ఇంతకు ముందు ఆమె ఇలా వుండేది కాదు. ఈ రెండు మూడు నెలల నుండే! మనసులో ఆందోళనో, తీరిక చిక్కనివ్వని పనులో, మరింకేమిటో?! అప్పటికీ సహాయానికి దిగాడు. అదే మూకుడు. అదే నూనె. కానీ ఆ ఆలూ వేపుడు ఓసారి కుదిరినట్లు మరింకోసారి కుదరదు. ఎందుకో అర్థంకాదు. పోనీ గిన్నెలు కడిగి పెడదామంటే జిడ్డు వదలలేదంటుంది. తానూ ఆఫీస్ పనితో పాటు మరెన్నో పనులు చక్కబెట్టుకుని వస్తోంది కదా!
Category Archive: కథలు
ఆమెను లేపబోయేంతలో ఏం జరిగిందో అతనికి ముందు అర్థంకాలేదు. బెడ్‌లాంప్ మసక వెలుతురులో నడుచుకుంటూ పోతున్న ఆకారాలు కనిపిస్తున్నాయి. గోడల మీద పొడుగ్గా నీడలు పాకుతూ పోతున్నాయి. కొన్ని పిల్లల నీడలు, కొన్ని వొంగిపోయిన ముసలి నీడలు, భుజాలకు వేలాడుతూ పసిపాపల నీడలు, నెలల నిండు గర్భిణుల నీడలూ. నెత్తిన ఏవో మూటలూ. నివ్వెరపోయి చూస్తూ కూచుండిపోయాడు.
“ఆ వెళ్ళాంలెండి! మరీ అర్ధరాత్రి మూడింటికే లేపి కార్లో కుదేస్తారు. ఏవో కొంపలు మునిగిపోతున్నట్లు అది చూద్దాం ఇది చూద్దాం అంటూ హడావుడి పెడతారు. అయినా ఎక్కడ చూసినా అవే పరాఠాలు, అదే బటర్ చికెన్. ఏ లోకానికెళ్ళినా మీకు మాత్రం మందు పడాల్సిందే. మీ మందు కార్యక్రమం అయ్యేదాకా మేమంతా డిన్నర్ కోసం చూస్తూ చొంగలు కార్చుకోవాల్సిందే. ఎన్నిసార్లు చూళ్ళేదూ?”
నాకోసం ఎవరూ పుట్టినరోజులు జరపలేదు. కేక్ కోయలేదు. కేండిల్స్ వెలిగించి పాటలూ పాడలేదు. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోయాక అద్దం ముందు నిల్చుని చూసుకున్నాను. నా శరీరంలో మార్పులు చూసి నాకు ఆశ్చర్యం వేసింది. నన్ను నేను చూసుకొని మురిసిపోతూ చాలాసేపు నిల్చుని ఉండిపోయాను, ఆ రోజు సాయంత్రం పిన్ని కొట్టిన చెంపదెబ్బ తాలూకు గుర్తు కనిపిస్తూనే ఉన్నా పట్టించుకోకుండా.
వేద పండితుడు ప్లస్ సంస్కృత మాష్టారి కూతురిని పెళ్ళిచేసుకొని తప్పు చేశానని వెయ్యిన్నొక్కోమారు విచారించాడు ప్రద్యుమ్నుడు. ఈ విషయంపై చర్చను పొడిగిస్తే ఆమె వేదాలు, పురాణాలు చెబుతుందేమోనని భయపడ్డాడు కూడా. మొన్నీమధ్యనే ఒకడు దైవదూషణ చేసి బ్రహ్మరాక్షసుడైన కథను చెప్పింది. పైగా వర్క్ ఈజ్ గాడ్ అనీ, పనియే ప్రత్యక్షదైవం అనీ తేల్చిచెప్పింది.
ఉన్నంతసేపు దిగులుగా ఉంటావు. నవ్వితే మాత్రం పిచ్చిదాన్లా నవ్వుతావేమ్మా, అన్నాడు నాన్న. రాత్రి దాదాపు స్పృహపోతూ తలపక్కకి వాలుస్తుంటే ఏవో ఇంజెక్షన్లు పొడిచేరు నాలుగు చోట్ల. ఇవ్వాళ తల ఎంత తేలిగ్గా ఉందో, ఏ పిచ్చి ఆలోచనలు లేకుండా. ఆ ఇంజెక్షన్లేవో రోజూ చేస్తే బాగుండు. రోజూ ఇంజెక్షన్లు కావాలనుకోవడం కంటే పిచ్చి ఆలోచన ఏముంది, అన్నాడు కొడుకు. నాకెందుకో ఇంటికన్నా ఇక్కడే హాయిగా ఉంది.
బయటి చలి వెన్నులో కూడా అనుభవమైంది. అటునుంచి ఎవరూ రావట్లేదని నిర్ధారణ కోసం ఒకసారి చెవిని మళ్ళీ కొంచెం ముందుకు వంచాడు. ఏ అలికిడీ లేదు. చల్లటి నీళ్ళలో అడుగు పెట్టేముందు అనుభవించే క్షణకాలపు తటపటాయింపు. నెమ్మదిగా కుడికాలు మోపాడు. ఏమీ తెలియలేదు. రెండో అడుగు కూడా పడ్డాక మొత్తం మనిషి బరువు పడటం వల్ల చెక్క క్రీక్‌మంది. ఒక క్షణం ఆగి, మళ్ళీ పైకి కదిలాడు.
