కేవలం తన ఆలోచనలను అక్షరబద్ధం చేసుకొని చూసుకోవడమే రచయిత లక్ష్యమైతే సాహిత్యం అనేదే ఉండదు. తన ఊహలు, అభిప్రాయాలు, ఆలోచనలు పదిమందికి తెలుపవలసి ఉన్నదనే స్పృహ సాహిత్యానికి, ప్రత్యేకించి ఆత్మకథాసాహిత్యానికి మూలబీజం. రచనకు కావలసిన ముడిసరుకులన్నీ జీవితంలోనే ఉంటాయి. కానీ అనుభవాన్ని రచనగా మార్చే పాటవం, ఆ చెప్పడంలో తనలోకి తాను నిజాయితీగా చూసుకునే చూపు రచనలను మనకు దగ్గర చేస్తాయి. అనుభవాలు వ్యక్తిగతమై, మనిషి లోతులు, బలహీనతలతో సహా అర్థమవుతున్న కొద్దీ, ఆ రచయిత మనిషిగా పాఠకుడికి ఆప్తుడవుతాడు. బహుశా ఇందుకే ఆత్మకథలు ఎప్పుడు ఎవరు రాసినా చెల్లుతూనే ఉన్నాయి. అవి శ్రీపాద అనుభవాలూ- జ్ఞాపకాలూ, దాశరథి జీవనయానం లాగా తమ తమ జీవితాల సాక్షిగా పాఠకులకు ఆనాటి చరిత్రను పరిచయం చేయవచ్చు. అబ్బూరి వరదకాలం లాగా, ఆచంట జానకిరామ్ సాగుతున్న యాత్ర లాగా, తమ జీవితాల్లోని ముఖ్య సంఘటనలను, ప్రముఖుల సాంగత్యాన్నీ మాత్రమే పొందుపరచవచ్చు. లేదూ, తమ మామూలు జీవితానుభవాలనే ముళ్ళపూడి శ్రీదేవిలా నెమరేసిన మెమరీస్‌ గానో, సోమరాజు సుశీలలా ఇల్లేరమ్మ కతలు గానో చెప్పి ఆకట్టుకోనూవచ్చు. ఒక ‘నేను’ తన జీవితంలోని బాధనైనా సంతోషాన్నైనా, తనకు తానుగా సాధించుకున్న విజయాలైనా పరాజయాలైనా, తన తలపొగరైనా, గర్వభంగమైనా, పంచుకోదగినదేనని నిస్సంకోచంగా నమ్మి ఉండకపోతే, ఈ రోజు మనకు అందుబాటులో ఉన్న సాహిత్యంలో సింహభాగం వెలుగు చూసేది కాదు. నిరాధారమూ, అసమంజసమూ, అసందర్భమూ అయితే తప్ప, స్వోత్కర్ష, పరనింద కూడా సాహిత్యంలో చొరబడరానివేం కావు. అందుచేత, ఎవ్వరైనా ఏదైనా ఎలాగైనా చెప్పవచ్చు. కానీ, నిజం నిక్కచ్చిగా చెప్తున్నామన్న అపోహలో అకారణమైన అక్కసునీ, ఇతరుల పట్ల ద్వేషాన్నీ కథలుగా, ఆత్మకథలుగా రాయడం సరి కాదు. సాహిత్యానికున్న పరిధినీ విశాలమైన వేదికనూ స్వార్థ ప్రయోజనాల కోసం ఆక్రమించుకుంటే, ఇప్పటిప్పుడు అడ్డుకునేవారు లేకపోవచ్చు. అంతమాత్రాన, రాసినదంతా సాహిత్యమూ కాదు, సాహిత్య చరిత్ర అంతకన్నా కాబోదు. తాత్కాలికమైన ఉద్వేగాలూ స్నేహాలూ శత్రుత్వాలూ కాలంతో కరిగిపోయాక, నిజాయితీగా తమ కథలు వినిపించిన గొంతులే మిగిలి, ముందుతరాలకు తమ కాలపు సాహిత్య చరిత్రను నిష్పక్షపాతంగా చెప్తాయి.

