భావప్రకటనా స్వాతంత్య్రం

ప్రతి కథకీ ఒక నీతి ఉంటుంది; నువ్వు ఆ నీతిని పట్టుకోవాలేగానీ   Lewis Carroll, Alice in Woderland

మాట్లాడే స్వాతంత్య్రం, ( Free Speech ), రాసి అచ్చేసుకునే స్వాతంత్య్రం, పదిమందీ గుమిగూడే స్వాతంత్య్రం,  ఉపన్యాసాలిచ్చే స్వాతంత్య్రం,  ఇవన్నీ సామూహికంగా భావ ప్రకటనా స్వాతంత్య్రం అన్న మకుటం కిందకి వస్తాయి.

భావ ప్రకటనా స్వాతంత్య్రం గురించి మాట్లాడలంటే (రాయాలంటే),  నాందిగా అమెరికా రాజ్యాంగం మొదటి సవరణ,  భారత రాజ్యాగంలో 19(1), 51 ఆ  పేరాలు ప్రస్తావించక తప్పదు. (నాందీ ప్రస్తావనా రెండూ వచ్చేశాయి; భావప్రకటనా స్వాతంత్య్రం నాటకానికి!)

ముందుగా అమెరికా రాజ్యాంగం మొదటి సవరణ.  Congress shall make no law respecting an establishment of  religion, or prohibiting the free exercise thereof; or abridging the freedom of speech, or of the press; or the right of the people peaceably to assemble, and to petition the government for a redress of grievances.

భారత రాజ్యాంగం తత్తుల్యంగా ఏమంటున్నదో  చూద్దాం.

Fundamental Rights, Article 19 (1) : All citizens shall have the right – a) to freedom of speech and expression, b) to assemble peaceably and without arms, c) to from associations or unions, d) to move freely throughout the territory of India, e) to reside and settle in any part of India, g) to practice any profession or to carry on any occupation, trade or business.  అంతే కాదు. హక్కులతో పాటు బాధ్యతలు కూడా రాజ్యాంగంలో భాగంగా చెప్పారు, అవి

51A.  Fundamental Duties.- It shall be the duty of every citizens of India- (a) to abide by the Constitution and respect its ideals and institutions, the National Flag and the National Anthem; (b) to cherish and follow the noble ideals which inspired our national struggle for freedom; (c) to uphold and protect the sovereignty, unity and integrity of India; (d) to defend the country and render national service when called upon to do so; (e) to promote harmony and the spirit of common brotherhood amongst all the people of India transcending religious, linguistic and regional or sectional diversities; to renounce practices derogatory to the dignity of women; (f) to value and preserve the rich heritage of our composite culture; (g) to protect and improve the natural environment including forests, lakes, rivers and wild life, and to have compassion for living creatures; (h) to develop the scientific temper, humanism and the spirit of inquiry and reform; (i) to safeguard public property and to abjure violence; (j) to strive towards excellence in all spheres of individual and collective activity so that the nation constantly rises to higher levels of endeavour and achievement.   (కావాలనే ఈ పై రెండు పేరాలూ తెలుగులో చెప్పలేదు.)

చూడండి, అమెరికా వాడి రాజ్యాంగం “కట్టె, కొట్టె, తెచ్చె,” అన్నట్టు  సింపుల్‌ గా ఉన్నదికదూ.   ఇంత సింపుల్‌ గా ఉండ బట్టే కాబోలు, బోలెడు సార్లు ఈ మొదటిసవరణ కి కోర్టుల్లో వ్యాఖ్యానాలు, వివరణలూ, ఇవ్వాలసి వచ్చింది.  మన జనాభా అమెరికామీద సుమారు నాలుగు రెట్లు కాబట్టి కాబోలు, మన రాజ్యాంగం వివరణ కూడా అన్ని రెట్లే వున్నట్టున్నది. అమెరికా  రాజ్యాంగం పరంగా కొన్ని కథలు, నిజంగా జరిగిన  కథలు చెప్పుకుందాం.  జోడుగా కొన్ని మనకథలూనూ! ఈ కథల్లో నీతులు, మంచీచెడ్డల గురించి తాడొపేడో తేల్చుకోవాల్సిన బాధ్యత మీది.  శ్రీశ్రీ గారు అన్నారుదారుల మధ్య రాటబల్ల మీ ఊరు ఎటువుందో చూపిస్తుంది కానీ తానే ఆ వూరు వెళ్ళదూ అని.

