గోవిందరావు హైదరాబాదులో విమానం దిగి, భోషాణాల్లాంటి రెండు పెద్ద సూటుకేసులూ ట్రాలీ మీదకెక్కించి బయటకి రాగానే వాడి నాన్న, అమ్మ, మేనత్త కనిపించారు, చేతులూపుతూ! అమ్మకి కళ్ళనిండా నీళ్ళు నిండాయి. ఐదేళ్ళయ్యిందాయె, ఒక్కగానొక్క కొడుకునీ చూసి!
“అంత చిక్కి పోయావేవిటిరా?” అని బావురుమంది అమ్మ, గోవిందరావు తలనిమురుతూ.
“లేదమ్మా! నేనేమీ చిక్కి పోలా! అంతా నీ పిచ్చి గానీ,” అన్నాడు, గోవిందరావు.
“ఈ సారి గ్యారంటీగా ఎవరికో ఒకరికి చిక్కిపోతాడులే వదినా,” అని నవ్వింది అత్తయ్య గోవిందరావు బుగ్గ గిల్లుతూ.
“ఫో! అత్తయ్యా,” అంటూ తను అత్తయ్య చేతినుంచి బుగ్గ విదిలించుకున్నాడు. అత్తయ్య అంటే ఇంట్లో అమ్మకీ, నాన్నకీ అందరికీ అభిమానమే. చిన్నప్పటినుంచీ అత్తయ్యకి గోవిందరావంటే ప్రాణం.
గోవిందరావు మేనత్త మంచి వ్యవహర్త. భర్త పోయి పదిహేనేళ్ళవుతుంది. పెద్ద ఆస్తి కలిసొచ్చింది. విజయరాయికి తంగెళ్ళమూడికీ మధ్య సగం మెరక పొలాలు ఆవిడవే! దానికి తోడు, కొల్లేరు కింద బోలెడు మాగాణీ. విజయవాడలో నాలుగు ఫ్లాట్లు. చిన్నప్పుడు, ‘ఇదంతా నీదేరా అల్లుడూ,’ అంటూ ఉండేది. ఆవిడకి పిల్లలు లేరు. ఆవిడకి ఆడపిల్లే వుండి వుంటే గోవిందరావుకి పాల పళ్ళూడక ముందే పెళ్ళి చేసేసి ఉండేది.
అందరూ ఎంబాసడర్ టాక్సీ ఎక్కారు. నాన్న గారు ముందు సీటులోను , అమ్మ అత్తయ్య తనూ వెనకాల కూచున్నారు.
“పోస్ట్ లో పంపించడానికి టైమ్ లేదురా! ఇదిగో ఈ మూడు ఫొటోలూ చూడు,” అంటూ అత్తయ్య హేండ్ బేగ్ లోనించి ఒక కవరు ఇచ్చింది. ఫొటోలతో పాటు ఈనాడు పేపరు ఆదివారం సప్లిమెంటు లోంచి కట్టింగూ!
గోవిందరావు అత్తయ్యగురించి విన్నతర్వాత, రూం మేట్ వాసు తను ఇండియా రాబోయే ముందు అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ‘అయితే మీ అత్తయ్యగారు బోల్డు మంది ఆడపిల్లల్ని లైనులో పెట్టేఉంటుంది లెండి గురూజీ! ఈ సారి మీకు ఆకు పూజే ఖాయం!’ అదివింటూ, వీసీఆర్‌లో పాత సినిమా “నిన్నే పెళ్ళాడుతా!” విడియోటేపు రీవైండ్ చేస్తూన్న రెండో రూమ్‌మేట్ జయరామ్, ‘తథాస్తు,’ అనడం గుర్తొచ్చి నవ్వుకున్నాడు, గోవిందరావు.
“అక్కయ్యా! వాడిని కాస్త సేద తీర్చుకోనీ. ఇరవైగంటల సేపు ప్రయాణం చేసి అలిసిపోయి ఉంటాడు,” అంటూ కాస్త చీదరింపుగానే అన్నాడు, గోవిందరావు నాన్నగారు.
అత్తయ్య ఏ కళలో ఉన్నదో గానీ, ఫొటోల కవరు హేండ్ బేగ్ లో పెట్టుకుంటూ ” రేపు సాయంత్రం, ఆ అత్తిలి వారి అమ్మాయిని చూడాలి, సైనిక్‌పురీలో,” అంది, కాస్త దీర్ఘంతీస్తూ!
గోవిందరావు ఈనాడు సప్లి మెంట్‌లో కట్టింగు చూశాడు.
