గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి

దక్షిణ భారత దేశంలో కర్ణాటక సంగీత దిశానిర్దేశక విషయ ప్రస్తావన వస్తే రామామాత్యుడు మొదలుకొని, అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు, త్యాగయ్య ఇలా ఒకరేమిటి ఎంతో మంది తెలుగు వారు తమ సర్వస్వాన్నీ సంగీతానికి ధారపోశారు. ఈనాడు కర్ణాటక సంగీతం సశాస్త్రీయంగా, శుద్ధంగా ఉండడానికి కారణం వీరే. వీరందరి పేర్లు మనకి చిరపరిచితమే. కానీ నిశ్శబ్దంగా, నిర్విరామంగా సంగీతానికి తొంభయ్యేళ్ళకి పైగా కృషి చేసిన ఒక మహానుభావుడి గురించి మనలో చాలామందికి తెలియకపోవచ్చు. ఈ వ్యాసం ప్రధానోద్దేశ్యం – మన మధ్యే ఉన్న ఆ శతవసంతాల సంగీతచూడామణి అందించిన సంగీత సర్వస్వం గురించి ముచ్చటించడం.

ఆ మహా మనీషి డా. శ్రీపాద పినాకపాణి.


డా. శ్రీపాద పినాకపాణి

సంగీత ప్రపంచంలో ఆయన గురించి తెలియని వారుండరు. నూరేళ్ళ సంగీతయానం ఆయనది. వృత్తి రీత్యా వైద్యుడయినా సంగీతజ్ఞుడినని చెప్పుకోవడానికే ఇష్టపడే అరుదైన వ్యక్తిత్వం ఆయనది. ఆయన కేవలం గాయకుడే కాదు; కేవలం వైణికుడే కాదు. సంగీత శాస్త్రాన్ని క్షుణ్ణంగా ఆపోశన చేసిన వాగ్గేయకారుడు. సంగీతమూ, విజ్ఞానమూ పదిమందితో పంచుకున్నప్పుడే అది పదికాలాలపాటూ నిలుస్తుందని నమ్మిన ఆయన ఎంతో మంది శిష్యుల్ని ఆణి ముత్యాలుగా మలిచారు. సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి, ఓలేటి వేంకటేశ్వర్లు, నూకల చినసత్యనారాయణ, శ్రీరంగం గోపాలరత్నం, మల్లాది బ్రదర్స్, ప్రసిద్ద సినీ గాయని ఎస్. జానకి, ఇలా ఎందరో మహామహులు ఆయన వద్ద సంగీతం నేర్చుకున్నారు. వారందరూ శ్రీపాద వారి గురించి అనే ఒకే మాట – ఆయన గురువులకే గురువని.

శ్రీపాద పినాకపాణి ఆగస్ట్ 13, 1913న శ్రీకాకుళంలో ప్రియాగ్రహారంలో ఒక సంగీత కుటుంబంలో జన్మించారు. తండ్రి కామేశ్వరరావు, మైసూర్ బి. లక్ష్మణరావు గార్ల వద్ద 11వ యేట మొదటి పాఠాలు నేర్చుకున్నారు. ఆయన నేర్చుకున్న మొదటి కృతి గజానన సదా. ఆ వయసులోనే ఆ కృతికి స్వరరచన చేసిన శ్రీపాద ఆ తరువాత ఎన్నో కృతులకు తనదైన పద్ధతిలో స్వరరచన చేసుకొని నేర్చుకున్నారు. ప్రముఖ వయొలిన్ విద్వాంసులు ద్వారం వేంకటస్వామి నాయుడు, శ్రీరంగ రామానుజ అయ్యంగార్ల వద్ద శిష్యరికం చేసి సంగీతంలో ప్రావీణ్యత సాధించారు. 1938లో ఆంధ్రా యూనివర్శిటీ మెడికల్ కాలేజీనుండి వైద్యంలో పట్టా తీసుకున్నారు. ఈయనకి రాగాలు కట్టాలన్నా, రోగాలు కట్టాలన్నాఒకటే మక్కువని అప్పట్లో అందరూ అనుకునేవారట.


శ్రీపాద స్వర్ణకంకణం

సంగీతంలో ఈయన చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో, సంగీత నాటక అకాడమీ పురస్కారంతో, మద్రాసు సంగీత సభ వారు సంగీత కళానిధి బిరుదుతో, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణతో సత్కరించారు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతికశాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా ఆయనకు స్వర్ణకంకణాన్నీ, గానవిద్యా వారిధి బిరుదునూ ఇచ్చి, ఆయన గౌరవార్థం కర్నూలులో శత జయంత్యోత్సవ వేడుకలు నిర్వహించారు. గత ఎనిమిదేండ్లుగా ఆయన మంచం పట్టి ఉన్నా, ఆయన మేధ ఏమాత్రమూ పదును తగ్గలేదనీ, ఇప్పటికీ ఆయన ఎంతో ఆసక్తితో సంగీతం గురించి చర్చిస్తారనీ వారి శిష్యులు చెప్తుంటారు.


మన పూర్వీకులు సంగీతాన్ని రెండు రకాలుగా విభజించారు. మొదటిది మార్గ సంగీతం – అంటే భరతముని ప్రవచించిన సంగీత పద్ధతి. రెండోది దేశీయ సంగీతం – దేశకాల సంబంధమైన జనరంజక సంగీతం. ప్రస్తుతం మన సంగీతాన్ని దేశీయ సంగీతమనే వ్యవహరిస్తాం.


