మంచి రచయితలు, మంచి పాఠకులు

[వ్లాదిమిర్ నబొకోవ్ ఇరవై ఏళ్ళకు పైగా అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌గా సాహిత్యం పైన ఉపన్యాసాలు ఇచ్చారు. ఆ ఉపన్యాసాల కోసం నబొకోవ్ తయారు చేసుకున్న, ఆయన చేతిరాతలో ఉన్న, నోట్సులని సంకలనం చేసి ఆయన మరణానంతరం సంపాదకులు ‘లెక్చర్స్ ఆన్ లిటరేచర్’ అన్న పేరుతో పుస్తకంగా ప్రచురించారు. ఆ పుస్తకంలో ఉన్న ‘గుడ్ రీడర్స్ అండ్ గుడ్ రైటర్స్’ అనే ఈ వ్యాసం పరిచయ ఉపన్యాసం కోసం ఆయన రాసుకున్న నోట్సు నుండి పుట్టింది.]


వివిధ రచయితల గురించిన ఈ చర్చలకు ‘మంచి పాఠకుడిగా ఎలా ఉండాలి?’ లేదా ‘రచయిత పట్ల దయ’ లాంటి ఉపశీర్షికేదైనా సరిపోవచ్చు, ఎందుకంటే యూరప్ సాహిత్యంలోని అనేక అత్యుత్తమ రచనలని ప్రియమారా, వివరంగా, విపులంగా చర్చించడమే ఇక్కడ నా ఉద్దేశం. ఓ వందేళ్ళ క్రితం గుస్తావ్ ఫ్లోబే తన ప్రియురాలికి రాసిన లేఖలో అన్న మాటలివి: ఏ అరడజను పుస్తకాల పైనో పూర్తిగా పట్టు సాధించినవాడు ఎంత గొప్ప పండితుడో!

సాహిత్య పఠనంలో పాఠకుడు వివరాలని గమనించి, ముద్దాడాలి. ఆ తీపి సూక్ష్మాలన్నింటినీ ప్రేమగా జుర్రుకున్న తరువాత పుస్తక తాత్పర్యాన్ని, సారాంశాన్ని గురించి చప్పని మాటలు చెప్పడంలో తప్పేమీ లేదు. కానీ ముందే పుస్తక తాత్పర్యం ఇదీ అని ఫలానా భావనతో పఠనానికి పూనుకుంటే మొదటికే మోసం వస్తుంది. పుస్తకం అర్థమవ్వడం మొదలుకాక ముందే పుస్తకానికి దూరంగా ప్రయాణం ప్రారంభించినట్టు అవుతుంది. ఉదాహరణకి, మేడమ్ బోవరీ నవల బూర్జువా వర్గంపై నిరసనని తెలిపే రచన అన్న భావనతో దాన్ని చదవడం మొదలుపెడితే, అంతకన్నా అనాసక్తమైన పని, రచయితకి అన్యాయం చేసే పనీ ఉండదు. కళాత్మక కృతి ఏదైనా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం దాని లక్ష్యం అని మనం మరిచిపోకూడదు. కాబట్టి మనమెరిగిన ప్రపంచాలతో ఈ కొత్త ప్రపంచానికి ఏ సంబంధమూ లేనట్టుగా దాన్ని వీలైనంత దగ్గరగా అధ్యయనం చెయ్యడం మన మొట్టమొదటి కర్తవ్యం. అది చేశాక మాత్రమే దానికి ఇతర ప్రపంచాలతోనూ, ఇతర శాస్త్రాలతోనూ ఉన్న సంబంధం ఏమిటని శోధించుకోవాలి.

