అదే వెన్నెల

మట్టెల చప్పుడు టిక్కు టిక్కుమని వినిపించింది. గాజుల మోత గలగలమంది. 

హాల్లో ఎనిమిదేళ్ళ మనవడు మురళి కుడివైపు, నాలుగేళ్ళ మనవరాలు విజయ ఎడమవైపు నిద్రలోకి జారుకున్నాక మధ్యలో పడుకుని ఉన్న కైలాసరావు తల పైకెత్తి చూశాడు. 

చేతిలో పాల గ్లాసు పట్టుకుని కోడలు సరస్వతి కొడుకు గదిలోకి వెళ్తూ ఉండడం కనిపించింది. తన మీద పడిన ఆ చూపుకు సరస్వతి తల కిందకి దిగిపోయింది – ముసలోడికి ఇంకా కుర్రతనం పోలేదు. 

కైలాసరావు చూపు ఆమె వెంటే వెళ్ళింది. ఆమె గది లోపలికి వెళ్ళిపోయింది. ‘కిఱ్ఱు’మనే శబ్దంతో తలుపు మూసుకుని, ఆయన చూపు తలుపుకు గుద్దుకుంది. మూసిన ఆ తలుపు మీద ఒక ఆడ మనిషి ఆకారం చిత్రలేఖనంలా కనిపించింది. వయసు పదహారేళ్ళు ఉంటుంది. నున్నగా దువ్విన తలమీద నాగరం, పాపిడికి రెండుపక్కలా నెలవంక బిళ్ళ, వదులుగా జారవిడిచిన జడకు జడకుప్పెలు, నుదుట వెలుతురును వెదజల్లే ముత్యాల పాపిడిబిళ్ళ, పగడాల పెదవులకు పైన ఉయ్యాలూగే బులాకీ, మోచేతులదాకా సాగిన రవిక, గఱగఱమనే జరీ నిండిన పట్టుచీర, నల్లగా నిగనిగలాడే కనుబొమ్మలకింద బిత్తరగా చూస్తున్న పెద్దపెద్ద కాటుక కళ్ళు, యవ్వనం, భయమూ కలగలిసిన పడుచు వయసు సొంపులతో, సొగసులతో, సిగ్గు, బెరుకులతో సన్నగా వణుకుతూ నిల్చున్న అమ్మాయి… 

అవును. ధర్మాంబ పదహారేళ్ళ చిత్రమే అది. ఆ ఆకారం, మూసిన తలుపునుండి దిగి ఆయన దగ్గరకు వచ్చింది. సిగ్గు, భయం, ‌వణుకు, మోహం, వినయం, భక్తి, ప్రేమ – ఇన్నీ కలగలిసి అందమైన అమ్మాయి రూపం దాల్చి కదిలి వచ్చింది – కైలాసరావు గాట్టిగా వాటేసుకోవాలనుకున్నాడు. 

వంటగదిలో పనులన్నీ ముగించుకుని, హాల్లోకి వస్తున్న ధర్మాంబ నిద్రపోతున్న మనవడి పక్కన చాప పరిచింది. పక్కన వినిపించిన ఆ చప్పుడికి ఆలోచనలనుండి బయటపడి భార్యకేసి చూశాడు కైలాసరావు. తల ఓ వైపు, కాలు ఓ వైపు అని అడ్దదిడంగా పడుకుని ఉన్న మనవడ్ని సర్ది సరిగ్గా పడుకోబెట్టింది. 

“ఏం పిల్లాడో ఏంటో! పొద్దుగూకులు ఒళ్ళలసిపోయేలా ఆటలు, గెంతడాలు, తిరుగుళ్ళు. రాత్రవ్వగానే ఇలా కాలోవైపు, చెయ్యోవైపు చాపుకుని ఒళ్ళు మరిచి నిద్రపోవడాలు! కాసేపు తిన్నగా ఉండడు, కొమ్మమీద కోతిలా పైకీ కిందకి దూకడం…” అని నిట్టూరుస్తూ మనవడి వీపుమీద నిమరసాగింది. ఒక్కగానొక్క కొడుకు కన్న ముద్దుల మనవడు కదా? 