మూడు తరాలు – శ్రీపాద, నేదునూరి
మల్లాది బ్రదర్స్ (లోకాభిరామం బ్లాగ్ నుంచి)

జనరంజకమయిన పాటకు కూడా ఒక మార్గము, పద్ధతి ఉంటాయి. కూనిరాగం కావచ్చు, లేదూ జానపదం, శాస్త్రీయం కావచ్చు; ఏ పాట అయినా, లయబద్ధమై ఉంటుంది. పాటకి లేదా శబ్దానికి ఆ లయకు తోడుగా, రూపం, నడక కలిసినప్పుడు అది జనరంజకం అవుతుంది. ఆ శబ్దప్రకరణాన్నే రాగం అన్నారు. అంటే వివిధ శబ్దాలను ఒక పద్ధతిలో ఒక నడకకి నప్పితే అదొక రాగం అవుతుంది. ఇక్కడ శబ్దం అంటే స్వరంగా భావించాలి. మన పూర్వీకులు అలా పొడిపొడి శబ్దాలు లేదా స్వరాల నడకకి సరైన మాటలు లేదా పదాలు అమర్చీ, వారికిష్టమైన భావాలు ఆయా పదాల్లో చొప్పించీ పాడేవారు. దీన్నే గీతం లేదా పాట అనేవారు. ఈ పాట ఒకరి నుంచి మరొకరికి వినికిడి ద్వారానో లేదా అనుసరణ ద్వారానో చేరేది. ఇటువంటి చక్కని గీతాన్నే సంగీతం అన్నారు. సంగీతం అంటే సమ్యక్ గీతం – అంటే ఒక చక్కని పాట.

సంగీత శాస్త్రానికి ప్రథమంగా శార్ఙ్గదేవుడు సంగీత రత్నాకరం రచించి ఒక పద్ధతిని సూచించాడు. తరువాతి కాలంలో రామామాత్యుడు తాను వ్రాసిన ‘స్వరమేళ కళానిధి’ లో రాగ లక్షణాలను బట్టి వాటిని ఒక శాస్త్రీయపద్ధతిలో కూర్చడానికి ప్రయత్నించాడు. తరువాత వేంకటమఖి ఆ ప్రతిని సరిదిద్ది, కొత్త ప్రతిపాదనలు చేస్తూ 72 మేళకర్తరాగ విభజన చేసి సంగీతానికి ఒక శాస్త్రీయత చేకూర్చాడు. ఈ పద్ధతినే ప్రస్తుతం మనం అనుసరిస్తున్నాం.

ఇదంతా 16, 17 శతాబ్దాల్లో జరిగింది. రాగవిభజన చేసి సంగీతానికి ఎంత శాస్త్రీయత చేకూర్చినా, వాగ్గేయకారుల రచనలు మాత్రం గురుముఖంగానే నేర్చుకోవల్సి వచ్చేది. ఈ క్రమంలో కృతీ, వర్ణమూ వంటివి అటూ ఇటూగా రూపాంతరం చెందేవి. ఏది సరైనదన్న ఒక నిర్ధారణకి రాలేక సంగీతజ్ఞులు సందేహంలో మునిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాలక్రమేణా సంగీతంలో చాలా మార్పులొచ్చాయి. ముఖ్యమైన మార్పు ఏమిటంటే పాటకి రాగాన్ని అనుసరించి స్వరం రాయడం. దీన్నే మనం స్వరరచన (Notation) అని అంటాం.

మన పూర్వీకులయిన ఎంతో మంది వాగ్గేయకారుల రచనలు స్వరరచన లేకపోవడం, స్వరాలు తెలియకపోవడం వలన పాట తీరూ, రూపమూ తెలుసుకోవడం కష్టమవుతుంది. ఇలా నొటేషను లేకుండా ప్రస్తుతం మనకి లభించిన అనేక క్షేత్రయ్య పదాలూ, జావళీలూ, అన్నమయ్య సంకీర్తనల వంటివాటికి ఆ వాగ్గేయకారులు ఎలా స్వరపరిచారో, ఏ విధంగా పాడేవారో తెలియకుండా పోయింది. అప్పటికీ, ఇప్పటికీ రాగాల పేర్లలో మార్పులు రావడంతో ఈ ప్రయత్నం మరింత కష్టతరమయింది. ఈ కారణాల వల్ల అనేక సంగీత రచనలు మరుగున పడిపోయాయి.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మన మధ్యనే ఉంటూ ఇటువంటి సంగీత రచనలనీ ఏర్చి కూర్చి, వాటికి వాగ్గేయకారులు నిర్దేశించిన రాగాల్లో స్వరాలు వ్రాసి, వాటిని ముందు తరాలకి అందించిన శ్రీపాద పినాకపాణిగారి బృహత్కార్యాన్ని పరిచయం చెయ్యడం కోసం. ఒకటీ రెండూ కాదు, 1500 పైచిలుకు వాగ్గేయకారుల కృతులకి స్వరరచన చేసి ఒక చోట పుస్తకంగా అచ్చు వేయడానికి ఒక జీవితకాలం కావాలి. శ్రీపాద తన జీవితకాలాన్ని ఇందుకే వెచ్చించారు.


కర్ణాటక సంగీతానికి పినాకపాణి వారు అందించిన విలువైన కానుకలు ఆయన రాసిన పుస్తకాలు: పల్లవి గాన సుధ, మేళరాగమాలిక, మనోధర్మ సంగీతం, సంగీత సౌరభం (నాలుగు సంపుటాలు). కొద్దికాలం క్రిందట ప్రచురించబడిన స్వరరామం, అభ్యాసం, ప్రపత్తి అనే మూడు పుస్తకాలు సంగీత విద్యార్థులకి ఎంతో ఉపకరించేవి.


