1972లో, ఒక ప్రముఖ హిందీ నటుణ్ణి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా పిలిచారు. ఆయన ప్రసంగ పాఠమే ఇది. ఈ వ్యాసంలో చెప్పిన విషయాలు ఇప్పటికీ చెక్కు చెదరని వాస్తవాలని నేననుకుంటున్నాను. అప్పటి పరిస్థితికంటే అధ్వాన్నంగా ఉంది నేడు. మన దేశంలో స్ఫూర్తినిచ్చే నాయకులు లేరు. నడిపించే వారు లేరు. సామాన్యుడి జీవితం రెండు ధృవాల మధ్యనే ఇరుక్కుపోయింది. ఒకటి రాజకీయం; రెండు సినిమాలు. దేశమూ, యువతా ఎటు వెళుతున్నాయో తెలియని అయోమయ స్థితిలో ఉన్నామనిపిస్తోంది. ప్రతిభావంతుడికీ, పనికిరానివాడికీ వ్యత్యాసం లేకుండా పోతోందనిపిస్తోంది. మంచికీ, చెడుకీ భేదం చెరిగిపోతోందన్న సంశయం ఆవరించుకుంటోంది. ఇటువంటి సమాజంలో ఉన్న మనమందరం, కొన్ని క్షణాలు వెచ్చించి తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఈ ప్రసంగంలో ఉన్నాయి. ఈ ప్రసంగానికి నలభయ్యేళ్ళు దాటినా ఇందులో చాలా విషయాలు ఇప్పటికీ వర్తిస్తాయని నేననుకుంటున్నాను.
ఎంతో స్ఫూర్తిదాయకమయిన ఆ ప్రసంగం చేసిన ప్రముఖ హిందీ నటుడి పేరు, బల్‌రాజ్ సాహని.
దాదాపు ఇరవయ్యేళ్ళ క్రిత్రం, దో బిఘా జమీన్ చిత్ర దర్శకులు బిమల్ రాయ్‌నీ, వారి బృందాన్నీ గౌరవపూర్వకంగా సత్కరించాలని కలకత్తా ఫిల్మ్ జర్నలిస్టు సంఘం నిశ్చయించింది. అదొక ఇంపైన నిరాడంబరమైన వేడుక. ఆ సభలో పదునైన ప్రసంగాలు జరిగాయి. కానీ ప్రేక్షకులందరూ బిమల్ రాయ్ ప్రసంగం కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. నేను బిమల్ రాయ్ పక్కనే తివాచీ మీద కూర్చున్నాను. బిమల్ దా వంతు రాగానే అతనిలో సభాకంపం గమనిస్తూనే ఉన్నాను. చేతులు నలుపుకోవడం చూస్తూనే ఉన్నాను. ఆయన వంతు వచ్చాక రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ -“నేను చెప్పదలుచుకున్నదంతా నా సినిమాల్లో చూపించాను. ఇంతకు మించి ఏమీ చెప్పడానికి లేదు,” అనేసి కూర్చుండిపోయారు.
ఆనాడు బిమల్ రాయ్ తన చర్యలో చెప్పకనే చాలా చెప్పారు. ఈనాడు, నేనూ ఆయన్ని అనుసరిద్దామని ఊగిసలాడాను. కానీ ఇంత గొప్ప విశ్వవిద్యాలయం మీద నాకున్న భక్తి ప్రపత్తుల వలన, అలాగే శ్రీ పి. సి. జోషీ పైన నాకున్న అపారమయిన గౌరవం వలన, నేను అలా చేయకూడదని అనుకున్నాను. ఆయనతో నాకున్న అనిర్వచనీయమైన సాంగత్యం ఎంతో ఋణపడేలా చేసింది. ఈ సభలో ప్రసంగించమని ఆయన నుండి పిలుపు వచ్చినప్పుడు కాదనలేకపోవడానికి ఇవే ముఖ్య కారణాలు. ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణం శుభ్రపరచమని నన్ను పిలిచినా ఎంతో సంతోషంగా ఒప్పుకునేవాణ్ణి. ఎందుకంటే, అదొక్కటే నాకున్న పెద్ద అర్హత.
దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను ఇక్కడ అణకువ, వినయమూ ప్రదర్శించడం లేదు. మీరు నేను చెప్పేదాంతో ఏకీభవించినా, లేకపోయినా, ఇటువంటి అపురూపమైన సందర్భంలో నేను ఆత్మసాక్షిగానే మాట్లాడుతున్నాను. గత పాతికేళ్ళుగా నేను ఈ విద్యాప్రపంచానికి దూరంగా ఉన్నానని మీకు తెలిసే ఉంటుంది. విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో నేనెప్పుడూ ప్రసంగించలేదు కూడా.
ఈ విద్యాప్రపంచానికి దూరంగా ఉండడం నా అంతట నేను కోరుకుని చేసినది కాదు. మన దేశంలో ప్రస్తుత సినిమా నిర్మాణ పరిస్థితుల వల్లే ఇలా జరిగింది. ఈ సినిమా ప్రపంచం నటులకి గోళ్ళు గిల్లుకుంటూ కాలక్షేపం చేయడమయినా ప్రసాదిస్తుంది లేదా బయట ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయేటంతటి ఊపిరి సలపని పనైనా ఇస్తుంది. నటులు తమ వ్యక్తిగత జీవిత సుఖాలని త్యాగం చేయడమే కాదు, విజ్ఞాన సముపార్జననీ, ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాన్నీ కూడా కోల్పోవలసి వస్తుంది. గత పాతికేళ్ళుగా సుమారు 125 పైగా సినిమాల్లో నటించి ఉంటాను. కానీ ఇదే కాలంలో పాశ్చాత్య నటులయితే ముప్ఫయ్యో లేదా ఆ పైన ఇంకో అయిదో, పదో ఎక్కువ సినిమాల్లో మాత్రమే నటించి వుంటారు. కొన్ని వందల పుస్తకాలు చదవాల్సిన నేను ఒక్కటీ ముట్టలేదు. ఎన్నో కార్యక్రమాలు చూస్తూండగానే దూరమయ్యాయి. ఒక్కోసారి ఇవన్నీ కోల్పోయానని నిరాశకు గురవుతాను. నేను నటించిన 125 సినిమాల్లో ఎన్ని ఉత్తమ చిత్రాలున్నాయని ఎంతో నిస్పృహతో నన్ను నేనే ప్రశ్నించుకుంటాను. ఇందులో ఎన్ని గుర్తుండిపోయే చిత్రాలు? ఏ కొద్దో ఉంటాయి. వేళ్ళ పైన లెక్కపెట్టవచ్చు. అవి కూడా మరుగున పడిపోయుండాలి లేదా త్వరలోనే పడిపోవచ్చు కూడా.
అందుకే నేను వినయం ప్రదర్శించడం లేదని చెప్పాను. ఈ ప్రసంగం ద్వారా మిమ్మల్ని నిరాశపరిస్తే నన్ను క్షమించమని ముందే వేడుకుంటున్నాను. బిమల్ రాయ్ చెప్పింది అక్షర సత్యం. నటించడమే నటుడి ప్రపంచం! అందువల్ల నేను, నా నటనానుభవాలూ, నా పరిశీలనలూ మాత్రమే పంచుకుంటాను. మిగతావి ఏం చెప్పినా డాంబికమే అవుతుంది. నా కాలేజీ రోజుల్లో జరిగిన ఒక సంఘటన గురించి చెబుతాను. అది ఇప్పటికీ నా మనస్సులో స్థిరంగా ఉండిపోయింది. ఆనందంగా వేసవి శలవలు గడపాలని మా కుటుంబం రావల్పిండి నుండి కాశ్మీర్ వెళుతున్నాం. ముందురోజు రాత్రి భారీ వర్షం వలన కొండచరియలు కూలి, రహదారి కొట్టుకుపోయి, మేం మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. రహదారి ఎప్పుడు బాగుపడుతుందాని ఎంతో అసహనంగా ఎదురుచూస్తున్నాం. ఆ కొండచరియ కిరుపక్కలా దారిపొడవునా కార్లు, బస్సులు నిలిచిపోయాయి. పి.డబ్ల్యూ.డి పనివారికి ఆ రహదారి బాగుచెయ్యడం ఒక దుస్సాధ్యమైన విషయం. ఆ రోడ్డు బాగుపడడానికి కొన్ని రోజులు పట్టింది. తమ అసహనాన్నీ, నిరసననీ తెలియజేస్తూ అక్కడున్న డ్రైవర్లూ, ప్రయాణీకులూ ఆ పనిని మరింత దుర్భరం చేశారు. చుట్టుపక్కలున్న గ్రామ ప్రజలు కూడా ఆ నగరవాసుల తలబిరుసుతనం చూసి చికాకు పడ్డారు.
