అతని కోసమే ఎదురుచూస్తున్నాను. నవ్వుతూ పలకరించాను.
“రండి సార్, బావున్నారా? అమ్మావాళ్ళు బావున్నారా?”
“బావున్నాను. నువ్వెలా ఉన్నావు?”
“ఏదో అలా సాగిపోతూంది సార్. ఇలా కూర్చోండి, కొత్తగా వచ్చిన ప్రొఫైల్స్ చూపిస్తాను.”
పక్కనున్న అలమరా నుండి పెళ్ళికుమార్తెల వివరాలు ఉన్న పెద్ద ఫైలు తీసి అతని ముందు పెట్టాను. అలమరాలో పదికి పైగా ఇలాంటి పెద్ద ఫైళ్ళు ఉన్నాయి. అన్నీ పెళ్ళి సంబంధాలు వెతుకుతూ ఉన్న అమ్మాయిల, అబ్బాయిల వివరాలు, జాతకాలు, ఫోటోలు.
“పైన ఉన్న పది పదకొండు ప్రొఫైల్స్ మాత్రమే చూడండి. మిగిలినవన్నీ మీరు అదివరకు చూసినవే. ఏదైనా నచ్చితే చెప్పండి.”
అతను ప్రొఫైలు తిరగేస్తూ ఉంటే నేను నా పనిలో పడ్డాను. ఏ రోజుకు ఆ రోజు వచ్చే అమ్మాయిలు అబ్బాయిల వివరాలను కంప్యూటర్లో టైప్ చేసి డేటా అంతా ఎక్కించాలి. దానితోపాటు జాతకం ఫోటోలు స్కాన్ చేసి జత చేయాలి.
అతను తన ముందున్న ఫైలును అశ్రద్ధగా చూస్తూ నన్ను ఓరకంట చూడడం గ్రహించాను. కళ్ళు తిప్పుకోకుండా చూడాలనిపించే అంతటి అందగత్తెనేమీ కాను నేను. నా అంచనా ప్రకారం నేను ఒక ఆవరేజ్ అమ్మాయిని. అయినా కూడా ఒక మగవాడి తదేకమైన చూపుకు అర్థం ఏంటో తెలుసుకోలేని అమాయకురాలిని కాను.
తల పైకెత్తి “ఏంటి సార్, ఏదైనా ప్రొఫైల్ నచ్చిందా?” అని అడిగాను, ‘నువ్వు నచ్చావు’ అని చెప్తాడేమోనని ఊహించుకుంటూ.
గత రెండు నెలలుగా అతను మా మ్యారేజ్ బ్యూరోలో ఉన్న ఏ ప్రొఫైల్‌నూ ఎన్నుకోలేదు. ఊరికే అలా వచ్చి ప్రొఫైళ్ళన్నీ తిరగేసి ఏదీ నచ్చలేదని చెప్పి వెళ్ళిపోతున్నాడు. మరి అలాంటప్పుడు సమయం అంతా వృధా చేసుకుని ప్రతి వారం వచ్చి గంటసేపు వాటన్నిటినీ ఎందుకు తిరగేస్తున్నాడు అని ఒక పిచ్చి అనుమానం వచ్చింది. అతను నన్ను చూడడానికే వస్తున్నాడు అనే నిర్ధారణకు వచ్చేశాను. అలా అని ఒకరినొకరు ఆకర్షించుకునే ఏ గమ్మత్తైన సంభాషణో, సంఘటనో మా మధ్య చోటు చేసుకోలేదు. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో అతని చూపులో ఏదో చెప్పాలని ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. బహుశా నేను అతిగా కూడా ఊహించుకుంటూ ఉండొచ్చు.
నిజానికి, మా పరిచయం ఒక పెద్ద గొడవతోనే మొదలైంది.
మూడుముళ్ళు మ్యారేజ్ బ్యూరో అనబడే మా ఆఫీసు ఒక పాత, పెద్ద ఇంట్లో ఉంటుంది. ఊరి బయట ఉన్నా, అప్పుడప్పుడే సిటీలో కలిసిపోవడానికి చూస్తున్న ఒక గ్రామం అది. చదువుకున్న కొత్త తరం వారికి తప్ప మిగిలిన వాళ్ళకు కంప్యూటర్‌కు సంబంధించిన అవగాహన లేదు. ఈ మ్యారేజ్ బ్యూరో మొదలుపెట్టిన పెద్దాయనకు ఇప్పుడు వయసు డెబ్బై ఏళ్ళు. అతను చిన్నతనంలో పెళ్ళిళ్ళ పేరయ్యగా ఒంటరిగానే ఈ వ్యాపారం మొదలుపెట్టాడు. ఇప్పుడు దీన్ని ఆఫీస్‌గా మార్చి పాతికమంది పనిచేసే స్థాయికి తీసుకువచ్చాడు. పెద్దగా చదువు, ఆర్థిక స్తోమతా లేని అమ్మాయిలే ఇక్కడ ఉద్యోగం చేసే అందరూను. దాదాపుగా ఎనిమిదవ క్లాసు నుండి 12వ క్లాస్ చదివినవాళ్ళు మాత్రమే. డిగ్రీ ముగించినవాళ్ళు ఇద్దరు. ఐదుగురు పెళ్ళయినవాళ్ళు – పదేళ్ళుగా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. మాకు పదివేల నుండి పదిహేను వేలదాకా జీతాలు ఉంటాయి.
ఆఫీస్ అనబడే ఈ ఇంట్లో చాలా గదులు. ఒక్కొక్క గది ముందు ఒక్కో కులం పేరున్న బోర్డు వేలాడదీసి ఉంటుంది – మాల, కోమటి, మాదిగ, కుమ్మరి, కంసాలి, బ్రాహ్మణ, కమ్మ, కాపు, రెడ్డి, రాజులు, క్రైస్తవులు, ముస్లిములు – మళ్ళీ వీళ్ళందరిలోనూ రెండో పెళ్ళి, కుల పట్టింపులు లేనివారు… ఇలా. ఒక్కో గదిలోను నాలాగే ఒక ఉద్యోగి. నేను మధ్యతరగతి సంసారుల కులాలకు చెందిన గదిని చూసుకుంటూ ఉన్నాను. పూర్వీకులు పాలకుల వంశానికి చెందినవారు అని గొప్పలు చెప్పుకునే కులం. ఇప్పుడు ప్రభుత్వం దీనిని వెనకబడిన కులంగా గుర్తించింది. ఇక్కడ పనిచేసే బాపన అమ్మాయి ‘వాళ్ళంతా శూద్రాళ్ళు’ అని అంది ఒకసారి.
