మిస్డిరెక్షన్‌

“ఈమధ్య జీవితం చాలా కాంప్లికేటెడ్‌గా అయిపోయింది. ఈ 911 ఏమోగాని ప్రతిదానికీ భయపడాల్సి వస్తున్నది” అన్నాడు సయీద్‌ దీర్ఘంగా నిట్టూరుస్తూ.
“నిజమే. ఈరోజుల్లో అమెరికాలో ముస్లిం పేరు వుండడం అంటే అవమానాలకి సిద్ధం కావటమే!” అన్నాడు శివరాం సానుభూతిగా.

ఓ కాన్ఫరెన్స్‌ రూంలో కూర్చుని వున్నారు ఇద్దరు. మీటింగ్‌ టైం అయింది కాని మిగిలిన వాళ్ళెవరూ ఇంకా రాలేదు. ఇద్దరూ ఒకే కంపెనీలో నాలుగైదు ఏళ్ళనుంచి పనిచెయ్యడమే కాకుండ ఎప్పట్నుంచో ఒకరికొకరు తెలియడమూ ఒకే వీధిలో దగ్గరి ఇళ్ళలో వుండడమూ వల్ల వాళ్ళిద్దరి మధ్యా బాగానే స్నేహం అయింది. సయీద్‌ మేనేజీరియల్‌ పొజిషన్‌లో వుంటే శివరాం సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు.

“మొన్నమొన్నటి దాకా చక్కగా పలకరించే పక్క ఇళ్ళ వాళ్ళు కూడ ఈమధ్య మొహాలు ముడుచుకుంటున్నారు. నిన్న ఎవరో నా కారు డ్రైవ్‌ వే మీద పార్క్‌ చేసి వుంటే ఒక టైర్లో గాలి తీసేశారు. ఇలా ఎన్నాళ్ళు ఇలాటి అవమానాలు ఎదుర్కోవాలో తెలీడం లేదు” అన్నాడు సయీద్‌ మళ్ళీ.
“ఇరాక్‌ గొడవ ఐపోయినట్లేగా! ఇంక పరిస్థితులు కొంతవరకన్నా మారతాయిలే!” అన్నాడు శివరాం భరోసాగా.
“నేనంటే ఎలాగో సర్దుకుపోగలను. హసీనా విషయమే కష్టంగా వుంది. తను పనిచేసేచోట కోవర్కర్ల సూటిపోటి మాటలూ, కోరచూపులూ భరించలేక ఉద్యోగం మానేసింది. ఇప్పుడు ఇంట్లోనే వుంటుంది. ఏమీ తోచదు. కొన్నాళ్ళ దాకానన్నా బయటికెళ్ళి వర్క్‌ చెయ్యనంటుంది. ఏం చెయ్యాలో తోచడం లేదు” శివరాం మొహం లోకి చూస్తూ అన్నాడు సయీద్‌.
“ఈ పరిస్థితుల్ని మీరు మరీ సెన్సిటివ్‌గా తీసుకుంటున్నారేమో అని నా అనుమానం. దేశంలో ఓ మిలియన్‌ పైగా ముస్లింలు వున్నారు కదా! వాళ్ళంతా ఇంతగా రియాక్ట్‌ ఔతున్నారనుకోను” అన్నాడు శివరాం.
“అనకూడదు కాని, నువ్వూ ఓ ముస్లింవి అయుంటే గాని మా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోలేవు..” అంటూ రెండు క్షణాల పాటు శూన్యంలోకి చూస్తూ వుండిపోయాడు సయీద్‌. శివరాం ఏమీ మాట్లాడలేదు.

