గురువుల సంస్మరణ కొనసాగిస్తున్న గాయని ప్రభా అత్రే

హిందూస్తానీ సంగీతకారులు చాలామంది ప్రతి ఏడాదీ తమ గురువుల పేర సంస్మరణ కార్యక్రమాలు జరుపుకుంటారు. ఈ ఆనవాయితీ కర్ణాటకసంగీతంలో కనబడదు. తెలుగువారిలోనే ద్వారం, పారుపల్లి, పినాకపాణివంటి మేధావులు ఎందరో శిష్యులూ, ప్రశిష్యుల్ని తయారుచేశారు. ఎప్పుడో 1951లో పారుపల్లివారి సమక్షంలో బాలమురళితోసహా ఆయన శిష్యులందరూ కచేరీలు చేశారని చదివాను. ఆ తరవాత అటువంటివి జరిగాయేమో తెలియదు. అలాగే తమిళనాట అరియక్కుడి, మహారాజపురం విశ్వనాథయ్యర్‌, సెమ్మంగుడి తదితరులూ, కర్ణాటకలో మైసూర్‌ వాసుదేవాచార్య వంటివారూ గొప్ప గురువులే. వారి పేర కార్యక్రమాలు ఏవీ జరుగుతున్నట్టు లేవు. మనవారికి గురుభక్తి తక్కువ అని అనలేము కనక పెద్ద కార్యక్రమాలు చేపట్టే స్తోమత లేకపోవడమే అందుకు కారణం అనుకోవాలి.

హిందూస్తానీ సంగీతకచేరీలు చాలామటుకు పాతతరం గురువుల పేరనే జరుగుతాయి. త్యాగరాజ ఆరాధన లాగే తాన్‌సేన్‌ ఉత్సవం గ్వాలియర్‌లో జరుగుతుంది. పూనాలో ఎన్నో సంవత్సరాలుగా భీమ్‌సేన్‌జోషీ తన గురువు సవాయీగంధర్వ పేర మూడురోజుల గొప్ప సంగీతోత్సవం నిర్వహిస్తున్నారు. ముంబాయిలో ఉస్తాద్‌ ఖాదింహుసేన్‌ఖాన్‌ పేర “సాజన్‌మిలాప్‌”, జగన్నాథబువా పురోహిత్‌ పేర “గుణిదాస్‌ సమ్మేళన్‌”, బడేగులాం అలీ యాద్‌గార్‌సభ, అల్లాదియా ఖాన్‌ సంస్మరణ కచేరీలూ, హాఫిజ్‌అలీఖాన్‌ పేర లోగడ అతని కుమారుడు అమ్జద్‌ అలీ నిర్వహించిన కచేరీలు, ఢిల్లీలో ఏటా జరిగే శంకర్‌లాల్‌ ఉత్సవం ఇలా ఎన్నో ఉన్నాయి. వీటిలో శిష్యులే కాక పేరుమోసిన కళాకారులందరూ పాల్గొంటారు.

ఇటువంటిదే ముంబాయిలో జరిగే సురేశ్‌బాబుహీరాబాయి స్మృతి సంగీతసభ. దీన్ని నిర్వహిస్తున్న ప్రభా అత్రే ఈనాటి హిందూస్తానీ గాయనులలో బహుముఖ ప్రజ్ఞావంతురాలు అని చెప్పవచ్చు. ఈ రచయిత ఇటీవల ముంబాయిలోని మాహీమ్‌లో ఆమె స్వగృహంలో కలుసుకున్నప్పుడు చాలా విషయాలు తెలిశాయి.

ప్రభా అత్రే పూనా విశ్వవిద్యాలయంలో సైన్స్‌, న్యాయశాస్త్రాల్లో, పట్టభద్రురాలు, గాంధర్వ మహావిద్యాలయం ద్వారా సంగీతంలో డాక్టరేట్‌ డిగ్రీ, ఆలిండియా రేడియోలో ప్రొడ్యూసర్‌గా ఉద్యోగం, ముంబాయి SNDT యూనివర్సిటీలో సంగీతవిభాగానికి అధ్యక్ష పదవి, ప్రభుత్వం తరఫున మొదట పద్మశ్రీ, తరవాత పద్మభూషణ్‌ పురస్కారం ఇలా ఆమె జీవితంలో సాధించిన విజయా లెన్నో ఉన్నాయి. కిరానా ఘరానా సంప్రదాయానికి మూలవిరాట్టు అనదగిన అబ్దుల్‌ కరీమ్‌ఖాన్‌ మహారాష్ట్రలో ఎందరో శిష్యులను తయారు చేశారు. వారిలో ముఖ్యులైన ఆయన కుమార్తె హీరాబాయి బడోదేకర్‌, ఆమె సోదరుడు సురేశ్‌బాబూ మానేల వద్ద ప్రభ చిన్న వయసులోనే సంగీతం

