నాకున్న కల్పనా సామర్థ్యమంతా, విజిటింగ్ కార్డులని తయారు చెయ్యడంలో చూపిస్తుంటాను. నా ప్రింటింగ్ వర్క్‌లో, నా అడ్రస్ కార్డ్‌లు నేనే తయారుచేసి, ఊళ్ళో నాకు కనపడ్డవాళ్ళందరికీ ఇచ్చాను. వాటికున్న ప్రయోజనాన్ని కూడా విప్పి చెప్పాను. మెల్లిమెల్లిగా మా పేటలోవాళ్ళే కాకుండా, చుట్టుపక్కల పేటల్లోనివాళ్ళు కూడా తమ విజిటింగ్ కార్డ్‌లని నా దగ్గర ప్రింట్ చేయించుకోవడం మొదలుపెట్టారు.

‘ఘర్షణలు ఆ ప్రాంతం పొలిమేరలు దాటలేదు’ అంటే మనుషులు నరుక్కోవడం, ఆస్తులు తగలెట్టడం లాంటివి చుట్టుపక్కల ప్రాంతాలకి పాకలేదు, అని. మరది యంత్రాంగం పనిజేయడం వల్లా లేకపోతే తంత్రాంగం ఊరుకోవడం వల్లా అన్నది తెలీదు; ఎవరికీ, ఎప్పటికీ!

ఆడవాళ్ళ నెత్తిమీద నీళ్ళకుండ ఉంటుంది, ప్రతీదానికి ఏడుస్తూనే ఉంటారు అంటారు మొగాళ్ళు. నిజఁవే. ఆడవాళ్ళకి అలా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. నాకు ఏడుపు రాదు. ఆలోచన ఉన్నవాళ్ళకి ఏడుపు అంత త్వరగా రాదట! మొగవాళ్ళు అందుకే ఏడవరు. బుర్రే పని చేస్తుందట వాళ్ళకి. గుండె కాదు!

గోపాల కామత్ కొట్లో కుప్పన్న బాకీ ఏటికేడాదీ పెరుగుతూ పోయి వెయ్యి దాటేసింది. అప్పుడప్పుడు గోపాల కామత్ పంపే మనిషి కుప్పన్న ఇంటికి పోయి డబ్బు కట్టమని అడగటం అందరికీ తెలుసు. అప్పన్న భట్ట గోపాల్ కొట్లోనే కాదు, మఠం కౌలు కూడా ఏడాది చివర్లో పైసా కూడా బాకీ లేకుండా తీర్చేస్తాడు. మఠం నుంచి కౌలు వసూలుకు వచ్చే మనిషికి అప్పన్న భట్ట ఇంట్లో సకల మర్యాదలూ దక్కుతాయి కూడా.

తులసి అక్క కాలం చేసిందని తెలిసింది. ఏ జబ్బూ లేని, ప్రాణం ఉన్న రాయిలా నిక్షేపంగా ఉండేది. అక్క అంటే దూరపు చుట్టరికమే అయినా, వయసులో అంతరం ఉన్నా మనసుకి దగ్గరే. కొడుకులిద్దరూ ఒకడు ఇంగ్లాండ్ నుండి, మరొకడు అమెరికా నుండి వచ్చేశారట. నాలుగు రోజులైంది. మళ్ళీ దినం రోజు దేనికైనా కుదురుతుందో లేదో. మనసు ఆగక వెంటనే బయలుదేరిపోయాను.

రోషన్‌తో నేను మాట్లాడితే, గులాబ్‌కు నన్ను నరికేయాలనిపిస్తుంది. గులాబ్‌తో మాట్లాడటం ఆయేషాకు నచ్చదు. ఆమెకు ఒక నగ తీసిస్తే, యీమె ఒక నగ పగలగొడుతుంది. ఈమెకు వొక పట్టు రవికె కొనిస్తే, ఆమె ఒక రవికెను చింపేస్తుంది. ఈ విధంగా అన్నిట్లో ఆ ముగ్గురూ పరస్పర విరుద్ధంగా ప్రవర్తిస్తూ నా ప్రాణం తీస్తున్నారు. ఒక సంవత్సరమా, రెండు సంవత్సరాలా, నా జీవితం మొత్తం వీళ్ళ వల్ల నరకమయిపోయింది.

ఇవాళ బామ్మ నోట మరోమాట విన్నా. ‘నువ్వు వెయ్యి చెప్పు, లక్ష చెప్పు. వాడు బుర్రకి ఎక్కించుకోడ్రా!’ అని బుచ్చిబాబుగారితో అన్నాది. బుచ్చిబాబుగారు మూడుమేడల వీధిలో చివారి ఇంట్లో ఉంటారు. బామ్మ దగ్గరికి వచ్చే అందరి లాగానే ఈయనా తన గోడు చెప్పుకోడానికి వస్తూ ఉంటాడు. వాడెవడో బుర్రకు ఎక్కించుకోడట!

