సాక్షి

ఆంగ్ల మూలం “సయ్యెద్‌”
(“నాసీ” తన అమెరిగల్పికల ద్వారా “ఈమాట” పాఠకులకు పరిచితులే. రాసి లోనూ వాసి లోనూ కూడా చెప్పుకోదగ్గ కథకులు. ఎలెక్ర్టానిక్‌ పత్రికల్లోనే కాకుండా ఇండియా పేపర్‌ పత్రికల్లోనూ ఈ మధ్య విరివిగా ప్రచురిస్తున్నారు. డిట్రాయిట్‌లో ఉంటారు. ఈ కథ మరో ఎలెక్ట్రానిక్‌ వెబ్‌ సైట్‌ “సులేఖ”లో “సయ్యెద్‌” గారు రాసిన ఓ ఇంగ్లీష్‌ కథకి అనువాదం. )

వాడు తన ఖాకీ సంచీని బుజానికి తగిలించుకుని యింటికి బయల్దేరాడు. మధ్యాన్నం నించీ గాంధీ పార్కులో గుంపులు గుంపులుగా చేరిన కుర్రాళ్ళూ అమ్మాయిలూ చాలామంది అప్పటికే చెదిరి పోయారు, ఎవరో అప్పుడప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళు తప్ప. వాళ్ళలో కొంతమంది మొహాల మీద ఆంజనేయస్వామి బొట్లు పెట్టుకు నున్నారు పొడుగ్గా తిలకంలాగా. రోజంతా ఆ పార్కులో చేరి పేపర్లు చూస్తూనే వున్నారు ఆత్రంగా. ఆ పూట “యెస్సెస్సీ” రిజల్టు వచ్చిందంట పేపర్లో, అంగడిలో వాడి యజమాని సుబ్బయ్య శెట్టి అంటుంటే విన్నాడు వాడు. వీళ్ళంతా పేసయ్యారో లేదో చూసుకోటానికే నంట ఆ పేపర్ల మీదకి యెగబడ్డం. ఈ “యెస్సెస్సీ” గొడవేంటో వాడికి బొత్తిగా అర్థం కాలేదు, కానీ పేపర్ల కెగబడుతున్న వాళ్ళ ఆరాటం చూసి యిదేదో పెద్ద విషయమే అనుకున్నాడు.

గడియారం స్తంబం సెంటర్లో సోడా బడ్డీ మైకులో సినిమా పాట, మొన్నే వచ్చిన “చిరు” సినిమాలోది, చెవుల్తుప్పొదిలే లాగా వినిపిస్తోంది. వాడికా పాటంటే చాలా యిష్టం.
“పండు పండు పండు .. యెర్ర పండూ .. ఏపిల్‌ దాని పేరూ
యెర్ర పువ్వులుండూ .. బుజ్జి పండూ ..”
ఆ పాటలో వచ్చే ఎర్రటి ఏపిల్‌ పళ్ళంటేనూ, యింకా యెర్రటి పూలంటేనూ మరీ యిష్టం. ఆ పాట విన్నప్పుడల్లా యెర్రటి మంకెన పూలతో సింగారించిన బండి నిండా నిగనిగ లాడే యెర్రటి ఏపిల్‌ పళ్ళు రాసులు పోసినట్టుగా వాడిక్కళ్ళ ముందు కనిపిస్తుంది.
“పండు పండు పండు … యెర్ర పండూ ..” మైకుతో పాటు వాడూ పాటందుకున్నాడు. వాడి నడకలో ఒక వూపొచ్చింది. అంతలోకే వాళ్ళూరికి పోయేందుకు పట్టుకోవాల్సిన డొంకదారీ వచ్చేసింది. మెయిన్‌ రోడ్డు దిగుతూనే ఆ డొంక వరిచేల మధ్యగా పోయి, చెరుకు తోటల మధ్య మెలికలు తిరుగుతూ ముళ్ళకంపపాలెం చేరుస్తుంది.

చిరు పాట యిచ్చిన వూపుకి తోడు పచ్చటి వరిచేలని చూసేప్పటికి వాడికి ఎక్కళ్ళేని ఉత్సాహమూ వచ్చేసింది. ఆ రోజు మధ్యాన్నం దిక్కులు చూస్తూ డబ్బాలో పొయ్యాల్సిన కందుల్ని కింద పారబోసి నందుకు సుబ్బయ్య తిట్టిన తిట్లూ, కొట్టిన దెబ్బలూ .. అన్నీ మర్చిపోయి, వాడు డొంకదారి పట్టాడు గంతులేస్కుంటూ.