“ఎనిమిదేళ్ళు అవుతుంది… వయసుకు తగినంత ఒళ్ళు రాలేదు… అన్నం తిని ఏడిస్తేగా…” అని నొచ్చుకుంటూ నిట్టూర్చింది ధర్మాంబ. మనవరాలు విజయ, నాలుగేళ్ళ పిల్ల. బామ్మ పెంపకం. చాపనుండి పొర్లి నేలమీద పడుకుని ఉంది. ఆ పిల్లను లాగి జరిపి చాపలో పడుకోబెట్టింది. 

“ఊఁ… బామ్మా…” అని నిద్రలో నసిగింది పాప. 

“ఏం లేదు తల్లీ… నేలమీదున్నావే అని. సరే బజ్జోమ్మా” అని ఆమె వీపుమీద మెత్తగా తడుతోంది. 

కైలాసరావు తన యుక్త వయసు జ్ఞాపకాల్లో మునిగితేలుతూ మౌనంగా కూర్చుని ఉన్నాడు. 

“మీరేంటి ఇంకా కూర్చుని జపం చేస్తున్నారు… మీకూ జోలపాడాలా? పాలు తాగి పడుకోవచ్చు కదా? తెచ్చిపెట్టి ఎంతసేపయింది! చల్లారిపోయుంటాయి…” అని అంటూనే చెదిరిపోయున్న అతని పడకను సర్దింది. 

“ఆ గ్లాసును తీసి నీ చేత్తో అందియ్యరాదూ…” పాల గ్లాసందుకుంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు. “పడుకుని నిద్రపోలేదేం అని అడుగుతున్నావే, తాంబూలం ఎవత్తె దంచి ఇచ్చిందనీ” అని ఆమె చేతిని విడవకుండా నవ్వుతూ అడిగాడు. 

“నవ్వులకేం తక్కువలేదు; పిల్లలులేని ఇంట్లో ముసలోడు గంతులేశాడంట. చేయి వదలండి.”

“ఎవడే ముసలోడు… నేనా?” అని భార్య బుగ్గలు నిమిరి నవ్వాడు. 

“అవును మరి, ఇప్పుడే పదిహేడు పూర్తయ్యి పద్దెనిమిది వచ్చింది పాపం… పెళ్ళికి పిల్లను చూడనా?”

“ఎందుకూ? నువ్వున్నావుగా?” ఆమె చెంగు లాగబోయాడు. 

“అయ్యో! ఏంటిది?”

మళ్ళీ నవ్వు. ముసలోడు భలేటోడు… 

పాలు తాగాక, ఒళ్ళంతా చెమట పట్టింది. తువ్వాలుతో ఒళ్ళు తుడుచుకుంటూ, “ఉస్… అబ్బా… ఒకటే ఉక్కగా ఉంది. ఆ చాప తీసుకెళ్ళి వాకిట్లో పరు. నేను తాంబూలం పెట్టె తీసుకొస్తా” అని లేచాడు. 

ధర్మాంబ చాపను చుట్టుకుని హాల్లో లైటు ఆపింది. పెరటి వాకిట్లో చందమామ వెన్నెల వెలుతురును అలుకుతున్న చోట చాపను పరిచింది. 

“హమ్మయ్యా… ఇక్కడ ఎంత చల్లగా ఉందో…” అంటూ కాళ్ళు చాపుకుని కూర్చుంది. చీర చెంగుతో ముంజేతుల్లో, మెడమీద జారుతున్న చెమటను తుడుచుకుంది. రవిక గుండీలు విప్పి వీపుమీద విసనకర్రతో గోక్కుంది. కైలాసరావు భార్య పక్కన కూర్చుని వెన్నెల కాంతులతో నిండిన ఆకాశానికేసి చూస్తున్నాడు. ఆకాశవీధిలో ఈదులాడుతున్న మేఘాల గుంపులు చందమామ దగ్గరకు రాగానే కాంతివంతంగానూ, దూరమయినప్పుడు నల్లటి నీడల్లాగానూ మారుతున్న ఆ రంగుల దోబూచాటను చూస్తున్నాడు. 

ఈ వెన్నెల వెలుగులోనే; అవును, ఈ వెన్నెలే ఎన్ని కాలాలు మారినా చందమామ ఒకటే, వెన్నెల కాంతి ఒకటే! ఈ వెన్నెల్లోనేగా పసిపిల్లాడిగా అమ్మమ్మ ఒడిలో కూర్చుని కథలు వింటూ పాలబువ్వ తిన్నది! ఈ వెన్నెల్లోనేగా తనతో ఏడడుగులు నడిచి జీవనయానం ప్రారంభించిన గొప్ప ఇల్లాలు ధర్మాంబ ఒడిలో తల వాల్చి కలల్లో తేలుతూ, తాంబూలం అందుకుంది!

