కబడ్డీ

సీనుగాడు పొద్దున్నే తలుపు కొట్టి మంచి నిద్ర పాడు చేసిండు.  హాస్టల్ల వుంటె ఆదివారం పూట హాయిగ కొంత ఎక్కువ సేపు నిద్ర పోదామంటె కుదరదు.  ఏందిర సీను ఇంత పొద్దున్నె అంటె చెప్పిండు, తొందరగ లే! లేసి టిఫిను తిని కాలేజీకి పోవాలె.  ఇంకెంత సేపు నిద్ర పోతవు నిన్న అనుకున్నది అప్పుడే మర్చి పోయినవ అన్నడు.

వెంటనే గుర్తొచ్చింది, ఇయ్యాళ ఇంటర్‌కాలేజీ కబడ్డీ పోటీలున్నయని.  అదీగాక వరంగల్లు కాలేజీకి, నల్లగొండ కాలేజీకి మధ్య ఇవ్వాల్నే అని.  నాది నల్లగొండ, అసలు కబడ్డి అక్కణ్ణే పుట్టిందా అన్నట్టు ఆడేవాళ్ళు నేను స్కూళుకు పోయేటప్పడి రోజులల్ల.  మా చిన్నాయనలు కాలేజీల ఆడుతుంటె నన్ను కూడ ఎమ్మడి తీసుక పొయ్యేటోల్లు.  వాళ్ళు నలుగురు ఒక జట్టులనే వుండి అవతలోళ్ళను అసలు బతకనిచ్చేటోల్లు కాదు.  వీళ్ళు ఎక్కడికి పోతె అక్కడ గెల్చుకు రావాల్సిందే.  ఒకాయన స్టేట్‌ తరఫున కూడ ఆడిండు, గెల్వలేదనుకుంట ఎవరు ఆ పోటిల గురించి మాట్లాడరు.  ఇంకో ఇద్దరు కాలేజీ బందు జేసి, పొలం జూస్తందుకు మా నాయనకు తోడుగ వూర్లెకు వచ్చేసిండ్రు.  ఇంటికాడ కూడ వుత్తగ కుసోలే, పిల్లగాండ్లకు మంచి పట్లు నేర్పించేటోల్లు.  మా అమ్మ ఒక్కతి లేకపోతె, నాక్కూడ మోకాళ్ళు గీక్కపోయ్యేటట్టు ఆడిపించి రోజంత కబడ్డి ధ్యాస తప్ప వేరే వుండకుండ చేసేటోళ్ళేమో.

అమ్మ చేబట్టి ఎనిమిదో తరగతినించే కబడ్డి గిబడ్డి ఏది లేని పట్నం బళ్ళె చేరిన.  స్కూలుమాత్రమే కాక రెండు ట్యూషనులు పెట్టించి నన్ను సదువు తప్ప ఇంకోటి ముట్టుకోనివ్వలేదు.  అందుకే నాకు రెండేండ్ల కింద వరంగల్లు కాలేజీల ఇంజనీరింగు సీటు వచ్చింది.  వరంగల్లు బాస కూడ వంటబట్టింది.  అయినా నల్లగొండ నీళ్ళు తాగిన కాబట్టి, చిన్నప్పటి అభిమానం ఎక్కడికి పోదు కాబట్టి నల్లగొండ జట్టు వచ్చిందంటె నిన్న సీను గాడు నేను కలిసి సూస్తందుకు పోయినం.  అన్నట్టు సీనుది కూడ మా నల్లగొండనే.  ప్రాక్టీసు సాయంత్రం పూట మా కాలేజీ గ్రౌండ్ల, అంత తెలిసినోళ్ళె, నల్లగొండ జట్టు అంటె అందరికి భయం అని తోటి కాలేజోళ్ళు చెప్పుకుంటుంటె మంచిగనిపించింది.  అరె మనోళ్ళంటె ఏమనుకున్నవు అన్నట్టు తలెగరేసుకుంట బనీనుల మీద ప్రాక్టిసు చేస్తున్న ఆటగాళ్ళను చూసుకుంట వాళ్ళ కోచ్‌ దగ్గరికి పోయ్యినం ఇద్దరం.

