మిత్రులు ఎం.బి.ఎస్.ప్రసాద్ తదితరులు మొదలుపెట్టిన పక్షపత్రిక పేరును టైట్‌ల్‌గా వాడుకున్నందుకు అందరూ క్షమించాలి. శాస్త్రీయ సంగీతం అంటే సామాన్యంగా సీరియస్ వ్యవహారం. అయినా అందులో కూడా కొన్ని జోకులూ, ఛలోక్తులూ ఉంటూనే ఉంటాయి. వాటిలో చిరునవ్వు తెప్పించేవి కొన్నిటిని ఈ వ్యాసంలో పొందుపరుస్తున్నాను.
అభ్యర్థన
1960లో ప్రఖ్యాత సరోద్ విద్వాంసుడు (నేటి సరోద్ నిపుణుడైన అంజద్ అలీ తండ్రి) ఉస్తాద్ హాఫిజ్ అలీఖాన్‌గారికి పద్మభూషణ్ పురస్కారం లభించింది. ఆ సందర్భంలో రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ఆయనతో మాట్లాడుతూ “ప్రభుత్వం తరఫున మేము మీకోసం చెయ్యగలిగినదేమైనా ఉందా?” అని అడిగారట. అందుకా ఉస్తాద్‌గారు “అయ్యా, మీరు దేశానికి అధిపతికదా, నాకైతే ఏమీ అక్కర్లేదు కాని మా దర్బారీకానడ రాగాన్ని కాపాడేందుకేదైనా చట్టాన్ని ప్రవేశపెట్టండి. ప్రతివారూ దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వినిపించి నాశనం చేస్తున్నారు” అన్నాడట అమాయకంగా.
హాఫిజ్ అలీ ఖాన్
ముఖపరిచయం
వీణ విద్వాంసుడు చిట్టిబాబుగారు చెప్పిన విషయం. ఒకరోజు చిట్టిబాబుగారింటి డోర్‌బెల్ మోగింది. తలుపు తెరిచిన చిట్టిబాబుకు ఎవరో అపరిచితవ్యక్తి కనిపించాడు. అతను “చిట్టిబాబుగారి ఇల్లు ఇదేనా?” అని అడిగాడు.
“అవును”
“ఆయన ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నారా?”
“ఆ, ఉన్నారు”
“ఆయన్నొకసారి పిలుస్తారా?”
“నేనే చిట్టిబాబును”
“సార్, నేను గుర్తున్నానా?”
చిట్టిబాబు
కోయలకు తుపాకీగుండు
చిట్టిబాబు వాయించిన మొదటి లాంగ్‌ప్లే రికార్డులో చివరిది కొమ్మలో కోయిలా అనే ఎంకిపాట. మాండ్ రాగంలో తాను స్వరపరచిన ఆ పాట గురించి చెపుతూ చిట్టిబాబు “నా కోయిలను మృదంగం వాయించిన వెల్లూర్ రామభద్రన్ తుపాకీతో కాల్చేశాడయ్యా” అన్నారు. నిజంగానే పాట ముగిసేటప్పుడు వీణ శబ్దం ఆగగానే మృదంగం దెబ్బ తుపాకీ మోతలాగే వినిపిస్తుంది!అదే రికార్డులో ఆడేవు పాడేవు అని సింధుభైరవి రాగంలో ఒక పాట ఉంది. దానికి రచయిత రంగారావు (చిట్టిబాబు తండ్రి) అని ఉంది. అదేం పాట అని అడిగితే, “పాటాలేదు, ఏం లేదు, ఊరికే ట్యూన్ కట్టాను. వీలున్నప్పుడు ఆరుద్రగారి చేత రాయించాలి” అన్నారు చిట్టిబాబు!
ప్రాప్తం, ప్రారబ్ధం
ఎస్.బాలచందర్ వీణ స్టైలు కొందరికి నచ్చదు. అలాంటివారిలో మృదంగ విద్వాంసుడు ఉపేంద్రన్ కూడా ఉన్నారు. ఆయనెప్పుడూ ప్రతిదానికీ ప్రాప్తం, ప్రారబ్ధం అంటూ ఉండేవాడు. ఆయనొకసారి సంగీత కచేరీలకని సోవియట్ రష్యా తదితర దేశాలకు వెళ్ళాడు. అది ఆయన లెక్కన ప్రాప్తం. బాలచందర్‌తో బాటు వెళ్ళవలసిరావడం ప్రారబ్ధం!
