ఎడిటర్లూ, రచయితలూ, ఎడిటింగూ

గత సంచికలలో ‘పీర్ రివ్యూ’ పై వచ్చిన వాదోపవాదాలు, కొందరు మిత్రులు శ్రేయోభిలాషుల నుండి వచ్చిన ఉత్తరాలు చదివిన తరవాత ఈ నాలుగు మాటలూ రాద్దామనిపించింది. ఒకరిద్దరు రచయితలు, వ్యాఖ్యాతలు, పీర్ రివ్యూ అనే పదాన్ని ‘తిట్టు’ పదంగా చిత్రించారు. కొన్ని పదాలు మనం అనుకోకుండా తిట్లుగా మారిపోతాయి. ఈ సందర్భంలో ఆంధ్రదేశంలో జరిగిన ఉదంతం ఒకటి చెప్పాలి. ఇది, వయసు మళ్ళిన కొంతమంది పాఠకులకి తెలిసే ఉంటుంది.

గత శతాబ్దంలో 50 దశకం మధ్యభాగంలో మహారాష్ట్రులు, తెలుగువాళ్ళు, గోదావరి నీళ్ళ వాడకంపై తగువు పడ్డారు. రెండు పక్కలా రాజకీయ నాయకులు హోరాహోరీ వాగ్యుద్ధం ప్రారంభించారు. ఈ తగువు తీర్చడానికి కేంద్రప్రభుత్వం గుల్‌హాతీ అనే జడ్జీగారి ఆధ్వర్యంలో ఒక కమీషన్ని నియోగించింది. ఆయనగారు ఒక సంవత్సరం తర్జనభర్జనలు పడి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ఆంధ్రరాష్ట్రానికి అన్యాయం చేసిందనే చెప్పాలి. ఆ రోజుల్లో బాపూ తెలుగు పత్రికలలో కార్టూనులు వేస్తుండేవారు; రమణ బొమ్మలకి మాటలు కూర్చేవారు.

ఒక కార్టూను సారాంశం ఇది: ఇద్దరు పిల్లలు దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఒకడు ఒక మాట అని రెండోవాడిని తిడితే, రెండోవాడు అంతకు రెట్టింపు మాటలని మొదటివాడిని తిడతాడు. ఇలా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్న తరువాత, ఇక తిట్టడానికి కొత్త మాటలు దొరక్క మొదటి వాడు రెండో వాడికి తర్జని చూపిస్తూ “గుల్‌హాతీ” అంటాడు. గుల్‌హాతీ అన్నమాటని అతిచాకచక్యంగా మూడు బొమ్మలతో బాపూ గారు తిట్టుగా మార్చడం ఆ రోజుల్లో తెలుగు పత్రికలు చదివే వాళ్ళందరికీ మహ బాగా నచ్చింది. (ఈ కార్టూను ఇప్పుడు దొరికితే బాగుండును!)

అయితే, ‘పీర్ రివ్యూ’ అన్న పదాన్ని ‘తిట్టు’గా తిప్పికొట్టిన వాళ్ళు వ్యంగ్యం కోసమే అన్నారనుకోండి. వాళ్ళ వ్యంగ్యం మాకు చాలా ఆహ్లాదకరంగా ఉన్నది కూడాను! వీళ్ళు ఈమాటకి ఉత్తరాలే కాకుండా రచనలు, వ్యాసాలు, విమర్శలూ కూడా రాస్తే బాగుండుననిపించింది. వారిని ప్రైవేటుగా మాకు రచనలు పంపించండని కోరాం. ఒకరిద్దరు సుముఖత చూపించారు. మరొకొంతమంది ఎందుకనో విముఖులయ్యారు. విముఖులని ఒప్పించో, మెప్పించో, వారి వద్ద నుండి రచనలు తెప్పించడానికి ప్రయత్నించడం మాకు మామూలే.

ఈ మాట ప్రారంభమైనప్పటినుంచీ, ఇప్పటివరకూ సంపాదకత్వ బాధ్యతలు (సంపాదక బాధలు అనడం ఉచితమేమో!) నిర్వహిస్తున్నవారందరూ సైంటిస్టులు, ఇంజనీర్లూనూ. అందువలన, పీర్ రివ్యూ అన్న పదం ఇంత ఘర్షణకి మూలకారణం అవుతుందని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు. సరిగదా, చాలా ఆశ్చర్యం వేసింది.

మా ఉద్దేశంలో పీర్ రివ్యూ అంటే ఎడిటోరియల్ రివ్యూ అని అర్థం. ఎడిటోరియల్ (సంపాదకీయం) కూడా రివ్యూ చేయించడం మాకు మామూలయ్యింది. ప్రారంభంలోనే ఎడిటర్ల రివ్యూ అని చెప్పి ఉంటే ఇంత రభస ఉండకపోయేదేమో! మాబృందంలో వారికెవ్వరికీ కొరుకుపడని విషయాలపై వ్యాసాలు బయటి వారి చేత రివ్యూ చేయించడం, లేదూ, ఇంకో అభిప్రాయం కోసమో వేరే వారి నడగడం, పీర్ రివ్యూ అనవచ్చు. ఈ ‘పీర్లు’ చెప్పిన సలహాలు రచయితలకి నచ్చచ్చు; నచ్చకపోవచ్చు. రచయిత మార్పులు చెయ్యవచ్చు; చెయ్యకపోవచ్చు. అది రచయిత ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంది. ఈమాటకి సంబంధించినంతవరకూ ఎప్పుడైనా రచయితదే పైచేయి.