నల్లద్దాలతో, సైడ్‌పోజు లో పదేళ్ళకిందటి తన పాత ఫొటో. ఆ ఫొటోకింద యస్. వి. ఆర్. గోవిందరావు (వెంకట్), సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (U.S.A.). ఫొటో పక్కనే పెద్ద అక్ష రాల్లోఆకుపచ్చ బ్యాక్‌గ్రౌండ్‌లో “స్వదేశాగమన శుభాకాంక్షలు,” అని హెడ్డింగు! దానికింద, “అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అత్యుత్తమ సేవలందిస్తూ విరామమము కొరకు, వివాహము కొరకూ నేడు స్వదేశానికి తిరిగివస్తున్న మా చి. గోవిందరావుకి ఇవే మా హృదయపూర్వక స్వాగతములు.” అని చుట్టాలు, పక్కాలు పదిమంది పేర్లతో పావుపేజీ ప్రకటన. ఇది అత్తయ్య చేసిన పనే! గోవిందరావు ఆ ప్రకటన చదివి, ” ఏమిటీ, ఈ పిచ్చి ఎడ్వర్టైజుమెంటు! నాకేమీ బాగోలేదు,” అని కాస్త చిరాకు పడ్డాడు.
“నే చెప్పలా! వాడికి ఇల్లాంటివి నచ్చవని. నా మాట విన్నావా అక్కయ్యా!” అని కసిరాడు, గోవిందరావు నాన్నగారు.
అత్తయ్య వీళ్ళ మాటలు పట్టించుకోకండా తన ధోరణిలో తను అత్తిలి వారి సంబంధం గురించి చెప్పుకో పోతూనే ఉన్నది. కాస్త నిద్రమత్తుగా ఉన్నాఅత్తయ్య ఆ అమ్మాయి గురించి చెప్పేవివరాలు చూచాయగా వింటూనే వున్నాడు, గోవిందరావు, అప్పుడప్పుడు ఊ కొడుతూ!.
“వాళ్ళు ముగ్గురు పిల్లలు రా. ఇద్దరు మొగపిల్లలు, ఒక ఆడపిల్ల. అమ్మాయే ఆఖరిది. ఆ అమ్మాయి బొంబాయిలో అదేదో పెద్ద కంపెనీలో, గాడ్రేజో ఎందులోనో పనిచేస్తున్నది. అన్నలిద్దరూ బొంబాయిలోనే ఉంటారు. తల్లీ తండ్రీ మాత్రం అత్తిలి లోనే కాపరం. అమ్మాయి పినతండ్రి స్టేట్ బ్యాంక్‌లో మేనేజర్‌గా చేసి రిటైర్ అయ్యాడు. పినతండ్రికి పిల్లలు లేరు. ఆయన, ఆయన భార్య , సైనిక్ పురీ లో డాబా కట్టుకొని ఇక్కడే ఉంటున్నారు. అమ్మాయి తల్లితండ్రులు అత్తిలి నుంచి హైదరాబాదు, బొంబాయి వస్తూ పోతూవుంటారు. అదీ సంగతి. మరేమో ……” ఆవిడ ఇంకా ఏదో చెప్పుతూనే వున్నది కానీ, గోవిందరావు కునుకు తీశాడు.
టాక్సీ జూబిలీ హిల్స్ లో ఓ మేడ ముందు ఆగింది. అది విజయరాయి మునసబు గారి అల్లుడి ఇల్లు. మునసబుగారూ, మావయ్యా కొన్నాళ్ళ పాటు లారీలవ్యాపారం చేశారు. అదీ, అత్తయ్యకీ వీళ్ళకీ ఉన్న బాంధవ్యం. ఇప్పుడు, ఆ లారీల వ్యాపారం అంతా మునసబుగారి అల్లుడిది. అత్తయ్య హైదరాబాదు వచ్చినప్పుడల్లా మునసబుగారి అల్లుడి ఇంట్లోనే ఉంటుంది; నాన్నకీ, అమ్మకీ ఆ ఇంట్లో మకాం వెయ్యడం ఇష్టంలేదు, అయినా తప్పదు మరి!
మర్నాడు మధ్యాన్నం ఒంటిగంటకి, గోవిందరావు, అమ్మ, నాన్న, అత్తయ్య అత్తిలి వారి అమ్మాయిని చూడటానికి సిద్ధం అయ్యారు. “సూటు వేసుకోరా,” అని అత్తయ్య పోరుపెడితే, గోవిందరావు టై కట్టుకుంటా గాని, సూటు మాత్రం వేసుకోను అని ఘంటాపథంగా చెప్పేశాడు. మొత్తానికి సంధి కుదిరింది; అత్తయ్య ఒప్పుకుంది. అంతా బయల్దేరారు, సైనిక్‌పురీకి. ఘంటన్నర పట్టింది, వాళ్ళ ఇంటికి చేరేసరికి. అమ్మాయి తల్లితండ్రులు, పినతండ్రి పిన్నమ్మగారూ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు. కుశలప్రశ్నలన్నీ అయ్యాక, ఆ అమ్మాయి పిన్ని లోపలికి వెళ్ళి ఇద్దరు అమ్మాయిలతో హాలులోకి వచ్చింది. ఆ ఇద్దరు అమ్మాయిలూ పొడుగ్గా నాజూగ్గా ఉన్నారు. సల్వార్ కమీజుల్లో ఉన్నారేమో, మరీ సన్నగా ఉన్నారు కూడాను. ఇద్దరిలో ఒక అమ్మాయి కిలకిలా నవ్వుతూ, “పెళ్ళికూతురు నేను కాదండోయ్! ఇదీ! శారద మీ పెళ్ళికూతురు, నేను రోజా, దీని స్నేహితురాలిని,” అని పక్కనున్న అమ్మాయిని చూపించింది.
