గుర్రాలు – గుగ్గిళ్ళు

పంథొమ్మిదివందల నలభై ఐదులో రెండవ ప్రపంచయుద్ధం ముగిసింది. ప్రపంచ ప్రజలందరూ  ఉమ్మడిగా ‘హమ్మయ్య,’ అన్నారు. అన్ని దేశాలూ,  శాంతియుతంగా సహజీవనం చేస్తాయి అని ఆశించారు. 
 
ఏడాది తిరక్కుండానే భూషయ్య గారికి కొడుకు పుట్టాడు. ఊళ్ళో సంబరాలు మిన్నంటి పోయాయి. పెద్దయ్య గారి కొడుకుని, చిన్నయ్య గారని పిలవటం మనకి మామూలే!. అయితే బళ్ళో వేసింతర్వాత, సాధారణంగా చిన్నబ్బాయికి వాడి సొంత పేరు పెడతారు. కానీ, ఊళ్ళో అందరూ చిన్నబ్బాయని పిలవటం కూడా మామూలే!.
 
పాశ్చాత్య దేశాల్లో, భూషయ్య గారి కొడుకు చిన్న భూషయ్యగానే మిగిలిపోతాడు. వాడి పేరు చివర, Jr. అని తోక తగిలిస్తారు. అదే మూడోతరం అయితే, భూషయ్య II అని, నాలుగోతరం అయితే, భూషయ్యIII అనీ రాస్తారు. ఆ రకంగా సార్థక నాముడవుతాడు. ఇలా Jr., II, III అని తోకలు తగిలించడానికి బహుశా రెండు కారణాలుండచ్చు.  పెద్దాయనకి, ఎనలేని గర్వం అన్నా ఉండాలి, లేదా, తనపేరంటే విపరీతమైన మోజన్నా కావాలి. రెండో కారణం,– ఆ పెద్దాయన ఉత్త చవటనాగన్న అయి ఉండాలి, లేదా ఇంకో పేరు కూడా ఆలోచించలేనంత శుద్ధ మొద్దైనా అయి ఉండాలి. ఏది ఏమైయితేనే, మన భూషయ్య, చిన భూషయ్యగా సార్థక నాముడయ్యాడు.
 
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని మనూరి సామెత. అదెంతనిజమో తెలియదు గానీ, చిన భూషయ్య పుట్టగానే, ‘ధరణి కంపించింది. కులపర్వతాలు వణికిపోయాయి. సముద్రంలో పెనుతుఫానులొచ్చాయి. ఆకాశంలో తోకచుక్కలు పొడిచాయి. ఫెళఫెళమని పిడుగులు పుడమిన పడ్డాయి.’ అంతే కాదు. ‘ కుక్కలు మోరలెత్తి మొరిగాయి. పట్టపగలే నక్కలు వాపోయాయి. పక్షులన్నీ ఆర్తరవాలిచ్చాయి.’
 
ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. చిన భూషయ్య పుట్టిన రోజునే,  మాటలు సరిగా పలకలేని మరొకడు కూడా పుట్టాడు. వాడు తరువాత పెద్ద యాక్టర్ అయ్యాడు. అందుకని, ప్రత్యేకంగా వాడి గురించి చెప్పాను.  
 
చిన భూషయ్య ముఖంలో తెలివితేటలున్నట్టు కనిపించదు. చిన భూషయ్య నవ్వితే, ముఖమంతా చిట్లిచ్చినట్టు కనపడుతుంది. అల్లాంటి వాడిని నమ్మకూడదంటారు.   చిన భూషయ్యది పచ్చటి శరీరం. దానికి తోడు, బంగారంలా పసుపుపచ్చని కళ్ళు. మా ఊళ్ళో అయితే, చిన భూషయ్యని, ‘కనకాక్షుడు,’ అనో, తెలుగులో అయితే బంగారయ్య అనో, బంగార్రాజనో పిలిచేవారు.
 
చిన భూషయ్యకి హడావిడిగా, పెద్ద యెత్తున అక్షరాభ్యాసం చేసి బళ్ళో వేశారు. చినభూషయ్యకి బళ్ళో జాగ్రఫీ మేష్టారు నచ్చలేదు. అసలు జాగ్రఫీయే నప్పలేదు. ఆ జాగ్రఫీ మేష్టారు, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అని చెప్పారు. పోనీ తిరిగితే తిరగనీ, అందువల్ల మనకి నష్టం ఏమీ లేదని చిన భూషయ్య ఒప్పుకున్నాడు. జాగ్రఫీ మేష్టారు అంతటితో జాగ్రఫీ పాఠం ఆపి ఉంటే బాగుండేది. భూమి తనచుట్టూ తాను తిరగటమే కాకుండా, సూర్యుడి చుట్టూకూడా తిరుతూందని చెప్పాడు. చిన భూషయ్యకి వల్ల మాలిన కోపం వచ్చింది. అది, ససేమిర, కుదరదు అనుకున్నాడు. చిన భూషయ్య ఉద్దేశంలో ఇది చాలా నష్టం కలిగించే పని.
 