శ్రీపాదతో కృష్ణమూర్తి, శివానందమూర్తి

ఇవి కేవలం పుస్తక రూపేణా అందించిన సంగీత రచనలు. ఇవికాక స్వరాలు లభ్యంకాని ఎన్నో కృతులకు సశాస్త్రీయంగా రాగ బద్ధంగా కూర్చిన స్వరరచనలు మరికొన్ని మచ్చుతునకలు. అన్నింటికన్నా గొప్ప విషయం తన వద్దకి వచ్చినవారికి కాదనకుండా సంగీతం నేర్పడం; తనకున్న సంగీత జ్ఞానాన్ని పరిపూర్ణంగా అందించడం. విశాల హృదయం ఉంటే తప్ప నిష్కల్మషంగా సంగీత బోధన జరగదు. ప్రముఖ వైణిక విద్వాంసురాలు మేడూరి సుబ్బలక్ష్మి కర్నూలులో ఆయన వద్ద మూడేళ్ళు సంగీతం నేర్చుకున్నారు.

సంగీతం – ఒక ప్రశంస – శ్రీపాద పినాకపాణి

“త్యాగరాజునీ, దీక్షితారునీ, శ్యామశాస్త్రినీ నేను చూడలేదు. వాళ్ళ పాటలు వినడమే తప్ప వ్యక్తిగతంగా మనకి వారు తెలియదు. పినాకపాణి గార్ని చూస్తే ఓ త్యాగరాజూ, ఓ దీక్షితారూ, ఓ శ్యామశాస్త్రీ – ఈ ముగ్గురి రూపం ఒక మనిషిని ఆవహించిందా అనిపిస్తుంది. చాలా మంది గురువులు సంగీత పాఠం చెబుతారు. పినాకపాణిగారు మాత్రం అలా కాదు. నేర్చుకునే వారికి అది సంపూర్ణంగా, క్షుణ్ణంగా వచ్చే వరకూ తాపత్రయపడతారు. సంగీత పాఠం చెప్పడంలో శిష్యులకుండాల్సిన శ్రద్ధ, జిజ్ఞాస కంటే వందరెట్లు ఎక్కువగా ఆయనలో కనిపిస్తుంది. అటువంటి వారి వద్ద నేర్చుకోవడం ఒక అదృష్టం. ఆయన వట్టి గురువు కాదు. గురువులకే గురువు. గురువంటే ఇలా ఉండాలి అన్న దానికి ఆయనే ఒక పెద్ద నిర్వచనం,” అని పినాకపాణి గారి గురించి మేడూరి సుబ్బలక్ష్మి అంటారు.

ఇది కేవలం వారి అభిప్రాయమే కాదు, ఆయన వద్ద శిష్యరికం చేసిన ప్రతీ వారూ అనే మాటే ఇది. “గొప్ప వ్యక్తులు పుట్టుకతో గొప్పవారు కారు. వారి సంస్కారం, ఎదుటివారి ఎడల చూపించే ప్రేమల వల్ల గొప్పవారవుతారు,” అని సుబ్బలక్ష్మి చెప్తారు.

సీతాపతి గారి క్షేత్రయ్య పదములు అనే పుస్తకానికి ముందు పీఠికలో ఈ. కృష్ణయ్యర్ ఇలా అంటారు.

“మన దేశమందు వెలసియుండిన కళలలో నేటికీ మనం నిలబెట్టుకొని జ్ఞప్తి యందుంచుకొనిన వాటికంటె ఎక్కువ కళలను పోగొట్టుకొని మరచి పోయినాము. ఇది మన దురదృష్టం. రాబోవు తరముల వారు పాడుకొనుటకు ఉపకరించునట్లుగా స్వరమెట్లతో క్షేత్రయ్య తక్కిన చాలామంది వాగ్గేయకారుల వలనే తన పదములు రచించలేదు. పాడవలసిన తీరు తెలియక అనేక పదములు పోయినవి. పదములు సేకరించుట కూడా చాలా కష్టమైన పని. ఎన్నో మారుమూలల దాగి యున్నవి. ఎంతో శ్రమపడి వాటిని సంగ్రహించవలసియున్నది. సంగ్రహించిన పదములలో ఏవి వాస్తవముగా క్షేత్రయ్య రచించినవో, ఏవి కావో ముద్రలేని పదముల విషయములో చెప్పుకొనుట కష్టముగానున్నది. ఇప్పుడు పాడుచున్న పదములలోనైనను సరియైన పాఠములేవో తెలుసుకొనుట చిక్కుగా నున్నది. కడు కొద్ది మంది మాత్రమే సంప్రదాయ సిద్ధములను, శుద్ధములను నగు పాఠములను చెప్పగలరు…”


రాగలక్షణం (సంగీత సౌరభం)

పై మాటలు కేవలం క్షేత్రయ్య పదాలకి మాత్రమే వర్తించవు. మరుగున పడిన ఎంతో మంది వాగ్గేయకారుల రచనలకీ అది వర్తిస్తుంది. నారాయణ తీర్థుల తరంగాలు కానీ, అన్నమయ్య పదాలు కానీ, రామదాసు కీర్తనలు కానీ వీటికి సాహిత్యం మాత్రమే ఉంది తప్ప, సంగీతపరంగా స్వరాలు పదిలపరచి లేవు. ప్రతీ పాటకీ కేవలం రాగాల పేర్లు మాత్రమే లభ్యమయ్యాయి. అందువల్ల వారు ఆ పాటల్ని ఎలా స్వరపరిచి పాడారో చెప్పడం సాధ్యం కాదు.