బాగా పాత కథ. 1884 లో, కాంకార్డ్‌ మాసుచెస్సెట్స్‌ గ్రంధాలయం, మార్క్‌ ట్వేన్‌ పుస్తకం  Huckleberry Finn , సెన్‌సారు చేసింది. కారణం, ‘ఈ పుస్తకంలో భాష “బజారీ” ( slang ) భాష. మనపిల్లలు ఇటువంటి భాష నేర్చుకోకూడదు, చదవకూడదు, రాయకూడదు.’  అందుకని ఈ పుస్తకాన్ని బహిష్కరించారు.   మార్క్‌ ట్వేన్‌  ఆ విషయం వినంగానే చెప్పేశాడు, ఈ లైబ్రరీ ధర్మమా అని, తన పుస్తకం కనీసం 25,000 కాపీలన్నా అమ్ముడు పోతుందని. మీకు తెలుసో తెలియదో, రెండునెలల్లో, 50,000 వేల కాపీలు అమ్ముడు పోయాయిట. ఆ రోజుల్లో అన్ని కాపీలు అమ్ముడు పోవడం రికార్డే!

మార్క్‌ ట్వేన్‌  మరోసారి ఎక్కడో అన్నాడు It is by the goodness of God that in our country we have those three unspeakably precious things: freedom of speech, freedom of conscience, and the prudence never to practice either of them.   పైకి చలోక్తిగా కనిపించినా, ఆయనగారు చెప్పింది కొంచెం లోతుగా పరిశీలించాల్సిన విషయమే.  అంతకన్నా ముందు బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌ ఎలక్ట్రిక్కు షాక్కొట్టినట్టు చెప్పాడు, “Abuses of the freedom of speech ought to be repressed; but whom are we to commit the power of doing it?”

ఇక మన తెలుగుదేశం కథ. గత శతాబ్దంలో యాభయ్యో దశాబ్దంలో ఎప్పుడో ఖచ్చితంగా ఏ సంవత్సరమో గుర్తులేదు గానీ, అప్పట్లో  ఆంధ్రదేశం లో కమ్మ్యూనిష్టులని జైల్లో వేశారు, మూక ఉమ్మడిగా. మనదేశంలో చెప్పా చెయ్యకండా జైల్లో పెట్టడానికి పెద్ద కారణాలు అక్కరలేదు కాబోలు!  ఆ రోజుల్లో  జైల్లో ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య గారు  ఆంధ్ర ప్రభ సంపాదకులు నార్లవెంకటేశ్వర రావు గారికి  ఓ ఉత్తరం రాశారు. దాని సారాంశం ఇది. జైలులో కి విడుదలచేసే ప్రభ, నానా కత్తిరింపులతో (అంటే censor  చెయ్యబడి) వస్తూన్నదేమిటీ అని.  నార్ల వెంకటేశ్వర రావు చాలా ధైర్యం ఉన్న సంపాదకులు. ఆయనకి, తన పత్రికని ప్రభుత్వం కత్తిరించడం సుతరాము ఇష్టంలేదు. అందుకు నిరసనగా, వెంకటేశ్వర రావుగారు, ఒక రోజు పత్రిక మొదటి పేజీ నిండా తారుపూసి విడుదల చేశారు. దాంతో, ప్రభుత్వం సెన్‌ సారు చెయ్యడం మానుకున్నది. అటువంటి పట్టుదల, ఆ ధైర్యం ఉన్న సంపాదకులు ఇప్పుడు కొరవేనని ఒప్పుకోక తప్పదు. గట్టిగా సంపాదకీయం రాస్తే ఉద్యోగం తీసేసే రోజులు ఇవి. అసలు, ఇప్పుడు వార్తాపత్రికలు, సంపాదకులు లేకుండానే నడుస్తాయికదా!  శ్రీశ్రీ గారన్నారు,

సంపాదకుడంటే నా
కింపారెడు భక్తి కలదు ఎంచేతనగా
సంపూర్ణ మనుజుడాతడు
చింపాంజీకన్న నయము సిరిసిరి మువ్వా,
అని.