ఇలాటి వర్షపురోజులు ఎలా గడిచేవి చిన్నప్పుడు?! స్కూలుకి అప్పటికప్పుడు సెలవు ప్రకటించేసేవారు. తడుచుకుంటూ ఇంటికెళ్ళేసరికి అమ్మ అననే అనేది, ‘వర్షం కాస్త తగ్గేక పిల్లల్ని వదలచ్చుకదా’ అంటూ. నీళ్ళోడుతున్న తల తుడిచి, పొడిబట్టలు మార్పించేది. నేను ఇంట్లోకి జాగ్రత్తగా వెళ్ళటం చూసేకే అన్న స్కూల్ బ్యాగ్ గుమ్మంలోంచి లోపలికి విసిరి అమ్మ చేతికి అందకుండా పారిపోయేవాడు. ఆ చిన్ననాటి ప్రేమ ఏమయిపోయింది?
వాడు వచ్చేలోపు స్నానం చేద్దాం అనుకుంది. రెడీగా ఉండి వాడిని సర్ప్రైజ్ చెయ్యొచ్చు. ఒక కాలి చెప్పుని మరో కాలి మడమ సాయంతో తీసి దాని పై అంచుని బొటనవేలితో పైకెత్తి పెండ్యులంలా ఊపి నవ్వుకుంది. ఆపైన కాలితోనే గోడవైపుకు విసిరింది. అది గోడకి కొట్టుకొని నేలమీద పడింది. మరో చెప్పునీ కాలితోనే తీసి విసిరింది. ఒంటిమీదున్న దుస్తులు విప్పి స్నానం చేసి వదులుగా ఉన్న బాత్ రోబ్ తొడుక్కుంది.
ఈ ప్రపంచం ఎంత వింతైనదంటే, ఒకే వీధిలో ఏళ్ళ తరుబడి వుంటూ కూడా పలకరించుకోకుండా, ఎదురైతే కనీసం నవ్వకుండా జీవితాలు గడిపేసేవాళ్ళు ఎందరో?! అందులో ఇతడు పరాయివాడికన్నా ఎక్కువే. అందుకే ఎదురైతే ముభావంగా పక్కకి తప్పుకుని పోయే మేమిద్దరం మాట్లాడుకోవలసి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. కానీ నిన్నటి రోజున అదే జరిగింది.
శ్రావస్తి నగరానికి వెనక్కి వస్తూంటే ఊరి బయట కనిపించిన ఖాళీ స్థలం గురించి వాకబు చేశాడు అనాథపిండకుడు. తనకి తెల్సిన విషయాల ప్రకారం అది కోసల రాజు ప్రసేనజిత్తుకి చెందినది. భగవానుడి కోసం ఒక విహారం నిర్మించడానికి ఈ స్థలం సరిపోతుందనుకుంటే దీన్నిరాజు దగ్గిరనుంచి కొనాలి. తానో వర్తకుణ్ణని తెలిస్తే ఏం ధర చెప్తాడో? తన ప్రయత్నం చేయడం తప్పులేదు కదా.
అతనొచ్చేలోగా స్నానం చేద్దామనుకుని ఒంటిపై కుర్తీ తీసేయబోతూ ఆగిపోయింది. ఎవరో తననే చూస్తూన్న భావన, దానితో కలిగే ఇబ్బంది, అసౌకర్యమూ. రోడ్డు మీద నడుస్తున్నప్పుడూ, అప్పుడప్పుడూ ఆఫీసులోనూ అలవాటయినదే. కానీ ఇది ఇల్లు. ఎవరి జోలీ లేకుండా నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండడానికి అలవాటుపడిన భద్ర ప్రదేశం. ఎందుకలా అనిపించిందో, అనిపిస్తూ ఉందో తేల్చుకోలేకపోయింది.
చిన్నప్పటినుంచీ ఎంతో కలిగిన కుటుంబంలో అల్లారు ముద్దుగా పెరిగి, అమెరికాలో చదువుకోవాలన్న కోరిక తీర్చుకుని, తనకిష్టమైన అబ్బాయిని పెళ్ళి చేసుకుని, జీవితమంతా వడ్డించిన విస్తరిలా బతుకుతున్న రాధ ఇలాంటి వాళ్ళ గురించి అంత సానుభూతి ఎలా చూపగలిగింది? ఆ అమ్మాయిలో ఆ సంస్కారం ఎలా వచ్చింది? తప్పు చేసిన మనుషుల్లో కూడా మంచి ఉంటుందని ఎంత ధీమా తనకు! ఎలా నమ్ముతోంది వీళ్ళని!