పినాకపాణి వారు ఇటువంటి అనేకమంది వాగ్గేయకారుల సాహిత్యానికి స్వరాలు కూర్చి, సొంతంగా బాణీలు కట్టి పొందుపరిచారు. సంగీత సౌరభం అనే పుస్తకంలో అన్నమయ్య కీర్తనలూ, క్షేత్రయ్య పదాలూ, జావళీలూ, వర్ణాలూ ఇలా దాదాపు రెండు వేలకి పైగా పాటలకు స్వరరచనను అందించారు. ఈ ప్రయత్నానికి ఎంతో సహనం, ఓర్పు, శ్రద్ధ, నిబద్ధత కావాలి. తన ముందు తరాలకి పూర్వపు వారందించిన సంగీత సంపద చేరాలన్న తపన వల్లనే ఇది సాధ్యమయింది. ఆయనే ముందుమాటలో చెప్పినట్లుగా, “ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులలో పెద్దలు పాడి ప్రచారము చేసిన పాఠాంతరములలో కర్ణాటక సంగీత లక్ష్య, లక్షణ సంప్రదాయము నిబద్ధమై ఉంటుంది. అటువంటి కృతులను కనీసం వెయ్యింటినైనా సేకరించి వీలైనంత మట్టుకు వివరములతో స్వరపరచి ఆంధ్ర యువతరాని కందజేయగలిగితే, వారి కృతి సంపదలతో పాటు సంగీత జ్ఞానము, సంగీతపు బాణి, గీటుకందిన అంతస్థు చేరుకుంటాయి అనే ధీమాతో నేను చేసిన ప్రయత్నమీ గ్రంథరచన.

కేవలం సాహిత్యం ఉన్న పాటలకి స్వరం కూర్చడం అంత సులభం కాదు. ముఖ్యంగా పూర్వపు వాగ్గేయకారులు నిర్దేశించిన పాటలకి రాగాల పేర్లున్నాయి కానీ స్వరాలు లేవు. అందువల్ల వారు చెప్పిన రాగంలోనే కట్టాల్సి వస్తుంది. వాటిలోని రాగాలు ప్రస్తుతం వాడుకలో ఉండకపోవచ్చు. లేదా మరొక పేరుతో పిలవబడవచ్చు. ఉదాహరణకి ఎన్నో అన్నమాచార్య కీర్తనల్లో పేర్కొన్న రాగాలు (తెలుగు కాంబోది, కొండమలహరి వంటివి) ప్రస్తుతం లేవు. అప్పుడు వాడుకలో ఉన్నా అవి ఎలా వుండేవో తెలియదు. అటువంటి సందర్భాల్లో సాహిత్యానికి అనుగుణంగా ఉన్న రాగం ఎన్నుకోవాల్సి వస్తుంది. ఆయా రాగాన్ననుసరించి భావం చెడకుండా సాహిత్యానికి నప్పుతూ స్వరపరచాల్సి ఉంటుంది. ఈ పని చెయ్యాలంటే ముందుగా ఎంతో సంగీతజ్ఞానం కావాలి. రాగాల మీద పట్టు సాధించాలి.


క్షేత్రయ్య పదం స్వరరచన

వివిధ వాగ్గేయకారులు రచించిన పాటలకు స్వరాలతో, అనుస్వర, గమక సహితంగా స్వరరచన చేసి పినాకపాణి సంగీత సౌరభంలో పొందుపరిచారు. అందులో కూడా వాడుకలో ఉన్న కొన్ని కృతులలో స్వరస్థానాలని సవరించి వాటిని, విద్వాంసులతో చర్చించి మరీ, సాధికారకంగా ప్రచురించారు. “నేను సేకరించిన కృతులు, పదములు, జావళీలు మొదలైన సంగీత రచనలన్నీ నేను నేర్చి, పాడుకొని, స్వరపరచి భద్రపరచినవే. ఇతరుల పాఠాంతరములను ఇంతకు పూర్వం ప్రచురింపబడిన గ్రంథముల నుండి తస్కరించలేదు. చాలాభాగం గురుముఖంగా నేర్చుకున్నవే; కొన్ని విద్వాంసుల నాశ్రయించి వారు పాడుతూ చెప్పగా నొటేషనుతో వ్రాసుకున్నవి; కొన్ని చిన్న కృతులు పదే పదే విని నేర్చుకున్నవి; నా చిన్ననాటి నుండీ (1930 సం||మొదలు) గ్రాంఫోను రికార్డులలో పూర్వతరం విద్వాంసులు పాడి వాయించి ఉన్న కృతులు కొన్ని; ప్రముఖ గాయకులు రేడియో ద్వారా వినిపించిన క్రొత్త కృతులను Cassette Tapes మీద ఎక్కించుకొని, వాటిని సావధానంగా నొటేషనుతో వ్రాసి నేర్చుకున్నవి కొన్ని:- ఈ విధంగా అన్నీ పెద్దలనుండి స్వయంగా నేర్చి సేకరించిన కృతులనే సమర్పించుకుంటున్నాను. ఇది వరలో నేర్చియున్న పాఠాంతరములలో నీరసంగా ఉన్న కృతులను దరిమిలా మనసుకు నచ్చిన పాఠాంతరములు విని సవరించుకున్నాను.

