గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి

సీతాపతి గారి క్షేత్రయ్య పదములు అనే పుస్తకానికి ముందు పీఠికలో ఈ. కృష్ణయ్యర్ ఇలా అంటారు.

“మన దేశమందు వెలసియుండిన కళలలో నేటికీ మనం నిలబెట్టుకొని జ్ఞప్తి యందుంచుకొనిన వాటికంటె ఎక్కువ కళలను పోగొట్టుకొని మరచి పోయినాము. ఇది మన దురదృష్టం. రాబోవు తరముల వారు పాడుకొనుటకు ఉపకరించునట్లుగా స్వరమెట్లతో క్షేత్రయ్య తక్కిన చాలామంది వాగ్గేయకారుల వలనే తన పదములు రచించలేదు. పాడవలసిన తీరు తెలియక అనేక పదములు పోయినవి. పదములు సేకరించుట కూడా చాలా కష్టమైన పని. ఎన్నో మారుమూలల దాగి యున్నవి. ఎంతో శ్రమపడి వాటిని సంగ్రహించవలసియున్నది. సంగ్రహించిన పదములలో ఏవి వాస్తవముగా క్షేత్రయ్య రచించినవో, ఏవి కావో ముద్రలేని పదముల విషయములో చెప్పుకొనుట కష్టముగానున్నది. ఇప్పుడు పాడుచున్న పదములలోనైనను సరియైన పాఠములేవో తెలుసుకొనుట చిక్కుగా నున్నది. కడు కొద్ది మంది మాత్రమే సంప్రదాయ సిద్ధములను, శుద్ధములను నగు పాఠములను చెప్పగలరు…”


రాగలక్షణం (సంగీత సౌరభం)

పై మాటలు కేవలం క్షేత్రయ్య పదాలకి మాత్రమే వర్తించవు. మరుగున పడిన ఎంతో మంది వాగ్గేయకారుల రచనలకీ అది వర్తిస్తుంది. నారాయణ తీర్థుల తరంగాలు కానీ, అన్నమయ్య పదాలు కానీ, రామదాసు కీర్తనలు కానీ వీటికి సాహిత్యం మాత్రమే ఉంది తప్ప, సంగీతపరంగా స్వరాలు పదిలపరచి లేవు. ప్రతీ పాటకీ కేవలం రాగాల పేర్లు మాత్రమే లభ్యమయ్యాయి. అందువల్ల వారు ఆ పాటల్ని ఎలా స్వరపరిచి పాడారో చెప్పడం సాధ్యం కాదు.

పినాకపాణి వారు ఇటువంటి అనేకమంది వాగ్గేయకారుల సాహిత్యానికి స్వరాలు కూర్చి, సొంతంగా బాణీలు కట్టి పొందుపరిచారు. సంగీత సౌరభం అనే పుస్తకంలో అన్నమయ్య కీర్తనలూ, క్షేత్రయ్య పదాలూ, జావళీలూ, వర్ణాలూ ఇలా దాదాపు రెండు వేలకి పైగా పాటలకు స్వరరచనను అందించారు. ఈ ప్రయత్నానికి ఎంతో సహనం, ఓర్పు, శ్రద్ధ, నిబద్ధత కావాలి. తన ముందు తరాలకి పూర్వపు వారందించిన సంగీత సంపద చేరాలన్న తపన వల్లనే ఇది సాధ్యమయింది. ఆయనే ముందుమాటలో చెప్పినట్లుగా, “ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులలో పెద్దలు పాడి ప్రచారము చేసిన పాఠాంతరములలో కర్ణాటక సంగీత లక్ష్య, లక్షణ సంప్రదాయము నిబద్ధమై ఉంటుంది. అటువంటి కృతులను కనీసం వెయ్యింటినైనా సేకరించి వీలైనంత మట్టుకు వివరములతో స్వరపరచి ఆంధ్ర యువతరాని కందజేయగలిగితే, వారి కృతి సంపదలతో పాటు సంగీత జ్ఞానము, సంగీతపు బాణి, గీటుకందిన అంతస్థు చేరుకుంటాయి అనే ధీమాతో నేను చేసిన ప్రయత్నమీ గ్రంథరచన.

కేవలం సాహిత్యం ఉన్న పాటలకి స్వరం కూర్చడం అంత సులభం కాదు. ముఖ్యంగా పూర్వపు వాగ్గేయకారులు నిర్దేశించిన పాటలకి రాగాల పేర్లున్నాయి కానీ స్వరాలు లేవు. అందువల్ల వారు చెప్పిన రాగంలోనే కట్టాల్సి వస్తుంది. వాటిలోని రాగాలు ప్రస్తుతం వాడుకలో ఉండకపోవచ్చు. లేదా మరొక పేరుతో పిలవబడవచ్చు. ఉదాహరణకి ఎన్నో అన్నమాచార్య కీర్తనల్లో పేర్కొన్న రాగాలు (తెలుగు కాంబోది, కొండమలహరి వంటివి) ప్రస్తుతం లేవు. అప్పుడు వాడుకలో ఉన్నా అవి ఎలా వుండేవో తెలియదు. అటువంటి సందర్భాల్లో సాహిత్యానికి అనుగుణంగా ఉన్న రాగం ఎన్నుకోవాల్సి వస్తుంది. ఆయా రాగాన్ననుసరించి భావం చెడకుండా సాహిత్యానికి నప్పుతూ స్వరపరచాల్సి ఉంటుంది. ఈ పని చెయ్యాలంటే ముందుగా ఎంతో సంగీతజ్ఞానం కావాలి. రాగాల మీద పట్టు సాధించాలి.