ఓరోజు ఉదయం ఆ రహదారి బాగుపడిందని అక్కడున్న సూపర్వైజరు ప్రకటించాడు. డ్రైవర్లకి పచ్చ జెండా ఊపాడు. వింతగా, రోడ్డు కిరుపక్కలా ఉన్న ఏ డ్రైవరూ ముందుకెళ్ళడానికి సిద్ధంగా లేరు. అక్కడే నుంచుని రోడ్డు కావలివైపున ఉన్న వారిని చూస్తూ నిలబడ్డారు. ఆ ప్రత్యామ్నాయ రహదారి సురక్షితం కాదనడంలో సందేహం లేదు. ఒక పక్క పెద్ద కొండ; మరొక పక్క చిన్న ఇరుకుదారిని ఆనుకొని ప్రవహిస్తున్న నది – రెండూ భయాన్ని కలిగించేవే! ఆ సూపర్వైజరు ఎంతో శ్రద్ధగా, బాధ్యతతో ఆ రహదార్ని పరీక్షించాకే పచ్చజెండా ఊపాడు. అంతకు ముందురోజు వరకూ ఆ పనివాళ్ళ తీరునీ, సోమరితనాన్నీ విమర్శిస్తూ వచ్చిన ప్రయాణీకులెవరూ ఆ సూపర్వైజరు మాటలని విశ్వసించడానికి సిద్ధంగా లేరు. అందరూ మౌనంగా చూస్తూ ఉండిపోయారు. ఒక్కరు కూడా కదల్లేదు. ఇంతలో హఠాత్తుగా ఒక చిన్న స్పోర్ట్స్ కారు అటుగా వస్తూ చూశాం. దాన్ని ఒక ఆంగ్లేయుడు నడుపుతున్నాడు. ఆ కారులో అతనొక్కడే ఉన్నాడు. అక్కడ బొమ్మల్లా నిల్చున్న మమ్మల్నీ, దారి పొడవునా మొరాయించిన కార్లనీ చూసి ఆశ్చర్యపోయాడు. సూటూ, బూటులో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న నన్ను చూసి, ఏం జరిగిందని అడిగాడు.
జరిగినదంతా చెప్పాను. అతను గట్టిగా పగలబడి నవ్వి, హారన్ కొట్టుకుంటూ ఏమాత్రం సంకోచం లేకుండా ఆ చిన్నదారి గుండా వెళిపోయాడు. అంతే! అక్కడి పరిస్థితి తారుమారయ్యింది. ప్రతీ ఒక్కరూ తామే ముందు వెళ్ళాలన్న తొందరలో అక్కడి పరిస్థితి అస్తవ్యస్తంగా తయారయ్యింది. కారు ఇంజన్ల మోతతోనూ, హారన్లతోనూ ఆ ప్రదేశం దద్దరిల్లిపోయింది.
స్వేచ్ఛా వాతావరణంలో పెరిగిన ఒక మనిషి ఆలోచనలకీ, దాస్యానికి గురైన మనిషి దృక్పథానికీ మధ్యనున్న తేడా అప్పుడు తెలిసింది. ఆ క్షణం నా కళ్ళు తెరుచుకున్నాయి. స్వేచ్ఛ ఉన్నవాడికి ఆలోచించి, నచ్చిన నిర్ణయం తీసుకునే శక్తి వుంటుంది. బానిసలకు అది వుండదు. ఎప్పుడూ పక్కవారి సలహాలపైనే ఆధారపడుతూ, డోలాయమానంగా నిర్ణయాలు స్వీకరిస్తూ, అందరూ వెళ్ళే దారిలోనే ప్రయాణించాల్సి వస్తుంది. ఆ సంఘటన నాకొక విలువైన పాఠం నేర్పింది. నా జీవితగమనాన్ని నిర్దేశించింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ సంతోషంగా, నాకు నేనే నిర్ణయాలు తీసుకునేలా చేసింది. పరిపూర్ణ స్వేచ్ఛా వాయువులు పీల్చే అనుభవం నాకిచ్చింది. నేనొక స్వేచ్ఛాజీవిని అనుకున్నాను. నాలో ఆత్మవిశ్వాసం అచంచలంగా పెరిగింది. జీవితం అంటే ఏవిటో తెలిసి, అప్పటినుండీ జీవితాన్ని సంతోషంగా స్వీకరించడం మొదలుపెట్టాను.
నిజానికి అటువంటి సందర్భాలు అరుదుగా ఎదురవుతాయి. నాలో ఆత్మవిశ్వాసం నశించి మరొకరి తెలివితేటలపైన ఆధారపడవలసిన సందర్భమే ఆ తరువాత రాలేదు. మధ్యతరగతి నుండి వచ్చిన నేను కుటుంబ విలువలు, ప్రమాణాలు పాటిస్తూనే స్వంత నిర్ణయాలు ఎన్నో తీసుకున్నాను. ఏ మాత్రం కష్టం కలగకుండా చూసుకునేవాణ్ణి. దరిమిలా నేనొకలా ఆలోచిస్తూ, మరో విధంగా ప్రవర్తించేవాణ్ణి. అందువల్ల దేనికీ కొరగాకుండా పోతున్నానన్న భావన కలిగేది. కొన్ని నిర్ణయాలు చిన్న చిన్న సంతోషాలకు నష్టం కలిగించేవి. ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడల్లా జీవితం భారంగా అనిపించేది.
ఇంతకు ముందు, మీకు ఒక ఆంగ్లేయుడి గురించి చెప్పాను. ఎందువల్లనంటే ఆ సమయంలో నాకు కలిగింది ఆత్మన్యూనతా భావం. అలా కాకుండా వుంటే సరిగ్గా ఆ ఏడాదిలోనే ఉరితీయబడ్డ సర్దార్ భగత్ సింగ్ గురించి చెప్పుండేవాణ్ణి. లేదా ఆత్మధైర్యం అధికంగా వున్న ఏ మహాత్మా గాంధీ గురించో ప్రస్తావించుండేవాణ్ణి.
కాలేజీ చదివే రోజుల్లో నాకింకా గుర్తు. సత్యము, అహింస వంటి ఆదర్శ సూత్రాలతో ఆంగ్లేయుల సార్వభౌమత్వాన్ని ఓడించవచ్చన్న గాంధీ ఆదర్శాలను చూసి మా వూళ్ళో ఎంతో మంది మేధావులు, పండితులు అదంతా ఒఠ్ఠి మూర్ఖత్వంగా భావించేవారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తుందన్న నమ్మకం మా వూళ్ళో ఒక శాతం జనాభాకి కూడా లేదు. కానీ గాంధీకి తనమీద నమ్మకముంది. దేశమ్మీద వుంది. ప్రజల మీద వుంది. మీరు నందలాల్ బోస్ చిత్రీకరించిన గాంధీ చిత్రపటాన్ని చూసే ఉంటారు. అది చిత్రపటం కాదు; ఆత్మవిశ్వాసానికీ, ఆత్మధైర్యానికీ నమూనా.