ఈ సంగీత సౌరభం నాలుగు సంపుటాల్లో మూడు వందలకు పైగా అన్నమాచార్య కీర్తనలను స్వరయుక్తం చేశారు. కొన్ని కృతులు తక్క, అన్నమాచార్య కృతులు ఏఏ రాగాల్లో రాగిరేకుల్లో ఉన్నాయో అవే రాగాలలో వాటికి స్వరాలున్నాయి. ఉదాహరణకి, అతి ప్రసిద్ధమైన “బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే – తందనానా ఆహి, తందనానా పురే” పదం ప్రస్తుతం మనం బౌళి రాగంలో పాడగా వింటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన అన్నమయ్య కీర్తనల్లో కూడా బౌళి రాగమనే ఉంది. బాలమురళిగారు మాత్రం భూపాలంలో పాడిన ఈ పాటను పినాకపాణి గారు శంకరాభరణంలో స్వరపరిచారు.

అలాగే ఈ సంగీత సౌరభంలో నూటికి పైగా క్షేత్రయ్య పదాలు ఉన్నాయి. సుమారు తొంభై జావళీలున్నాయి. తిల్లానాలూ, తిరుప్పుగళ్ వంటి రచనలు కూడా ఉన్నాయి. వీటిలో త్యాగరాజాది తదితరుల కృతులూ, దీక్షితార్, శ్యామశాస్త్రుల కృతులు కూడా ఉన్నాయి. ఇందులోని అన్నమయ్య కీర్తనల్లో సింహభాగం పినాకపాణిగారి స్వీయ స్వరకల్పనలే అయినా, వాటిలో కొన్ని తన శిష్యుడైన శ్రీ నేదునూరి కృష్ణమూర్తి స్వరపరిచినవి కూడా పేరు ఇచ్చి జతచేయడం తన శిష్యుల ప్రతిభనీ, విద్వత్తునీ గౌరవించడమే.

కృతి లేదా పాటకి నొటేషను రాయడంలో ఒక పెద్ద చిక్కు వుంది. ఒకే పాటకి అనేకరకాలుగా రాగం వరుస చెడకుండా నొటేషన్ రాయచ్చు. ఉదాహరణకి అందరికీ పరిచయమున్న – “సామజ వరగమన” త్యాగరాజ కృతికి సంగీతం పుస్తకాలలో కొంచెం తేడాగా వేర్వేరు నొటేషన్లు కనిపిస్తాయి. కేవలం పల్లవి, సామజ వరగమనా సాధు హృత్, మాత్రమే తీసుకుంటే ఇలా ఉంటుంది: మా;; గ స నీ దా నీ నీ | సా ; ; సా | మా గా మా ; ||. ఇదే పల్లవి వేరొక పుస్తకంలో: సా మా – మ గ సా – సనిదా – నీ నీ | సా ; – ; సా | సా మా గా మా || అని ఉంటుంది.


సామజ వరగమనా

స్వరపరంగా, రాగం పరంగా రెండూ సరైనవే అయినా ఇందులో ఏది ప్రామాణికమో తెలీదు. అంటే త్యాగరాజ కృతిలో మొట్టమొదట ఏవిధంగా స్వరరచన ఉందో తెలుసుకోవడం కష్టం. వినే వాళ్ళకి రెండూ ఒకేలా అనిపించవచ్చు. కానీ నొటేషనులో మాత్రం తేడా ఉంది. ఇలా, ఎన్నో కృతులకి ఈ విధమయిన స్వరభేదాలు ఉన్నాయి. ఇటువంటప్పుడు దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? ముఖ్యంగా ముందు నేర్చుకునేటప్పుడు ఒక ప్రామాణిక పద్ధతిలో నేర్చుకొని కాస్త రాగ జ్ఞానమూ, స్వర స్థానములూ అబ్బిన తరువాత కొద్ది మార్పులు చేసుకుంటూ పాడడం ఒక పద్ధతి. కానీ చాలామంది మొట్టమొదట సంగీత పాఠాలు గురుముఖంగానే నేర్చుకుంటారు; నేర్చుకోవాలి కూడాను. ప్రతీ గురువూ తనకి నచ్చిన రీతిలో కృతుల నొటేషన్లని మార్చి విద్యార్థులకి చెప్పడం జరిగినప్పుడు, తప్పు స్వరాలు దొర్లే అవకాశం ఉంది. అంతే కాకుండా ఏది అనుసరించాలో అర్థం కాని పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితులన్నీ చూసి, మనకి ఒక ప్రామాణికమైన సంగీత పాఠ్యగ్రంథం కావాలి, అందులో స్థిరమైన నొటేషనుతో సంగీత పాఠాలు ఉండాలి, అవి చూసి విద్యార్థులు మొదట నేర్చుకుంటే, పైస్థాయికి వెళ్ళినప్పుడు అనేక రకాల సంగతులు చొప్పించి మరీ పాడుకోగలరు అనే ఉద్దేశ్యంతో, ప్రామాణికతను ఆపాదిస్తూ పినాకపాణి సంగీత సౌరభం పుస్తకాన్ని ఎంతో కాలం శ్రమించి కూర్చారు.