సంపాదకులు లేకపోతే సరే సరి, కనీసం చింపాంజీలన్నా లేవు ఇప్పుడు.

నార్లవారిని గురించి చెప్పిన కథ  సంపాదకుల బాధ్యతకి ఒక చిన్ని ఉదాహరణ! థామస్‌ జఫర్సన్‌ మహాశయుడు అన్నాడు, / When the press is free, and everyman able to read all is safe  . ఇక్కడ మనం జాగర్తగా గమనించవలసిన విషయం, every man able to read  అన్న ఐదు మాటలూనూ!

1960 ల్లో వియత్నాం యుద్ధం. “బిలియన్లకి బిలియన్లు తగలెడుతున్నాం, మనం దక్షిణ వియత్నాం ని ఎందుకు సురక్షితంగా ఉంచలేకపోతున్నాం? దీని అంతు తేల్చుకోండని,”  లిండన్‌ జాన్‌ సన్‌ గారు ఒక రహస్య విచారణ సంఘాన్ని పురమాయించాడు. ఈ సంఘం 1968 లో ఏడువేలపేజీల రిపోర్టు తయారుచేసి, నిక్సన్‌ మహాశయుడికి ఇచ్చారు. ఈ ఉద్గ్రంధాన్నే Pentagon Papers  అంటారు. ఈ రిపోర్టు అప్పటి ప్రభుత్వాన్ని దులిపేసింది. ముఖ్యంగా మిలటరీకీ బాగా వ్యతిరేకంగా ఉన్నది. ప్రభుత్వం ప్రజల కళ్ళల్లో బూడిదపోసి, ఈ రహస్యాలు రహస్యాలుగా ఉంచడం ప్రజాస్వామ్యానికి తీరని అవమానమని, ప్రభుత్వం ప్రజలని మోసం చేస్తున్నదని నమ్మి, ఆ రిపోర్టుకి పని చేసిన Daniel Ellsberg  ఈ మొత్తం రిపోర్టు New York Times  దినపత్రికకి 1971 లో రహస్యంగా అందించాడు. వాళ్ళు దీన్ని సీరియల్‌ నవలలా అచ్చెయ్యడం మొదలెట్టారు. నానా రభసా అయ్యింది. New York Times   కి నయాన చెప్పలేక, భయాన్నైనా మానిపిద్దామని ప్రభుత్వం ప్రయత్నించింది. చివరకి, సుప్రీం కోర్టుకెళ్ళింది ఈ కేసు. ఇది అప్పట్లో అమెరికాలో Freedom of Expression  పేరుతో పెద్ద కోర్టుకొచ్చిన పెద్ద కేసు.  వినండి, ప్రభుత్వానికి పెద్ద చెంపపెట్టుగా హ్యూగో బ్లాక్‌ అనే జడ్జీ గారు  ఏమని రాశారో! “A free press has the duty to prevent any part of the government from deceiving the people and sending them to distant lands to die…”   ఒక ప్రశ్న అడగాలి మనం. “దేశ స్వాతంత్య్ర రక్షణ,” ని అడ్డుపెట్టుకొని,  ప్రజల భావప్రకటనా స్వాతంత్య్రానికి ప్రభుత్వం అడ్డుపడటం న్యాయమేనా?    ఇదీ మనం ఆలోచించ వలసిన ప్రశ్న. ముప్ఫై ఏళ్ళ తరువాత, నిరుడు  డేనియల్‌ ఎల్స్బర్గ్‌ సీక్రెట్స్‌ అని వియత్నాం యుద్ధం గురించి ఒక పుస్తకం విడుదల చేశాడు. వియత్నాం యుద్ధ విరమణకి పెంటగన్‌ పేపర్లు బయటపడడం ముఖ్యకారణమో కాదో  అన్న విషయం వివాదాంశమే.  న్యూయర్క్‌ టైమ్స్‌ లాంటి పత్రిక, ఆ పత్రికా సంపాదకులకున్న నైతిక విలువలూ, ముఖ్యంగా ధైర్యం, బాధ్యతా నిర్వహణా నిజంగా చెప్పుకో దగ్గవేనని ఒప్పుకోక తప్పదు.