ఎస్.బాలచందర్
హ్యూమర్ ఎట్ అయ్యర్ లెవెల్
మైసూర్ వాసుదేవాచార్య సునాదవినోదిని రాగంలో రచించిన దేవాదిదేవ అనే కీర్తన బాలమురళీకృష్ణ ద్వారా బాగా పాప్యులర్ అయింది. మహారాజపురం విశ్వనాథాయ్యర్‌వంటి గొప్ప విద్వాంసులకు కూడా అదంటే ఇష్టం. ఒకసారి అయ్యర్‌గారి ఎదుట ఎవరో కుర్రగాయకుడు ఆ కీర్తన పాడి ఎలా ఉందని అడిగాట్ట. ఆయన తడుముకోకుండా “బాలమురళి పాడినా సునాదమా ఇరుక్కు. నీ పాడినా వినోదమా ఇరుక్కు” అన్నాట్ట. (దీనికి అనువాదం అనవసరం!)
మహారాజపురం విశ్వనాథ అయ్యర్‌విశ్వనాథాయ్యర్‌గారి ఛలోక్తులు ఆ రోజుల్లో ప్రసిద్ధమైనవిగా ఉండేవి. ఆయన ఒక కచేరీలో ఏదో కీర్తన పాడుతూ చరణం మరిచిపోయాడట. ఆయన కుమారుడైన మహారాజపురం సంతానం వెనకనుంచి అందిస్తూ ఉంటే ఆయన అందరికీ వినబడేట్టుగానే ప్రేక్షకులని చూపిస్తూ “నేను పాడకపోయనా వీళ్ళకి తెలియదా ఏమిటి?” అన్నాట్ట. ఇంకొక సందర్భంలో తన శిష్యుడైన సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ కచేరీ గురించి ఎవరినో అడిగితే “ఆయన పాడుతున్నంతసేపూ ఒక చెవి మూసుకునే ఉన్నాడు” అన్నారట. “వినేవాళ్ళకంటే ముందుగా తానే మూసుకున్నాడన్నమాట” అన్నాట్ట అయ్యర్‌గారు.
ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు ఎం.ఎస్.గోపాలకృష్ణన్‌కు మాటిమాటికీ తారస్థాయిలో స్వరాలు పలికించే అలవాటుండేది. అందుకుగాను ఎడమచేతి వేళ్ళు వయొలిన్ బ్రిడ్జికి దగ్గరగా వెళుతూ ఉండేవి. తనకు పక్కవాద్యం వాయిస్తున్నప్పుడు ఈ ధోరణిని గమనించిన విశ్వనాథ అయ్యర్‌గారు “గోపాలా, జాగ్రత్త, బ్రిడ్జిమీది కెళుతున్నావు. పడిపోగలవు” అన్నాట్ట.
ఎం.ఎస్.గోపాలకృష్ణన్
కొన్ని జోకులు విశ్వనాథాయ్యర్‌గారికి తెలియకుండానే పేలేవి. వయసు మళ్ళాక ఆయనకు కదులుతున్న రైలుపెట్టెలో నడవాలంటే భయంగా ఉండేదట. ప్రయాణంలో ఒకరాత్రివేళ ఆయన టాయిలెట్‌కు వెళ్ళవలసి ఉండి శిష్యులను లేపబోతే నిద్రలో ఉండి ఒక్కడూ పలకలేదట. అయ్యర్‌గారు మర్నాడు పొద్దున్నే వాళ్ళమీద విసుక్కున్నాట్ట. “నిద్రమత్తు మొహాల్లారా. రాత్రి ఒంటేలుకు పోవాలిరా అని పిలిస్తే ఒక్కడూ నోరు తెరవడే?”