మా ఆఫీసుకు కొత్తగా ఎవరు వచ్చినా ముందుగా వాళ్ళని మేము అడిగే ప్రశ్న “మీరు ఏవిట్లండీ?” అనే. కులం గురించి ఇలా సిగ్గు లేకుండా అడగడం, చెప్పడం ఇక్కడ సహజం అన్నది మేము అడిగే ధోరణిలోనే తెలిసిపోతుంది. వాళ్ళు చెప్పే జవాబును బట్టి వాళ్ళు వెళ్ళవలసిన గది, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం నిర్ణయించబడుతుంది.
అలా ఆరు నెలల క్రితం నా గదికి పంపించబడ్డారు అతని తల్లిదండ్రులు. కొడుకు ఫోటోకి నలుమూలల పసుపు కుంకుమ పూసుకొని వచ్చారు. టిప్‌టాప్‌గా ఉన్న ఆ ఫోటోలోని అబ్బాయి పేరు ప్రభు అని చెప్పారు. ఫోటోలో చూడడానికి పాతికేళ్ళే ఉంటాయి అనిపించింది. వివరాలు రాసున్న చీటీలో 29 అని ఉంది. ఇక్కడ చాలావరకు అందరూ పాత ఫోటోలనే ఇస్తూ ఉంటారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం. నెలకు రెండు లక్షల సంపాదన అని తెలియజేశారు. తర్వాత చదువు ఇంటర్ అని చూడగానే నాకు అర్థం అయిపోయింది. ఇతనికి సరిపోయే ప్రొఫైల్ ఏదీ ప్రస్తుతానికి తయారుగా లేదు అని. అయితే నేను వాళ్ళతో అలా చెప్పడానికి కుదరదు. వచ్చే కొత్త కస్టమర్లను ఎలాగైనా ఒప్పించి డబ్బులు కట్టించుకుని రిజిస్టర్ చేయించి తీరాలి. తేనె పూసిన అబద్దపు మాటలతో ఆసక్తిని, నమ్మకాన్ని కలిగించాలి. కొత్తగా ఒక కస్టమర్ లోపలికి వచ్చి రిజిస్టర్ చేసుకోకుండా వెళ్ళిపోతే, ఆ శాఖ ఉద్యోగికి ఆ వారం జరిగే మీటింగ్‌లో ప్రత్యేక నీతికథల తరగతి ఉంటుంది.
“ఏంటమ్మా, కస్టమర్‌ని రిజిస్టర్ కూడా చేయించలేకపోతే వాళ్ళతో మాట్లాడి పెళ్ళి ఎలా చేసి పెట్టగలవు? తీసుకునే జీతానికి కొంచమైనా శ్రద్ధ పెట్టి ఉద్యోగం చెయ్యి. ఎనిమిదవ తరగతి ఫెయిల్ అయిన నీకు వేరే ఎవడైనా ఉద్యోగం ఇస్తాడా చెప్పు? పొద్దున తీరుబాటుగా పదింటికి వచ్చి, సాయంత్రం ఆరు అవ్వగానే సంచి తీసుకుని బయలుదేరడం… అదేదో పెద్ద బ్యాంకు ఉద్యోగం చేస్తున్నట్టు! ఇక్కడ ఉద్యోగం ఇచ్చి ఈ కులానికి ఇన్‌ఛార్జ్ అన్న పదవి ఇచ్చిన నాకు నీవల్ల నష్టమే కదా?”
మాలో విధేయత, కృతజ్ఞత, పశ్చాత్తాపాలను తన మాటలతో ప్రేరేపించి మేమే ఏదో హంతకులమన్నంత గొడవ చేసేస్తాడు మా యజమాని. అలా మాటలు పడుతూ, సిగ్గుతో బాధతో ముడుచుకుపోతున్న అమ్మాయిని మిగిలిన అమ్మాయిలు చూసి ముసిముసిగా నవ్వుకోవడం మరింత బాధను కలిగిస్తుంది. నవ్విన అమ్మాయి వచ్చేవారం అలా ముడుచుకుపోతుంది, లేకుంటే కిందటి వారమే ముడుచుకుపోయుంటుంది. అయినప్పటికీ అవతలివాళ్ళకు అలా జరుగుతుంటే చిన్న ఆనందం. ఆ మీటింగుకు భయపడే మేము ఏదో చిన్న చిన్న కుట్రలు పన్ని, వచ్చే కస్టమర్లను ఎలాగో ఒకలాగా రిజిస్టర్ చేయించేస్తుంటాము.
“బాబుకు సరిపోయే అమ్మాయిలు ఉన్నారా తల్లీ?” ఆమె అమాయకంగా అడిగింది.
“ఉన్నారమ్మా. నేను కొన్ని ఫోటోలు చూపిస్తాను. మీరు చూడండి…”
నాలుగైదు ఫోటోలు తీసి చూపించాను. అందరూ డిగ్రీకి కంటే ఎక్కువ చదువుకున్న అమ్మాయిలే. మా ఊర్లోవాళ్ళే కాకుండా బయటి ఊళ్ళ నుండి కూడా మా దగ్గర రిజిస్టర్ చేసిన ప్రొఫైల్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో అమ్మాయిలు కనీసం ఒక డిగ్రీ అయినా పూర్తి చేసేస్తున్నారు. ఆ అమ్మాయిలు కోరుకునేదంతా ఐ.టి. ఉద్యోగం చేసే అబ్బాయిలను, డాక్టర్లను. అయితే నేను తడుముకోకుండా అబద్ధం చెప్పాను.
“ఈ అమ్మాయి పదో తరగతి చదువుకుంది.
“ఈ అమ్మాయి ఇంటర్.”
“ఈ అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్.”
“ఈ అమ్మాయి తొమ్మిది ఫెయిల్.”
తొమ్మిదో తరగతి ఫెయిల్ అని నేను చెప్పిన అమ్మాయి ఆయుర్వేద డాక్టర్. ఇలా అబద్ధాలు చెప్పాల్సివచ్చినప్పుడు దూరంగా వేరే ఊర్లలో ఉండేవాళ్ళ ప్రొఫైళ్ళను ఎన్నుకుంటాము. ఈ ఊర్లోవాళ్ళే అయితే తెలిసిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలా అబద్ధాలు చెప్పేటప్పుడు ఎలాంటి అపరాధభావనా ఉండదు. రెండేళ్ళలో బాగా అలవాటు అయిపోయింది. ఏదో ఒకటి చెప్పి వచ్చినవారికి తగిన అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నట్టు చూపించుకుని వాళ్ళను రిజిస్టర్ చేయించి, వాళ్ళ చేత డబ్బులు కట్టించేసుకోవాలి అన్నదే మా నీతి, మా ఉద్యోగ ధర్మం.
ఆయుర్వేద డాక్టర్ నక్షత్రం, రాశి వంటి జాతక వివరాలను పైపైనే చూసిన ఆవిడ “ఈ అమ్మాయి జాతకం మాకు సరిపోవచ్చేమో. మా జ్యోతిష్యుడి దగ్గర చూపించి చెప్తాము. అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎవరితో మాట్లాడాలి?”
