ఇక్కడ ఏం పని?

లైబ్రరీ విషయాలు మాట్లాడడం అయ్యేక, కవిగార్ని స్వామిగారు అడిగేరు: “మీ పక్క ఇల్లు టైప్ ఇన్‌స్టిట్యూట్ మార్తాండం కొన్నాడని అనుకుంటున్నారు. ఎవరిది ఆ ఇల్లు? గజరాజుగార్ని ఒకటి రెండు సార్లు అక్కడ చూసినట్టు గుర్తు. వాళ్ళ బంధువులెవరిదైనానా?

కవిగారు అన్నారు, “స్వామిగారూ, అది చాలా పెద్ద కథ. మీకు తొందరలేకపోతే వినండి.”

కవిగారు చెప్పిన వివరం

గజరాజు తెలుసు కదా రెండు వారాల క్రితం అకస్మాత్తుగా పోయేడు! డెబ్బై ఐదేళ్ళ వయసు, మంచి కాయకష్టం చేసిన మనిషి. చిన్నప్పుడే తండ్రి పోతే, ఒంటి చేతి మీద ఉన్న పది ఎకరాల్ని ఏభై ఎకరాలు చేసి, చెల్లెళ్ళకు మంచి మోతుబరి కుటుంబాలకి ఇచ్చి పెళ్ళి చేసేడు. చెరో రెండు ఎకరాలు స్త్రీ ధనం ఇచ్చేడు. పక్క స్థలం కొని పెద్ద మేడ కట్టి మూడు వాటాలుగా తనకి తమ్ముళ్ళకి అమర్చేడు.

అన్నదమ్ములు అందరికీ చెరో ఇద్దరు మొగపిల్లలు. గజరాజు భార్య, తల్లి కలిసి ఆయన తమ్ముళ్ళని, చెల్లెళ్ళని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు కూడా చేసేరు. గజరాజంటే ఇంట్లో అందరికీ గౌరవం, భయం కూడా. ఒక్క రోజు కూడా పొలం పోకుండా ఉండలేదు. పాడి కూడా అలాగే పెంచేరు. భార్య, తల్లి పాలు పోసి ఆస్తి పెంచుకోవడంలో సాయపడ్డారు. మరదళ్ళు కూడా భాగం పంచుకున్నారు. అలాంటి వ్యవసాయ కుటుంబాల్లో ఉండే సౌలభ్యాలలో స్త్రీ సంపాదన, పుట్టింటి నుంచి వచ్చిన ధనమే కాకుండా పాడిలో వచ్చే మిగులు కూడా.

గజరాజుకి ఏభై ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి, తన కొడుకులకి, తమ్ముళ్ళ పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు అయిపోయేయి. ఎవరికి ఇంకా సంతానం కలగలేదు. గజరాజు తల్లి కాలధర్మం చెందింది. ఒక చెల్లెలు భర్త చనిపోయి నిస్సంతుగా అన్నగారి దగ్గరకు వచ్చేసింది. పుట్టింటి వారిచ్చిన రెండెకరాలే కాకుండా అప్పుడప్పుడు కూడబెట్టుకున్న మిగులు సొమ్ముతో అన్నగారి ద్వారా కొనుక్కున్న ఇంకో రెండెకరాలు, భర్త ద్వారా జల్లూరులో ఐదు ఎకరాలు ఆమె ఆస్తి. పెరట్లో ఓ రెండు గదులు ఆవిడ కోసం కట్టించి ఇచ్చేరు.

ఇలా ఉండగా, గజరాజు భార్య కుంతి మాధవుడి కళ్యాణ సందర్భంలో ఉప్పాడ సముద్రం దగ్గర జరిగే ఉత్సవానికి తోడికోడళ్ళతో వెళ్ళి సముద్రస్నానం చేస్తుండగా కెరటం లోపలికి లాక్కుంది. ప్రాణాలతో ఒడ్డుకు చేరలేదు. ఈ లోగా తెల్లారింది.

గజరాజు తట్టుకోలేకపోయాడు. బంధువులు, ఊర్లోవాళ్ళు, పై ఊరివాళ్ళూ అందరూ వచ్చేరు. ఆయన ఎవరితోటి మాట్లాడలేదు. ఒక్కడుగా ఉండిపోయాడు. తమ్ముళ్ళూ మరదళ్ళు, కొడుకులూ కోడళ్ళు, చెల్లెళ్ళు పనులన్నీ చూసుకున్నారు. అందరికీ గజరాజు భార్య తల్లి లాంటిదే.

దినవారాలు ముగిసేయి. గజరాజు మరి పొలానికి పోలేదు. పొలం పనులు తమ్ముళ్ళకి, కొడుకులకి అప్పచెప్పేశాడు. చెల్లెలు ఇంట్లో భోజనం. మాంసం మానేసేడు. పొద్దున్నుంచి గదిలో కూర్చోడం, లేకపోతే డాబా మీద వాలుకుర్చీలో చుట్ట కాల్చుకోవడం. పనిపిల్ల కాఫీ తెచ్చిస్తే తాగడం. అదే దినచర్య.

నెల తిరిగే లోగా మొత్తం ఆస్తి వాటాలు వేసేసేరు. ఇల్లు మూడు భాగాలు, చెల్లెలు వాటా వేరు, పొలం ఒక్కొక్కరికి పదహారు ఎకరాల చిల్లర వచ్చింది. చిన్న తమ్ముడు ఉత్తరం వైపు పొలం, రెండోవాడు దక్షిణం వైపు భాగం తీసుకున్నారు. గజరాజుకి మూడు చెక్కలుగా వచ్చింది ఆరెకరాలు ఒక ముక్క, రెండున్నర ఎకరాలు ఒక ముక్క, ఇంకో ఆరెకరాలు. చెరో ఆరెకరాలు కొడుకులకి ఇచ్చేసి, తన పేర్న మిగతా ముక్క ఉంచుకున్నాడు. ధాన్యం అవసరాలకి అట్టేపెట్టుకోగా మిగిలిన ధాన్యం రొక్కం ఓ ఏభై వేలు చేతికొచ్చింది కూడా పంచేసేరు. ఇంట్లో పాడి కూడా ఆడవాళ్ళు సర్దుకున్నారు. కొడుకులు కొంచెం నిరాశపడ్డారు. మిగతా భూమి తమ చేతికి వెంటనే రానందుకు. ఇంకో నెల తిరిగేటప్పటికి చిన్న చిన్న అలజడులు కనిపించడం ప్రారంభించేయి. ఎవరి వాటాలో వాళ్ళు వంటలు, తమకి కావాల్సిన సౌకర్యాలు అమర్చుకోవడంలో శ్రద్ధ పెట్టేరు. అంతవరకూ కలిసి ఉన్నవాళ్ళు కొంచెం ఎడం కావడం కనిపించింది. భార్యల వైపు, కోడళ్ళ వైపు బంధువుల రాకపోకలు ఎక్కువయ్యేయి.