పిన్నిగారు తినడానికి స్వీట్లు, హాట్లూ చిన్నచిన్న ప్లేట్లల్లో పెట్టి ఇస్తూవుంటే రోజా అందరికీ దగ్గిరగా టీ పాయ్‌ల మీద పెట్టింది. “గతికితే అతకదంటారండోయ్,” అని అంటూనే తను తినడం మొదలెట్టింది, అత్తయ్య. “మనం వాళ్ళిద్దరినీ మాట్లాడుకోనిస్తే బాగుంటూందేమో,” అని శారద పినతండ్రిగారు అనంగానే, “దట్ వుడ్ బి నైస్,” అని రోజా వంత పలికింది. శారదని, గోవిందరావునీ హాలులో వదిలిపెట్టి, మిగిలిన అందరూ ప్లేట్లు పట్టుకొని డైనింగ్ రూమ్ లోకి వెళ్ళారు.
ఒక నిమిషం నిశ్శబ్దం.
గోవిందరావుని శారదే ముందు పలకరించింది.
“మీరు హ్యూస్టన్ లో ఉంటారా?”
“అవునండీ! గత మూడేళ్ళనుంచీ హ్యూస్టన్ లో ఉంటున్నా. మా కంపెనీ హెడ్ క్వార్టర్స్ అక్కడే…..మీరు ….”
గోవిందరావు రెండేళ్ళ కిందటే హ్యూష్టన్ లో ఒక పెద్ద క్రెడిట్ కార్డ్ కంపెనీలో పర్మనెంటు ఉద్యోగం సంపాదించాడు. దానితోపాటు గ్రీను కార్డు కూడా! పంతొమ్మిదివందల తొంభైఎనిమిది జనవరిలో, వైటూకె సందడిలో ఇండియానుంచి అమెరికాకి వచ్చిన ఇంజనీర్లలో గోవిందరావు ఒకడు. వాడితో పాటు చెన్నైలో ఏదో కంపెనీ నుంచి అమెరికా వచ్చిన ఇంజనీర్లలో చాలా మంది, రెండేళ్ళు — మహా అయితే మూడేళ్ళు — తిరక్కండా వెనక్కి వెళ్ళిపోయారు. గోవిందరావు మాత్రం ఎన్నో కంపెనీల్లో తాత్కాలికంగా ఎన్నెన్నో రకాల కాంట్రాక్టు పనులు చేశాడు. విసుగు విరామం లేకండా కాంట్రాక్ట్ కంపెనీల పేరుతో అమెరికాలో అడ్డమైన ఊళ్ళన్నీ తిరిగాడు. కష్టే ఫలీ! అమెరికా వెళ్ళిన నాలుగేళ్ళతర్వాత ఒకేఒక్కసారి ఇండియా వచ్చాడు. మళ్ళీ ఇండియా రావడం ఇప్పుడే!
“నేను ముంబయి లో రిచర్డ్ సన్ క్రుడ్డాస్ లో పని చేస్తున్నా. ఈ మధ్యనే చోప్రా యెసోసియేట్స్ తో జాయంట్ గా ఇక్కడ నేషనల్ టైర్స్ ఫాక్టరీ కట్టబోతున్నారు. అందుకని, నేను ముంబయి, హైదరాబాదు లమధ్య తిరుగుతూ ఉంటా. ఇట్స్ ఎ కొలాబరేషన్ విత్ ఎ ఫ్రెంచ్ కంపెనీ. వెల్! ఇట్ వుడ్ బి డన్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ ఇయర్స్,” అని అంది శారద.
“ఈ ఊరునుంచి ఆ ఊరు, ఆఊరు నుంచి ఈ ఊరూ తిరగడం చాలా ఇబ్బందే! ఐ డిడ్ ఇట్ ఫర్ ఫైవ్ ఇయర్స్,” అన్నాడు గోవిందరావు.
“నో, నాట్ రియల్లీ. ఇట్స్ ఎ షార్ట్ ట్రిప్, బిట్వీన్ బాంబే యండ్ హైదరబాద్. ఇక్కడ రెండు వారాలు, ముంబయిలో రెండు వారాలు. అక్కడ ఇద్దరు బ్రదర్స్, ఇక్కడ పిన్ని, చిన్నాన్న! ఐ యాం యట్ హోమ్ యట్ బోత్ ది ప్లేసెస్,” అన్నది శారద సన్నగా నవ్వుతూ.
“మీరు యం.బి.ఏ. చేశారా?” అని అడిగాడు, గోవిందరావు.
“అవునండీ. వి.జె.టి.ఐ. లో బి.ఇ. అయింతర్వాత, అహమ్మదాబాద్ ఐ.ఐ.యం. లో యం.బి. ఎ. చేశా. మీరూ?..” అని అడిగింది శారద.