ఈరోజు తెలుగుభాష ఏ స్థితిలో ఉన్నది అన్న ప్రశ్నకు పతనమవుతున్నది అన్నదొకటే సమాధానం ఎవరిచ్చినా. ఏ దేశంలోనైనా, కాలంతో పాటు భాష తీరుతెన్నులు మారడం సహజం. కానీ, ఈ మార్పులను ఏ తరానికాతరం గమనించుకోవాలి. భాషను నిలబెడుతున్నవేవో, పతనానికి గురిచేస్తున్నవేవో చర్చించుకొని వాటిని నమోదు చేయడం, భావి తరాలకు భాష పట్ల మెలకువను, జాగరూకతను మప్పుతాయి. తెలుగు భాష స్థితి నానాటికీ దుర్భరంగా తయారవుతోందని అందరూ ఒప్పుకుంటున్నా, దానికి కారణాలు వెదికి విశ్లేషించే దిశగా ఎవరూ అడుగులు వేయలేదు. అందుకే, తెలుగు వచనం కాలక్రమేణా ఎలాంటి మార్పులకు గురైంది? వాటి నేపథ్యమేమిటి? అన్న మౌలికమైన ప్రశ్నలకు కూడా, కనీసం రెండు శతాబ్దాల చరిత్ర తవ్వి చూస్తే గానీ సమాధానం దొరకదు. ఈ బృహత్కార్యాన్ని వెల్చేరు నారాయణరావు, పరుచూరి శ్రీనివాస్ తలకెత్తుకొని, సమగ్రమైన తమ పరిశోధనా సారాన్ని మూడు భాగాలుగా సాగిన వ్యాసరూపంలో విశ్లేషించారు. తెలుగు భాష చరిత్రలో మొదటగా వినవచ్చే ప్రముఖులు పరవస్తు చిన్నయ సూరి, గిడుగు రామమూర్తుల అభిప్రాయాలలో వైరుధ్యాల వల్ల తెలుగు భాషా వ్యవహారాలలో కలిగిన మార్పుల గురించి మొదటి భాగంలోనూ; స్కూళ్ళల్లో కాలేజీల్లో ప్రాంతీయభాషలకు ప్రాధాన్యం కల్పించాలని లార్డ్ కర్జన్ తీసుకున్న నిర్ణయం, తెలుగు దగ్గరకు వచ్చేసరికి ఏ రూపు తీసుకుంది? లాక్షణిక-గ్రామ్య/గ్రాంథిక-వ్యావహారిక భాషావివాదంగా దారి తప్పిన తెలుగు ఇప్పటికీ కవిత్వం, కథలు, నవలలు రాసుకునే భాష అయ్యింది కానీ కొత్త ఆలోచనలు తయారుచేసే భాష ఎందుకు కాలేదు? అనే విషయాలు రెండవ భాగంలోనూ వివరించారు. ఇక, బళ్ళలో ఏ తెలుగు నేర్పాలన్న విషయంలో గ్రాంథిక భాషావాదులు గెలిచిన తరువాతి పరిణామాలు ఏమిటి? వ్యావహారిక భాషను సమర్థించిన గిడుగు రామమూర్తి వాదం మనకు ఏ అదనపు సౌకర్యాన్నిచ్చింది? ఈ భాషోద్యమం తరువాత, తెలుగులో వచ్చిన మార్పుల్లో రేడియో, పత్రికలు, పత్రికా సంపాదకుల పాత్ర ఏమిటి? ప్రస్తుత తెలుగు భాష పరిస్థితిని విశ్లేషిస్తూ, మెరుగుపరుచుకోగలిగే మార్గాలను సూచిస్తూ రాసిన ఆఖరి భాగం ఈ సంచికలో. సామాజిక, సాంస్కృతిక, చారిత్రక దృష్టితో ఎంతో కృషి చేసి, ఈ వ్యాసాన్ని మనకు అందించిన రచయితలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.


ఈ సంచిక నుండీ మానస చామర్తి ఈమాట సంపాదక బృందంలో ఒకరవుతున్నారు. వారికి మా హార్దిక స్వాగతం.