మరొక ప్రశ్న: నవలల నుండి స్థలకాలాల గురించిన సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకోవచ్చా? చారిత్రక నవలల విభాగంలో బుక్ క్లబ్ వాళ్ళు పేర్చిన, పుష్కలంగా అమ్ముడుబోయే, పుష్టిగా ఉన్న నవలలని చదివి చరిత్ర తెలుసుకోవాలి అనుకునేంత అమాయకులు కూడా ఉంటారా? అవి సరే, మరి అత్యుత్తమ రచనల సంగతేంటి? ఓ చర్చి పాదిరి ఇంటి లోగిలి తప్ప మరేమీ ఎరుగని జేన్ ఆస్టెన్ వర్ణించిన భూస్వాములు, బారోనెట్లు, చూడదగ్గ విశాలభూములు గల ఇంగ్లండ్‌ని మనం నమ్మొచ్చా? లండన్‌లో జరిగే కాల్పనిక అద్భుతం బ్లీక్ హౌజ్ నవలని లండన్ మీద అధ్యయనం అనొచ్చా? ససేమిరా అనలేం. ఇదే ఈ చర్చల్లోని తక్కిన నవలలకు కూడా వర్తిస్తుంది. నిజానికి గొప్ప నవలలన్నీ గొప్ప అభూతకల్పనలు – ఈ చర్చల్లోని నవలలు అత్యున్నతమైన అభూతకల్పనలు.

స్థలకాలాలు, ఋతువుల రంగులు, మాంస-మస్తిష్క చలనాలు… ఇవన్నీ రచయితలలో మేధావులకు చలామణిలో ఉన్న సార్వజనిక వాస్తవాల గ్రంథాలయం నుండి అరువుగా తెచ్చుకునే విషయాలు కాదు (మనం ఊహించగలిగినంత వరకు. ఈ ఊహ నిజమేనని నా నమ్మకం). ప్రపంచంలోని ఒక్కో విషయం వాళ్ళకి ఒక్కో కొత్త ఆశ్చర్యం. గొప్ప కళాకారులందరూ వాటన్నింటినీ తమతమ విలక్షణ పద్ధతిలో వ్యక్తపరచడాన్ని నేర్చుకున్నవారే. ఇక అల్పమైన రచయితలకు మిగిలింది సాధారణ, సాంప్రదాయిక భావాలను అలంకరించి రాయటం. వాళ్ళకు పునఃసృష్టితో పనిలేదు. సాహిత్యం లోని యథాస్థితి నుండి, సాంప్రదాయిక నమూనాల నుండి వీలైనంత పిండి రాస్తారు. ఈ నిర్ణీత పరిధుల్లో వాళ్ళు చేసే కూర్పులు తాత్కాలిక వినోదాన్ని ఇస్తాయి, ఎందుకంటే వాటిల్లో అల్పమైన పాఠకులు అందమైన మారువేషంలో ఉన్న తమ సొంత ఆలోచనలని చూసుకుంటారు.