మూడురోజుల కుంభవృష్టి తెరపిచ్చింది. సన్నటి జల్లు. రోడ్లన్నీ నీళ్ళల్లోనే మునిగి ఉన్నాయి. రోడ్డుపై ఐదారుగురు మనుషులు మూగి ఉన్నారు. చిట్టితల్లి హడావుడే అయుంటుంది అనుకున్నాను. చిట్టితల్లి కనపడలేదు. నీళ్ళల్లో పడవలు తేలుతున్నాయేమో అని చూశాను. ఇంటిముందు పడవలూ కనిపించలేదు. కనిపించడానికి అక్కడికి ఒక కిలోమీటరు దూరం వెళ్ళాలట.

ఒకానొకప్పుడు ఒక అడవిలో ఒక సరుగుడు చెట్టు వుండేది. మంచి వర్షంతో పాటూ తగినంత సూర్యరశ్మి కూడా ఉండడంతో అది ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ వుండేది. దాని నీడలో పిల్లలు ఆనందంగా ఆడుతూ పాడుతూ వుండేవారు. దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకున్న పక్షులు కిలకిలారావాలు ఆలపించేవి. కొమ్మ నుంచి కొమ్మకు దూకుతూ సరస సల్లాపాలాడే ఉడతల్ని చూస్తే, ఎవరికైనా ఉత్సాహం ఉరకలేస్తుండేది.

పండు అనుకుని ఆంజనేయుడు సూర్యుడి దగ్గరకి ఆకాశంలో ఎగిరి వెళ్ళేడు. మీదికి బాగా లేచేక బాగా వేడెక్కిపోతాడెమో! పొద్దున్నే అంత వేడిగా ఉండడేమోలే! కాస్త కాలితే కాలింది అనుకుందామంటే అందడు కదా! గాలికి పుట్టేడు కాబట్టి ఆంజనేయుడు ఎగిరివెళ్ళేడు. నేనెలా వెళ్తానూ? ఎగరలేనే! ఎలా సూరీడిని రాకుండా చెయ్యాలీ? తెల్లారకుండా ఎలా చెయ్యాలీ?

ఇంటికి ఎవరెవరో వచ్చారు. అటూ ఇటూ హడావిడిగా తిరుగుతున్నారు. బయటికేగాని లోపల ఎవరికీ డాలీని పట్టించుకోవాలని ఉన్నట్లు లేదు. నాకు సంతోషమేసింది, డాలీని నిజంగా ఎవరూ పట్టించుకోవట్లేదు. కానీ డాలీ కూడా ఎవరినీ పట్టించుకోవట్లేదు. ఆడుకొంటున్న పిల్లల దగ్గర ఉంది. ఎవరితో కలవకుండా అందరినీ పరిశీలనగా చూస్తున్నట్లు అనిపించింది. నిజంగానే డాలీ ప్రత్యేకమా?

“మీ ఈ తర్కం తప్పు. గురుదేవులు ఇలాంటి ప్రశ్నలకి జవాబు ఇవ్వద్దని చెప్పారు. ఎవరూ నా ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వడమే లేదు. భార్యని అడిగాను నేనెవర్ని? అని. ఆమె బదులిచ్చింది, నువ్వు నా భర్తవి. పెద్ద కొడుకుని అడిగాను నేనెవర్ని? అని వాడు బదులిచ్చాడు, నువ్వు నాన్నవి. ఆఫీసులో మా మేనేజర్‌ని అడిగాను సార్ నేనెవర్ని? అని. నువ్వు పిచ్చివాడివి, అని ఆయన జవాబు.”

బిడ్డకొచ్చిన కష్టంతో కుంగిపోయి వున్న కమలాంబాళ్ తనేం చేస్తున్నాననే స్పృహ లేకుండా, యింటి ముందుకెళ్ళి, ఆ మందులోడితో తన గోడు వెల్లబోసుకుంది. వాడు ఆమెకు కొంచెం విబూతి, కొన్ని మందు ఆకులు యిస్తూ చెప్పాడు. “విబూతి నుదుటిన రాయి. ఆకుపసురు చేతికి పూయి. కనికట్టు వేసినట్టు అంతా మాయమయిపోతుంది. కలత చెందకు అమ్మన్నీ, పళని స్వామి నిన్ను పరిరక్షిస్తాడు.”

పిన్ని కూతురు రేవతికి పన్నుమీద పన్ను ఎక్కింది. దొంతర పన్ను అంటారట! అది నవ్వితే భలే అందంగా ఉంటుంది. నిజానికి అందంగా కనబడకూడదుగా! అందరూ ఒకలాగ ఉండి ఒకళ్ళు వేరేగా కనబడితే దాన్ని గొప్పగా బాగుందనుకుంటాం కాబోలు! అది నవ్వితే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది!

