జానపద చిత్రకళాకారుడు జామినీ రాయ్

కళ గురించి ఆలోచిస్తే రెండు రకాల అభిప్రాయాలు ముందుకు వస్తాయి. కళ సంఘం కోసరమని, కళ కళ కోసమేనని. కళారంగంలో ఈ రెండు విభిన్న దృక్పథాల వాదాలు నేటికీ వెంటాడుతూనే వున్నాయి. ఈ రెంటిలో ఏది సరియైనదో ఖచ్చితంగా నిర్ణయించలేక పోయారు విజ్ఞానులు, తార్కికులు. సగంమంది ఒక వైపు, సగంమంది మరొకవైపు ఉండటం వల్ల తెగే సమస్య కాకుండా పోయింది. కళ కళ కోసమే అయితే గానీ ఉత్కృష్ట స్థాయికి పోదని చాలా మంది అభిప్రాయం. కళ సంఘం కోసరమే అయితే కళ ఎప్పుడూ మామూలు మనిషి స్థాయిలోనే ఉంటుంది, ఉన్నత స్థాయికి పోదు. నిజానికి కళ ఎప్పుడూ సంఘానికి మూడడుగులు ముందే వుంటుంది నడకలో. సంఘమే ప్రయత్నించి అందుకుంటుంది. అలా అందుకునే ప్రయత్నంలోనే అది విజ్ఞానవంతం అవుతుంది. ఇక రెండో అభిప్రాయం, సామాన్య మానవుడి స్థాయికి దిగి అతన్ని ఉన్నత స్థాయికి తీసికొని పోవడమే కళ కర్తవ్యం అనేది. లేకపోతే కళకు, సంఘానికి మధ్య పెద్ద అగాధమేర్పడుతుంది.


దుర్గ (జామినీ రాయ్)

జానపద కళల్లో ఆయా దేశాల, ప్రజల సంస్కృతి, అభిరుచులు వ్యక్తమవుతాయి సూటిగా. ఈ కళ పుట్టి పెరిగింది గ్రామాల్లో. గ్రామీణులు తమ ఆనందాల్ని, భావాల్ని, భక్తిని, భయాన్ని, బహుకొద్ది రంగుల్లో ఎలా తోస్తే అలా వ్యక్తపరిచారు చిత్రాల్లో, బొమ్మల్లో. కళ కోసరమై పని కట్టుకుని చేసిందేమీ లేదు. అవసరానికి పనికి వచ్చే వస్తువుల్నే అందంగా వారికి తట్టిన నాజూకుతనంతో సుందరమయం చేశారు. బెంగాల్ పట్ వర్ణచిత్రాలు, కాళికాదేవి మట్టిబొమ్మలు, మన తిరుపతి కొయ్యబొమ్మలు, బందరూ కలంకారి వస్త్రాలు, ఒరిస్సా జగన్నాధుని చిత్రాలు, మహారాష్ట్రుల, ఆంధ్రుల తోలుబొమ్మలు, తంజావూరు చిత్రపటాలు చూస్తే తెలుస్తుంది జానపదుల పనితనం, వారి మోటైన నాజూకుతనం. బహుకొద్ది రంగుల్లో ఎన్నో డిజైనులు, లతలు, పువ్వులు చిత్రిస్తారు. తిరునాళ్ళలో తయారు చేసి అమ్మే మట్టి, పేడ బొమ్మలు ఎంతో ముచ్చటగా ఉంటాయి. దేవుని విగ్రహాలు చూస్తే ఎంత భక్తి ప్రపత్తులతో తయారు చేశారో తెలుస్తుంది. అలా ఈ జానపద కళ పల్లె వాతావరణానికి చుట్టుకొని అభివృద్ధి అయిందే కానీ, పట్టణాల్లో నాగరికులైన చిత్రకారుల వల్ల కానే కాదు. పల్లెటూరివారు సరదాగానూ, కొంతమంది వృత్తిగానూ పెట్టుకుని అభివృద్ధి పరచిందే ఈ జానపద చిత్రకళ.


జామినీ రాయ్ (1887-1972)

భారతదేశపు కీర్తి నలుదిశల విస్తరింపచేసిన జానపద చిత్రకారుడు జామినీ రాయ్. భారతీయ చిత్రకళలో ఆయన ఒక మైలురాయి. జామినీ రాయ్ చిత్రాన్ని ఇద్దరు చూస్తే, ఇద్దరికీ రెండు వేరు వేరు అభిప్రాయాలు కలుగుతాయి. ఒకరు భారతదేశ చిత్రకారుల్లో అత్యంత ప్రతిభాశాలి, మహామేధావి, సాహసిగా లెక్క వేస్తే, రెండవవారు జానపదులు ఏనాడో వేసిన చిత్రాలకు నకళ్ళు తయారు చేసే అతి సాధారణమైన, చవుకబారు చిత్రకారుడిగా పరిగణిస్తారు. ఇలా విభిన్న కోణాల్లో చిక్కుకున్న వ్యక్తిని గురించి బెవర్లీ నికలస్ సంవత్సరం పాటు భారతదేశమంతా తిరిగి ఎన్నో చిత్రాలు చూసి, ఎంతో మంది చిత్రకారులని కలిసిన మీదట, “భారతదేశంలో గొప్ప చిత్రకారుల గురించి చెప్పాలంటే ఒక్క జామినీ రాయ్‌ని గురించే చెప్పాలి,” అన్నారు.

