గదిలోంచి బయటకి నడుస్తున్నపుడు, నేలకు కాళ్ళు ఆనుతున్నట్టు అనిపించలేదు ఆమెకి. అసలు ఏమీ అనిపించలేదు. కొద్దిగా తల తిరుగుతున్నట్టు, వాంతి వస్తుందేమోనన్న భయం తప్పితే. చేస్తున్న పనులన్నీ అచేతనంగా జరిగిపోతున్నాయి: సెల్లార్ లోకి వెళ్ళడం, లైటు వెయ్యడం, ఫ్రీజర్ తలుపు తెరవడం, చెయ్యి పెట్టి ఏది ముందు తగిలితే దాన్ని అందుకోవడం. అందినది బయటికి తీసి అదేమిటా అనుకుంది.

గుడ్లగూబకో బొటనవేలు ఉంటుందనీ
ఐతే అదలా తిరిగి ఉండదని
శరీర శాస్త్రం చెప్తుంది.
పక్షిశాస్త్రం బోధిస్తుంది!
ఎన్నో ఏళ్ళు తెల్ల గుడ్లగూబని అధ్యయనం చేశాను
ఈ డొల్ల పనితనాన్ని చూసి బాధ పడుతున్నాను.

పాఠకుల ఊహ విషయానికొస్తే, దాంట్లో కనీసం రెండు రకాలు ఉంటాయి. ఆ రెండింట్లో ఏది సరైనదో చూద్దాం. మొదటిది తులనాత్మకంగా తక్కువదైన, వ్యక్తిగతమైన ఊహ. ఇది భావావేశాలను ఆశ్రయిస్తుంది. ఈ రకమైన ఊహ స్వభావం ఇలా ఉంటుంది: మనకో, మనకు తెలిసిన వాళ్ళకో జరిగిన వాటిని పుస్తకంలోని ఫలానా సన్నివేశం గుర్తు చేస్తుంది కాబట్టి అది మనల్ని బలంగా తాకుతుంది.

విమానం గాలిలోకి ఎగరగానే నేను గుడ్‌బై చెపుతున్నది ఒక పనమాకే కాదు; 18 రోజులు తనివితీరా తిరుగాడి ఆయా ప్రదేశాలు, మనుషులు, సంస్కృతులతో సహజీవనం చేసిన యావత్ మధ్య అమెరికాకు అన్న విషయం మనసులోకి ఇంకింది. నేను చేసిన అనేకానేక ప్రయాణాల్లో ఇది ఒక ముఖ్యమైన సంతృప్తికరమైన ప్రయాణం.

ఋగ్వేదంలో మొట్టమొదటి అనువాకంలోని మొదటి సూక్తంలోని తొమ్మిది శ్లోకాలకు యథాతథంగా తెలుగులో తెచ్చే అనువాద ప్రయత్నం ఇది. ప్రాచీనాంధ్ర కవులు వేదాలకు అనువాదం చేయకపోయినా, ఆధునిక పద్యానువాదాలు ఒకటి రెండు ఇదివరకు వచ్చాయి. ఉదా. చర్ల గణపతి శాస్త్రిగారు, నేమాని నరసింహ శాస్త్రిగారు చేసిన అనువాదాలు నాకు పరిచయం. అయితే, వారి అనువాద ప్రయోజనం వేరు. నా అనువాద ప్రయత్నం వేరు.

మనం ఇప్పుడు చాలా చిత్రమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. నా జీవితకాలంలో ఇటువంటి పరిస్థితులు ఎదురౌతాయని నేను ఊహించలేదు. ముఖ్యంగా భావప్రకటనా స్వాతంత్ర్యానికి చాలా గడ్డు పరీక్షలు ఎదురౌతున్న కాలం ఇది. ప్రపంచంలో భావప్రకటనా స్వేచ్ఛ లేకపోతే ఇప్పుడు మనకు కనిపించే వైవిధ్యమైన పుస్తకప్రపంచమే ఉండేది కాదు.

బయట నుంచి గుర్రం జూలు విదిలించిన శబ్దమూ గంటల శబ్దమూ వినిపించాయి. అంటే బగ్గీ సిద్ధమైందన్నమాట. కొట్టు తాలూకు తాళాల గుత్తి చేతిలోకి తీసుకుంటాడు నాన్న. గడియారం ముల్లు ఎనిమిదిన్నర వైపు కదులుతూ ఉంటుంది. క్వీచ్ క్వీచ్ మంటూ నాన్న తన కిర్రు చెప్పులు వేసుకుంటాడు. తర్వాత గొడుగు సరిగా పని చేస్తుందా లేదా చూడ్డానికి దాన్ని ఒకసారి తెరిచి మూసిన శబ్దం వినిపిస్తుంది. ఇదంతా రోజువారీ రివాజు. నెమ్మదిగా తలుపు తెరుచుకుంది.