“కచ్చితంగా చెప్తామమ్మా. ఈ లోగా మీరు మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోండి. సంవత్సరానికి వెయ్యి రూపాయలు కడితే చాలు. బహుశా ఈ ఏడాది పెళ్ళి కుదిరిపోవచ్చు. దాదాపుగా ఈ అమ్మాయే సెట్ అవ్వచ్చు. అలా కుదరకపోయినా నెలనెలా మీకు సరిపడే సంబంధాలను వచ్చినవి వచ్చినట్టు మీకు పంపిస్తూ ఉంటాము. మా వెబ్‌సైట్లో కూడా చూసుకోవచ్చు”
“అవన్నీ చూడటం మాకు చేత కాదు తల్లీ. పోస్టులో పంపించేయ్.”
“ఇప్పుడే డబ్బులు కట్టేస్తాం. కట్టిన వెంటనే అమ్మాయి వాళ్ళతో మాట్లాడేస్తారా?”
“మీరు అమ్మాయి వివరాలు ఫోటోలు చూసినట్టు వాళ్ళు కూడా మీ అబ్బాయి ఫోటో ఉద్యోగం చదువు ఇవన్నీ చూడాలి కదా. ఇవాళే మీ వివరాలన్నీ వాళ్ళకు పంపించేస్తాం. వాళ్ళు చూసి ఓకే చెప్పగానే మీకు తెలియజేస్తాం.” ఎలాంటి తడబాటు లేకుండా అలవోకగా వచ్చిపడుతున్న అలవాటయిన మాటలు. రోజూ చెప్పే అవే అబద్దాలకు మన ముఖాలలో ఎలాంటి మార్పు ఉండదు. కంగారు ఉండదు. చెరగని చిరునవ్వుతో ఎంతో ఇష్టంగా చేస్తున్నట్టు సహజంగా ఉండటం వీలవుతుంది.
డబ్బులు కట్టి రిసీట్ తీసుకున్నారు. నేను రాసిచ్చిన ఫామ్‌లో అమ్మాయి పేరు, చదువు, ఊరు అన్నీ తప్పులే నింపి ఇచ్చాను.
“అన్నయ్యకు తొందరగా మంచి అమ్మాయి కుదరాలని నువ్వు కూడా వేడుకో తల్లీ” అని అన్నారు ఆమె.
అప్పుడే ఆ ఫోటోలోని టిప్-టాప్ అబ్బాయి అందాన్ని ఆస్వాదించిన నాకు ‘అన్నయ్య’ అనే మాట చిన్న నవ్వుని తెప్పించింది. “తప్పకుండా కుదురుతుంది” అని అన్నాను.
“వెళ్ళొస్తాము తల్లీ” అన్న ప్రభు వాళ్ళ నాన్నతో “అలాగే నాన్నగారూ” అని అన్నాను. ఇలాంటివన్నీ మామూలు అయిపోయాయి నాకు – అమ్మ, నాన్నగారు, అక్కయ్య, అన్నయ్య అని అందరినీ ఏదో ఒక వరసతో సంబోధిస్తే కస్టమర్లతో మరింత దగ్గరితనం ఏర్పడటమే కాకుండా ఏదీ కుదరలేదు అని కోపంతో వచ్చేవాళ్ళని ‘రండమ్మా, అయ్యో! మంచి ఎండలో పడి వచ్చారే సాయంత్రం రావాల్సింది, ముందుగా నీళ్ళు తాగండి’ అన్న మాటలతో చల్లారిపోతారు.
రెండు రోజుల తర్వాత ప్రభువాళ్ళ అమ్మానాన్నలు వచ్చారు. “జ్యోతిష్యుడికి చూపించాము, తొమ్మిది పొంతనలు ఉన్నాయన్నారు. అమ్మాయివాళ్ళ ఇంట్లో ఏమన్నారు?” అంటూ జాతకం కాగితాన్ని కాండక్ట్ సర్టిఫికెట్‌లాగా గౌరవపూర్వకంగా తీసుకొచ్చి చేతికిస్తున్నప్పుడు జాలేసింది.
“వాళ్ళకి ఆ రోజే పోస్ట్ చేసేశామమ్మా. ఈ రోజు అంది ఉండొచ్చు. బహుశా రేపటికి చూసి చెప్తారేమో!”
“ఒకసారి వాళ్ళతో మేము మాట్లాడొచ్చా?”
“లేదమ్మా… అమ్మాయివాళ్ళ ఇంట్లో అలా వెంటనే మాట్లాడరు. వాళ్ళు జాతకాలు అవి చూసుకుని బాగుంటే తప్పకుండా చెప్తారు.”
ఒక వారం రోజులు అలా ఇలా గడిచిపోతుంది. ఇలాంటివి మామూలే. చివరిగా అమ్మాయివాళ్ళు జాతకం సెట్ అవలేదు అన్నారని చెప్పేస్తాం. ఆ మాటకు ఒప్పుకోలేదు అంటే, అమ్మాయికి అబ్బాయి నచ్చలేదంట అని చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తాం. ఈ అస్త్రంతో చాలావరకు తల్లిదండ్రులు లేదా ఆ అబ్బాయి నొచ్చుకుంటారు. తనను, తమ పిల్లాడ్ని ఒక అమ్మాయి నచ్చలేదంటుందా? ఆమెకు ఎంత పొగరు? వేరే అమ్మాయిని చూసుకుందాం అని పక్కన పెడతారు.
ఇంచుమించుగా ఈ వరుసలో పావుల్ని కదిపి ఆ విషయాన్ని అక్కడికి ముగించాను.
బాగా చదువుకున్న, డబ్బులున్న అబ్బాయిలకు, అమ్మాయిలకు మా బ్యూరో ద్వారా ఎన్నో సంబంధాలు కుదిర్చి పెళ్ళిళ్ళు చేసిపెట్టాం. అలా పెళ్ళి కుదిరినప్పుడు కొంతమంది ఒక చిన్న మొత్తంగా డబ్బు తీసుకొచ్చి కుదిర్చిన ఆ ఉద్యోగికి ఇస్తూ ఉంటారు. నేను ఉద్యోగంలో చేరిన ఈ రెండేళ్ళల్లో నా శాఖలో పదికి పైనే పెళ్ళిళ్ళు జరిగాయి. అందులో నలుగురైదుగురు పార్టీలు వెయ్యి, రెండువేలు అంటూ నాకు డబ్బులు ఇచ్చారు. కేవలం పదో తరగతి చదివిన నాకు కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగంలో పెట్టుకొని జీతం ఇస్తున్న ఈ సంస్థ ఒక గుడిలాగే అనిపిస్తుంది. సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళిపోవచ్చు. జీతం తక్కువైనా ఆడపిల్లలు సాయంత్రం ఆరుకల్లా ఇంటికి వెళ్ళిపోవడానికి వెసులుబాటు ఉన్నందువల్లే చాలామంది వదిలి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉద్యోగం చేస్తున్నారు.