అంతవరకూ చెప్పి కవిగారు పోస్టుమాన్ తెచ్చిన ఉత్తరాలు, పుస్తకాలూ చూస్తూ కాస్త విరామం ఇచ్చేరు.

అప్పుడే మహంతి మెట్లెక్కి ఒగురుస్తూ పైకొచ్చేడు. ఎగ్గట్టి కట్టిన పంచె, పొట్టి చేతుల జుబ్బా, భుజం మీద కాశీ తువ్వాలుతో ఒక స్టీల్ పళ్ళెంలో మూడు గ్లాసుల్లో టీ పట్టుకొచ్చేడు. “పైకొస్తుంటే అమ్మగారు టీలు పట్టికెళ్ళమనిచ్చేరు” అన్నాడు.

“ఏరా నువ్వెప్పుడు వచ్చేవు. భలే వచ్చేవు సమయానికి. టీ తెచ్చి మంచి పని చేసేవు. కిందకెళ్ళి ఆ కూజా నిండా నీళ్ళు పట్టుకురా” అని అతన్ని వెంటనే కిందకి పంపేరు. మహంతి నీళ్ళు తెచ్చేడు. ముగ్గురం టీ గ్లాసులు తీసుకున్నాం.

“ఎక్కడకి పోయేవురా మూడురోజుల నుంచి కనిపించలేదు. చెప్పాపెట్టకుండా పోయేవు” అన్నారు కవిగారు.

“గజరాజుగారు పోయేరు కదా. కొడుకులకు పొలం పంపకాల విషయంలో చిన్న మాట పట్టింపు వచ్చింది. కాలువ వార చెక్క గురించి పట్టుదల. మామగార్లు రంగంలోకి దిగేరు. ఆఖరికి సర్దుబాటు అయిందనుకోండి. మీకు తెల్సుకదా పదేళ్ళ క్రితం గజరాజుగారి వాటా పక్కనుంచి కాలువ పడింది. మూడు పంటలు, ముందుగా నీళ్ళ సౌకర్యం వచ్చింది. భూములు ధరలు కూడా బాగా పెరిగేయి.”

“అవును సరే గానీ నువ్వు పెద్దమనిషివి ఎప్పుడయ్యేవు ఇలాంటి విషయాల్లో” అన్నారు కవిగారు.

మహంతి కళింగం నుంచి వచ్చి బట్టల వ్యాపారం చేస్తాడు. పంటల సమయంలో గిరాకీ ఎక్కువ. మిగతా సమయాల్లో ఎక్కువగా రైతులకి, మోతుబర్లకి, బరంపురం సిల్క్ సరఫరా విషయంలో పెట్టింది పేరు. కుటుంబ స్త్రీలకి కూడా అణకువగా సిల్క్ ఎంపిక విషయంలో సాయం చేస్తాడు. వాళ్ళతో ఖరీదులకి కూడా వెళ్తాడు. గుంభనంగా గమనిస్తూ ఉంటాడు. కుటుంబం నుంచి దూరంగా ఉండడం వల్ల అప్పుడప్పుడు డబ్బిచ్చి సుఖం కొనుక్కుంటాడు. డబ్బున్న కొందరు రైతులకు నమ్మకమైన చెలికాడు. పనివాడు కాడు, సమానుడు కాడు, అలాగని బ్రోకర్ కూడా కాడు.

అప్పుడప్పుడు పశువుల బేరాలకి వేరే ఊళ్ళు కూడా వెళ్తాడు తోడుగా. కవిగారికి నమ్మిన బంటు. వీలు చిక్కినప్పుడల్లా వచ్చి లోకాభిరామాయణం చెబుతూ ఉంటాడు. కవిగారు కట్టేది బరంపురం సిల్క్ మాత్రమే. అది మహంతి చలవే.

“ఒరే, సులోచనమ్మ ఎక్కడికెళ్ళిపోయింది?”

“ఆవిడ మండపేట వెళ్ళిపోయిందండి. మనవరాలు దగ్గరకి. కక్షగట్టి పంపించేసేరు రోజులు తిరక్కుండానే, ఇదంతా మనవల పనే.”

“స్వామిగారికి ఆవిడ గురించి చెప్పు” అన్నారు కవిగారు.

సులోచనమ్మ గురించి మహంతి చెప్పిన వివరం

గజరాజుగారు ఆస్తులు పంచేసి ఓ ఆరు నెలలు ఇంటిపట్టునే ఉండిపోయేరండి. చెల్లెలు ఇంటిలో భోజనం చేయడం, డాబా మీద కూర్చోడం, కొడుకులు కానీ తమ్ముళ్ళు కానీ వచ్చి పొలం గురించో, ధాన్యం ధరల గురించో, అమ్మకానికి వస్తున్న పక్క పొలాల గురించో అడిగితే తనకి తోచింది చెప్పేవారు.

ఇలావుండగా, చెల్లెలు వాటా గేదెల్లో మూడు గేదెలు ఒట్టిపోయేయండి. చూలు నిలవలేదు. పాలిచ్చే ఆవుకి కడుపులో కాయ కాసిందని పశువుల డాక్టర్ తేల్చి చెప్పేడు. గజరాజుగారు నాకు కబురు పెట్టేరు. మంచి గేదెలు ఎక్కడున్నాయో వాకబు చెయ్యి వెళ్ళి తెచ్చుకుందాం అన్నారు.

