓ కృష్ణ శాస్త్రి గీతిగా,
నార్ల మాటగా నీముందు, నిలుస్తామని
మరీమరీ చెప్పి వెళ్ళాయి అక్షరాలు.
పేలవంగా పలికే చాలా భాగాలు కత్తిరిచ్చేస్తే, పరవాలేదనిపిస్తుంది. ఈ కవిత రాజశేఖరుడు చెప్పిన ‘బదర’.
కొన్ని కవితలు మొదట్లోనూ చివరా కాస్త ఆకర్షణీయంగా, ఆహ్లాదంగా ఉంటాయి. ఇవి కాస్త సంస్కరించి మెరుగు పెట్టటానికి అవకాశం ఉన్నవి.
స్నానం[7]రెంటాల కల్పన నేను కనిపించే పదం అన్న సంకలనం నుంచి – రాలిపడ్డ జ్ఞాపకాలు అన్న కవిత
దేహం మీంచి జారిపోయే నీటి బిందువులు
జ్ఞాపకం ఘనీభవించి దేహమైంది.
నువ్ చేసిన గాయ స్రావం రాత్రి
నీకోసం
విచ్చుకున్న పెదవి
పొగడపూల పరిమళంతో
నా నడుంగీతమీంచి
నువ్వలా నడిచి వస్తుంటావా
ఒక్క క్షణం చూద్దును కదా
అరవిరిసిన నవ్వయి
నా ఒళ్ళో ఉంటావు.
… తరువాతి వాక్యాలు రెండు తీసేసి, ఆఖరి వాక్యం,
నిలువెత్తు పూలచెట్టులా నేను
రాత్రి కౌగిలిలో నలిగి
రాలిపడ్డ జ్ఞాపకాల పూలు.
నాకు తిరిగి వచ్చిన జ్ఞాపకాలు నా రహస్యాలు ! ఈ కవితతో మీ కొచ్చే జ్ఞాపకాలు ఏమిటో? ఈ కవిత రాజశేఖరుడు చెప్పిన ‘తింత్రిణీ’ (చింత పండు) రుచికి మంచి ఉదాహరణ.
పందిరిదోసకాయ పచ్చిది తిన్నప్పటిలా ప్రారంభంలో ఆకర్షణీయంగా ఉండి, ఆఖరికి ఒక మోస్తరుగా ఆహ్లాదం కలిగించే కవిత.
మా పెద్దబ్బాయి ఇంటి[8]వి. ఆర్. విద్యార్థి ఖండాంతర కవిత్వం అనే సంకలనం నుంచి – సమాంతరం అన్న కవిత
బ్యాక్ యార్డు లో
నివాసముంటుందొక
సింధూర వృక్షం.
నేనీ ఊరొచ్చిన ప్రతిసారీ అది
చిరునవ్వుతో స్వాగతిస్తుంది
ఇష్ట పూర్తిగా ముచ్చటిస్తుంది
అచ్చం కోహినూరు వజ్రాకారంలో
వెనుకటి మా ఉస్మాన్ నవాబు
శిరోభూషణంలా
రూపించే ఈ చెట్టు (ఈ పాదాలు కత్తిరించెయ్యవచ్చు)
ఏడాదిలో సగం రోజులు
పనీపాటా లేని ఇల్లాలిలా
నిండుగా నిగనిగ లాడుతుంటుంది.
సగంరోజులు యోగాభ్యాసం చేసే తరుణిలా
చిక్కిపోయినా మెరుస్తుంటుంది. …
…….
అక్టోబర్లో ఇది
కుంకుమ కొండ
నవంబరొస్తే
పసుపు రాసి
డిశంబర్ నుండి మార్చి దాకా
నగిషీల వెండిరేకులతో మలచిన
ఒక మహా కలశం…
……
బతుకు ప్రవాహంలో
కొట్టుకొపోతూ
తనకు తానే అపరిచితమైపోతున్న
ఈ ఊళ్ళో
నన్నెరిగిన ఒకే ఒక్క మనిషి
ఈ చెట్టు
నా ఎన్నో నిద్రారహిత రాత్రులకు
ప్రత్యక్షసాక్షి.
ఈ కవికి ఒక ఎజ్రా పౌండ్ అవసరం చాలా ఉన్నది! కొన్నిభాగాలు కత్తిరిస్తే, మంచి జ్ఞాపకాల చెట్టు కవిత. అలా కత్తిరించకపోతే, శాలడ్‌లో పచ్చిదోసకాయ ముక్కలు ఎక్కువైతే వచ్చే త్రేణుపు జ్ఞాపకానికొస్తుంది! ఈ కవిత రాజశేఖరుడు చెప్పిన ‘త్రాపుష’.