రష్యా నుండి ఇటీవల వచ్చిన సాంస్కృతిక సంఘ సభ్యులు కూడా రాయ్ చిత్రాలు చూసి, భారతీయ జానపద శైలిని మూడుమూర్తుల ప్రతిబింబింపజేస్తున్న చిత్రకారుడన్నారు.

శ్రీ సంజీవదేవ్, “జామినీ రాయ్ చిత్రాల్లోని విషయ వస్తువులో కాని, ప్రక్రియలో కాని, రూపసృష్టిలో కాని, ఊహాపుష్టిలో కాని నాకేమాత్రం లోతు, లావణ్యం కనిపించదు. ఆయనది కేవలం జానపద చిత్రకళ మాత్రమే కాని మోడర్నిస్ట్ చిత్రకళ కాదు” అన్నారు.

ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఎడిటరుగారైన శ్రీ ఎ. ఎస్. రామన్, “జామినీ రాయ్ కౌశలం అద్భుతం అనడంలో సందేహం లేదు. కానీ, విమర్శనా దృష్టితో తీక్షణంగా చూసినట్టయితే తెలుస్తుంది ఆయన చిత్రకళలోని శూన్యం. బెంగాల్ జానపద చిత్రకళకు కార్బన్ కాపీ లాంటిది రాయ్ చిత్రకళ” అని నిరసించాడు. ఇలా విరుద్ధ విమర్శనాశక్తుల మధ్య నిలచి, చిత్రకారుడిగా విజయం సాధించిన వ్యక్తి ఎంత గట్టివాడో ఊహించగలం.


వైష్ణవులు

జామినీ రాయ్ ఉండేది కలకత్తాలో బహు జనసమ్మర్దమైన చోట. ఇరుకు సందుల్లోంచి, జనసమూహం మధ్యనుండి వెళితే వస్తుంది ఆయన ఇల్లు. అదే రాయ్ నివసించేది, చిత్రించే స్థలము కూడా. భారతీయ చిత్రకారులు వారు వుండే ఇంట్లోనే ఒక గదిలో చిత్రరచన సాగిస్తారు. ప్రత్యేకంగా చిత్రరచనకు వేరే ఇల్లు వుండదు. కానీ పాశ్చాత్యులు చాలామంది సంసారంతో వుండేది ఒక చోట, చిత్రరచన చేసేది మరొక చోట. సాంసారిక వాతావరణానికి సుదూరంగా వుండి చిత్రిస్తారు ఏకాంతంగా, ప్రశాంతంగా. మనకు, వారికి గల ఈ తేడా ఆర్ధిక కారణాల వల్లే అనుకుంటా. వచ్చిన కళాపిపాసకులని రాయ్ ఎంతో ఆదరంతో, ముకుళిత హస్తాలతో, గుమ్మం దగ్గరే ఎదురై లోనికి తీసుకుని వెళ్తారు. గోడలకు తగిలించిన ఎన్నో చిత్రాలు వెలుగును సృష్టిస్తూ, ముదురు రంగుల్లో ప్రకాశిస్తుంటాయి. సిగ్గుతో ముడుచుకున్న కండ్లతో పిలిచే పల్లెటూరి భామలు, రాధాకృష్ణులు, శివపార్వతులు, శిష్ట వైష్ణవ బ్రాహ్మణులు, రామాయణ, భాగవత ఘట్టాల చిత్రాలు, క్రైస్తవమత సంబంధ చిత్రాలు, ఎన్నో ఇంటి గోడల నిండా, ఒక మూల దొంతర్లుగా వుంటాయి. రాయ్ చూపిస్తున్న చిత్రాలు చూస్తూ, ఆయన వైపు ఒకసారి చూస్తే తెలుస్తుంది చిత్రకారుని నిశ్చలత, దృఢ నిశ్చయం, గాంభీర్యం. పొడవైన నిండు విగ్రహం, గుండ్రని ముఖం, బలమైన అవయవాలు, వయసుతో పండిన రంగులో వుంటాయి. నెరసిన జుట్టు, సుమారు డెబ్బైరెండేండ్ల రాయ్‌కి ఒక ప్రత్యేక శోభ చేకూర్చింది. ఎంత గొప్ప చిత్రకారుడో అంత నిరాడంబరుడు, అంత మితభాషి.