నేర్చుకుంది. ప్రతి సంవత్సరమూ వారి పేర ముంబాయిలో సంగీత సభలు నిర్వహిస్తూ వస్తోంది.

తనదేమీ సంగీతకారుల కుటుంబం కాదనీ, అనారోగ్యంతో బాధ పడుతున్న తన తల్లి ఉపశమనానికని పాట నేర్చుకోబోయి మానెయ్యగా తనకది కొంత పట్టుబడిందనీ ఆమె చెప్పింది. మనలో చాలామంది సంగీత కుటుంబాలకు చెందనివారే కనక పాఠకులకు ఆసక్తికరంగా ఉంటుందనే ఉద్దేశంతో సంగీతంలో ఆమె ప్రగతి గురించి ముచ్చటించడం జరిగింది.

శాస్త్రీయ సంగీతకచేరీలు చెయ్యడంతో ఆమె ఆగలేదు. సంగీతం గురించి వ్యాస సంకలనాలుగా ఆమె రాసిన పుస్తకాల్లో “స్వరమయి”కి రాష్ట్ర ప్రభుత్వ బహుమతి లభించింది. ఇవికాక ఆమె “స్వరాళి”, “స్వరాంగిణి” అనే పుస్తకాలనూ, “అంతఃస్వర్‌” అనే మరాఠీ కవితా సంపుటినీ వెలువరించింది. రెండువందలకు పైగా కొత్త కృతులు రచించింది. అపూర్వ కల్యాణ్‌, దర్బారీకౌఁస్‌, పట్‌దీప్‌ మల్హార్‌, శివకలీ వంటి కొత్త రాగాలను సృష్టించింది. నృత్యకళాకారిణి సుచేతా భిడే కోసం సంగీత రచనలు చేసింది. కెనడా, అమెరికా, నెదర్లండ్స్‌, స్విట్జర్లండ్‌ వగైరా దేశాలలో సంగీత అధ్యాపకురాలిగా పనిచేసింది. అనేక యూనివర్సిటీల్లో సంగీతపరీక్షాధికారిగా, సంగీత న్యాయ నిర్ణేతగా పనిచేసి డజన్లకొద్దీ బహుమతులనూ సన్మానాలనూ పొందింది. రేడియోలో అనేక నాటకాల్లో నటించింది.

“1960లో నా కాలేజీ చదువు పూర్తవగానే ఆలిండియా రేడియోలో చేరాను. పదేళ్ళు పనిచేసి గాయనిగా ప్రొఫెషన్‌ మొదలెట్టాను. సంగీతశాస్త్రంపై నాకు మక్కువ పెరగడంతో 1979లో SNDT మహిళావిశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేరి, సంగీతశాఖ అధ్యక్షురాలిగా 1992దాకా పనిచేశాను” అని చెప్పారు ప్రభా అత్రే. ఆమె సంగీత శిక్షణ పుణేలో విజయ్‌ కరందీకర్‌గారి వద్ద మొదలై తరవాత పధ్నాలుగేళ్ళ వయసునుంచి కిరానా సంప్రదాయంలో అప్పటికే సుప్రసిద్ధులైన సురేశ్‌బాబూ మానే, హీరాబాయి బడోదేకర్‌ల వద్ద కొనసాగింది. నేర్పడానికి వారు అంగీకరించడమే మహాభాగ్యం అనిపించింది. తరవాత 1960లో ఉస్తాద్‌ అమీర్‌ఖాన్‌ శిష్యుడు శ్రీకాంత్‌ బక్రే ద్వారా నేర్చుకున్న అమీర్‌ఖాన్‌ శైలి ఆమెను చాలా ప్రభావితం చేసింది. అలాగే ఠుమ్రీలు పాడడంలో ఉస్తాద్‌ బడేగులామ్‌ అలీ ఖాన్‌ గారి ప్రభావం చాలా పనిచేసింది.