ఈ తరహా కవితకి ప్రారంభంలో ఎక్కువ ఆకర్షణ ఉండదు. త్వరగానే తుదిలో చాలా ఆకర్షణీయంగా తయారవుతుంది. ఈ కవిత చూడండి.
కొన్ని ఏండ్ల కింద[9]నారాయణ స్వామి సందుక సంకలనం నుంచి – చిన్నారిమొక్క అనే కవిత
కొత్తగా విమానమెక్కి
సముద్రాన్ని దాటేటప్పుడు
తోడుగా ఉండేందుకు
చిన్న చెయ్యి సంచిలో
ఒక చిన్నారి పూల మొక్కనూ
ఒక సీతాకోకచిలుకనూ
వెంబడి తెచ్చుకున్నా.
మట్టి వేళ్ళతో ఆపేక్షల తడినీ
పచ్చని ఆకుల్లో పిల్లగాలుల హొయలునీ
మెత్తని సీతాకోకచిలుక రెక్కల్లో
యవ్వనపు గరుకుదనాన్నీ
పూలరెమ్మల ఎరపుదనంలో
మావూరి విశ్వాసాన్నీ
వెంట తెచ్చుకున్నా.
నాతోటి దేశాలు దాటివచ్చిన
మావూరి మొక్కను ఎక్కడ నాటాలో తెలియక
నాలోనే తలకిందులుగా
నాటుకున్నా.
తలలోంచి బయటకు పెరిగిన
వేళ్ళు
భూమినీ ఆకాశాన్నీ
ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. …
ఇంక ఇప్పుడు
సన్నగిల్లుతున్న నమ్మకాలకు
ధీముగా
ప్రపంచమంతా
మా వూళ్ళను నాటచ్చు.
నాలో నేనే తలకిందుగా నాటుకున్నా అని వినంగానే, ఊర్థ్వమూల మథ శ్శాఖః అని ప్రారంభమయ్యే భగవద్గీతలో శ్లోకం నాకు గుర్తుకొస్తున్నది!
ఊర్థ్వమూలమథశ్శాఖః అశ్వత్థం ప్రాహరవ్యయం
చందాంసి యస్య పర్ణాని వేదం విత్త స వేదవిత్.
నాకు వచ్చిన జ్ఞాపకాలే అందరికీ రావాలని అనటంలేదు. పై పద్యంలో మొదటి మూడు చరణాలూ చాలా మందికి అనేకమైన స్మృతులను వెలికి తెస్తాయి. ఈ పద్యం రాజశేఖరుడు చెప్పిన ‘మృద్వీకా’ కి ఒక మచ్చుక.
మొట్ట మొదట్లో ఒకింత స్వాదువుగా ఉండి, ఆఖరికి చాలా ఆహ్లాద కరంగా ఉండే కవిత, మామిడి పండు తినడం లాంటి అనుభవాన్ని ఇస్తుంది. దీనికి ఉదాహరణగా:
దారి తప్పిన ఒక జ్ఞాపకాన్ని[10]విన్నకోట రవిశంకర్ వేసవి వాన అన్న సంకలనం నుంచి, పోలికలు అన్న కవిత
ఈ పసి పిల్ల ఓపిగ్గా ఒడ్డుకు చేర్చింది.
గతకాలపు చీకటి గదిలో
పారేసుకున్న ఒక విలువైన అనుభవాన్ని
అతి సహనంతో ఇది వెతికి తెచ్చింది.
ఎన్నాళ్ళ క్రితమో బూడిదగా మారి
నీళ్ళలో కలిసి పోయిన వాళ్ళు
దీని పాల బుగ్గల్లోంచి మళ్ళీ పలకరించారు.
పటాలుగా మారి, కాలంలో
ఒకచోట నిలిచి పోయిన వాళ్ళు,
దీని పసి కళ్ళల్లో సజీవంగా కదిలారు.
ఎంతమంది గతించిన వాళ్ళ ఆనవాళ్ళని
అంత చిన్ని శరీరంలో దొంతర్లు దొంతర్లుగా దాచిందో!
ఇది వాళ్ళందరూ ప్రేమతో సంతకాలు చేసి పంపిన
బుల్లి ఆటోగ్రాఫ్ బుక్ లాగా ఉంది.