బంకురా జిల్లా, చెలియతోర్ గ్రామంలో జన్మించాడు రాయ్. ఆ గ్రామంలో కుమ్మరులు చేసే కుండలు, బొమ్మలు, వాటికి వేసే రంగులు ఎంతో ఆకర్షించాయి. చిన్నప్పటి నుండి వారితో తిరిగి మట్టిబొమ్మలు వారిలా చేస్తూ, రంగులు వేస్తుండేవాడు. రాయ్ తండ్రి కొడుకుకు గల కళాభిలాషను గుర్తించి కలకత్తా లోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేర్పించాడు. ఎంతో శ్రద్ధతో చిత్రకళ నేర్చుకొని పట్టుదల గలవాడని అనిపించుకున్నాడు. రూపచిత్రాలు వెయ్యడంలో దిట్ట. ఎంతోమంది రూపచిత్రాలు వేసి డబ్బు, కీర్తి గడించాడు. ఆ రోజుల్లోని రాయ్ చిత్రాలు అమెరికన్ చిత్రకారుడు విజ్‌లర్ (James Whistler) చిత్రాలకు దగ్గరగా ఉండేవి. దృశ్యచిత్రాలను, అవనీంద్రనాధ టాగోర్ గురుత్వాన వర్ధిల్లిన బెంగాల్ చిత్రకళా పద్ధతుల్లోనూ విరివిగా చిత్రాలు వేస్తూ వుండేవాడు. తైలవర్ణల్లో, నీటిరంగుల్లో, వివిధ రకాల ప్రయోగాలు చేస్తుండడం మొదటినుండీ అలవాటు. వాన్‌గో (Van gogh), గోగాన్‌ల (Paul Gauguin) ప్రభావం రాయ్ చిత్రాల మీద వుండేది. రాయ్ విచిత్రమైన వ్యక్తి. అందరు చిత్రకారుల్లా దేశం తిరిగి చూసిన మనిషి కాదు. అంతగా చదువుకున్నవాడు కాదు. కలకత్తా నగరమే ఆయనకు ప్రపంచం. అక్కడి జనసమ్మర్దమే రాయ్‌కి అనుభూతుల్ని, అనుభవాల్ని అందిస్తుంది.


గోపిని (టెంపేరా)

ఇన్నిరకాలుగా చిత్రించినా రాయ్ హృదయాంతరాళంలో తన చిన్నతనం లోని మట్టిబొమ్మలు, చిత్రాలు మెదులుతూనే వున్నాయి. ఏదో చిత్రిస్తున్నాడే గానీ ధ్యాస లేదు. ఏదో సంపాదిస్తున్నాడే గానీ ఆత్మసంతృప్తి లేదు. అశాంతితో అలానే బ్రతుకుతున్నాడు. ఒక్కసారిగా ఏదో మార్పు వచ్చింది రాయ్‌లో. తను సాధించదల్చుకున్న దానికి తను వేస్తున్న పద్ధతులు పనికి రావని గ్రహించాడు. తను చిన్నతనంలో చేసిన, వేసిన పద్ధతికి తిరిగివెళ్ళాడు. అప్పటి వరకు నేర్చిన చిత్రకళా కౌశలంతో, ఆనాటి జానపద చిత్రకళే తన మార్గంగా నమ్మి, ప్రస్తుతం ప్రచారంలో వున్న చిత్రకళా పద్ధతులను, చిత్రకారులను వదిలి వేసి, తీవ్రమైన కృషి పెట్టాడు, ఒక్కడే. అంత పేరున్న చిత్రకారుడు, పెద్దగా అర్జిస్తున్న వ్యక్తి అన్నీ వదలి భవిష్యత్తు లేని జానపద కళలోకి వెళ్ళడం, ఎవరూ నమ్మలేని విషయం. అదే ఆయనలోని విశేషం. తనకు ఏది తోస్తే అది సాధించేవరకు నిద్రపోని రకం రాయ్. కొంతమంది అధునాతన పాశ్చాత్యులు కొందరు అల్టామీరా (Cave of Altamira) గుహ చిత్రకళా పద్ధతులకు వెళ్ళారు, రాయ్ బెంగాలీ జానపద చిత్రకళ వద్దకు వెళ్ళినట్టుగా. దీన్ని వివరిస్తూ, శ్రీ బిష్నూ డే, జాన్ ఇర్విన్‌లు “ఎవరో కొత్తవారు జానపద కళ నుండి ఏదో గ్రహించేందుకు ఆ కళను సమీపించినట్లుగా కాక, జానపద సంప్రదాయాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకుని జీర్ణించుకున్నవానిలా తిరిగి వెళ్ళాడు రాయ్,” అన్నారు.

అవును, నిజంగా ఆయన అలానే సమీపించారు జానపద చిత్రకళను. చిన్నతనంలో తను జానపద చిత్రకారుల్తో కలిసిపోయి నేర్చుకున్న చిత్రకళ లోని వర్ణమాధుర్యం, రేఖావిన్యాసం లోనికి వెళ్ళడం ఆయనకు అతిసహజం. అందుకే రాయ్‌కి, కొంతమంది ప్రఖ్యాత భారతీయ చిత్రకారుల మాదిరిగా, పాశ్చాత్య చిత్రకారులైన డెరైన్ (Andre Derain), మథీస్‌ల (Matthias Grunewald) పద్ధతుల వద్దకు వెళ్ళవలసిన అగత్యం లేకపోయింది జానపద చిత్రకళా నైర్మల్యాన్ని పట్టుకుంటానికి.