కానీ గ్రహాలని గిర్రున తిప్పేవాడు, మనిషిని నిద్రిస్తున్నట్టు చిత్రించి వాడి పక్క ఎముకలను గెలికేవాడు… ఇలాంటి అసలైన రచయితకు ప్రపంచం నుండి పుచ్చుకోగల విలువలేమీ ఉండవు. విలువలని తానే సృష్టిస్తాడు. అసలు వాస్తవిక ప్రపంచాన్ని కాల్పనిక గర్భితమైనదిగా చూపే కళను సూచించని రచనాకళ వ్యర్థం. ప్రపంచంలోని పదార్థము వాస్తవమే (మనమెరిగిన ‘వాస్తవం’ మేరకు) కావొచ్చు గాని స్వీకృత సంపూర్ణం కాదు: అదొక గందరగోళం. ఈ గందరగోళంలో ప్రపంచపు పదార్థం చలించి, చెదిరిపోయి, మళ్ళీ దగ్గరకు చేరుకునేలా రచయిత దాన్ని తడతాడు. ఈ పునస్సంయోగం కేవలం కంటికి కనబడే పైపైన భాగాలదే కాదు, ప్రపంచంలోని అణువణువుదీ. ఈ ప్రక్రియకో అర్థాన్నిచ్చి, అన్ని సహజ వస్తువులకు పేరుపెట్టే మొట్టమొదటి వ్యక్తి రచయిత. అక్కడున్న ఆ పండ్లు తినదగినవి. పరిగెడుతూ వెళ్ళిన ఆ మచ్చలున్న జీవిని మచ్చిక చేసుకోవచ్చు. ఆ చెట్ల మధ్యన వెళ్తున్న నదికి ఓపల్ లేక్ అని పేరు పెట్టొచ్చు, లేదా ఇంకొంచెం సృజనాత్మకంగా డిష్‌వాటర్ లేక్ అని పెట్టొచ్చు. ఆ పొగమంచో పర్వతం, దాన్ని అధిరోహించాలి… దారిలేని వాలుని ఎక్కి శిఖరాన్ని చేరుకున్నాక, హోరుగాలి వీస్తున్న ఆ గట్టు మీద రచయిత ఎవరిని కలుసుకుంటాడు అనుకుంటున్నారు? ఆయాసపడుతున్న సంతుష్ట పాఠకుణ్ణి. అది శాశ్వతంగా నిలిచిపోయే పుస్తకమైతే, అక్కడ వాళ్ళిద్దరికీ మధ్య శాశ్వత బంధం ఏర్పడుతుంది.

ఒక పొడుగాటి ఉపన్యాస పర్యటనలో జాగింగ్ చేస్తూ వెళుతుండగా, ఒక మారుమూల ప్రొవిన్సియల్ కాలేజీకి నేను వెళ్ళినప్పుడు, అక్కడి విద్యార్థులకి ఒక సాయంత్రం పూట ఒక క్విజ్ పెట్టాను. పాఠకుడికి ఉండే పది లక్షణాలను ఇచ్చి వాటిలో ఏ నాలుగు కలిస్తే మంచి పాఠకుడు అవుతాడో వాళ్ళని ఎన్నుకోమన్నాను. ఆ పట్టీ నేను పోగొట్టుకున్నాను కాని నాకు గుర్తున్నంత వరకు అవి ఇలా ఉంటాయి, మంచి పాఠకుడికి ఉండాల్సిన నాలుగు లక్షణాలు ఏంటో మీరూ ఎన్నుకోండి:

1. పాఠకుడు ఒక బుక్‌క్లబ్బుకు చెంది ఉండాలి.
2. పాఠకులు తమని తాము కథలోని హీరోతోనూ, హీరోయిన్‌తోనూ గుర్తించుకోవాలి.
3. పాఠకుడు సాంఘిక, ఆర్థిక కోణాల నుండి చదవాలి.
4. యాక్షను, సంభాషణలు లేని కథల కన్నా అవి ఉన్న వాటినే పాఠకుడు ఎంచుకోవాలి.
5. తాను చదువుతున్న పుస్తకాన్ని ఆధారంగా తీసిన సినిమాని పాఠకుడు చూసి ఉండాలి.
6. పాఠకుడు ఎదుగుతున్న రచయిత అయ్యుండాలి.
7. పాఠకుడికి ఊహాశక్తి ఉండాలి.
8. పాఠకుడికి జ్ఞాపకశక్తి ఉండాలి.
9. పాఠకుడి దగ్గర నిఘంటువు ఉండాలి.
10. పాఠకుడికి కొంత కళాత్మక భావం ఉండాలి.

భావావేశాలతో పాత్రలతో గుర్తించుకోవడం వైపు, యాక్షను వైపు, సాంఘిక, ఆర్థిక, చారిత్రక కోణాల వైపే విద్యార్థులంతా ఎక్కువుగా మొగ్గు చూపారు. కాని నిజానికి, మీరు అనుకున్నట్టే, పాఠకుడి దగ్గర ఉండాల్సింది నిఘంటువు, ఊహాశక్తి, జ్ఞాపకశక్తి, కొంత కళాత్మక భావం – ఈ భావాన్నే వీలయినప్పుడల్లా నాలోనూ, ఇతరులలోనూ పెంపొందించడానికి ప్రయత్నిస్తాను.