నేను కాలేజీలో చదివే రోజుల్లో మహత్మా గాంధీ వల్ల కానీ, భగత్ సింగ్ వల్ల కానీ ప్రభావితం కాలేదు. నేను పంజాబు లాహోర్ గవర్నమెంట్ కాలేజీలో ఇంగ్లీషు సాహిత్యంలో ఎం.ఏ. చేశాను. ప్రతిభావంతులైన విద్యార్థులకే అక్కడ సీటు లభించేది. దేశవిభజన జరిగాక నా సహాధ్యాయులందరూ ఇండియా, పాకిస్తాన్లలో అటు సమాజంలోనూ, ఇటు ప్రభుత్వ రంగంలోనూ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆ కాలేజీలో ప్రవేశానికి ముందు, మేము ఏ రకమయిన రాజకీయ ఉద్యమాల్లోనూ పాల్గొనమని మా చేత హామీ పత్రం రాయించుకునేవారు.
ఈ ఏడాది మనం స్వాతంత్ర్య రజతోత్సవాలు జరుపుకుంటున్నాం. కానీ మన బానిస మనస్తత్వాన్నీ, ఆత్మన్యూనతనీ కోల్పోయామని గుండెమీద చెయ్యేసుకొని చెప్పగలమా? సామాజికంగా, సంస్థాగతంగా మన ఆలోచనలూ, నిర్ణయాలూ, ఇంకా మన చర్యలూ – ఇవన్నీ మన సొంతమేననీ, అరువు తెచ్చుకున్నవి కావనీ నిర్భయంగా చెప్పగలమా? మనకింకా మానసిక స్వాతంత్ర్యం వచ్చిందా? మన కాళ్ళ మీద మనం ఉన్నామని ధైర్యంగా చెప్పగలమా? లేక పై మెరుగులకోసమే కృత్రిమ స్వాతంత్ర్యం ప్రదర్శిస్తున్నామా?
నేను పనిచేసే సినిమా రంగం వైపు కాసేపు మీ దృష్టి మళ్ళిస్తాను. మన సినిమాల గురించి చెప్పబోతే మీరందరూ నవ్వుకుంటారని నాకు తెలుసు. తెలివైన వారి దృష్టిలోనూ, విద్యావంతుల దృష్టిలోనూ ఈ సినిమాలన్నీ ఒక పెద్ద తమాషా. అందులో కథలన్నీ అసహజత్వంతో, పిచ్చిగా, తర్కవిరుద్ధంగా ఉంటాయి. అందులో కనిపించే రచనా పద్ధతి, సాంకేతిక పరిజ్ఞానం, పాటలు, నృత్యాలు, ఇవన్నీ గుడ్డిగా మక్కీకి మక్కీ పాశ్చాత్య దేశాల సినిమాలనుండి తెచ్చుకున్నవే. చాలా సినిమాల్లో సన్నివేశాలు విదేశీ చిత్రాలనుండి స్ఫూర్తి పొందినవే! మమ్మల్ని చూసి మీరందరూ నవ్వుకోవడంలో ఆశ్చర్యపోయే విషయమేమీ కాదు. అప్పటికీ, మీలో కొందరు గొప్ప తారలు కావాలని కలలుకంటూ ఉండవచ్చు కూడా.
కానీ హిందీ సినిమాలు చూసి మీలా నేను నవ్వలేను. ఎందుకంటే అది నాకు అన్నం పెడుతోంది. నాకు ఎంతో పేరునీ, ప్రతిష్టనీ, సంపదనీ ఇచ్చింది. ఈ రోజు నాకు లభించిన ఈ గౌరవానికి నేను కొంతయినా సినిమా రంగానికి ఋణపడి వుంటాను.
నేను మీలాగ విద్యార్థిగా ఉన్నప్పుడు, లలితకళల మీద తెల్లవాళ్ళకే గుత్తాధికారం ఉందన్నట్లు మా ఆంగ్ల, ఆంగ్లేతర ఉపాధ్యాయులందరూ మమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నించేవారు. గొప్ప సినిమాలు, గొప్ప నాటకాలు, నటన, చిత్రలేఖనం వంటివి కేవలం యూరోపు, అమెరికా దేశాల్లోనే సాధ్యం; కళాత్మక ప్రదర్శనకు కావల్సిన సున్నితత్వం భారతీయ భాషా సంస్కృతుల్లో లేదు. ఇలాంటి వెనుకబడిన అంశాలు చాలా వున్నాయంటూ చెప్పేవారు. ఇవి మాకు కష్టం కలిగించేవి. మేం పైకి ఆవేశపడ్డా లోలోపల వారి అభిప్రాయాన్ని కాదనలేక పోయేవాళ్ళం.
ఆ పరిస్థితి ఇప్పుడు చాలా మారిపోయింది. మనకి స్వాతంత్ర్యం వచ్చాక ప్రతీ కళారంగంలోనూ విశేషమయిన అభివృద్ధి వచ్చింది. సత్యజిత్ రాయ్, బిమల్ రాయ్ వంటి వారు ప్రపంచ ప్రసిద్ధ సినిమా దర్శకులుగా పేరొందారు. ఎంతోమంది నటులు, కెమేరామెన్లు, సాంకేతిక నిపుణులు, ప్రపంచ స్థాయికి ఎదిగారు. స్వాతంత్ర్యం రాకమునుపు సంవత్సరానికి మహా అయితే పదో, పదిహేనో సినిమాలు వచ్చేవి. కానీ ఈనాడు మనది ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా నిర్మాణరంగం. మన దేశంలోనే కాదు. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, ఇరాన్, సోవియట్ యూనియన్, ఈజిప్ట్, ఇంకా ఎన్నో అరబ్బు దేశాల్లో మన సినిమాలు ప్రజాదరణ పొందాయి. తిరుగులేని హాలీవుడ్ గుత్తాధిపత్యానికి గండి కొట్టాం.
సామాజిక దృక్పథం పట్ల మన సినిమారంగం ఇంకా ఎంతో బాధ్యత తోనే వ్యవహరిస్తోంది. పాశ్చాత్యదేశాల్లో ఇది పూర్తిగా కొరవడింది. శృంగారాన్నీ, హింసనీ పెట్టుబడిగా పెట్టి లాభాలు ఆర్జించడంలో మునిగి తేలుతున్న అమెరికా చిత్రరంగంతో పోలిస్తే మనం చాలా నియమబద్ధంగానే ఉన్నాం. మనం వాళ్ళని అనుకరిస్తున్నాము, కాపీ కొడుతున్నామన్న తప్పిదం పైన చెప్పిన మంచిని చెరిపేస్తోంది. మనం పాతబడిన రొడ్డకొట్టుడు సినిమాలే తీస్తున్నాం. మన దేశం గురించి సహజంగా, సున్నితంగా అందర్నీ ఒప్పించే మనదైన సొంత బాణీలో సినిమాలు తీసే ధైర్యం మనకింకా లేదు.
ఇవి మన హిందీ, తమిళ బాక్సాఫీసు సినిమాలు చూసి అనడం లేదు. బెంగాలీ, హిందీ, మళయాళ భాషల్లో వచ్చిన అభ్యుదయ సినిమాలు చూసిన తరువాతనే ఈ ఆరోపణ చేస్తున్నాను. ఇప్పటికీ సత్యజిత్ రాయ్, మృణాల్ సేన్, సుఖదేవ్, బసు భట్టాచార్జీ, రాజేంద్ర సింగ్ వంటి ప్రముఖుల చిత్రాలని శ్లాఘించడంలో వెనుకాడను. ప్రతిభ విషయంలో వారికి అపారమైన గౌరవ ప్రతిష్టలున్నాయి. కానీ ఇటలీ, ఫ్రాన్స్, స్వీడన్ వంటి దేశాల్లో వచ్చిన ఫేషన్ ప్రభావం వీళ్ళ సినిమాల మీద కూడా వుంది. వీళ్ళందరూ కూడా కొత్త పుంతలు తొక్కుతారు; అదీ వేరొకరి బాటలోనే.