పిల్లి, రొయ్య

జామినీ రాయ్‌కి జానపద చిత్రకళలో శాంతి లభించింది. తలచిన భావాన్ని వెంటనే అతి కొద్ది రంగుల్లో, బలమైన రేఖల్లో చెప్పడం అలవడింది. ఈ సాధనకు టెంపేరా (Tempera) వర్ణ పద్ధతి (ధవళ వర్ణ మిశ్రమ విధాన పద్ధతి) ఎంతగానో ఉపకరించింది. జానపదులు భగవంతుని ఊహాచిత్రాలు వేయాలంటే గ్రంథాలలోని రూపలక్షణ వివరాలకై అంతగా బాధపడరు. ఎలా ఊహిస్తే అలా నిండైన మనసుతో, భక్తితో చిత్రిస్తారు. హనుమంతుణ్ణి చిత్రిస్తే ఆయన్ను ఎంతో గంభీరంగాను, చిత్రంలో వున్న ఇతర రూపాలకంటే పెద్దదిగానూ చిత్రిస్తారు. వారి దృష్టిలో భగవంతుడు సర్వ చరాచర ప్రాణికోటికంటే ఉన్నతమైనవాడు. అందుకే అలా చిత్రిస్తారు. హనుమంతుడు హిమాలయ పర్వతాల వద్ద ఉన్నా సరే హిమాలయాల్ని చిన్నవిగా చేసి, హనుమంతుణ్ణి పెద్దగానే, గాంభీర్యంగానే చిత్రిస్తారు. ఇక్కడ వస్తుగుణాలకు రూపభేదాలకు తారతమ్యం లేదు. వారి మనో దృష్టికి అందిందే కళ.

రాయ్ చిత్రకళను సమీక్షిస్తూ శ్రీ ముల్కరాజ్ ఆనంద్ “భారతీయ తత్వం, తంత్రాలలోని నిబిడీకృత జీవాన్ని ఒకవైపు, నేటి మధ్య తరగతి ప్రజా జీవితాన్నంటి పెట్టుకున్న మనోవైకల్యం, ఆకలి, క్రూరత్వం, బాధల్ని రెండవవైపు, అధిగమించి తన భావాల్ని, అనుభవాల్ని, మనో దృశ్యాల్ని విడమర్చి ఈ దృశ్య సంబంధమైన చిత్రకళలో చెప్పడం లోనే వుంది రాయ్ ప్రజ్ఞ.” అన్నారు. మరుగు పడిన జానపద కళలోని ఔన్నత్యాన్ని వెలికి తీసి ప్రాణప్రతిష్ట చేయడం లోనే వుంది రాయ్ గొప్పతనం. దేశంలో ఎంతోమంది విజ్ఞుల విమర్శలకు గురి ఐనా రాయ్ చిత్రకళ విజయం పొందింది. ధనం ఆర్జించింది. ఎంతోమంది చిత్రకారులను ఆకర్షించింది. ఆయన మార్గదర్శకత్వంలో జానపద చిత్రకళ అంటే జామినీ రాయ్ మారుపేరు అయింది. వారి చిత్రాలు కొన్నంతగా ఏ చిత్రకారుని చిత్రాలు భారతీయులు, పాశ్చాత్యులు కొని వుండరు.

జామినీ రాయ్‌కి రెండవ ప్రపంచ యుద్ధం ఎంతో కీర్తినీ, ధనాన్ని ఆర్జించి పెట్టింది. కలకత్తాకు వచ్చిన విదేశీ సైనికులు వినూత్నంగా వున్న ఈ చిత్రాలను, విరివిగా, వేలంవెర్రిగా కొన్నారు. అప్పటి బెంగాల్ గవర్నరుకు రాయ్ చిత్రాలంటే పిచ్చి. ఎన్నో చిత్రాలు కొని, తన స్నేహితులతో కొనిపించాడు. ఇంగ్లండ్‌లో రాయ్ చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేయించాడు. అదే రాయ్ జీవితంలో పెద్ద మార్పు తెచ్చింది. అక్కడి ప్రదర్శన విజయం కావడంతో ప్రపంచ ఖ్యాతి వచ్చింది. ఈనాడు ఎన్నో దేశాలలో రాయ్ చిత్రాలు వున్నాయి.