పఠనం అన్న పదాన్ని స్వేచ్ఛగా వాడుతున్నాను గాని, అసలు ఒక్కమారు పఠనం పఠనం అవ్వదు. మళ్ళీమళ్ళీ చదివితేనే అది పఠనం అవుతుంది. మంచి పాఠకుడు, గొప్ప పాఠకుడు, చురుకైన, సృజనాత్మక పాఠకుడు మళ్ళీ మళ్ళీ చదువుతాడు. ఎందుకో చెప్తాను. పుస్తకంలోని ప్రతి పుటలోని ప్రతి వాక్యాన్నీ కళ్ళు ఆ చివర నుండి ఈ చివర వరకు తిప్పి చదవడము, పుస్తకం మీద ఒక ప్రాథమిక అవగాహన తెచ్చుకోవడము, ఈ ప్రక్రియంతా చాలా శ్రమతో కూడుకున్నది. మొదటిసారి చదువుతున్నప్పుడు ఈ క్లిష్టమైన ప్రక్రియ కళాత్మకమైన మెచ్చుకోలుకు అడ్డం వస్తుంది. అదే ఒక చిత్రలేఖనాన్ని చూస్తునప్పుడు మనం కళ్ళను ప్రత్యేకంగా ఎటూ తిప్పాల్సిన పని లేదు, పుస్తకంలో లాగా అందులో గొప్ప నిర్మాణం, లోతు ఉన్నప్పటికీ. మొట్టమొదటిసారి దాన్ని చూస్తున్నప్పుడు అసలు సమయం అన్న అంశం సమస్యే కాదు. కాని పుస్తకంతో పరిచయం ఏర్పడడానికి మనం కొంత సమయం కేటాయించాలి. చిత్రలేఖనాన్ని చూడ్డానికి కళ్ళు ఉన్నట్టు ఒక్కసారిగా పుస్తకంలోని వివరాలన్నింటినీ ఆస్వాదించడానికి మనకి ఏ ఇంద్రియమూ లేదు. కానీ పుస్తకాన్ని రెండో సారో, మూడో సారో, నాలుగో సారో చదివినప్పుడు దాంతో మనం వ్యవహరించే తీరు చిత్రలేఖనంతో వ్యవహరించినట్టుగానే ఉంటుంది. ఐతే మానవ పరిణామ క్రమం తీర్చిదిద్దిన కళాఖండం కన్నుకు, అంతకంటే ఘనంగా అది సాధించిన మనసుకి తేడా ఉంది కదా! పుస్తకం ఏదైనా (కాల్పనిక రచనైనా, శాస్త్రీయ రచనైనా. ఈ రెంటికీ మధ్య అంతరం మనం సాధారణంగా అనుకునే దానికంటే ఎక్కువే!) మనసును ఉద్దేశించి రాయబడుతుంది. కాబట్టి మన మనసు – పులకరించే మన వెన్నుపూస పైన కూర్చున్న మస్తిష్కం – మాత్రమే మనం పుస్తకం పైన ఉపయోగించాల్సిన ఏకైక సాధనం.

మరి నిస్తేజమైన మనసుతో తేజరిల్లే పుస్తకాన్ని చేతపడితే ఏమవుతుందన్న దాని గురించి ఆలోచించాలి. ముందా నిస్తేజమంతా కరిగిపోతుంది, మంచికో చెడుకో పాఠకుడు స్ఫూర్తి పొంది పుస్తకంలో నిమగ్నమవుతాడు. ఒక పుస్తకం చదవడాన్ని మొదలుపెట్టడం కష్టమైన పనే, ముఖ్యంగా పాతకాలపు మనుషులు, గంభీరులు అని యువతరం పాఠకులు ఆంతరంగికంగా భావించే వ్యక్తులు ఆ పుస్తకాన్ని కొనియాడుతున్నప్పుడు. కానీ కష్టమైన ఆ మొదటి అడుగులు వేశాక ప్రతిఫలం పలురకాలుగా, పుష్కలంగా ఉంటుంది. గొప్ప కళాకారులు వారి కల్పనాశక్తితో పుస్తకాన్ని సృష్టిస్తారు కాబట్టి సహజంగా, సకారణంగా పాఠకులు కూడా తమ కల్పనాశక్తి ఉపయోగించక తప్పదు.