కోచ్‌ పేరు రాం రెడ్డి, నేను మా చిన్నాయన పేరు చెప్పిన, స్టేట్‌ టీంల ఆడినాయన పేరు రాం రెడ్డి నన్ను పైకి కిందికి చూసి, అట్లనా మీ చిన్నాయన తోటి నేను కూడ ఆడిన స్కూళ్ళ వున్నప్పుడు, ఇప్పుడేం చేస్తున్నడు అని కొన్ని ప్రశ్నలడిగిండు.  ఇగో ఇంకో రాం రెడ్డి అంతటోడు మన ఇప్పటి టీంల కూడ వున్నడు అని ఏయ్‌ సందీప్‌ రెడ్డిని పిలువు అని ఒక ఎత్తుగ బలంగ కనిపిస్తన్న ఒక టీం మెంబరుని పిలిపించి మాకు పరిచయం చేసిండు.  సూస్తెనే తెలుస్తంది వీణ్ణి పట్టాలంటె ముగ్గురు నలుగురన్న కావాలె అని.  అదీగాక వరంగల్లు టీం అంత గొప్పదేం కాదు ఈసారి.  అసలు వుత్తగ గెలువొచ్చు, అంత అల్కటి ఆట రేపు అని నేను వేరే వాళ్ళ దగ్గర విన్న రెండు ముక్కలు చెప్పిన.  సందీప్‌ నా మొఖంలకు చూసి, ‘ అరే అన్నా వాళ్ళకు మల్లొకసారి నల్లగొండ టీంతోటి ఆడాలంటె చెమటలు పట్టేటట్టు చేస్తం రేపు, ఆట సూస్తందుకు రా ‘  అని చెప్పిండు.  తప్పకుండా అని చెప్పి ఇద్దరం వచ్చేసినం.

దోస్తులతోటి అదీ ఇదీ మాట్లాడుకుంట రాత్రి లేట్‌ అయింది నిద్ర పొయ్యేటప్పటికి.  సీనుగాన్ని పది నిమిషాలు ఆగమని, తొందరగ అన్ని కానిచ్చి ఇద్దరం ఒక ప్లేటు ఇడ్లీ తిని గ్రౌండ్స్‌ మీద పడ్డం.  మా వరంగల్లు కాలేజీ టీముల నాకు ఎవరు తెల్వదు.  నా మిగతా క్లాస్‌మేట్లు చెప్పిండ్రు, మన కాలేజీ వరసగ వోడిపోవుట్ల రికార్డు స్థాపిస్తది ఈసారి, నల్లగొండ తోటి అని.  నా నల్లగొండ ఫీలింగు వాళ్ళకు చెప్పకుండ ఆట ముఖ్యం వోడిపోతె ఏమెయితది అని ఏదో నోటి మాట చెప్తున్న నన్ను చూసి సీను ముసిముసి నవ్వులు నవ్విండు.  అందరికి తెలుసులేరా మనం నల్లగొండ నించి అని నువ్వెట్లాగు నీ టీమే గెలవాలె అని చూస్తవని, అన్నడు.  నేనేం మాట్లాడ లేదు.

పది గంట్లకు పోటీ మొదలు.

కబడ్డీ ఫెడరేషను రూల్సు ప్రకారం రెండు దిక్కుల ఏడుగురు మెంబర్స్‌ వుండాలె.  ఒక దిక్కు టీంల ఎవరన్న అవుటయితె ఇంకో దిక్కు టీం మెంబరు అవుటెయినోల్లెవరన్న వుంటె ఆటలకు ఎక్కొచ్చు.  వేరే రకమ్‌ రూల్సు కూడ వున్నయి గాని ఇప్పుడయితె ఇట్ల ఆడుతున్నం అన్ని రూల్సు అర్ధమెయినయ అని ఎంపైరు అడుగుతున్నడు అందరిని.

అందరు తలలూపి, రెండు సైడ్లు రెడీ అయినయి ఆడ్తందుకు. ఇరవై  నిమిషాలకు ఒక అయిదు నిమిషాలు విరామం ఇచ్చి, సైడ్లు మారి మల్ల ఆడ్తరు ఇంకో సగం.  వరంగల్లు టీం టాస్‌ గెలిచింది, మొదటోన్ని అవతలి దిక్కు పంపింది.  కబడ్డి కబడ్డి అనుకుంట వచ్చినోణ్ణి వచ్చినట్టె లాగేసిండ్రు నల్లగొండ టీంఓల్లు .  అది వొక వ్యూహమ్‌ అనుకుంట మొట్ట మొదలే మంచి దెబ్బ కొడితె అవతలి టీం వాళ్ళకు వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం పోద్దంట అని పక్కనించి సీను గాడు నిమ్మళంగ చెప్పిండు.  నాకు ఈల వేయబుద్ధయింది కాని పక్కన అంత వరంగల్లోల్లు, క్లాసుమేట్లు వున్నరని సప్పుడు చెయ్యలేదు.