రాధాకృష్ణులు

తన పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్న కొద్ది ధరలు పెంచటానికి బదులు తగ్గించాడు. దానితో మధ్య తరగతి ప్రజలు సహితం కొనడం ప్రారంభించారు. బహుశా ప్రజల అందుబాటులోకి తన చిత్రాలు రావడం రాయ్‌కి ఎంతో ఆత్మసంతృప్తి ఇచ్చి వుండవచ్చు. ఇలా సృజనాత్మక చిత్రకళని ప్రజల్లోకి తీసుకువచ్చిన చిత్రకారుడు ఈయన ఒక్కడే. ఒక్కొక్క చిత్రాన్ని షుమారు రూ.75లకు కూడా అమ్ముతాడు, అంత ప్రసిద్ధ చిత్రకారుడు. అంత చవుకగా చిత్రాలను అమ్మేవారు భారతదేశంలో ఏ చిత్రకారుడూ లేడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే జామినీ రాయ్ వ్యాపార సరళి కూడా తెలిసిన దిట్ట కూడా అనిపిస్తుంది. నిజానికి రాయ్ వేసే చిత్రాలకంటే కొనేవారు ఎక్కువ వుండడం వల్ల, లోగడ వేసిన చిత్రాలనే మరల మరల చిత్రిస్తుంటాడు. అక్కడికి చిత్రాలు కొనేవారి సంఖ్య తట్టుకోలేక, కొడుకులు తనలాగే చిత్రించిన వాటి మీద సంతకం చేసి ఆయనవిగా అమ్ముతాడు. ఈ విధంగా కుటీర పరిశ్రమ క్రిందకు దింపాడు రాయ్ తన కళను. ఈ పద్ధతి వల్ల ఆయనకు చిత్రకారుల్లోనూ, విమర్శకుల్లోనూ ఎంతో చెడుపేరు వచ్చింది. ఎ. ఎస్. రామన్ తన ఇలస్ట్రేటెడ్ వీక్లీలోనే ఈ విషయం వ్రాయడం గూడా జరిగింది.

వేసిన చిత్రాలనే మరల మరల వేసి అమ్మడం ఏమంత క్రొత్త విషయం కాదు. ప్రసిద్ధ చిత్రకారుడు టిషన్ (Titian) గూడా ఇలాగే చేసేవాడు. ఇప్పుడు చిత్రాలకు, వుడ్‌కట్స్‌కు, లినోకట్స్‌కు, పాశ్చాత్య దేశాలలో పరిమితంగా ప్రింట్స్ తీసి అమ్ముతారు, చాలా ఎక్కువ ధరలకు. తరువాత అసలు చిత్రాన్ని ధ్వంసం చేస్తారు. యూరప్‌లో వున్న మన ప్రసిద్ధ తెలుగు చిత్రకారుడు కృష్ణారెడ్డి గూడా ఇలాగే చేస్తాడు. ఆయనే తన చిత్రాలకు ప్రింట్సు బహు పరిమితంగా తీసి ఇండియాలో పలుచోట్ల ప్రదర్శనలో అమ్మారు. బొంబాయిలోని ప్రముఖ చిత్రకారుడు అల్మేల్కర్, ఒకే చిత్రాన్ని రెండు మూడు సార్లు వేసి, ఇద్దరు ముగ్గురికి ఒరిజినల్ చిత్రం ఇది ఒకటే వేశానని చెప్పి, అమ్మాడు. ఒక రోజున అలా కొన్నవాళ్ళు ఒకరింట్లో ఒకరు ఆ చిత్రాల్ని చూచుకొని తెల్లముఖం వేశారు. వారు మద్రాసు వచ్చి నాదగ్గర కూడా కొన్ని చిత్రాలు కొనడం జరిగింది. ఈ సంగతి వారు చెబితే ఆశ్చర్యమేసింది. కృష్ణారెడ్డి, జామినీ రాయ్ అలా చెయ్యరు. కొనేవాళ్ళు ఇష్టపడితే కొంటారు లేకపోతే లేదు. రాయ్ వద్దకు వచ్చి కొనేవాళ్ళు, ఆయన లోగడ వేసిన చిత్రాల మాదిరివి మరల వేసిమ్మని అడిగి వేయించుకుంటారు. ఇది తప్పా కాదా అనేది మనం చూచిన కోణాన్ని బట్టి వుంటుంది.


దుర్గ లక్ష్మి సరస్వతి

విచిత్రమైన విషయం ఏమిటంటే రాయ్ దాదాపు చిత్రకళా ప్రదర్శనలకు చిత్రాలు పంపడనే చెప్పాలి. ఆయన ఇల్లే చిత్రకళా ప్రదర్శనశాల. కొనదల్చుకున్న వాళ్ళు రాయ్ ఇంటికే వెళ్ళి కొంటారు. ఆయన బెంగాలీ వాడవడం అదృష్టం. దేశంలో అన్ని భాషల్లో, అన్నిచోట్ల ఎన్నో వ్యాసాలు, చిత్రాలు, ప్రచురణలు జరిగాయి. ప్రముఖ విమర్శకులు ఆయన గురించి ప్రచారం చేశారు కొంతమంది గొప్పవాడనీ, కొంతమంది నమూనాలు తీసే యంత్రమని. చిలికి చిలికి గాలివాన అయినట్లు బ్రహ్మాండమై కూర్చున్నాడు రాయ్. దాదాపు అంత గొప్పవాడైనా మన తెలుగు చిత్రకారుడు శ్రీ కె. శ్రీనివాసులుకు అలా జరగలేదు. అది శ్రీనివాసులుగారి దురదృష్టం. మన ఆంధ్రుల దురదృష్టం.