కొన్ని సెకన్లు రెస్టారెంటంతా నిశ్శబ్దంగా అయింది. అతని వైపు చూస్తూన్న అందరి కళ్ళూ ఆమెవైపు తిరిగాయి. ఆమె తలవంచుకుని మొహం దాచుకోవడంతో తలలు తిప్పుకున్నారు. ఆమెకు మరింత ఇబ్బంది కలిగించకూడదన్న సామూహిక ఒప్పందానికి వచ్చినట్టు ఏం జరగలేదన్నట్టు అందరూ తమ మాటలు కొనసాగించారు. పిల్లలు ‘దట్స్ మీన్!’ ‘హౌ రూడ్!’ అని గుసగుసలుగా అంటున్నారు.

“చూసినావురా శేషు, కప్ప దొరకాలని పాములు కోరుకుంటాయి. తప్పించుకోవాలని కప్పలు కోరుకుంటాయి. తప్పించుకోవడం, దొరికించుకోవడం అనేది వాటికున్న ఒడుపు వల్ల వస్తది. పాము ఒడుపుతో ఇంకో కప్పని దొరికించుకోవచ్చు. కప్ప చురుగ్గా లేనిరోజు ఇంకో పాము నోట్లో పడొచ్చు. సంతోషించు, నీ చిత్తం ఏంటో తెల్సి చేసిందో తెలీక చేసిందో కరుణమ్మ, తెలిసుంటే ఈ డబ్బులు కూడా దక్కేవి కావు.”

క్రితం నెల దాదాపు పదహారు పదిహేడేళ్ళ తరువాత నా పుట్టింటి వాళ్ళనందరినీ కలిశాను. అందరూ బాగా ఆదరించారు. రఫీ గురించి, ఆకాశ్ గురించీ వాళ్ళు రాలేదేమనీ అడిగారు. రఫీతో కాపురంలో పుట్టింటివాళ్ళను నేను పెద్దగా మిస్సవలేదు కాని, నావాళ్ళ మధ్య ఇన్నేళ్ళ తర్వాత కలిసి కూర్చుని మంచిచెడ్డలు పంచుకుంటుంటే ఎంత బావుండిందో! ఇప్పటికయినా నావాళ్ళు మళ్ళీ నన్ను కలుపుకున్నారని సంబరపడ్డాను.

“నేనుండగా ఒకరిద్దరు రైటర్స్ వచ్చారు. వచ్చిన వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు నాకు తెలిసినా పలకరించలేదు. ఓ ఫ్లవర్ బొకే పెట్టొచ్చేశాను. ఎవరితోనూ మాట్లాడలేదు. చెప్పానుగా, నే వెళ్ళింది నాకోసం. అతనంటే జాలి వుంది. ప్రేమ లేదు. అతన్ని చూశాకా అనూ వచ్చుంటే బావుండేదని నాకూ అనిపించింది. ఎంతైనా కన్న తండ్రికదా? ఇప్పుడు నాకనిపించిన గిల్టే ముందు ముందు అనూకి రావచ్చు అనిపించింది.”

పేషంట్ పొట్టమీద ఆపరేషన్ చేయబోయే చోట చర్మాన్ని సమియా స్టెరిలైజ్ చేసింది. అన్వర్ స్కాల్పెల్ అందుకుని గాటు పెట్టబోతుండగా, అకస్మాత్తుగా బయట పెద్దగా కలకలం వినిపించి అతని చేయి ఆగిపోయింది. గట్టిగా ఏదో అతని వీపు మీద గుచ్చుకుంది. “చేస్తున్న పని ఆపి, ముందు, ఈ కామ్రేడ్ ఛాతీలో దిగిన బులెట్ బయటికి తియ్యి” కర్కశంగా ఆదేశించింది ఒక గొంతు.

ఒకటి అనుకుంటానా, ఇంకేదో గుర్తుకు వస్తుంది. దాంతో మరోటేదో వచ్చేస్తుంది. పరిగెట్టుకెళ్ళి చెప్పకపోతే నా బుర్రలోంచి అది ఎగిరి చక్కాపోతుంది. అవునూ, ఎగిరి ఎక్కడికి వెళ్తుందీ? పిట్టలు ఓ చెట్టు మీంచి మరో చెట్టు మీదికి ఎగిరి కూచుంటాయి. ఒకటా రెండా? ఎన్నో చెట్లు! నా బుర్రలోంచి ఎగిరి బహుశా మరో బుర్రలోకి దూరిపోతుంది కాబోలు! ఒకటా రెండా? ఎన్నో బుర్రలు!