మండపేటలో ఒక పెద్దింటి ఆవిడ తనకున్న ఆరు గేదెలు ఒకే పార్టీకి అమ్మేద్దామని చూస్తున్నారని తెలిసిందండి. మంచి గేదెలు, రోజుకు ఎనిమిది సేర్లు పాలిచ్చే గేదెలు. రెండు ఈతలు ఈనిన గేదెలు. రెండు మూడు కావాలని వచ్చిన వాళ్ళున్నారు కానీ ఆరు గేదెలు కొంటామని వచ్చినవాళ్ళు లేరు. గజరాజుగారు నన్నే పోయి చూసి రమ్మన్నారండి. గేదెలు వంక పెట్టడానికి లేవు. ఆవిడ గురించి తెలిసింది ఏమంటే. పేరు సులోచనమ్మ. నలభై ఐదు యాభై మధ్య వయసు. భర్త లేడు. సొంత ఇల్లు పెద్ద గొడ్ల చావిడి. చేదోడుగా ఉన్న కొడుకు పెళ్ళి చేసుకుని విత్తనాల వ్యాపారం చేసుకోవడానికి అత్తారింటికి వెళ్ళిపోయేడు, ఊర్లో ఉన్న పొలం అమ్మేసుకుని. కూతురికి చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది. కూతురు మొగుడు రావులపాలెంలో అరటి పళ్ళ టోకు వ్యాపారి. ఆ అమ్మాయికి ఓ కూతురు. కూతురుతో రాకపోకలు తక్కువ.

ఒంటినిండా నగలు, ఓ లక్ష నగదు ఉంది ఆవిడ దగ్గర. మనిషి బంగారం, వేలెత్తి చూపించడానికి లేదు. పొట్టిగా, కొంచెం లావుగా అనిపించినా మనిషిలో మెరుపు కనిపిస్తుంది. మాట నెమ్మది.

మహంతి తక్కువైనవాడు కాదు. అవసరమైన వాటి కంటే ఎక్కువ వివరాలే తెలుసుకున్నాడు.

విషయం చెల్లెలుతో సంప్రదించేరు. కొందామని నిర్ణయించుకుని గజరాజుగారు, మహంతి మండపేట వెళ్ళేరు. సులోచనమ్మగారి ఇంటికి వెళ్ళేరు. గేదెలు చూసుకున్నారు. నచ్చిందని చెప్పేరు. ధర విషయంలో ఆవిడ గజరాజుగారితో బేరం ఆడలేదు. “మీ గురించి విన్నాను. న్యాయం తెలిసినవారు. కష్టం తెలిసినవారు. మీరు ఇచ్చినంత పుచ్చుకుంటాను. జాగర్తగా చూసుకుంటారని నమ్మకం చాలు. మీ చెల్లిగారికి నేను తెలియదు గానీ ఆమె భర్త మా బావ అవుతాడు మా పిన్ని అత్తారి వైపు” అని చెప్పేరు. ఒప్పందం అయింది. ఆవిడే వంటచేసి పెట్టేరు వెళ్ళిన ఇద్దరికి. మనుషుల్ని పంపిస్తాను దూడల్ని తీసుకెళ్ళడానికి అని మొత్తం సొమ్ము ఇచ్చేసి వీరిద్దరూ వచ్చేసేరు. పాలికాపు వెళ్ళి గేదెల్ని తోలుకొచ్చేడు.

ఓ నెలపోయేక గజరాజుగారు కబురెట్టేరండి. మండపేట వెళ్దాం రమ్మన్నారు. ఇద్దరం వెళ్ళేం. మమ్మల్ని చూసి ఆవిడ ఆశ్చర్యపోయేరు. కాస్త కలవరపడ్డారు. మంచినీళ్ళు ఇచ్చేరు. భోజనం ఎన్నింటికి చేస్తారు అన్నారు. మేము నీళ్ళు తాగలేదు నవిలేం. ‘తాపేశ్వరంలో పనిబడి వచ్చేం. ఒకసారి మిమ్మల్ని పలకరిద్దాం అనిపించింది’ అన్నారు గజరాజుగారు. భోజనం చేసి వెళ్దురు గాని అని మా సమ్మతి లేకుండానే లోపలికి వెళ్ళిందండి ఆవిడ. ఓ నిమిషం పోయేక ‘మహంతిగారూ, ఒకసారి ఇలా రండి’ అని లోపల్నించి పిలిచేరు. వెళ్ళేను. ‘ఆయనకి ఏమి ఇష్టమో తెలియదు. నాకు నచ్చింది వండుతాను. మీరు నా అన్నదమ్ముడి వంటివారు. బజారు నుంచి మంచి చక్రకేళీ అరటిపళ్ళు ఓ కిలో మడత కాజాలు తీసుకురండి’ అని ఓ వంద కాయితం నా చేతిలో పెట్టేరు.

గజరాజుగారితో ఇప్పుడే వస్తా అని చెప్పి బయటకు వచ్చేను. అరగంటలో ఆవిడ చెప్పిన సామాన్లు తెస్తూ మా ఊరి సాహుకారు కనిపిస్తే మాట్లాడి వచ్చా. వచ్చేటప్పటికి గంట దాటింది. ఆవిడ వంట ఘుమఘుమలు తెలుస్తున్నాయి. చేపల వేపుడు, టమాటా పప్పు, దొండకాయ పెరుగు పచ్చడి.

గజరాజుగారు ముందు గదిలో పేపర్ చదువుకుంటూ కనిపించేరు.

భోజనాలయ్యాయి. మేము బయలుదేరడానికి ముందర గజరాజుగారు, ‘మీరు ఆలోచించుకుని చెప్పండి. వచ్చేవారం మహంతి వస్తాడు. మీ మాటకి నేను గౌరవం ఇస్తాను. మీరు ఎవరితోనైనా మాట్లాడాలంటే మాట్లాడండి’ అని చెప్పేరు.

బయటకి వచ్చేం బస్ ఎక్కి ఊరికి వచ్చేసేం. ఆయన నాతో ఏమీ మాట్లాడలేదు. నేనూ మాట్లాడలేదు.

కవిగారి ఇంటి పక్క ఇల్లు సాంబయ్యది. గజరాజుగారికి దూరపు బంధువు. ఇల్లు ఖాళీగా ఉండేది. సాంబయ్య కుటుంబం కొండెవరంలో పొలాలు కొనుక్కొని, అక్కడే ఇల్లు కట్టుకున్నారు. ఇక్కడకి రావడం తగ్గిపోయింది. మాధవుడి గుడిలో పూజలకో, నూకాలమ్మ సంబరానికో వచ్చినప్పుడు రాత్రి ఉండి పొద్దున్న వెళ్ళడం చేస్తూ ఉంటారు.