“ఏమిటి నీ అధునాతన సృష్టి, రాయ్?” అని సుప్రసిద్ధ కళా విమర్శకుడు, రచయిత శ్రీ జి. వెంకటాచలంగారు అడిగితే ఒక చిన్న మట్టిపాత్రను, కొద్ది దిజైనులతో అలంకరించి వున్నదాన్ని చూపిస్తూ, “ఇదే నా ఉత్తమోత్తమమైంది, అధునాతనమైందీ,” అని చెప్పాడు.

“అక్కడినుండేగా నీవు కళని ఆరంభించింది?” అని చురక వేస్తూ అడిగారు వెంకటాచలంగారు.

“ఆది అంతాలు ఒకటి కాదూ?” అని వేదాంతీకరించాడు రాయ్. తోటి చిత్రకారులు అనుకునేంతటి అమాయకుడు, చదువుకోనివాడు కాదనిపిస్తుంది ఈ జవాబు వింటే.


మదర్ అండ్ ఛైల్డ్

రాయ్ చాలా సుకుమార మనస్కుడు. ఏమాత్రం కష్టమైన మాటైనా భరించలేడు. అసాధ్యమైన ఓపికతో, ఎవరి అండా లేకుండా, తను నమ్మిన కళలో సాధన చేశాడు ఎన్నో సంవత్సరాలు. అలా ధైర్యంగా, దూరంగా వుండి కృషి పెట్టిన చిత్రకారులు మన దేశంలో ఎవరూ లేరు. ఆయనకు అదృష్టం కలసి వచ్చింది. అనుకున్నది సాధించాడు. విత్తం, విఖ్యాతి రెండూ పొందాడు ఎవరూ ఊహించలేనంతగా. మనం అందరం సంతోషించదగిన విషయమే ఇది. కానీ, తోటి చిత్రకారుల సంగతి వేరు. పద్మశ్రీలు, మరెన్నో ప్రభుత్వ గౌరవాలు పొందిన ప్రముఖ భారతీయ చిత్రకారులు కొందరు బాహాటంగా, రహస్యంగా ఎన్నో పరుషాలు పలికారు రాయ్ గురించి. రాయ్ ఔన్నత్యాన్ని ఓర్వలేక కుతకుత వుడికిపోయారు. వారు చెయ్యగలిగినంతగా విషపూరితం చేశారు వాతావరణాన్ని రాయ్‌కి వ్యతిరేకంగా. కాని, రాయ్ నిలిచాడు. ఎందువల్ల? చిత్రకారుడుగా ఆయన నిజాయితి, పట్టుదల, కృషి అండగా నిలిచాయి. ఆయన్ను గురించి తోటి చిత్రకారులు అలా అసూయ పడడం, పరుషంగా ప్రచారం చెయ్యడం రాయ్ హృదయానికి గుచ్చుకుంది. రాయ్ మాట్లాడుతుంటే ఎవరితోనైనా ఈ బాధ బహిర్గతమౌతుంది. తన బాధను ఒకసారి జి. వెంకటాచలంగారికి వెళ్ళగ్రక్కుకున్నాడు. “ఎందువల్ల నా పాత స్నేహితులంతా వ్యతిరేకం అయ్యారు నాకు? నేనేమీ హాని చెయ్యలేదే వారికి. నమ్మండి. ఇల్లు వదిలి అసలు బైటికే వెళ్ళను. ప్రదర్శనలు, శుభకార్యాలకు వెళ్ళి పది సంవత్సరాలు పైన అవుతుంది. ఇతరుల చిత్రాల గురించి విమర్శించే అంత తెలివి అయినా లేదు. నా సిద్ధాంతం ప్రకారం అలా విమర్శించను గూడాను.” అని ఎన్నో చెప్పుకొని తన మానసిక బాధను తేలిక పర్చుకున్నాడు.

చిత్రకారునికి ఒక్కసారిగా అదృష్టం కలిసివచ్చి, చిత్రాలపై మెచ్చుకోలు, కీర్తిరేఖలు నలుదిక్కులా ప్రాకితే, గవర్నర్లు, ధనికులు, విదేశీయులు ఎడతెగక చిత్రకారుని ఇంటికి వచ్చి చిత్రాలు కొనుక్కు వెళ్తుంటే, అసూయతో నిండిన తోటి చిత్రకారులకు మరుగుతున్న పాలకుండలో కూర్చున్నట్లుంటుంది. నిజమే. అయినా సహించగల నిబ్బరం రాయ్‌కి వుంది. చిత్రరచనకై కూర్చోగానే ఇవన్నీ మర్చిపోయి రంగుల లోకంలో విహరిస్తూ, ఆనందాన్ని తాను పొందుతూ, ఇతరులకు గూడ పంచిపెడ్తాడు.