ఒక అమెరికన్‌ టెలివిజన్‌  షో కథ.  1989 జనవరి లో కాబోలు, శ్రీమతి రకోల్టా  ‘Married with Children’  అనే టీ వీ షో పిల్లతో కూర్చోని మరీ చూస్తూన్నది. మరి, ఆ షో, primetime  షో కదా!  అంటే రాత్రి పది లోగా ప్రసారమయ్యే షో.  బహుశా మీలో చాలామంది  చూసే ఉంటారు. అది బాగా వెకిలిగా, soft porn  కి దగ్గిరగా వున్నదని ఆవిడ భావించింది. తరువాత తను ఒక్కత్తే, 18 షోలు చూసింది. ఇది గ్యారంటీ గా soft porn  అన్న దృఢనిశ్చయానికొచ్చి, ముందుగా, ఆ టివీ  చానల్‌ వాళ్ళకి ఉత్తరం రాసింది. వాళ్ళు ఆ ఉత్తరాన్ని చెత్త బుట్టలో పారేసి ఊరుకున్నారు, సమాధానం ఏమీ రాయకండా.   ఆవిడగారు ఉత్తరంతో ఊరుకోలేదు. ఓ చిన్న గ్రూప్‌ తయారుచేసి, ఆ గ్రూప్‌ తరఫున, ఆ షోకి, ఆ టెలివిజన్‌ కంపెనీకీ ప్రకటనలిచ్చి పోషిస్తున్న 45 కంపెనీలకి  ఉత్తరాలు రాసింది. వాళ్ళు ఆ షో  “పరిశుభ్రం” ( clean up ) చెయ్యకపోతే ప్రకటనలు ఇవ్వడం మానేస్తామని బెదిరించారు.  కోతి పుండు బ్రహ్మరాక్షసయ్యింది. మొత్తానికి, రకోల్టా ఒక చిన్న విజయం సాధించిదనే చెప్పాలి, కానీ, ఆవిడ ఆ షోకిచ్చిన పబ్లిసిటీ ధర్మమా అని  Married with children  చాలా పాప్యులర్‌ షో అయి కూచుంది. ఫాక్స్‌ టీ. వీ. కంపెనీ  “ఎడిటర్లు” ముందుగానే జాగర్త పడితే, ఈ షో బహుశా బుల్లి తెరకెక్కేదే కాదేమో!  Moral: Sometimes your conscientious objections drum up undue publicity. May be, it would have been wiser to let it go alone. Is it ?  మీరే చెప్పండి.

మరో అమెరికా కథ. ఈ సారి పాటల ఆల్బమ్‌ కథ. 1990 లో 2 Live Crew  అనే Rap Group  ఒక ఆల్బమ్‌  చేసారు. దాని పేరు As Nasty As They Wannabe  అని. మీలో ఎంతమంది rap music  వినడానికి ప్రయత్నించారో నాకు తెలియదు. ఆ పాటల్లో మాటలు అంటే lyrics  వినడానికి చాలా ఓపిక కావాలి. అవి అర్థం  చేసుకోవడానికి అంతకన్నా ఎక్కువ ఓపిక కావాలి. ఏమయితేనేం! అసలు విషయం, ఆ లిరిక్స్‌  నిండా, బూతులు,  స్త్రీలపై దౌర్జన్యాన్ని ప్రోత్సహించడం, మొదలైనవి చాలా వున్నాయి. ఇది ఆరోపణేకాదు, నిజం కూడాను. ఆ రికార్డు అమ్మకూడదని, దాన్ని నిషేధించాలనీ, కోర్టు కెళ్ళారు, ఫ్లారిడాలో. అక్కడి జడ్జీ గారు, ఈ ఆల్బం అమ్మితే 5,000 డాలర్ల జరిమానా, పబ్లిగ్గా పాడితే వెయ్యి డాలర్లు జరిమానా అని “తీర్పు” చెప్పారు. ఆ తీర్పు కి సుప్రీం కోర్టు వారు ఇదివరలో obscenity  అంటే బండబూతుకి ఇచ్చిన మూడు నిర్వచనాలూ ఆధారం.  Fort Lauderdale  జడ్జీ గారు ఇలా రాశారు