గజరాజుగారు కొండెవరం వెళ్ళి సాంబయ్యతో మాట్లాడి రెండు రోజుల్లో ఇల్లు కొనేసేరు. ఈ విషయం కాస్త గుంభనంగా జరిగింది. సాంబయ్య ఇంట్లో ఉన్న సామాను తరలించేడు. మర్నాటి నుంచి ఇల్లు రిపేర్లు, పెయింటు వేయడం అయ్యాయి. ఓ పది పదిహేను రోజుల్లో ఇల్లు కొత్తగా తయారయింది. అందరూ సాంబయ్య ఇంటికి పనులు చేయించేడనే అనుకున్నారు. ఆ ఇల్లు గజరాజుగారి మేడ మీంచి కనిపిస్తూ ఉండేది. ఇప్పుడంటే మధ్యలో ఒకటి రెండు ఇళ్ళు ఎత్తుగా అడ్డు వచ్చేయి కానీ.

అనుకున్నట్టే నేను మండపేట వెళ్ళేనండి. ఆవిడను కలిశాను. ఆవిడ ‘ఆయనకి సరే అలాగే అని చెప్పండి. ఆ మనిషి మీద చూసిన రోజునే నమ్మకం కలిగింది. మా బంధువుల ఇష్టంతో సంబంధం లేదు. వాళ్ళు కొడుకైనా, కూతురైనా మంచో చెడో ఇది కొత్త ప్రయాణం ఆయనకైనా నాకైనా’ అంది.

కొన్నాళ్ళలో ఆవిడ సాంబయ్య ఇంట్లోకి చేరిపోయారు. నేనే ఆవిడకి పనివాళ్ళని ఏర్పాటు చేసేను. ఆవిడ వీధి గుమ్మంలోకి ఒకటి రెండు సార్లు బయటకు వచ్చింది. ఓ రోజు అరుగు మీద నిల్చుని వీధి వంక చూసింది. మళ్ళీ ఆవిడ బయటకు రాలేదు. నన్ను ఆవిడ గుమ్మం దగ్గర చూసి ఎవరో వివరాలు అడిగేరు. తెలుసున్న వాళ్ళ బంధువు, సాయం అడిగితే చేస్తున్నాను అని జవాబు చెప్పేను.

కవిగారు తనకి వచ్చిన ఉత్తరాలకి జవాబులు రాసేరు ఈలోగా. కొత్త రచనలు కూడా పత్రికలకు పంపడానికి తయారుచేసిన కవర్లు కూడా. “ఒరే వీటిని తీసుకెళ్ళి పోస్టు బాక్స్‌లో వేసిరా” అని మహంతిని పంపించేశారు.

కవిగారు చెప్పిన తరువాయి భాగం

గజరాజు నాకు చిన్నప్పుడు స్నేహితుడు. వాడు వ్యవసాయంలో, నేను చదువు, ఉద్యమం, పూర్తి స్థాయి సాహిత్యంలో ఇమిడిపోయేం. భార్య పోయేక ఇంటికి వెళ్ళి పలకరించాను. ఆస్తి పంపకాలు అవీ విని సంబరపడ్డాను. ఒకరోజు కనిపిస్తే మంచి పని చేసేవని మెచ్చుకున్నాను. మరీ ఒంటరిగా ఉండకు, మరీ పెద్దవాడివేమి కాదు. కాస్త లైబ్రరీ పనిలో సాయం చెయ్యి అని సలహా ఇచ్చేను. కవిగారు కబురెట్టండి ఏం కావాలన్నా చేస్తాను అన్నాడు.

మహంతి ద్వారా గేదెల బేరం, మండపేట మళ్ళీ వెళ్ళారని తెలిసింది. సాంబయ్య ఇంటికి రంగులు పడడం గమనించేను. ఓ రోజు వసారాలో పుస్తకం చదువుకుంటున్నాను. గజరాజు ‘నమస్తే కవిగారు’ అని పలకరించి లోపలికి వచ్చేడు. పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని ‘మీతో మాట్లాడాలని వచ్చేను బిజీయా? ఓ సలహా కావాల’న్నాడు. ఇన్నేళ్ళలో ఎప్పుడూ అతను నా సలహా కోసం రాలేదు. ఏమై ఉంటుంది చెప్మా నన్ను అడిగే సలహా అని నేను కొంచెం ఇబ్బందిపడ్డాను. ఏమైనా తీర్థయాత్రలు, దేశాటన లేదా పొరపాటున రాజకీయ రంగప్రవేశం ఏమైనా తలపెట్టేడా అని అనిపించింది. తగినవాడే రాజకీయాలకి, మంచి గౌరవం కులంలో, మోతుబరి, నిజాయతీ మనిషి, అందర్నీ కలుపుకునిపోయే మనిషి, కళ్ళకద్దుకుని టికెట్ ఇస్తారు ఏ పార్టీ అయినా. ‘ఇక్కడ మాట్లాడుకుందామా లోపలికి పోదామా” అన్నాను. లోపలికి వెళ్ళేం. సోఫాలో కూర్చున్నాడు, నేను కుర్చీ దగ్గరకి లాక్కుని కూర్చున్నాను. మా ఇంట్లో బయట కూర్చున్నా, లోపల కూర్చున్నా అంతా ప్రైవసీనే.

టేబుల్ మీద ఉన్న కూజా లోంచి గ్లాసులో నీళ్ళు పోసుకుని ఎత్తిపెట్టి తాగి, గజరాజు ఇలా అన్నాడు: “మీకు తెలుసుకదా చెల్లెమ్మ కోసం దూడలు కొనడానికి మండపేట వెళ్ళేం నేనూ, మహంతీ. సులోచనమ్మ అని ఆవిడ దగ్గర. ఆ మనిషిని చూస్తే మనసు జారిపోయింది. మీకు తెలుసు కదా నాకు స్త్రీ వ్యసనం లేదని. మాయావిడే నా ప్రపంచం. పొలమే నా జీవితంగా ఉన్నాను ఇన్నాళ్ళు. తమ్ముళ్ళు, ఆఖరికి నా కొడుకులు కాస్త అక్కడక్కడ వెసులుబాటు చేసుకున్నా, నాకు ఆ దృష్టి లేదు. నేను, నా భార్య మంచి సంసారం చేసేం. తృప్తే. ఆవిడ పోయేక కాస్త దిగులు ఎక్కువే అయింది ఉప్పూ పులుపూ తిన్న వొళ్ళు.