“హై, హైయ్య!” అదిలింపు వినిపిస్తే వెనక్కి తిరిగి చూశాడు. రెండెడ్ల బండొకటి మెల్లగా వస్తోంది డొంకలో. వాడు బండికేసి పరిగెత్తి, ఎగిరి వెనకాల ఎక్కేశాడు, ఎడ్ల నదిలిస్తున్న ముసలాయనతో మాటన్నా అడక్కుండానే. ఆ బండి యెట్లాగూ ఖాళీగానే పోతోంది, ఎడ్లకోసం కాబోలు, రెండు చొప్పకట్టలు మాత్రం వున్నై. వాడు బండిలో కాళ్ళూపుకుంటూ కూర్చున్నాడు చిరు పాటని గుసగుసగా పాడుకుంటూ. ఉన్నట్టుండి పాట ఆపి, “ఏం తాతా, యాడికి?” అనడిగాడు.
“కొత్తచిన్నయపాలెం”
“ఐతె, నేనేరుకాడ దిగుతలే”
అక్కడితో వాళ్ళ మధ్య మాటలైపోయినై.
“థెయ్‌ దీనమ్మ యెద్దుల్జావ!” అంటూ ముసలాయన వుత్తి పుణ్యానికి చెర్నాకోలని ఒక యెద్దు వీపుమీద మోగించాడు. ఆ దెబ్బతో రెండెడ్లూ కొంచెం జోరుగా అడుగేస్తున్నై.
కాళ్ళూపటంతోనూ, గుసగుసగా పాడుకోటంతోనూ వాడి హుషారు తీర లేదు.
“పండు పండు పండు … యెర్ర పండూ ..” వరిచేలు మారుమోగేట్టు గొంతెత్తి పాడుతున్నాడు. బండి చెక్రాలు చేసే “లట్‌ .. ఫట్‌ .. ఖట్‌” చప్పుళ్ళు వాడి పాటకి దరువేస్తున్నై.
“ఏం కుర్రకాయ్‌ చాన హుషారు గుండావే?” అన్నాడు ముసలాయన.
“మనం యెప్పుడింతె” నిర్లక్ష్యంగా చెప్పాడు వాడు. చెప్పేసి మళ్ళా పాటందుకున్నాడు.
“ధ .. ధ .. హై, హై” ముసలాయన యెడ్ల నదిలిస్తూనే వున్నాడు, మధ్య మధ్య వాడి హుషారు చూసి నవ్వుకుంటూ.
యేరు రాంగానే వాడు బండి దూకేసి చెరుకు తోటల మధ్యలోంచి సాగి పోయే డొంకలోకి పరిగెత్తాడు. కొంత సేపటిదాకా వాడికి బండి చప్పుళ్ళూ, ముసలాయన ఎడ్లని అదిలించడమూ వినిపిస్తూనే వున్నై.

యెదురుగా రైతు ఒకతను రెండు బర్రెల్ని తోలుకుంటూ వస్తున్నాడు.
“భో .. భో ..హోయ్‌ .. హోయ్‌”
బయల్లో పచ్చగడ్డి మేపుకుని వస్తున్నట్లుంది.
“ఏం బీ, బేగొచ్చినావె నేడు?” వాణ్ణడిగాడు రైతు అంత దూరాన్నించే. అతనికి వాడు బాగా తెలుసు, అతను అప్పుడప్పుడూ సుబ్బయ్య అంగడిలో బీడీలు కొనుక్కోటానికి వస్తూంటాడు.
“అయ్య పెండ్లికి పోనాడు.” అన్నాడు వాడు.
“రామయ్య పెండ్లికా?”
“ఆ!”
తన దగ్గిరగా పోతున్న బర్రె వీపు మీద ఒక్క చరుపు చరిచాడు వాడు నడక ఆపకుండానే.