వివరణకందని దీని పెదవులమీది చిరునవ్వు
తమకు లభించిన ఈ కొనసాగింపుకి
వాళ్ళు తెలిపే అంగీకారం కావచ్చు. (ఈ పాదాలు తీసేస్తే ఈ కవిత గొప్పకవిత అవుతుందని నా అభిప్రాయం!)
మూసిన దీని గుప్పిట్లో దాచి ఉంచింది
విప్పిచెప్పలేని వాళ్ళ సందేశం కావచ్చు.
ఈ పద్యం చదివిన తరువాత నా స్వానుభవంలో రకరకాల జ్ఞాపకాలు వచ్చాయి. అవి కాక, తిరిగి గుర్తుకొచ్చిన ముఖ్యమైన జ్ఞాపకం చదివిన పుస్తకం నుంచి మిగిలిన జ్ఞాపకం. ఆ వచ్చిన కొన్ని స్మృతుల్లో (తిరిగి గుర్తుకొచ్చిన జ్ఞాపకం!) ముఖ్యమైనది, శ్రీ కృష్ణ కర్ణామృతం లోని ఈ క్రింది శ్లోకం:
రామో నామ బభూవ హుం, తదబలా సీతేతి, హుం, తంపితు
ర్వాచా పంచవటీతటే విహరత స్త స్యాహర ద్రావణః
నిద్రార్థం జననీ కథా మితి హరే ర్హుంకారతః శ్రుణ్వతః
సౌమిత్రే! క్వ ధను ర్ధను ర్ధను రితి వ్యగ్రాగిరః పాంతునః
“అనగా అనగా రాముడనే వాడొకడున్నాడు. ఆయన భార్య సీత. తండ్రి మాటచేత పంచవటి అను గోదావరి ఒడ్డున విహరించుచుండగా ఆ రాముని భార్య సీతను రావణుడు ఎత్తుకొని పోయాడు”. ఈ రీతిగా తనని నిద్ర పుచ్చడం కోసం తల్లి యశోద చెప్పుతూ ఉన్న కథకు ‘ఊ’ కొడుతూ వింటున్న శ్రీహరి (చిన్ని కృష్ణుడు) యొక్క “సౌమిత్రీ! ఎక్కడ ధనస్సు, ధనస్సు, ధనస్సు ” అనెడి తొట్రుపడుతూ అన్న మాటలు మమ్ము కాపాడు గాక! అని అర్ధం.
ఇక్కడ జ్ఞాపకం పూర్వ జన్మ లో జ్ఞాపకం! కృష్ణుడు పూర్వజన్మలో రాముడే కదా! ఈ కవిత రాజశేఖరుడు చెప్పిన ‘సహకార’.
ఆఖరుగా, కొబ్బరి తింటే వచ్చే అనుభూతి లాగా ప్రారంభం నుండీ, అంతమయ్యే వరకూ ఆహ్లాదం కలిగించే కవిత్వం. ఈ మధ్య కాలంలో నా అనుభవంలో ఇలాంటి కవితలు బహుకొద్దిగానే వచ్చాయని చెప్పగలను. ప్రస్తుతం నాకు అందుబాటులో ఉన్నవాటి నుంచి మచ్చుకి ఈ రెండు కవితలు.
రెక్కలు విప్పుకున్న దూదికొండల్లో [11]కన్నెగంటి చంద్ర వాన వెలిసిన సాయంత్రం అన్న సంకలనం నుంచి – మబ్బుల్లో బొమ్మలు అనే కవిత
చెట్లూ, ఏనుగులూ, కొండచిలవలూ ఇంక ఏవో
అగపడినట్టే పడి మాయమవుతుంటాయి
వాటికిందగా ఒంటరిగానో గుంపులుగానో
దేన్నీ పట్టించుకోకండా
రెక్కలాడిస్తూపోతున్న పిట్టలూ –
ఆకాశానికి రంగురంగుల నిప్పంటుకుంది
మబ్బులు కాస్త రంగు పుంజుకొని
సాయంత్రపు షికారుకు బయల్దేరతాయి
ఎంత కొత్తగా రంగులద్దుకున్నా
బొమ్మ బాగా కుదర్లేదని
ఇంకో పడమటి పొద్దుని
చెరిపేస్తుంది రాత్రి
చీకటితెరలు దించేస్తూ.