ఓ వర్షాకాలపు మధ్యాహ్నం అలిసిపోయిన భూమి వదులుతున్న వెచ్చని ఊపిరి చర్మాన్ని తాకుతున్నట్టుగా, ఎండలో పచ్చిక చెమ్మ నిండిన పిల్లగాలి వీస్తోంది. ప్రకృతికీ ప్రపంచానికీ దాని బాధేదో చెప్పాలనుకుంటున్నట్టుగా ఓ పక్షి విసుగు పుట్టించేలా మధ్యాహ్నమంతా ఆపకుండా కూసింది. పోస్టుమాస్టరుకు చెయ్యడానికి పనేమీ లేదు. తనకు చూడడానికి ఉన్నదల్లా వానకు తడిసి నిగనిగలాడుతున్న ఆకులూ, మిగిలిపోయిన తెల్లని పలుచని మేఘాలూ మాత్రమే.

మానవ నిర్మాణ అద్భుతాలలో ఒకటైన పనమా కెనాల్ దగ్గర ఆ అపరాహ్ణ సమయం ఎంతో ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా గడిచింది. ఈ కెనాలే లేని పక్షంలో పనమా అనేకానేక చిరుదేశాలలో ఒకటిగా ఉండిపోయేది. ఈ కాలువకున్న వ్యూహాత్మక ప్రాముఖ్యత పనమాను ఒక నిర్దుష్టమైన ఉనికి ఉన్న దేశంగా నిలబెట్టింది.

దట్టమైన పొగమంచు అలముకున్న వేకువజామున వారణాసికి అంబులెన్స్ చేరుకుంది. నటరాజ్ పూరణిని నిద్ర లేపాడు. ఆ వేకువ జాము చలిలోనూ గంగానది రాళ్ళమెట్ల అంచులో ఎంతోమంది స్మారక కర్మలు చేస్తున్నారు. ఎందరో స్త్రీపురుషుల తలలు గంగలో మునకలు వేసి లేస్తున్నాయి. పురోహితులు, సాధువులు, పశువులు, శవాలు, తిరగాడుతున్నారు. నటరాజ్ హరిశ్చంద్ర ఘాట్ ఎటువైపో ఒకరి దగ్గర కనుక్కున్నాడు.

ఋగ్వేదంలోని పదవ మండలంలో 129వ సూక్తంగా ఉన్న నాసదీయ సూక్తం ఈ సృష్టి ఎక్కడినుండి వచ్చిందో, ఎలా సృష్టింపబడిందో అన్న విషయాల గురించి మహాశ్చర్యకరమైన ప్రశ్నలు వేస్తుంది. భారతీయ భాషా సాహిత్యాన్ని సూటిగా మూలం నుండి కాకుండా ఆంగ్లానువాదం నుంచి అనువాదం చేయడం క్షమించరాని నేరం. అందుకే సంస్కృత మూలం నుండి ముత్యాల సరాలకు దగ్గరిగా ఉండే ఛందంలో నేను చేసిన తెలుగు అనువాదం ఇది.

ఆయన ఆర్ధికంగా జర్మనీ వెనుకబాటుతనం, ప్రజలు మోస్తున్న అవమానభారాన్ని దగ్గరగా చూశారు. అంత ఘోరమైన ఓటమి, ప్రళయ వినాశనం తరవాత, తప్పు చేశామన్న భావనతో కుంగిపోయిన ఆ దేశాన్ని గుర్తించారు. తమ పిల్లలు ఆకలితో అలమటిస్తున్నపుడు కూడా, పశ్చాత్తాపంతో చింతించే ప్రజల మనస్సాక్షి ఎంత గొప్పదో అన్న ఆలోచన వచ్చింది ఆయనకు. అంతకన్నా ఎక్కువ వినాశనాన్నే, అమెరికా జపాన్‌కు కలిగించింది.

హైస్కూల్ చదువు పూర్తయ్యాక పై చదువులకి డబ్బు అవసరమైంది. చెల్లి ఇంకా బడిలో చదువుతుండడం, ఓ రిసెప్షనిస్టు‍గా పని చేసే అమ్మ జీతం కుటుంబానికి సరిపోకపోవడం వల్ల, రెండేళ్ళు చదువు ఆపి, ఏదైనా పని చేసి డబ్బు ఆదా చేయాలని, ఆ తరువాత చదువు కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. తనకి ఇష్టమైన సైకాలజీ చదవాలనుకున్నాడు. అయితే, ఆపాటి చదువుతో ఉద్యోగం సంపాదించడం కష్టం. పైగా కోవిడ్-19 మాంద్యం నుంచి నగరం ఇంకా కోలుకోలేదు.