ఇకపోతే, కథలు, కవితలూ లాంటి సృజనాత్మక రచనలని రివ్యూ చెయ్యడం, మార్పులు, కూర్పులు, కత్తిరింపులూ ఎడిటర్లే చెయ్యడం పాశ్చాత్యదేశాలలో ఆనవాయితీ. ఈ మాట తెలుగులో అమెరికానుంచి ప్రచురించబడుతున్న ఎలెక్ట్రానిక్ పత్రిక. అందుకని, పాశ్చాత్య దేశాల్లో ఎడిటర్లు, రచయితల గురించి కొంత ముచ్చటించడం అవసరం. వారిద్దరిమధ్య ఉండే స్నేహం వైరుధ్యం గురించి ఈ మధ్య నేను చదివిన కొన్ని విశేషాలు చెప్పుతాను.

ఇవన్నీ పాత విషయాలే. ఇందులో కొత్తవి ఏమీ లేవు.

రేమండ్ కార్వర్ ప్రముఖ అమెరికన్‌ కథకుడు, కవి కూడాను. అతను ప్రముఖ రచయిత కావడానికి ముఖ్యకారకుడు, అతని మిత్రుడు, ఎడిటర్, గోర్డన్‌ లిష్. లిష్ గనక కార్వర్ కథలని మార్చి, కత్తిరించి, కూర్చి అచ్చు వెయ్యకపోతే, కార్వర్ గురించి మనకి తెలిసేది కాదు. ఒక కార్వర్ కథా సంకలనాన్ని లిష్ సగానికి సగం కత్తిరించాడు. దానిలో మూడు కథల్ని ముప్పాతికభాగం తీసేశాడు; పది కథలకి టైటిళ్ళు మార్చాడు; పధ్నాలుక్కథల ముగింపు తిరిగి రాసాడు. కార్వర్ లిష్‌కి ఉత్తరం రాస్తూ, నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, నీ మూలంగానే నేను రచయితగా నిలబడ్డాను అని చెపుతూ, తన సంకలనంలో మార్పులు చెయ్యొద్దని ప్రాధేయపడ్డాడు. లిష్ ఒప్పుకోలేదు. ఆ సంకలనం లిష్ ఉద్దేశించినట్టుగానే అచ్చయ్యియ్యింది. ఇది ముప్పై ఏళ్ళక్రితం సంగతి.

ఇప్పుడు కార్వర్ కథలన్నీ వెయ్యి పేజీల సంకలనంగా ఇద్దరు సంపాదకుల ఆధ్వర్యంలో అచ్చయ్యాయి. అందులో లిష్ కత్తిరించిన వేసిన ఒక కథా సంకలనం పూర్తిపాఠం (కత్తిరింపులు లేకండా) వేసారు. ఆ ప్రచురణ, కథకుడిగా కార్వర్‌కి న్యాయం చెయ్యలేదు సరిగదా, సంపాదకుడిగా లిష్ ప్రతిభని మాత్రం హెచ్చించిందని విమర్శకుల అభిప్రాయం.

కార్వర్ రాసిన కొన్ని కథలు గొప్ప కథలుగా ప్రసిద్ధికెక్కాయి. చెయ్యితిరిగిన తెలుగుదేశ కథకులకి, తెలుగులో ప్రముఖ కథా విమర్శకులకీ, వాళ్ళు నమ్మే ‘కథా పరిధి’ లో కార్వర్ కథలు ఇమడకపోవచ్చు. ఇవి కథలెల్లాగయ్యాయి, అని వెక్కిరించవచ్చు కూడాను! అది అప్రస్తుతం.

ప్రఖ్యాత రచయితలుగా పేరు వచ్చిం’తరువాత’ ఎడిటర్ల మీద రచయితలు కొందరు చాలా జోరైన విసుర్లు విసిరారు. నబకోవ్ ఎడిటర్లని pompous avuncular brutes అన్నాడు. నోబెల్ బహుమతి వచ్చింతరువాత టి. యస్. ఎలియట్, ఎడిటర్లని failed writers అని హేళన చేసాడు. ఎలియట్ గారి వేస్ట్ లాండ్ కథ అందరికీ తెలిసిందే. తను రాసిన ప్రతిని ఎజ్రా పౌండ్ కి పంపిస్తే, పౌండ్ దానిని సగానికి పైగా కత్తిరించి, వేస్ట్ లాండ్ అని పేరు మార్చి అచ్చువెయ్యడానికి ఏర్పాటు చేసి పెట్టాడు. తరువాతి కథ చరిత్ర.

ఎలియట్ తన వేస్ట్ లాండ్ కావ్యాన్ని ఎజ్రా పౌండ్‌కే అంకితం ఇచ్చాడు, il miglior fabbro (better craftsman) అని పొగుడుతూ! పౌండ్ లేకపోతే ఎలియట్ ఎక్కడ ఉండేవాడో ఊహించడం కష్టం. సుమారు 20 సంవత్సరాల క్రితం అనుకుంటాను, పౌండ్ కత్తిరించని ప్రతిని అచ్చువేసారు; చరిత్రకోసం! పరిశోధకులకోసం! కవిత్వం చదివి ఆనందించడానికి మాత్రం కాదు!!

నాకు తెలిసినంతలో గోర్ వైడల్, స్టీవెన్‌ కింగ్‌లు ఎడిటర్లని హేళన పట్టని అమెరికన్‌ రచయితలు.

ఈ మాటకు కథలు పంపే వాళ్ళు కార్వర్లు కావచ్చు, కాని మేము గోర్డన్ లిష్ లమని అనుకోవటల్లేదు. ఈ మాటకు కవితలు పంపే వాళ్ళు ఎలియట్లు కావచ్చు, కాని మేము ఎజ్రా పౌండ్లమని విర్రవీగటల్లేదు.

We try hard; some times we succeed.