ఆరుబయట వెలకింతలా పడుకొని
మిలమిలమెరిసే చుక్కలని
చూపుడివేలి గీతలతో కలిపితే
బొమ్మలే బొమ్మలు కలల్లోకి జారుతూ –
నడిరాత్రి ఆకాశంలో పెళ్ళవుతుంది
మెరుపులదండలూ, వురుములమేళాలూ –
మంచాలు హడావుడిగా వరండాల్లో ఇరుక్కుంటాయి
ఇప్పుడు నీడకోసమో, వాన కోసమో వెతికేకళ్ళకు
మబ్బుల్లో బొమ్మలు కనపడవు
వెలుతురు కోసమే వేచే వాళ్ళకు
చుక్కల మిణుగురులు అక్కర లేదు.
ఇది అందరికీ వచ్చే పాత జ్ఞాపకం! ఈ కవిత పాత జ్ఞాపకాల పుట్ట. కదా!
మరొక పద్యం, చిన్నదే!
ఎప్పటిదో తెలీదు[12]అఫ్సర్ వలస అన్న సంకలనం నుంచి – కురిసీకురవని అనే కవిత
ఎక్కడిదో తెలీదు
తడపటం ఒక్కటే తెలుసు వానకి.
లోపలంతా రాత్రంతా
అలా
కురుస్తూనే వున్నా ఏక ధారగా.
ఆ మధ్యాన్నపు వాన ఇలాగే
కురిసీకురవని నీ లాగే
గాయకుడు మిగిల్చి వెళ్ళిన
నిశ్శబ్దంలా వాన
సుదీర్ఘమౌనానికి నిరసనలా వాన
ఇవాళింక తెరిపి లేదు.
వాన ఏ రకమైన వెనకటి జ్ఞాపకాలని గుర్తుకి తెచ్చినా, కవితలో ఆఖరి చరణం మరొక కొత్త జ్ఞాపకాన్నీ నెమరుకి తెస్తుంది. అది మంచి కవితకి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి. ఈ పైకవితలు రెండూ, రాజశేఖరుడు చెప్పిన నారికేళ (కొబ్బరి) పాకపు కవితలు.
ఐతే, అసలు ఏ పాకంలోకీ ఇరకని పాకం, అస్పష్ట పాకం అనుకుంటా!
“… నిద్రలేని సగం అర్థ ఒకటిన్నర రాత్రిలో[13]వేగుంట మోహన ప్రసాద్ చితి-చింత అనే సంకలనం నుంచి – నిరాకారుడు అనే కవిత
చీకటి కాటుక కానుగ చెట్టు ఆకుల జుట్టులోని
ఈనెల నరాల్లో కన్నీళ్ళు, చలిగాలీ, నేను
రైలు దిగి రహస్సూ యాశ్వమెక్కి వచ్చాం;
ఎర్ర ద్రాక్షపళ్ళూ తెల్లన్నం పుచ్చుకొని…”
శబ్దపాకం తిరకాసుగా ఉన్నట్టున్నది! ఈ వచనపద్యాన్ని మామూలు వచనంలోకి మార్చుకొని చదివితే, మొదటి రెండు లైనులూ ఇలా ఉంటాయి. అర్థ రాత్రి ఒంటిగంటన్నరకి, సగం నిద్రలో లేచాడు కాబోలు. కాటుక చీకటి. మాటలు తల్లకిందులు. కానుగు చెట్ల ఆకుల జుట్టు అంటే ఏమిటి? ఆకుల ఈనెల నరాల్లో కన్నీళ్ళు, చలిగాలితో కలిసి, సగం నిద్రలో రైలు దిగి రహస్యం అనే గుర్రం ఎక్కి వచ్చారట! ఏమిటి పట్టుకోవచ్చారు? ఎర్రద్రాక్ష పళ్ళు, తెల్ల అన్నం! ఈ కవిత ఎన్నిసార్లు చదివినా దీనిలోని తాత్త్విక నిగూఢార్థం నాకు ఇప్పటికీ బోధపడలేదు! ఇదేదో నాలాంటి సాధారణ పాఠకుడికోసం రాసింది కాదని వదిలేశాను! ఎప్పుడో, ఎవరింట్లోనో, లైఫ్ బాయ్ సబ్బుతో కడిగిన గ్లాసులో చవకరకం జిన్ అండ్ టానిక్ తాగిన రుచి. ఇది నా కొచ్చిన జ్ఞాపకం!
