పొద్దుపొద్దున్నే నిద్ర కళ్ళతో గోడను పట్టుకుని, బెడ్రూములోంచి వంటగదిని దాటుకుని, ముందు గదిలోకి వచ్చి, తలుపు తీసి పేపరు కోసం చూడ్డమూ వారం రోజుల్లో అయిదు రోజులు అదక్కడ వుండక పోవడం చాలా మామూలు!
పేపరబ్బాయి అయిదింటికే, సైకిలు మీద నుంచీ గురిచూసి మా రూము గుమ్మం కేసి విసిరేసి వెళ్ళిపోతాట్ట ( ఏనాడైనా అయిదింటికి లేస్తేగా తెలిసేది ) ! అయితే ఆరున్నరకో ఏడుకో, పక్కన పడుకున్న వాళ్ళను దాటుకుంటూ, నేను లేచి వెళ్ళేసరికి అదక్కడ వుండదు. అంతలోనే దానికి కాళ్ళొచ్చి, పాక్కుంటూనో, పరుగెత్తుకుంటూనో … అదెక్కడికో షికారుకు వెళ్ళదు కదా!
మా ఇంటి ఓనరు కాశీపతి, మాకంటే ముందేలేచి పేపరుకు కాళ్ళు కళ్ళూ తగిలించి వాళ్ళ ఇంటి దారి చూపిస్తాడు.
ఇంకేముంది. మేము లేచేసరికి ఈనాడు పేపరు, డక్కను క్రానికలూ మాయం!
గుమ్మం దగ్గర లేని పేపరును, ఇంటి ఓనరును సైలెంటుగా ఒక అయిదునిమిషాలు తిట్టుకుని అక్కడే చల్లగా పడున్న పాల పేకెట్టును తీసుకొని లోపలికెళ్ళి గిన్నెలో పాలు పోసి బాత్‌రూము కార్యక్రమాలు ముగించుకొచ్చేసరికి, రూమ్మేట్లలో ఎవరో ఒకరు స్టౌ వెలిగించేవారు.
ఒక సిగరెట్ వెలిగించి, వెచ్చగా కాఫీ తాగుతూ కూర్చుంటే, రాంబాబు హడావిడిగా రెడీ అయి, కాఫీ గ్లాసు పక్కన పెట్టుకుని షూస్ పైన తోలు లేచొచ్చేలా బ్రష్షుతో తుడుస్తూ వుండేవాడు. బోసన్న ఇస్త్రీ చొక్కా కోసం రూమంతా వెదుకుతూ వుండే వాడు ( ఫైనల్‌గా మర్నాడు ఉతికి, ఇస్త్రీ చేసిచ్చే ఒప్పందమ్మీద ఎవరిదో ఒకరి చొక్కా తొడుక్కునేవాడు ) . నిద్ర డిస్ట్రబ్ చేసినందుకు బోసన్నను తిట్టుకుంటూ లేచే సుబ్బారావు, వాచీ వంక చూసుకుని ఆఫీసుకు టైమవుతోంది మొర్రో అనుకుంటూ చిందులేసేవాడు.
వీళ్ళందరినీ చూస్తుంటే నాకింకా వుద్యోగం దొరకలేదన్న విషయం మళ్ళీ గుర్తొచ్చేది. మనకీ ఉద్యోగం ఉంటే, నున్నగా గడ్డం గీసుకుని, ఓల్స్ప్డైస్ ఆఫ్టెర్ షేవ్ రాసుకుని, ఇస్త్రీ చొక్కా ఏసుకుని, బూట్లకు పోలిష్ కొట్టుకుని ఈ పాటికి రెడీ అయి బయల్దేరుదునుకదా అనిపించేది. దాంతో ఆవాల్టి పేపరూ, దాన్ని ఎత్తుకుపోయిన మా ఇంటి ఓనరు గుర్తొచ్చే వాళ్ళు.
పొద్దున్నే లేవగానే పేపరు కనిపిస్తే, గబగబా వుద్యోగాల అడ్వర్టైజ్‌మెంట్లు చూసేసి, బయోడేటా కాపీలు తీసుకుని నేనూ కాస్త హడావిడి చేసేవాణ్ణికదా అనుకునే వాణ్ణి.
మనమలా అనుకుంటుండగానే, ” ఒరేయ్… గాస్ బండ అయిపోనట్లుంది ఒకటి బుక్ చేసిరా ” అంటూ, అద్దంలో అరవై అయిదోసారి చూసుకుని వెళ్ళిపోయేవాడు రాంబాబు, నేను సమాధానం చెప్పేలోపుగానే.