మన ప్రయత్నం వల్ల పెళ్ళి జరుగుతుంది అన్న తృప్తి కలగడం వంటివి చేరిన కొత్తల్లోనే. మెల్లమెల్లగా ‘పెళ్ళిళ్ళు జరిగితే వాళ్ళ స్తోమతకు తగినట్టు డబ్బులు ఇస్తారు’ అన్న ఆశతో ఏదో ఒకలాగా మాట్లాడి, అష్టకష్టాలు పడి సంబంధాలు వెతికిపెట్టి పెళ్ళిళ్ళు కుదిర్చే పనిని అతి శ్రద్ధగా చేస్తూ ఉంటాం. అయితే అమ్మాయిలు కోరుకునే లక్షణాలు లేని అబ్బాయిల దగ్గర ఇలా అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది. మొదట్లో అబద్దాలు చెప్తున్నందుకు, మసిపూసి మారేడుకాయ చేస్తున్నందుకు కొంచెం పశ్చాతాపం, అపరాధ భావన ఉండేవి కానీ అవన్నీ రోజులు గడిచే కొద్దీ మామూలు అయిపోయాయి.
చాలా ఏళ్ళుగా తమ అబ్బాయికి సంబంధాలు వెతుకుతున్న ఒక నడిమి కులపు తల్లితో “అమ్మా, వేరే కులంలో ఒక అమ్మాయి జాతకం ఉంది, చూస్తారా?” అని అడిగినందుకు అగ్గి మీద గుగ్గిలమై కేకలు పెట్టారు.
“అసలు మాది ఎలాంటి వంశం తెలుసా? అసలు ఈ మాట ఎలా అడుగుతావు? ఎవరిని అడుగుతున్నావో తెలిసే అడిగావా? మీ ఓనర్ ఎక్కడున్నాడో ముందు పిలువు…” అని గట్టిగా అరిచి నానా రభస చేశారు.
నేను “సారీ… సారీ” అని పలుమార్లు క్షమాపణ అడిగి కాళ్ళు పట్టుకోవడం ఒకటే తక్కువ అన్నంత దూరం తీసుకెళ్ళారు. ఆ మరుసటి వారం ఆమె సెలెక్ట్ చేసుకున్న ఒక సంబంధాన్ని గురించి చెప్తూ “ఆ అమ్మాయి వద్దనేసిందంటండీ” అని ఆమె ముఖానికేసి చూస్తూ చెప్పాను. ఆ మాటకు గాయపడిన ఆమె ముఖాన్ని చూసి ఒక క్షణికానందం పొందాను.
“ఎందుకట?”
“చదువు లేదంట.”
“అమ్మాయి పదేగా చదివింది?”
“అవును. అయినప్పటికీ వాళ్ళకు మీ అబ్బాయి చదువు చాలదట.”
“అయినా అలా…” అని ఆమె ఏదో చెప్పబోతుంటే ఆమె నోరు మూయించాలన్నంత ఆత్రం కలిగింది నాకు.
“వాళ్ళు చెప్పిన కారణం వేరే ఉంది. మీరు నొచ్చుకుంటారు అని చదువు అని చెప్పాను.”
“మధ్యలో నువ్వు ఎందుకు మార్చి చెప్తున్నావు? వాళ్ళు ఏమన్నారు చెప్పు!”
“అబ్బాయి బాలేడు. పెద్ద పొట్టేసుకుని లావుగా ఉన్నాడు మాకు వద్దు అన్నారు. మన అన్నయ్యను అలా అన్నారే అని నాకే ఇంత బాధ కలిగిందంటే మీకు ఇంకెంత బాధ కలుగుతుందోనని చెప్పలేదు.”
అక్కడితో ఆమె ఇంక నిదానించింది. ఇలాంటి కుల పిచ్చి ఉన్న జనాలకు అబద్ధాలు చెప్పినా తప్పులేదులే అని నా చర్యలను సమర్థించుకుని నన్ను నేను సమాధానపరచుకున్నాను.
ప్రభు వాళ్ళ అమ్మానాన్నలకు తొలి రోజు అబద్ధాలు చెప్పినప్పటికీ వెంటవెంటనే కొన్ని సంబంధాలు వెతకడం మొదలుపెట్టాను. కొందరు డబ్బు, ఆస్తులను చూసి చదువుదేముంది అనుకుంటారు. నెలకు రెండు లక్షలు అన్నది మా ఊరికి సంబంధించినంత వరకు చాలా మంచి సంపాదనే. సరిపోతుంది అనిపించిన అమ్మాయిల తల్లిదండ్రులతో అబ్బాయి గురించిన వివరాలు, వాళ్ళ గొప్పతనాలు అంటూ చెప్పి నా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాను. అమ్మాయి తల్లిదండ్రులు దేనికి దారిలోకి వస్తారు, దేన్ని చూసి కరుగుతారు అని ఈ రెండేళ్ళలో బాగా ఔపోసన పట్టేశాను. అయితే తల్లిదండ్రులను ఒప్పించినంత సులువు కాదు అమ్మాయిలను ఒప్పించడం. దానికి వాళ్ళ అమ్మలకు తలంటు పోసి, కాళ్ళు కడిగినంత పని చేయాలి. అలా చేసినప్పటికీ విజయం సాధిస్తామన్న నమ్మకం లేదు. అలా ఒక మధ్యాహ్నం వేళ ఒక అమ్మాయి తరఫు వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ ఉండగా ప్రభు లోపలికి వచ్చాడు. చేతిలో ఆ ఆయుర్వేద డాక్టర్ ఫోటో కాపీ ఉంది. నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి.
“ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోవాళ్ళు ఎందుకు వద్దని చెప్పినట్టు చెప్పారు?”
ఏ కారణం చెప్పానా అని ఆలోచిస్తున్నా. అబద్ధం చెప్పడంలో ఉన్న పెద్ద ఇబ్బంది ఇది! “…వాళ్ళ జ్యోతిష్యుడు జాతకాలు కలవలేదు అని చెప్పారట. మీరు కూర్చోండి. మీకోసమే వేరే అమ్మాయిల తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉన్నాను.”
అతను పట్టు వదలకుండా “ఈ అమ్మాయి పేరేంటి?”
కవిత అని రాసి ఇచ్చానా, సవిత అని రాసిచ్చానా? ఆలోచించడానికి అవకాశం లేదు.
“వందలాది అమ్మాయిలు ప్రొఫైళ్ళు ఉంటాయి సార్, అందరి పేర్లు గుర్తుండవు. రిజిస్ట్రేషన్ నెంబర్ చూసి చెప్పాలి” అని నసిగాను. ఇంకా కోపంగానే ఉన్న అతని ముఖం నన్ను కలవరపెట్టింది. నా ఒళ్ళు వణకసాగింది.