” ఈ ఆల్బం లో కళపరంగాగాని, రాజకీయంగా కాని, కనీసం విజ్ఞాన పరంగా కానీ చెప్పుకోడానికి ఏమీ లేదు. ఈ ఆల్బం ప్రజలకి అసహ్యం కలిగిస్తున్నది. అంతేకాదు. పాటల్లో మాటలు ప్రజల లైంగిక ప్రవృత్తిని నీచంగా ప్రోత్సహిస్తున్నాయి, ” అని.   మామూలేగా! పై కోర్టుకెళ్ళాడు ఆ ఆల్బంలు  అమ్మిన పెద్దమనిషి ఒకాయన.  పై కోర్టులో, జ్యూరీ ఫ్లారిడా చిన్న జడ్జీ గారి తీర్పుని కొట్టేసింది. ఈ హడావిడిలో, ఆ ఆల్బం రెండు మిలియనులు చేసుకుంది, గుట్టుచప్పుడు కాకుండా! ఇక్కడ మనం అడగవలసిన ప్రశ్న   Does the free speech guarantee  freedom to advocate hate, threats to harass, and freedom to publish offensive material to a part of the community, be it majority or a minority?  అమెరికనులు, భారతీయులూ, అందరూ ఆలోచించవలసిన ప్రశ్నే ఇదీనూ!

ఈ మధ్యే, జెర్రీ ఫాల్వెల్‌ అనే ఒక రివరెండు గారు  ఉవాచ ” I think Mohammad was a terrorist”  అని.  ఇది ఒక బిలియను పైచిలుకు ప్రపంచ ప్రజలు ఏకగ్రీవంగా నమ్మిన ఒక ప్రాఫెట్‌ మీద వేసిన అభాండం. ఇది అచ్చు వెయ్యచ్చా? టీ.వీ. లో చెప్పచ్చా? దీనివలన కమ్యూనిటీ లో అనవసరమైన స్ఫర్థలు వైషమ్యాలూ ఇంకా ఎక్కువవుతాయా అని ఆలోచించవలసిన బాధ్యత సంపాదకులది. ఈ వార్త వచ్చిన వెంటనే భారతదేశంలో  ఐదుగురు అనవసరంగా హత్య చెయ్యబడ్డారు గూడాను. ఈ విషయంలో, సంపాదకులు, టీ.వీ. అధినేతలూ బురదలో కాలువేశారని ఖచ్చితంగా చెప్పవచ్చేమో, ఆలోచించండి. ఈ ఫాల్వెల్‌ , రాబర్స్టన్‌ , బ్యుఖానన్‌  లాంటి వాళ్ళతో వేగడం ఎలాగ? వీళ్ళకి మన లాక్షణికులు చెప్పిన “కవిసమయం” బొత్తిగా తెలీదు గాబోలు.