ఆ జ్ఞాపకాలన్నీ ఒక్కోటీ వెన్నెల వెలుగులు అందుకుని మెరుస్తున్న మేఘాల్లా తలపుల్లో మెరుపుల్లా జ్వలించి, దూరమయ్యి కాంతి కృంగి… వెలుగు నీడల దోబూచులాటలా జ్ఞాపకాలు కదులుతున్నాయి. 

మేఘాలెక్కడ, వాటికంటే దూరానున్న చందమామ ఎక్కడ! ఆ జ్ఞాపకాలెక్కడ! ఇప్పుడు తానున్న స్థితి ఎక్కడ? తలచుకున్నప్పుడేనా జ్ఞాపకాలు? తలచుకోనప్పుడు ఆ జ్ఞాపకాలెక్కడ ఉంటాయి? ఎందుకు జ్ఞాపకాలు గుర్తొస్తాయి? అవి మళ్ళీ ఎలా మనసులో పుట్టుకొస్తాయి? జ్ఞాపకాలు! జ్ఞాపకాలంటే? తలచుకున్నవేనా? తలచుకున్నవన్నీ జరిగినవేనా? జరగనివాటిని తలచుకోమా? ఈ తలపులున్నీ నిజాలా? కల్పనలను, ఆశలను, అర్థంలేని ఆలోచనలను, పిచ్చి ఊహలను పదేపదే తలచుకుంటే అవన్నీ తలపుల్లోనే నిజమవ్వవా?

“ఠొక్.. ఠొక్..”

ధర్మాంబ చేతిలోని అడకత్తెర రాత్రి నిశ్శబ్దంలో వక్కను కత్తిరిస్తున్న శబ్దం… కైలాసరావు తన భార్యను చూసేప్పుడు తనను చూసుకుంటాడు. 

ధర్మాంబ అరచేతిలో ఉన్న తమలపాకులో ఎండిపోయిన సున్నాన్ని పోగుచేసి పెట్టి వక్కను పెట్టి చుట్టి, ఇత్తడి రోలులో దంచసాగింది. 

కైలాసరావు నాలుక నోట్లో ఒకప్పుడు దంతాలున్న చోటుని తడిమింది. ‘హ్మ్… నాకెప్పుడూ దంతాలు బలహీనంగానే ఉండేటివి…’

తన ఒంటిని ఒకమారు తడిమి చూసుకున్నాడు. జబ్బలనూ, భుజాలనూ కదిలించాడు. చేతులను విదిలించుకుని చిటికెలు వేశాడు. జుట్టు నిండిన ఛాతీ, భుజాలమీద చర్మంలో కాస్త ముడతలున్నప్పటికీ కండలు బాగా కనబడుతుంటాయి. 

నిజానికి కైలాసరావు దృఢమైన దేహదారుఢ్యం కలిగిన మనిషి. ఒకప్పుడు బలాఢ్యుడే. ఇప్పటికీ ఏం తీసిపోలేదు. గత ఏడాదే షష్టిపూర్తి జరిగింది.

ధర్మాంబకు యాభైకు పైన, అరవైకి లోపు… ఆమెది వెదురు కర్రలాంటి దేహం. సన్నగా ఉన్నప్పటికీ గట్టి కాయం. లేకుంటే దాదాపు నలభైయేళ్ళుగా ఆ బలాఢ్యుడి ఒంటికి సరితూగేదా! 

ముసలాయన చెయ్యి భార్య భుజాన్ని తాకింది.

“ఏంటి? ముద్దు చేస్తున్నారు. తాంబూలం వేసుకుని పడుకోండి” అంటూ మెత్తగా దంచిన తాంబూలాన్ని రోట్లోనుండి తీసి కొంచం ఆయన అరచేతిలో పెట్టింది. మిగిలినదాన్ని తన నోట్లో వేసుకుని పుక్కిట పెట్టుకుంది. ధర్మాంబకు దంతాలు బానే ఉన్నాయి. అయినా మొగుడికోసం దంచిన తాంబూలంలో కొంచం మిగుల్చుకుని దాన్ని తాను వేసుకోవడంలో ఒక ఆనందం. ఆరేళ్ళుగా ఇదే పద్ధతి. 