“సులోచనమ్మ భర్త లేడు. కొడుకూ కూతురూ కుదురుకున్నారు ఎవరి జీవితాల్లో వాళ్ళు. ఆవిడ ఒక్కర్తే. నేనూ అన్నీ పంపకాలు ముగించేసేను. అడిగి చూసేను కలిసి ఉందామా, మనువాడదామా? అని. ఆవిడ మీ ఇష్టం ఎలాగైనా నాకు పర్వాలేదు. మీ గురించి తెలుసు మిగతా జీవితం కలిసి ఉండగలిగితే అంతే చాలు అంది. మా ఊరు వచ్చేస్తారా నేను మీ ఊరు రానా? అని అడిగేను ఆవిడ మీ ఇష్టమే అంది. పిల్లలు ఏమైనా అంటారా అంటే, కొడుకు, కూతుళ్ళు తన జీవితం మీద అధికారం చలాయించేది లేదని, మిగతావాళ్ళతో తనకి అవసరం లేదని చెప్పింది ఆవిడ.

“ఇదీ పరిస్థితి ఏం చెయ్యమంటారు? చిన్నప్పటి స్నేహితుడిగా లోకం చూసిన పెద్దమనిషిగా, కవిగారిగా మిమ్మల్ని అడుగుదాం అనిపించింది ఆవిడలాగే నేనూ అనుకోవచ్చు. తమ్ముళ్ళూ, కొడుకులూ ఏదో అనుకుంటారని ఏమీ లేదు. సాంబయ్యతో మాట్లాడేను, ఇల్లు కొనడానికి ఒప్పందం అయింది. ఆవిడ పేరున కొందామని. రిపేర్లు చేయించి రంగులు వేయించమని చెప్పేను, ఇద్దరం ఇక్కడే ఉందామని” తన నిశ్చయాన్ని చెప్పేడు.

నిశ్చయించుకున్నాక, నేను పెద్దగా చెప్పేదేముంది. తమ్ముళ్ళకి, కొడుకులకి ఓ మాట చెప్పమన్నాను. చెల్లెమ్మకి కూడా. వాళ్ళ అభిప్రాయం అడక్కు. ఇలా చేస్తున్నానని చెప్పు. విడివిడిగా మాట్లాడు అని సలహా చెప్పేను. రెండు రోజులు పోయేక మహంతి చెప్పేడు గజరాజుగారి తమ్ముళ్ళు ఏమీ అనలేదు కానీ, కొడుకులు పెళ్ళి చేసుకోవద్దు, మిగతా మీ ఇష్టం. ఆవిడ మన ఇంటి గడప తొక్కకూడదని అన్నారని. చెల్లెలు నీ ఇష్టం, నేనేం చెప్తాను అందిట.

పదిహేను రోజుల్లో ఆవిడ మా పక్కింట్లోకి వచ్చింది. ఒక్కర్తే వచ్చింది. పెద్దగా సామాన్లు ఏమీ తెచ్చుకున్నట్లు లేదు.ఆవిడకి సాయానికి పనిమనిషిని మహంతి కుదిర్చి పెట్టాడు. వచ్చిందని తెలియడమే తప్ప, ఆమె కనిపించలేదు. మహంతి చెప్పడమే. ఆమె ఎలా ఉంటుందో తెలియదు. పక్క ఇల్లే అయినా గొంతు కూడా ఎప్పుడూ వినలేదు. మా కాంపౌండ్ గోడ, వాళ్ళ ఇల్లు దూరంగా ఉండడం ఒక్కటే కారణం కాదు. ఆమె గొంతు నెమ్మది. వీధిలోకి ఉన్న కిటికీ ఎప్పుడూ మూసి ఉండేది. గేట్ చప్పుడు అప్పుడప్పుడు వినిపించేది నేను నా రాత బల్ల దగ్గర నిశ్శబ్దంగా రాసుకునేటప్పుడు.

ఉత్తరాలు పోస్ట్ చేసి, కవిగారికి చుట్టలకట్ట పట్టుకొచ్చేడు మహంతి. వస్తూ వస్తూ మరిన్ని ఉత్తరాలు, కొత్త కవిత్వం పుస్తకాలూ తెచ్చేడు. కవిగారు మాటలాపేసి, ఉత్తరాలు చదువుకోవడం, వివిధ ప్రాంతాలనుంచి కవులు పంపిన పుస్తకాలు తెరచి చూసేరు. గ్లాసులో నాకు మంచినీళ్ళు పోసి, ఆయనో గ్లాసులో పోసుకుని తాగి, మహంతితో “ఆవిడ వచ్చేక ఏమి జరిగిందో చెప్పు” అన్నారు.

మహంతి ద్వారా విన్న గజరాజుగారి కొత్త దినచర్య

సులోచనమ్మగారు వచ్చేరు. మహంతే పనిమనిషిని కుదిర్చి పెట్టేడు. ఆవిడ రావడానికి ముందరే, ఉప్పులు, పప్పులు, బియ్యం వగైరా ఇంటికి కావాల్సినవన్నీ సమకూర్చి పెట్టేరు. ఆవిడ వచ్చిన ఐదారు రోజులలో, దసరా పండగ నాడు గజరాజుగారు మొదటిసారి మధ్యాహ్నం భోజనం చేసి నడుచుకుంటూ ఆయన మేడ దగ్గరనుంచి ఈవిడ ఇంటికి వచ్చేరు. గేట్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళేరు. పనిమనిషి తలుపు తీసింది. హాల్లో వాలుకుర్చీలో కూర్చున్నారు. పనిమనిషి బయటకు వెళ్ళిపోయింది.

కాస్సేపు మాట్లాడి, గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకున్నారు ఇంకో గంట పోయేక లేచి, కాఫీ తాగి, చుట్ట కాల్చుకుని వెళ్ళిపోయేరు. ఆ రోజు మొదలు అదే దినచర్య. ఇంట్లో భోజనం చేసి రావడం, మధ్యాహ్నం నిద్ర, కాఫీ తాగి వెళ్ళడం. కొన్నాళ్ళు పోయేక రాత్రి భోజనం చేసి వచ్చి పొద్దున్నే ఇంటికి వెళ్ళడం అలవాటయ్యింది.

