సాయంత్రం ఐదున్నరకు ఉక్కబోస్తుంటే ఆవలిస్తూ నిద్ర లేచాను.
రూములో నేను తప్ప మిగిలిన వాళ్ళెవరూ కన్పించలా.
మొహాన కాసిన్ని చన్నీళ్ళు చల్లుకుని, టవల్ కోసం చూస్తే అదీ కనిపించలా. కాస్సేపు బెడ్‌రూంలో వెదికి బోసన్న టవల్‌తో మొహం తుడుచుకుని, షర్ట్ వేసుకుని లుంగీ మీదే బయటకొచ్చా. బయట కూడా ఎవరూ కనిపించలా. కాకపోతే మేడ మీదనుంచి కూనిరాగాలు, పొగ మేఘాలు వస్తున్నై.
ఇంకా గోడ కట్టని మొండి మెట్లు ఎక్కి మేడ మీదకు వెళ్ళా.
బోసన్న కట్ బనీనులో, ఇంకో అంతస్తు కోసమని లేపిన దిమ్మెనానుకుని కూర్చుని, దిగులుగా దిమ్మెలోంచి బయటకొచ్చిన చువ్వల్ని, చువ్వల్లోంచి కనిపించే ఆకాశాన్ని చూస్తూ సిగరెట్ పొగ వొదులుతున్నాడు. వాడికెదురుగా మిగిలిన రూమ్మేట్లిద్దరూ చాప మీద పండుకొని ఏదో మాట్లాడుతున్నారు.
నాకు సీను కాస్త అర్థమైంది. వెళ్ళి చాప మీద కూర్చున్నా!
“అది కాదు బోసన్నా అది కాకపోతే దాని అమ్మ లాంటిది మరొకటి. నువ్వు మరీ ఇలా వర్రీ అయిపోయి సిగరెట్లు కాల్చి పొగచూరి పోతే ఎలా?!”అంటున్నాడు సుబ్బారావ్.
“అదే మరి…మేము లేమా నీకు…రేపెళ్ళి దాని అమ్మమ్మ లాంటి దానికి లైనెయ్యి. అంతేకానీ ఇలా దిగులుగా కూర్చుని ఉన్న సిగరెట్లన్నీ వూదేస్తే ఎట్లా… నీకు తెలుసో తెలియదో…సిగరెట్లకంటే మందు ఆరోగ్యానికి బెటర్” రాంబాబు.
“అమ్మ … అమ్మామ్మా?! ఏజ్ ఎక్కువవుతుందేమో” అని నేనంటే “నీ కుళ్ళు జోకులకిది టైము కాదు”అని కసిరాడు రాంబాబు.
నెక్స్ట్ సీను కూడా అర్థమైంది నాకు! ఇంకేముంది అందరం బోసుగాడితో సాధ్యమైనంత సానుభూతిగా మాట్లాడుతూ వాడి దగ్గర ఎంత డబ్బుందో కనుక్కుని, ఎక్కువ వుంటే బారుకు…లేక పోతే మందుల షాపు పక్కనున్న రాయల్ వైన్స్ షాపుకెళ్ళి మందు, ఆ పక్కనే బండిమీద మిరపకాయ బజ్జీలు ఒకడు తెస్తే, ఇంకొకడు బండి మీద వెళ్ళి హోటల్ నుంచి బిర్యానీ పార్సిల్లు తేవడం. ఏడున్నర ఎనిమిది కల్లా రెడీ అయిపోయి సిట్టింగ్ వెయ్యడం.
బోసు మొహంలో ఎలాంటి రియాక్షనూ లేదు. చివరిదాకా కాలిన సిగరెట్‌తో మరో సిగరెట్ వెలిగించుకుని మళ్ళీ చువ్వల వైపు చూస్తా కూర్చున్నాడు.
మాట వరసకైనా ఏమీ మాట్లాడకపోతే బాగోదని “ఏమయింది బోసన్నా?” అనడిగా అమాయకంగా.
ఈ సెటప్పు, డైలాగులు వింటున్నా అర్థం కావడంలేదా…అన్నట్టు తీక్షణంగా చూసి, “ఇలా కాదు బోసన్నా. పద బారుకు పోదాం”అన్నాడు సుబ్బారావ్.
“బారుకు పోదాం…పారును చూదాం ఛలో ఛలో…”అని కూనిరాగంతీసి, “అవును మందు కొడితే తప్ప మంచి ఆలోచనలు రావు”వంత పాడాడు రాంబాబు.