“శివరాం! నీకు మిస్టరీ కథలంటే చాలా ఇష్టమనీ మిస్టరీ పుస్తకాల్ని విపరీతంగా చదువుతావనీ చెప్పావు కదూ?” హఠాత్తుగా ఆ విషయం ఎందుకొచ్చిందో అర్థం కాక ఒక్క క్షణం తికమకపడి “అవును! చెప్పుకోతగ్గ మిస్టరీ పుస్తకాల్లో బహుశ నేను చదవనిది లేదనుకుంటాను. ఆగతా క్రిస్టీ దగ్గర్నుంచి సూసన్‌ మెక్‌బ్రైడ్‌ దాకా నేను చదవని వాళ్ళు లేరు. అయినా ఇప్పుడెందుకు ఆ విషయం?” అనడిగాడు శివరాం కుతూహలంగా.
గబాల్న లేచి వెళ్ళి తలుపు దగ్గరకు వేసివచ్చాడు సయీద్‌. సీరియస్‌గా మొహం పెట్టి “శివరాం! ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మనిద్దరి మధ్యనే వుండాలి. ఎట్టి పరిస్థితుల్లోను మరెవరికీ తెలియకూడదు” అని ఆగి అతని వంక చూశాడు. అప్రయత్నంగానే తలూపాడు శివరాం ఆశ్చర్యంలో మునిగి తేలుతూ.
“నేను హసీనాని చంపెయ్యాలి. నీ మిస్టరీ పరిజ్ఞానాన్నంతా ఉపయోగించి నాకు ఒక మంచి ప్లాన్‌ తయారుచేసి చెప్పాలి నువ్వు” అన్నాడు సయీద్‌.
అతను ఏమంటున్నాడో శివరాంకి వెంటనే అర్థం కాలేదు. అర్థం అయ్యాక ఏం మాట్లాడాలో తోచలేదు. ఏదో చెప్పబోయేంతలో తలుపు తెరుచుకొని ఎవరో రావడంతో ఆ సంభాషణ అక్కడితో ఆగిపోయింది.

మీటింగ్‌ ఐపోయి తన క్యూబికల్‌కి వెళ్ళాక కూడ శివరాం మనసు మనసులో లేదు. సయీద్‌ అలాటి వ్యక్తి అని శివరాంకి ఎప్పుడూ కనీసం అనుమానమైనా రాలేదు. అందరితోనూ మంచిగా వుంటూ, ఆఫీసు రాజకీయాల్ని అవలీలగా అర్థం చేసుకొని వాటిలో తన వంతు పాత్ర తను ధరించి చకచక ప్రమోషన్లు కొట్టేసి ఫాస్ట్‌ ట్రాక్‌లో పైకి దూసుకు వెళ్ళిపోతున్న ఇలాటి వాడికి ఇంత ఘోరమైన ఆలోచన కలగడం ఎలా సంభవమో శివరాంకి అంతు పట్టలేదు.

సయీద్‌తో మాట్లాడదామని రెండు సార్లు వెళ్ళిచూస్తే అతని ఆఫీసులో ఎవరో మాట్లాడుతూ కనిపించారు. గంటసేపు కాలుకాలిన పిల్లి లాగా చుట్టూ తిరిగాక సయీద్‌ ఖాళీగా కనిపించాడు. గభాల్న అతని ఆఫీసులోకి దూరి తలుపు మూసి, “ఇందాక నువ్వన్నది ఆలోచించే అన్నావా?” అనడిగాడు శివరాం ఆదుర్దాగా.
తాపీగా అతని వంక చూశాడు సయీద్‌. “ఆలోచించానా అంటే కొంతవరకు ఆలోచించాను. పూర్తిగా ముందువెనకలు ఆలోచించలేదు. మనిద్దరం ఇంతకాలం నుంచి ఒకర్నొకరు ఎరిగిన వాళ్ళం కదా, సహాయం చేస్తావేమో అనుకున్నాను. సహాయం చెయ్యకపోతే మానె, నేను నీతో ఈ విషయాన్ని మాట్లాడినట్టు ఎలాటి పరిస్థితుల్లోను ఎవరితోను చెప్పకు. అదే నాకు చాలు. లేకపోతే ఒకవేళ నా ప్రమేయం ఏమీ లేకుండా ఏ కార్‌ ఏక్సిడెంట్‌ లోనో మా ఆవిడ పోయినా నీ మాటలు విని పోలీసులు దాన్ని నా మీదికి నెడతారు” అన్నాడు.
“అది సరేననుకో, కాని అసలు నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో నీకు అర్థమౌతున్నదా? ఈ దేశంలో ఒక మనిషిని చంపటం ఎంత తీవ్రమైన నేరమో నీకూ తెలీదు? మిస్టరీ పుస్తకాల్నుంచి నేను నేర్చుకున్న ముఖ్యమైన పాఠం ఏమిటంటే హంతకుడు ఎంత మేధావి ఐనా సరే, ఏదో ఒక పొరపాటు చేస్తాడని, చట్టాన్నుంచి తప్పించుకోలేడని” అన్నాడు శివరాం అతన్ని అర్ధిస్తున్నట్టు.
“శివరాం! నేను న్యూస్‌ పేపర్లు చదవనని నీ నమ్మకం లా వుంది. జోన్‌ బెనే రామ్సీ హంతకుడు దొరికాడా చెప్పు? ఓజే సింప్సనే వాళ్ళావిడ నికోల్‌ని చంపాడని అందరూ అనుకోవడమే కాని అది ప్రూవయిందా? టీవీ నిండా ఏళ్ళపాటు వేలగంటలు చర్చించిన ఈ కేసులే తేల్లేదంటే ఇంక మనం విననివి ఎన్ని కేసులున్నాయో! వాళ్ళందరూ ఎలా తప్పించుకున్నారంటావ్‌?” విలాసంగా చూస్తూ అడిగాడు సయీద్‌.