ఇంట్లో భోజనం అంటే, చెల్లెలి చేతి వంట. ఇద్దరూ కలిసి కూర్చుని తినేవారు. కొడుకులూ కోడళ్ళు, తమ్ముళ్ళ పిల్లలు, కుటుంబాలు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు కనిపిస్తూనే ఉన్నారు. వరసగా కొడుకులకి, తమ్ముళ్ళ పిల్లలకి సంసారాలు పెరిగి కుటుంబాలు పెద్దవయ్యేయి. చూస్తూ చూస్తుండగానే ఇంటినిండా మనవలు. స్కూల్‌కి పోయే వయసులు వచ్చేసేయి.

కవిగారు చెప్పినట్టు సాయంకాలాలు లైబ్రరీ దగ్గర గజరాజుగారు కనిపించడం ప్రారంభించేరు. సభలకి సమావేశాలకి ఏర్పాట్లు చేయడంతో బాటు, కాస్త పెద్దరికం కూడా అందుకున్నారు. ఎవరో ఒక మనవడు ఆయనతో కనిపించేవాడు. కానీ, ఈ ఇంటికి మాత్రం ఆయనొక్కడే రావడం, పోవడం. అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి కాకినాడ కారు కట్టించుకుని వెళ్ళి వచ్చేవారు. ఆమెను చూడ్డానికి కొడుకు కానీ కూతురు కానీ ఎప్పుడూ రాలేదు. ఎప్పుడైనా పనిమనిషిని తోడు తీసుకుని మాధవుడి గుడికో, శివరాత్రి నాడు పాదగయకో వెళ్ళడం మినహా ఆమె బయటకి వెళ్ళేది కాదు.

చూస్తుండగానే గజరాజుగారి మనవలు చదువులు ముగించుకుని, పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. అవసరాల కోసం మేడమీద గదులు వేసుకున్నారు, కలిసి ఉన్నారు, వేర్లు పడ్డారు. ఏ పెళ్ళికీ సులోచనమ్మ వెళ్ళలేదు. ఆ ఇంటినుంచి ఈ ఇంటికి గజరాజుగారు తప్ప ఎవరూ ఎప్పుడూ రాలేదు. ఆయన చెల్లెలు మరణించినప్పుడు అన్నీ ముగిసేదాకా ఆయన ఈ ఇంటికి రాలేదు. తర్వాత అన్ని వేళలా భోజనం ఇక్కడే. తెల్లారేక స్నానానికి ఆ ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి వచ్చి, కునుకు తీసి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి, సాయంత్రం బయట పనులు చూసుకుని రాత్రి భోజనం, నిద్రా ఇక్కడే.

కవిగారి ద్వారా విన్న గజరాజుగారి మరణానంతరం

లైబ్రరీకి కొత్త సదుపాయాలు కల్పించాలని, పుస్తకాలూ, కంప్యూటర్లు కొనాలని, ఆడిటోరియం కట్టాలని నలుగుతూ ఉన్న పని గజరాజుగారి చొరవతో ఊపందుకుంది. గవర్నమెంట్ గ్రాంట్ కోసం హైదరాబాద్ వెళ్ళి గ్రాంట్ సంపాదించి వచ్చిన గజరాజుగారు పొద్దున్న నిద్ర లేచి స్నానానికి ఇంటికి వెళ్ళి అలసట తీరడానికి నడుం వాల్చిన మనిషి మరి లేవలేదు. ఎవరూ ఆయన్ని గమనించలేదు. పన్నెండు గంటల ప్రాంతంలో కొడుకు యథాలాపంగా చూసి ఊరికెళ్ళివచ్చి అలసిపోయినట్లున్నారని గది లోపలికి వెళ్ళకుండానే తలుపు కాస్త దగ్గరగా వేసి మెట్లు దిగి కిందకి వెళ్ళిపోయేడు. రెండయ్యింది ఆయన గదిలోంచి రాలేదు. బయటకు వెళ్ళలేదు. భోజనానికి కూర్చుంటూ కొడుకు తండ్రి గదిలోకి వెళ్ళేడు. నాన్నా అని పిలిచేడు. తట్టి లేపేడు. శరీరం చల్లగా తగిలింది. కిందకొచ్చేడు. భార్యకి చెప్పేడు. మోటార్ సైకిల్ మీద ఇంటి దగ్గరలోని డాక్టర్ దగ్గరకి వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చేడు. ఆయన చూసి చాలా సేపయ్యింది పోయి అని తేల్చి చెప్పాడు.

సులోచనమ్మ ఆయనకోసం చూస్తూ ఉంది. పనిమనిషి గేట్ దగ్గరకి వచ్చి ఆయన వచ్చే దోవ చూస్తోంది. హఠాత్తుగా ఆ ఇంటిదగ్గర హడావుడి కనిపించింది. లోపలికి వెళ్ళి చెప్పింది. పనిమనిషి ఆ ఇంటికేసి నడుస్తుంటే,ఆ ఇంటి పాలికాపు ఎదురయ్యేడు. అయ్యగారు పోయేరు అని చెప్పేడు. ఆమె వెనక్కి తిరిగి వచ్చేసింది. సులోచనమ్మ విన్న మనిషి విన్నట్టుగానే కుప్పకూలిపోయింది. నీళ్ళు జల్లి కాస్త తెప్పరిల్లేక పనిమనిషి కూర్చోబెట్టింది. మాట లేదు, ఏడుపు లేదు, మనిషి పాలిపోయినట్టు అయిపోయింది.

పనిమనిషిని మహంతిని పిలుచుకు రమ్మంది. మహంతి వచ్చేడు. అప్పటికే మహంతికి విషయం తెలుసు. “నేను ఆ ఇంటి గడప తొక్కలేదు ఇన్నేళ్ళు. ఇప్పుడు ఆయన్ను చూడాలి ఎలా? నువ్వు కనుక్కురా బాబూ” అని అడిగింది.