ఆ దంపతుల మధ్య ఇప్పటివరకు ఎలాంటి పొరపొచ్చమూ రాలేదు. ఎలాంటి తగాదాలు లేవు. ‘ఛీ… దూరంగా పో’ అని ఆయన అనలేదు. అంటే ఆమె తట్టుకోగలదా అన్నది అటుంచితే, ముందుగా ఆయన నాలుకే అలాంటివి అనలేదు. మూడు నవ్వులు, ఆరు కబుర్లుగా జీవితాన్ని సంతోషంగానే గడిపేశారు. గడిపేశారు అనగలమా? ఇప్పటివరకు జీవితాన్ని అలానే గడిపారు.

వెన్నెల కొంచం మసకబారింది. రాత్రి నిశ్శబ్దం. హాల్లో పడుకుని ఉన్న మురళి నిద్రలో ఏవో కలవరిస్తూ పొర్లి పడుకుంటున్నాడు. గది లోపలినుండి గాజుల చప్పుడు, మంచం కిఱ్ఱుశబ్దం, కోడలి గుసగుసలు… 

ఎక్కడో దూరాన రాత్రి పక్షి రెక్కలు అల్లార్చుకుంటున్న శబ్దం, గబ్బిలం ఒకటి వాకిటి పైన ఆకాశంలో అడ్డంగా ఎగురుకుంటూ పోతోంది… వాకిట్లో సగానికి పైనే చీకటి. చందమామ, పెరటికి అవతల ఉన్న ఇంటి వెనక్కి జారిపోయాడు. వాళ్ళు పడుకుని ఉన్నచోట చీకటి వెన్నెల వెలుగుకు తెరవేసింది. 

ధర్మాంబ మెల్లగా పడుచు ప్రాయం తిరిగి వచ్చినట్టు గలగలమని నవ్వింది… ముసలాయన విశాలమైన ఛాతీమీద ఆమె ముఖం వాల్చింది. బంగారు మురుగులున్న ఆమె రెండు చేతులూ ముసలాయన వీపు మీద మెరిశాయి.

చీకటి-వెన్నెల, రాత్రి-పగలు, యవ్వనం-వార్ధక్యం… వీటన్నిటికీ అతీతమైనది కదా సుఖం! అవును. అది – సుఖం మనసులో ఉంటుంది… ఆస్వాదించగల మనసు ఉంటే ఏ దశలోనైనా కాలంతో నిమిత్తంలేకుండా అది ఆనందాన్నిచ్చే ఘని. ధర్మాంబ, కైలాసరావు అలాంటి మనసుగలవాళ్ళు… వయసుతో వాళ్ళకు పనిలేదు.

“ఢక్… ఢక్…” కైలాసరావు, వెన్నెల వెలుగులోకి చాపను లాగి, ఇత్తడి రోలు తీసుకుని అందులో తాంబూలం దంచుతున్నాడు. 

పక్కన ధర్మాంబ పడుకుని ఉంది… నిద్ర, మగత నిద్ర, మైమరపు. 

“మీరింకా పడుకోలేదా?”

“ఆఁ… లేదు. నువ్వు తాంబూలం వేసుకుంటావా?”

“ఊఁ… ఆ గుంజపక్కన నీళ్ళ చెంబు పెట్టాను. అందుకోండి. నాలుక ఎండిపోయింది” అంటూ గొంతు సవరించుకుంది. 

“నాక్కూడా నాలుకెండిపోయింది” అంటూ లేచి చెంబు అందుకుని నీళ్ళు తాగి ఆమెకు తీసుకొస్తున్నాడు కైలాసరావు. 

వస్తున్నప్పుడు ఆ వెన్నెల వెలుతురులో కండలు తిరిగిన ఆయన దృఢమైన దేహాన్ని చూసి ధర్మాంబ మనసు, పసివయసుదయ్యి, ఆ అందంలో చొక్కి మైమరపుకు లోనైంది. ఆయన ఆమె దగ్గరకొచ్చి కూర్చున్నాడు. ఆమె నెమ్మదిగా నీళ్ళు తాగింది. పెద్దగా నిట్టూర్చి ఆయన మీద వాలింది. బలమైన ఆయన చేయిని మెల్లగా తడిమింది. ఆమెకు నవ్వు వచ్చింది – నవ్వింది. 