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (1944-2019):’నా లోపల విశ్వమంత ఆమ్రవృక్షం ఎడతెగని పరాగపవనాన్ని శ్రుతి చేస్తుంటే, గానంగా కరిగిపోయే కోకిలాన్ని, ఏకాంత ఢోలాఖేలనం ఎప్పటికీ ఇష్టం నాకు‘ అంటూ తన ప్రవృత్తిని కవిత్వంలో ప్రకటించుకున్న సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంతశర్మ తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురంలో జన్మించారు. కవులు, పండితులు అయిన తండ్రి శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారి సాహిత్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. కవిత్వమంతా రాజకీయమయమై, నిరసననూ, పోరాటాన్ని ప్రతిపాదించనిదంతా అకవిత్వంగా చూపించబడుతోన్న రోజుల్లో, ఒక సాహిత్య ప్రక్రియను ఈ తీరున అడ్డుగోడల మధ్య బిగించడం నచ్చని ఇంద్రగంటి దానిని బాహాటంగానే విమర్శించారు. బాహ్య ప్రపంచపు పోకడల ప్రేరణలతో ఉత్పన్నమవుతోన్న తనకాలపు కవిత్వ ఋతువులను గమనిస్తూ, ఆ గొంతుల్లోని ‘ఆధునికత’ను జాగ్రత్తగా జల్లెడ పట్టిన సునిశిత దృష్టి ఇంద్రగంటిది. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సబ్ ఎడిటర్‌గా ఉద్యోగజీవితం మొదలుపెట్టినా, కొంతకాలం సినిమా రంగంలో పనిచేసినా, ఆలిండియా రేడియోలో చేరినాకనే శ్రీకాంతశర్మ సృజనాత్మకత పూర్తిగా రెక్కలు విప్పుకుంది. ఆయన రచించిన ఎన్నో సంగీత రూపకాలు జాతీయస్థాయిలో బహుమతులు అందుకున్నాయి. ఆయన రచించిన లలితగీతాలు ఈనాటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. తెలుగు నాటకరంగానికి, తెలుగు సాహిత్యరంగానికీ ఆయన చేసిన కృషి చెప్పుకోదగ్గది. అనుభూతి గీతాలు, ఏకాంతకోకిల, నిశ్శబ్దగమ్యం – కవితా సంపుటులు; శిలామురళి, క్షణికం, తూర్పున వాలిన సూర్యుడు – నవలలు; గంగావతరణం, వర్షనందిని, కవి తిలక్‌పై చేసిన శిఖరారోహణం, మాట మౌనం, తలుపు, మరెన్నో సంగీత రూపకాలు రచించారు. యువ నుంచి యువ దాకా అన్న కవిత్వ సంకలానికి సంపాదకత్వం వహించారు. ‘హద్దుల మధ్య జీవితం జబ్బులా వార్ధక్యంలా, బెంగ పుట్టిస్తుంది కాబోలు! అందుకే, మనస్సు ఇంకా ఇంకా వెన్నెల రెక్కలు తొడుక్కుని, ఆకుపచ్చని యౌవన వనాల వైపు పరుగులు తీస్తుంది!‘ అన్న శ్రీకాంత శర్మ, అట్లాంటి యవ్వనోత్సాహంతోనే జీవన పర్యంతమూ తనను తాను మెరుగుపరుచుకుంటూ సాహిత్య సృజనలో కొత్త పుంతలు తొక్కుతూ వచ్చారు. ఇప్పుడిక హంస ఎగిరిపోయింది. ఇది విశ్రాంతి సమయం.