“నేను తిరపతిలో యం.సి.ఎ. చేశాను. తర్వాత హ్యూష్టన్‌లో యం.బి.ఎ. కూడా పూర్తిచేశా.”
“మీరు చాలా కాలం నుంచీ అమెరికాలో ఉన్నారు. ఎనీ ప్లాన్స్ టు కం బేక్?”
“ఇప్పట్లో అనుకోవటల్లేదు. ముందు సంగతి ఇప్పుడే ఏం చెప్పగలం?” అన్నాడు గోవిందరావు.
“నేను బహుశా బెంగుళూరు మూవ్ అవ్వచ్చు. చోప్రా ఎసోసియేట్స్ అడుగుతున్నారు,” అని అంది శారద.
మరో నిమిషం నిశ్శబ్దం.
“కాఫీ తాగుదామా?” అని అడిగింది శారద. “ష్యూర్,” అన్నాడు గోవిందరావు.
“వుయ్ విల్ గొ టు బరిష్టా. ఓకే?” అని, తను సమాధానం చెప్పకముందే, “మేము కాఫీ తాగటానికి బయటికి వెడుతున్నాం. విల్ బి బాక్ ఇన్ ఏన్ అవర్,” అన్నది శారద డైనింగ్ రూమ్ లో అందరికీ వినిపించేట్టు గట్టిగా.
“హావ్ ఫన్,” అంది రోజా.
చిన్నాన్న గారి హాండాసిటీ కార్లో గోవిందరావూ, శారదా బంజారా హిల్స్ లో బరిష్టాకి బయల్దేరారు; శారద డ్రైవరు, గోవిందరావు పేసింజరూ.
డ్రైవ్ చేస్తూ “ఫ్రీ టైమ్‌లో ఏం చేస్తారు? ఐ థింక్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఆక్టివిటీస్ టు కీప్ బిజీ ఇన్ అమెరికా?” అన్నది శారద.
“వర్క్ లో చాలా బిజీ. ఒక్కోసారి పన్నెండు గంటలు పనిచెయ్యలసి వస్తుంది, వీక్ ఎండ్స్‌లో కూడా! ఇంటికొచ్చింతర్వాత, రిలాక్స్ అవడానికి మ్యూజిక్ వినడం, ఊసుపోక పోతే పాత సినిమా టేపులు చూడడం. వీకెండ్లో కాళీ దొరికితే, ఏదన్నా మనవాళ్ళ ఫంక్షన్ ఉంటే దానికి పోతాం!” అన్నాడు గోవిందరావు.
అసలునిజం – గోవిందరావు పనినుంచి రాగానే రూమ్ మేట్లు వాసు, జయరామ్ లతో కలిసి పాత తెలుగు పాటలు వింటారు, వంట చేసుకున్నంతసేపూ. అతని దగ్గిర పాతా కొత్తా పాటల టేపులు, సీ.డీ లూ కనీసం ఒక వెయ్యన్నా ఉండి ఉంటాయి. దగ్గిర దగ్గిర మూడు వందల తెలుగు సినిమా విడియోలు, వీసీడీలూ ఉన్నాయి. శని ఆదివారాల్లో గుడికో, విష్ణుసహస్రనామం గ్రూపుకో వెళ్తారు, ముగ్గురూనూ!
స్టాప్ సైన్ దగ్గిర గేర్ న్యూట్రలో పెడుతూ, యధాలాపంగా శారద అడిగింది, “వాట్ ఆర్ యువర్ వీల్స్?” అని.
“ఆ? ఏవిటన్నారు ?” అన్నాడు గోవిందరావు.
“మీరు హ్యూష్టన్‌లో ఏకారు డ్రైవ్ చేస్తారు?”
“ఓ! అదా!! మిట్సుబిషీ గేలంట్.”
“యు మీన్ గలాంట్? … దట్స్ వన్ గ్రేట్ థింగ్ యిన్ అమెరికా. సో మెనీ కార్స్ టు ఛూజ్. ఇప్పుడు ఇక్కడకూడాబాగా ఛేంజ్ అయిపోతోంది లెండి,” అన్నది శారద.
“హైదరాబాదు ఐదేళ్ళల్లో చాలా బాగా మారిపోయింది. ఇట్స్ ఎమేజింగ్!,” అన్నాడు గోవిందరావు.
“యప్,” అన్నది శారద.
బరిష్టా లో కాఫీతో పాటు చాక్లెట్ కేక్ తిని వెనక్కి బయల్దేరారు. తిరిగి వస్తున్నంతసేపూ శారద వాళ్ళ కంపెనీ గురించి చాలా విషయాలు చెప్పింది. ప్రతి ఆరునెలలకీ అరడజను మంది ఇంజనీర్లు, మేనేజర్లూ ఫ్రాన్‌స్ వెళ్ళి వస్తూ ఉంటారట. ఏవో కొలాబరేషన్ల పేరుతో అమెరికా, జపానూ చైనా కొరియా లకి కూడా వెళ్ళి వస్తూ ఉంటారట. ఇప్పటికి తను రెండుసార్లు కొరియా, ఒక సారి ఫ్రాన్‌స్ వెళ్ళి వచ్చిందిట! బెంగుళూరు మూవ్ అయితే, హాయిగా సెటిల్ అవచ్చట. “ఐ వుడ్ లవ్ దట్!, బేంగళూర్ ఈజ్ ఎ గ్రేట్ సిటీ,” అంటూ కారు పార్క్ చేసింది. ఇంటికి తిరిగి వచ్చేటప్పటికీ సాయంత్రం ఆరయ్యింది. వస్తున్నంతసేపూ, గోవిందరావు ఊ కొడుతున్నాడే కానీ, శారద చెప్పు తున్నదేదీ బుర్రకెక్కినట్టు లేదు.