“ఎందుకే నవ్వుతున్నావు?” 

“ఏం లేదు; ఈ ముసలోళ్ళు చేస్తున్న వీరంగాలు ఎవరైనా చూశారంటే నవ్వుకోరూ అని అనిపించి నవ్వాను.” 

ఆయన కన్నుగీటుతూ ఆమె తలమీద మొట్టి “ఎవరే ముసలోడు?” అంటూ ఆయనా నవ్వాడు. ఆమె కూడా నవ్వింది. 

ధర్మాంబ లేచి కూర్చుని మరోమారు తాంబూలం వేసుకుంది. ఆమె చూపు దించుకునే ఉంది. ముసలాయన ఆమె ముఖాన్ని నిమిరాడు. ఆమె కళ్ళు పైకెత్తి చూసింది. ఆయన ఆమె కళ్ళల్లోకి చూస్తూ నవ్వాడు. 

“ఛీ… మీలో కొంటెతనం పోలేదు” అంది సిగ్గుపడుతూ, ఖండిస్తున్న స్వరంతో. 

ఆనందానుభూతిలో తేలుతున్న కారణంగానేమో అంతు పట్టని నవ్వేదో లోలోపలనుండి పొంగుకొస్తోంది. ముసలాయన అతిశయంతో ఉబ్బితబ్బిబైపోతున్నాడు. ఆమెతో సరదాగా మాట్లాడి ఆటపట్టించాలి అనిపించింది ఆయనకు. అరిచేతిలో పొగాకును నలుపుతూ, తనలో తానే మెల్లగా నవ్వుకుంటూ “ఆ రోజుల్లో నేను చేసిన లీలలు నీకెక్కడ తెలుస్తాయిలే” అని అంటూ తలవెనక్కి వాల్చుకుంటూ పొగాకును నోట్లో వేసుకున్నాడు. 

“ఏం? దొరగారేమైనా లండన్‌కు పోయినారా?”

“ధర్మూ, నీకు తెలియదు. నువ్వు ఎప్పుడూ అమాయకురాలివే. నీతో అప్పట్లో నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్తే ఏం కాదులే” ముసలాయన లేచి వెళ్ళి ఎంగిలి ఉమ్మి వచ్చాడు. 

“మన గుడివీధిలో గోమతి ఉండేది కదా, గుర్తుందా నీకు?” 

కాళ్ళకు గజ్జెకట్టుకుని ఘల్లుఘల్లుమంటూ, నల్లత్రాచులా కదిలే జడను గాల్లో విసురుతూ, కళ్ళు, పెదవులతో భావాన్ని చెప్పేస్తూ ‘సమయమీదే రారా’ అని తనువంతా నాట్యముద్రలను ప్రదర్శించే పుత్తడి బొమ్మలాంటి గోమతి రూపం ధర్మాంబకు కళ్ళముందు కదిలింది. అబ్బబ్బా… ఆ రూపం ఆమె కళ్ళముందు కొన్ని క్షణాలు అలా నిలిచిపోయింది. 

“ఏం, గుర్తొచ్చిందా… ఆ రోజుల్లో ఆమె సాటి ఎవరూ లేరు. ఆమె ఎంతటి కళాకారిణి అయినా వారకాంతే కదా. వాళ్ళు సుఖపెట్టినట్టు సంసారంలో ఉండే ఆడవాళ్ళు సుఖపెట్టలేరుగా?”

“ఉఁ…” ధర్మాంబ కళ్ళు ముసలాయన కళ్ళను అర్థవంతంగా చూశాయి. మనసు…? ‘ఓహ్… ఆ రోజుల్లో ఆమె నాట్య కచేరి అంటే అంతలా పరుగు తీసేవారు అందుకేనా?’ అని పరిపరి సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటూ ఆలోచిస్తోంది ఆమె మనసు. 

ముసలాయన ఆనందంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. “నన్ను ఒకసారి నీలగిరికి బదిలీ చేశారు, గుర్తుందా? కృష్ణ అప్పుడు కడుపులో ఉన్నాడు, ఏడో నెల. కదా?”

“ఉఁ…” ధర్మాంబ కళ్ళు మిర్రిమిర్రి చూస్తున్నాయి. ‘ఇది వాస్తవమే! ఇది వాస్తవమే!’ అని ఆమె లోపల ఏదో గొంతు వినబడుతోంది. 