వాదనకి ఒక ప్రశ్న రావచ్చు. నేనొక కవిత చదివిన తరువాత నాకు తిరిగి ఏ విధమైన జ్ఞాపకాలూ రావటల్లేదు. అంత మాత్రం చేత ఆ కవితని నేను అనుభవించి ఆనందించలేనా? అని అడగవచ్చు. నిజం చెప్పాలంటే, ఆ కవితని మీరు సహృదయతతో అనుభవించలేరు. అయితే, ఇక్కడ పెర్ఫ్యూముల విషయం గుర్తుకి తీసుకొని రావాలి. కొత్తగా, మొట్టమొదటిసారిగా పెర్ఫ్యూముల దుకాణంలోకి వెళ్ళినప్పుడు, ఏ విధమైన “అనుభవం” కలిగింది? అని ప్రశ్నించుకోవాలి. ఆ పరిమళానుభవం అభ్యాసంతో వచ్చినది అవుతుంది. ఆ అనుభవం జ్ఞాపకపరిధిలోకి పోతుంది. అదే విధంగా ఈ కవిత ఏ విధమైన కొత్త అనుభూతులని కలిగిస్తూన్నది? లేదా ఏ విధమైన పాత జ్ఞాపకాలని వెలికి తెస్తూన్నది? ఇంతకీ ఇది మరి మంచి కవితా కాదా? అని మనం ప్రశ్నించుకోవాలి.
మరొక ఉదాహరణ: ఆకు రాలు కాలంలో ఎండుటాకుల కుప్పలు మెల్లగా మండేటప్పుడు వచ్చే వాసన మొట్టమొదటిసారిగా అనుభవించిన గుర్తు. ఇక్కడా అభ్యాసమే! కొన్ని పరిమళాలు మనసుకి హత్తుకొని పోతాయి. కొన్ని మరుగున పడిపోతాయి. సహజం. మనసుకి హత్తుకొపోయిన పరిమళాలు (రుచులు) మనం తేలికగా జ్ఞప్తి లోకి తెచ్చుకుంటాం. We relive them. We experience them again! సరిగ్గా, కవిత్వం ఆస్వాదించడం కూడా అంతే! పోతే, కొన్ని కవితలు చదివిన తరువాత ఏవిధమైన కొత్త అనుభూతి కలగకపోవచ్చు. కొత్తదనం ఉండవచ్చు. వినడానికి బాగుండవచ్చు. కానీ కవితగా ఏ విధమైన రుచినీ గుర్తుకి తీసుకొరాక పోవచ్చు. ఉదాహరణకి: “కాకికేమి తెలుసు సైకోఎనాలి సిస్” అని చదవగానే అందంగా వినిపించినా ఇందులో ఏమీ పసలేదని సాధారణ పాఠకుడు గమనించగలడు. సూపర్ మార్కెట్లో కొన్న టొమేటో తంతు. గుండ్రంగా, పెద్దగా అందంగా ఉంటుంది. అంతే!
The conceits of the poets of other lands
I’d bring them not,
Nor the compliments that have served
Their turn so long,
Nor rhyme, nor the classics, nor perfume
of foreign court or indoor library;
But an odor I’d bring
As from forests of pine from Maine,
or breath of Illinois prairie,
With open airs of Virginia
or Georgia or Tennessee,
or from Texas uplands, or Florida glades….
– Walt Whitman వ్రాసిన Leaves of Grass నుంచి…
కావ్యాలంకార సంగ్రహం (సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారి వ్యాఖ్యానం), కావ్యమీమాంసా (రాజశేఖరుడు), ధ్వన్యాలోకం (ఆనందవర్థనుడు), శ్రీ కృష్ణ కర్ణామృతం (బిళ్వమంగళ లీలాశుకుడు) – ఈ పుస్తకాలు సంప్రదించాను. దగ్గిర దగ్గిర ఒక నలభై యాభై ఆథునిక కవితా సంకలనాలు జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నించాను.
పరిమళాలు, జ్ఞాపకాల పరంగా, ముఖ్యంగా Recovered Memories పై నా అవగాహనకి ఈ క్రింది మూడుపుస్తకాలూ చాలా బలాన్ని చేకూర్చాయి.
- Wines: Their Sensory Evaluation, By Maynard Amerine & Edward Roessler, 1976.
- What the Nose Knows, By Avery Gilbert, 2008.
- Perfumes : The Guide, By Luca Turin & Tania Sanchez, 2008
అధస్సూచికలు