వాళ్ళు భోజనం చేసి వెళ్ళండి అంటున్నా, అత్తయ్య ససేమిరా ఒప్పుకోలేదు.
“ఓ వారం రోజుల్లో మిమ్మల్ని పిలుస్తాం లెండి,” అన్నది అత్తయ్య.
జుబిలీ హిల్స్ కి తిరిగి వచ్చేటప్పటికీ ఎనిమిది దాటింది. కారులోనే అడిగేసింది అత్తయ్య, ” ఏరా! అమ్మాయి నచ్చిందా? లేదా?”
“తరువాత మాట్లాడుకుందాంలే,” అన్నాడు గోవిందరావు, ముభావంగా.
మర్నాడు అంతా టాక్సీలో విజయవాడ వచ్చారు. అత్తయ్య బెంజ్ సెంటర్ దగ్గిర ఒక పెద్ద ఫ్లాట్ ఎప్పుడూ కాళీగానే ఉంచేది. ఆ ఫ్లాట్‌ని శుభ్రం చేయించింది. ఓ పనిమనిషిని, కూరా, నారా తేవడానికి ఒక కుర్రాడినీ, ఒక వంట మనిషిని కుదిర్చింది.
నాన్నగారికి తేలప్రోలులో అడితీ ఉంది. చిన్న సైజు కలప వ్యాపారం, తోడుగా వ్యవసాయం. పాతకాలం తాతలనాటి మండువా లోగిలి. అత్తయ్య ఎప్పుడూ ఊరూరూ చాంద్రాయణం చేస్తూనే ఉంటుంది. అత్తయ్య పొలం వ్యవహారాలన్నీ గోవిందరావు నాన్నగారే చూస్తూ ఉంటాడు. విజయవాడలో ఉండమని అత్తయ్య ఎన్ని సార్లు బ్రతిమలాడినా ఉండనంటే ఉండనని ఖచ్చితంగా చెప్పేశాడు. అదొక్క విషయంలోనే గోవిందరావు నాన్నగారు తన అక్కయ్యకి ఎదురు చెప్పి ఉంటాడు.
“ఇదిగో! చూడు నాయనా! విజయవాడలో ఇద్దరమ్మాయిలున్నారు, నువ్వు చూడటానికి. మనవాళ్ళే! ఒక అమ్మాయిది విజయవాడే. డాక్టర్ ప్రాక్టీసు. రెండో అమ్మాయి తణుకులోనో, భీమవరం లోనో పని చేస్తూన్నది. పని ఏదో నాకు సరిగా గుర్తులేదు. ఆ ఇద్దరినీ నువ్వు ఇక్కడే చూడచ్చు. సరేనా?” అన్నది అత్తయ్య.
“ఊ హూ!,” అన్నాడు, గోవిందరావు. విజయవాడ చేరంగానే గోవిందరావు ఒక రోజు రోజంతా పగలూ రాత్రీ పడుకోనే ఉన్నాడు. చాలా సార్లు లేచి అటూ ఇటూ తారట్లాడాడు. కలతనిద్రో ఏమో! చూస్తే, ఇంకా హైదరాబాదులో హైరాణ నుంచి కోలుకున్నట్టులేడు.
రెండో రోజున, అత్తయ్య డాక్టర్ పెళ్ళికూతురిని చూడటానికి ఏర్పాటు చేసింది. నాన్న తేలప్రోలు వెళ్ళి పొద్దున్నే వచ్చాడు. ఆ రోజు గురువారం. అమ్మ, అత్తయ్యా పొద్దున్నే సాయిబాబా పూజ చేసి, అందరిచేతా అటుకులూ పటికిబెల్లం ప్రసాదం తినిపించి సాయంత్రం పెళ్ళికూతురిని చూడటానికి రెడీ అయ్యారు.
“పెళ్ళివారి” టాక్సీ గవర్నరు పేటలో మూడంతస్తుల మేడ దగ్గిర ఆగింది. కింద ఒక అరడజను స్కూటర్లు, మూడు కార్లూ, రోడ్డుపక్కనే డజను పైచిలుకు ఆటో రిక్షాలూ ఉన్నాయి.
సిల్క్ బుష్ షర్ట్ వేసుకున్న ఒక మీసాల పెద్దాయన ఎదురొచ్చి, “మనం పైకి వెడదాం, పదండి,” అన్నాడు.