నాకు కొద్దిగా ఆసక్తి వున్న సాహిత్యరంగంలో కూడా ఇదే ధోరణి చూశాను. ఒక్క సోవియట్ యూనియన్ మినహాయించి, పాశ్చాత్య పోకడలను అలవోకగా గ్రహించే మన నవలాకారులు, కథకులు, కవులు, వీరెవరికీ మన సాహిత్యం గురించి క్షుణ్ణంగా తెలియదు. ఉదాహరణకి, మా పంజాబు రాష్ట్రంలో సామాజిక స్థితిగతుల మీద మన కవులకు నిరసన వుంది. సమాజానికి ఎదురు తిరగమని వారి సాహిత్యం ద్వారా ప్రజలని ప్రేరేపించడం చూశాను. అవినీతి, అసమానత, దోపిడీ లేని సమాజనిర్మాణం వారి ధ్యేయం. ప్రస్తుత సమాజస్థితి మారాలని ప్రతీ ఒక్కరూ కోరుకున్నా, దానికి ఆమోదముద్ర మాత్రం ఎవరూ వేయరు.
కవిత్వంలో కూడా వస్తువు ఉత్తమమైనదే కానీ, రూపం దేశీయం కాదు. పాశ్చాత్యుల నుంచి తెచ్చుకున్న అరువు. పాశ్చాత్యులు వృత్తము, ప్రాస వదిలేశారు కాబట్టి పంజాబీ కవి కూడా త్యజించాలి. అతను కూడా అభ్యుదయ భావ కవిత్వమే ఎంచుకోవాలి. శబ్దమూ, ఆవేశమూ కాగితం వరకే అంకితమవుతోంది. అదే భావజాలం ఉన్న ఏ కొద్దిమందికో ఆ కవిత్వం పరిమితమయిపోతోంది. ప్రేరణ పొంది, మార్పుకి గురి కావల్సిన ప్రజలకీ, పల్లెవారికీ, శ్రామికజనానికీ, ఈ కవిత్వంలో తలా తోకా కనిపించదు. చివరికి వారు ఉదాసీనతకి గురవుతున్నారు. గాభరా మిగులుతోంది. ఈ నవీన కవిత్వపు పిడికిలిలో మిగతా భారతీయ భాషలూ చిక్కుకున్నాయని నేనంటే అది తప్పు కాదని అనుకుంటాను.
నాకు చిత్రలేఖనం గురించి బొత్తిగా తెలీదు. అందులో మంచీ, చెడూ అస్సలు గుర్తించలేను. కానీ ఈ రంగం కూడా పాశ్చాత్య పోకడలకే పరిమితం అవుతోంది. అతి కొద్దిమందికే ఏటికి ఎదురీదడానికి తెగువ వుంది. మరి విద్యా ప్రపంచం మాటేమిటి? మీరందరూ ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. హిందీ సినిమాలు చూసి మీరు నవ్వుకుంటే, మిమ్మల్ని చూసి మీరు నవ్వుకున్నట్టే!
ఈ ఏడాది మా ప్రాంతం వాళ్ళు నన్ను గురునానక్ విశ్వవిద్యాలయ పాలకసభ సభ్యుడిగా నియమించారు. ఈ ఆహ్వానం వచ్చిన సమయంలో నేను పంజాబులో ప్రీత్‌నగర్ సాంస్కృతిక కేంద్రం దగ్గరున్నాను. దాన్ని ప్రసిద్ధ రచయిత ఎస్. గురుబక్ష సింగ్ నెలకొల్పారు. కొంతమంది మిత్రులతో ఆ సాయంత్రం జరిగిన పిచ్చాపాటీలో నేను అమృతసర్ సభకి వెళుతున్నాననీ, ఎవరైనా రాదల్చుకుంటే నా కారులో రావచ్చుననీ చెప్పాను.
“మీరు మా మధ్యకి తెహ్మత్ కుర్తా ధరించి ఓ పల్లెటూరి వేషంలో వచ్చారు. రేపు మీరు సూటు ధరించి సాహెబ్ బహదూర్ వేషం వేసుకొని వెళతారు మళ్ళీ,” అని మా మిత్రుల్లో ఒకరు అన్నారు.
“అలా ఎందుకు? మీకు కావలిస్తే ఈ దుస్తులతోనే వెళ్ళగలను,” అని నవ్వుతూ చెప్పాను. మీకంత తెగువ లేదని ఇంకొకరు అన్నారు.
“ఇక్కడి సర్పంచి కచేరీ పనిమీద ఎప్పుడు సిటీకెళ్ళినా తెహ్మత్ బదులు పైజామాతోనే వెళతారు. అలా చెయ్యకపోతే ఆయన్ని ఎవరూ గౌరవించరని అంటాడు. అలాంటిది మీరు ఈ పల్లెటూరి దుస్తుల్లో అంత పెద్ద విశ్వవిద్యాలయానికి ఎలా వెళ్ళగలరు?” అని ఇంకో ఆయన అన్నాడు.
“మన సర్పంచ్ పిరికిపంద. ఈ రోజున సిటీలో స్త్రీలే లుంగీలు ధరిస్తున్నారు. అలాంటిది ఈయన్ని ఎందుకు గౌరవించరు?” అంటూ శలవులో వరి నాటడానికొచ్చిన ఒక జవాన్ వాళ్ళతో మాట కలిపాడు. (పంజాబులో సైన్యంలో చేరిన వారు వరి నాటే సమయానికి శలవు పెట్టుకు రావడం రివాజు.)
ఆ విధంగా మా ముచ్చట్లు సాగాయి. వారి సవాలు స్వీకరించేనా అన్నట్టుగా నేను తెహ్మత్ కుర్తా ధరించే ఆ సభకి వెళ్ళాను. నేనూహించని సంచలనం వచ్చింది. అక్కడున్న ఆఫీసరు, బహుశా ప్రొఫెసర్ అనుకుంటా, అందరికీ పట్టా గౌన్లు ఇస్తూ నన్ను ముందు గుర్తుపట్టనే లేదు. తరువాత గుర్తుపట్టాక ఆశ్చర్యంతో -“మిస్టర్ సహాని, మీరు ఈ తెహ్మత్‌తో ఖోసా ధరించుండాల్సింది, బూట్లు కావు,” అని గౌను తొడుగుతూ నాతో అన్నాడు. “ముందు ముందు జాగ్రత్త వహిస్తాను,” పశ్చాత్తాపంతో అనేసి వెళ్ళిపోయాను.
“సభ్యతలేకుండా ఆ ప్రొఫెసర్ నా వేషధారణని ప్రశ్నించవచ్చా? మరి నేనెందుకు ఆయన్ని తప్పు పట్టలేదు?” ఒక్క క్షణం గడిచాక నాలో నేనే ప్రశ్నించుకున్నాను. నేనెందుకు ఆ క్షణం ఠకీమని జవాబివ్వలేకపోయానని బాధ పడ్డాను.
ఆ సభ అయ్యాక కొంతమంది విద్యార్థుల్ని కలవడానికి వెళ్ళాను. వాళ్ళ విస్మయం కూడా మాటల్లోనే గట్టిగా కనిపించింది. తెహ్మత్‌తో బూట్లు వేసుకున్న నన్ను చూసి వాళ్ళు నవ్వాపుకోలేకపోయారు. కానీ, వాళ్ళు పాంటు వేసుకొని మామూలు చెప్పులు ధరించడం వారికి వింతగా అనిపించలేదు.
ఇటువంటి అల్పమైన విషయాలు చెప్పి ఈయనెందుకిలా మా కాలం వృధా చేస్తున్నాడని మీకనిపించవచ్చు. ఒక్కసారి ఆ పంజాబీ రైతు కోణంలోంచి చూడండి. హరితవిప్లవంలో అతని పాత్ర పై మనందరికీ మెండైన గౌరవం వుంది. భద్రతా సైన్యానికి అతను వెన్నెముక. అటువంటి వ్యక్తి వస్త్రధారణని పదిమందీ హాస్యాలాడుతూ వుంటే అతనికెలా వుంటుంది చెప్పండి?
