పెద్రో

విసుగెత్తుతోంది. ఎన్నిరోజులనీ ఇలా ఇందులో గడపాలి!

టటట్…టటటటట్…టటటట్…టట్. దూరంగా వినిపిస్తున్న మెషీన్‌గన్‌ల వర్షం.

ఇంతలోనే సన్నటి ఈల శబ్దం. ఢాం. ఢాం! ఈ సారి దగ్గిరలోనే పేలినట్టుంది.

పెద్రో ఉలిక్కిపడి నా ముఖంలోకి చూశాడు.

పైనుంచి ఏదో పెద్దదే మా మీద పడినట్టుంది. గది కొంచెం కంపించింది. కప్పునుంచి సన్నగా కాస్త దుమ్ము రాలింది.

“గలీనా… గలీనా ఏమవుతోంది?” ఆందోళనతో నిండిన కీచుగొంతుతో నాన్న అడిగాడు. నాన్నకి ఎనభై రెండేళ్ళు. కాన్సర్. బతకడు. అలాగని చచ్చిపోడు. కళ్ళు కనపడవు. చెవులు కొంచెం వింటాయి. కుర్చీలో కూర్చుంటాడు. కదల్లేడు, మెదల్లేడు.

పెద్రో కుయ్యికుయిమంటున్నాడు. దాదాపు ఇరవై నాలుగంటలయ్యింది బయట నడకకు వెళ్ళి, వాడు కాలకృత్యాలు తీర్చుకుని.

“ఏం అవ్వలేదు నాన్నా!”

“ఊఁ” అని మూలిగాడు నాన్న.

టటటటట్… ఢాం… టటటటటటటటట్…ఢాం. టటటటట్. ఢాం… ఈసారి చప్పుళ్ళు మూడు వైపుల నుంచి వినబడుతున్నాయి.

ఇండిపెండెన్స్ స్క్వేర్ వైపు నుంచి మోతలు ఎక్కువగా వినపడుతున్నాయి.

“గలీనా… ఎక్కడున్నావ్?” నాన్న మళ్ళీ అడుగుతున్నాడు. లేచి ఆయన పక్కనే వున్న చిన్న స్టూల్ మీద కూర్చున్నాను. వణుకుతున్న ఆయన ఎడమ చేయి అందుకున్నాను. నరాలు వుబ్బిన ఆయన వేళ్ళు నా అరచేతిని గట్టిగా పట్టుకున్నాయి. ఆయన భయపడుతున్నాడు.

మొన్న నేను ప్లాజాకి వెచ్చాలు కొనుక్కురావడానికి వెళ్ళినప్పుడు మా అపార్ట్‌మెంట్ బిల్డింగ్ కాన్సియార్జ్ వచ్చింది. నాన్నతో అవీ ఇవీ మాట్లాడి వెళ్ళింది. మాకు దగ్గిరలోనే ఉన్న కుట్జివ్‌ గ్రామాన్ని రష్యన్ దళాలు ఆక్రమించుకున్నాయి అని చెప్పిందట. అంతటితో ఆపితే బాగుండేది. ఇళ్ళళ్ళో ఉన్న స్త్రీలని బలాత్కరించారని చెప్పింది. అని వూరుకున్నా బాగుండేది. ఒంటరి తల్లిని రేప్ చేయబోతున్న రష్యన్ సైనికుడికి ఆవిడకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు అడ్డం పడితే వాడిని కాల్చి చంపి ఆ తల్లిని చెరిచాడట. ఎవరు తోడు లేక తన ఇంటి పెరడులోనే ఆ కన్నకొడుకుని పాతిపెట్టుకుందట ఆ తల్లి. ఆ గ్రామంలో ఎవరిని వదిలి పెట్టలేదంట. అది విన్నప్పటుంచి నాన్న వణికిపోతున్నాడు.

నాన్నకి తెలియనిది ఒకటుంది. మొన్న రష్యన్ టాంకులు ఇంటికి దగ్గరగా ఉన్న ఫ్రీడమ్ ప్లాజా దాకా వచ్చాయి. కానీ మా సైనికుల డ్రోన్‌ ఎటాక్స్ ధాటికి తట్టుకోలేక టాంక్స్‌ని వదిలేసి పారిపొయ్యారు సైనికులు.

పెద్రో సణుగుడు పెద్డదయ్యింది. మా ఒంటి గది బంకర్‌లో అసహనంగా తిరుగుతున్నప్పుడు వాడి గోళ్ళ చప్పుడు సీనారేకుల మీద మేకుల వర్షంలా వినపడుతోంది.

