కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ ఏల ఏడ్చెదో
కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల! ఓ మదంబ! ఓ
హాటకగర్భు రాణి! నిను ఆకటి కైకొనిపోయి అల్ల క
ర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!
ఈ పద్యం మా మేనమావ నాకు నేర్పిన పద్యాల్లో మొట్టమొదటి పెద్ద పద్యం. నాకు ఏడు ఏళ్ళు నిండకముందు కంఠతా పట్టిన పద్యాల్లో ఇది ఒకటి. మా మామయ్య సీతాకాలంలో సాయంకాలం నెగడి ముందు నన్ను, మాతమ్ముడిని, మా బావలనీ కూర్చోపెట్టి పద్యాలు నేర్పేవాడు. ఆయన ఒక చరణం చెప్పడం, మేము వల్లించడం. ఇదీ వరస.
ప్రతి పద్యానికీ ఆయన ఒక కథ చెప్పేవాడు. మిగతా పద్యాల గురించి చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు; ఈ పద్యం గురించి చెప్పిన కథ మరో ఎత్తు.
ఒక రోజు పోతన గారు భుక్తి కోసం దుక్కి దున్నుతూ చెమటలోడుస్తున్నారట. బావమరిది శ్రీనాథుడు పల్లకీలో పోతూ, “ బావా! ఎందుకొచ్చిన శ్రమయ్యా! ఆ రాస్తున్న భాగవతం ఏ రాజుకో అంకితమిచ్చి నాలాగా సుఖపడ రాదుటయ్యా” అని సలహా పారేశాడుట. పోతన గారు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడుట.
సరస్వతీ దేవికి గుండెగుభేలు మందిట. ఆ శ్రీనాథుడి మాట విని, పోతన గారు తనని, ఏ రాజుకో అమ్ముతాడేమోనని సరస్వతి భయపడింది.
ఆ రాత్రికి రాత్రి పోతనగారికి సరస్వతి కలలో కనపడి, కాటుక కరిగిపోయేటంతగా కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏడ్చిందిట. ఆ సమయంలో పోతనగారు సరస్వతికి ఒట్టేసి భరోసా ఇచ్చాడుట. “తల్లీ! నేను భాగవతాన్ని ఎవ్వరికీ అమ్మను, నన్ను నమ్మవమ్మా,” అని.
ఈ కథ చెప్పంగానే మా అందరికీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. చిన్నతనంలో కళ్ళనీళ్ళు తిరగడం పెద్ద విశేషం ఏమీ కాదు. ఆశ్చర్యం ఏమిటంటే,ఈ పద్యం ఇప్పుడు గుర్తుకొచ్చి అప్పచెప్పినా నాకు కళ్ళు చెమ్మగిలుతాయి.
చిన్నప్పుడు అనిపించింది, సరస్వతి ఇంత తెలివితక్కువదా అని. ఆవిడ ఈ పిచ్చి సలహా ఇచ్చిన శ్రీనాథుణ్ణి ఎందుకు శపించలేదు, కనీసం ఎందుకు మందలించలేదూ అని. ఆ విషయం మా మామయ్యని అడిగితే, “అల్లాటి చొప్పదండు ప్రశ్నలు వెయ్యడం మీ వేలూరి వాళ్ళకే తగింది,” అని వేళాకోళం చేశాడు.
నాలుగు దశాబ్దాల తరువాత తెలిసింది, ఈ పద్యం భాగవతంలో లేదని, ఇదొక చాటుపద్యం అనీ. అయితేనే! పోతనగారు ఇటువంటి పద్యమే భాగవతం ప్రథమ స్కంధంలో చెప్పారు.
“ ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములు కొన్ని” పుచ్చుకోను, శ్రీహరికే అంకితమిస్తాను సుమా అని.
మా మామయ్యే చెప్పాడు, పోతన గారు భాగవతాన్ని రాజుల చేతుల్లో పడకుండా భూమిలో పాతిపెట్టాడు, అని. ఇందులో నిజం ఎంతో నాకయితే తెలియదు కానీ, శిధిలమైపోయిన కొన్ని భాగవత భాగాలు, సింగన, గంగనలు పరిష్కరించారట.
కాటుక కంటినీరు పద్యం గుర్తుకొచ్చినప్పుడల్లా అనిపిస్తుంద ి “Great poetry ought to be free, like beautiful things are!”
(నాలుగున్నర సంవత్సరాల క్రితం రచ్చబండలో మీకు బాగా నచ్చిన పద్యం రాసి, ఆ పద్యం ఎందుకు నచ్చిందో రాయండని అడిగితే, సుమారు పది మంది రాసి పంపారు. కొందరు మిత్రులు రాశారు, మాకు బోలెడు పద్యాలు చాలా ఇష్టం; ఒక్క నచ్చిన పద్యం అంటే ఎల్లా అన్నారు. నిజమే మరి. నాకు కూడా నచ్చిన పద్యాలు చాలా ఉన్నాయి. అయితే కొన్ని పద్యాలు గుండెకి హత్తుకో పోయేవి, మరి కొన్ని మెదడుకి మేతవేసేవి. ఈ రెండో రకం పద్యాలు, సహజంగా మనం బాగా పెద్దవాళ్ళయింతరువాత చదువుకొన్నవి. మొదటి రకం పద్యాలు కంఠతా వస్తాయి; రెండో రకంవి బహుశా పుస్తకంలో చూడవలసి రావచ్చు. వాటిని నేను మెచ్చిన పద్యం అనడం సబబేమో. అదేమీ తక్కువని కాదు; పనికి రాని దనీకాదు.
గుండెకి హత్తుకోపోయిన పద్యాలకి చెప్పుకునే వ్యాఖ్యానం తీరు మరోలా ఉంటుంది. అందుకని, అటువంటి పద్యాలు అందరిదగ్గిరనుంచీ పోగుచేసి ఒక చిన్న పుస్తకగా వేద్దామని అనుకున్నాను, అప్పట్లో. ఇప్పటికీ అనుకుంటూనే ఉన్నాను, మీరందరూ సహకరిస్తే.
ఇదివరకు పంపించిన వారు ఎవరైనా , ఎందుకు ఫలానా పద్యం నచ్చిందో మళ్ళీ వ్యాఖ్యానం చెయ్యదలచుకుంటే, శుభం. కొత్త చదువరులు ఇందులో పాల్గొంటే అది మరీ శుభం.
ఆఖరిగా ఒక్క విషయం. నేను Robert Pinsky ని కాదని నాకు తెలుసు.)