శ్రీలలితా సహస్రనామ వైశిష్య్టమ్‌

“దేవీనామ సహస్రాణి కోటిశ స్సంతి కుంభజ”

దేవీనామములు కోట్లకొలది ఉన్నప్పటికి నామస్తోత్రాలలో లలితా రహస్యనామ స్తోత్రం ఉత్తమోత్తమ మైనది. విశిష్టమైనది.

“శ్రీమాయః ప్రీతయే తస్మాదనిశం కీర్తయే దిదం”
శ్రీమాత ప్రీతి కొరకు లలితా సహస్ర నామ పారాయణ నిత్యము భక్తులకు ఆవశ్యకరమైనది.

శివ, విష్ణు, లక్ష్మీ సహస్ర నామావళి స్తోత్రాలు వున్నప్పటికీ లలితా సహస్ర నామ స్తోత్రములో య, చ, స్మ, త, ధ, హ మొదలైన పదాలు కాని వ్యర్థాక్షరాలు కాని వుండవు.

ఈ నామాల వరుస అంతర్లీనంగా కావ్యకళా వైభవంతో సూత్రబద్ధమైన కథాగమనంతో ఉపమాన, రూపకాలంకార సమేతమై, సమాస శిల్పముతో మహాదృశ్య కావ్యమై రాగమాలికా సమ్మిళితమై ఆనందానుభూతిని కలిగిస్తుంది.

ఆమె స్వరూప వర్ణనతో, జ్ఞానమార్గానికి కర్మమార్గానికి మధ్యే మార్గమయిన ఉపాసనా మార్గంగా, వశిన్యాది వాగ్దేవతల స్తుతితో మహిమాన్వితమైన చారిత్రక అంశాల సందర్భ వైశిష్య్టంతో ఈ రహస్యనామ స్తోత్రం కీర్తితమైంది.

సమస్త శక్తులకు ఆధారభూతమైన బ్రహ్మ స్వరూపిణి త్రిపురసుందరి ఆంధ్రుల ఆరాధ్యదేవత.

అనుష్టుప్‌ ఛందస్సులో 320 శ్లోకములతో బ్రహ్మాండ పురాణం లోని ఉత్తరభాగంలో వున్నది. వేయినామములు తాంత్రిక స్వరములైన వేయి మంత్రములు.

ఒక ధ్యానశ్లోకముతో, 50 శ్లోకముల పీఠికతో మొత్తం 51, సహస్రనామములు 182 1/2 శ్లోకములతో, ఫలశ్రుతి 86 1/2 శ్లోకములు కలిపి మొత్తం 320 శ్లోకములు. “శ్రీమాతా” నామంతో ప్రారంభమై “లలితాంబికా” నామంతో వేయి నామాలు 182 1/2 శ్లోకాలలో నిక్షిప్తం కావడానికి విశేషమైన సూత్రాధారం వుంది.

సంవత్సరానికి 365 రోజులు; అందులో సగం పగలు, సగం రాత్రి; సగం శివపరంగాను, సగం శక్తి పరంగాను విభజించుకొని 182 1/2 శ్లోకాలతో నిబద్ధీకరించబడి “శివా శ్తౖక్యెక్య రూపిణి లలితాంబికా” అని ముగించబడుతుంది.

శ్రీవిద్యోపాసకులలో అగ్రగణ్యుడు హయగ్రీవుడు. ఆయన ద్వారా, శిష్యుడైన అగస్య్త మహామునికి వశిన్యాది వాగ్దేవతలు మంత్రాధిష్టాన దేవతలుగా రహస్య నామస్తోత్రాన్ని ఉపదేశించారు.

నిగూఢ విద్యాత్మకమై వేదాంత, సాంఖ్య, శైవ సిద్ధాంతాల నుండి అనేక విషయములతో మంత్ర స్వరూపమైన ఈ స్తోత్రమునకు సాధికారికముగా ఆరు వ్యాఖ్యానములు సంస్కృతములో ఉన్నవి. వారు విమర్శానందుడు, విద్యారణ్యులు, భట్ట నారాయణ, శంకరుడు, భాస్కరాచార్యులు, కళ్యానంద భారతి.

వీరిలో భాస్కరరాయ “సౌభాగ్యభాస్కరం”, కళ్యానందభారతి “శ్రీకల” అత్యంత విపులమైనవిగా భావించబడుచున్నవి.

