బిడ్డకొచ్చిన కష్టంతో కుంగిపోయి వున్న కమలాంబాళ్ తనేం చేస్తున్నాననే స్పృహ లేకుండా, యింటి ముందుకెళ్ళి, ఆ మందులోడితో తన గోడు వెల్లబోసుకుంది. వాడు ఆమెకు కొంచెం విబూతి, కొన్ని మందు ఆకులు యిస్తూ చెప్పాడు. “విబూతి నుదుటిన రాయి. ఆకుపసురు చేతికి పూయి. కనికట్టు వేసినట్టు అంతా మాయమయిపోతుంది. కలత చెందకు అమ్మన్నీ, పళని స్వామి నిన్ను పరిరక్షిస్తాడు.”

పిన్ని కూతురు రేవతికి పన్నుమీద పన్ను ఎక్కింది. దొంతర పన్ను అంటారట! అది నవ్వితే భలే అందంగా ఉంటుంది. నిజానికి అందంగా కనబడకూడదుగా! అందరూ ఒకలాగ ఉండి ఒకళ్ళు వేరేగా కనబడితే దాన్ని గొప్పగా బాగుందనుకుంటాం కాబోలు! అది నవ్వితే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది!

కొన్ని సెకన్లు రెస్టారెంటంతా నిశ్శబ్దంగా అయింది. అతని వైపు చూస్తూన్న అందరి కళ్ళూ ఆమెవైపు తిరిగాయి. ఆమె తలవంచుకుని మొహం దాచుకోవడంతో తలలు తిప్పుకున్నారు. ఆమెకు మరింత ఇబ్బంది కలిగించకూడదన్న సామూహిక ఒప్పందానికి వచ్చినట్టు ఏం జరగలేదన్నట్టు అందరూ తమ మాటలు కొనసాగించారు. పిల్లలు ‘దట్స్ మీన్!’ ‘హౌ రూడ్!’ అని గుసగుసలుగా అంటున్నారు.

“చూసినావురా శేషు, కప్ప దొరకాలని పాములు కోరుకుంటాయి. తప్పించుకోవాలని కప్పలు కోరుకుంటాయి. తప్పించుకోవడం, దొరికించుకోవడం అనేది వాటికున్న ఒడుపు వల్ల వస్తది. పాము ఒడుపుతో ఇంకో కప్పని దొరికించుకోవచ్చు. కప్ప చురుగ్గా లేనిరోజు ఇంకో పాము నోట్లో పడొచ్చు. సంతోషించు, నీ చిత్తం ఏంటో తెల్సి చేసిందో తెలీక చేసిందో కరుణమ్మ, తెలిసుంటే ఈ డబ్బులు కూడా దక్కేవి కావు.”

క్రితం నెల దాదాపు పదహారు పదిహేడేళ్ళ తరువాత నా పుట్టింటి వాళ్ళనందరినీ కలిశాను. అందరూ బాగా ఆదరించారు. రఫీ గురించి, ఆకాశ్ గురించీ వాళ్ళు రాలేదేమనీ అడిగారు. రఫీతో కాపురంలో పుట్టింటివాళ్ళను నేను పెద్దగా మిస్సవలేదు కాని, నావాళ్ళ మధ్య ఇన్నేళ్ళ తర్వాత కలిసి కూర్చుని మంచిచెడ్డలు పంచుకుంటుంటే ఎంత బావుండిందో! ఇప్పటికయినా నావాళ్ళు మళ్ళీ నన్ను కలుపుకున్నారని సంబరపడ్డాను.

“నేనుండగా ఒకరిద్దరు రైటర్స్ వచ్చారు. వచ్చిన వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు నాకు తెలిసినా పలకరించలేదు. ఓ ఫ్లవర్ బొకే పెట్టొచ్చేశాను. ఎవరితోనూ మాట్లాడలేదు. చెప్పానుగా, నే వెళ్ళింది నాకోసం. అతనంటే జాలి వుంది. ప్రేమ లేదు. అతన్ని చూశాకా అనూ వచ్చుంటే బావుండేదని నాకూ అనిపించింది. ఎంతైనా కన్న తండ్రికదా? ఇప్పుడు నాకనిపించిన గిల్టే ముందు ముందు అనూకి రావచ్చు అనిపించింది.”

పేషంట్ పొట్టమీద ఆపరేషన్ చేయబోయే చోట చర్మాన్ని సమియా స్టెరిలైజ్ చేసింది. అన్వర్ స్కాల్పెల్ అందుకుని గాటు పెట్టబోతుండగా, అకస్మాత్తుగా బయట పెద్దగా కలకలం వినిపించి అతని చేయి ఆగిపోయింది. గట్టిగా ఏదో అతని వీపు మీద గుచ్చుకుంది. “చేస్తున్న పని ఆపి, ముందు, ఈ కామ్రేడ్ ఛాతీలో దిగిన బులెట్ బయటికి తియ్యి” కర్కశంగా ఆదేశించింది ఒక గొంతు.