 తనే కనక మహారాజయితే, భూమిని సూర్యుడి చుట్టూ తిరగడం మానిపించి, తన చుట్టూ తిప్పుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు. చిన భూషయ్య కి మూర్ఖపు పట్టుదల. ఏమయినా సరే, భూమిని తన చుట్టూ తిరిగేట్టు చెయ్యాలి.
 
వాడి అదృష్టం కలిసొచ్చింది. పెద భూషయ్య బాగా సంపాదించాడు. దాంతో, బాగా పలుకుబడున్న మోతుబరయ్యాడు. చిన భూషయ్య స్నేహితుల ధర్మవా అని, పరీక్షలన్నీ ముప్పై ఐదు మార్కులతోటే pass అయ్యాడు. పెద భూషయ్య, ఒక రోజున చిన భూషయ్యని పిలిచి, “ఒరే జూనియరూ, ఇవిగో పది లక్షలు ఇస్తున్నా. ఏదన్నా పనికొచ్చే వ్యాపారం పెట్టుకో,” అన్నాడు. చిన భూషయ్య పది లక్షలూ ఒక చిన్న కంపెనీలో పెట్టి, అదే కంపెనీలో ఒక పెద్ద ఉద్యోగం సంపాదించాడు. ఆ కంపెనీ దివాలా తీసేసింది. దాంతో చిన భూషయ్య మనసు కాస్తా పాడయిపోయింది. రాత్రింపగళ్ళూ స్నేహితులతో కలిసి, పరమ విశృంఖలంగా బతికాడు.
 
ఇలా ఉండగా, పెద భూషయ్య ఎన్నికల్లో మహారాజుగా నెగ్గాడు. మరి, ఇది చిన భూషయ్య అదృష్టమనే అనాలి.  చిన భూషయ్య ఇక విజృంభించేశాడు. రక రకాల వ్యాపారాలని పల్టికొట్టించి, తను ఒక చిన్న రాజయి పోయాడు. అప్పుడే, వాడి చిన్న నాటి కోరిక తీర్చుకుందామని బుద్ధి పుట్టింది. ‘భుజా విజృంభణం చేసి భూమిని చాపలా చుట్టి’ వాళ్ళ ఇంటి వెనక పొలంలో దాచేద్దామనుకున్నాడు. నలుగురూ మచ్చిక చేసుకొని,  కొంతకాలం ఆగమని సలహా ఇచ్చారు.  నువ్వు కూడా, మీనాయనలా మహారాజు వయ్యింతర్వాత ఆ పని సులువుగా చెయ్యొచ్చని బుజ్జగించారు. చిన భూషయ్యకి వల్లమాలిన కోపం వచ్చింది. అయినా, సరే అని అప్పటికి సర్దుకున్నాడు.
 
ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. పెద భూషయ్యగారి ఆధీనంలో ఉన్న ప్రాంతంలో, అంటే ఆయన దేశంలో అనండి, ప్రతివాడికీ గుర్రాలంటే మహ మోజు. ప్రతి ఒక్కడికీ కనీస పక్షం రెండు గుర్రాలన్నా ఉంటాయి. కాస్త మదించిన వాడి ఇంటిముందు, అయిదారు గుర్రాలన్నా కనిపిస్తాయి. మీరు గనక ఈ ప్రాంతానికొస్తే, రకరకాల గుర్రాలని చూస్తారు.  పెద్ద గుర్రాలు, తొమ్మిదడుగులెత్తుంటాయి.  అన్నిటికన్నా చిన్నవీ, కనీసం నాలుగడుగులెత్తుంటాయి. ఇక్కడి గుర్రాలు, రకరకాల సైజుల్లో, రకరకాల రంగుల్లో దొరుకుతాయి. ప్రపంచకంలో కొత్త గుర్రం కనిపించిందీ అని తెలిస్తే, ఈ ప్రాతం వాళ్ళు ఆ గుర్రాలని వెంటనే దిగుమతి చేసుకుంటారు. ఇక్కడ, ఎవడైనాసరే,  పక్కింటికెళ్ళడానికి కూడా గుర్రమెక్కే వెళ్తాడు.
 