నేటికి లభ్యమయ్యే వివిధ గ్రంథస్థములైన కృతులు ప్రౌఢ గాయకులు పాడే రీతులలో స్వరపరిచి లేవు. పాడినవి పాడినట్లే స్వరపరిచే విధానం తెలియకనే, చదివి నేర్చుకునే పాఠకులకు అర్థం చేసుకోడానికి కష్టమేమీ లేని విధంగా స్వరపరచవలెననే భావన అడ్డుతగలడం వల్లనో, స్వరపరిచిన విధానానికీ, కృతి వినబడే రీతికీ సంబంధం లేకుండా పోయిందీ గ్రంధాలలో. కృతుల స్వరూపాలకి బదులు వాటి అస్థిపంజరాలే మిగిలి ఉన్నాయా అనిపిస్తుంది.

పాడిన కృతి పాడినట్లే అనుస్వర సహితంగానూ, నిర్దిష్టమయిన కాల ప్రమాణముతోనూ స్వరపరిచి వ్రాయడమూ, ఆ విధంగా వ్రాసియున్న కృతిని పాఠం చెయ్యడమూ; తగినంత కృషి చేసిన వారికే సాధ్యమవుతుంది కానీ, నొటేషన్ జోలికే పోనివారికి కాదు. సంగీతజ్ఞులందరూ నొటేషనుతో కృతులు వ్రాయడము, నొటేషనుతో యున్న కృతుల చదివి పాఠం చెయ్యడమూ అలవాటు చెయ్యాలి. పాట తేలికగా ఉంటే, దాని నొటేషనూ తేలికగానే వుంటుంది. నొటేషను కష్టమని ప్రసిద్ధ పాఠాంతరముల జోలికే పోకపోవడం కళాసేవ ఎలా అవుతుంది? రంగు పూసలను భద్రపరచి ఆణి ముత్యాలను వదులుకున్నట్లు కాదా?

ఈ సంగీత సౌరభంలో ఇంకొక విశేషం కూడా ఉంది. ప్రతీ సంపుటిలోనూ వచ్చిన రాగాల మీద చివర్లో రాగం ఆరోహణ, అవరోహణ, రాగ సంచారం, విశేష ప్రయోగాలు వంటివి అదనంగా ఇవ్వడం. సాధారణంగా వినికిడి ద్వారానూ, లేదా గురుముఖంగానూ కొంత రాగసంచారం వంటివి అలవాటయినా, ప్రతీ రాగం గురించీ అందరికీ తెలియకపోవచ్చు. సంగీత విద్యార్థులకి కొంచెంగా రాగం తెలిసినా, ఈ పుస్తకంలో ఇచ్చిన దాని తాలూకు సంచారం సాధకం చేస్తే రాగం మీద పట్టు దొరుకుతుంది. సంగీతం నేర్చుకోవడంలో ప్రాథమిక, మాధ్యమిక స్థాయి ఉన్న విద్యార్థులకే కాకుండా, గురువులకు కూడా ఉపయోగపడే పుస్తకం ఈ సంగీత సౌరభం. పాఠం చెప్పేటప్పుడు ప్రామాణికంగా, ప్రతీ పాటా, స్వరమూ శాస్త్రీయంగా ఒకటికి పలుమార్లు పరీక్షించి స్వర దోషాలు లేకుండా ఇచ్చిన ఈ పుస్తకం గురువులకు ఎంతో సహాయకారిగా ఉంటుంది.

సంగీత సౌరభం లాంటి గొప్ప కార్యాన్ని ఇంతవరకూ ఏ సంగీతజ్ఞుడూ సాధించలేదంటే అతిశయోక్తి కాదు. త్యాగరాజు కీర్తనల మీద, దీక్షితార్ కృతులమీదా విడిగా వచ్చి వుండవచ్చు కానీ అనేకమంది వాగ్గేయకారుల రచనలు ఒకే చోట పదిలపరచడం మాత్రం జరగలేదు. శుద్ధమైన కర్ణాటక సంగీతాన్ని పరిరక్షించాలన్న తపనతో కంకణం కట్టుకుంటే తప్ప ఇలాంటివి సాధ్యపడవు.



మనోధర్మ సంగీతం

తెలుగులో ప్రామాణిక నిఘంటువు లేనట్లుగానే కర్ణాటక సంగీతానికి కూడా ప్రామాణిక పాఠ్యగ్రంథాలు లేవు. ముఖ్యంగా మధ్యమస్థాయి నుండి ఉత్తమస్థాయికి వెళ్ళే విద్యార్థులకోసం ప్రత్యేకమయిన గ్రంధాల్లేవు. రాగం-తానం-పల్లవి, మనోధర్మ సంగీతం ఇవన్నీ గురుముఖంగా నేర్చుకున్నా ప్రతీ రాగానికీ సంబంధించి ఎక్కడా ఈ వివరాలు నిక్షిప్తమయినట్లు కనిపించదు. మనోధర్మ సంగీతం అంటే ఏవిటో, కొద్దిపాటి వివరణలతో ఉంటుంది కానీ అది ఎలా అనుసరించాలి, ఏ ఏ నియమాలూ, సూత్రాలూ పాటించాలి వంటివి కూలంకషంగా చర్చించిన పుస్తకాలు చాలా అరుదు. పినాకపాణి గారి మనోధర్మ సంగీతం ఆ లోటుని తీరుస్తుంది.

