వంటా వార్పు

రూంలో వుండేది నలుగురం. నాకు బియ్యంలో కొలత ప్రకారం నీళ్ళు పోసి, అన్నం వండడం కూడా రాని రోజులవి.

సాయంత్రం ఆఫీసుల నుంచి ఎవరు ముందొస్తే వాళ్ళు వంట పని మొదలు పెట్టే వాళ్ళు. నా పని మాత్రం షాపు కెళ్ళి సరుకులు, కూరగాయలు తేవడం   కూరలు కట్‌ చేసిపెట్టడం. వినడానికి అది చాలా తేలికైన పనిలా అనిపిస్తుంది కానీ, మా రూంలో మాత్రం అది బ్రహ్మ విద్యతో సమానం.

కూరల రుచి, ముక్కల సైజుని బట్టీ, ఆకారాల బట్టీ ఉంటుందని, అసలు కూరలు కట్‌ చేయడం పెద్ద ఆర్టని…నేను కాస్త వొళ్ళు దగ్గరెట్టుకుని కూరలు కోయాలని చెప్పేవాడు రాంబాబు. ఏ రోజైనా కూరలో ఉప్పెక్కువైందనో, మషాలా తక్కువైందనో ఎవరైనా అంటే…రాంబాబు నావైపు గుర్రుగా చూసేవాడు. అక్కడకేదో నేనే కూర చెడగొట్టినట్టు.

ఏదో కలిసి ఉంటున్నప్పుడు అలాంటివన్నీ మామూలే కదా!

మెస్సుల్లో, హోటళ్ళలో తినే ఫ్రెండ్స్‌ ఎప్పుడైనా రాత్రి పూట మా రూంకొస్తే ” అబ్బ మీ పనెంత హాయిగా వుందిరా. సుబ్బరంగా వొండుకు తింటున్నారు ” అనే వాళ్ళు. పైపెచ్చు మమ్మల్ని బయట ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు ” వీళ్ళు సెల్ఫ్‌ కుక్కింగ్‌ చేసుకుంటార ” ని చెప్పే వాళ్ళు.

” అవును మమ్మల్ని మేము వొండుకుంటాం ”  అనేవాడు సుబ్బారావ్‌..

రూంలోంచి బయటకు వెళ్ళకుండా, చక్కగా రూమ్మేట్లు వొండి పెడుతుంటే తింటానికి నాకూ హాయిగానే వుండేది. పైగా ఖర్చు కూడా బయట మెస్సుల కంటే చాలా తక్కువగా ఉండేది. అసలే నిరుద్యోగ పర్వం.

రోజులన్నీ ఎప్పుడూ ఒకేలాగా వుండవుకదా!

ఒక్కోసారి ఆఫీసుల్లో పనులు పెరగొచ్చు. బయట పనులూ పెరగొచ్చు. పనులు పెరిగాయికదాని తిండి మానెయ్యం కదా. అలాగని బయట తిని ఆరోగ్యాలు పాడు చేసుకోలేము కదా! కాబట్టి అందరం రూములోనే వొండుకుని తినాలి.

ఆలస్యంగా ఇంటికి వచ్చి సెకండ్‌ షో వొదిలే టైములో కుక్కర్‌తో విజిల్స్‌ వేయిస్తా వుంటే   చుట్టుప్రక్కల వాళ్ళు వింటూ వూరుకొంటారా ?!

ఒక ఆదివారం మధ్యాహ్నం, ఉదయాన్నే పట్టుకెళ్ళిన పేపరు తిరిగి ఇవ్వడానికొచ్చిన ఇంటి ఓనర్‌గారు ” రోజూ అర్థరాత్రి ఈలలేసి గోలచేస్తున్నారట…ఏమిటి సంగతి? చుట్టు ప్రక్కల వాళ్ళు కంప్లయింట్‌ చేస్తున్నారు. ఇలా అయితే మరో ఇల్లు వెదుక్కోండి ” అని వార్నింగిచ్చాడు.

ఆ రాత్రి మూడు కింగ్‌ఫిషర్‌ బీర్లు కొనుక్కొచ్చి ( సుబ్బారావు తాగడు. అయినా ఖర్చు కామన్‌ ఖాతాలో పడుతుంది )  అర్జంట్‌ మీటింగ్‌ పెట్టాడు రాంబాబు.

” మనమిలా అర్థరాత్రులు, అపరాత్రులు వంటలు చేస్తుంటే జనాలకు ఇబ్బందిగా వున్నట్టుంది…అదీగాక ప్రతి రోజూ నేనే వంట చెయ్యాల్సి  రావడం నాకూ ఇబ్బందిగానే వుంది. కాబట్టి మనమొక టైంటేబుల్‌ వేసుకుని దాని ప్రకారంగా సెకండ్‌ షో మొదలుగాక ముందే వంట పనెయ్యేలాగా చూసుకుంటే బావుంటుంది ”  అని తీర్మానించాడు.

ఇదేదో తిరిగితిరిగి మన తలకు చుట్టుకునేలా వుందని ” నాకు వంట రాదు కదా. మరి నా పరిస్థితేమిటి ?”  అనడిగా. ఇంజనీరింగ్‌ చదివేటప్పుడు బాబూరావుకు నాల్గు సినిమాలు చూపించి అసైన్మెంట్లన్నీ చేయించుకున్నట్లు, రూములో మిగిలిన వాళ్ళకు సిన్మాలు చూయించో, బీరు కొట్టించో వంట తప్పించుకోవచ్చన్న ఆలోచన రాకపోలేదు.