“నేను చెప్తాను. ఈ అమ్మాయి పేరు మధుమిత. ఈమె ఒక డాక్టర్.”
ఏదో ఒకటి చేసి పరిస్థితిని సర్దేయాలి. “అయ్యో, ఫోటో మారిపోయినట్టుంది సార్… మీకు ఇచ్చిన బయోడేటా కరెక్ట్‌గానే ఉంటుంది. రెండు నిమిషాలు ఉండండి చెక్ చేస్తాను.”
“అప్పనంగా డబ్బులు తీసుకుని ఎందుకండీ ఇలా అబద్ధాలు చెబుతున్నారు? వాళ్ళను కనుక్కున్నాను. వాళ్ళు కూడా మీ దగ్గర పోయిన ఏడాది రిజిస్టర్ చేశారట. ఇప్పుడు పెళ్ళి కూడా అయిపోయింది. ఇంకా మీరు ఈ ఫోటోని చూపించి మీ దగ్గరికి వచ్చేవాళ్ళను మోసం చేస్తున్నారు! కేస్ పెడితే ఏమవుతుందో తెలుసా?”
“ఉండండి… నేను చెక్ చేస్తాను” అని కంగారుపడిపోతూ అన్నాను. ఊరికే ఫైళ్ళను అటు ఇటు వెతుకుతున్నట్టు నటిస్తున్నాను. ఆయన కేస్ అన్న ఆ మాట నాలో దడ పుట్టించేసింది.
“నువ్వు కూడా ఒక అమ్మాయివేగా! ఇలా ఒక అమ్మాయి ఫోటోని అబద్ధాలు చెప్పి అమ్ముకోవడం తప్పు అనిపించడం లేదా? ఇలాంటి పనులు చేసి డబ్బు సంపాదించాలా?”
“…”
“ఇలాంటి ఉద్యోగం చెయ్యడంకంటే ‘అలాంటి’ పనులు చేసుకుని బతకొచ్చు.”
ఆ మాటలు నాకు అర్థం అయ్యేలోపే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
“అన్నా… ప్లీజ్” కన్నీళ్ళు నా చెంపల మీద కారిపోతున్నాయి.
“అన్నా గిన్నా అన్నావంటే చెంపలు వాయించేస్తాను. మీ ఓనర్ ఎక్కడ? పిలువు…”
“అన్నా, ప్లీజ్ అన్నా. గట్టిగా అరవకండి. ఇది నా తప్పే. ఆ సమయంలో మీ అమ్మగారికి ఈ ఫోటో నచ్చింది అనగానే ఏవో వివరాలు రాసి ఇచ్చేశాను.”
పక్కన గదుల్లో వేరే కులాలకు చెందిన కస్టమర్లు ఉంటారు. ఇతను ఇక్కడ గట్టిగా అరిచి గోల చేస్తే, దగాకోరు బ్యూరో అని ముద్ర పడిపోతే, సంస్థకు చెడ్డపేరు రావడంతో పాటు నా ఉద్యోగం పోతుంది, నన్ను జైల్లో పెడతారేమో అని నా మనసు రకరకాలుగా ఆలోచించింది. భయంతో నిలువెల్లా వణికిపోయాను. ఇతనికి ఏదో ఒకటి చేసి సర్దిచెప్పి పంపించాలి.
“ప్లీజ్ అన్నా… నేను మీకోసమే అమ్మాయిని వెతుకుతున్నాను. తప్పకుండా చూసి పెడతాను.”
“ఛీ!” అని ఆ ఫోటోని టేబుల్ మీద విసిరి పడేసి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా నేను ఏడుస్తూనే ఉన్నాను. నా తోటి అమ్మాయిలు వచ్చి నన్ను ఓదార్చారు. ‘అలాంటి పనులు చేసి బతకొచ్చు’ అన్న ఆ మాటలు మాత్రం ఎవరితోనూ చెప్పలేదు. అయితే ఆ మాటలు నాకు పదేపదే గుచ్చుకుంటూ ఉన్నాయి. అప్పటికప్పుడు ఒక వైరాగ్యం వచ్చింది. వీడికి ఎలాగైనా నేనే పెళ్ళి సంబంధం వెతికి పెట్టాలి, అప్పుడు అతని ముఖానికేసి గర్వంగా చూసి ‘చూశావా మాట నిలబెట్టుకున్నాను’ అనాలి అనుకున్నాను.
ఆ మరుసటి వారం వచ్చాడు. నాకు చెమటలు పట్టేశాయి. అతన్ని చూడడానికే భయమేసింది.
“ఇకనుండి ప్రతి వారం వస్తాను. అమ్మాయిల ఒరిజినల్ డీటెయిల్స్ నాకు ఇవ్వు. పెద్దోళ్ళని మోసం చేసినట్టు కాదు.”
కోపం తగ్గినట్టుంది. అతని కోసం మాట్లాడిన ఇద్దరు అమ్మాయిల వివరాలను తీసి ఇచ్చాను. “అంతా ఓకే అంటున్నారు. చదువు విషయం మాత్రమే కొంచెం ఆలోచిస్తున్నారు” అని అన్నాను.
అతను ఉండగానే ఒక అమ్మాయి తరఫువాళ్ళతో మాట్లాడాను. “…మంచి ఫ్యామిలీ మా… అబ్బాయి చాలా మంచోడు. మీరు నేరుగా పిలిపించుకుని చూడండి. మీ అమ్మాయికి నచ్చుతాడు…”
“…”
“మీ నెంబర్ అబ్బాయి వాళ్ళకు ఇవ్వమంటారా?”
“…”
“థేంక్స్ మా. థేంక్స్”
అమ్మాయివాళ్ళ అమ్మ ఫోన్ నెంబర్ ప్రభుకు ఇచ్చాను.
“నీ వయసెంత?”
“ఇరవైరెండు.”
“నాకు ఇరవైతొమ్మిదేళ్ళు. నీ పాటికి నువ్వు నన్ను ఒళ్ళో వేసుకుని సాకినదానిలా మాటి మాటికీ అబ్బాయి అబ్బాయి అంటున్నావు?”
“…అదేంటంటే ఇక్కడ అమ్మాయి, అబ్బాయి అని చెప్పి అలవాటయిపోయింది” అని నీళ్ళు నమిలాను. ఇతను ప్రతిదానికీ ఏదో ఒక రభస చేసేవాడిలా ఉన్నాడు. ఇలాంటోన్ని ఒళ్ళో వేసుకుని సాకాలి మరి!
“సరే, ఈ అమ్మాయివాళ్ళతో మాట్లాడి చెప్తాను. ఇంకేవైనా సంబంధాలు వచ్చినా మాట్లాడి పెట్టు. కొంచం చూడటానికి లక్షణంగా ఉండే అమ్మాయిని చూడు.”