ఇక పాఠకుల ఊహ విషయానికొస్తే, దాంట్లో కనీసం రెండు రకాలు ఉంటాయి. ఆ రెండింట్లో ఏది సరైనదో చూద్దాం. మొదటిది తులనాత్మకంగా తక్కువదైన, వ్యక్తిగతమైన ఊహ. ఇది భావావేశాలను ఆశ్రయిస్తుంది (ఈ భావావేశపూరిత పఠనంలోనే మళ్ళీ పలురకాలు ఉంటాయి). ఈ రకమైన ఊహ స్వభావం ఇలా ఉంటుంది: మనకో, మనకు తెలిసిన వాళ్ళకో జరిగిన వాటిని పుస్తకంలోని ఫలానా సన్నివేశం గుర్తు చేస్తుంది కాబట్టి అది మనల్ని బలంగా తాకుతుంది. లేదా, ఒక దేశం తాలూకు, ప్రకృతిదృశ్యం తాలూకు, తన గతాన్ని గుర్తుచేసే జీవనవిధానం తాలూకు, భావాలని మనసులో రేకెత్తిస్తే ఫలానా పుస్తకానికి పాఠకుడు విలువిస్తాడు. లేదా, అర్థరాహిత్యంగా, పుస్తకంలోని పాత్రతో పాఠకుడు తనను తాను గుర్తించుకుంటాడు. ఈ నాసిరకపు ఊహతో కాదు పాఠకులు పఠనం చెయ్యాలని నేను కోరుకునేది.

మరి పాఠకుడు ఉపయోగించాల్సిన అసలైన సాధనమేంటి? వ్యక్తిగత ఛాయ లేని ఊహ, కళాత్మక ఆహ్లాదం. రచయిత, పాఠకుడి మనసుల మధ్య కళాత్మక, సామరస్య సమతౌల్యం ఏర్పడాలి. పాఠకుడు పుస్తకానికి అంటిముట్టనట్టు ఉంటూ, ఆ దూరంలో ఆనందం పొందుతూనే తీక్షణతతో పుస్తకంలోని అంతర్లీన అల్లికను గాఢంగా అనుభూతి చెందాలి – కంపిస్తూ, కంటతడి పెడుతూ అనుభూతి చెందాలి. ఈ విషయంలో బొత్తిగా తటస్థంగా ఉండటం అసాధ్యమే, ఎందుకంటే విలువగల ప్రతీదీ కొంతవరకూ వ్యక్తిగతం కాకపోదు. ఉదాహరణకి, ఇప్పుడు మీరు అక్కడ కూర్చోడం కేవలం నా కల కావొచ్చు, నేను మీ పీడకల అయ్యుండొచ్చు. కాని నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, పాఠకుడికి ఎప్పుడు ఎక్కడ తన ఊహకి కళ్ళెం వెయ్యాలన్నది తెలియాలి. రచయిత మనకందించిన నిర్దిష్టమైన ప్రపంచాన్ని నిజాయితీగా ఆకళింపు చేసుకోడానికి ప్రయత్నిస్తే అది తెలుస్తుంది. అందులోని విషయాలని మన కళ్ళకి కట్టినట్టు, చెవులకి వినబడినట్టు ఊహించుకోవాలి. రచయిత సృష్టించిన పాత్రల నడవడిని, బట్టలని, గదులని ఊహల్లో చిత్రించుకోవాలి. మాన్స్‌ఫీల్డ్ పార్క్ నవలలో ఫ్యాని ప్రైస్ కళ్ళ రంగు, తన చల్లని గది, దాన్ని అమర్చిన విధానం… ఇవన్నీ ముఖ్యమైన విషయాలు.