శ్రీమాత యొక్క స్వరూపము, భండాసురునితో యుద్ధము, సాధకుని శరీరమునందు మూలాధారాది సహస్రారాంత అంతరచక్రములందు వివిధములైన ఆమె నివాసస్థానములు, భక్తరక్షణ, ఆమె మూర్తామూర్త స్వరూప నిర్ణయము పొందుపరుచబడినవి.

ఏ అక్షరములతో ప్రారంభించి ఎన్నెన్ని నామాలుంటాయో అన్ని గూడా ఒక పద్ధతి ప్రకారం వుంటాయి. ప్రక్షిప్త నామాలకు గాని ఉన్న నామాల్ని తీసివెయ్యడానికి గాని వీల్లేని విధంగా కట్టుదిట్టంగా నిబద్ధమై వున్నాయి.

ఛలాక్షర సూత్రముతో  ఏర్పరచిన సంకేతాలతో అక్షరాలను అంకెలతో తెలుసుకొనే విధానాన్ని వరరుచి సూత్రీకరించారు.

“త్రిపురాం కులనిధి మీడేऽరుణ శ్రియాం కామరాజవిద్ధాంగీం త్రిగుణైర్దేవై ర్వినుతాం ఏకాంతాం బిందుగాం మహారంభాం”

ఈ సూత్రానికి రెండర్థాలు వున్నాయి. అవి బాహ్యార్థం, అంతరార్థం.

మూడు పురములు గలిగి సజాతీయ సమూహమునకు కోశాగారమై ఎఱ్ఱని కాంతులు గలది, కామరాజైన పరమేశ్వర సామరస్యము పొందిన అంగములతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో స్తుతింపబడినది. బిందుమండల వాసిని, మహాసృష్టి ఆరంభకారకురాలయిన త్రిపురసుందరిని స్తుతించుచున్నాను.

ఈ శ్లోకమందే నామోద్ధారము కూడ చూపబడుచున్నది. అంకెలకు అక్షరాలకు ఈ క్రింద చూపిన సంబంధాన్ని గమనించాలి.

1

2

3

4

5

6

7

8

9

0

ఙ్‌

ఞ్‌


పై పట్టిక ననుసరించి క, ట, ప, య వర్ణభవములు నాలుగు అక్షరాలు ఏక సంఖ్యను సూచిస్తాయి. గ, డ, బ, ల మూడు సంఖ్యను, ఞ్‌ , న శూన్యాన్ని సూచిస్తాయి.

సంస్కృతమున “అంకానాం వామతః గతిః” అనగా అంకెలను లెక్క పెట్టునప్పుడు కుడినుండి ఎడమ వైపునకు చదువుకొనవలెను. ఉదా కర. క 1, ర 2; అంటే 12 అవుతుంది; కాని ఎడమవైపుగా చదువుకొంటే 21 అవుతుంది. ఉదా ఏకవింశతి అనుచోట వింశతి ముందుగా ఏక తరువాత అనగా ఇరువది ఒకటి అవుతుంది.

సంయుక్తాక్షరం వస్తే రెండవ అక్షరానికే ప్రాధాన్యత వుంటుంది. “రమ్భాం” అనే పదంలో సంయుక్తాక్షరంలో “మా” తీసివేసి “భాం” అనే అక్షరాన్ని తీసుకొని ర 2, భ 4 గా తీసుకొని 42 గా అర్థం చేసుకోవాలి.

కొన్ని చోట్ల అగ్ని (త్రేతాగ్నులు) రాశి ద్వాదశ సంకేతంగా అన్వయించుకోవలసి వుంటుంది.”త్రిపురాం” ప ఏక సంఖ్యను, రే రేఫము రెండు సంఖ్యను, పుర ఇరువది ఒకటి అని గమనించాలి. త్రిపుర ప్రారంభముగా గల నామములు త్రినయన ఆరంభముతో త్రికోణగా అనువరకు ఇరువది ఒకటి నామములు అని తెలుసుకోవాలి.

“కులనిధి” ఛాందసీయ వచనము ననుసరించి నిధి అనగా తొమ్మిది; నవగ్రహములు. కుల పద నామములు కులామృతైక రసికా నుండి కులరూపిణి వరకు తొమ్మిది.