మదర్ అండ్ ఛైల్డ్ 2

నేను ఎన్నో చిత్రాలు చూచాను రాయ్‌వి పెక్కుచోట్ల. ఆయన అంటే ఎంతో గౌరవం, ఆయన చిత్రాలంటే అభిమానం. నన్ను మరో లోకాలకు తీసుకుపోతాయి. ఆయన బెంగాల్ పట్ చిత్రాలనుండి వెయ్యనివ్వండి, స్వంతంగానే వెయ్యనివ్వండి, అది వేరే విషయం. కండ్లకు హాయిగా, మనసుకు ప్రశాంతంగా వుంటాయి చిత్రాలు. అయినా ఒకటి నాకు తోస్తుంది. రాయ్ చిత్రాలు ఎప్పటినుండో చూస్తున్న తర్వాత ఆయన చిత్రశైలి గిడసబారి పోయిందనిపిస్తుంది. ఆశించినంత మార్పు, చేర్పు రాలేదు రాయ్ చిత్రసంచయంలో. ఇది నేను చెప్పక తప్పదు. పది సంవత్సరాల క్రితం చిత్రాలకు, ఇప్పటి చిత్రాలకు తేడా ఏమిటి అని రెండు చిత్రాలు దగ్గరగా పెట్టి చూస్తే, అంతగా భేదం కనిపించదు. కాలంతో పాటు చిత్రాలలో మార్పు రాలేదు. బహుశః రాయ్ ఆర్థిక విజయమే ఇందుకు కారణమయితే అయివుండవచ్చు ననుకుంటాను. పాతపద్ధతిలోనే పదేపదే చిత్రించినా, వెంట వెంటనే అమ్ముడు పోతుంటే క్రొత్త పోకడలతో వేసే ప్రయత్నానికి అవకాశమేది? అలా వేసే అవసరం గూడ రాలేదేమో వారికి! విమర్శనాదృష్టితో చూస్తే ఎలా రాయ్‌ని ఇప్పటి అధునాతన చిత్రకారుల స్థాయిలో వుంచగలం? నిత్యం మారుతున్న కాలాన్ని బట్టి ఎన్నో ప్రయోగాలు ఎడతెగక చేస్తున్న మన చిత్రకారుల్లో రాయ్‌కి చోటు అంతగా వుండదేమో! అదే రంగుల మిశ్రమం, అవే రేఖల వంపులు, అవే ఆకార వికారాలు ఎంతగా ఎన్నిసార్లు చూస్తాం. విసుగు పుడుతుంది. అలానే తయారయింది రాయ్ చిత్రకళ ఇప్పుడు.


ముగ్గురు స్త్రీలు

జామినీ రాయ్ భారతీయ చిత్రకారుల్లో చిరస్థాయిగా నిలిచే ధృవతార. జానపద కళకు ఉన్నత గౌరవాన్ని తెచ్చిన పితామహుడు. వెలికితెచ్చిన ఈ కళలో ఎంతోమంది చిత్రకారులు సాధన చేసి ఖ్యాతి పొందారు. అత్యంత ఆధునికంగా వస్తున్న చిత్రకళారంగంలో ఆయన విడిగా నిలబడి పలకరిస్తాడు. ఒకనాడు గ్రామాల్లో బీదవారి ఇండ్లలో వుండే ఈ జానపద చిత్రకళ, నేడు ఆధునిక గృహాలను అలంకరించింది. మరచిపోయిన మన గ్రామజీవిత కళా శోభల్ని, గ్రామీణుల అభిరుచుల్ని, సంతోషాన్ని, వారి ధర్మాల్ని మనకు చిత్రాల ద్వారా ఎరుక పరిచాడు. ఆకర్ణాంత నయనాలతో, పల్లెటూరి ముతక రంగుబట్టల్లో వయ్యారంగా వివిధభంగిమల్లో నిలిచి, పసుపు పూసుకున్న ముఖాలతో నిండుగా, ఆధునికులమైన మనల్ని, అమాయకంగా తేరిపార చూస్తారు జామినీ రాయ్ స్త్రీలు. తీర్చిదిద్దిన తిలకం, అప్పుడే చేయించుకున్న వెండి, బంగారు ఆభరణాలతో, వివిధ ముఖభావాల్లో మనకు ప్రత్యక్షమౌతారు. జీవితంలో నిరాడంబరంగా, హాయిగా ఎలా వుండచ్చో నేర్పుతారు.