ఈ గుర్రాలు, పచ్చగడ్డీ, చెరువు నీళ్ళతోనే పరిగెత్తేవయితే ఇబ్బందే లేదు. ఇవి వేగంగా స్వారీ చెయ్యాలంటే, రోజూ ఉలవ గుగ్గిళ్ళు మేపాలి. ఉలవలు దొరక్కపోతే, అధమ పక్షం అలచందలైనా, ఉడకేసి పెట్టాలి. ఇక్కడే వచ్చింది, పెద్ద చిక్కు. ఈ ప్రాంతంలో గుర్రాలైతే సమృద్ధిగా ఉన్నాయి కానీ, ఉలవలే లేవు.
 
ఈ ప్రాంతానికి ఆగ్నేయంగా ఉన్న మరో ప్రాంతంలో, ఉలవలు, అలచందలూ సమృద్ధిగా,
పండుతాయి. అక్కడి జనం, సర్కారు భాషలో చెప్పాలంటే, అంతా తూర్పు మేళం. పెద భూషయ్య గారు మహారాజు కాకముందు, నయాన్నో, కాస్త భయపెట్టో, ఉలవలు, అలచందలూ దిగుమతి చేసుకొనేవాళ్ళు. పెద భూషయ్య గారి హయాంలో,  కాస్త భయపెట్టి ఉలవలు దిగుమతి చేసుకోవడం పెరిగింది. అప్పుడే, ఈ ఉలవలు పండించే ప్రాంతం అంతా మన ఆధీనంలోకి తెచ్చేసుకుంటే బాగుంటుందని ఊహించి, పన్నాగాలు పన్నడం మొదలెట్టారు. అంతో ఇంతో దౌర్జన్యం చెయ్యడం కూడా జరిగింది. ఆగ్నేయంలో ఉన్న ఉలవల ‘దేశం’ వాళ్ళు లొంగలేదు.       
 
ఇలా ఉండగా, పెద భూషయ్య హయాం అయిపోయింది. తన హయాం లో, పెద్ద భూషయ్య ఆ ఉలవల భూమినంతా తన పాదాలక్రిందకి తేలేక పోయాడు. అది,  చిన భూషయ్యకి తల కొట్టేసినట్టనిపించింది. ఎంత నామర్దా! 
 
ఆ రోజు రానే వచ్చింది. చిన భూషయ్య కిందా మీదా పడి ( కిందే ఎక్కువ పడ్డాడు లెండి)  మహారాజుగా  తనని ఎంపిక చేయించుకున్నాడు. ఎన్నికల్లో ఎదురు నిలబడ్డవాడు దద్దమ్మయితే, ఎబ్బెమ్మలుకూడా మహా రాజులవుతారు. స్వారస్యం లేని వాడు మహారాజవుతాడని, ఏనాడో వేదన పడ్డాడు, మహానుభావుడు,  వేదం వేంకట్రాయ శాస్త్రి గారు!
 
చిన భూషయ్య చిన్నప్పటి కోరిక చెప్పుకున్నాం కదా! భూమిని సూర్యుడిచుట్టూ తిరక్కండా, తన చుట్టూ తిప్పుకోవడం, అని. అది సాధించడం కోసం,  నానారకాల అబద్ధాలు చెప్పి, ఎదురు మాట్లాడిన ప్రతి చిన్న వాడినీ బెదిరించి లొంగదీసుకున్నాడు. దక్షిణాన, ఉత్తరాన, కాసిన్ని ఉలవలు పండించే చిన్న చిన్న ప్రాంతాల వాళ్ళంతా , వీడితో మనకెందుకు  బాబోయ్ అని పక్కకి తప్పుకున్నారు. చిన భూషయ్య మహారాజు ‘ ప్రతిరోజూ చండ వేదండ శుండా దండ మండిత భుజాదండంబున గదాదండంబు ధరించి,’ విచ్చలవిడిగా విజృంభించాడు. 
ఈ దెబ్బతో, వీడిరంగులో వాళ్ళే, —  ఒకళ్ళిద్దరు, వీడి సరసన చేరారు కూడాను. అయితే, ఆగ్నేయంలో ఉన్న మూక మాత్రం తీవ్రంగా ప్రతిఘటించడం మొదలెట్టింది.
 