మహంతి నేరుగా వెళ్ళాడు, అప్పటికి గజరాజుగారిని హాల్లో పడుకోపెట్టేరు. ఇంటి బయట షామియానా వేసేరు. జనం వస్తున్నారు. కోడలు, తమ్ముళ్ళ భార్యలూ ఆయన దగ్గర కూర్చున్నారు. కొడుకు ఎవరితోటో మాట్లాడుతున్నాడు. తమ్ముడు పనులు పురమాయిస్తున్నాడు. కొడుకుని పక్కకి పిలిచేడు. ఎలా జరిగిందో అడిగేడు తెలుసుకున్నాడు. సులోచనమ్మగారు బాబుగారిని చూడడానికి వస్తానన్నారని చెప్పేడు.

‘ఆవిడకి ఇక్కడేం పని. ఆయన పోయేరు. ఇన్నేళ్ళుగా అక్కడే ఉన్నారు కదా. మా తండ్రి కార్యం మా కుటుంబంతో చేసుకోనివ్వండి. ఆవిడకి ఏం సంబంధం’ అని కొంచెం స్పష్టంగా చెప్పేడు. మహంతి ‘తప్పు బాబూ, ఇరవై ఏళ్ళ పైనించి ఆయన ఆవిడతో కలిసే ఉన్నాడు. అంతెందుకు పొద్దున్న దాకా ఆవిడతో ఉన్న మనిషి’ అని నచ్చచెప్పేడు. మా బాబయ్యలతోటి మాట్లాడి చెప్తానన్నడు కొడుకు. కూర్చోండి అని అక్కడ నుంచి వెళ్ళిపోయేడు. మహంతి అక్కడే కూర్చున్నాడు. కోడలూ, మిగతా స్త్రీలూ మహంతికేసి వింతగా చూస్తూ ఉన్నారు.

కాస్సేపటికి కొడుకూ, తమ్ముడూ వచ్చేరు. ‘ఆవిడకి మా కుటుంబంతో సంబంధం లేదు. ఊర్లో మనుషులు వచ్చినట్టు ఆవిడ కూడా వచ్చి దణ్ణం పెట్టుకు వెళ్తానంటే మాకేమీ అభ్యంతరం లేదు. ఇక్కడ శోకన్నాలు పెట్టడం, మీద పడి ఏడవడం లాంటివి కుదరవు. ఈయన ఆవిడ మొగుడూ కాదు ఆవిడ ఈయన పెళ్ళామూ కాదు. ఇప్పుడొస్తే వచ్చి వెళ్ళిపొమ్మనండి సాయంత్రానికి జనం ఎక్కువ అవుతారు. మాకు బావుండదు. ఎవరైనా అడిగితే మేము సిగ్గుపడాలి’ అని తేల్చి చెప్పేరు. కొంతమంది బంధువులు రావాలి కాబట్టి పొద్దున్నే కార్యక్రమం అని చెప్పేరు.

మహంతి వెనక్కి వచ్చి చెప్పేడు. ఒక్క ఐదు నిమిషాలు ఆయనతో ఉండే అవకాశం ఇమ్మని మళ్ళీ కబురుపెట్టింది. కుదరదు అని బదులు ఇచ్చేరు.

సరే వస్తున్నానని చెప్పి, ముఖం కడుక్కుని, తెల్ల చీర కట్టుకుని మహంతి, పనిమనిషి తోడుతో వంద అడుగుల దూరంలో ఉన్న గజరాజుగారి ఇంటికి నడిచింది. ఎత్తైన అరుగుల ఇంటి పది మెట్లూ ఎక్కి హాల్లోకి ప్రవేశించింది. పొద్దున్న కాఫీ తాగి ఇంట్లోంచి బయటకు వచ్చిన మనిషి అలాగే నిశ్చలంగా చాప మీద పడుకుని ఉన్నారు. పాదాలు చాప బయటకి వచ్చేయి. తలకింద సన్నటి దిండు. తల దగ్గర చిన్నగా వెలుగుతూ దీపం. రెండు చేతులూ సాచి దణ్ణం పెట్టుకుంది. చేతులు వదులు చేసి ముఖం కప్పుకుంది. కళ్ళు మూసుకుని ఒక్క క్షణం నిల్చుంది. అక్కడ ఎవరు ఉన్నారో, ఎవరు లేరో ఆవిడ గమనించలేదు. ఆవిడ, గజరాజుగారే! పొద్దుటి కాఫీ పొలమారింది. వెనక్కి తిరిగి నడిచింది. గుమ్మం దాటి మెట్లు దిగుతూ ఒకసారి వెనక్కి తిరిగి దణ్ణం పెట్టింది. ఎదురుగా గజరాజుగారి మనవడు అచ్చం తాతలాగే కనిపించేడు. ఓ క్షణం బిత్తరపోయింది.తేరుకుని తిరిగి నడిచి ఇంటికి వచ్చేసింది. స్నానం చేసి దీపం వెలిగించింది. భోజనం చేసి పడుకుంది. నిద్ర పట్టేసింది. తెల్లారేదాకా పడుకుంది. పొద్దున్న లేచి కాఫీ పెట్టుకుని తాగింది. మహంతి పదకొండు గంటలకు వచ్చి కార్యక్రమం ముగిసింది అని చెప్పేడు.

ఐదోనాడు సాయంత్రం అవుతుంటే గేట్ చప్పుడయింది. పనిమనిషి తలుపు తీసింది. గజరాజుగారి పెద్ద కొడుకు, మనవడు వచ్చేరు. లోపల హాల్లో కూర్చోపెట్టింది. ఉన్న రెండు కుర్చీల్లో ఇద్దరూ కూర్చున్నారు. ఇల్లు చల్లగా ఉంది. తెల్లటి గోడలు, గోడ మీద గజరాజుగారి ఫోటో దండతో. ఓ మూల చిన్న టేబుల్ మీద నైట్‌లాంప్. ఓ పక్కగా వంటిల్లు కామోసు. మరో పక్క పడక గది. పొడుగ్గా హాలు.

పనిమనిషి ఇద్దరికీ మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. గదిలోంచి ఒక కుర్చీ తెచ్చి ఎదురుగా వేసింది. సులోచనమ్మ తెల్ల చీరలో నెమ్మదిగా గదిలోంచి వచ్చింది. నమస్కారం చేసింది. కొడుకు తన వయసే ఉంటాడు అనుకుంది. మనవడు అచ్చం తాత పోలిక.

ఇద్దరూ లేచి నుంచొని ప్రతి నమస్కారం చేసేరు. కూర్చోండి అని చెప్తూ ఆవిడ కూడా కూర్చుంది. తండ్రీ కొడుకు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు.