జీసస్ క్రూసిఫైడ్

క్రీస్తు చిత్రాల్లో బాధనీ, దయనీ ఒలికిస్తాడు రాయ్. క్రీస్తు, ప్రజలే తనను చంపుతున్నా ఆ ప్రజలనే దయతో చూస్తాడు. వారికై జాలిపడతాడు. వారి జ్ఞానానికై మేలుకై భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. ఈర్ష్యకి, కోపానికి, బాధకి అతీతుడు క్రీస్తు. ఆయన కండ్లలోని లోతు అనంతం. ఆయన ఒలికించే కరుణ అపారం. ఏమిటి ఆయన సందేశం మనకి? ఏమిటి ఆయన నోటితో చెప్పే శక్తి లేక కండ్లతో అందిస్తున్న ఉపదేశం? అది తెలుసుకోనేందుకే మనం రాయ్ వేసిన క్రీస్తు చిత్రాన్ని సదా చూస్తుంటాం. ఎంత చూచినా తనివి తీరని, మనం తెలుసుకోలేని సందేశం ఆ క్రీస్తు చిత్రం ఇస్తుంది.

శివుడు, పార్వతి, గంగ చిత్రం ఎంత పెద్దవాళ్ళమైనా, వయసులో మనల్ని పిల్లలుగా చేస్తుంది మరల ఒక్కసారి. చిన్నతనంలో మనం ఆడుకున్న దేవుళ్ళ బొమ్మల్ని జ్ఞాపకం తెస్తుంది. ఎంత భక్తిగా మ్రొక్కేవాళ్ళమో ఆ బొమ్మలకు. మనం మ్రొక్కుకున్నది, కోరికలు చెప్పుకున్నది, కోపంతో నృత్యం చేసే తాండవశివుణ్ణి కాదు. ఇలాంటి కరుణాపూరిత దయామయుణ్ణే. శివతాండవాన్ని చూచి మనం జడుచుకుంటామని, పెద్దవాళ్ళు ఇలాంటి నిండైన బొమ్మలు ఇచ్చేవారు మనకి, ఆడుకోవడానికి. ఈ చిత్రం గూడా అంత పవిత్రమైన పసిమనసుతో వేసిందే. అందుకే చిత్రం మనల్ని నిలబెడుతుంది. ఇంత సునాయాసంగా ఇలాంటి చిత్రం వెయ్యడం, చాలా కష్టం చిత్రకారులకు. ఇది నా అనుభవం లోని మాట. నిజానికి జామినీ రాయే వెయ్యగలడు అంత తేలికగా. మరో సిద్ధహస్తుడు లేడు.


మడోనా & ఛైల్డ్

మడోనా & ఛైల్డ్‌లో ఆధునిక పోకడలు పోయాడు రాయ్. నేటి చిత్రకళకు ఎంత దూరంగా వున్నా, ఈ కాలంలో వున్నాడు కాబట్టి ఆధునిక చిత్రకళా ప్రభావాన్ని తప్పించుకోలేక పోయాడు. పలు ఆయతనాలతో చిత్రాన్ని నింపాడు. అవే ఇండ్లు. గాలిలో ఈదుతున్న చేపలు, ఎగిరివస్తున్న రూపాలతో వింతగా వుంటుంది చిత్రం. ఆయనలో వచ్చిన పెద్ద మార్పు ఈ చిత్రంలో కనిపిస్తుంది. రాయ్‌కి సహజంగా వున్న రేఖ మీద గల అధికారం సుస్పష్టంగా కనిపిస్తుంది ఈ చిత్రంలో. మామూలుగా అన్ని చిత్రాలలో మాదిరిగా ద్వి ఆయతన విధానంలో చిత్రించినా, నూత్నత్వం కొట్టవచ్చినట్లు చిత్రంలో కనిపిస్తుంది. రాయ్ చిత్రాలు రంగుల్లోనే చూడాలి. ఆయన ఎంతెంత భావాన్ని ఒక్కో రంగులో చూపగలడో తెలుస్తుంది. అప్పుడే మనం ఆనందించగలం.

“జీవితానుభవం, బాధలు, మానసిక శారీరక సమస్యల చికాకుల నుండి వచ్చేదే కళ” అంటాడు రాయ్. ఇది ఎంతైనా సత్యం. ఆయన జీవితాన్ని చూస్తే తెలుస్తుంది ఎన్ని కష్టాలను, ఎదురుదెబ్బలను తిన్నాడో, మానసికంగా ఎంత కుతకుత వుడికిపోయాడో. అది అంతా తానే ద్రిగమింగి, మనకు అందిస్తున్నాడు వెన్నెల లాంటి స్వచ్ఛమైన, అపూర్వమైన జానపదకళని. నిజానికి రాయ్ పేరులోనే వుంది అది. యామిని అనే పదాన్ని జామిని అని పలుకుతారు బెంగాలీయులు. యామిని అంటే చీకటి అని అర్థం. ఆయన చిత్రాలు ఎప్పుడూ మన మనసులో మెదుల్తుంటాయి. చిత్రాలతోబాటు ఆ చిత్రాల వెనుకగా జామినీ రాయ్ మసకగా కనిపిస్తుంటాడు మన అంతర్ దృష్టికి.

(మొదటి ప్రచురణ: భారతి, 1959. ఈ వ్యాసంలోని కొన్ని చిత్రాలను ఇంటర్నెట్ నుండి సేకరించాము – సం.)