కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012)

రోహిణీప్రసాద్‌ కిమ్స్‌లో తనకు జరగాల్సిన సర్జరీ కొంతకాలం వాయిదా వేశారనీ, ఏడాది తిరగకముందే న్యూ ఆర్లియన్స్‌కి వచ్చేసి సెటిల్ అవుతాననీ చెప్పి నెల కూడా కాలేదు. ఇంతలో ఈ దుర్వార్త. ఆయనను వ్యక్తిగతంగానో, ఆయన రచనల ద్వారానో రోహిణీప్రసాద్ తెలిసినవారికే కాదు, ఈమాటకు మాత్రమే కాదు, తెలుగు సాహిత్యానికీ ఇది పెద్ద పిడుగుపాటు. ఈమాటకు ఆయన లేని లోటు ఇంకెవరూ, ఇంకెప్పటికీ పూడ్చలేనిది.

రోహిణీప్రసాద్‌గారి రచనల విస్తృతి, శైలి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సైన్స్‌ని సామాన్యులకు అందించడానికి, ఆయన వ్రాసిన ప్రతీ పుస్తకమూ ఆయన హేతువాద దృష్టిని తేటతెల్లం చేసింది. హిందూస్తానీ సంగీతంపై ఆయన ఈమాటలో వ్రాసిన వ్యాసాలకు సాటి లేదు. హిందూస్తానీ సంగీతాన్నిసరళమైన భాషలో వివరించడం; హిందూస్తానీ సంగీత విద్వాంసుల గురించి తనకున్న వ్యక్తిగత అనుబంధాలను ప్రస్తావిస్తూ ఇంకెవరూ ఇవ్వలేని ఒక పరిచిత ధోరణితో వ్రాయడం ద్వారా ఆ విద్వాంసులని పాఠకులకు దగ్గర చేయడం; హిందూస్తానీ సంగీతశాస్త్రాన్ని జనసామాన్యమైన ఉదాహరణలతో అర్థమయేలా వివరించి చెప్పడం – ఇలా ఈ మూడూ రకాల వ్యాసాలతో హిందూస్తానీ సంగీతాన్ని ఈమాట పాఠకులకు దగ్గర చేశారు రోహిణీప్రసాద్. హిందూస్తానీ సంగీతంలో పద్ధతులని వివరిస్తూ ఈమాటలో వరుసగా వ్యాసాలు వ్రాయించాలని ఆయనతో మేము చేస్తున్న చర్చ ఇంకా పూర్తి కాలేదు. ఇంక కాలేదు.

We miss him dearly!

వేలూరి వేంకటేశ్వర రావు
శంఖవరం పాణిని
మాౘవరం మాధవ్