ఒక్క క్షణం శివరాంకి మాటలు దొరకలేదు. “అది సరే, ఎంతో అన్యోన్యంగా వుంటారు కదా, హసీనాని చంపాలనే ఆలోచన నీకు ఎందుకు కలిగింది?” అనడిగాడు సయీద్‌ని.
సయీద్‌ ముఖం వివర్ణమయింది. కొంచెం సేపు కప్పు వంక చూశాడు. ఇంకొంచెం సేపు కిటికీ లోంచి చూశాడు. తిరిగి శివరాం వంక చూసేసరికి అతని ముఖం కోపంతో ఎరుపెక్కి వుంది. శివరాం వంక తీక్షణంగా చూశాడు.
“శివరాం! ఈ విషయం మరొక మనిషితో నేను అనలేదు, అనను. ఇది ఈ గది గోడలు దాటి బయటికెళ్తే పరిణామాలు చాలా తీవ్రంగా వుంటాయి. దయచేసి ఈ విషయం గుర్తుంచుకో. నేను నీకు చెప్పబోయేది పరమరహస్యమన్న మాట. ముందుగా నాకూ హసీనాకు ఎలా పెళ్ళయిందో చెప్తాను.

ఆమెను నేను తొలిసారి చూసినప్పుడు హసీనా వయస్సు పద్దెనిమిది. నాకు ఇరవై ఒకటి. అప్పుడే నా డిగ్రీ పూర్తయింది. మా అంకుల్‌ ఒకాయన హైదరాబాద్‌లో పనిచేస్తుండే వాడు. సెలవలకి రమ్మంటే వెళ్ళాను. వాళ్ళ పక్కింట్లో వుండే వాళ్ళు హసీనా వాళ్ళు. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం. అప్పటికీ ఆస్తులు పూర్తిగా పోలేదు. ఓ బట్టల షాపు వుండేది. బాగానే సంపాయిస్తుండే వాళ్ళు. అనుకోకుండా దొడ్లో ఒక రోజు చూశాను ఆమెని. ఎందుకో ఆమె నన్ను వెంటనే ఆకర్షించింది. అది ఆమె అందమో తెలీదు, విశాలంగా వుండే ఆమె కళ్ళో, ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూండే ఆమె నోరో ఏదో తెలీదు కాని ఆ రోజు నుంచి నాకు నిద్ర లేదు, ఆకలి లేదు, మనసు మనసులో లేదు. ఇంక వుండబట్టలేక ఒకరోజు మా అంకుల్‌తో చెప్పాను. ఆయన నవ్వి ఊరుకున్నాడు. చివరికి అక్కడినుంచి వచ్చేసే రోజు నేనే ధైర్యం చేసి హసీనాని పలకరించాను కాని అంతలో ఎవరో రావడంతో నా మనసులోని విషయం ఆమెకి చెప్పడం కుదర్లేదు. తిరిగి వచ్చాక కూడ ఎప్పుడూ ఆమెనే తల్చుకుంటూ వుండేవాణ్ణి. ఎలాగైనా ఆమెనే పెళ్ళిచేసుకోవాలని కలలు కంటూ వుండే వాణ్ణి.