క్షేత్రయ్య పదం స్వరరచన

వివిధ వాగ్గేయకారులు రచించిన పాటలకు స్వరాలతో, అనుస్వర, గమక సహితంగా స్వరరచన చేసి పినాకపాణి సంగీత సౌరభంలో పొందుపరిచారు. అందులో కూడా వాడుకలో ఉన్న కొన్ని కృతులలో స్వరస్థానాలని సవరించి వాటిని, విద్వాంసులతో చర్చించి మరీ, సాధికారకంగా ప్రచురించారు. “నేను సేకరించిన కృతులు, పదములు, జావళీలు మొదలైన సంగీత రచనలన్నీ నేను నేర్చి, పాడుకొని, స్వరపరచి భద్రపరచినవే. ఇతరుల పాఠాంతరములను ఇంతకు పూర్వం ప్రచురింపబడిన గ్రంథముల నుండి తస్కరించలేదు. చాలాభాగం గురుముఖంగా నేర్చుకున్నవే; కొన్ని విద్వాంసుల నాశ్రయించి వారు పాడుతూ చెప్పగా నొటేషనుతో వ్రాసుకున్నవి; కొన్ని చిన్న కృతులు పదే పదే విని నేర్చుకున్నవి; నా చిన్ననాటి నుండీ (1930 సం||మొదలు) గ్రాంఫోను రికార్డులలో పూర్వతరం విద్వాంసులు పాడి వాయించి ఉన్న కృతులు కొన్ని; ప్రముఖ గాయకులు రేడియో ద్వారా వినిపించిన క్రొత్త కృతులను Cassette Tapes మీద ఎక్కించుకొని, వాటిని సావధానంగా నొటేషనుతో వ్రాసి నేర్చుకున్నవి కొన్ని:- ఈ విధంగా అన్నీ పెద్దలనుండి స్వయంగా నేర్చి సేకరించిన కృతులనే సమర్పించుకుంటున్నాను. ఇది వరలో నేర్చియున్న పాఠాంతరములలో నీరసంగా ఉన్న కృతులను దరిమిలా మనసుకు నచ్చిన పాఠాంతరములు విని సవరించుకున్నాను.

ఈ సంగీత సౌరభం నాలుగు సంపుటాల్లో మూడు వందలకు పైగా అన్నమాచార్య కీర్తనలను స్వరయుక్తం చేశారు. కొన్ని కృతులు తక్క, అన్నమాచార్య కృతులు ఏఏ రాగాల్లో రాగిరేకుల్లో ఉన్నాయో అవే రాగాలలో వాటికి స్వరాలున్నాయి. ఉదాహరణకి, అతి ప్రసిద్ధమైన “బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే – తందనానా ఆహి, తందనానా పురే” పదం ప్రస్తుతం మనం బౌళి రాగంలో పాడగా వింటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన అన్నమయ్య కీర్తనల్లో కూడా బౌళి రాగమనే ఉంది. బాలమురళిగారు మాత్రం భూపాలంలో పాడిన ఈ పాటను పినాకపాణి గారు శంకరాభరణంలో స్వరపరిచారు.

అలాగే ఈ సంగీత సౌరభంలో నూటికి పైగా క్షేత్రయ్య పదాలు ఉన్నాయి. సుమారు తొంభై జావళీలున్నాయి. తిల్లానాలూ, తిరుప్పుగళ్ వంటి రచనలు కూడా ఉన్నాయి. వీటిలో త్యాగరాజాది తదితరుల కృతులూ, దీక్షితార్, శ్యామశాస్త్రుల కృతులు కూడా ఉన్నాయి. ఇందులోని అన్నమయ్య కీర్తనల్లో సింహభాగం పినాకపాణిగారి స్వీయ స్వరకల్పనలే అయినా, వాటిలో కొన్ని తన శిష్యుడైన శ్రీ నేదునూరి కృష్ణమూర్తి స్వరపరిచినవి కూడా పేరు ఇచ్చి జతచేయడం తన శిష్యుల ప్రతిభనీ, విద్వత్తునీ గౌరవించడమే.