అమీరి బరాకా,  ఉరఫ్‌  లీ రాయ్‌ జో న్స్‌ , న్యూజెర్సీ రాష్ట్ర ఆస్థానకవి. ఆయన,  ఈ మధ్య చదివిన కవిత, Somebody Blew up America   గురించి మీరు వినేవుంటారు. ఆయన పద్యం నిండా రాజకీయపు అరుపులు తప్ప కవిత్వం సున్నా. ఆ పద్యంలో, అమీరి బరాకా అంటాడు, సెప్టెంబర్‌ 11, 2001 న, లాడెన్‌ అనూయాయులు పడగొట్టిన రెండు భవంతుల్లో పనిచేసే నాలుగువేలమంది న్యూయర్క్‌ యూదులు ఆ రోజున పనికి వెళ్ళలేదు. వీళ్ళకి ఈ దురాగతం జరుగుతుందని ముందుగానే తెలుసును అని ఆయనగారి ఆరోపణ. దీనిలో నిజానిజాలు గురించి చర్చకి ఇది వేదిక కాదు.  అమెరికా అధ్యక్షుడిని impeach  చేసి వాడిని పదవినుంచి దింపెయ్యడానికి అమెరికా రాజ్యాంగంలో అవకాశం ఉన్నది కానీ, ఒక సారి ఆస్థాన కవి అని అందలం ఎక్కించిన తరువాత ఆ కవిగారిని దింపడానికి వీలులేదు.  అందుకే కాబోలు, న్యూయార్క్‌ టైమ్స్‌ రాస్తుంది అతగాడు రాసింది offensive  అన్న పేరుతో అతగాడిని తన పదవికి రాజీనామా చెయ్యమని అడగటం, అల్లరిచెయ్యడం  కూడా offensive  యే, అని.   న్యూయార్క్‌ టైమ్స్‌  తర్కం చూస్తే నాకు, జార్జ్‌ ఆర్వెల్‌ అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి.  ఆయన అంటాడు If thought corrupts language, language can also corrupt thought  అని.  నిజమే కాబోలు.

ఇల్లాటి కథలు చాలా ఉన్నాయి. 1990 లో, మడోనా చేసిన విడియో, Justify My Love  యెం.టీ.వీ. చూపించలేదు. దానిని గురించి న్యూయార్క్‌ టైమ్స్‌ కూడా రాసింది. Night Line  విడియోలో కాస్తముక్క  చూపించింది, బోలెడు చర్చించింది. దానితో, ఆ విడియో మిలియను కాపీలు అమ్ముడు పోయాయి.

కల్పనల పేరుతో, కథలు అని దండోరా వేస్తూవచ్చిన  రచనలు ఈ మధ్య కాలంలోనే, మన తెలుగునాట వచ్చాయి; ఇక్కడా మన తెలుగు కమ్యూనిటీ పత్రికల్లోనూ అచ్చయ్యాయి. వాటిగురించి కొద్దిగా చెప్పడం అవసరం.  రావణ జోస్యం అని ఒక కథ.  సీతకి రావణాసురుడి మీద “మోహం” లేక ఒక రకమయిన ఆప్యాయత ఉన్నట్టు ఆపాదిస్తూ రాయబడ్డ కథ ఇది. ఈ ఇతివృత్తం ఒక మతాన్ని నమ్మిన వారికి  వాళ్ళ నమ్మికని కించపరచటల్లేదని  ఎవ్వరూ అనలేరు. రచయితకి భావప్రకటనా స్వాతంత్య్రం వున్నదని ఒప్పుకుందాం.  సంపాదకుడికి, భావ ప్రకటనా స్వాతంత్య్ర రక్షణతో పాటు, సాంఘిక బాధ్యత రచయితకన్నా ఎక్కువగా వుండాలి. అసహ్యం పుట్టించి, అసహనానికి పురికొలిపే రచనలు అచ్చువేసేటప్పుడు, కొద్దిగా జాగ్రత్త అవసరం. పైగా, ఆ రచనని విమర్శిస్తూ వచ్చే రచనలు వెయ్యకుండా తప్పుకోవడం మంచి సంపాదకుని లక్షణం అసలు కాదు.