“అరుణశ్రియం” ద్వాదశ సూర్యులు కావున శ్రీ అక్షరముతో ఆరంభించబడి శ్రీమాతా అను నామము నుండి శ్రీశివా వరకు పన్నెండు కలవు.

“కామరాజ” పదారంభముతో (షోడశ రాజులు) 16. కామేశబద్ధ మాంగల్య నుండి కామకేళితరంగిత వరకు పదహారు నామములు కలవు.

“విద్ధాంగీం” ధ 9, గీం 3. వామగతిని బట్టి 39. విశుక్రప్రాణ హరణ నుండి విరాగిణి వరకు.

“త్రిగుణైః మూడు గుణ శబ్ద ప్రారంభ నామములు. గుణనిధి, గుణాతీతా, గుణప్రియ.

“నినుతాం” ను 0, తాం 6. వామగతి ననుసరించి 60 సంఖ్యను సూచిస్తుంది. ని అక్షరంతో 60 నామములు.

“ఏకాంతాం” తాం అను దానితో ప్రారంభించు నామము ఒకటి. తాంబూలపూరిత ముఖీ

“బిందుగాం” గాం 3. బిందు శబ్దములు మూడు. బిందుమండల, బైందవాసనా, బిందుతర్పణ

“మహారంభాం” ర 2, భ 4. వామగతిలో 42. మహా ప్రారంభ నామములు 42. మహా లావణ్య నుండి మహేశీ వరకు.

ఛలాక్షర సూత్రములచే నామ విభాగము క్లిష్టము అయినందున పరిభాష సౌలభ్యము కొరకు ఈ వివరణ ఇవ్వడం జరిగింది. మరో ముఖ్యమైన సాంకేతిక విషయం

ఆయుర్వేదశాస్త్రానుసారము రసాది సప్త ధాతువులు శరీరక్రియ పోషణ వ్యవహారాల్ని నిర్వహిస్తుంటాయి. ఆశ్చర్యకరమయిన అంశం ఈ సప్త ధాతువుల పేర దేవి నామములు ఉండడం. ధాత్వాశ్రయమై దేవి పంచభూతాత్మక దేహస్థితయై వుంటుందనేది విశేషము. ఈ క్రింది నామములు గమనించండి

ఆరక్తవర్ణా (శ్వేత రక్తస్తు పాటల)       476
రక్తవర్ణా      499
మాంసనిష్టా      500
మేదోనిష్టా      509
అస్థిసంస్థితా      516
మజ్జాసంస్థా      529
శుక్లసంస్థితా      531

“యా దేవీ సర్వభూతేషు శక్తిరూపే సమన్వితా” అని ఆర్యోక్తి. ఈ జీవుల పార్థివ శరీరం పట్ల దేవి సప్తధాతువుల్లో శక్తిరూపమై వుంటుందని విశేషాంశం.

బాల మంత్రోపదేశము కాని, పంచదశాక్షరీ షోడశాక్షరీ మంత్రోదేశము కాని పొందిన వారు పఠించిన మూలమంత్రము ఫలితము ఎంతమేరకు కలుగునో మంత్రోపదేశం పొందని సామాన్యులకు కూడ స్తోత్రాదులను పారాయణ చేసినంత మాత్రముననే దీక్షాపరులతో సరితూగు భోగభాగ్యములు ప్రాప్తించును.

పంచభూతాత్మకే దేహే
పంచతన్మాత్ర సాయికే
సప్త ధాత్వాశ్రయే దేవి
నారాయణి నమోస్తుతే!

రచనకు ఉపకరించిన గ్రంధాలు

1. శ్రీలలితా సహస్రనామ భాష్యమ్‌ (భాస్కరరాయ) శ్రీ పొంగూరు సూర్యనారాయణ శర్మ, ఆంధ్రానువాదం

2. శ్రీలలితా సహస్రనామ వివరణము, డా.. జి. ఎల్‌. ఎన్‌. శాస్త్రి

3. శ్రీలాలిత్యము జయమంగళ పాఠము, శ్రీ దోర్బల విశ్వనాథ శర్మ

4. సుశ్రుత సంహిత

5. శ్రీచక్రార్చన శ్రీవిద్యోపాసన, డా.. ధేనువకొండ శ్రీరామమూర్తి