“ఊఁ… సరే, సార్.”
“ఏంటి, అన్న, అబ్బాయి అయిపోయి ఇప్పుడు సార్ దగ్గరకొచ్చావు?”
“లేదు సార్… ఇకనుండి ఇలాగే పిలుస్తాను. ఇదే బాగుంది.”
ప్రతి మంగళవారం ఇక్కడికి రావడం అలవాటు చేసుకున్నాడు. వచ్చీ రాగానే అధికారం చలాయిస్తూ గద్దించినట్టు ఉంటాయి అతని మాటా, ప్రవర్తనలు.
“ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోవాళ్ళతో మాట్లాడాము. అమ్మాయి వాళ్ళమ్మ, నేనేదో ఆమెనే పెళ్ళి చేసుకోమని అడిగినట్టు అంత హెచ్చులు పోతోంది! చదువు తక్కువ అంట… అసలు బతకాలా వద్దా?”
‘నువ్వు ఇక్కడ చేస్తున్న అట్టహాసాలకు నీకు అమ్మాయే దొరకదురా’ అని మనసులో అనుకుంటూ “అలా కాదు సార్, వాళ్ళ అమ్మాయి చదువుకుంది కాబట్టి వాళ్ళకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదా?” అన్నాను.
“సరేలే, నువ్వేం చదువుకున్నావు?”
“పదో తరగతి.”
“నీకు ఎంత జీతం ఇస్తారు ఇక్కడ?”
“తక్కువే, సార్.”
“ఎంత అని చెప్తే నేనేమైనా వాటా అడుగుతానా? చెప్పు పరవాలేదు. వేరే ఏదైనా మంచి ఉద్యోగం ఉంటే చెప్తాను. ఈ పెళ్ళిళ్ళ పేరమ్మ ఉద్యోగం ఎంతకాలం చేస్తావు?”
“పదివేలు. కొంతమంది కస్టమర్లు కోపంగా అరిచేప్పుడు వాళ్ళను తట్టుకోవడం కష్టమైన పని అనిపించినా మనవల్ల నలుగురికి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అన్న సంతృప్తి ఉంటుంది. అది చాలు సార్.” ‘కోపంగా అరిచేప్పుడు’ అన్నదాన్ని కావాలనే నొక్కి పలికాను. అతనికి అర్థం అయిందో లేదో తెలియదు.
“నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం కూడా ఒక ఉద్యోగమా?”
“సార్, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారమే కదా చేస్తున్నారు?”
నా ప్రశ్నలోని అంతరార్థం కనుక్కొని ఒక క్షణం ఆలోచించి “నువ్వు కూడా బ్రోకర్‌గాడివేగా అంటున్నావా?” అన్నాడు.
అవున్రా, ఇప్పటికైనా వెలిగింది! “అయ్యో సార్! అలా అనలేదు!”
“ఏమో అనుకున్నా… బతక నేర్చినదానివే!”
రాను రాను ఇలా చమత్కారం మా మాటల్లో పెరిగింది. సరదాగా నేననేది అతనికి నచ్చుతున్నట్టుంది. అతను తిడుతున్నట్టు మాట్లాడితే నాకూ నచ్చుతోందా? ఈ మధ్యకాలంలో అతను ఏ అమ్మాయి తరఫువారి నెంబర్లూ అడగటం లేదు. ‘ఏదీ నచ్చలేదు. నచ్చినవి వాళ్ళకు నచ్చవని తెలుసు. వచ్చే వారం చూద్దాం’ అని వెళ్ళిపోతున్నాడు.
పోయినవారం మంగళవారం రాకుండా శుక్రవారం మధ్యాహ్నం వచ్చాడు. “ఏంటి ఈ రోజు తల స్నానం చేసి అందంగా ఉన్నట్టున్నావ్!” అన్నాడు ఫైల్ తిరగేస్తూ. నేను సమాధానం చెప్పలేదు. చిన్నగా నవ్వి ఊరుకున్నాను. ఇదిగో ఇవాళ కూడా వచ్చాడు.
“ఏంటి సార్, ఏదైనా ప్రొఫైల్ నచ్చిందా?” అని అడిగాను, ‘నువ్వు నచ్చావు’ అని చెప్తాడేమోనని ఊహించుకుంటూ.
ప్రశ్నవేసి ఏవో ఆలోచనల్లో ఉండగానే, మండిపోతున్న మధ్యాహ్నపు ఎండలో “దీదీ, దీదీ” అంటూ గొంతు వినిపించింది. కొన్ని గదుల్లో నుండి అమ్మాయిలం బయటకు తొంగిచూశాం. చెమటలు కక్కుకుంటూ భుజాన పెద్ద మూటతో ఒక ఉత్తరాది అబ్బాయి నిల్చుని ఉన్నాడు.
“ఆప్ కో చుడీదార్ మెటీరియల్ చాహియే?”
“వద్దు, వద్దు, వెళ్ళు…” సీనియర్ అక్క తరుముతోంది. ఒక అమ్మాయి గుసగుసగా నిట్టూరుస్తూ, “సార్ భోజనానికి ఇంటికి వెళ్ళారు కదా? వచ్చేలోపు చూద్దాం” అంది. మధ్యాహ్నం పూట కాబట్టి కస్టమర్లు లేరు. అందరూ ఏకాభిప్రాయంతో ఆ హిందీ యువకుడి మూట విప్పించారు.
తలో ఒక డ్రెస్ మెటీరియల్ చేతికి తీసుకుని భుజాన పెట్టుకుని చూస్తుండగానే నేను ఒక నల్ల చుడీదార్ తీసుకుని చూసి నిట్టూర్చి కింద పెట్టేసి నా గదికి వచ్చేశాను. నేను డ్రెస్ తీసుకుని భుజాన పెట్టి చూసుకోవడాన్ని చూసినట్టు ఉన్నాడు –
“ఏం కొనుక్కోలేదా?”
“లేదు, ఏదీ నచ్చలేదు.”
“ఆశగా తీసుకుని చూసుకున్నట్టున్నావు?”
“హ్మ్… నెలాఖరు. డబ్బుల్లేవు. చెప్పాలంటే ఇక్కడ ఎవరిదగ్గరా డబ్బులు లేవని నాకు తెలుసు. కొనుక్కున్నా కొనుక్కోకున్నా అమ్మాయిలకు కొత్త బట్టలను చూడటం ఒక సరదా!”
“మగవాళ్ళు కూడా అమ్మాయిల్ని చూసేది అలానే.”
“సార్…” మనసులోపల అది ‘ఒరేయ్’ అని వినిపించింది.