మెట్లెక్కుతూ, “కింది భాగం అంతా మా మేనకోడలు సరోజిని హాస్పటలు. ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటూంది. రెండో అంతస్తులో అమ్మాయి ఆఫీసు. అమ్మా నాన్నా చిన్న తమ్ముడూ చెల్లెలూ అంతా కలిసి మూడో అంతస్తులో ఉంటారు. నేను గుంటూరులో ఉంటాను లెండి. నాకు ఎగుమతి దిగుమతి వ్యాపారం ఉంది,” అని ఫామిలీ వివరాలన్నీ మూడు ముక్కల్లో చెప్పేశాడు. అత్తయ్య ముక్కుతూ, మూలుగుతూ మూడంతస్తులూ ఎక్కింది. “అయ్యో! బిల్డింగ్ లో లిఫ్ట్ ఉన్నది కానీ, అది కింద ఆసుపత్రి లోనించి ఎక్కాలి. ఆ గలీజులోనించి మిమ్మల్ని తీసుకోరావడం ఇష్టం లేక మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టాను,” అన్నాడు పిల్ల మేనమామ, అత్తయ్య పడ్డ ఆపసోపాలు చూసి!
“పరవా లేదు లెండి,” అంటూనే “ఈ బిల్డింగు అద్దెదా, సొంతవేనా?” అని ఆరాతీసింది అత్తయ్య. “బిల్డింగు అమ్మాయి సొంతవే నండి,” అన్నాడు మేనమావగారు.
మూడో అంతస్తు లో పెద్ద హాలు. తోలు సోఫాలు. సరోజిని నాన్నా, అమ్మా గోవిందరావు నాన్నా అమ్మలనీ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆ అమ్మాయి అమ్మగారు అత్తయ్య చేతిలో చెయ్యి కలిపి పెద్ద సోఫాలో కూర్చోబెట్టింది. సరోజిని చిన్న తమ్ముడు, చెల్లెలూ నేనంటే నేనని పందెం వెసుకున్నట్టు, ప్లేట్లలో పెద్ద పెద్ద తొక్కుడు లడ్డూలు, కారబ్బూంది, చేగోడీలు, పాలకోవా తెచ్చి పెట్టారు. వెండి గ్లాసుల్లో చల్లటి మంచి నీళ్ళు. నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయంటే, వెండిగ్లాసు బయట నీళ్ళు ఘనీభవించి మంచు పొరలా ఉన్నది.
“కాస్త ఫలహారం తీసుకోండి. అమ్మాయి కింద క్లినిక్ లో ఉంది, ఒక్క నిమిషంలో వస్తుంది, ” అన్నాడు సరోజిని నాన్న గారు. ఇంతలో ఓ పెద్దావిడ ట్రేలో కాఫి, టీ లు తెచ్చి వెంటనే లోపలికి పోయింది.
“ఆవిడ మా వంటావిడ. వాళ్ళ అబ్బాయి, మా అమ్మాయి ఆసుపత్రిలో ఈ పనీ ఆపనీ చేసిపెడుతూ ఉంటాడు,” అన్నాడు సరోజిని నాన్న గారు.
ఈ లోగా, “సారీ, వెరీ సారీ, అర్జెంటుగా పేషంటుని చూడాలసి వచ్చింది, ” అంటూ, సరోజిని హాలులోకొచ్చింది, తెల్లకోటు తీస్తూ. సంప్రదాయంగా పెళ్ళి చూపులకి రెడీ అయ్యే అయిఉండాలి; మంచి పట్టు చీరె కట్టుకొని ఉంది. మెళ్ళో మూడు వరసల ముత్యాల నెక్‌లెస్. చామన చాయ. చూడటానికి బాగానే ఉన్నది, కాస్త పొట్టిగా బొద్దుగా ఉన్నా!
“అమ్మాయి యం.డీ. చేసిందండి. ఇక్కడ మెడికల్ కాలేజీలో ప్రొఫెసరు కూడాను,” అన్నాడు మేనమావ గారు.
గోవిందరావుకి ఎదురుగుండా సోఫాలో కూర్చుంది. ఎర్రటి పట్టీలున్న ఎత్తుమడవల డిజైనర్ జోళ్ళు కనిపిస్తున్నాయి, చీరె అంచుకిందనుంచి.
“మీరు ఎన్నాళ్ళనుంచీ ప్రాక్టీసులో ఉన్నారు?” సంభాషణ గోవిందరావే ప్రారంభించాడు. అది ఒక రకంగా ‘ కాస్త మీరంతా పక్క గదిలోకెడితే, మేవిద్దరం మాట్లాడుకుంటాం,’ అన్న క్లూ.
అత్తయ్య వెంటనే, “మనం పక్క గదిలోకి వెడదాం. కాఫీలు అక్కడే తాగచ్చు,” అన్నది. అన్నతడవుగానే, మిగిలిన అందరూ, పక్క గదిలోకి వెళ్ళారు. ఆ గదిలో సన్నగా టీ.వీ. వినిపిస్తూన్నది కూడాను.
“మూడేళ్ళయ్యిందండి. ప్రాక్టీసు చాలా హెవీ గా ఉంది. ఈ యేడే ఇంకో పార్ట్‌నర్ ని తీసుకుందామనుకుంటున్నా,” అన్న ది సరోజిని.