చిన భూషయ్య పగ పడితే, పాములు పనికి రావు. వీడు పాముని కరిస్తే, ఆ పాము చావాల్సిందే. ఆ  మూకని వదిలెయ్యరా నాయనా అని పెద భూషయ్య చెప్పినా వినలేదు. అలా చెప్పిన వాళ్ళు వీడికి బద్ధ విరోధులయ్యారు. శాంతి కోరే పెద్దలు అన్నారు కూడాను, ‘ పురుషోత్తముడవతరించి  భూరి భుజా విస్ఫురణన్ దుష్టనిశాటుల హరియించుచు నుండు,’ అని.  చిన భూషయ్య, వాడెవడో వాడిని నేనే హరించేస్తా, హతమార్చేస్తా అని మంకు పట్టు పట్టాడు.
 
ఆ ఆగ్నేయ  మూకని  నానా మాటలూ అన్నాడు. ‘ఘన సూకర, మూఢాత్మక, మాయావి వగుచు ఈ పుడమి చోర భావముతో కొనిపో చూతునె?, భుజబలముచేత అణచెద,’ అని పేలాడు.
 
మీ గుర్రాలకి గుగ్గిళ్ళకోసం, మమ్మలని, ‘సూకర, మూఢాత్మకా,మాయావీ’ అంటావా. అందులోనూ ‘ఘన సూకరా!’ అని ఎద్దేవ చేస్తావా? చూడు మా తఢాకా చూపిస్తాం అని మూకజనం, మూక ఉమ్మడిగా పైకి కనపడకుండా, అదృశ్యంగా పోరు సలపడం మొదలెట్టారు. అదృశ్యంగా  పోరుకి ఒకే ఒక్క కారణం. చిన భూషయ్య ఏలికలో ఉన్న ప్రాంతం, చాలా ధనబలం, విపరీతమైన ఆయుధ బలం  ఉన్న ప్రాంతం. ధన మూల మిదం జగత్  అని గదా ఆర్యోక్తి. పైగా, వీడి సరసన చేరిన వాళ్ళకీ చవకగా ఉలవలు కావాలి. ఎంత చవగ్గా ఉలవలు దొరికితే, అంత జోరుగా గుర్రాలని పరిగెత్తించచ్చు. ఇంకా పెద్ద పెద్ద గుర్రాలు కొనుక్కోవచ్చు. ఇంటికి రెండు బదులు, నాలుగో, ఐదో పెద్ద గుర్రాలు దిగుమతి చేసుకోవచ్చు.
 
ఆగ్నేయ  మూక చేసే తిరుగుబాటు దుర్భరమై పోయింది. ఉలవ గుగ్గిళ్ళో, ఉలవగుగ్గిళ్ళో అని గుర్రాల ఓనర్లు మొర పెట్టడం మొదలెట్టారు.  ఈ ఓనర్లు చిన భూషయ్య తెలివితేటలని ఇప్పుడు శంకించడం మొదలెట్టారు. కాస్తో, కూస్తో, అక్కడక్కడ  అలజడి కూడా ప్రారంభమయ్యింది. ఉలవలకోసం ఇంత పోరు మంచిది కాదేమో అన్న సంశయం రావడం మొదలయ్యింది.
 
చిన భూషయ్య, ‘దిటచెడి లోబడె దైత్యుడు, సటికిన్ దంష్ట్రా విభిన్న శత్రు మహోరస్తటికిన్ ఖర ఖుర పుటికిన్ కటతట హత కమలజాండ ఘటికిన్ గిటికిన్’  అన్నట్టుగా లోబడి తోక ముడిచెయ్యడం మొదలెట్టాడు. ప్రస్తుతం, చిన భూషయ్య తను చేసిన వెధవ పనిని సమర్థించుకుంటున్నాడు.
 
‘నా తరవాత మహారాజుగా, ఎన్నికయ్యేవాడో, ఎంపికయ్యేవాడో, వాడి ఖర్మ,’ అని ముఖ్య స్నేహితులతో రహస్యంగా అంటున్నట్టు వినికిడి. ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో, ఎవరికి తెలుసు. దక్షిణాన రాజుగా ఉన్న చిన భూషయ్య తమ్ముడే ఈ సారి మహారాజవచ్చు!
 
జనకోటికంతకీ, ‘అనఘంబగు నీ చరితము, వినిన పఠించిన విశ్రుత కీర్తులు, సుసౌఖ్యములు, లభించును.’
 
కథ కంచికి, మనం ఇంటికి.