” వంట నేర్చుకోవడం ఎంత సేపు. నేనొక పూటలో నేర్చుకున్నా ” అన్నాడు సుబ్బారావ్‌.

” అది వేరే చెప్పాలా…నీ వంట తింటూంటేనే తెలుస్తుంది ” అని చురకేశాడు బోసు.

” ఒక పని చేద్దాం. గిన్నెలు కడగటానికి ఎలాగు పనిమనిషి వస్తుంది కాబట్టి, నువ్వు ఇప్పటిలాగే కూరలు తరిగిపెట్టు చాలు…తరగమన్నారు కదాని బాంబే సెలూనోడి మాదిరిగా కచ్చాపచ్చాగా కూరల్ని నరకడం కాదు. జాగ్రత్తగా మనసు పెట్టి…చక్కగా కోయాలి ” అన్నాడు రాంబాబు.

సరేనని తలూపాను.

వెంటనే మా రూము అక్కౌంటు పుస్తకం వెనక పేజీలో ఏ రోజు ఎవడు వంట చెయ్యాల్సింది ఒక టైం టేబుల్‌ గీసాడు రాంబాబు. ఎవడికైనా అర్జెంట్‌ పని తగిలి వంట చేయడం కుదరక పోతే, ఆ రోజు వంట మిగిలిన వాళ్ళలో ఎవడో ఒకడు చెయ్యాలి. నెలలో మూడు సార్లు అర్జెంటు పనులు తగిలి వంట చేయని వాళ్ళు, ఒక రోజు రూములో అందరికీ సరిపోయేంత చికెన్‌, తలా ఒక బీరు కొనుక్కురావాలి ( ఖర్చు కామన్‌ ఖాతాలో పడదు ) .

రోజుకొకడు వంట చేస్తుంటే, కూరగాయలు తరిగి ఇవ్వడం, పోపు గింజలు అందివ్వడం, వంట ఎలా చేస్తున్నారో గమనించడం నా పని.

ఆ విధంగా కొన్నాళ్ళు బాగానే నడిచింది.

ఒక రోజు వూరంతా తిరిగి రూముకు బయల్దేరే టైముకు భోరున వర్షం. అలాగే తడుస్తూ, రెండు బస్సులు మారి రూముకొచ్చాను.

ఎనిమిదైంది. రూమ్మేట్లు ఎవరూ గూటికి చేరలేదు. ఆకలి దంచేస్తోంది.

బయటకు వెళ్ళి తిందామంటే రూములో గొడుగులేదు. మళ్ళీ తడుచుకుంటూ వెళ్ళి తినే ఓపికా లేదు. తింటానికి రూములో ఏమైనా దొరుకుతాయేమోనని వెదికాను. ఏదో దుర్భిక్షమొచ్చినట్లు తింటానికి ఏమీ దొరకలేదు.

నాకు ‘ సెల్ఫ్‌కుక్కింగు ‘  తప్ప వేరే మార్గం కనిపించలేదు.

అయినా అన్నం వండడమేమైనా బ్రహ్మ విద్యా?! రోజూ మిగిలిన వాళ్ళు వొండుతుండగా ఎన్ని సార్లు చూళ్ళేదు?! అనుకుని వీరావేశంతో బియ్యం కొలుస్తుండగా కరెంటు పోయింది.

కేండిల్‌ వెలిగించి, ఆ వెల్తురులోనే బియ్యం కడిగి, వురామారిగ్గా నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టి, పొయ్యి వెలిగించా.

సరే, అన్నమెలాగు అలా వుడుకుతుంది కదా అదయ్యేలోపు కూర కూడా ఒకటి వొండేస్తే పోలా… పాపం మిగిలిన జీవాలు ఆవురావురంటూ వొస్తారు. వాళ్ళ ఋణం తీర్చుకునే ఛాన్సొచ్చిందని, చూస్తే రెండు బంగాలా దుంపలు తప్పించి, కూరగాయలేమీ కనిపించలా. డబ్బాలు వెదికితే కాసిన్ని కంది పప్పు కనిపించాయి. వుత్తి పొప్పు వొండినా…రెండు బంగాలాదుంపలతో కూర చేసినా అందరికీ సరిపోదు. రెండూ కలిపి బంగాళాదుంప పప్పు చేస్తే పోలా అనుకున్నా. గబగబా కందిపప్పు కడిగి, బంగాళా దుంపలు కోసి అందులో వేసి…వుడుకుతున్న కుక్కరు మూతతీసి పప్పు గిన్నెను అందులో పెట్టాను.

అంత ఆకలిలోనూ నా సమయస్పూర్తికి నన్ను నేను మెచ్చుకుంటూ, ఆనందిస్తుండగానే కుక్కరు విజిల్‌ వేసింది.

స్టౌ కట్టేసి, పప్పును ఆలూను బాగా మెదిపి కాస్త ఉప్పూకారం వేసి, ఘాటుగా పోపు పెట్టే వేళకు… వర్షంలో చిత్తుగా తడిసి, ఆవురావురుమంటూ రూమ్మేట్లు వచ్చేశారు.

వంట రెడీగా వుండడం చూసి నన్ను మెచ్చుకుని, తలలు తుడుచుకుంటూ పళ్ళేలు తెచ్చుకుని అందులో వుడికీ వుడకని అన్నాన్నీ, పొటేటో పప్పును వేసుకుని మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్న తర్వాత వాళ్ళు చూసిన చూపుంది చూశారూ నా కిప్పటికీ గుర్తే!