బర్రెల్నీ, రైతునీ దాటి ఇంకొంచెం దూరం పోయాక ఒక చిన్న కప్ప పిల్ల డొంకలోకి వాడి ముందుకి దూకింది, పక్కనున్న చెరుకు చేల గట్టు మీంచి. దాన్ని చూసి ఠక్కున ఆగి పోయాడు వాడు సంబరంగా. చటుక్కున ఒక రాయి తీసుకుని చెయ్యి పైకెత్తాడు ఒక్క దెబ్బతో దాన్ని చంపేసేందుకు. అంతలో వాడికి బాషా చెప్పింది గుర్తొచ్చింది, కప్ప పిల్లని చంపితే మూగ పిల్లకాయలు పుట్టుకొస్తారని. చూస్తూ చూస్తూ దాన్నలా వొదిలెయ్యటానికీ మన సొప్పలేదు. అలాగని దాన్ని చంపి ఎప్పుడో వొచ్చే భవిష్యత్తులో మూగ పిల్లల్ని కనేంత పాపం కట్టుకోడమూ యిష్టం లేకపోయింది వాడికి. దాన్ని కొట్టేందుకు రాయి పైకెత్తిన చెయ్యి చప్పగా కిందకి జారిపోయింది. ఈ అవకాశం తీసుకుని కప్ప పిల్ల కాస్తా ఎగిరి అవతలి చేలోకి దూకేసింది.

ఇంతలోనే వాడి కింకో విషయం గూడా గుర్తొచ్చింది బాషా చెప్పింది. కప్పకి బదులు తొండని గనక చంపితే ఆకలితో వున్న వాడికి అర్ధ డబుల్‌ రొట్టి పెట్టినంత పుణ్య మొస్తుందని. చకచకా చుట్టూ వెతికాడు తొండ దొరుకుతుందేమో నని. పది గజాల దూరంలో చేని గట్టున వున్న చిన్న తాటి చెట్టు మట్ట మీద కనిపించిం దొకటి. వాడి చెయ్యి చురుగ్గా రాయి విసరడమూ, రాయికీ మట్టకీ మధ్య దాని తల పచ్చడవడమూ ఒక్ఖమాటే. బలే సంబరం వేసింది వాడికి ఆ రోజుకి ఒక మంచిపని చేసి పుణ్యం సంపాదించుకో గలిగి నందుకు. అది చూసేందుకు బాషా పక్కన లేక పోయాడని కొంచెం విచారించాడు గానీ, పోయిన వుత్సాహం తిరిగొచ్చేసింది.
“పండు పండు పండు … యెర్ర పండూ ..” మళ్ళీ హుషారుగా పాటందుకుని వూరివేపు అడుగేశాడు.

యెదురుగుండా పెద్ద రైలు బ్రిడ్జీ కంటి కగుపడింది. ఆ బ్రిడ్జీ చూసినప్పుడల్లా వాడికి ఎక్కళ్ళేని గర్వమూ మొలుచు కొస్తుంది. వాడి తాతకి తాత ఆ బ్రిడ్జీ కట్టాడని .. అంటే కట్టిన ముఠాలో కూలీగా పన్జేశాడని .. వాడి నాయన చెప్పాడు. తానే ఆ బ్రిడ్జీకి వోనరయినట్టు వాడికి ఆనందం.

దూరంగా “కూ” అంటూ రైలు కూత వినబడింది. అది వినేందుకు “భోంయ్‌” మన్నట్టుగా వుంటుంది, మరందరూ “కూ” అంటా రెందుకో వాడి కర్థం కాదు. డీసెలింజన్లు రాక ముందు బొగ్గులింజను వుండేదంట రైలుకి, అదలాగ కూ అంటూ కూసేదేమో మరి. అక్కడే కాసేపు నిలబడి రైలు తన బ్రిడ్జీ మీంచి పోవటం చూసి పోదా మనుకున్నాడు. ఎక్స్‌ప్రెసు రైలు బ్రిడ్జీ మీంచి పోయేటప్పుడు చేసే “ధడ ధడా” చప్పుడు వినడమూ, రైల్లో వాళ్ళకి “టాటా” చెప్పడమూ వాడికి చాలా యిష్టం. వాళ్ళ నాయన వాణ్ణి సుబ్బయ్య అంగడిలో పనికి పెట్టేముందు వాడు ప్రతీ రోజూ బ్రిడ్జీ దగ్గిరి కొచ్చి రైలుకి “టాటా” చెప్పేవాడు. పని మొదలెట్టాక అది కుదరట్లేదు, ఏదో ఇలా ఆటవిడుపు దొరికితే తప్ప. సుబ్బయ్య ఆదివారాలు కూడా అంగడి తెరిచే వుంచుతాడు ఏది ఏ వారమైనా వాడికి పని తప్పదు.