కాస్త కాలేజీ చదువు అబ్బగానే ప్రతీ పల్లెటూరి విద్యార్థి తన గ్రామం పట్ల ఎంత ఉదాసీనంగా ఉంటాడో పంజాబులో అందరికీ తెలిసున్నదే! అందరికంటే తను యోగ్యుడు, ఉత్తముడు అనుకుంటూ, ఆకాశం నుండి ఊడిపడినట్లుగా భావిస్తాడు. ఆ ఊరు వదిలేసి సిటీకి పారిపోవడమే అతనికున్న ఏకైక తృష్ణ. ఇది మన విద్యావ్యవస్థకి కళంకం కాదా? చెప్పండి!?
అన్ని ఊళ్ళూ ఒకేలా వుండవన్నది ఒప్పుకుంటాను. అంతే కాదు, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో స్థానిక వస్త్రధారణ విషయంలో ఏ ఇబ్బందీ ఉండదనీ నాకు తెలుసు. సాధారణ రైతు నుండి పండితుడి వరకూ అందరూ ధోతీతోనే ఏ వేడుకకయినా హాజరవుతారు. అక్కడ కూడా అరువు తెచ్చుకున్న అభ్యుదయవాదం ఉందని తెలుసు. ఎంతో కొంత శాతం ప్రతీ చోట అది కనిపిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చి పాతికేళ్ళు దాటినా, ఇప్పటికీ మెకాలే మిత్రులు అందించిన విద్యావ్యవస్థనే బ్రహ్మానందంగా కొనసాగిస్తూ గుమాస్తాలనీ, బానిసలనీ ఉత్పత్తి చేస్తున్నాం. ఎటువంటి వారినంటే – సొంతంగా ఆలోచించలేని వారినీ; ప్రభువులంటే ఏహ్యత వున్నా పైకి ప్రశంసించే వారినీ; బ్రిటీషు పాలకుల వేషభాషల్నీ, ఆటపాటల్నీ అనుకరిస్తూ, వారి పక్కన నిలబడడమే గొప్పగా భావించే వారినీ; సొంతవారిని అసహ్యించుకునేలా వారిలో వారికే ద్వేషబోధ చేసే బానిసలనీ అందిస్తున్నాం. ఇటువంటి విద్యావ్యవస్థపైన ఎంతో మంది విద్యార్థులు నమ్మకం కోల్పోవడంలో ఆశ్చర్యం ఏముందీ?
మళ్ళీ అల్పమైన విషయాల వద్దకే వస్తాను. పదేళ్ళ క్రితం, ఢిల్లీలో ఒక షోకైన విద్యార్థితో పేంటు పైన కుర్తా వేసుకోమని చెబితే పగలబడి నవ్వుండేవాడు. కానీ, ఈనాడు ‘హరే రామ హరే కృష్ణ’ హిప్పీ బృందం దయ వలన, కుర్తా-పాంటూ సంప్రదాయం అయ్యింది. ఇంకా గురు-షర్ట్ పేరుతో కుర్తా చెలామణీ అవుతోంది కూడా. ఏభయ్యేళ్ళ క్రితం రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి వచ్చాక భారతదేశానికి గురుదేవులెలా అయ్యారో, అలాగే అమెరికన్లు రవి శంకర్ని ఆహ్వానించి, గుర్తించగానే సితార్ ప్రసిద్ధ వాయిద్యం అయికూర్చుంది. మంగలి వ్యాపారాన్ని దెబ్బతీసేలా ఫేషన్ పేరుతొ గుండు కొట్టించుకొని, మీసాలూ, గెడ్డాలూ తీసేయమని ఏ విద్యార్థికయినా చెప్పే ధైర్యం మనకుందా? కానీ ఇవాళ రేపు యోగా పేరుతో యూరపులోని విద్యార్థులందరూ గుండు కొట్టించుకుంటే, మర్నాడే కనాట్ సర్కస్ అంతా గుండ్లతో నిండిపోతుందని ఘంట వాయించి మరీ చెప్పగలను. యోగా ఇంట గెలవాలంటే పక్కవాడి (యూరోపు) ప్రశంసాపత్రం అవసరం.
పోనీ అంతకంటే మరో చిన్న విషయం చెబుతాను. నేను పని చేసే హిందీ సినిమాల్లో పాటలూ, మాటలూ సింహభాగం ఉర్దూలోనే ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. కిషన్ చందర్, రాజేంద్ర సింగ్ బేడీ, కె. ఎ. అబ్బాస్, గుల్షన్ నందా, సాహిర్, మజ్రూహ్ సుల్తాన్‌పురి, కైఫీ ఆజ్మీ వంటి ప్రసిద్ధి చెందిన ఉర్దూ కవులూ, రచయితలూ వీటికి పనిచేస్తారు.
ఉర్దూలో రాయబడిన ఒక సినిమా హిందీ సినిమాగా చెలామణీ అవుతున్నప్పుడు, హిందీ, ఉర్దూ భాషలు రెండూ ఒకటేనని చెప్పడం సబబే కదా? కానీ, కాదు. రెండూ వేర్వేరు భాషలని మన బ్రిటీషు పెద్దలు వారి కాలంలో ప్రకటించారు. కాబట్టి, స్వాతంత్ర్యం వచ్చి పాతికేళ్ళయినా మన ప్రభుత్వమూ, మన విశ్వవిద్యాలయాలూ, ఆఖరికి మన మేధావులూ, ఆ రెండూ వేర్వేరు స్వతంత్ర భాషలనే నొక్కి చెబుతారు. ఎన్నో పర్షియన్, అరబిక్ పదాలను జొప్పిస్తూ పాకిస్తాన్ రేడియో అందమైన ఉర్దూ భాషని ద్వంసం చేస్తోంది; మనమేమి తక్కువ అన్నట్లు ఆల్ ఇండియా రేడియో సంస్కృత పదాలు గుమ్మరిస్తోంది. బ్రిటీషు పెద్దల అభీష్టాన్ని కాపాడడం కోసం విడదీయలేని వాటిని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు మనవాళ్ళు. ఇంతకంటే అర్థరహితమైన విషయం ఉంటుందా? తెలుపు రంగుని నలుపని బ్రిటీషువాళ్ళు చెప్పుంటే మనం ఎప్పటికీ అలాగే అనేవాళ్ళవేమో? మొన్ననే నా సహనటుడు జానీ వాకర్ – ‘ఇప్పుడు హిందీలో వార్తలు వినండి’కి (అబ్ హిందీ మే సమాచార్ సునియే) బదులుగా ‘ఇప్పుడు వార్తల్లో హిందీ వినండి’ (అబ్ సమాచార్ మే హిందీ సునియే) అని చెప్పాలని అన్నాడు.
ఇటువంటి హాస్యాస్పదమైన విషయాన్ని నేను అనేక మంది అభ్యుదయ, అనభ్యుదయ హిందీ, ఉర్దూ రచయితలతో చర్చించాను; మనం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా వుందని నచ్చ చెప్పాను. ఇదంతా గోడ కేసి తలకొట్టుకున్న వ్యవహారం లాగానే సాగింది, చివరికి. దీన్నే మా సినిమా వాళ్ళం ‘జ్ఞానుల అజ్ఞానం’గా వ్యవహరిస్తాం. మేము ఇలా అనడం తప్పా?
చివరగా, నా మాటలు విసుగు కలిగించే విధంగా వున్నా, నాకున్న ఒక అంతర్దృష్టి గురించి మీకు చెప్పాలి. ఎవరికైనా అంతర్దృష్టి కోరుకుంటే వచ్చేది కాదు. అది సహజంగా వస్తుంది, అంతే. చివరకి అది ఒప్పో, తప్పో అనిపించవచ్చు. నేను చెప్పిందీ తప్పు కావచ్చు. కానీ అంతర్దృష్టి వుంది. తప్పుగా భావించినది ఒప్పుగా నిరూపించబడచ్చు. ఎవరికి తెలుసు?