ప్రియమైన సంగీతం
ప్రసిద్ధ సితార్ విద్వాంసుడు ఉస్తాద్ విలాయత్‌ఖాన్ చెప్పినది. సంగీతప్రియుడైన ఒకానొక నవాబుగారు తన ఇంట్లో రాత్రంతా సంగీత కచేరీలు ఏర్పాటు చేసి అందులో పాల్గొన్న సంగీత విద్వాంసులకు వెళ్ళిపోయే ముందు ఈనాములు ఇచ్చి పంపేవాడట. అలా తన ముందుకు వచ్చిన ఒక వ్యక్తిని నవాబుగారు గుర్తుపట్టలేకపోయాడట. “జీ హుజూర్, తమకు గుర్తులేదేమో, నిన్న సాయంత్రం మొదటగా పాడినది నేనే. ఫలానా రాగం పాడాను” అని చెప్పుకున్నాట్ట ఆ వ్యక్తి. నవాబుగారు ముఖం చిట్లించి “ఆ, ఆ, గుర్తుకొస్తోంది, అబ్బెబ్బే అదేం ఆలాపన? ఆ నిషాదాన్ని అలాగేనా ప్రయోగించేది?” అన్నాట్ట కోపంగా. దానికా గాయకుడు భయపడుతూ “ఏలినవారు నా తప్పు క్షమించాలి. పోనీ ఆ ఒక్క నిషాదానికి కాస్త డబ్బు కోసేసి తక్కిన దిప్పించండి” అన్నాట్ట వినయంగా.
విలాయత్‌ఖాన్
అప్రాచ్యపు వెధవలు
బెనారెస్‌కు చెందిన ప్రఖ్యాత గాయని సిద్ధేశ్వరీదేవికి సనాతన ఆచారాలెక్కువ. వయసుమళ్ళిన తరవాత ఆవిడ మొదటిసారిగా కచేరీలకని ఇంగ్లండ్ వెళ్ళిందట. అక్కడ టాయిలెట్‌లో చెంబూ, నీళ్ళూ లేవంటే ఆవిడకు మొదట్లో అర్థం కాలేదట. ఎవరో ఆవిడకు టాయిలెట్ పేపర్ సంగతి చెపితే శివశివా అని చెవులు మూసుకుందట. కొన్ని శతాబ్దాలపాటు అక్కడివారంతా అలాగే జీవిస్తున్నారన్న సంగతి ఆవిడ జీర్ణించుకోలేకపోయిందట. మర్నాడు కచేరీలో తన ఎదుట వినడానికి కూర్చున్న తెల్లవాళ్ళంతా ఎన్నో ఏళ్ళనుంచీ ఆపనే చేస్తున్నారన్న ఆలోచన ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసి సరిగ్గా పాడలేకపోయిందట !
సిద్ధేశ్వరీదేవి
మాటకు మాట
ఆజానుబాహుడై మంచి విగ్రహపుష్ఠి కలిగిన ఆదిభట్ల నారాయణదాసుగారితో ఒకసారి విజయనగరం మహారాజా పరిహాసంగా “సంగీతవృషభు లెక్కడికో బయలుదేరినట్టున్నారు?” అన్నాడట. “ఇంకెక్కడికి, కామధేనువువంటి తమవద్దకే” అని జవాబిచ్చాడట దాసుగారు.
ఆదిభట్ల నారాయణదాసు
మాటకారి, పాటకారి
ప్రసిద్ధ కర్ణాటక గాయకుడైన చెంబై వైద్యనాథ భాగవతార్‌గారికి తన కచేరీల్లో చిలిపిచేష్టలు చెయ్యడం అలవాటు. ఒకసారి ఆయనకు లాల్గుడి జయరామన్ వయొలిన్, ఉమయాళ్పురం శివరామన్ మృదంగం వాయస్తున్నారట. హుసేని రాగంలో “రామా నిన్నే నిజముగా నమ్మినాను సీతారామా” అని పాడుతూ ఒక్కొక్కసారి వయొలినిస్ట్‌ను చూపుతూ “జయరామా నిన్నే నమ్మినాను” అనీ, మృదంగంకేసి చూపుతూ “శివరామా నిన్నే నమ్మినాను” అనీ పాడారట.