అంతలో అనుకోకుండా వైటుకె ప్రాబ్లం గురించి అమెరికన్‌ కంపెనీలు హడావుడి పడడం, అందుకోసం ఇండియా నుంచి ఏదో ఒక డిగ్రీ వున్న ఎలాటి వాడైనా ఓ ఆర్నెల్ల ట్రైనింగ్‌ తో ఇక్కడికి వచ్చెయ్యడం మొదలైంది. నేను కూడ వెంటనే మళ్ళీ హైదరాబాద్‌ వెళ్ళి ఓ కోచింగ్‌ సెంటర్లో చేరాను. ఆర్నెల్లలో నా కోర్సు కావడమూ అమెరికాలో ఉద్యోగం దొరకడమూ జరిగిపోయాయి. అప్పుడే హసీనాకి పెళ్ళి సంబంధాలు చూస్తున్నట్లు తెలిసింది. ఇంక నేను ఆలస్యం చెయ్యలేదు. ఈ సారి నేరుగా వాళ్ళ నాన్న దగ్గరకే వెళ్ళి పరిచయం చేసుకొని ఇలా అమెరికా వెళ్తున్నానని, వాళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఇద్దరం కలిసి వెళ్ళాలని వున్నదని చెప్పాను. ముందు వాళ్ళంతా కొంత వెనకాడారు చూస్తూనే వున్నావుగా, నేనేం అందగాణ్ణి కాను. మొహాన స్ఫోటకం మచ్చలు పూర్తిగా పోలేదు. నీలాగా పొడుగ్గా సన్నగా వుండను. అమెరికా వీటన్నిటినీ జయించిందనుకుంటా. వెంటనే మా పెళ్ళయింది. ఇక్కడికి వచ్చేశాం. ఇది ఆరేళ్ళ నాటి మాట.

నువ్వన్నట్టు మేం అన్యోన్యంగానే వున్నాం కొంతకాలం. రానురాను నేను తనమీద కంటె ఉద్యోగం మీదే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నానని, తనని విసుక్కోవడం, పట్టించుకోకపోవడం చేస్తున్నానని సాధించడం మొదలుపెట్టింది. కొంత కాలక్షేపంగా వుంటుందని ఉద్యోగం చూసుకోమని ప్రోత్సహించాను. అలాగే ఏదో చిన్న ఉద్యోగం దొరికింది. అంతా సర్దుకున్నదనే అనుకున్నాను నేను. కాని..”

ఆగాడు సయీద్‌.
శూన్యంలోకి చూస్తూ, “శివరాం! హసీనా నన్ను చీట్‌ చేస్తున్నదని నా  అనుమానం” అన్నాడు సయీద్‌ గొణుగుతున్నట్లు.
“సయీద్‌! ఇలాటి విషయాల్లో తొందరపడకూడదు. ఆమె ఎఫైర్‌ నడుపుతున్నట్లు నీకు ఖచ్చితంగా తెలుసా?”
“ఖచ్చితంగా తెలిస్తే ఇలా ఆలోచిస్తూ కూర్చునేవాడినా? ఇద్దర్నీ ఒకసారే చంపి పారేసేవాడిని!” అతని కళ్ళ నుంచి నిప్పురవ్వలు రాలుతున్నాయి.
“పోనీ ఆ వ్యక్తి ఎవరై వుంటాడో తెలుసా? తెలిస్తే అట్నుంచి ఏదైనా చెయ్యడానికి ప్రయత్నం చెయ్యొచ్చు”
“అనుమానాలు వున్నాయి కాని ఆధారాలు మాత్రం లేవు. పోనీ డిటెక్షన్‌ వర్క్‌ చేద్దామా అంటే ఈ మేనేజీరియల్‌ రెస్పాన్సిబిలిటీస్‌ వల్ల పగలు ఎక్కడికీ వెళ్ళడానికి కుదరడం లేదు. నీకు కాస్త టైమ్‌ దొరికితే పోనీ నాకీ హెల్పన్నా చేసిపెడతావా?” ప్రాధేయపడుతున్నట్లు అడిగాడు సయీద్‌.
“తప్పకుండా! అది నా కనీస కర్తవ్యం. నా ప్రయత్నం నేను చేస్తాను. ఈలోగా మాత్రం నువ్వు తొందరపడి ఎలాటి అఘాయిత్యాలు చెయ్యనని మాటివ్వు”
“అలాగే! అయితే, నాకు నాలుగైదు రోజుల్లో ఏదో ఒక సమాధానం కావాలి”
“ఈ క్షణం నుంచి అదే పని మీద వుంటాను. నీకు తెలిసిన విషయాలన్నీ ముందు చెప్పు నాకు. అక్కడినుంచి నేను చూసుకుంటా”.