‘నీ జీవితం కాలిపోతుంటే మిగిలే బూడిదే కవిత్వం’ అని కెనేడియన్ కవి, గాయకుడు లెనార్డ్ కోహెన్ అంటాడు. కె. సదాశివరావు వ్రాసిన చలిమంటలు అనే కథలో రచయిత పరంజ్యోతి, తన రచనలేవీ ఎక్కడా ప్రచురించడు. అతనితో వ్యక్తిగత పరిచయం ఉన్న వారికి తప్ప అతని ప్రజ్ఞ మిగతా లోకానికి తెలియదు. అలాంటి వారి ద్వారా పరంజ్యోతి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయిన తరువాతి తరం రచయిత ఒకడు, అతన్ని వెదుక్కుంటూ వెళతాడు. తన కవితలను వినాలనీ, పదిమందికీ తెలియజేయడానికి వాటిని ప్రచురించాలనీ, ఉవ్విళ్ళూరుతున్న ఇతనికి ఆ రాత్రి వెచ్చదనం కోసం ఒక చలిమంట రగిల్చి, తన కవితలు చదివి వినిపిస్తూ, చదివినవి చదివినట్టు ఆ మంటలో వేస్తాడు పరంజ్యోతి. విస్తుపోయి చూస్తోన్న ఇతనితో, అవన్నీ చిత్తు ప్రతులనీ, ప్రతి రచననూ ఎన్నోసార్లు తిప్పి వ్రాశాననీ, అవన్నీ ఉండక్కర్లేదనీ చెప్తాడు. ఒక పరిణత కవి, ఒక ఊహను కాగితం మీద పెట్టి, అది కవితగా రూపాంతరం చెందేవరకు ఎంతలా తపిస్తాడో; కవిత్వ పరిణామ దశల్లో ఉన్న ఎన్నో అంతరాలు దాటుకుని ఉత్తమ ప్రతినే వెలువరించడానికి ఎలా ప్రయత్నిస్తాడో; అది ఒక్కొక్కసారి ఒక జీవితకాలపు సాధన ఎందుకవుతుందో ఈ కథ చెప్తుంది. తాము రాసినవి ప్రపంచానికి చూపించాలన్న తాపత్రయం లేకుండా తమ దగ్గరే అట్టిపెట్టుకోవడం వెనుక తమ సాహిత్యసాధక ప్రయోజనాలు ఏమిటో తన మరణానంతరం తన రచనలు వేటినీ మిగల్చవద్దని మిత్రుణ్ణి కోరిన కాఫ్కా, వేల కవితలు రాసినా తాను బ్రతికుండగా గుప్పెడే ప్రచురించిన ఎమిలీ డికిన్‌సన్ లాంటి రచయితలకే తెలియాలి. విరివిగా సాహిత్య సృజన చేస్తూ కూడా ధన, కీర్తి కాంక్షలకతీతంగా ఆ రచనలను జీవితాంతం తమకు తామే మోసిన వారి నిర్మోహత్వాన్నీ, అంతకు మించి, అన్నాళ్ళ వాళ్ళ పరీక్షకూ, అటు పైన ఇన్నేళ్ళ కాల పరీక్షకూ తట్టుకుని ఈనాటికీ ఆ రచనలింత ప్రాభవంతో మనముందుండటాన్నీ, గమనించి చూడటం ఎన్నో కొత్త పాఠాలను నేర్పిస్తుంది. ఈ సోషల్ మీడియా యుగంలో, అట్లాంటి స్వీయ నియంత్రణ ఊహకు కూడా అందని మన సృజనకారులకు ఆ పాఠాలిప్పుడు మరీ అవసరం. ప్రచురణ అన్నది కేవలం కాగితాలకో, వెబ్ పేజీలకో, వ్యయానికో మాత్రమే సంబంధించిన విషయం కాదు. చాలా సందర్భాల్లో, అది రచయితకూ రచనకూ మధ్య సాగిన రహస్య సంభాషణను ఒక కొలిక్కి తెచ్చే దారి కూడా. తన కవితలన్నీ చిత్తు ప్రతులేనని, కవిత రాసిన నలభయ్యేళ్ళ తరువాత కూడా దాని గురించి ఆలోచిస్తూ అవసరమైన మార్పులు చేస్తానని, తన కవిత్వమసలు లిట్మస్ టెస్ట్ దాటనే లేదనీ చెప్పే అజంతాలు అరుదు, మంచి కవిత్వం లాగే. కానీ ఇప్పుడు, రచనను తీర్చిదిద్దటం అటుంచి, ప్రచురించే ముందు తాము రాసినది మరొక్కసారి చూసుకున్నారన్న నమ్మకం కూడా కలిగించని రచనలే ఎటు చూసినా. తన గొంతు తాను గొప్పగా వినిపిస్తున్నానన్న భ్రమలో, శబ్దవమనమే భావస్వేచ్ఛగా పొరబడుతూ, ఏ కొద్దిపాటి విమర్శనూ తీసుకోలేకుండా ఉన్న కూపస్థ మండూకాల బెకబెకలే ఎటు విన్నా. రచయితలుగా తాము ముందుకు రాకుండా రచనా ప్రక్రియ పట్ల గౌరవం, రచన గురించి రచనే మాట్లాడాలన్న పట్టుదల ఉన్నవాళ్ళు, ప్రస్తుతం మనకు వేళ్ళ మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. అయినా, మన సాహిత్య దశను దిశను మార్చడానికి ఆ కొద్ది గొంతులే చాలు, మనం వినగలిగితే.