చెంబై వైద్యనాథ భాగవతార్
లాల్గుడి జయరామన్
ఉమయాళ్పురం శివరామన్
ఒక కచేరీలో స్థూలకాయుడైన చెంబై మైక్ను దగ్గరగా జరుపుకుందామంటే వైర్ పొట్టిదయందిట. అది గమనించిన చెంబై “వైర్ సరిగ్గానే ఉంది. నా “వయరే” అంటే బొజ్జ పెద్దది” అన్నాట్ట. మరొక సందర్భంలో హిందూస్తానీ గాయని పర్వీన్ సుల్తానా మద్రాసులో పాడిన కచేరీలో ఉపన్యసిస్తూ చెంబై “నా శారీరం గొప్పదంటారు. ఈమె శారీరం, శరీరం కూడా గొప్పవే” అన్నాట్ట అప్పట్లో ఆకర్షణీయంగా కనబడుతున్న పర్వీన్ను చూపిస్తూ.
పర్వీన్ సుల్తానా
అపశ్రుతులు
బాలమురళీకృష్ణగారికి జోడైన వయొలిన్ విద్వాంసుడు దొరకడం కష్టంగా ఉండేది. ఒక కచేరీలో ఆయన మధ్యమావతి రాగం ఎత్తుకోగానే ఎవరో వయొలిన్ వాయిస్తూ శుద్ధమధ్యమానికి బదులుగా పొరపాటున ప్రతిమధ్యమం వాయించాడట. ఇదేదో తమాషాగా ఉందే అనిపించి మురళిగారు అప్పటికప్పుడు తానుకూడా అలాగే చేసి సమయస్ఫూర్తితో కొత్త రాగాన్ని కొనసాగించాడట. తరవాత ఎవరో వచ్చి ఈ రాగం పేరేమిటి అని అడగగానే తడుముకోకుండా ప్రతిమధ్యమావతి అని జవాబిచ్చాడట. ఈ రాగంలో ఆయన పాడిన భజరే యదునాథం అనే సదాశివబ్రహ్మేంద్ర కీర్తన వినడానికి చాలా బాగుంటుంది.
చైన్నెలో బాలమురళిగారి ఇల్లు మ్యూజిక్ అకాడమీ హాలుకు వెనకాలే ఉంటుంది. అది తెలిసిన సభ నిర్వాహకులు ఇల్లు కట్టుకున్న కొత్తలో ఆయనతో వెటకారంగా “మొత్తం మీద మా వెనకే చేరారే?” అన్నారట. అందుకాయన “చూడ్డానికి మీ హాలు ముందునుంచీ, పక్కలనుంచీకూడా బాగాలేదు. వెనకనించి చూడ్డమే నయమనుకున్నాను” అన్నారట. నిజంగానే ఆ భవనం చూడటానికి బావుండేదికాదు.
బాలమురళీకృష్ణ
అల్లిక జిగిబిగి
బొంబాయిలో నేను హాజరయిన ఒక లెక్చర్ డెమాన్‌స్ట్రేషన్‌లో రవిశంకర్ భారతీయ శాస్త్రీయ సంగీతం గురించి వివరిస్తూ ముందు వరసలో ఏదో అల్లుతూ కూర్చున్న ఒక గొప్పింటి ఆడపడుచును గమనించి ఇలా అన్నాడు. “మిమ్మల్ని కించపరచాలని కాదుగాని తొలిరోజుల్లో నా సితార్ కచేరీల్లో ఇలా నిటింగ్ చేస్తూనో, కబుర్లు చెపుతూనో కూర్చున్నవారు మన సంగీతాన్ని పరోక్షంగా అవమానపరుస్తున్నారనే భావనవల్లే నేను కళ్ళుమూసుకుని వాయించడం అలవాటు చేసుకున్నాను. సంగీతాన్ని భక్తిశ్రద్ధలతో వినాలి”
రవిశంకర్
దుంపతెగా ఏం కంఠం!
ఒకసారి ఉస్తాద్ బడేగులాం అలీఖాన్‌గారిని కలుసుకోవడానికి ఎవరో వెళితే ఆయన రేడియోలో లతా మంగేశ్కర్ పాటను శ్రద్ధగా వింటూ కనిపించాట్ట. వచ్చినాయన అదేమిటని ఆశ్చర్యపోగా “ఏమీ లేదు, చాలాసేపుగా వింటున్నాను. దాని దుంపతెగ, ఒక్క అపస్వరం కూడా పాడదయ్యా” అన్నాట్ట ఉస్తాద్‌గారు.