ఐదు రోజుల తర్వాత మళ్ళీ సయీద్‌ ఆఫీసులోకి వచ్చాడు శివరాం.
“సయీద్‌! నేను ఈ ఐదు రోజులుగా ఎంతో ట్రై చేశాను. హసీనాని ఆమెకు తెలియకుండా వెంటాడి ఆమె కలిసిన వాళ్ళందర్నీ కూడ చూశాను. వాళ్ళలో ఒక్క మగవాడు కూడ లేడని చెప్పడానికి నాకు ఎంతో ఆనందంగా వుంది. ఆమె నిన్ను చీట్‌ చెయ్యడం లేదు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. నువ్వింక నిశ్చింతగా వుండొచ్చు” అన్నాడు గబగబా.
“నువ్వు చెప్పింది నిజమేనని నా ఆశ కూడ! నీ సహాయానికి చాలా థేంక్స్‌. ఐతే ఈ విషయం పూర్తిగా మర్చిపోయే ముందు నేను కూడ నా కళ్ళతో చూస్తే బాగుంటుంది. కనుక ఒక పని చేద్దాం. రేపట్నుంచి మూడు రోజులు సెలవు తీసుకుంటాను నేను. నువ్వు కూడ తీసుకో. ఐతే ఈ విషయం హసీనాకి చెప్పకుండా నేను ఆమె ఎక్కడెక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో గమనిస్తాను. ఎందుకైనా మంచిది నువ్వు నన్ను వెంబడిస్తూ వుండు నేను ఆవేశపడి ఏ అఘాయిత్యమైనా చెయ్యబోతే అడ్డుకుందువు గాని. ఈ మూడు రోజుల్లో ఏమీ బయటపడకపోతే నువ్వు చెప్పింది నిజమేనని నమ్మి ఈ విషయం ఇంతటితో వొదిలేస్తాను. అలా కాకుండా ఏమైనా వుందని తేలిందా, వాళ్ళిద్దర్నీ నేనే షూట్‌ చేస్తాను” తాపీగా, ఎంతో లోతుగా ఆలోచించిన వాడిలా చెప్పాడు సయీద్‌. శివరాం అడ్డు చెప్పబోయాడు కాని అతను వినడని అర్థమై అందుకు ఒప్పుకున్నాడు.

ఆరోజు రాత్రి ఎవరో సయీద్‌ ఇంటి కిటికీకేసి ఓ ఇటుక రాయి విసిరారు. సెక్యూరిటీ అలార్మ్‌ మోగడం, పోలీసులు పరుగెత్తుకు రావడం కూడ జరిగాయి. పోలీసులు కంప్లెయింట్‌ రాసుకెళ్ళారు. ఐతే ఎవరు చెయ్యగలిగింది ఏమీ లేదని అందరికీ తెలుసు.

మర్నాడు కూడ ఎవరో ఇటుక విసిరి మరో కిటికీ పగలగొట్టారు. సయీద్‌ కోపంతో మండిపడ్డాడు. పోలీసులు మళ్ళీ వచ్చారు.