“అయితే నే రెడీకానా…”అడిగాను ఉత్సాహంగా. బారులో మందు కంటే, లివర్ ఫ్రై, గ్రీన్ పీస్ మసాలా అంటే నాకు మహా ఇష్టం. ఉద్యోగం సద్యోగం లేకుండా బారుకెళ్ళి అవి తినడం పడదు కదా. అంచేత ఇలా ఎప్పుడైనా చాన్స్ దొరికితే వొదులుతానా?!
అందరూ నావైపొకసారి చీదరలుక్కొకటిచ్చారు. “ఇకలేరా బోసూ…మళ్ళీ టైము సరిపోదు”అన్నాడు రాంబాబు.
పొగ వొదులుతూ గూడ్స్ రైలు బండిలా కదిలాడు బోసు జారి పోతున్న నా టవల్‌ను ఒక చేత్తో సర్దుకుంటూ.
సిగరెట్ పేకెట్‌తో చేసిన యాష్ ట్రేని సుబ్బారావు, చాపనేమో రాంబాబుగాడు తెస్తూంటే ఆ ప్రక్కనే పడున్న అగ్గి పెట్టెను తీసుకుని నేనూ రూములోకొచ్చా.
అందరం గబగబా రెడీ అయిపోయి, బోసన్నను రెడీ చేస్తూ వాడి పర్సులో వున్న నాలుగొందలూ జాగ్రత్తగా తీసి రాంబాబుకిచ్చి బయల్దేరాం. మిగతా వాళ్ళం చిల్లర తప్ప నోట్లు తీసుకెళ్ళ లేదని వేరే చెప్పాలా?
దారి పొడుగునా ప్రేమ పవిత్రత గురించి, ప్రేమికుల విశాల హృదయాల గురించి…ఏది ఏమైనా చివరలో గెలిచే ప్రేమ గురించి మాట్లాడుకుంటూ బారు కొచ్చాం.
మందు మొదటి చుక్క నాలుకను తాకగానే బోసు లవ్వు చేసిన అమ్మాయి వగలాడి తనం(అమ్మ తోడు ఆ అమ్మాయిని బోసన్న తప్ప మేమెన్నడూ చూసి ఎరగం. ఆ అమ్మాయి పేరు మాకే కాదు…బోసన్నకు కూడా తెలియదు)గురించి, ఖతర్‌నాక్ తనం గురించి,స్వార్ధపూరితమైన ఆమె ప్రేమ గురించి మాట్లాడ్డం మొదలెట్టాం.
ఎంత స్వార్ధం లేక పోతే…నాలుగు రోజులుగా బస్ స్టాప్‌లో పొద్దుటా సాయంత్రం ఆమె కోసమే కాసుక్కూర్చుంటున్న బోసన్నను పట్టించుకోకుండా మరెవడి బైకు మీదో ఎక్కుతుందా?! ఇలా బోసన్న ప్రేమించిన అమ్మాయిలంతా బోసన్నకు దూరమవుతుంటే ఎలా?!
రెండో రౌండ్ మొదలయ్యాక, “నా ప్రేమే నిజమైతే ఈ రోజు ఫుల్లు బాటిలు లేపుతా”అని బోసనడం, “నేను రెండు ఫుల్లులు లేపుతా ఒంటి చేత్తో”అంటూ రాంబాబు, బారు కౌంటర్ వైపు పరిగెత్త బోవడం, నేనూ సుబ్బారావ్ ఇద్దరినీ సముదాయించి కూర్చో బెట్టడం…
మూడో రౌండ్ మధ్యలో, వున్నట్టుండి రాంబాబు తన ప్రేమ కథ చెప్పడం మొదలెట్టాడు.
అది చూసి సుబ్బారావు “1972 లవ్ స్టోరీ” అంటూ నోటితో మ్యూజిక్ మొదలెట్టాడు! నేను కూడా ఏదో కథ చెప్పబోయినట్లు గుర్తు.
బోసన్న నిర్లిప్తంగా గాల్లోకి చూస్తా, మధ్య మధ్యలో “నా ప్రేమే నిజమైతే పది సిగరెట్టులు ఒక్కసారే కాలుస్తా. నా ప్రేమే నిజమైతే…”అంటూ దండకం మొదలెట్టాడు.
మూడో రౌండు తర్వాత ఏమైందో నాకైతే తెలియదు.
మర్నాడు నాకిప్పటికీ డౌటే మర్నాడా…ఆ మర్నాడా అన్నది లేచే సరికి తల దిమ్ముగా వుంది.
అప్పటికే బోసన్న లేచి నా పర్సులో డబ్బులేమైనాయని చిందులు వేస్తున్నాడు.
సుబ్బారావ్, రాంబాబు చెరో మూల గోడను కరుచుకుని పడి నిద్ర పోతున్నారు.