గత పన్నెండేళ్ళుగా ముంబాయిలో తాను నిర్వహిస్తున్న సురేశ్‌బాబు హీరాబాయి స్మృతి సంగీతసభ గురించి చెపుతూ “జీవితంలో గురు శిష్యుల అనుబంధం ఎంతో పవిత్రమైనదీ విశిష్టమైనదీ కూడా. గురువుల శైలినీ, కళనూ, సంప్రదాయాన్నీ కొనసాగించేది శ్రద్ధాళువులైన శిష్యులే కదా. ఎన్ని రికార్డింగులున్నా గురువు శ్రోతల స్మృతిపథం నుంచి మరుగవకుండా ఉండాలంటే శిష్యులు కచేరీలూ చేస్తూనే ఉండాలి. నాకు నేర్పిన గురువులలో హీరాబాయి బడోదేకర్‌ కన్నా ఆమె సోదరుడు సురేశ్‌బాబూ మానే రికార్డింగులు చాలా తక్కువ. వారి విద్వత్తుకు నివాళిగా ఈనాడు వారి పేర కచేరీలు నిర్వహించడ మొక్కటే సరైన పద్ధతిగా తోస్తుంది. మధ్యతరగతి ప్రేక్షకులు మూడు నాలుగు వేలమంది ఒక్కసారిగా వచ్చి వినడంకోసం తక్కువ ప్రవేశరుసుముతో పెద్ద స్కూలు ఆవరణ లో ఓపెన్‌ ఏర్‌ కచేరీలు నిర్వహిస్తున్నాము” అన్నారామె.

జనవరి 2003లో విలేపార్లేలో జరిగిన మూడురోజుల సంగీతోత్సవంలో ఉస్తాద్‌ ఇమ్రత్‌ఖాన్‌ ప్రత్యేకంగా అమెరికానుంచి వచ్చి సితార్‌ వాయించారు. యువగాయకుడు రషీద్‌ఖాన్‌, కర్ణాటక  వయొలిన్‌ విద్వాంసుడు డా.ఎల్‌.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఎనభైఏళ్ళ భీష్మ పితామహులవంటి పండిత్‌ భీమ్‌సేన్‌జోషీ గానంతో సమావేశం ముగిసింది.

కిరానా పద్ధతిలోని గానం మృదువుగా చెవికింపుగా ఉండి, భావావేశంతో వినే సామాన్యులను వెంటనే ఆకట్టుకుంటుంది. అలా విని ఆనందించడానికి సంగీతశాస్త్రం తెలియనవసరం లేదు. రాగ విస్తారం నింపాదిగా తాళంతోబాటు ప్రశాంతంగా ఒక్కొక్క స్వరంమీదా ఆగుతూ హాయిగా సాగుతుంది. మెప్పించడానికి గమ్మత్తులు చెయ్యడం, భేషజాలూ ఉండవు. మాధుర్యం, శాంతగుణం ప్రధాన లక్షణాలు. గురువుగారు సురేశ్‌బాబు విశాల దృక్పథంతో బడేగులాం అలీఖాన్‌, అమీర్‌ఖాన్‌ వంటీవారి బాణీలను కూడా విని మంచి విషయాలు గ్రహించమని ప్రభను ప్రోత్సహించారు.

“ఒక సంవత్సరం పాటు ఆయన యమన్‌ (కర్ణాటకంలో కల్యాణి) అనే ఒక్క రాగమే సాధన చేయించారంటే నమ్మగలరా? మరో రాగం నేర్పమని నేను ప్రాధేయపడితే “అయితే యమన్‌ వచ్చేసినట్టేనా?” అని పరిహాసం చేసేవారు. యమన్‌ నేర్చుకుంటే తక్కిన రాగాలు సులువుగా పట్టుబడతాయన్న ఆయన నమ్మకం నిజమని నేను ఆచరణద్వారా తెలుసుకున్నాను. కేవలం ఆరోహణ, అవరోహణ, రాగలక్షణాలను నేర్పి నన్ను రాగాన్ని ఆలపించమనేవారు. అనుకరణ ఆయనకు నచ్చేదికాదు. స్వతంత్రంగా స్వరకల్పన ఊహించే గుణాన్ని బాగా ప్రోత్సహించేవారు. ఆయన కాలంచేశాక ఆయన సోదరి హీరాబాయి నేర్పారు. ఆరోజుల్లో ఆమె అద్వితీయమైన ప్రతిభతో కచేరీలు చేసేవారు. ఆమెతో దేశమంతటా తిరిగాను. ప్రేక్షకులముందు పాడి మెప్పించటంలోని మెళుకువలు అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. ఒక సంప్రదాయపు లక్షణాలను క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే ఆ తరవాత ఇతర సంప్రదాయాలను అర్థం చేసుకోవడం సులభమౌతుంది. ఆ విషయంలో ఘరానా పద్ధతి మంచిదే” అంటారామె.