అయితే హసీనాకి సంబంధించినంత వరకు ఆ రెండు రోజులు ఎలాటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా గడిచిపోయాయి. 911 తర్వాత తన కారు మీద, ఇంటి మీద జరుగుతున్న అత్యాచారాల దృష్య్టా గన్‌ లైసెన్స్‌ తెచ్చుకుని కొనుక్కున్న వెపన్‌ని తన దగ్గరే పెట్టుకుని తిరుగుతున్నాడు సయీద్‌.
శివరాం అతన్ని జాగ్రత్తగా ఫాలో ఔతున్నాడు.

మూడో రోజు సాయంత్రం హసీనా మాల్‌కి వెళ్ళింది. అక్కడ ఒక స్టోర్‌లో ఆమె బట్టలు చూస్తుంటే ఎవడో తెల్లవాడొకడు ఆమె దగ్గరగా వచ్చి మాట్లాడాడు. ఆమె వాడితో నవ్వుతూ మాట్లాడడం దూరం నుంచి చూశాడు సయీద్‌. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇంకో వైపుకు వెళ్ళారు. అతని అనుమానం దృఢమైంది. అంతలో శివరాం వచ్చాడక్కడికి. ఆ పరిస్థితుల్లో సయీద్‌ హసీనా వెళ్ళిన వైపుకు వెళ్ళడం ఎవరికీ మంచిది కాదని, తను వెళ్ళి అసలు విషయం ఏమిటో గమనించి వస్తానని సయీద్‌ని నచ్చచెప్పి ఇంటికి పంపించి హసీనా వెళ్ళిన వైపు వెళ్ళాడు శివరాం.

ఇల్లు చేరి నిప్పులు కక్కుతూ పచార్లు చేయసాగాడు సయీద్‌. చీకటి పడుతున్నది. హసీనా ఇంకా ఇంటికి రాలేదు. అతని రక్తం ఉడికిపోతున్నది. తన దగ్గరున్న గన్‌తో ఆత్మహత్య చేసుకుందామా అనుకున్నాడు కాసేపు. ఏమీ తప్పు చెయ్యని తను ఎందుకు చావాలని సర్దిచెప్పుకున్నాడు.

క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయి. ఇంతలో ఓ ఇటుక వచ్చి మరో కిటికీకి తగిలింది. అద్దం పగిలి ముక్కలు భళ్ళున లోపల రాలాయి. గన్‌ తీసుకుని అతను బయటకు పరుగెత్తే సరికి ఓ కారు వేగంగా అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది. రొప్పుతూ అతను లోపలికి వచ్చేసరికి అంతలోనే తలుపు తెరుచుకొని హసీనా లోపలికి వచ్చింది.

రావడం తోనే ఎగిరి దూకి ఆమె జుట్టు పట్టుకున్నాడు సయీద్‌. “రాక్షసీ! నీ ఎఫైర్‌ ఎంత కాలం నుంచి సాగుతుంది, చెప్పు! చెప్పకపోయావో, ఈ పూట నీ చావు తప్పదు!” అరిచాడు. ఆమె పెనుగులాడింది. “నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలీడం లేదు” అని అరిచింది.

అప్పుడే అక్కడికి వచ్చాడు శివరాం. పగిలిన కిటికీ లోంచి లోపల జరుగుతున్నది లీలగా కనిపించిందతనికి. డ్రైవ్‌ వే లో కారు పార్క్‌ చేసి ఇంజన్‌ ఆపకుండానే అటుకేసి పరుగెత్తాడు. తలుపు పూర్తిగా మూసుకో లేదింకా. తెరుచుకుని లోపలికి పరిగెత్తాడు శివరాం.

సయీద్‌ చేతిలో గన్‌ వెంట వెంటనే రెండు సార్లు పేలింది. ఒకటి గుండెలోంచి చొచ్చుకుపోయింది. రెండోది కడుపులోంచి.

శబ్దం ఐనా చెయ్యకుండా నేలకూలాడు శివరాం!