మనసిజ – వర్ణము – హిందోళం – శ్రీపాద పినాకపాణి భజగోవిందం – రాగమాలికకస్తూరీతిలకం – రాగమాలిక వనితరో – ఏ వన్నెలేలనే – జావళీ

కవిత్వంలో ఆశుకవిత్వం లాంటిదే సంగీతంలో మనోధర్మ సంగీతం. కవిత్వం ఒక అంశమ్మీద ఆశువుగా చెప్పినట్లే సంగీతంలో ఒక రాగాన్ని తీసుకొని ఆశువుగా స్వరకల్పన చేయడాన్ని మనోధర్మ సంగీతం అంటారు. స్వరకల్పన, రాగము, నెరవు, పల్లవి, మనోధర్మ సంగీతానికి ఉదాహరణలుగా చెప్పచ్చు.

సూక్ష్మంగా – స్వరకల్పన అంటే తాళాన్ని అనుసరిస్తూ చేసే రాగ విస్తారణ. నెరవు అంటే – పాటకున్న సాహిత్యంలోని ఒక వాక్యాన్ని లేదా పాదాన్ని తీసుకొని రాగ బద్ధంగా పదే పదే మారుస్తూ పాడటం.

గౌరవ ప్రదమైన సంగీత జ్ఞానం కలిగిన గురువుల వద్ద అభ్యాస సంగీతం నేర్చుకొని, దీక్షతో శ్రద్ధగా తగినంతకాలం సాధకం చెయ్యడమే కాకుండా, ప్రసిద్ధ గాయకుల సంగీతం విశేషంగా వినిన శిష్యులకు లయజ్ఞానం, స్వరజ్ఞానం, రాగజ్ఞానం అలవడతాయి. ఆ విధమైన కృషి చేయలేని, చేసినా మనోధర్మ సంగీతం అలవడని, విద్యార్థులు చాలామంది ఉంటారు. వీరికే శ్రద్ధ, పట్టుదల, తాపత్రయమూ ఎక్కువగా ఉంటాయి కూడాను. సాధారణంగా ఈ రెండవ తెగకు చెందిన విద్యార్థులను ‘మనోధర్మ సంగీతం చెప్పేదేమిటి?’ అని తోసి వేయడమేనా, వారి చేత కూడా రాగం, స్వరకల్పనా, నెరవూ పాడించడానికి వీలుందా? వీలున్నది అని చెప్పే జవాబే ఈ పుస్తక రూపంగా మనవి చేసుకుంటున్నాను.

నొటేషన్ లిఖిత పూర్వకంగా రాయడం పట్ల కూడా పినాకపాణిగారికి నిర్దిష్టమయిన అభిప్రాయం ఉంది. “…అభ్యాస సంగీతం క్షుణ్ణంగా నేర్చి సాధకం చేసిన విద్యార్థులకే జ్ఞానం కలుగుతుంది. సాధారణంగా కొద్దో గొప్పో నొటేషను వ్రాయనేర్చిన వారికి పాడిన పాట పాడినట్లే అనుస్వర సహితంగా, లయబద్ధంగా వ్రాయడానికీ పుస్తకం సహకరిస్తుంది. అచ్చంగా పాట పాడినట్లే వ్రాసిన నొటేషను కాకపోతే అది ఎందుకూ పనికి రాదు…” అని సంగీతంలో, ముఖ్యంగా పాటలకి నిర్దిష్టమయిన స్వరరచన ఎందుకవసరమో పినాకపాణి చెప్తారు.

సంగీతంలో ఒక స్థాయికి వస్తే కానీ మనోధర్మ సంగీతం రాదు. సూచనప్రాయంగా సూత్రాలు పాటిస్తూ గురుముఖంగా నేర్చుకున్నా, ఎవరికి వారు స్వతహాగా పెంపొందించుకోవాల్సిన ఈ నేర్పు ఒక పద్ధతిగా నేర్చుకుంటే సులభం అవుతుందన్నది పినాకపాణి వారి అభిప్రాయం. వారి మాటల్లో తరువాత తరాలకి సంగీతం ఎలా అందించాలన్న తపన కనిపిస్తుంది.

తమిళనాడులో సంగీతం గురువు వద్ద అభ్యసించకపోయినా, సంవత్సరాలపాటు రాగాలాపన విని, విని, వినికిడి అనుభవంతోనే రాగాలు పాడగలిగిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఆంధ్రదేశంలో శాస్త్రీయ సంగీతం అంత ధారాళంగా వినబడడానికి మనం నోచుకోలేదు. అందుచేతనే సంగీతం యధావిధిగా నేర్చిన విద్యార్థులకు కూడా రాగం పాడే శక్తి రావడం లేదు. గురువే రాగం పాడుతూ విద్యార్థి చేత పాడిస్తూ నేర్పాలి. చెప్పగా, చెప్పగా అభ్యాసం సంగీతం నేర్చిన విధంగానే రాగం కూడా వచ్చేస్తుంది విద్యార్థికి. నొటేషను వ్రాసి, చదువనేర్చిన విద్యార్థికి ప్రసిద్ధ రాగములలో తరచూ వినబడే సంగతులని స్వరపరిచి వ్రాసిచ్చి, వాటిని కంఠోపాఠంగా వచ్చేవరకూ చెప్పి, పాడించాలి. స్వరకల్పన పాడుతూ పాడించినట్లే రాగం కూడా గురువు నేర్పాలి. కల్పన సంగీతం అభ్యాస సంగీతం వలెనే పాఠం చెప్పి నేర్పించాలి ప్రతీ విద్యార్థికీను…