“నాన్న పోవడం బాధగా ఉంది. పొలం పనులు, డబ్బు విషయాలు, కుటుంబ విషయాల్లోనూ ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. పెద్ద దిక్కులా ఆయన లేకుండా ముందున్న కాలం తలుచుకుంటే కష్టంగానే ఉంది” అని ప్రారంభించేడు. తండ్రి మాట్లాడుతూ ఉంటే కొడుకు ఇబ్బందిగా కదుల్తున్నాడు. ఆయన కేసి ఆవిడ కేసి చూపు మరులుస్తూ ఉన్నాడు. తండ్రి కుటుంబం గురించి, తన చిన్నప్పటి వివరాలు మాట్లాడడం కొడుక్కి నచ్చలేదు. ఇవన్నీ ఆవిడకెందుకు? వచ్చిన పని ముగించక అన్నట్టు తండ్రికి సంజ్ఞ చేసేడు.

“ఏం చేస్తాం. ఇప్పుడు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చేను. మా నాన్న ఈ ఇల్లు సాంబయ్య దగ్గర కొన్నారు. కొని మిమ్మల్ని ఇక్కడ వుంచేరు. ఆయన వాటా పొలం, ఈ ఇల్లు, పెద్దింట్లో వాటా పంపకాల విషయంలో చాలా మల్లగుల్లాలు పడ్డాం. ఆయన పోయేక మీకు ఇక్కడ ఏమీ సంబంధం లేదు కదా, మీరు వచ్చిన చోటికే వెళ్ళిపోతారు కదా! నాకు మా ఇంట్లో వాటా సరిపోతుంది. మా అబ్బాయి కాకినాడలో ఉద్యోగం అక్కడే ఇల్లు కట్టుకొంటున్నాడు. ఈ ఇల్లు అమ్మకానికి పెట్టేద్దామని తీర్మానించేము. మీరు దినాలు ముగిసేలోగా వెళ్ళిపోవచ్చు. మీ సామాన్లు తరలించడానికి కావాల్సిన సాయం చేస్తాను. మీ అమ్మాయి దగ్గరకి వెళ్తారా? అబ్బాయి దగ్గరకా? ఇంకెక్కడికైనా వెళ్తారా?

“ఇన్నాళ్ళు మా నాన్న బాగోగులు చూసుకున్నారు ఆయనకి కావాల్సిన మనిషిగా. రెండు లక్షలు మీకోసం ఇస్తాను. మీరు ఎక్కడ ఉంటే అక్కడ సుఖంగా ఉండేటట్టు చూసుకోండి. రేపు కబురు పెట్టండి ఎప్పుడు మీ ప్రయాణమో, సామాను తరలించడంలో నా సాయం ఏం కావాలో కూడా. ఈ ఇంట్లో ఉన్న అన్ని వస్తువులూ మీరు తీసుకెళ్ళచ్చు” అని ముగించేడు.

ఆవిడకి మాట్లాడే అవకాశం లేకుండా తండ్రి, కొడుకు లేచి “నమస్తే వస్తాం” అని కదిలారు.

వాళ్ళు వెళ్ళేరు ఆవిడ కుర్చీలో కుప్పకూలిపోయింది. మాట్లాడడానికి ఏవుంది. పనిమనిషి మంచినీళ్ళిచ్చింది. కొంతసేపు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. సాయంత్రం మహంతి ఆవిడ్ని చూడడానికి వెళ్ళేడు. ఆవిడ జరిగింది చెప్పింది.

“ఎక్కడికి వెళ్ళడం? ఎవరు ఎక్కడున్నారో? నాకు ఇరవై ఏళ్ళ నుంచి ఇదే ఊరు, ఇదే ఇల్లు. ఏ ఊరు వెళ్ళాలి, ఎవరి దగ్గరికి? ఎవరు నా వాళ్ళు, అన్నీ వదులుకునే వచ్చేను కదా! మండపేట మళ్ళీ వెళ్తే ఎక్కడ ఉంటాను? ఓపిక ఉన్నంతవరకు సరే తర్వాత?”

“ఇందాకా పెద్దకొడుకు కనిపించేడు. మీతో మాట్లాడానని, మీ మనవరాలు (కూతురు కూతురు) మండపేటలో ఉందని, అక్కడికి వెళ్ళచ్చు కదా” అని చెప్పేడు మహంతి.

“నేను ఈ ఊర్లో ఉండడం ఇష్టం లేదా? ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేదా? నాకు ఇక్కడేం పని అని కదా ప్రశ్న!”

కాస్సేపు అంతా నిశ్శబ్ధం!

కూడదీసుకుని ఆవిడ అంది. “మనవరాలు నెత్తిన పెట్టుకుంటుందా? అందరూ అడుగుతారు, ఎలా ఉన్నావని? ఎలా ఉన్నాను, నాదీ అదే ప్రశ్న! అన్నీ వదులుకుని వచ్చేను. అన్నీ వదులుకుని మళ్ళీ ఎక్కడికి?”

ఎవరు కబురు పెట్టేరో ఎవరు పిలిపించేరో తెలియదు. మనవరాలు వచ్చింది. తనతో వచ్చేయమని బతిమాలింది. ప్రత్యేకంగా ఉండడానికి ఏర్పాటు చేస్తానంది. నీ బాగోగులు నేను చూసుకుంటాను. నా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయేయి. నేనూ మా ఆయనే ఉంటున్నాం. మాతో ఉండు అని ప్రాధేయపడింది.

గజరాజుగారు పోయిన తొమ్మిదవనాడు సులోచనమ్మ ఊరు విడిచి వెళ్ళిపోయింది.

పెద్ద దినం అయిన మర్నాడు ఇల్లు టైప్ ఇన్‌స్టిట్యూట్ మార్తండం 25 లక్షలకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తర్వాత మహంతితో మనవరాలికి లక్ష చేతికిచ్చి సులోచనమ్మని పంపేరని, తన కొడుకు అత్తారు తమ పలుకుబడి ఉపయోగించేరని గజరాజుగారి కొడుకు చెప్పేడు.

నెల రోజుల్లో ఇల్లు పడగొట్టి మార్తాండం కొత్త ఇంటికి పిల్లర్లు లేపేడు.