మనందరి స్వభావాలు వేరు వేరు. కానీ పాఠకుడికి ఉండాల్సిన, లేదా పాఠకుడు పెంపొందించుకోవాల్సిన ఉత్తమ స్వభావం మాత్రం కళాత్మక, శాస్త్రీయ స్వభావాల కలయిక అని నేను చెప్పగలను. పుస్తకం పట్ల తీవ్రమైన భావుకత ఉండడానికి తగినవాడు ఉత్సుకత కలిగిన కళాకారుడు మాత్రమే, కాబట్టి ఆ భావుకత వేడిని చల్లార్చడానికి తనలో శాస్త్రీయ ఉదాసీనత కూడా ఉండాలి. కాబోయే పాఠకుడికి ఈ ఉత్సుకత, ఓర్పు – కళాకారుడి ఉత్సుకత, శాస్త్రజ్ఞుడి ఓర్పు – లేకపోతే తాను గొప్ప సాహిత్యాన్ని ఆస్వాదించలేడు.

ఆటవిక యుగంలో పులిని చూసి బెదిరిపోయిన పిల్లాడు పులి, పులి అని కేకలుపెట్టి పరిగెత్తుకొచ్చిన రోజు సాహిత్యం పుట్టలేదు. వాడు పులి, పులి అని అరుస్తూ పరిగెత్తుకొచ్చినప్పుడు, వాడి వెనక ఏ పులీ లేని రోజున సాహిత్యం పుట్టింది. ఈ అబద్ధాల ఆకతాయిని ఒక రోజు నిజమైన పులి తినేసింది అనుకోండి, అది వేరే సంగతి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే దట్టమైన పొదల్లోని పులికీ దట్టమైన వాడి కథలోని పులికీ నడుమన ఒక తేజరిల్లే మధ్యస్థం ఉంది. ఆ మధ్యస్థం, ఆ స్ఫటికమే సాహిత్యకళ.

సాహిత్యమంటే సృష్టి; కల్పన కల్పనే. కథని వాస్తవం అనడం అటు కళకీ ఇటు వాస్తవానికీ అవమానం. ప్రతి గొప్ప రచయిత ఒక గొప్ప మాంత్రికుడు – ప్రకృతి కూడా అంతేగా! ప్రకృతి మన కళ్ళుగప్పి ఎప్పుడూ మోసపుచ్చుతూ ఉంటుంది. జాతిని వృద్ధి చెయ్యడానికి అది చేసే చిన్న మోసం నుండి, సీతకోకచిలుకలకి, పక్షులకి వాటి సంరక్షణ కోసం అది ఘనంగా అందించిన మోసపూరితమైన రంగుల వరకు ప్రకృతి మొత్తం మాయలు, మంత్రతంత్రాలతో నిండిపోయుంది. రచయిత ప్రకృతిని అనుసరిస్తాడంతే.

ఇక పులి, పులి అని పొలికేకలు పెట్టిన మన పిల్లాడి విషయానికొస్తే, వాడు ఉద్దేశపూర్వకంగా కల్పించిన పులిలో, వాడి కలలో, కళ యొక్క మాయ ఉంది. తరువాత వాడి జిత్తులన్నీ ఒక మంచి కథగా అల్లుకున్నాయి. చివరికి వాడు చనిపోయాక, వాడి గురించిన కథ పోనుపోను చీకట్లో చలిమంట దగ్గర చెప్పుకునే నీతికథ అయింది. ఏదేమైనా, వాడొక మాంత్రికుడు, ఒక సృష్టికర్త.