“అంటే, మీరు అమెరికా వచ్చేస్తే, మీ ప్రాక్టీస్ పార్ట్‌నర్ కి అప్పచెప్పుతారా?” అన్నాడు, గోవిందరావు, నవ్వుతూ. అన్న మరుక్షణవే నాలిక్కరుచుకున్నాడుకూడాను!
సరోజిని ఏమీ అనుకున్నట్టుగా పైకి మాత్రం కనిపించ లేదు. యధాలాపంగా, “అమెరికా వస్తే మళ్ళీ రకరకాల పరీక్షలు, ట్రైనింగూ, ఇవన్నీ నాలుగైదేళ్ళూ వేస్టే కదండీ,” అన్నది సరోజిని.
“అవును! అదీ నిజమే!” అన్నాడు, గోవిందరావు, నీళ్ళు నవులుతూ.
“ఇప్పుడు మీ కంప్యూటర్ వాళ్ళకి ఇండియాలో పెద్ద పెద్ద ఉద్యోగాలు కోకొల్లలు. నిజం చెప్పాలంటే, డాక్టర్‌ల కన్నా వాళ్ళకే ఎక్కువ డిమాండ్, ఈ మధ్య ఎక్కడో చదివా. రివెర్స్ మైగ్రేషన్, అని!” అన్నది సరోజిని, చిరునవ్వు నవ్వుతూ.
“అదీ ఒక రకంగా నిజమే లెండి,” అన్నాడు గోవిందరావు. కాస్త చివుక్కు మనిపించింది. మనసులో మాత్రం దీని భావమేమి తిరుమలేశ, అని అనిపించకపోలేదు.
ఒక్క క్షణం తరువాత, “మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా?” అని అడిగింది సరోజిని.
“కాఫీ ఏ నండి,” అనంగానే, “కాఫీ నే తెచ్చిపెడతా, మీరు కూర్చోండి,” అని తను లోపలికి వెళ్ళింది. ఈ లోగా, అమ్మా, నాన్నా, అత్తయ్యా పక్క గదిలోనించి హాలు లోకొచ్చారు.
“మనం ఇక వెడదాం,” అన్నాడు గోవింద రావు. సరోజిని ఫామెలీ అందరూ హాలులో కొచ్చారు.
“ఒకటి రెండు రోజుల్లో మీతో మాట్లాడతా లెండి,” అని అన్నది అత్తయ్య. “మరి వెళ్ళొస్తాం,” అని అంటూ ఉండగానే, “ఇదిగో! మీకు కాఫీ తెచ్చా. కాఫీ తాగి వెళ్ళండి,” అని సరోజిని, సాసరూ కప్పుతో పొగలు కక్కే కాఫీ తెచ్చింది. గోవిందరావు కాస్త తటపటాయిస్తున్నాడు.
వెంటనే, ” పరవా లేదు లే అమ్మా! ఆలస్యం అవుతూన్నది. ఇక వెళ్ళొస్తాం,” అన్నది గోవిందరావు అమ్మ.
“మీరు కిందకి లిఫ్ట్ లో వెళ్ళండి,” అన్నాడు మేనమావ, లిఫ్ట్ గదివేపు చెయ్యి చూపిస్తూ! అందరూ కిందకొచ్చారు, లిఫ్ట్ లో. గోవిందరావు ఫామిలీ టాక్సీ లోకెక్కేవరకూ కిందే ఉండి, టాక్సీ కదిలింతర్వాత, చేతులూపుతూ టాటా చెప్పారు.
ఈ సారి టాక్సీలో అత్తయ్య ఏమీ మాట్లాడలేదు. మరిలోపల ఏం మాట్లాడుకొ ని ఉంటారో, ఏమో!
మర్నాడు కూడా ఎవ్వరూ పెళ్ళికూతుళ్ళ ప్రస్తావన తేలేదు. ఎప్పుడూ వసపోసినట్టు వటవట వాగే అత్తయ్య కూడా ఏ విషయం ఎత్తక పోవడం, గోవిందరావుకి కొంచెం ఆశ్చర్యం గానే కనిపించింది. ఆదివారం వచ్చింది. నాన్నా అమ్మా నిన్ననే తేలప్రోలు వెళ్ళారు. అత్తయ్య ఇంట్లో గోవిందరావు ఒక్కడూ కూర్చొని టీ.వీ. చూస్తున్నాడు. మెల్లిగా అత్తయ్య వచ్చి, గోవిందరావు పక్కనే కూచుంది. కాసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు.
టీ.వీ. లో ఏదో చీరెలకొట్టు ప్రకటన రాంగానే, అత్తయ్య మొదలెట్టింది.
“ఒరేయ్ వెంకట్! ఇలా చూడు.” అలా వెంకట్ అని గోవిందరావుని పిలిచేది ఒక్క అత్తయ్యే!
