భానుగుడి సెంటర్, మసీదు సెంటర్, బాలాజీచెరువు, సిన్మారోడ్డు, టెంపుల్ స్ట్రీట్, ఎస్సారెమ్టీ రోడ్డు నుంచి జగన్నాథపురం బ్రిడ్జి దాకా అదనీ ఇదనీ లేదు ఏ రోడ్డు చూసినా నేల ఈనినట్టు ఒకటే జనం! బాలాజీ చెరువు సెంటర్, టాక్సీ స్టాండ్, ధియోసాఫికల్ సొసైటీ సెంటర్, ఒక్కచోటని ఏంటీ… ఊరు ఊరంతా తొక్కిడిగానే వుంది. అక్కడక్కడ కుర్రోళ్ళు పేల్చే సీమటపాకాయి జడలబాంబుల శబ్దాలకు గూబలు గుయ్యిమంటున్నాయి!
ఒక క్రమపద్ధతిగా వెళ్ళే ట్రాఫిక్, లారీలూ ఆటో రిక్షాలు లేని కాకినాడను చూస్తే వెల్ ప్లాన్‌డ్ సిటీ అని ఎందుకంటారో ఈజీగా తెలిసిపోతుంది. రోడ్డుకు అటూ ఇటూ షాపులన్నీ గ్లో సైన్ బోర్డులు, రంగురంగుల విద్యుద్దీపాలతో ధగధగా మెరిసిపోతూ కన్నుల పండుగగా ఉంది. అక్కడక్కడ ఇళ్ళమీద వేలాడుతున్న స్టార్స్ తళుక్కు తళుక్కుమంటున్నాయి. బ్రిటిష్ వాళ్ళు మనల్ని విడిచిపోయినా వారి ముద్ర బొంబాయి, కలకత్తా, మద్రాస్, విశాఖ, కాకినాడ లాంటి పెద్దపెద్ద పోర్ట్ టౌన్‌లలో ఇప్పటికీ ఏదో రూపంలో కనిపిస్తూనే ఉంటుంది!
స్వీట్ షాపులు, పండ్ల దుకాణాలు, బేకరీలు, పూలకొట్లన్నీ జనాలతో కిక్కిరిసి పోయాయి. వైన్ షాపుల దగ్గరైతే కులాయి చెరువు మీద ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు జరిగే ఫలపుష్ప ప్రదర్శనకొచ్చే జనంలా కిటకిటలాడిపోతున్నారు జనం.
కేరీ చర్చి, లూథరన్ చర్చి, బాప్టిస్ట్ చర్చిలన్నీ రంగురంగుల సీరియల్ లైట్‌లలో వెలిగిపోతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నట్టున్నాయి. రోడ్లమీద తోసుకుంటూ తొక్కుకుంటూ హడావిడిగా పోతున్నారు జనం. అందరి చేతుల్లోనూ కొత్తబట్టల, పండ్ల, కేకుల సంచులున్నాయి. పాటలు, అరుపులు, కేకలతో రోడ్డుమీద వచ్చేపోయే వాళ్ళకు హేపీ న్యూ యియర్ అని విషెస్ చెపుతూ సందడి చేస్తున్నారు కుర్రకారు.
మసీదు సెంటర్‌కు ఎప్పుడొచ్చినా సాయంత్రం ఆరూ ఏడూ మధ్య నేనూ శ్రీశ్రీ కల్సి వస్తాం. ఆ టైమ్‌లో అబ్బాయిలూ అమ్మాయిలతో సెంటర్ కళకళలాడిపోతుంది! పిఠాపురం రాజా కాలేజీ స్టూడెంట్స్, హౌస్ సర్జన్‌లు, పీజీలంతా ఈ సెంటర్‌లో కాపు కాస్తే… రంగరాయ మెడికల్ కాలేజ్ మెడికోస్ భానుగుడి సెంటర్‌లో కాపు కాసేవాళ్ళు.
సమ్మర్‌లో శ్రీశ్రీకి మేరేజ్ కావడంతో న్యూ యియర్ సంబరాలు జరుపుకోవడానికి వైజాగ్ వెళ్ళాడు.