“అయితే ఆ మనిషి పాపం. ఎవరైనా కొనుక్కుంటారు అని ఆశతోనే కదా ఇన్ని బట్టలను విప్పదీసి పరుస్తాడు. టైమ్ వేస్ట్. మళ్ళీ అన్నిట్నీ సర్దుకుని మూటగట్టుకోవాలి పాపం.”
“అంత జాలి పడుతున్నావు మరి, నువ్వు కావాలంటే నీకు నచ్చింది తీసుకుంటావా? నేను డబ్బులిస్తాను.”
“వద్దు వద్దు. నేను కావాలని మిమ్మల్ని అడిగానా?”
“అరే, ఇందులో ఏముంది? అంతగా అయితే ఇప్పుడు తీసుకుని జీతం రాగానే తిరిగి ఇచ్చేయ్.”
“ఏం వద్దు, వచ్చేదే అంతంత జీతం. అందులో ఐదు వందలు, వేయి తగ్గితే కష్టం సార్.”
“అరే, చిన్నపిల్లవి! నచ్చినవి ఈ వయసులో వేసుకోకుంటే ఎప్పుడు వేసుకుంటావు!”
“లేదు సార్. వద్దు” నేను గొంతుపెంచి కచ్చితంగా చెప్పాను. ఆపైన అతను అడగలేదు.
ముప్పావు గంట తర్వాత అందరూ ‘ఇది బాగుంది’, ‘అది బ్రహ్మాండం’ అని ఉత్సాహంగా చెప్పుకుంటూ ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళి విప్పి చూసి తిరిగి తెచ్చి ఇచ్చేశారు. వీళ్ళెవరూ కొనే బేరాలు కాదు. అందరూ వేడుకచూసే మూకే అని గ్రహించిన హిందీ అబ్బాయి మళ్ళీ మూట కట్టడం మొదలుపెట్టాడు. ఉన్నట్టుంది గాబరా పడిపోతూ “ఏక్ ఐటెమ్ చూట్ గయా” అన్నాడు.
ముందుగా అర్థం కాలేదు మాకు. కాసేపటికి అర్థం అయింది. ఒక డ్రెస్ మెటీరియల్ తగ్గింది అని!
“ఎందుకైనా మంచిది అన్ని గదుల్లోనూ ఒక సారి చెక్ చేసుకుని చూడండి” అని అన్నాను.
ఆ హిందీ అబ్బాయి ముఖం వాడిపోయి ఉంది. “అన్నా భోంచేశారా?” అన్నాను.
అర్థంకాకుండా బిక్కమొహం పెట్టాడు. తిన్నారా అన్నట్టు సైగ చేసి చూపించాను.
“నహి” అని మళ్ళీ “ఏక్ ఐటెమ్ చూట్ గయా” అన్నాడు.
అందరం వెతికాము – దొరకలేదు. ముందుగా వద్దు వెళ్ళు అన్న ఆ సీనియర్ అక్క “ఒకవేళ నువ్వు తెచ్చింది ఇన్నేనేమో” అని అంది. సైగలతో ఆమె చెప్పగా అర్థం చేసుకుని “నహీ నహీ” అని దృఢంగా చెప్పాడు.
ఈలోపు ఓనర్ పెద్దాయన వచ్చేశాడు. “ఏం చేస్తున్నారమ్మా, పనులు చెయ్యకుండా?” అని అడిగి ఆ హిందీ అబ్బాయిని తరిమేశాడు. ఆ మూట ఇరవై కేజీలకు పైనే ఉంటుంది. తన బాధ ఏంటో చెప్పాలని ప్రయత్నించి భాష రాక ఓడిపోయి మూటను మళ్ళీ భుజాలకెక్కించుకుని ఎండలో బయలుదేరాడు.
వెళ్తున్నవాడికి ‘నీళ్ళయినా తాగి వెళ్ళండి’ అని నీళ్ళ గ్లాసు చాచాను. వద్దు అని చేయి చూపించి “మేరా నెంబర్ దేతా హూఁ! అగర్ మేరా ఐటమ్ మిలాతో ఫోన్ కర్దో దీదీ!” అంటూ ఏదో రాస్తున్నట్టు సైగ చేశాడు. పెన్ను అడుగుతున్నాడా? అతను ఫోన్లో మాట్లాడేవాడిలా సైగ చేయగానే అర్థం అయింది.
“చెప్పండి” అని అతని సెల్‌ఫోన్ నెంబర్ నోట్ చేసుకున్నాను.
ఫైలు తిరగేస్తున్న ప్రభు “ఈ వారం కూడా ఏ ప్రొఫైలూ అనుకూలంగా లేదు” అని అన్నాడు.
నా మనసులో ఆ డ్రెస్ మెటీరియల్ ఎక్కడ మాయమయిందా అన్న ఆలోచన మెదలసాగింది.
“ఏం? డ్రెస్ కొనుక్కోలేకపోయానని ఫీల్ అవుతున్నావా?”
“ఛా… అదేం లేదు. అతను తెచ్చినవాటిలో ఒక మెటీరియల్ మిస్ అయిందట. పాపం! ఎంత కష్టపడి రోడ్లు పట్టుకుని ఎండలో వస్తారో… పాపం!”
“సరే, దానికేం చేస్తాం? ఇక్కడే ఎవరో తీసుకుని ఉంటారు.”
“అందర్నీ అడిగాం! ఎవరూ తీసుకోలేదన్నారు.”
“మీ ఆఫీసులో అబద్ధాలు చెప్పడం కొత్తగా నేర్పించాలా!” అదోలా నవ్వాడు.
“సార్, ప్లీజ్! నేను అబద్ధం చెప్పాను. అయితే, మరో దారి లేదు. ఇక్కడికి వచ్చే కష్టమర్లు రిజిస్టర్ చేయకుండా వెళ్తే ఓనర్ తిడతాడు. మీలాంటి వాళ్ళు సవాలక్ష ఆంక్షలతో వస్తారు. మీ కులం వాళ్ళే కావాలంటారు. ఒక్కో కులంలోనూ కొన్నే ప్రొఫైల్స్ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ వచ్చిన కొన్నిట్లోనే వెతికిపెట్టాలి. అలా మిమ్మల్ని ఆకట్టుకోడానికి ఏవో అబద్ధాలు చెప్తాము. కొన్నిసార్లు వీళ్ళందరూ లవ్ చేసి చావచ్చుకదా? ఇలా సంబంధాలకోసం మా ప్రాణాలు తీయకుంటే అని కూడా మనసులో తిట్టుకుంటాను… పాపం ఆ హిందీ అన్న గురించి తలచుకుంటే బాధగా ఉంది.”
“నన్ను అడగలేదు మీకు ఏ కులమైనా పరవాలేదా అని!”
“అయితే మీకు ఓకేనా?”
“నాకు ఓకే. మా అమ్మకు నేను చెప్పుకుంటాను.”