“నాన్నా, పాలు తాగుతావా?” అని అడిగాను.

సగం తాగి “ఇవి పెడ్రోకి పొయ్యి. మళ్ళీ మనకి దొరుకుతాయో లేవో” అంటూ మగ్గు నాకు ఇచ్చాడు. నాన్న ఆలోచన అర్ధం అయ్యింది. ఉన్న సరుకులని సర్దుకోవాలి. పెద్రో అంటే నాన్నకి కూడా ఇష్టం. నా కళ్ళు మసకబారాయి.

“నాన్నా… నేను పెద్రోని వాకింగ్‌కి తీసుకెళ్ళి వస్తాను,” అని అంటుంటే నాన్న విపరీతమైన ఆందోళనతో వద్దంటూ తలని అడ్డంగా వూపాడు. నాన్న చేతిని వదిలించుకుని లేచాను. పెద్రో నా కాళ్ళ చుట్టూ ఒక చుట్టు తిరిగి గదిలో ఒక మూలనున్న లీష్‌ని తీసుకువచ్చి అందించాడు.

లీష్‌ని ఒక చేత్తో పట్టుకుని నేను నెమ్మదిగా చప్పుడు చేయకుండా బంకర్ మెట్లు ఎక్కి సువిశాల ప్రపంచంలోకి అడుగుపెట్టాను. సూర్యుడి వెలుతురు తట్టుకోలేక కళ్ళు ఒక్కసారి మూసుకోవలసి వచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాను. ఒక వైపు పచ్చని ఆకులతో చెట్లు. మరోవైపు కాలిపోయిన మొక్కలు. చచ్చిపడిపోయిన పక్షులు. కాలిన తూటాలు, బాంబుల దుర్గంధంతో నిండిన గాలిని రొమ్ములనిండా పీల్చుకున్నాను. ఎంత బలంగా లీష్‌ని లాగుతున్నా పెద్రో ఆగడం లేదు. వాడు ఇంకా బలంగా నన్ను లాగేస్తున్నాడు. మా అపార్ట్‌మెంట్ బ్లాక్ చివరకి వచ్చాము. ముసలి దంపతులు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని ట్రాలీని నెట్టుకుంటూ నా వైపు వస్తున్నారు. దగ్గిరకు రాగానే నవ్వుతూ చేయి వూపాను. రెండు జతల గాజుకళ్ళు నావంక చూశాయి. నన్ను దాటుకుని వెళ్ళిపొయ్యారు.

ఆ క్షణంలో ఒక్క వుదుటున పెద్రో బలంగా గుంజాడు. లీష్ నా చేతి నుంచి జారి పోయింది. ముందుకు పరిగెత్తిన పెద్రో బ్లాకు ఆనుకుని ఫ్రీడమ్ ప్లాజాకి వెళ్ళే రోడ్డమ్మట పరిగెత్తాడు. “పెద్రో, పెద్రో” అని పిలుస్తూ నేను వాడి వెనకే పరిగెత్తాను. అల్లంత దూరంలో పెద్రో కనబడ్డాడు. పెద్రో ఆగి వెనక్కి చూశాడు. నేను తనని అనుసరిస్తున్నానని గ్రహించగానే తన ముందున్న కుడి మలుపులో దూరి కనబడకుండా పొయ్యాడు. ఆ మలుపుకి సుమారుగా వంద గజాల దూరంలోనే వుంది ఫ్రీడమ్ ప్లాజా. ఆ మలుపు దగ్గిరకి వెళ్ళి చూశాను. నా ఎదురుగుండా టరెట్ చెడిపోయిన రష్యన్ టాంక్! ఎ.టి.ఎమ్. మిసైల్స్‌కి కుదేలైపోయి ట్రాక్స్ మీద ఒరిగిపోయిన టి-80 టాంక్ అది.

పెద్రో అక్కడే నిలబడి నా వంక చూస్తున్నాడు. నేను వెళ్ళి కింద పడివున్న లీష్‌ని అందుకున్నాను. తల కిందకి వంచి నేలని వాసన చూస్తున్నాడు పెద్రో. అలాగే వాసన చూస్తూ టాంక్ దగ్గిరకు తీసుకువెళ్ళాడు నన్ను. ఎడమ చేతి వైపు టాంక్ ట్రాక్స్ దగ్గిరకు వెళ్ళి ఆగాడు. మళ్ళీ వాసన చూశాడు. నా వంక చూస్తూ తన వెనక ఎడమ కాలు ఎత్తి ట్రాక్స్ మీద తన పని కానిచ్చాడు.