కొందరు రచయితలు కేవలం irritate  చెయ్యడం కోసం రాస్తారు. ఆ ధోరణిలో వచ్చిన కథే, మరొకటి, రాజయ్య రాకపోయె, అని. ఈ కథలో ముఖ్య “సందేశం” (?)  స్త్రీలని న్యూనతభావంతో చూడటమే కాకుండా, వాళ్ళని చిత్రహింస కూడా పెట్టవచ్చు, అని. కోపం వస్తే, స్త్రీ ముఖంపై acid  పోసి, deface  కూడా చెయ్యచ్చు.  ఈ రచయితకి ఈ పద్ధతిలో రాయడం పుర్రెతోపుట్టిన బుద్ధిట! ఈ కథ కేవలం irritate  చెయ్యడానికే రాసినట్టు తెలిసిపోతుంది, కథ చదవంగానే! ఈ రకమైన రచనలు చూసిన తరువాత మనం అడగవల్సిన ముఖ్యమైన ప్రశ్న భావ ప్రకటనా స్వాతంత్య్రానికి హద్దులున్నాయా లేవా? ఇది చాలా మౌలిక మైన ప్రశ్న.

ఇంకోరకమైన కథ. ఇది  కేవలం  అమాయకత్వం వల్ల రాసిన కథ. ఈ కథ అమెరికాలోనే అచ్చయ్యింది. ఈ కథ  అమెరికా తెలుగు వాళ్ళు సత్యనారాయణ వ్రతం చెయ్యడాన్ని మనసులో పెట్టుకొని, రాసింది.  పాపం అమెరికాలో తెలుగు వాళ్ళకి ఈ వ్రత పరమార్థం తెలియ చెప్పడం రచయిత్రి ముఖ్యోద్దేశం. కథ చదవంగానే, పాపం, ఈ రచయిత్రికి అమెరికా తెలుగు వాళ్ళగురించి ఏమీ తెలియదు. అంతేకాదు.  ఆర్థిక శాస్త్రంలో, ఓ నా మా లు, అంటే Economics 101  కూడా తెలియదు అని మనకి తెలుస్తుంది. ఈకథలో ముఖ్య పాత్రలు, సత్యనారాయణ వ్రతం పేరుతో మోసాలు చేసి లక్షలు  లక్షలు గణించడమే వృత్తిగా పెట్టుకున్న పూజారి,  అది ససేమిరా నచ్చని, చదువుకున్న అతని భార్య. కథ పొడుగూతా తట్టెడు flashback లు. చివరకి తెలుగు సినిమా ధోరణిలో ఆమెగారి పెద్ద నీతి  ఉపన్యాసంతో కథ ముగుస్తుంది. ఈ మధ్యకాలంలో అమెరికాలో తెలుగువాళ్ళ తెలివితక్కువతనం గురించి చాలా కథలు, వ్యాసాలు తెలుగునాట పత్రికల్లోకూడా బరికి పారేస్తున్నారు. ఎక్కడో తిరుపల్లెలోనో, తిప్పనగుంటలోనో వుంటూ, బయటి ప్రపంచం చూడక, దాన్నిగురించి ఏమీ చదవక నానాగందరగోళంగా రాయడం. పోనీలే పాపం, అని విమర్శ చెయ్యకండా వదిలితే, ‘గుమ్మడికాయల నాడే ఎందుకు చెప్పలేదూ’ అన్న ప్రశ్న తప్పకండా వస్తుంది.

పత్రికలకి వార్తలు రాసే విలేఖకులకి ఈ దేశంలో పత్రికా విలేఖకుల నైతిక ప్రవర్తనని సూచించే  First Amendment Hand Book  అనే పుస్తకం, వున్నది. అయితే, దానిని ఎంతమంది పాటిస్తున్నారా అన్నది వేరే ప్రశ్న. మనకి భారతంలో అటువంటి code  వున్నదో లేదో నాకు తెలియదు. చూడగా చూడగా, వార్తాపత్రికల మకుటం “If it bleeds, it leads”  అన్నట్టే కనపడుతూన్నది. ఏ విధమైన పరిశోధన చెయ్యకండా, చేతికొచ్చినట్టు రాయడం బాగా పరిపాటి అయ్యింది.