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యావత్తూ సంపన్నులతోనూ, వ్యాపారవేత్తలతోనూ, భూస్వాములతోనూ నిండిపోయిందని జవహర్లాల్ నెహ్రూ తన ఆత్మకథలో రాసుకున్నాడు. కాబట్టి న్యాయానుసారంగా ఈ వర్గమే స్వాతంత్ర్యానంతరం సహజంగా అధికారం చేబడుతుంది. ఈ పాతికేళ్ళలోనూ ధనికులు ఇంకా ధనికులవుతున్నారు; బీదవారు మరింత బీదవారవుతున్నారు. ఇవాళ ఇది అందరికీ తెలుసు. పండిట్ నెహ్రూ దీన్ని మారుద్దామని ప్రయత్నించి విఫలుడయ్యాడు. నేనాయన్ని తప్పు పట్టను. అతను ఈ క్రమంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొని ఉంటాడు. ఇవాళ మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈ దేశాన్ని సోషలిజం వైపుగా నడిపిస్తానని గట్టిగా చెబుతున్నారు. ఆమె ఎంత వరకూ విజయం సాధించగలదు? నేను చెప్పలేను. ఎందుకంటే రాజకీయం వంటబట్టదు నాకు. కానీ, మన ప్రభుత్వాన్నీ, సమాజాన్నీ సంపన్నవర్గమే నడిపిస్తుందన్న విషయంతో ప్రస్తుతానికి మీరు ఏకీభవిస్తే చాలు నాకు.
అదొక్కటే కాదు. తమ సామ్రాజ్యాధిపత్యాన్ని విస్తరీకరించుకోవడంలో బ్రిటీషు వారు ఇంగ్లీషు భాషని ఉపయోగించారన్నది మీరూ ఒప్పుకుంటారని అనుకుంటున్నాను. మీ అభిప్రాయంలో – ప్రస్తుతం మన పాలకులు దేశాన్ని బలపర్చడం కోసం ఏ భాషని వాడుకుంటారు? రాష్ట్రభాష హిందీయా? చచ్చినా కాదు. వీరు కూడా ఇంగ్లీషే వాడతారని నా అంతర్దృష్టి చెబుతోంది. కానీ దేశభక్తి చాటుకోవడం కోసం, ప్రజలు దాన్ని మర్చిపోకుండా వీళ్ళందరూ కొంత సందడి చేస్తారు.
డబ్బున్న మనుషులు వెయ్యిమంది దేవుళ్ళని నమ్మవచ్చు. కానీ పూజించేది మాత్రం లాభలక్ష్మినే! ఈ లాభాలని బట్టి చూస్తే, ప్రస్తుత సాంకేతిక, పారిశ్రామిక విప్లవంలో ఇంగ్లీషుని వాడడంలో పెట్టుబడిదారీ వర్గానికి కొన్ని ప్రయోజనాలున్నాయి. దానికంటే సాంఘిక ప్రయోజనాలే ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే మన పాలకవర్గానికి దేవుడిచ్చిన వరం – ఇంగ్లీషు. ఎందుకో తెలుసా? మన దేశంలో ఉన్న కోట్లాది జనాభాకి ఈ భాష అందుబాటులో వుండదన్నదే ముఖ్య కారణం. పూర్వం సంస్కృతం, పర్షియన్ మామూలు ప్రజలకి అందుబాటులో ఉండేవి కావు. అందుకే ఆనాటి పాలకులు రాష్ట్రభాషా ప్రతిపత్తి ఇచ్చారు. సంస్కృతమూ, పర్షియన్ భాషల ద్వారానే సామాన్యులు తక్కువగానూ, నిర్లక్ష్యానికి గురైనవారుగా చూపించబడ్డారు. పరిపాలించుకునే స్థితిలో లేరంటూ వాళ్ళకి వాళ్ళు అనాగరికులమని చూపించడం జరిగింది. సంస్కృతం, పర్షియన్ వాళ్ళ మానసిక బానిసత్వానికి దోహదం చేసాయి. ఎప్పుడయితే మనసు ఆ భాషల బాంధవ్యానికి బానిసయ్యిందో, అప్పుడు ఆ మానసిక బానిసత్వం నిరంతరంగా సాగుతూనే ఉంటుంది.
బ్రిటీషువారి నుండి సంక్రమించిన సాంఘిక అంతరాలు మన పాలకుల పాలిట వరం. పాలకులు ఓ మెట్టు పైనే ఉన్నారు; కానీ పైకి మాత్రం అనరు. అందుకే హిందీని జాతీయ భాష చేయడానికి చాలా గోల జరిగింది. సంస్కృతభూయిష్టము, కృత్రిమమము, ఆధునిక, వైజ్ఞానిక, సాంకేతిక పదజాలరహితము అయిన హిందీ భాష బలహీనమైనది. దానికి బలమైన ఆంగ్ల భాషతో పోటీ పడే సామర్థ్యం లేదని మన పాలకులకి తెలుసు. పైకి చూపించుకోవడానికీ, అంతకంటే ముఖ్యంగా, ప్రజల మధ్య సులభంగా చిచ్చు పెట్టే సాధనంగా మాత్రమే ఉంటుంది.
మా సినిమావాళ్ళకి హైస్కూలు, కాలేజీ విద్యార్థుల నుండీ తరచు అభిమానుల ఉత్తరాలు వస్తూ వుంటాయి. అవన్నీ చూడగానే – ఇంగ్లీషు భాషాహింసకు వీళ్ళు ఎంత గురవుతున్నారో తెలుస్తూ ఉంటుంది. మన విద్యా బోధనా, జ్ఞానమూ ఎంత అధోగతిలో వున్నాయో అవి చదివితే తెలుస్తుంది. అందుకే మన విద్యారంగంలో మంచి స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకే, అంటే ఆర్థికంగా పైబడిన వారి పిల్లలకే ప్రాధాన్యత ఇవ్వబడుతోంది.
పైకి వద్దని అంటూనే, మన నిత్య జీవితంలో ప్రతీ పార్శ్వంలోనూ ఈ ఇంగ్లీషు భాషని బలపర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇవన్నీ స్పష్టమయిన విషయాలు. సగటు భారతీయుడికి ఇంగ్లీషు పరభాష; అందుకే నేర్చుకోవడం కష్టమయినా, ఇదే పెట్టుబడిదారుల హోదానీ, పారిశ్రామికవేత్తల స్థానాన్నీ భారత దేశమంతటా బలపర్చడానికి దోహదపడుతోంది. దీనికి మించినది మరొకటి లేదు. వారి ప్రయోజనాలు జాతి ప్రయోజనాల క్రిందే లెక్క. ప్రస్తుత ఇంగ్లీషు హోదాని ముందు తరాల వారు ఎప్పటికీ ఇలానే ఆమోదిస్తారన్న నమ్మకం వారికి బలంగా ఉంది.
ఇదే నా అంతర్దృష్టి. దీన్ని కార్మిక నాయకుడైన ఒక మిత్రునితో పంచుకున్నాను. పెట్టుబడిదారీ వ్యవస్థని రూపుమాపే సామాజికవాదాన్ని తీసుకురావాలంటే, పెట్టుబడిదారీ వర్గం ఎంత శక్తివంతంగా చేస్తున్నారో, అంతే శక్తివంతంగా శ్రామికవర్గం కూడా తమ వాదాన్ని భారతదేశమంతటా బలపరుచుకోవాలి. శ్రామికవర్గం సమాజంలో ప్రధాన పాత్ర పోషించడానికి మనం చేయూత నివ్వాలి. ఇంగ్లీషు పెత్తనాన్ని ప్రజల భాషతో భర్తీ చేస్తేనే ఇటువంటివి సాధ్య పడతాయని చెప్పాను. నేను చెప్పింది నా స్నేహితుడు శ్రద్ధగా విన్నాడు. స్థూలంగా అంగీకరించాడు.
“నువ్వు ప్రస్తుత పరిస్థితిని చక్కగా విశ్లేషించావు. కానీ దీనికి నివారణేదీ?” అని అడిగాడు.
“ఇంగ్లీషు లిపిని వుంచి, భాషని తరిమి వేయడమే దీనికి నివారణ,” అని చెప్పాను.
“మరదెలా?”