“ఈ మూడో అమ్మాయి ….” అనంగానే గోవిందరావు అత్తయ్య మాటలకి అడ్డుపడి, “చూడు అత్తయ్యా! నాకు సరిపోయే అమ్మాయిలు ఎవరూ….” అని ఇంకేదో చెప్పబోయాడు. గోవిందరావు వాక్యం పూర్తిచెయ్య కముందే, తర్జని చూపిస్తూ, అత్తయ్య “ఆగవోయి! నే చెప్పేది పూర్తిగావిను. ఆ తరవాత నువ్వు చెప్పేది నే వింటా,” అన్నది. గోవిందరావు మాట్లాడలేదు.
అత్తయ్య అందుకుంది. “ఈ తణుకు అమ్మాయి యం.ఎ. ఫస్టుగా పాసయ్యింది. సోషల్ వర్కరుట! విజయవాడ రాజమండ్రి ల మధ్య తిరుగుతూ ఉంటుందట, ఉద్యోగం పేరుతో! అంటే, ఏమిటి చేస్తుందో నాకయితే తెలియదు కానీ, మీ అమెరికా వాళ్ళిచ్చిన డబ్బులేనట ఆ అమ్మాయి జీతం. జీతం బాగానే ఇస్తారని చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యం, అమ్మాయి పచ్చగా ఉంటుందిట; బంగారపు బొమ్మే నటరా! కర్ణాటక సంగీతం అద్భుతంగా పాడుతుందట. రేడియోలోనూ, టీ.వీ. లోనూ ప్రోగ్రాములు కూడా యిస్తుందట. నేనయితే చూడలేదుగానీ, చూసినవాళ్ళు చెప్పగా విన్నా. మన మునసబు గారి అల్లుడున్నాడే, అతని వేలువిడిచిన మేనమామ కొడుకు, హైదరాబాదులో ఏదో వ్యాపారం చేస్తున్నాడు; అతను ఆ అమ్మాయిని చూశాడటరా. ఆ అబ్బాయి నాన్న గారు చెప్పారు, మునసబుగారి అల్లుడికి. జాతకాలు కుదరక, ఆ సంబంధం చేసుకోలేదని! ఏమిటో ఇంకా ఈ జాతకాల పిచ్చి … నువ్వు చూస్తానంటే…..”
గోవిందరావు, అత్తయ్య వాక్యం పూర్తికాక ముందే, “ఇదిగో చూడు అత్తయ్యా! ఆ అమ్మాయి యం.ఏ. ఎందులో చేసిందో నాకు అనవసరం. బంగారపు బొమ్మ అయితేనేం? రాతి విగ్రహం అయితేనేం? ఆవిడ చేస్తున్న ఉద్యోగం సోషల్ వర్కరు ఉద్యోగం. ఇక పోతే, సంగీతంలో ఎంత పాండిత్యం ఉన్న అమ్మాయి అయినా అమెరికా వచ్చి ఏం చేస్తుంది చెప్పు? ఇంట్లో కూర్చొని త్యాగరాజ కృతులు పాడుకుంటుందా? సోషల్ వర్కర్లూ, సంగీతవిద్వాంసులూ ఎక్కడ మాత్రం ఎవరిక్కావాలి, చెప్పు? నువ్వు ఆ అమ్మాయి తాలూకు వాళ్ళకి నేను తప్పకండా వచ్చి చూస్తానని మాట ఇవ్వలేదుగదా? అలా మాటగనక ఇచ్చి ఉంటే, నువ్వు మరీ బలవంతపెడితే మహుమాటం కోసం, మొక్కుబడిగా ఆ అమ్మాయిని కూడా చూస్తాను,” అని ఒక్క క్షణం అత్తయ్య కేసి ఎగా దిగా చూశాడు. అత్తయ్య తల వంచుకొని, కుడికాలి బొటనవేలుతో నేలమీద సున్నాలు చుట్టుకుంటోది; ఏం మాట్లాడలేదు. కిమన్నాస్తి. ఒక్క క్షణం ఆగి గోవిందరావు అన్నాడు, “ఏ లెక్కల్లోనో, కెమెస్త్రీ లోనో ఒక బి.యె. డిగ్రీ ఉన్న అమ్మాయి అయితే, అమెరికాలో ఒకటో రెండో ఐ.టి. కోర్సులు చేసుకుంటుంది. అంతే! వెంటనే ఏదో పనికొచ్చే ఉద్యోగం వస్తుంది. చూడు అత్తయ్యా! నేను వచ్చే ఆదివారం తిరిగి అమెరికా పోతున్నా. కావాలంటే, రెండు మూడు నెలల్లో మళ్ళీ వస్తాలే!” అని నిర్మొహమాటంగా చెప్పి టీ.వీ. గదిలోంచి బయటికొచ్చాడు.
టీ వీ లో చాందినీ సిల్క్ ఎంపోరియం అమ్మాయి శ్రావణశుక్రవారం శారీ సేల్స్ ప్రకటన పుస్తకంచూసి చదివినట్టు చదువుతూన్నది, చిరునవ్వునవ్వుతూ చేతిలో పట్టుచీరె పమిటని విసనకర్రలా విసురుతూ! *