ఉద్యోగాలు చేస్తున్నా సెలవురోజుల్లోనూ, శని, ఆదివారాలూ గానకచేరీలు చేస్తూ, రేడియో, యూనివర్సిటీ ఉద్యోగాలవల్ల సంగీతాన్ని వివిధకోణాల నుంచి పరిశీలించి, మరింత విపులంగా అవగాహన చేసుకుంటూ ప్రభా అత్రే తన సంగీత యాత్ర కొనసాగించింది. ఆమె అభిప్రాయంలో సంగీతంలో ఆచరణలో ఉన్నవాటికి శాస్త్రాధారాలేమిటో తెలుసుకోవడం పాడేవారికి ఈరోజుల్లో చాలా అవసరం. శ్రోతలు వివేకవంతులు కనక ప్రతిదీ “ఏమిటి, ఎందుకు” అని ప్రశ్నిస్తారు. పాత తరంలో లాగా “ఏదో ఇది మా సాంప్రదాయం” అనేస్తే వారికి నచ్చదు. వారికి సంతృప్తికరమైన సమాధానాలివ్వడం గాయకుల విధి. సంగీతం ఎలా విని ఆస్వాదించాలో కుతూహలం ఉన్నవారికి గాయకులే నేర్పాలి. తద్వారా ప్రేక్షకుల్లో సరైన అవగాహన పెరుగుతుంది కూడా. స్పిక్‌ మాకే వంటి సంస్థలు కొన్ని మంచి ప్రయత్నాలు చేస్తున్నాయి. మునుపటి గురుకుల వ్యవస్థ ఏనాడో పోయింది. ఈరోజుల్లో నేర్చుకునేవారికి గురువే కాక ఇతరత్రా సంగీతం వినడానికి ఎన్నో మార్గాలున్నాయి. శిష్యులపై ఇతరుల ప్రభావం పడకుండా కాపాడడం అసాధ్యం, అనవసరం కూడా.

ఆధునిక హిందూస్తానీ గాన కచేరీల గురించి “Enlightening the Listener” అనే పేరుతో ఒక పుస్తకాన్నీ, దానికి అనుబంధంగా ఒక ఆడియో కేసెట్‌నూ ప్రభా అత్రే వెలువరించింది. అందులో సంగీతం గురించేకాక ఖయాల్‌లో సాహిత్యానికీ, తాళగతికీ, రాగభావానికీ, రాగం పాడే సమయానికీ ఉన్న ప్రాముఖ్యతను వివరించింది. ఇవికాక ఖయాల్‌ ఆధునిక స్వరూపాన్ని వివరిస్తూ కిరానా సంప్రదాయం, ఠుమ్రీ, గజల్‌ విశేషాలూ, సినీ, ఆర్కెస్ట్రా సంగీతం, దేశ విదేశాల్లో సంగీత శిక్షణ  అనుభవాలూ, సంగీతవిమర్శ వంటి అనేక విషయాలను ప్రస్తావించింది.