“దేశమంతటా జనసామాన్యం వ్యావహారిక హిందూస్తానీనే వాడుతారు. విద్యా, వ్యాకరణ సౌరభాలకి అతీతంగా దీన్ని వాడుకలోకి తీసుకురావాలి. లడ్కా భీ జాతా హై (పిల్లాడూ వెళతాడు), లడ్కీ భీ జాతా హై (పిల్లా వెళుతుంది). ఈ యాసలో స్వేచ్ఛా వాతావరణం ఉంటుంది. మేధావులు కూడా ఇటువంటి పదప్రయోగాలే చేస్తారు. సర్వోత్తమమైన హిందూస్తానీ సంప్రదాయం ఇదే. ఇలాగే ఈ భాష పుట్టింది; ప్రగతి సాధించి భారతదేశమంతటా వ్యాపించింది. పూర్వం దీన్నే ఉర్దూ భాష లేదా బజారు భాష అని తిరస్కారంగా వ్యవహరించేవారు,” అని చెప్పాను.
ఈనాడు యూనివర్సిటీ అనే పదం, బజారీ హిందూస్తానీలో యూనివ్రస్టి అయ్యింది. ఇది విశ్వవిద్యాలయం కంటే మెరుగైన పదం. లాంటర్న్ కాస్తా లాల్తే (లాంతరు) అయ్యింది; కారు షాసీ కాస్తా ఛాసిస్ అయ్యింది; స్పానర్ పదం పానా గా మారింది; ఇలా ప్రతీదీ సాధ్యమయ్యింది. సైనికులు రైఫిల్ని శుభ్రపరడానికి వాడే తీగను పుల్ త్రూ అంటారు. అది కాస్తా అందమైన ‘ఫుల్ త్రూ’గా రూపాంతరం చెందింది. హాలీవుడ్లో లైట్ మేన్ వాడే చతురస్రాకార లైట్ల అమరికని బార్న్ డోర్ అంటారు. దీన్ని మన ముంబై సినీ కార్మికుడు బందూర్ అని చక్కగా మార్చివేశాడు. ఈ హిందూస్తానీకి చెప్పనలవి కాని అంతులేని సంభావ్యత వుంది. అంతర్జాతీయ సాంకేతిక, శాస్త్రీయ పదజాలాన్ని అతి సులభంగా ఇముడ్చుకోగలదు. అనేక మూలాల నుండి మాటల్ని సంగ్రహించుకుని సంపన్నం కాగలదు. అందరూ సంస్కృత పదకోశం వైపే పరిగెత్తనవసరం లేదు.
“అయితే రోమన్ లిపి మాత్రం ఎందుకు?” అని నా స్నేహితుడు ప్రశ్నించాడు.
“ఎందుకంటే దాని మీద ఎవరికీ వ్యతిరేకత లేదు. ఆ ఒక్క లిపే యావత్తు భారతదేశమూ ఇప్పటికే చెలామణీలో వుంది. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో ఎక్కడైనా ప్రతీ దుకాణం పేర్లూ, సినిమా పోస్టర్లూ అన్నీ ఆ లిపిలోనే ఉంటాయి. మనం కూడా పోస్టు కార్డులమీద చిరునామాలు రాయడానికీ ఇదే లిపి వాడుతాం. మన సైన్యం గత ముప్పయ్యేళ్ళగా ఇదే లిపి వాడుతోంది,” అని చెప్పాను.
నా మిత్రుడు, కార్మిక నాయకుడు, ఇది విని కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. తరువాత నిగ్రహంతో నవ్వుని అణచుకుంటూ, “కామ్రేడ్! యూరపులో కూడా ప్రజలకి వ్యవహారిక భాషతో (ఎస్పరాంటో) ప్రయోగాలు చేశారు. మహామేధావి బెర్నార్డ్ షా మౌలిక ఇంగ్లీషుని ప్రజల్లోకి తీసుకెళదామని శాయశక్తులా ప్రయత్నించాడు. ఇవన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. భాషలు యాంత్రికంగా వికసించవు; స్వయంగానే పురోగమిస్తాయి,” అని చెప్పాడు. అది విని అదిరిపోయాను.
“కామ్రేడ్! వ్యవహారికం పేరుతో మన హిందీ పండితులు, సంస్కృత పదకోశం నుండే జాతీయ భాషని తయారుచేస్తున్నారు. కానీ నేను మన మధ్య ఎదుగుతున్న ప్రజల భాష గురించి మాట్లాడుతున్నాను,” అని చెప్పాను.
కానీ అతన్ని ఒప్పించలేకపోయాను. నా వాదనలన్నీ వినిపించాను. సుభాస్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ వంటి వాళ్ళు రోమన్ లిపినే ఎంతగా సమర్థించారో వివరించినా అతనికి నచ్చజెప్పలేక పోయాను. నేను ఒప్పా? ఆ కామ్రేడ్ ఒప్పా? అన్నది కాదిక్కడి ప్రశ్న. బహుశా నేనే తప్పు కావచ్చు. బహుశా అతను అన్నట్లుగా నా ఆలోచనలన్నీ ఆదర్శవంతంగా లేదా యాంత్రికంగా వుండచ్చు. ఇంతకుముందు చెప్పినట్లుగా మన అంతర్దృష్టి తప్పా, ఒప్పా అన్నది ఎప్పుడూ చెప్పలేం. అది ఉండడం ఒక లీల. అది స్వేచ్ఛా చింతనకి గుర్తు. నా కామ్రేడ్ మిత్రుడు నన్ను మెచ్చుకుని ఉండవచ్చు. కానీ అలా చెయ్యలేక పోయాడు. ఎందుకంటే, సనాతన ధోరణి నుండి బయట పడడం అతనికి కష్టం.
తన శరీరాన్నీ, మనసునీ గుర్తించుకోకుండా ఏ దేశమూ ప్రగతి సాధించలేదు. తన కండరాల్ని తానే పెంచుకోవడం నేర్చుకోవాలి. తన సమస్యల్ని తానే తెలుసుకుని, తన పద్ధతిలోనే పరిష్కరించుకోవాలి. పాతికేళ్ళ స్వాతంత్ర్యానంతరం ఎటు చూసినా ఒకటే తీరు. ఎంతోకాలం పంజరంలో బందీ అయిన పక్షిలా మనకి స్వేచ్ఛని ఎలా సద్వినియోగ పరుచుకోవాలో తెలియడం లేదు. ఆ పక్షికి రెక్కలున్నాయి. స్వేచ్ఛావాయువుల్లో ఎగరడానికి మాత్రం భయపడుతోంది. పంజరపు బందీలా హద్దుల్లోనే గడపడానికి ఇష్టపడుతోంది.
విడిగానూ, సామూహికంగానూ మనం వాల్టర్ మిట్టీని పోలి ఉన్నాం. మన లోపలి జీవితం వేరు; బయట జీవితం వేరు. మన మాటలూ, చేతలూ ఉత్తర దక్షిణ ధృవాలు. మన చుట్టూ ఉన్న సమాజ స్థితిగతులు మారాలని కోరుకుంటున్నాం. చుట్టుపక్కలున్న పరిస్థితులని మార్చాలన్న కోరిక మనకున్నప్పటికీ, ఎన్నాళ్ళనుండో మనం పని చేస్తున్న తీరునుంచి, మననుండి ఇతరులు ఆశిస్తున్న దానికి భిన్నంగా వ్యవహరించే ధైర్యం మనకి లేదు.