మా రంగరాయ మెడికల్ కాలేజీ హౌస్ సర్జన్స్, పీజీలకు హాస్పిటల్ లోని పై అంతస్తు థర్డ్ ఫ్లోర్ మొత్తం హాస్టల్. మాకు డైనింగ్ హాల్, టీవీ రూమ్ కామన్ మీటింగ్ ప్లేస్.
“మన హౌస్ సర్జన్స్ పీజీ హాస్టల్లో ఈ సారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అదిరి పోవాలిరా” అన్నాడు రూప్‌కుమార్. డైనింగ్ హాల్లో అమ్మాయిలతో కలిసి తినేప్పుడు నాటుజోకులేసి నవ్వించగలడు.
మా పీజీ ఫ్రెండ్స్ గాంగ్ విజయ్‌కుమార్, మహేష్, కోటి, సీతారాముడు, శ్రీశ్రీ, సత్యప్రసాద్, విజయబాబు, రామారావు, రమణారావు మాస్టారు, గణపతి, రాఘవేంద్రరావు – డైనింగ్ హాల్లో ఒక టేబుల్ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాం. అంతా జుబిలియెంట్ మూడ్‌లో వున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రపోజల్స్‌కు అందరూ డన్! డన్! అన్నట్టుగా థమ్స్ అప్ సంజ్ఞలు చేశారు. అంతకు ముందురోజు యానాం వెళ్ళి అరడజను లిక్కర్ బాటిల్స్ తెచ్చారు నాగు, కోటి. అలా న్యూ యియర్ వేడుకలకు డైనింగ్ హాల్లో పునాది పడింది.
అమ్మాయిలంతా కూడా ఓ! ఓ! అని గోలగోలగా అరిచి సంసిద్ధత తెలియజేశారు. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా టీవీ హాల్‌ను రంగురంగు తగరపు కాగితాలు, బొమ్మలు, కలర్ బెలూన్లతో అందంగా అలంకరించసాగారు హౌస్ సర్జన్ అబ్బాయిలు, అమ్మాయిలు కల్సి. పీజీలు సిగరెట్ పొగలతో మేఘాలు సృష్టిస్తూ వాళ్ళకు సలహాలిస్తున్నారు.
“మనం నైట్ ట్వల్వోక్లాక్కు కేక్ కటింగ్ అయ్యాక అంతాకల్సి మైఖేల్ జాక్సన్ పాటలతో డాన్స్‌లు చెయ్యాలి. రాజేష్ హౌస్ సర్జన్స్ తరుపున, ఎంబీ విజయకుమార్ పిజీల తరుపున రెండు కేక్స్ తెస్తారు. రామరాజు మెస్ సెక్రెటరీ కాబట్టి మిగతా ఎరేంజ్‌మెంట్స్ చూస్తాడు.” రమణారావు మాస్టారు చెప్పాడు. ఆయన యూజీ, పీజీ వైజాగ్‌లో చేశాడు. ఆరు నెలల క్రితం మెడికల్ యూనిట్ వన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఇక్కడికి వచ్చాడు. అందరికీ ఆయనంటే గౌరవం. మాస్టారని అంతా పిలిచేవాళ్ళం.
రాత్రికి టీలు, బిస్కట్లు, డెకరేషన్ సామాగ్రి, స్వీట్, హాట్ లాంటి మిగతా ఏర్పాట్లు చూసుకోమనీ మెస్ క్లర్క్ రమణతో చెప్పి, మెస్ వర్కర్లను డెకరేషన్స్‌లో హెల్ప్ చెయ్యడానికి పంపమన్నా.
అదంతా చూశాక హౌస్ సర్జన్‌లు, పీజీలకంటే ఇంకా పెద్ద ప్లమ్ కేక్ తెచ్చి అందర్ని సర్‌ప్రైజ్ చేద్దామనే ఆలోచన సడన్‌గా వచ్చింది. బజారుకు పోవడానికి టైమ్‌కు శ్రీశ్రీ లేడు. మహేష్ రూముకెళ్ళా. అతనూ లేడు. నైట్ డ్యూటీ అని రూమ్మేట్‌కు చెప్పాడట! ఉంటే అతని స్కూటర్ మీద మసీదు సెంటర్‌కు వెళ్ళి కేక్ తీసుకు రావొచ్చు. మా బేచ్ మొత్తంలో విజయ్ కుమార్, మహేష్‌లకే చేతక్ స్కూటర్లు ఉన్నాయి.