సందీపు వస్త వస్తనే గాలి దుమారమ్‌ లాగ కూత పెట్టుకుంట వచ్చిండు.  నలుగురు అవుట్‌ .
రెండు నిమిషాలు కాలేదు వరంగల్లు టీమ్‌ అన్త అవుటయ్యే పరిస్థితి.
బోనస్‌ పాయ్త్లిను రెండు వస్తయి అందరు అవుటయితె.
పదినిమిషాలల్ల తేలిపోయిన్ది ఎవరు గెలుస్తరో, నల్లగొండ  : 10 వరంగల్లు : 3.
విశ్రాంతి టైము కు వరన్గల్లోల్లు నీరస పడ్డరు కాని వోటమిని వొప్పుకోవడం ఇష్టం లేక ఆట కోసమే అన్నట్లు వీరోచితంగ ఆడుతున్నరు.
అవుటైతమని తెలిసినా కూడ కూత పెట్టి పోతనే వున్నరు, పొయ్యినోళ్ళు మల్ల తిరిగి వస్తలేరు.
మిగతా సగం సేపట్ల ఎట్లనైన సందీపును అవుట్‌ చేసి తమ సత్తా కూడ చూపిన్చుకోవాలని ఆరాట పడ్తున్నరు.
ఆట ఇన్క అయిదు నిమిషాలున్ది, స్కోర్ల తేడా అసలు చూస్తట్టు కూడ లేదు, మా కాలేజీ ముప్ఫై అయిదు పాయింట్లు వెనకబడి వుంది.

నల్లగొండ టీం స్టేట్‌ చామ్పియనులు ఆడినట్లు ఆడుతున్నరు.
వరంగల్లు టీమంత కూడ బలుక్కుని లోపలికొచ్చిన సందీపు మీద బడ్డరు, ఫైనలుగ సందీపును ఒక్కసారి అవుట్‌ చేసిండ్రు.
వాళ్ళ సంతోషానికి హద్దులేదింక, ఇంకో రెండు నిమిషాలల్ల మల్ల ఆటలకొచ్చేస్తడని తెలిసి కూడా, ఏదో కొండని పిడికిట్ల పట్టిన సంతోషం.

అనుకున్నట్టే సందీపు ఆటలకు రావుడైంది, మళ్ళ పాయింట్ల పంట పండిచ్చడమూ మొదులైంది.
కాకపోతె ఈ సారి నన్ను అవుట్‌ చేస్తరా అన్నట్టు కొంత కసిగా రిస్కు తీసుకోని ఒక్కసారే ఎక్కువ పాయింట్లు తేవడం మొదలు పెట్టిండు సందీపు.
సూస్త సూస్తనే తేడా యాభై పాయింట్లకు పోయింది.
వరంగల్లోల్ల ముఖలల్ల కళ లేదు, ఎన్నో రోజులనించి పోరాడుతున్నట్టు మొఖాలు వేలాడేసుకోని ఇంక తప్పదన్నట్టు ఆడుతున్నరు.

ఇంకోక్క నిమిషంల ఆట అయిపోతుందనంగ సందీపు మళ్ళ కూత బెట్టుకుంట వచ్చిండు.  కళ్ళు మూసి తెరిసే లోపల కాలెత్తి వొకణ్ణి గీత అవతల పడ్తట్టు తొయ్యడం, ఇంకో ఇద్దరిని చేతులతోటి నెట్టెయ్యడం, మిగతా ముగ్గురిని తన బాడీతో కుమ్మెయ్యడం జరిగిపోయినయ్యి.
మిగిలిన వొక్కడు వొక భూతం లాగ మీది మీదికొస్తున్న సందీపుని చూసి, తనే బయటికి అడుగు పెట్టిండు, లైను దిక్కు సైగ చేసుకుంట సందీపు చిన్నగ నవ్వుకుంట మద్య బేర దాక వొచ్చి వరంగల్లు టీమును గేలి చేస్తున్నట్టు ఒక చూపు చూసి అందరు నల్లగొండ టీమ్లోల్లు పిలుస్తుంటె వొక వీరునిలాగ అవతలికి పొయ్యిండు.

ఆట అయిపోయింది.
ఎంపైరు నల్లగొండ గెలిచినట్టు ప్రకటించిండు.
నేను, సీను ఇద్దరం నల్లగొండ దిక్కు వాళ్ళ కోచుకి మల్ల కలుస్తం అని చెప్పడానికి పోయినం.

టవలుతోటి తుడుచుకుంట సందీపు మాదిక్కు వొచ్చిండు.  నవ్వుకుంట చూసిండ్రా, ఇంకో సారి మనతోటి ఆడాలంటె కూడ భయపడ్తట్లు చేసినం అన్నడు.

నేను వొక్కసారి సందీపు మొఖంలకు చూసి లాగిపెట్టి రెండు కాళ్ళ మధ్య బలం కొద్దీ తన్నిన.  నీ ప్రతాపం సచ్చిన పామును మల్ల మల్ల సంపుట్ల కాదురా చూపించాల్సింది. అవతలోడూ నీ లాగనే ఒక ఆటగాడు, ఓడిపోయేటిది తెల్సినా గూడ యెనక్కి తగ్గకుండ ఆడినోడు. అందుకు వాడిని గౌరవించడం నేర్చుకో అని చెప్పి, వరంగల్లు జిందాబాద్‌ అనుకుంట హాస్టలు దిక్కు నడిచిన.  సీను గాడెక్కడున్నడో నాకు తెల్వదు.