“అయితే అన్ని కులాల్లోనూ క్యాస్ట్ నోబార్ అమ్మాయిల ఫైళ్ళు తీసుకొస్తాను. చూస్తారా?”
“చూస్తాను. నా ప్రొఫైల్‌కు సరిపోయే అమ్మాయిల వివరాలే చూపించు.”
“ఓ… తప్పకుండా” అతను అలా అనడం నాకు సంతోషం అనిపించిందా, నిరాశ కలిగిందా అర్థం కాలేదు.
“అది మీరు చూసి నిర్ణయం చేసుకోవాలి సార్. మీరు ముందుగా ఫైల్ చూడండి. నచ్చితే మాట్లాడదాం.”
“ఊఁ… సరే.”
అతనికి నా మీద ఆసక్తి లేదు. అంతా నా ఊహేనన్న భావన నిరాశ కలిగించింది కానీ అతను సర్వకులసమ్మతం అని తెలియగానే అతని మీద కొంత గౌరవం పెరిగింది. వెంటనే కులాంతర వివాహం సమ్మతమున్న వధువుల ఫైళ్ళు తీసుకురాడానికి గబగబా అడుగులేశాను. ఆ క్షణం నాకే ఆశ్చర్యంగా అనిపించింది. అతను ఇతర కులాల అమ్మాయిల ప్రొఫైల్స్ చూడటానికి ఆసక్తి చూపించడం నాకు నిజానికి ఆశాభంగమే కలిగించింది. అయినప్పటికీ వృత్తి రీత్యా నా ఆదాయం నేను చూసుకోడానికి సిద్ధపడుతున్నానే అనిపించింది. ఆడవాళ్ళు పరిస్థితులకు తగ్గట్టు తమను తాము మార్చుకోవడంలో చాలా సమర్థులు. బలమైనది బట్టకడుతుంది అనడానికి గొప్ప ఉదాహణ అడది.
ఒక్కో శాఖలోనూ వెళ్ళి క్యాస్ట్ నోబార్ ఫైళ్ళు తీసుకున్నాను. చివరిగా వెళ్ళిన గదిలో అక్క లేదు. పక్కగదిలో ఉన్న అమ్మాయి “రెస్ట్ రూమ్” అని అంది.
“సరే, అమ్మాయిల ఫైల్ తీసుకుంటున్నాను. ఆ అక్క రాగానే చెప్పేయ్.”
గబగబా ఫైలు లాగగానే ఒక డ్రెస్ మెటీరియల్ దబ్‌మని పడింది. ఆశ్చర్యానికి కూడా సమయం ఇవ్వకుండా నేను ఫైళ్ళలోపల ఆ డ్రెస్ మెటీరియల్‌ను దాచాను. గబగబా నా గదిలోకి వచ్చి ఫైళ్ళు అతని చేతికిచ్చి ఆ డ్రెస్ తీసి పక్కన పెట్టాను. హిందీ అబ్బాయికి ఫోన్ చేశాను.
ఆ హిందీ అబ్బాయి ఫోన్ తియ్యగానే “మీ చుడీదార్ దొరికింది. వచ్చి తీసుకోండి” అన్నాను.
నేను చెప్పేది అర్థం కాక, ఎవరు మాట్లాడుతున్నది తెలియక “క్యాఁ క్యాఁ” అన్నాడు. ప్రభుని అడిగాను “సార్, మీకు హిందీ వచ్చా?” అని. పెదాలు విరిచాడు. ఫోన్ కట్ చేసి ఏం చెయ్యాలి అని క్షణం ఆలోచించాను. వెంటనే ఒక ఆలోచన వచ్చింది! ప్రభును అడిగాను.
“ఆ హిందీ అన్న బస్ స్టాండ్ వైపే వెళ్ళుంటాడు. దీన్ని అతనికి ఇచ్చి వస్తారా?”
“అతన్ని నేను ఎక్కడ వెతకను?”
“ఇదిగోండి, అతని ఫోన్ నెంబర్. బండి ఉంది కదా? వెంటనే వెళ్ళారంటే పక్క వీధిలోనే ఉంటాడు. ప్లీజ్ సార్!”
ఏదో ఆలోచిస్తున్నవాడిలా నాకేసి చూశాడు. “దీనికి ఎందుకు ఇంత హైరానా పడుతున్నావు? వ్యాపారమన్నాక ఇలాంటివి ఎన్నో ఉంటాయి!”
“మిమ్ముల్ని క్లాస్ తీసుకోమని అడగలేదు. సాయం అడుగుతున్నాను అంతే. ఈ ఫోటోలో అమ్మాయిలు ఎక్కడికీ ఎగిరిపోరు. వచ్చి చూసుకోవచ్చు. ఈ చుడీదార్ ఇచ్చిరండి ప్లీజ్…”
అతను చూస్తున ఫైలు మూతపెట్టి మారు మాట్లాడకుండా చుడీదార్ తీసుకునివెళ్ళి పావుగంటలో తిరిగి వచ్చాడు.
“అది వాడికిచ్చేశాను. షుక్రియా అన్నాడు. అది నీకే.”
“థేంక్స్, సార్!”
“ఆ అమ్మాయిల ఫైళ్ళు తిరిగి ఇచ్చేసేయ్. ఇక అవసరం లేదు.”
“ఎందుకు, సార్?”
“అవును, ఇందాక నీకు నచ్చింది ఈ నల్లటి చుడీదారే కదా?”
హిందీవాడి మూటలో ఉన్న నాలుగైదు నల్ల చుడీదార్ల నుండి సరిగ్గా నేను ఎన్నుకున్న పసుపుపచ్చ చున్నీ ఉన్న నల్ల చుడీదార్‌ను టేబుల్ మీద పెట్టాడు.
నేను వద్దనలేదు. “అవును! ఇదే!” అన్నాను అదేదో హక్కయినట్టు, అతన్నే చూస్తూ!
(మూలం: పొరుత్తం, మార్చ్ 16, 2024, వాసగసాలై, వెబ్ పత్రిక.)
సౌమ్యా రాఘవన్ కోయంబత్తూరుకు చెందిన యువ రచయిత. ఈమె సామాజిక మాధ్యమాలలో విరివిగా రాస్తుంటారు. 2016లో అమ్మ అన్న కవితా సంపుటం తీసుకొచ్చారు. 2023లో కళిట్ఱడి అన్న కథల సంపుటం వెలవడింది. ఉదిరిగళ్ పత్రిక నిర్వహించిన ప్రపంచ స్థాయి కథల పోటీలో ఈమె రాసిన మూళి అన్న కథ మూడో బహుమతి పొందింది. ఆనంద వికడన్, వికడన్.కామ్, తమిళ్ మిన్నిదళ్ వంటి పత్రికల్లో ఈమె కధలు, తవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఇప్పటివరకు 25 కథలు, రెండు చిన్న నవలలూ రాశారు.