రిక్షాలో మసీదుసెంటర్ కెళ్ళా. ఆర్యభవన్‌లో టీ తాగి రోడ్డుమీద నిలబడ్డా. దుకాణాలన్నీ జనంతో కిటకిటలాడి పోతున్నాయి. పండగ సంతోషం అందరి ముఖాల్లో కనబడుతుంది.
ఫెస్టివల్ ఈవ్ అంటే ఇదేనేమో!
సంవత్సరంలో ప్రతి రెండుమూడు నెలలకూ ఒక పండగ వస్తే ఎంత బావుంటుందో కదా! అయినా ఈ పండుగల ఆనందాలు అందరికీ ఉంటాయా? దేశంలో బీదాబిక్కికి కడుపు నిండితేనే కైలాసం కదా! కొత్తబట్టలు, స్వీట్లు, బిర్యానీలు, పూలు పండ్లు లాంటి పండగ ఆర్భాటాలు అందరికీ అందేనా! అంతా సంతోషంగా ఇలా పండగలు జరుపుకోవాలoటే ఇంకెంతకాలం పడుతోందో కదా! రోడ్డు మీద పోయే జనాల్ని చూస్తూ ఆలోచనలతో జగన్నాథపురం బ్రిడ్జ్ దాకా వెళ్ళా.
బ్రిడ్జి దగ్గర కాలవలో వేటకెళ్ళొచ్చిన పడవలు లంగరులేసి వున్నాయి. వెనక్కి తిరిగి మసీదు సెంటరుకొచ్చా. కోటయ్య కాజాల షాపు దగ్గర చాలా రష్‌గా వుంది. ఫేమస్ బేకరీ కెళ్ళాను. లోనికి పోవడానికే ఖాళీ లేనట్టు కిక్కిరిసి పోయివుంది. అర్ధగంట ఆగితే గానీ లోనికి పోవడానికి కుదర్లేదు. వేలం వెర్రిగా కేకులు తీసుకుపోతున్నారు జనం. పెద్ద ప్లమ్ కేక్ తీసుకున్నాను. దాని పైన అందంగా ‘హేపీ న్యూ యియర్’ అని రాసి ఇచ్చాడు.
సంతవీధి మార్కెట్‌లో ఆపిల్స్, చక్కరకేళి అమృతపాణి అరటిపండ్లు, దానిమ్మలు, బత్తాయిలు, కమలాలు రారమ్మని పిలుస్తున్నట్టు ఊరిస్తున్నాయి. డిసెంబర్ జనవరి నెలల్లో వచ్చే పండ్లు కూరగాయలు తీరే వేరు! నవనవలాడుతూ ఉంటాయి! న్యూ యియర్ సందర్భంగా ఆప్తులకు శ్రేయోభిలాషులకు కానుకగా ఇవ్వడానికి, శుభాకాంక్షలు తెలిపేoదుకూ ఆపిల్ పండ్లను రంగుకాగితాలతో చుట్టి సిద్దంగా ఉంచారు షాపులవాళ్ళు. కమలాలు, ఆపిల్స్, దానిమ్మలు తీసుకుని రిక్షా కోసం రోడ్డు పక్కన నిలబడ్డాను.
కాకినాడ అందం చూడాలంటే క్రిస్మస్, న్యూ యియర్ టైములో చూడాల్సిందే! ఇళ్ళన్నీ రంగులేసి అందంగా తయారుచేస్తారు. సముద్రతీరమైనా డిసెంబర్ జనవరి నెలల్లో వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా వుంటుంది! పది నిముషాలైనా ఒక్క రిక్షా కనబడలేదు. ఈ పూట వీళ్ళకు ఏమైందబ్బా? రోడ్డు పక్కన నిలబడితే చాలు ఈగల్లా ముసిరేవాళ్ళే…
“గాడి కావాలా బాబుగారూ” అనడిగాడు బక్కపల్చగా ఉన్న మనిషి రిక్షా నా ముందాపి. ఈ ఊర్లో రిక్షావాళ్ళు కస్టమర్లను చాలా మర్యాదగా పిలుస్తారు. ఈ ఊరుకున్న కల్చర్ అది.