డా. శ్రీపాద శతజయంతి వేడుక

మేళరాగమాలిక పినాకపాణిగారి మరో ఉత్కృష్టమయిన సంగీత రచన. కర్ణాటక సంగీతంలో ప్రధానంగా ఉన్న 72 మేళకర్త రాగాలతోనూ చేసిన రాగమాలిక. ఈ 72 రాగాల మేళరాగమాలిక మొదట రచించింది మహావైద్యనాథయ్యర్. పినాకపాణిగారి పుస్తకంలో అసలు ఈ రాగమాలిక ఎలా పాడాలీ, ఏ ఏ రాగాలు పాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలూ, శ్రద్ధా తీసుకోవాలీ అన్న విషయాలు ఎంతో వివరంగా, సులభంగా అర్థం అయేట్టుగా ఉంటాయి. ఈ మేళరాగమాలిక పాడటం ఒక దుస్సాధ్యమనుకునే వారికి పినాకపాణిగారి వివరణ ఒక వరం లాంటిది. అలాగే, కర్ణాటక సంగీతంలో అతి క్లిష్టమయిన ప్రక్రియ రాగం-తానం-పల్లవి లోని పల్లవి సంప్రదాయం గురించి పల్లవి గాన సుధ పుస్తకంలో చర్చించారు. ఇందులో కొన్ని పల్లవులు వీరి శిష్యులు నేదునూరి కృష్ణమూర్తి, మల్లాది సూరిబాబు, తదితరులు వారి కచేరీల్లో పాడేవారు.

వద్దని నేనంటినిగా – జావళీ పలుకు తేనెల తల్లి – అన్నమయ్య మోసమాయె – ఆహిరి- క్షేత్రయ్య గురులేక ఎటువంటి గుణికి – త్యాగరాజు

కేవలం సంగీతానికి సంబంధించిన పుస్తకాల రచనే కాకుండా ఆయన స్వయంగా ఎన్నో కృతులకి స్వరాలు కట్టారు. అన్నమయ్య, క్షేత్రయ్య పదాలకు ఎన్నిటికో ఆయన స్వరరచన చేశారు. పినాకపాణిగారే కొన్ని కృతులు, వర్ణాలు కూడా రచించారు. ఈ క్రింది ‘మనసిజ’ హిందోళ వర్ణం, భజగోవిందం వంటివి ఈయన చేతులమీదుగా స్వరాలు దిద్దుకున్నవే!

శ్రీపాద పినాకపాణి స్వరపరిచిన/గానం చేసిన కొన్ని సంగీత రచనలు: 1. మనసిజ – వర్ణము – హిందోళం – శ్రీపాద పినాకపాణి; 2. భజగోవిందం – రాగమాలిక – పూర్వికళ్యాణి – హిందోళం – కుంతలవరాళి – కాపి – ఆదిశంకరాచార్య; 3. కస్తూరీతిలకం – రాగమాలిక; 4. వనితరో – ఏ వన్నెలేలనే – జావళి; 5. వద్దని నేనంటినిగా – జావళి; 6. పలుకు తేనెల తల్లి – అన్నమయ్య
7. మోసమాయె – ఆహిరి- క్షేత్రయ్య; 8. గురులేక ఎటువంటి గుణికి – త్యాగరాజు — ఈ వ్యాసంతో జతచేసినవి, ఆయన ప్రతిభకి ఒక చిన్న మచ్చుతునక మాత్రమే.

స్వతహాగా వైద్యులు కావడం వలన రోగానికి కారణం వెతికినట్లే, సంగీతం ఎలా నేర్పాలి, ఎలా నేర్పితే సులభతరం అవుతుంది అన్నవి ఎంతో ఆలోచన పెట్టి పరిశోధన చేసిన పినాకపాణిగారికి ‘గురుర్బ్రహ్మా – గురుర్విష్ణుః – గురుర్దేవో మహేశ్వరః’ అన్న సూక్తి అక్షరాలా వర్తిస్తుంది.

చాలామంది సంగీత విద్వాంసులకి పాటలు పాడీ, కచేరీలు చేసీ సొమ్ము చేసుకుందామనే ఉంటుంది తప్ప, పదిమందికీ తమ జ్ఞానాన్నీ, విద్యనూ అందించే గుణం ఉండదు. ఉన్నా అది అసంపూర్ణంగానే ఏ కొద్దిమందికో తప్ప అందదు. పినాకపాణి గారి లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. అందుకే ఆయన గురువులకి గురువు.


జెజ్జాల కృష్ణ మోహనరావుగారికీ, మేడూరు సుబ్బలక్ష్మి గారికి, తమ వెబ్‌సైట్ నుంచి చిత్రాలకు అనుమతి నిచ్చిన శభాష్.కామ్ వారికీ నా కృతజ్ఞతలు. ఆడియోలు సంగీతంషేర్.ఆర్గ్ వారినుంచి సేకరించబడ్డాయి.

ఉపయుక్త గ్రంథసూచి

  1. సంగీత సౌరభం 1,2,3,4 సంపుటాలు – శ్రీపాద పినాకపాణి – 1999 – తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ.
  2. మనోధర్మ సంగీతం – శ్రీపాద పినాకపాణి – 1992- తెలుగు విశ్వవిద్యాలయం – హైద్రాబాదు.
  3. అన్నమయ్య పదసౌరభం – నాద సుధాతరంగిణి – 1994 – విశాఖపట్నం.
  4. క్షేత్రయ్య పదములు – గిడుగు వేంకట సీతాపతి – 1952- పిఠాపురం మహారాజా వారి ప్రచురణ.
  5. క్షేత్రయ్య పదములు – విస్సా అప్పారావు – 1950 – ఆంధ్ర గాన కళా పరిషత్తు – రాజమండ్రి.