“అప్పుడు నేను ఒంటరిగా వెళ్ళాననా అనుకుంటున్నావు… పోవే పిచ్చిమొహందానా! అప్పుడు ఆ గోమతి నాతో వచ్చింది… ఆమె చెక్కిన శిల్పంలా ఉంటుంది… ఆమె ఏం చెప్పిందో తెలుసా చివర్లో…” ముసలాయన తనలో తానే నవ్వుకున్నాడు “నేను ఇప్పటిదాకా ఎంతోమంది మగవారిని చూశాను – మగాడు అంటే అది మీరే…” ముసలాయన మళ్ళీ నవ్వాడు. 

అది ఏం నవ్వు… ఆటపట్టించే నవ్వా, లేదు నిజమైన నవ్వేనా? ధర్మాంబ మనసులో ఆత్రం, మోసం చేయబడ్డాను అన్న ఆక్రోశం, వంచనకు గురయ్యానన్న బాధా ఆమెను దహించేస్తున్నాయి.. 

“నిజంగానా?”

“లేకుంటే అబద్ధమా? ఇప్పుడు అదంతా అప్రస్తుతం, ఎప్పుడో జరిగింది కదా…”

ఓరి పాపిష్టి ముసలివాడా! నిజమో అబద్దమో ఆమె సంతృప్తి కోసమైనా ‘కాదు’ అని చెప్పి ఉండొచ్చు కదా?

ధర్మాంబ ముసలిదే! ముసలిది ఆడది కాదా? ‘మోసగాడు! మోసగాడు!’ అని ఆమె లోపల గుండె గట్టిగా కొట్టుకుంటుంది. ‘అవును; అది నిజమే. అబద్ధం కాదు’ ఎందుకో ఆమె మనసు దాన్ని నమ్మేసింది. ఇది అబద్ధం అయి ఉంటుందా అన్న చిన్న సందేహం కూడా కలగలేదు – అదంతా వారి అన్యోన్యతలోని రహస్యం!

హఠాత్తుగా లేచి చీకట్లో తడుముకుంటూ నడిచి వెళ్ళి హాల్లో పిల్లల పక్కన చతికిలపడింది. 

“అరే, ధర్మూ, అలిగావా? ఓసి అయోమయందానా!” అంటూ ఆటపట్టించే ధోరణిలోనే నవ్వుతూ చాపలో గుడ్డ పరచుకుని పడుకున్నాడు కైలాసరావు. 

ఆటపట్టించడమా? అదేం ఆటపట్టించడమనీ? ముసలాయన నోట్లో శనేశ్వరుడు చేరికదా జీవితంతో ఆడుకుంటున్నాడు! గంట పన్నెండయింది. ముసలాయన నిద్రపోయాడు. ధర్మాంబ నిద్రపోలేదు. 

మరుసటి రోజు… 

మరుసటి రోజేంటి, ఆ రోజునుండి చివరిరోజుదాకా… 

ఆయనకు ఆమె చేత్తో కాఫీ ఇవ్వలేదు, పళ్ళు తోముకోడానికి, స్నానానికి వేడినీళ్ళు పెట్టివ్వడంలేదు. వీపు తోమడం లేదు. అన్నం వడ్డించడం లేదు. తాంబూలం దంచివ్వడం లేదు. 

పాపం! ముసలాయన అనాథ పిల్లవాడి లాగా తపించిపోతున్నాడు. ఆమెకు సంబంధించినంతలో, కైలాసరావన్న ఒక మనిషి ఉనికే లేనట్టు, అలాంటొక మనిషికి తాను జీవితభాగస్వామే కాలేదు అన్నట్టు మెలుగుతోంది. ఆయనతో ఒక్కమాటయినా మాట్లాడలేదు. ఎవరితోనూ మాట్లాడలేదు. కొడుకూ కోడలూ ఎన్నో రకాలుగా గింజుకుని అడిగారు. అన్నింటికీ మౌనం తప్ప మరో జవాబు రాలేదు ఆమెనుండి. 

ముసలాయనా? ఆయన నోరు తెరిచి ఏమని చెప్పగలడు? మౌనంగా ఉండటం తప్ప! 

ఆ రోజు రాత్రి విజయ అడిగింది “బామ్మా, తాతయ్యతో కటీఫా?”  