సాయంత్రపు ఎండ తలుపుకున్న కిటికీగుండా లోపలికి వచ్చి నా వేలికున్న తొడుగు మీద పడుతున్నది. ఆ ఎండ దానిమీద ప్రతిఫలించి ట్రెయిన్ సీలింగ్ మీద ఓ తెల్లని సీతాకోకచిలుకకు మల్లే కదులుతున్నది. ఈ తొడుగు దేంతో తయారయిందో నాకు తెలియదు గానీ, ఇరవయ్యేడేళ్ళు భూమిలో కప్పడి ఉన్నాకూడా ఇంతబాగా మెరుస్తున్నది. ఇందులో బంగారమో వెండో ఉందేమో.
“మీరెక్కడి మనిషి బాబూ! సినిమా వాళ్ళను ఎవడయినా అలాగే అంటాడు. ఇప్పుడు కొత్తగా వాళ్ళకు మర్యాదలేమిటీ?” చిరాకు అణుచుకుని మళ్ళీ అందుకున్నాడు. “ఆ బాబుగారికి నటనలో ఓనమాలు తెలీవు. మొదటి సినిమా నుంచి ఇప్పటిదాక మొహంలో ఒకటే ఫీలింగ్. వాళ్ళ బాబు దగ్గర డబ్బులుండబట్టి అన్ని సినిమాలు ఫ్లాపయినా ఇంకా సినిమాలు తీస్తూ జనాల్ని చంపుతున్నాడు కానీ బుర్ర ఉన్న వాడెవడూ డైలాగ్ లేని వేషం కూడా ఇవ్వడు.
భారత దేశపు బీద అమ్మాయిలందరిలాగే ఓపికమ్మకు ఓపిక ఎక్కువ. పదిహేనేళ్ళకే పెళ్ళి చేస్తే అప్పటి వరకూ ముక్కూ మొహం తెలియని అత్తవారింటికి వెళ్ళి ఓపికగా ఇంటెడు చాకిరీ చేసింది. కాలక్రమేణా ముగ్గురు మగ పిల్లలు, ఓ ఆడ పిల్ల పుడితే వారందరినీ ఓపికగా సాకింది. ఇంతలో భర్తను గిట్టని వారెవరో జైలు పాలు చేయగా సంసారం కిందపడ్డ గుమ్మడికాయలా ముక్కచెక్కలు కాకుండా ఓపికగా కాచుకుంది.
అప్పటికి రాత్రి ఎనిమిది అయ్యింది. బాక్‌పాక్ లోంచి బట్టలన్నీ తీసి, తను వేసుకున్న ప్యాంటు, టీషర్టూ కూడా తీసేసి చకచకా వాషింగ్ మెషీన్లో పడేశాడు. అతను టీషర్టు తీస్తున్నప్పుడు చూశాను. తెల్లగా కండలు తిరిగిన శరీరం, చంకలకింద జీబురుగా పెరిగిన నల్లటి వెంట్రుకలు, పొట్టమీద పలకల మధ్య డైమ్‌లా మెరుస్తున్న బొడ్డూ, పొడుగాటి తెల్లటి చేతులూ–అతని ఒంటిమీంచి వస్తున్న మొగవాసన. అతని దేహం నన్ను విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఆమె అతని ముంజేతిలో చేయి కలిపి నడవసాగింది. అతను మాటిమాటికీ గొంతు సవరించుకోవడం మొదలెట్టాడు. మనసు వికలం అయినప్పుడల్లా అలా చెయ్యడం అతని అలవాటు. బస్‌స్టాండ్ కిందకు చేరి నిలుచున్నాక అతను గొడుగు ముడిచాడు. ఎదురుగా కొద్దిదూరంలో, గాలికి ఊగుతూ ఆకులనుండి నీళ్ళు రాలుతున్న చెట్టుక్రింద, చిన్న బురదగుంటలో, ఇంకా రెక్కలురాని పక్షిపిల్ల ఒకటి అటూ ఇటూ పొర్లుతోంది బైటకు రాలేక.
ఛైర్మన్ మావ్ అన్నట్లుగానే, ఈ ఉద్యమం (కల్చరల్ రివల్యూషన్) ధ్యేయం కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూనే క్యాపిటలిజం దారి తొక్కుతున్నవాళ్ళనూ, క్యాపిటలిస్టుల్లో రియాక్షనరీలనూ ఏరివేయడం. నాలాంటి సామాన్యులకూ ఈ ఉద్యమానికీ అస్సలు సంబంధం లేదు.
‘చావు వెధవా!’ అని ఇందాక నోరెత్తిన పాపానికి నన్ను నేను లోపలే తిట్టుకుంటూ, బారు వెనక రాజ్యమేలుతున్న చంద్రముఖి కేసి దీనదృక్కొకటి ప్రసరించాను. ఆ కరుణామయి నన్ను కనికరించి, మరో డబుల్ జానీని ప్రసాదించింది. భక్తితో సేవించి, ‘దూధ్‌నాథ్’ నాఁబరగిన పాల తాగుబోతు తివారీ వాచాలత భరించే శక్తి పొందాను. బండి కూత పెట్టి స్టేషను వెడలింది. జానీగాడు నెత్తిన నడయాడుతున్నాడులా ఉంది, తల దిమ్ముగా అనిపిస్తోంది.