తెలుగునాట భారీగా అమ్ముకునే దినపత్రిక 1999 లో కాబోలు, నాకు బాగా తెలిసిన ఒక స్వచ్ఛంద సంస్థ  గురించి పచ్చి అబద్ధాలు, ఒకరోజు కాదు, చర్వితచర్వణంగా పదే పదే రాసింది. ఆ సంస్థ ఇచ్చిన సమాధానం చెత్తబుట్టలో పారేసారు. చివరకి, ఆ సంస్థ ప్రాంతంలో ఉన్న ప్రజలు మీ పత్రికని తగలేస్తాం అని కూడా బెదిరించారు. ఈ సంస్థ కార్యదర్శి, చివరకి, మరో పత్రికలో పూర్తి పేజీ ప్రకటన గా, తమ సమాధానం ఇవ్వవలసిన స్థితి వచ్చింది. ఆర్థికంగా మదించిన తెలుగు పత్రికాధిపతుల పత్రికలో వేసిన అభాండాలని, ఖండించడానికి కూడా వెనుకాడాయి, మిగిలిన చిన్న సైజు దిన పత్రికలు. ఇది నాకు స్వయంగా అనుభవమున్న విషయం.

అందుకే కాబోలు John Merrill  అనే పత్రికా రచయిత, గ్రంధకర్త  తన పుస్తకం Freedom, Ethics and Press: Toward a Dialectical Journalism   లో  రాస్తాడు “Press Power must be limited because journalists are unethical. They go to excesses under the First Amendment Rights. Ethical journalism is an oxymoron. ”

ఇన్ని కథలు ఎందుకు చెప్పానంటే, అసలు   Free Speech ,  వాక్‌ స్వాతంత్య్రాం మీద నాకు నిజంగా కొన్ని అనుమానాలున్నాయి. నిష్పక్షపాతంగా చెప్పాలంటే, censor  చెయ్యడానికి బదులు చర్చించి censure  చెయ్యడం మంచిదేమో.  జోసెఫ్‌ జోర్బే (17541824), అన్నాడు, It is better to debate a question without settling it than to settle a question without debating it.  అందుకని ఇన్నికథలు చెప్పాను.

ఇప్పుడు నా అనుమానాలు చెప్పుతా.  మాటలు ( speech ) స్వతంత్రం  ( free ) కావు.  మాటలు అంటే, అర్థం లేని రణగొణ ధ్వనులు అని అర్థం చెప్పుకుంటే తప్ప.  మాట్లాడేవాడు ( ఇక్కడ రాసే వాడు కూడా కలుపుకోవాలి), ఏ విధమైన ప్రేరణ ( vision ), ఒక ప్రత్యేక కార్యక్రమం ( agenda ), ఒక ప్రణాళిక,  తన వెనుక లేకండా మాట్లాడడు, రాయడు. అంటే మాటకి ఒక రకమైన బంధనం ఉన్నదన్న మాట. బంధనం  అన్న మాట కఠినంగా వినపడితే, కాస్త మెత్తని మాట, నమ్మకం, గాఢనమ్మకం అని వాడుతాను. తనదైన నమ్మిక మాట వెనుక ఉంటుంది. ఎప్పుడైతే తనదైన నమ్మిక తన మాటకి భూమిక అయిందో, అది మరొకని నమ్మికకు, మరొకని గాఢమైన నమ్మకానికి వ్యతిరేకం అయ్యే అవకాశం ఉన్నది.  అందుచేత పరిణామ రహితం గా మాటలు ఉండవు. నీవు కోరుకున్న పరిణామం నీకు ఎంతో ముఖ్యం. మరొకడికి అది అనవసరం, విరుద్ధం, విషం. ఈ రకంగా చూస్తే అసలు free speech  అనేది free lunch  లాంటిదే కదూ!

ఈ వ్యాసం ఎలా మొదలు పెట్టానో అలాగే ముగించడం మంచిది.

Thomas Jefferson, the defender of free speech has said: “Whose foot is to be the measure to which  ours are all to be cut or stretched?”

( Revised & adapted from a talk given at the Third Telugu Sadassu in Detroit, 2002)