ఆమె దానికి కూడా సమాధానం ఇవ్వలేదు. 

“ఎందుకు తాతయ్యా, బామ్మ నీతో మాట్లాడటం లేదు? నువ్వు కొట్టావా?” మురళి ముసలాయన్ని రకరకాలుగా అడిగాడు. ముసలాయన తాళలేకపోయాడు. 

‘ఏమిటి ధర్మూ, నేనేదో నిన్ను ఆట పట్టించాలని అబద్ధం చెప్పాను. నా గురించి నీకు తెలియదా? నేను నీకు ద్రోహం చేసి ఉంటాను అని అనుకుంటున్నావా? ఇంతకాలం నాతో కాపురం చేసి నా గురించి తెలుసుకున్నది ఇంతేనా, ధర్మూ… ధర్మూ…’

‘ఛీ! కాపురమా… అయ్యో! నా బొంద! కాపురం చేస్తున్నట్టు నమ్మి ఇంతకాలం మోసపోయానే…’ దీన్ని కూడా పైకి అనలేదు.

పిల్లలు నిద్రపోయారు. ముసలాయన స్వయంగా తాంబూలం దంచి వేసుకున్నాడు. 

“ధర్మూ… నన్ను నమ్మవా?” ఆయన చెయ్యి ఆమె తలను నిమిరింది. 

దెబ్బతిన్న మృగంలాగా విజృంభించి కదిలి ఆమె ఒళ్ళు అదిరిపడింది. “ఛీ” అని అసహ్యంగా ఉగ్రంగా గద్దించింది “ముట్టుకున్నారంటే అరిచి గోల చేసి నవ్వులపాలు చేసేస్తాను” అని అంది. 

అమెకు ఆయాసం వచ్చింది – ఒళ్ళంతా చెమటలు పోసి వణికింది. ఆయనతో ఆమె అలా మాట్లాడటం అదే తొలిసారి. ఆయన నిశ్చేష్టుడైపోయాడు. ముసలాయన మనసులో కుమిలిపోతూ లేచి వెళ్ళిపోయాడు… 

‘నన్ను… నన్ను సందేహిస్తుందే’ అని తలచుకున్నప్పుడు మనసులో ఏదో అడ్డుపడి కళ్ళు చెమర్చాయి. ‘పోనీ, సద్గతి దొరకదు’ అని మనసు శపించింది. దిక్కులేనివాడిలా, ఎవరూలేని అనాథలా వీధి అరుగుమీద కటికనేలమీద పడుకున్నాడు. ధర్మాంబని చేపట్టిన రోజు నుంచి ఈరోజే తొలిసారిగా ఆయన కళ్ళల్లో నీళ్ళు ధారలు కట్టడం. ‘తల రాత’ అన్న గొణుగుడు.

విధికి సమయం ఆసన్నమయ్యింది. 

రాత్రి ఎనిమిది కావస్తోంది. వీధి వాకిట కారు ఆగింది. హాల్లో ధర్మాంబ మంచం మీద పడి ఉంది. చుట్టూ మనవడు, మనవరాలు, కొడుకు, కోడలు నిల్చుని ఉన్నారు – డాక్టర్ ఇంజెక్షన్ చేస్తున్నాడు. వీధి అరుగు పక్కనే నిల్చుని ఉన్న కైలాసరావు కలవరపడే మనసుతో కిటికీలోనుండి తొంగి చూశాడు. లోపలికి వెళ్ళటానికి ఆయనకి అనుమతి లేదు. 

డాక్టర్ బయటికి వచ్చాడు. కృష్ణ పెట్టె తీసుకొని డాక్టర్ వెనక వచ్చాడు. 

“డాక్టర్… నా ప్రాణం బతుకుతుందా?” అన్న కైలాసరావు వణికే స్వరం డాక్టర్ దారిని అడ్డగించింది. 

డాక్టర్ సమాధానం చెప్పకుండా తలవంచుకుని కైలాసరావు బాధను తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. ముసలాయన తట్టుకోలేని ఆవేశంతో లోపలికి పరిగెత్తాడు. 

“ధర్మూ… ధర్మూ… నన్ను వదిలెళ్ళిపోవద్దే… ధర్మూ!”

గడ్డకట్టుకుపోయినట్టు మంచంమీద పడివున్న ధర్మాంబ ఒంటిలో ఎలాంటి కదలికలూ లేవు. ప్రాణం? 