ఒకటి అనుకుంటానా, ఇంకేదో గుర్తుకు వస్తుంది. దాంతో మరోటేదో వచ్చేస్తుంది. పరిగెట్టుకెళ్ళి చెప్పకపోతే నా బుర్రలోంచి అది ఎగిరి చక్కాపోతుంది. అవునూ, ఎగిరి ఎక్కడికి వెళ్తుందీ? పిట్టలు ఓ చెట్టు మీంచి మరో చెట్టు మీదికి ఎగిరి కూచుంటాయి. ఒకటా రెండా? ఎన్నో చెట్లు! నా బుర్రలోంచి ఎగిరి బహుశా మరో బుర్రలోకి దూరిపోతుంది కాబోలు! ఒకటా రెండా? ఎన్నో బుర్రలు!

మరియమ్మ ఒడిలో వాడు ఆడుకుంటున్న క్షణాలు అస్సలు నచ్చనివి. మరియమ్మ వాడినే కలవరిస్తా పోయింది. నన్ను కదా ఆమె మొదట పెంచింది. ఏదడిగినా ఇచ్చాను ఆయమ్మైనా కూడా. అయినా వాడినే ఇష్టపడింది, వాడు అమ్మా అనేవాడనా? చివరికి లక్ష్మి కూడా వాడిని నవ్వుతున్న కళ్ళతో చూసేది. ఆ చూపుల్లో ఇష్టం. అది నా జీవితంలోకి కదా వచ్చింది? నావైపు భయంతోనో భక్తితోనో చూసేదే తప్ప ఏవి ఆ ఇష్టపడే కళ్ళు?

నిసి అతని ఆదుర్దా చూసి, ఎవరితని కంపానియన్స్? గ్రిజ్లీ బేర్స్‌ని గాని ఇతడు ఇన్వైట్ చెయ్యలేదు కదా, అనుకుంది. అంతకు ముందే ఆమె హోటల్ వారి వార్నింగులు చదువుకుంది. ఫోర్ సీజన్స్ బైటి రోడ్డు కొంత భాగం మూసివేసినట్టు, అటవీశాఖవారు ఒక ఎలుగుబంటి ఫామిలీ కోసం వెతుకుతున్నట్టు, బైట నడవొద్దని, బేర్ స్ప్రేలు దగ్గర పెట్టుకోమని, న్యూస్ రిలీజ్‌లు ఫాలో అవ్వమని సందేశం.

అర్ధరాత్రి దాటాక డ్యూటీ కాగానే తన గదికి వెళ్ళేవాడు. హోటల్ కేరేజీలో ఉన్న భోజనం తినేవాడు. నిద్రపోయేవాడు. కొన్ని రాత్రుళ్ళు ప్రెస్ క్లబ్‌కో, వేరే ఎక్కడికో వెళ్ళి బాగా తాగి ఏవేవో వాగేవాడు, పెద్దగా ఏవేవో పాడేవాడు. తన మనసు లోలోపల తనకే తెలీకుండా పేరుకున్న సున్నితమైన కోరికలను, ఆశలను మద్యంతో కడిగి బయటకు పంపుతున్నట్టు ఉండేది ఈ తాగుడు తంతు. కాని, శరీరాన్ని మోసం చెయ్యడం వీలయ్యేది కాదు.

ఈ కవర్ నా ముందు లేకపోతే అతను నా జీవితంలో ఉన్నాడని గుర్తులేనట్లు గడిపేదాన్ని. అది బావుండేది. ఆ కవర్ గుడారంలోకి తలదూర్చిన ఒంటెలా టేబుల్ మీద వెక్కిరిస్తుంది. వచ్చి వారమైంది. చిరాగ్గా ఉంది. ఏడేళ్ళ తరువాత రామలక్ష్మి రాసిన ఉత్తరం. ‘మధూ, నా పరిస్థితేమి బాగాలేదు. నీతో మాట్లాడాలి. ఇప్పుడు స్థిరంగా నమ్మగలిగే వ్యక్తులు ఎవరూ లేరిక్కడ. ఒక్కసారి రా.’

యుద్ధం మొదలైన తొలి రోజుల్లో తన ప్రేమ కరీమ్‌తో యూనివర్సిటీలో ఎలా మొదలైందో నాకు గుర్తుంది. ఆ రోజుల్లో ఇబ్తిసామ్ ఎంతగా మారిపోయిందంటే, ఈ కొత్త పిల్ల అప్పుడే నా కళ్ళ ముందే పుట్టి పెరిగిందనిపించేది. ఆమె కళ్ళు, స్వరం, శరీరం పూర్తిగా స్త్రీత్వాన్ని సంతరించుకున్నాయి. నీలి రంగు జీన్స్ మీద, తెల్ల షర్టు, భుజాల మీదుగా వేలాడేసుకున్న నల్ల కార్డిగన్ వేసుకుని తిరిగే ఇబ్తిసామ్ నాకింకా కళ్ళ ముందే మెదులుతోంది.