కృతి లేదా పాటకి నొటేషను రాయడంలో ఒక పెద్ద చిక్కు వుంది. ఒకే పాటకి అనేకరకాలుగా రాగం వరుస చెడకుండా నొటేషన్ రాయచ్చు. ఉదాహరణకి అందరికీ పరిచయమున్న – “సామజ వరగమన” త్యాగరాజ కృతికి సంగీతం పుస్తకాలలో కొంచెం తేడాగా వేర్వేరు నొటేషన్లు కనిపిస్తాయి. కేవలం పల్లవి, సామజ వరగమనా సాధు హృత్, మాత్రమే తీసుకుంటే ఇలా ఉంటుంది: మా;; గ స నీ దా నీ నీ | సా ; ; సా | మా గా మా ; ||. ఇదే పల్లవి వేరొక పుస్తకంలో: సా మా – మ గ సా – సనిదా – నీ నీ | సా ; – ; సా | సా మా గా మా || అని ఉంటుంది.


సామజ వరగమనా

స్వరపరంగా, రాగం పరంగా రెండూ సరైనవే అయినా ఇందులో ఏది ప్రామాణికమో తెలీదు. అంటే త్యాగరాజ కృతిలో మొట్టమొదట ఏవిధంగా స్వరరచన ఉందో తెలుసుకోవడం కష్టం. వినే వాళ్ళకి రెండూ ఒకేలా అనిపించవచ్చు. కానీ నొటేషనులో మాత్రం తేడా ఉంది. ఇలా, ఎన్నో కృతులకి ఈ విధమయిన స్వరభేదాలు ఉన్నాయి. ఇటువంటప్పుడు దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? ముఖ్యంగా ముందు నేర్చుకునేటప్పుడు ఒక ప్రామాణిక పద్ధతిలో నేర్చుకొని కాస్త రాగ జ్ఞానమూ, స్వర స్థానములూ అబ్బిన తరువాత కొద్ది మార్పులు చేసుకుంటూ పాడడం ఒక పద్ధతి. కానీ చాలామంది మొట్టమొదట సంగీత పాఠాలు గురుముఖంగానే నేర్చుకుంటారు; నేర్చుకోవాలి కూడాను. ప్రతీ గురువూ తనకి నచ్చిన రీతిలో కృతుల నొటేషన్లని మార్చి విద్యార్థులకి చెప్పడం జరిగినప్పుడు, తప్పు స్వరాలు దొర్లే అవకాశం ఉంది. అంతే కాకుండా ఏది అనుసరించాలో అర్థం కాని పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితులన్నీ చూసి, మనకి ఒక ప్రామాణికమైన సంగీత పాఠ్యగ్రంథం కావాలి, అందులో స్థిరమైన నొటేషనుతో సంగీత పాఠాలు ఉండాలి, అవి చూసి విద్యార్థులు మొదట నేర్చుకుంటే, పైస్థాయికి వెళ్ళినప్పుడు అనేక రకాల సంగతులు చొప్పించి మరీ పాడుకోగలరు అనే ఉద్దేశ్యంతో, ప్రామాణికతను ఆపాదిస్తూ పినాకపాణి సంగీత సౌరభం పుస్తకాన్ని ఎంతో కాలం శ్రమించి కూర్చారు.

నేటికి లభ్యమయ్యే వివిధ గ్రంథస్థములైన కృతులు ప్రౌఢ గాయకులు పాడే రీతులలో స్వరపరిచి లేవు. పాడినవి పాడినట్లే స్వరపరిచే విధానం తెలియకనే, చదివి నేర్చుకునే పాఠకులకు అర్థం చేసుకోడానికి కష్టమేమీ లేని విధంగా స్వరపరచవలెననే భావన అడ్డుతగలడం వల్లనో, స్వరపరిచిన విధానానికీ, కృతి వినబడే రీతికీ సంబంధం లేకుండా పోయిందీ గ్రంధాలలో. కృతుల స్వరూపాలకి బదులు వాటి అస్థిపంజరాలే మిగిలి ఉన్నాయా అనిపిస్తుంది.

పాడిన కృతి పాడినట్లే అనుస్వర సహితంగానూ, నిర్దిష్టమయిన కాల ప్రమాణముతోనూ స్వరపరిచి వ్రాయడమూ, ఆ విధంగా వ్రాసియున్న కృతిని పాఠం చెయ్యడమూ; తగినంత కృషి చేసిన వారికే సాధ్యమవుతుంది కానీ, నొటేషన్ జోలికే పోనివారికి కాదు. సంగీతజ్ఞులందరూ నొటేషనుతో కృతులు వ్రాయడము, నొటేషనుతో యున్న కృతుల చదివి పాఠం చెయ్యడమూ అలవాటు చెయ్యాలి. పాట తేలికగా ఉంటే, దాని నొటేషనూ తేలికగానే వుంటుంది. నొటేషను కష్టమని ప్రసిద్ధ పాఠాంతరముల జోలికే పోకపోవడం కళాసేవ ఎలా అవుతుంది? రంగు పూసలను భద్రపరచి ఆణి ముత్యాలను వదులుకున్నట్లు కాదా?