నుదుటి మీద ఒక ఈగ వాలింది. నుదుటి చర్మం, కనుబొమ్మల కొసలు కదులుతున్నాయి. కళ్ళు పెద్దగా తెరచుకుని ఒక మారు కలియజూస్తున్నట్టు కనుబొమ్మలు కదిలాయి. 

ఆ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, గ్లాసులో పాలను తల్లి నోట్లో పోస్తున్నాడు కృష్ణ. 

‘ఎవరు… కృష్ణా… పాలల్లోనేరా బంధం ఉండేది… ఆ బంధమూ తెగిపోతుంది…’

అదిగో, సరస్వతి ఇప్పుడు పాలు పోస్తోంది. 

‘ఇద్దరు పసిపిల్లల్ను ఒక్కత్తివే ఎలా పెంచబోతున్నావో బంగారు తల్లీ!’ 

మనవడు మురళి “బామ్మా… బామ్మా…” అని ఏడుస్తూ పాలు పోశాడు. మురళిని దగ్గరకు తీసుకుని హత్తుకోవాలన్న తపనతో కళ్ళు మెరిశాయి. 

భయపడిపోతూ, ఏం జరుగుతోందో అర్థం కాక నిలుచుని విజయ తన లేత చేతులతో బామ్మ నోట్లో పాలు పోస్తున్నప్పుడు… అందులో ఏం తీపి ఉన్నదో! ముఖంలో అపురూపమైన కళ తాండవించింది… గటగటా పాలు లోపలికి వెళ్ళాయి. 

పైగుడ్డని ముఖానికి అడ్డం పెట్టుకుని ఒళ్ళు అదిరిపడేలా వగస్తూ వచ్చి నిల్చున్నాడు కైలాసరావు. ‘ఈ దశలోనైనా నన్ను క్షమించదా’ అన్న తపన! ఆయన చేతులు పాల గ్లాసును తీసుకుంటుండగా వణికిపోతున్నాయి.

“ధర్మూ… ధర్మూ… నన్ను ఒకమారు చూడవా, ధర్మూ?”

‘ఎవరది?’ ఆమె కళ్ళు ఉరిమి చూస్తూ కదిలాయి. తాళలేని శోకంతో కన్నీళ్ళతోబాటు తపిస్తున్న పెదవుల్లో చిరునవ్వుని తెప్పించుకుని పాల గ్లాసును ఆమె నోటి దగ్గర పెట్టాడు కైలాసరావు. పళ్ళు బిగించుకుని మూర్చవచ్చినట్టు కళ్ళు తేలేసిన ధర్మాంబ తల భుజంమీదకు ఒరిగిపోయింది. నోటి అంచులో పాల ధార కారిపోతోంది. 

“అయ్యో అత్తయ్యా” అని సరస్వతి ఏడుపు గాల్లోకి లేచింది. 

“అమ్మా…. బామ్మ” అంటూ మురళి తల్లిని పట్టుకుని ఏడుస్తున్నాడు. విజయకి ఏమీ అర్థంకాక దిక్కులు చూస్తోంది. కృష్ణ తల వంచుకుని నీళ్ళు కారుతున్న కళ్ళతో కూర్చుండిపోయాడు. 

ముసలాయన పైకి లేచాడు. ఆయన ముఖం కవళికలు మారిపోయాయి. కోపం, బాధా కలగలిసి నీళ్ళు తిరిగిన కళ్ళు ఎరుపెక్కాయి. 

కైలాసరావు ముసలోడే! అయినప్పటికీ మగాడు కదా! 

“దీనికి నా చేత్తో తలకొరివి పెట్టను!” చేతిలో ఉన్న పాల గ్లాసును నేలమీదకు విసిరికొట్టి ఆ గదినుండి బయటకు నడిచాడు. 

పెరటి వాకిట్లో వెన్నెల్లో పాలగ్లాసు ఘణఘణమంటూ శబ్దం చేసుకుంటూ దొర్లిపడింది. 

ఆరోజు, ఆ చివరి రాత్రి, వాళ్ళు పడుకున్న ఆ చోట చిందిపోయిన పాలల్లో వెన్నెల కిరణాలు వెలుగుని చిందిస్తూ నవ్వుతున్నాయి.

అవును, అదే వెన్నెలే!