” మన టీవీ ప్రోగ్రాముల్లో పద్దాకా ఒకటే డిస్ట్రబెన్సు వస్తోంది. ఓసారలా వెళ్ళి, కేబుల్ వాడితో మాట్లాడిరా ” అన్చెప్పేవాడు సుబ్బారావు.
” ఉప్పు, షుగరు అయిపోయినై. సాయంత్రానికి కొనుక్కురా ” అని బోసన్న కూడా ఒక పని చెప్పేవాడు.
ఛ…నౌకరు బ్రతుకైపోయింది అనుకుని, ” అలాగే లేవో…అంతకంటే నాకు వూడ బొడిచే పనేముంది కనుక ” అనేవాణ్ణి నేను. మనసులో మాత్రం, హాయిగా ఊళ్ళో తిని కూర్చోక తగుదునమ్మా అనుకుంటూ హైదరాబాదొచ్చినందుకు తగిన శాస్తే జరుగుతోందనుకునేవాణ్ణి.
” మరీ అంత వర్రీ కాకు…నిరాశ, నిస్పృహలు మనిషికి మంచిది కాదు. రోజూ మర్చిపోకుండా పేపర్లో పడ్డ వుద్యోగాలన్నింటికి అప్లై చెయ్యి. ఏదో ఒహటి వొస్తుందిలే ” అని వూరడించి, ” అన్నట్టు…కేబుల్ సంగతి మర్చి పోకు ” అని ఇంకోసారి చెప్పి వెళ్ళే వాడు సుబ్బారావు.
పేపరు పట్టుకెళ్ళిన కాశీపతిని మరో రౌండ్ తిట్టుకునే వేళకు, మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషనూ లేకుండా…మా గుమ్మంలోంచి లోపలకు పేపరు గిరాటేసి, వెళ్ళిపోయేవారు.
డక్కన్ క్రానికల్‌లో ఉద్యోగాల పేజీ తెరిచి, పనికొచ్చే వాటికి టిక్కులు పెట్టుకుంటూ ఉన్న బయోడేటా వాటికి సరిపోతుందో లేదో చూసుకుని, సరిపోదనుకుంటే దాన్లో చెయ్యాల్సిన మార్పులను, వెయ్యాల్సిన మసాలాలను పెన్సిల్‌తో నోట్ చేసుకుని…స్నానం చేసి, రూంకి దగ్గరలో వున్న టైప్ ఇన్స్టిట్యూట్‌కి వెళ్ళేవాణ్ణి.
అక్కడ నోట్ చేసుకున్న మార్పులతో రెండు మూడు రకాల బయోడేటాను ఎలక్ట్రానిక్ టైపు కొట్టించుకుని ( ఇప్పటిలా కంప్యూటర్ సౌకర్యాలు అంతగా లేవు ఆ రోజుల్లో ) , వాటిని జెరాక్స్ కాపీలు తీయించుకుని…నా పాకెట్ డైరీలో ఏ వెర్షన్ బయోడాటా ఏ కంపెనీకి పంపుతున్నదీ వివరంగా వ్రాసుకుని, బయోడేటాలను పోస్ట్ చేసి, ఇంటికి వచ్చే దారిలో గాస్ ఆఫీసుకెళ్ళి, గాసు బుక్ చేసే వాణ్ణి. అప్పటికి మధ్యాహ్నం పన్నెండయ్యేది.
అట్నుంచీ అటే మెస్సుకెళ్ళి తిండి తిని ( పగలు రూములో నేను తప్ప ఎవరూ ఉండరు…నాకా వంట రాదు ) , అక్కడ ఎవరైనా ఫ్రెండ్సు కనిపిస్తే కాస్సేపు బాతాఖానీ కొట్టి…ఎవరో ఒకరి రూముకు వెళ్ళి సాయంత్రం దాకా పేకాడుకుని, సాయంత్రం ఆల్‌మాస్ కేఫ్ లో టీ త్రాగి, వస్తూ వస్తూ కేబుల్ వాడితో మాట్లాడి, బోసన్న చెప్పిన సరుకులు తీసుకుని అలసిపోయి రూముకు చేరే వాణ్ణి.
అదేమి చిత్రమో గానీ, మళ్ళీ తెల్లారే వరకూ నాకుద్యోగం దొరకలేన్న విషయం అస్సలు గుర్తొచ్చేది కాదు !