గ్రనాద నడకరాయుళ్ళ స్వర్గసీమ. పెద్దగా దూరాలేమీ లేవు. ఏ వీధిని చూసినా రంగులీనుతూ కళకళలాడుతూ కనిపించింది. నాలో ఉత్సాహం నింపింది. ఎలాంటి అభద్రతాభావమూ కలుగలేదు. జనజీవితం నింపాదిగా సాగిపోతోంది. మనుషులు సౌమ్యుల్లా కనిపించారు. ఆప్యాయంగా పలకరించారు. స్నేహంగా సాయపడేవారిలా అనిపించారు.

అన్ని కంప్యూటర్ ఎంట్రీ పాయింట్లకి మనుషులను నియమించాక ఒక మనిషి ఎక్కువగా ఉన్నారని తెలిసింది. అది ఎవరా అని చూసినప్పుడు అతనితోపాటు ఉద్యోగంలో చేరడానికి వచ్చిన ఆ అమ్మాయేనని గుర్తుకు వచ్చింది. ఆమెను రప్పించాడు. ఆమె వణుకుతూ, కంగారుగా వచ్చి అతని గది గాజు తలుపు బయట నిల్చుంది. నెమ్మదిగా ఆమెకేసి చూశాడు. ఆమె వణుకు స్పష్టంగా కనబడుతోంది. గాలిలో ఆకులు అల్లాడుతున్నట్టు వణుకుతోంది అనుకున్నాడు.

ఇవన్నీ ఇంట్లో మరుగు దొడ్లు లేనివారికి, డబ్బులిచ్చి వెళ్ళలేని వారికే. ఇప్పుడు ధారావిలో ప్రభుత్వం వసూళ్ళ వేటకు, గుళ్ళకు ఏ మాత్రం తీసిపోని, రాజభవనం లాంటి డబ్బులు చెల్లించే మరుగు దొడ్లను తీసుకువచ్చింది. తెల్లారి నాలుగు గంటలకు తెరిచి, రాత్రి ఒంటి గంటకంతా మూసేస్తారు. తెరిచేటప్పుడు మనుష్యులు వచ్చి తెరవమని చెబుతారు. నాలుగు గంటల నుండి ఒక్కొక్కరిగా ఏడు, ఏడున్నరకల్లా గుమిగూడటం మొదలవుతుంది.

ఏటవాలుగా ఉన్న నదీ తీరాన్ని ఎక్కలేక ఎక్కలేక ఎక్కుతున్న ఆ బండ్లను అక్కడ ఉన్న సైనికులు తోసి సాయం చేస్తున్నారు. కాలినడకన వెళ్ళే రైతులు పాదాలు మునిగిపోయేంత దుమ్ము, ధూళిలో అతికష్టం మీద నడుస్తున్నారు. కానీ ఆ పెద్దాయన మాత్రం కదలకుండా అక్కడే కూర్చొని ఉన్నాడు. ఇంక ముందుకెళ్ళడానికి ఏ మాత్రం వీలుకానంతగా అలసిపోయాడు. రక్షణ స్థావరాల ఆవలి ప్రాంతం పరిశీలించి నేను మళ్ళీ వంతెన దాటుకొని తిరిగి వచ్చాను.

పొరుగున ఉన్న గ్వాతెమాల, ఓందూరాస్ దేశాలలో ఉన్నట్టుగా కాకుండా ఎల్ సల్బదోర్ ప్రజల రూపురేఖలు ఎక్కువగా యూరోపియన్లను పోలి ఉన్నాయనిపించింది. కాస్తంత పరిశోధన తర్వాత అక్కడి జనాభాలో ఎనభై ఆరుశాతం మెస్తీహోలు అని, పదమూడు శాతం యూరోపియన్లు అని, ఒకే ఒక్కశాతం నేటివ్ ఇండియన్లనీ తెలిసింది.

మరియమ్మ వచ్చి స్టేజ్ మీద నిలబడింది. శంకరన్ కుర్చీకి ఎదురుగా. అతడికి పుట్ట నుంచి జెర్రి వేగంగా బయటకొచ్చి శరీరమంతా సరసరమని పాకుతున్న అనుభూతి. పవిత్రన్ మాస్టర్ సైగ చేయగానే ఆమె ఆ లంగాను కుప్పగా జారవిడిచింది. గదంతా చిక్కటి నిశ్శబ్దం అలుముకుంది. ఆ లంగా ఆమె కాళ్ళ కింద వంకరగా గీసిన సున్నాలా వచ్చి పడ్డది. కాలితో రంగు వెలిసిన ఆ లంగాను కాస్త దూరంగా నెట్టింది. స్టేజ్ మీద కూర్చుంది.