మనదేశంలో కొంతమంది పోలీసు అధికారులు ప్రజలకి శత్రువులుగా కాకుండా మిత్రులుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నారని నా నమ్మకం. ఇంగ్లాండ్‌లో పోలీసుల వ్యవహార సరళి ప్రజల పట్ల గౌరవప్రదంగానూ, సహాయకరంగానూ ఉంటుందని మన పోలీసులకి తెలియాలి. కానీ, బ్రిటీషువారి శిక్షణా సాంప్రదాయం వేరు. తమ దేశానికొక పద్ధతిలోనూ, తాము ఆక్రమించుకున్న దేశాలకి మరొక విధంగానూ వాళ్ళు తర్ఫీదు ఇచ్చారు. అందువలనే మన పోలీసులు నిస్సహాయులు. వలసవాద సంప్రదాయం ప్రకారం తమ ఆఫీసుకొచ్చిన ఎవరికయినా వీలయినంత మేరకి భయభీతులు కలగజేస్తూ, అవరోధాలు కల్పిస్తూ సహాయపడకుండా ఉండడం వారి విధి. బంట్రోతు నుండి, మంత్రుల వరకూ ఇదే సంప్రదాయం ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలోనూ కొనసాగుతోంది.
ఒక యువ ఔత్సాహిక నిర్మాత, ఒక ప్రయోగాత్మక సినిమా నిర్మించి, పన్ను రాయితీ కోసం ప్రభుత్వాన్ని సంప్రదించాడు. క్రితం రోజే సదరు మంత్రి పదవీ స్వీకారం చేశాడు. తన ప్రమాణ స్వీకారోత్సవం అయ్యాక, విడిగా మాట్లాడుదాం అంటూ ఈ నిర్మాతని పిలిచాడు. ఏ భేషజం లేని ఆ మంత్రిని చూసి ముచ్చటపడి ఈ నిర్మాత వెళ్ళాడు. ప్రజలకి నిజాయితీగా, విశ్వాసంగా సేవ చేస్తానని సత్య ప్రమాణం చేసిన ఆ మంత్రి గారి పదవీ స్వీకారం ఇలా అయ్యిందో లేదో, వెంటనే వారి కార్యదర్శి ఈ సినిమాకి పన్ను రాయితీ కావాలంటే ఎవరికెంత నల్లధనం ఎలా ముట్ట చెప్పాలో విడమర్చి చెప్పాడు.
ఇది విని అదిరిపోయిన ఆ నిర్మాత కోపంతో తన తరువాత సినిమాలో ఇదే సన్నివేశం పెడదామనుకున్నాడు. కానీ, అప్పటికే అతని పెట్టుబడి వాటాదారులు మొదటి సినిమాతో నష్టాల ఊబిలో కూరుకుపోయారు. అటువంటి తెలివితక్కువ పని చెయ్యొద్దని స్పష్టంగా చెప్పారు. ఒకవేళ ఆ సన్నివేశం ఉంచదలచుకున్నా సెన్సారు వాళ్ళు ఊరుకోరని చెప్పారు. ఎందుకంటే, ఏ ఒక్క పోలీసు వాడూ, ఏ ఒక్క మంత్రీ మన దేశంలో అవినీతిపరులు కారన్న ఒక అనధికార చట్టం ఉంది.
ఇంతకుమించి హాస్యాస్పదమయిన విచిత్రం ఇంకొకటుంది. ఈ మంత్రుల మీద ఎలుగెత్తి అరిచే ఇదే పెద్దమనుషులు ఏ ఒక్క చిన్న వేడుకనీ ఈ మంత్రులు ప్రారంభించకుండా, లేదా ముఖ్య అతిథిగా అధ్యక్షత వహించకుండా జరపలేరు. ఒక్కోసారి సినిమా తార అధ్యక్షుడు గానూ, మంత్రిగారు అతిథిగానూ ఉంటారు. మరోసారి వారి స్థానాలు తారుమారు కావచ్చు. ఎవరో ఒక పెద్ద తలకాయ ఉండాలి. ఎందుకంటే అది వలసవాద సాంప్రదాయం.
క్రితం సారి యుద్ధసమయంలో నేను నాలుగేళ్ళు ఇంగ్లాడులో బీ.బీ.సీ వాచకుడిగా ఉన్నాను. ఆ నాలుగేళ్ళ సంక్షోభంలోనూ నేను బ్రిటీషు మంత్రులను కానీ, ప్రధాన మంత్రి చర్చిల్‌ని గానీ చూడలేదు. కానీ మనకి స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో ఎక్కడ చూసినా మంత్రుల్ని తప్ప మరొకర్ని చూడడం లేదు.
బ్రిటీషు వారి తుపాకులు, గుళ్ళు భారతీయులకి దీపావళి బాణాసంచా లాంటిదని పత్రికా విలేకర్లతో గాంధీజీ రౌండ్ టేబిల్ సమావేశానికి వెళ్ళినప్పుడు చెప్పాడు. అలా చెప్పడానికి కారణం, అతను ప్రజల మనసుల్లోంచి బ్రిటీషు వారంటే భయాన్ని తొలగించడమే. వేడుకోలుగా బ్రతిమాలుకోకుండా బ్రిటీషు వారిని ఎలా ఉపేక్షించాలో, వెలివేయాలో ప్రజలకి గాంధీజీ నేర్పాడు. అలాగే సామాజికవాదం మన దేశానికి కావాలంటే, ధనం నుండీ, అధికారం నుండీ, ఉద్యోగ స్థాయి నుండీ ప్రజల మనస్సుల్లోంచి భయం పోయేలా చెయ్యాలి. ఆ దిశగా మనం ఏదైనా చేస్తున్నామా? ఈ నాటి సమాజంలో ఎవరికి ఎక్కువ గౌరవం లభిస్తోంది? ప్రతిభావంతులకా? లేక ధనవంతులకా? ఎవరికి ఎక్కువ ప్రశంసలు లభిస్తున్నాయి? ప్రతిభకా? అధికారానికా?
ఇటువంటి పరిస్థితుల్లో సమాజవాదం విలసిల్లుతుందా? సామాజిక వాదం వచ్చే లోపల మనం ఒక రకమయిన వాతావరణం ఏర్పరచాలి. అదే వాతావరణంలో సంపన్నత పట్ల, సంపదల పట్ల అగౌరవాన్ని కలగజెయ్యాలి – గౌరవాన్ని కాదు. ఆ వాతావరణంలో శ్రామికుల పట్ల అత్యున్నతమైన గౌరవాన్ని కలగజేయాలి; శ్రామికుల ప్రతిభకీ, సామర్థ్యానికీ, కళానైపుణ్యానికీ, కల్పనాశక్తికీ గౌరవాన్నిచ్చే పరిస్థితి మనం కల్పించాలి. దీనికి, పాత పద్ధతుల్ని వదిలేసే ధైర్యమూ, కొత్త ఆలోచనాసరళీ కావాలి. ఇటువంటి మానసిక విప్లవం దరిదాపుల్లో మనం వున్నామా?
బానిసత్వాన్ని త్యజింపగలిగే ధైర్యాన్నిచ్చే మహాత్ముడు మనకిప్పుడు కావాలి. స్వేచ్ఛా స్వాతంత్ర్య దేశానికి సరిపడే మానవీయ విలువల్ని ఏర్పరిచే మహాత్ముడు కావాలి. అట్టి మానవీయ విలువలు మన విధిని మనమే నిర్ణయించుకునేలా మనలాంటి పీడితులకి ధైర్యాన్ని ఇస్తాయి, మన పాలకులకీ, పీడించే వారికీ కాదు.
గొప్ప పంజాబీ సాధువు గురు అర్జున్ దేవ్ ఇలా అన్నారు:
జన్ కి తెహల్ సంభఖన్ జన్ సియొ ఊతన్ బైతన్ జన్ కై సంగా
జన్ చర్ రజ్ ముఖ్ మతై లాగి ఆస పూరన్ అనంత్ తరంగా
నేను దేవుడి సేవకులని సేవిస్తాను; సంభాషిస్తాను; కలిసి జీవిస్తాను. వారి పాదధూళిని నా నుదుటను రాసుకుంటాను. నా ఆశలూ, ఇచ్ఛాతరంగాలూ అప్పుడే సార్థకమవుతాయి.
నేనూ, మా తరమూ విఫలమయిన చోటున మీరు, అంటే ఈ జవహర్ లాల్ యూనివర్సిటీ పట్టభద్రులైన విద్యార్థులు, విజయం సాధించాలి.
అదే నా కోరిక, నా ప్రార్థన.