మనుషులు మాటలకి, చిన్నపాటి ఈగో తృప్తికే వారిని వారు గొప్పవాళ్ళుగా బలవంతులుగా ఎలా అనుకుంటారో, వీళ్ళింత బలహీనులేంటి అనిపిస్తది నాకు. ఇవన్నీ అనుకొని చేసిందా లేకా అనుకోకుండా చేసిందా అన్నదాన్లో నాకెలాంటి అనుమానం లేదు. ఇన్నీ జరిగాకా సంతోష్ నస్రీన్ కోసం పనిచేయడానికి రత్నాన్ని పక్కన పెట్టడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టలేదు.

అతను ఆ సంఘటనని కవితాత్మకంగా కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తున్నాడు. ‘అతను పేలిపోయాడు’ అనే పదప్రయోగం ఇంతకుముందు ఎక్కడా వినలేదు నేను. బహుశా ఇది యుద్ధ పరిభాష అయి ఉండాలి. సందేహం లేదు, ఇది యుద్ధ భాషే. అతను చెప్తూ ఉంటే, ఆ సంఘటన నా కళ్ళ ముందే జరిగినట్టు, నేను అప్పుడు అక్కడే ఉన్నట్టుగా, అదంతా స్లో మోషన్‌లో జరిగినట్టు నా కళ్ళముందే కనిపిస్తోంది.

ఆనందుడు నవ్వుతూ చెప్పాడు, “పిచ్చివాడా, ‘బుద్ధేర్లోకానతస్త్రాతుమితి స్థితోస్మి’ ఆయనే చెప్పారన్నావుగా? మనకి ఈ ప్రపంచంలో తగులుకున్న భవరోగానికి దారి చూపించే భగవానుడికి గృహస్థు ఇంటికి దగ్గిర దారి ఎటువైపు ఉందో తెలియకపోవడమేమిటి? నీ కోసమే అటువైపు కావాలని, నేను మరొకర్ని తోడు పంపిస్తానన్నా వద్దని, ఒక్కడూ వచ్చాడు. నీ అదృష్టం ఏమని చెప్పేది?”

ఎక్కిన వాళ్ళందరూ ఆ రైలు వాళ్ళదే అనుకుంటారు. వాళ్ళకే కాదు వాళ్ళ సామాన్లు పెట్టుకోడానికి స్థలం కోసం కొట్లాడతారు. కొంచెం స్థిరపడ్డాక కొత్తవాళ్ళు ఎక్కితే, మేము ముందే ఎక్కాం, రైలు మాది అని ఏదో అధికారం చూపే చూపులతో కాల్చేస్తారు. దిగేటప్పుడు ఒక్క నిమిషంలో అప్పటిదాకా వాళ్ళతో ప్రయాణించిన వాళ్ళందరిని ఒక్క క్షణంలో వదిలేసి గమ్యం వచ్చిందని ఆనందంగా వెళ్ళిపోతారు.

వచ్చినట్టే వెళ్ళిపోయింది, తన పన్నెండో ఏట, మొన్నటి ప్రేమికుల రోజున, ఎవరో పిలిచినట్టు, వచ్చిన కారణానికి పోయే ముహూర్తానికి లంకె ఏదో ఉందని తెలుపడానికి అన్నట్టు. ఆ అమ్మాయి తన స్నేహితుడితో మాట్లాడుతూ అంది, “మనవాళ్ళు చచ్చిపోవడం నన్ను పెద్ద ఇబ్బంది పెట్టే విషయమేమి కాదు ఇపుడు. సమయం వస్తే వెళ్ళిపోతారు కదా. కానీ ఇదే ఎందుకో కొత్త లోతుతో గుచ్చుకుంటోంది” అని.

“అమ్మమ్మా! నీకు తాతయ్య అంటే కోపమా?”

“అదేం లేదురా. మీ తాతయ్యకి నా స్వభావాన్ని అర్థం చేసుకొనే అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు. ఆయన స్వభావంలో ఇమిడిపోతూ వచ్చా అనేక భయాల కారణంగా.”

“అంత భయం ఉన్నదానివి రేపు అంత పెద్ద అబద్ధం ఆడటం ఏంటి అమ్మమ్మా! అదీ నువ్వు పూజించే దేవుడి ఎదురుగా. దేవుణ్ణి మోసం చేయడం కదా అది!”

ఆయన ఆరోజు రాత్రి మూవీ చూడాలన్నాడు. పెద్దగా సినిమాలు చూడడు, ఏమయిందో మరి? ప్లే చేశాను. గుజారిష్. అక్కడేముందో మన జీవితాల్లోనూ అదే, ఏం చూస్తాం? అని తనే మధ్యలో ఆపి ‘నీకు కాలేజి లవ్ స్టోరీ ఏం లేదా?’ అన్నాడు. ‘పూర్తిగా చదివితే ఉండేదేమో’ అన్నాను. ఎందుకో ఆయన వైపు చూడలేదు. ‘ఉండి ఉంటే బాగుండేదా?’ అన్నాడు. ‘ఎవరూ? నాకు చెప్పు?’ నవ్వాడు.