లతా మంగేశ్కర్
బడేగులాం అలీఖాన్
అలాగే ప్రఖ్యాత గజల్ గాయని బేగం అఖ్తర్‌తో మరొక గాయని రసూలన్‌బాయి ఇలా అన్నదట. “నువ్వెవరినైనా తిడుతున్నప్పుడు కూడా వాళ్ళు నీ గొంతు విని మెచ్చుకుంటారు”
బేగం అఖ్తర్
ధ్వన్యనుకరణ
ప్రముఖ కర్ణాటక గాయకుడు మదురై మణీయ్యర్ మామూలుగా తదరినన్నా మొదలైనవి కాకుండా రకరకాల ధ్వనులు ఉపయోగించేవారు. అందులో దాదాపు అన్ని అచ్చులూ, హల్లులూ పలికేవి. ఒకసారి ఆయన పాడుతూ “టుట్టుట్టు” అని ఉచ్చరించారట. వయొలిన్ పక్కవాద్యం వాయిస్తున్న చౌడయ్యగారు వెంటనే తన కమాను కింద పెట్టేసి వేలితో తీగలు మీటుతూ ఆ ధ్వనిని అనుకరించారట.
మదురై మణి అయ్యర్
మైసూర్ టి. చౌడయ్య
పొట్టకోసం
మా గురువుగారు (సితార్, సుర్‌బహార్ విద్వాంసుడు) ఉస్తాద్ ఇమ్రత్‌ఖాన్‌గారి కొడుకులు నలుగురూ ఉత్తమశ్రేణి సంగీతకారులే. ఒక కచేరీకి ముందుగా గ్రీన్‌రూంలో కూర్చుని ఉన్నప్పుడు ఉస్తాద్‌గారికి తెలిసినాయన వచ్చి పలకరించాడు. అతనికి శాస్త్రీయసంగీతంతో పెద్దగా పరిచయం లేదని మాటలనిబట్టి తెలిసింది. మాటల సందర్భంలో ఉస్తాద్‌గారు తన కొడుకులందరూ సంగీతం ఫీల్డ్‌లోనే ఉన్నారని అన్నాడు. వచ్చినతను కాస్త జాలిగా “అందరూనా?” అన్నాడు. దానికి ఇమ్రత్ ఖాన్ “ఏం చేస్తాం? వాళ్ళకి చదువులూ ఏమంత గొప్పగా అబ్బలేదు. చూడ్డానికి హీరోల్లా ఉంటే సినిమాల్లోనైనా వేషాలొచ్చేవి. అందుకని అందర్నీ సంగీతంలోనే పెట్టవలిసొచ్చింది” అన్నారు. మేము చాటుగా నవ్వుకున్నాంగాని వచ్చినతనికి వ్యంగ్యం అర్థం కాలేదు
తన కొడుకులతో ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్
ముఖ మురళి
ఈల ద్వారా కర్ణాటక, హిందూస్తానీ శాస్త్రీయ సంగీతాన్ని సమర్థవంతంగా వినిపించగల ప్రముఖ కళాకారుడు శివప్రసాద్ రేడియోలో ప్రోగ్రాం ఇస్తానంటే అక్కడి అధికారులు “ముందు మీ సంగీతం గాత్రమో, వాయిద్యమో చెప్పండి. మూడోదానికి మేము అవకాశం ఇవ్వలేము” అన్నారట!
శివప్రసాద్
సినీశాస్త్రి
సంగీతంలో బి.ఏ. కోర్సుకు అప్లై చేసినవారిని ముందుగా పరీక్షించేందుకు ఒక విద్వాంసుడు వచ్చాడట. ఒక విద్యార్థిని నీ కిష్టంవచ్చిన కీర్తన ఏదైనా పాడమని అడగగా విద్యార్థి రాగం తానం పల్లవి పాడతానన్నాట్ట. విద్వాంసుడు పరమానందభరితుడై సరే కానిమ్మన్నాడట. వెంటనే విద్యార్థి శంకరాభరణం సినిమా పాట ఎత్తుకున్నాడట.