“గవర్నమెంట్ హాస్పిటల్‌కి వస్తావా?”
“ఎక్కండి బాబూ.”
“ఎంతివ్వమంటావ్?”
“మీకు తెలవన్దేముందీ? తోచిందివ్వండి డాక్టర్ బాబూ” అన్నాడు సంచులు రిక్షాలో పెట్టుకొంటూ.
“వీటిని పైనున్న మూడో అంతస్తు దాకా తేవాలి.”
“బలేవొరే డాక్టర్ బాబూ! తవరు సెప్పాలా?”
రిక్షా ఎక్కి కూర్చున్నాను. మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు, కార్లు తిరిగే జనంతో రోడ్డు రద్దీగా వుంది. ట్రాఫిక్ తప్పించుకుంటూ నెమ్మదిగా తొక్కుతున్నాడు. రిక్షా బాలాజీ చెరువు దగ్గిరకొచ్చింది. మౌనంగా రిక్షా తొక్కుతున్నాడు. ఆటో ఎక్కినా, రిక్షా ఎక్కినా దాన్ని తోలే ఆసామితో ముచ్చట్లు పెట్టటం నాకలవాటు.
“నిలబడి పది నిమిషాలయినా ఒక్క రిక్షా రాలేదు. కొత్త సంవత్సరం జరుపుకోవడానికి తొందరగా ఇళ్ళకు జేరుకున్నట్టున్నారేం మీ ఫ్రెండ్స్ అంతా? నువ్వు కొత్త సంవత్సరం పండగ చేసుకోవటం లేదా?” అన్నాను మాట కలుపుతూ.
“నాబోటోల్లకేం కొత్త సంవత్సరం లేండి బాబూ!”
“అదేం? ఊరూవాడా అంతా మందు తాగి, టపాకాయలు కాలుస్తూ సంతోషంగా సంబరాలు చేసుకుంటుంటే?”
“మా ఫ్యామిలీ ఇంట్లో నేదు బాబూ! దుబాయ్ పోయి నాలుగేళ్ళయిందండి. అక్కడ పెద్దసేటు ఇంట్లో పని. ఇదుగో వత్తన్నా అదిగో వత్తన్నా అని ఉత్తరాలు రాసేదిగాని ఇంతవరకూ పత్తా నేదు. పోయినేడాది కిస్మిస్ పండక్కి వత్తానని రాసిందిగాని రాలేదు. తర్వాత కొత్త సంవత్సరానికి వత్తాననీ రాసిందిగాని రాలేదు. దుబాయ్ పోయిన కొత్తల్లో నెలనెలా డబ్బులు పంపేది. రెండేళ్ళనుంచి వుత్తరం లేదు, డబ్బులూ నేవు బాబూ!”
“అయ్యో! అలా ఎందుకు?”
“ఏమో బాబూ! మా పిల్లలిద్దరూ అప్పన్నుంచీ వాళ్ళ అమ్మ మీద దిగులేసుకున్నారు బాబూ! కిస్మిస్, కొత్త సంవత్సరం వత్తంటె సాలు అమ్మ… అమ్మ కావాలనీ రోజూ అడుగుతారు బాబూ! మొన్న కిస్మిస్ పండక్కీ పిల్లలిద్దరూ మరీ గోల చేసేరు. సిన్నోడయితే అమ్మ కేక్ తెత్తానంది ఏదీ నాన్నా అని నేనింటికి పోగానే ఏడుత్తాడు బాబూ!”
“పోనీ చిన్న కేక్ కొనుక్కెళ్ళక పోయా?”
“కేకు తీసుకెళ్దారంటే మాకు దొరికే అరకొర రిక్షాకిరాయిలు మా తిండికే సాలటల్లేదండీ!”
“అవునులే! మార్కెట్లో అన్నీ మండిపోతున్నాయి.”