తన యజమాన్ని తల్చుకుని, “పీనాసి లంజకొడుకు” అని ముద్దుగా తిట్టుకున్నాడు వాడు, తుప్పల కడ్డం పడి బ్రిడ్జీ వేపు నడుస్తూ.
రైలు కూత మళ్ళీ వినిపించింది. రైలొచ్చేస్తుందేమో నని వాడు బ్రిడ్జీ వేపుకే చూస్తూ గబగబా నడుస్తుంటే, రైలుకట్ట వెంబడే ఒక మనిషి ఆకారం నీడ లాగా కదుల్తూ వాడికి కనిపించింది. ఎవరో మనిషి బ్రిడ్జీ ఎక్కుతున్నాడు .. ఎవరో అది? ఒక్క క్షణం ఆగి, కళ్ళని మసక చేస్తున్న చెమటని చొక్కా చేత్తో తుడుచుకుని తేరగా చూశాడు. మనిషి ఆనవాలు తెలీలా. ఆకారం మట్టుకు స్పష్టమైన నీడలాగా కనిపించింది. ఆ నీడని ఒక కంట కని పెడుతూనే వాడు మళ్ళీ గబగబా నడుస్తున్నాడు. ఆ నీడ బ్రిడ్జీ ఎక్కడంతో ఆగకుండా రైలుకట్ట మధ్యకి దిగింది. ఆ మనిషి అవతలి గట్టుకి వెళ్ళాలేమో ననుకున్నాడు వాడు. కదుల్తూ వున్న ఆ నీడ బ్రిడ్జీ మధ్యకి చేరుకోగానే చటుక్కున చతికిల బడింది రైలు కట్ట మీద. అరెరే, కట్టమీ దుండే కంకర్రాయి ఏదన్నా గుచ్చుకుందేమో కాల్లో. ఆ మనిషి లేచే లోపలే రైలొచ్చేస్తే! వాడు ఒక్క పరుగున రైలు కట్ట చేరుకున్నాడు. వాడున్న చోటికి బ్రిడ్జీ ఇంకా చాలా దూరం వుంది. కానీ ఇక్కణ్ణించి వాడికి బ్రిడ్జీ రైలుకట్ట స్పష్టంగా కనిపిస్తోంది. రైలుకట్ట మీది మనిషి లేచే ప్రయత్నమేమీ చెయ్యక పోగా, పైపెచ్చు హాయిగా కట్ట కడ్డంగా వెల్లికిలా పడకేశాడు. జరుగుతున్న దేమిటో వాడికి క్షణంలో అర్థమైంది. అక్కణ్ణించి వాడు పరుగందు కున్నాడు, రైలొచ్చే లోగా బ్రిడ్జీ చేరుకోవాలని.

రైలు మళ్ళీ కూత వేసింది. యింకా ఎక్కడో దూరంగానే వుంది గానీ చాలా తొందరగా దగ్గిరి కొచ్చేస్తున్నట్టు అనిపించింది వాడికి. ఈదురుగాలికి బొత్తాలు లేని వాడి చొక్కా అంచులూ, బుజానికి తగిలించిన సంచీ రెపరెపలాడి పోతున్నై వాడి పరుగుతో. మసకబారి పోతున్న వెలుగులో దూరంగా రైలు లైటు అగుపడింది. చుక్కలా మొదలైంది క్షణ క్షణానికీ పెద్దదవుతూ వచ్చేస్తోం దొచ్చేస్తోంది. అదొచ్చేసే లోపలే బ్రిడ్జీ చేరుకోవాలి.

కసిక్కిన దిగింది ముల్లు, చెప్పుల్లేని అరికాల్లో. ముల్లు దిగిన నొప్పికూడా తెలీలా వాడికి బ్రిడ్జీ, రైలు కట్ట మీద పడుకున్న మనిషి నీడా, వచ్చేస్తున్న రైలూ, వీటి ధ్యాసలో. వొంటికాలి మీద బేలెన్సు చేస్తూ అనాలోచితంగానే ముల్లుని పీకేసి, గుచ్చుకున్న చోట రెండు బొటన వేళ్ళతోనూ వొత్తాడు. ఒక రక్తబ్బొట్టు బయటకొచ్చింది, యెర్ర పువ్వులాగా. దాన్ని అరచేత్తో తుడిచేసి మళ్ళీ వొత్తాడు. యింకో చిన్న బొట్టు తొంగి చూసింది. దాన్నీ తుడిచేసి మళ్ళీ వొత్తాడు. ఏవీ రాలా. కాలు కిందకి దించి బ్రిడ్జీ వేపు చూశాడు. రైలు బాగా దగ్గిరి కొచ్చేసింది బ్రిడ్జీకి. దాని లైటు పడి యినుప వొంటి బ్రిడ్జీ అంతా యెర్రగా మెరుస్తోంది.