“శాస్త్రీయసంగీతానికి విశేషమైన జనాదరణ ఉండదెందుకని?” అని అడిగితే ఆమె ఇలా అన్నారు. “శాస్త్రీయసంగీతం అనేది సామాన్య ప్రజలకు ఉద్దేశించినదికాదు. అది ఎంతో కాలంనుంచీ కొన్ని శాస్త్రపద్ధతుల ఆధారంగా అందంగా రూపొందించబడినది. దాని వెనక ఎంతో యోచనా, పరిశోధనలూ ఉన్నాయి. అది సినిమా పాటల్లాగా జనాదరణ పొందాలనుకోవడం తప్పు. దాన్ని విని ఆనందించడానికి సంగీతానికి ఉండే సంగీతపరమైన అర్థంతెలియాలి. శుద్ధ స్వరాల, లయల విన్యాసాలు తెలియాలి. దీనికి కొంత సంస్కృతి, అధ్యయనం, ఆలోచన అవసరమవుతాయి. సామాన్యులకు వీటన్నిటికీ ఓపిక ఉండదు. వారికి సులువుగా అర్థమై వెంటనే నచ్చేవి తేలిక పాటలు. అందులో సాహిత్యం, దరువు ప్రధానం. అవి సింపుల్‌గా పాడుకోవటానికి వీలుగా ఉంటాయి. అదీకాక కొందరు శాస్త్రీయ సంగీతకారులు టెక్నిక్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఒక్కొక్కప్పుడు సంగీతాన్ని నిర్జీవం చేస్తారు. ఇవన్నీ విముఖతకు దారితీస్తాయి. స్కూలు, కాలేజీలలో శిక్షణ ద్వారానూ, మీడియా సహాయంతోనూ కొంతవరకూ శాస్త్రీయ సంగీతానికి ఆదరణ పెంచవచ్చు కాని అది “పాప్‌” సంగీతంతో ఎప్పుడూ పోటీ పడలేదు. అలా అని సినిమా సంగీతం అంతా తక్కువరకం అనలేము. అది మనసంగీతపు పరిధిని విస్తృతం చేసింది. మనసంగీతానికి “హార్మొనీ”ని జోడించింది. రకరకాల బాణీలనూ,వాయిద్యాలనూ, లయలనూ, శబ్ద వైవిధ్యాన్నీ, హావభావాలనూ సమకూర్చింది. అలాగే రేడియోలో పనిచేసినప్పుడు మైక్‌ల గురించీ, అకూస్టిక్‌ ప్రాముఖ్యత గురించీ ఎంతో తెలుసుకోగలిగాను”

కర్ణాటక రాగాలు, గమకాల ప్రభావం కూడా తనమీద ఉందంటారు ప్రభా అత్రే. “నేను ఆలిండియా రేడియోలో పని చేసినప్పుడు తరుచుగా దక్షిణాది సంగీతం వినేదాన్ని. నాకు వారి గమకాలూ, సరిగమలు పాడే విధానమూ నచ్చుతాయి. ఆ సంగీతం కూడా నేర్చుకుని ఉంటే బావుండేది” అన్నారామె.

కొత్త రాగాలు సృష్టించడం అవసరమా అని అడిగితే “నేనూ కొన్ని సృష్టించాను కాని, నా లెక్కన కొత్త రాగం పాడడం కన్నా ఉన్న రాగాలను కొత్తగా పాడగలగడమే కష్టం” అని ఆమె జవాబిచ్చింది.

ఫ్యూజన్‌ సంగీతం గురించి చెపుతూ ప్రస్తుతపు వ్యాపారసరళిలో సంగీతం కూడా ఒక కొనుగోలు వస్తువైపోయిందనీ, మార్కెట్‌ కోసమో, ఈనాటి అభిరుచుల వల్లనో, కొత్తదనం ఉందనో కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనీ, అవి ఎలా పరిణమిస్తాయో వేచి చూడాలనీ అందామె.

“రాగభావం అభివ్యక్తికి వ్యవధితో పనిలేదు. పాత తరం దిగ్గజాలందరూ మూడు నాలుగు నిమిషాల్లో గొప్ప రికార్డులు పాడలేదా? ప్రేక్షకులలో సామాన్య సంగీతప్రియులూ, విమర్శకులూ, పండితులూ రకరకాల వాళ్ళుంటారు. వారిలో అవగాహన వివిధ స్థాయిలలో ఉంటుంది. అందర్నీ మెప్పించి తన ఆనందాన్ని వినేవారందరితోనూ పంచుకోగలగడమే గానం చేసే వ్యక్తికి సవాలు అనుకుంటాను” అంటున్న ప్రభా అత్రేతో చాలామంది ఏకీభవిస్తారు.


కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

రచయిత కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గురించి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు. ...