ఆఫీసర్స్ క్లబ్ దగ్గర నుంచీ ట్రాఫిక్ కొంచెం తగ్గింది. కేరీ చర్చి ముందు బాగా రష్‌గా వుంది. అది రంగురంగుల విద్యుత్ దీపపుకాంతులతో వెలిగిపోతుంది. ‘కొత్త ఏడు మొదలు పెట్టెను మనబతుకులందు. కొత్త ఏడు మొదలు పెట్టెను…’ అంటూ వాచ్ నైట్ సర్వీస్ పాటలు చర్చ్ లోంచి వినిపిస్తున్నాయి.
కేక్ ఒళ్ళో పెట్టుకుని ఒకచేత్తో జాగ్రత్తగా పట్టుకున్నాను.
“తవరు ఆ పేమసు బేకరిలో కేకు తీసుకున్నారండీ? అక్కడ బలేగుంటదని మా వరదరాజులు సెప్పేడండీ!” అడిగాడు నా చేతిలో ఉన్న కేకు బాక్స్ చూసి.
“ఆఁ, అవును. రాత్రి పన్నెండుకు కొత్తసంవత్సరం వస్తుందిగా! హాస్టల్లో వుండే డాక్టర్లంతా కల్సి కేక్ కట్ చేసి కొత్త సంవత్సరం పార్టీ చేసుకుంటాం.”
“ఆ కేకును దేంతో సేత్తారు బాబూ?”
“ఇదా? మైదా, గుడ్డుసొన, పంచదార, సోడావుప్పూ… కిస్మిస్లు, పళ్ళముక్కలు అలా అన్నీ కలిపి చేస్తారు. నువ్వెపుడూ తినలేదా?”
“నేదు బాబూ! రోజూ కేకు కేకనీ పిల్లలడుగుతారు. వాళ్ళబడిలో సదువుకునే పిల్లకాయలు పుట్టినరోజు కేకు గురించి చెప్పుకుంటారంట! చానా రుచిగా వుంటదనీ. నేను ఇంటికిపోగానే కేకు ఎలా చేత్తారో మాపిల్లలకి చెబుతా లేండి.”
మాటల్లోనే హాస్పటల్ గేటు దగ్గరకొచ్చాం. గేటు తీశాడు వాచ్‌మన్. కాజువాలిటీ ముందు రిక్షా ఆపాడు. మా పీజీ హాస్టల్ మూడంతస్తుల పైన. మెట్లు ఎక్కి పైకి పోవాలి.
రిక్షా దిగాను. రిక్షా పక్కగా పెట్టి రెండు సంచులు రెండు చేతులతో తీసుకొన్నాడు రిక్షా అతను. సంచులు బరువుగా ఉన్నాయి. కేకు పట్టుకుని అతనివెనకే మెట్లెక్కసాగాను. అతను సునాయాసంగా ఎక్కుతున్నాడు.
న్యూ యియర్ వేడుకలకోసం ఏర్పాటు చేసిన లౌడ్‌స్పీకర్ లోంచి మైకేల్ జాక్సన్ సాంగ్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరం పైకి చేరుకున్నాం.
“నీకు మా హాస్టల్ తెలుసా?”
“కిరాయి కొచ్చినప్పుడు పైకి చానాసార్లు వచ్చాను బాబూ! అమ్మాయిగార్లు బజార్నుంచి ఏవైనా తెచ్చుకుంటారుగా! వాళ్ళు పైకి రమ్మనకపోయినా ఆరి సామాన్లు నేనే పైదాకా తీసుకొత్తానండీ. ఆడపిల్లలు కదండీ!”
మామూలుగా ఇచ్చే కిరాయికంటే ఒక రూపాయి ఎక్కువగా ఇస్తే సంతోషంగా తీసుకుని కిందికి దిగి వెళ్తుంటే అతన్ని చూస్తూ అక్కడే నిలబడ్డాను. కొంతసేపటికి అతన్ని పిలిచాను.
వెనక్కి తిరిగొచ్చి “ఏం బాబూ పిలిచారా?” అంటూ నిలబడ్డాడు.
నేను తెచ్చిన ప్లమ్ కేకు అతని చేతిలో పెట్టి “దీన్ని తీసుకుపోయి నీ పిల్లలతోకల్సి కొత్త సంవత్సరం పండగ చేసుకో” అన్నాను.
అతని ముఖం వెలిగిపోయింది.