కథకుడిగా, గురువుగా, మాంత్రికుడిగా ఒక రచయితని మూడు దృక్కోణాల నుంచి పరిగణించవచ్చు. గొప్ప రచయితలో ఈ ముగ్గురూ ఉన్నప్పటికీ, ప్రబలమైన తనలోని మాంత్రికుడే తనని గొప్ప రచయితని చేస్తాడు.

వినోదం కోసము, మనసుని ఉత్తేజపరచుకోవడం కోసము, భావోద్వేగాలలో లీనమవడం కోసము, సుదూర స్థలకాలాలలో విహరించడం కోసము మనం రచయితలోని కథకుణ్ణి ఆశ్రయిస్తాం. భిన్నమైన మరికొన్ని మనసులు – మేలైనవి కానక్కరలేదు – రచయితలో గురువుని వెతుక్కుంటాయి. ఇంక భావప్రచారకర్త, నీతి బోధకుడు, ప్రవక్త… ఇదీ పెరిగే క్రమం. నైతికత నేర్చుకోవడానికి మాత్రమే కాక సాధారణ వాస్తవాలు, సూటి జ్ఞానం కోసం కూడా మనం గురువు వైపుకు మళ్ళుతాం. ఆమాటకొస్తే పారిస్‌లోని సుఖాన్ని, రష్యాలోని దుఃఖాన్ని గురించి ఏదో కొంత తెలుసుకోడానికి ఫ్రెంచి, రష్యన్ నవలలు చదివినవాళ్ళని కూడా నేను చూశాను! చివరగా, అన్నింటికంటే ముఖ్యంగా, గొప్ప రచయిత ఎప్పుడూ ఒక గొప్ప మాంత్రికుడు. ఈ మాంత్రికుడి విలక్షణ మేధోమాయని పట్టుకోవడము, తన శైలిని, చిత్రణలని, రచనల్లోని లయని అధ్యయనం చెయ్యడమే పఠనంలో అన్నింటికన్నా ఊరించే అంశం.

గొప్ప రచయితలో ఉండే ఈ మూడు లక్షణాలు – కథ, పాఠం, మాయ – తన రచనల్లో సమ్మిళితమై విశిష్ట సంయోగంగా ప్రకాశిస్తాయి, ఎందుకంటే మనల్ని మంత్రముగ్ధుల్ని చేయగల కళ రచనలోని కథాస్థిలోనైనా ఉండొచ్చు, అందులోని అంతర్లీన ఆలోచనల మూలుగలోనైనా ఉండొచ్చు. మాన్స్‌ఫీల్డ్ పార్క్ లాంటి నవల లాగా, చార్లెస్ డికెన్స్ రచనల్లో వెల్లివిరిసే చిత్రణల లాగానే, ఆలోచనలని క్రమబద్ధంగా పొందుపరిచిన సూటి, పొడి రచనలు కూడా మనల్ని అంతే ఉత్తేజపరిచి కదిలించగలవు. దీర్ఘకాలంలో, ఒక నవల నాణ్యతని కొలిచే సూత్రం కవిత్వానికుండే అమరిక, శాస్త్రీయ అంతర్బుద్ధిల కలయికని నాకు అనిపిస్తుంది. ఈ మాయలో మునిగితేలటానికి తెలివైన పాఠకుడు పుస్తకాన్ని హృదయంతోనో, మెదడుతోనో కాదు, వెన్నుపూసతో చదవాలి. అక్కడే కదా మరి మన పులకరింతల పొలకువ కనబడేది, మనం పుస్తకానికి కొంత అంటీ ముట్టనట్టు, కొంత దూరంగా ఉంటూ చదివినప్పటికీ! ఇక ఇంద్రియానందము, మేధోల్లసముతో కళాకారుడు నిర్మించే పేకమేడని, అది అందమైన గాజు-ఉక్కు భవనంలా మారే వైనాన్నీ వీక్షించి పరవశించాలి.