డీసెలింజను “భోంయ్యి”మంది అనవసరంగా.
రైలు కట్ట వేపు చూశాడు. కట్ట కడ్డంగా పడుకునున్న నీడ అలాగే వుంది. ఇంకా యెంతో సేపు లేదు. కాళ్ళ బలమంతా వుపయోగించి బ్రిడ్జీ మీదికి పరిగెత్తాడు వాడు, కింద పడ్డ సంచీని కూడా మర్చిపోయి. వాడు ఇటునించి .. రైలు అటునించి. ఆ నీడకి దగ్గిరయ్యే కొద్దీ దాని మొహమూ, ఆకారమూ వాడి కళ్ళకి కొంచెం స్పష్టంగా కనబడుతున్నై రైలు లైటు వెలుగులో. ఆ మొహం వాడికి పరిచయ మైందే, ఒక అబ్బాయిది. ఆ అబ్బాయిది పక్క వూరే. అప్పుడప్పుడూ సుబ్బయ్య అంగడిలో చాక్లెట్లూ బిస్కెట్లూ కొంటుండే వాడు. అంతే గానీ ఎవరబ్బాయో, పేరేంటో వాడికి తెలీదు.
రైలు బ్రిడ్జీ ఎక్కనే ఎక్కేసింది. రైలు చెక్రాలు వేసే దరువుకి బ్రిడ్జీ అంతా పూనక మొచ్చినట్టు వూగిపోతోంది.
“ధాక్‌ ఢక్‌ ధఢా ధక్‌ .. ధాక్‌ ఢక్‌ ధఢా ధక్‌ ..” ఆపలేని వోపలేని పొంగి పొర్లే వెల్లువ లాగా విరగబడి పోతోంది ఆ చప్పుడు. అహం బ్రహ్మాస్మి అన్నట్టు ఆ చప్పుడు అంతటినీ తనలో కలిపేసు కుంటోంది. యింజెను నెత్తిని లైటు ఇంకో సూర్యుడి లాగానూ, నాగుపాము పడగమీది నాగమణి  లాగానూ మండిపడి పోతోంది.

వాడు బ్రిడ్జీ అంచుకు చేరిపోయాడు. “భోంయ్యి”మని మళ్ళీ కూసింది రైలు తొందర పడిపోతూ. బ్రిడ్జీ గట్టు వాడికి నడు మెత్తుకి వుంది. వాడు రెండు అరచేతుల్నీ గట్టుమీద ఆనించి, ఆ వూతంతో “హుష్‌”మంటూ ఎగిరి గట్టు మీద కెక్కాడు. కాళ్ళు గట్టు మీద ఆనుతూనే ఛెంగున నిలబడి కట్ట మీద పడుకు నున్న అబ్బాయికేసి చూశాడు. ఆ అబ్బాయి అలా పడుకునే వున్నాడు వాడికి పదంగల దూరంలో. ఆ అబ్బాయి కళ్ళు వాడి కళ్ళల్లోకి చూశాయి .. ఆ కళ్ళల్లో ఏ భావమూ లేదు. నుదుటి మీద మాత్రం పొడుగ్గా ఆంజనేయస్వామి వారి సిందూరం బొట్టు వుంది నెత్తుటి చారిక లాగా.
సమయానికి బ్రిడ్జీని చేరుకో గలిగినందుకు వాడు సంబర పడ్డాడు. ఆ సంబరంలో వాడికి తెలీకుండానే గుసగుసగా పాటొచ్చేసింది.
“పండు పండు పండు … యెర్ర పండూ ..”
రైలు చెవులు చిల్లులు పడేలా, గుండెలవిసిపోయేలా “భోంయ్యి”మని ఆఖరుగా ఒక్ఖ కూత వేసి బ్రిడ్జీ దాటేసింది వాడు నించున్న గట్టు పక్కనించే.

ఇంతకు ముందల్లా యిలా జరిగిందని యెవరో చెప్పగా వినడమే, యెప్పుడూ చూళ్ళేదు. ఇదే మొదటి సారి వాడు చూడ్డం ఒక మనిషి చచ్చిపోవడాన్ని.


ఎస్‌. నారాయణస్వామి

రచయిత ఎస్‌. నారాయణస్వామి గురించి: కథకుడిగా, అనువాదకుడిగా, సమీక్షకుడిగా అమెరికాలోనూ, ఇండియాలోనూ, బ్లాగుల లోకంలోనూ పేరు గడించిన ఎస్‌. నారాయణ స్వామి అమెరికా ఆంధ్రుల జీవన తలాల్లో కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తున్న కథకుడిగా ఈమాట పాఠకులకు చిరపరిచితులు.  ...