“అయ్యయ్యో! ఎంతపని జరిగిపోయింది! వెంటనే 911 కి ఫోన్‌ చెయ్యి” అరిచాడు సయీద్‌, శివరాం మెడ కింద వేలు పెట్టి నాడి కొట్టుకుంటుందో లేదో చూస్తూ. హసీనా పరుగెత్తుకెళ్ళి ఫోన్‌ చేసింది. ఐదు నిముషాల్లో అంబులెన్స్‌ వచ్చింది. ఐతే అప్పటికే  శివరాం ప్రాణం పోయింది.

పోలీసులు వచ్చి అన్ని ఆధారాలన్నీ సేకరించారు. జరిగిన విషయాలన్నీ ఏమీ దాచకుండా వాళ్ళకి చెప్పాడు సయీద్‌.

వాళ్ళు హసీనాని కూడ ఇంటర్వ్యూ చేశారు. ఆమె కూడ అన్ని విషయాలు వాళ్ళకు చెప్పింది ఏ మాత్రం అబద్ధం చెప్పినా అది అనవసరమైన అనుమానాలకు దారి తీస్తుందని. మూడు నెలల నుంచి శివరాంతో ఎఫైర్‌ నడుపుతున్నట్లు హసీనా వాళ్ళకి చెప్పింది. ఐతే ఆ విషయం సయీద్‌కి తెలిసే అవకాశం లేదని ఆమె అభిప్రాయ పడింది ఎందుకంటే, శివరాం ఎప్పటికప్పుడు సయీద్‌ ఆలోచనల గురించి తనకు చెప్తూనే వున్నాడని, అందువల్ల గత వారం రోజులుగా తనని పట్టుకోవడానికి సయీద్‌ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని, దాన్ని బట్టి తేలేది సయీద్‌కి తన మీద అనుమానం వున్నదని తప్ప ఆ వ్యక్తి శివరామే నని తెలియదని వివరించింది. ఐతే మాల్‌లో ఎవరో తనకి పరిచయం లేని వ్యక్తి వచ్చి తన గర్ల్‌ ఫ్రెండ్‌కి బర్త్‌డే ప్రెజెంట్‌గా ఇవ్వడానికి ఓ మంచి పెర్‌ఫ్యూమ్‌ చూసిపెట్టమని అడిగితే అది చూసి బహుశ సయీద్‌ అపార్థం చేసుకున్నాడని చెప్పింది.

ఈ విషయాలేవీ సయీద్‌కి తెలియనివ్వలేదు వాళ్ళు.

కేసంతా పరిశీలించి చివరకు సయీద్‌ మీద ఎలాటి అభియోగాలు మోపకుండా వదిలేశారు.

“శివరాం! ఎలాటి మిస్టరీ పుస్తకాలూ చదవక పోయినా, నా చేతికి ఏ మాత్రం మట్టి అంటుకోకుండా నిన్నెలా లేపేశానో చూశావు కదా! మీ ఎఫైర్‌ సంగతి నెలరోజుల క్రితమే గ్రహించాను. అప్పట్నుంచి జాగ్రత్తగా ఓ పథకం వేసి, డబ్బిచ్చి మా ఇంటి మీద దాడులు జరిపించుకొని ఆ పేరుతో గన్‌ లైసెన్స్‌ తెచ్చుకుని, నిన్ను బొమ్మ లాగా ఆడించి నా ప్లాన్‌ ప్రకారం నీచేత పనులు చేయించాను! ఎంతో మనసు పడి, ప్రేమించి పెళ్ళి చేసుకున్న హసీనాని నీలాటి మిత్రద్రోహికి అప్పగించడమో లేకపోతే ఆమెని చంపి పోగొట్టుకోవడమో చేసేంత తెలివి తక్కువ వాణ్ణి కాను నేను!” అనుకున్నాడు సయీద్‌ తన చాకచక్యానికి గర్వపడుతూ.

తొలి ప్రియుడే ఇలా అయేసరికి హసీనా కూడ మళ్ళీ ఎఫైర్‌ల గురించిన ఆలోచనలు లేకుండా మసలుకోసాగింది.