ఏ ఏటికాయేడు ఇబ్బడిముబ్బడిగా కథలు, కవిత్వ సంకలనాలు ప్రచురింపబడటం తెలుగునాట రానురానూ రివాజుగా మారుతోంది. ఊరికొకరుగా వెలిసి సాహిత్యాన్ని తమ భుజాల కెక్కించుకు మోస్తున్నామని చెప్పుకోడం చూపించుకోడం మొదలయ్యాకే మన సాహిత్య ప్రమాణాలు ఏ ఎత్తులో ఉన్నాయో మరీ స్పష్టంగా అందరికీ తెలిసి వస్తోంది. పేరు పొందిన కథా/కవిత్వ సంకలనాలు ఏవి తీసుకున్నా అందులో చేర్చబడని కథల/కవితల చర్చ అనివార్యంగా వాటితో జతపడి ఉంటుంది. కానీ, నిజానికి అసలు సమస్య అది కాదు. ఎంపిక చేయబడుతున్న రచనలూ నానాటికీ తీసికట్టుగా తయారవుతుండడం, ఏ సంకలనాన్ని గమనించినా అది ఒక ఏడాదిలో వచ్చిన గొప్ప రచనల తాలూకు జ్ఞాపికగానో లేదంటే ఆ ఏడాది వినపడ్డ కొత్త గొంతుకలను మరికొందరికి పరిచయం చేసే ప్రయత్నంగానో కనపడకపోతుండడం, సాహిత్యేతర ప్రయోజనాలే ఈ సంకలనాలు క్రమం తప్పకుండా విడుదలయ్యేలా ప్రోత్సహిస్తున్నాయన్న నిజం సాహిత్యావరణంతో అంతగా పరిచయం లేని మామూలు పాఠకులకు కూడా అర్థమయ్యేంత స్పష్టంగా ఈ రాజకీయాలు పెచ్చుపెరిగిపోవడం, కలవరపెట్టే విషయాలు.

నాలుగు రచనలు మన ముందున్నప్పుడు వాటిలో ఏది అత్యుత్తమ రచనో బేరీజు వెయ్యడం, నాలుగింటినీ విలువ కట్టి వరుసలో ప్రకటించడం అసాధ్యమైతే కావచ్చు కానీ, ఇన్ని ప్రింట్ పత్రికలు,కొత్తగా పుట్టుకొస్తోన్న వెబ్ పత్రికలు, ఏడాది పొడుగునా ప్రచురిస్తోన్న ఇన్ని వందల రచనల్లో నుండి, ఒక కనీస స్థాయిలో నిలబడగల రచనలను ఎంపిక చేయలేకపోవడం ఎలాంటి దుర్గతి! ఏ ఏ అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారో, ఏ ప్రాతిపదికన ఎంపిక జరిగిందో మాటవరసకు కూడా ప్రకటించని సంపాదకుల అలక్ష్యం. తమ రచనలు ఎట్లాంటి సంకలనాలలో ప్రచురింపడుతున్నాయో కనీస వివరం తెలియని స్థితిలో రచయితలున్నారు. ముందుగా రచయితలకు తెలియబరచడం, అనుమతి తీసుకోవడం అక్కర్లేని పనులయ్యాయి. ఆపాటి గౌరవాన్ని కూడా ఆశించకుండా, తమ రచనలను అచ్చులో చూసుకుంటే చాలన్న తృప్తితో బ్రతుకుతున్నారా తెలుగు రచయితలు? వెబ్‌పత్రికలలో రచనలు పరిశీలనకు అనర్హమైనవనీ, ప్రింట్‌ పత్రికలలో ప్రచురింపబడ్డ రచనలనే ఈ సంకలనాలకు పరిశీలిస్తామనీ బిగ్గరగా, బహిరంగంగా చెప్పుకుంటున్న సంపాదకవర్గాలది మరో వింత పోకడ. సాంకేతికతను కళకు విరోధిగా భావించే మూర్ఖత్వమిది. లేదా వెబ్‌పత్రికలలో వస్తోన్న సాహిత్యాన్ని గమనించలేని అలసత్వం. మాధ్యమాలను బట్టి, రచయిత పేరును బట్టీ కాక, అక్షరాలను బట్టి రచనలకు విలువ గట్టే ధోరణి మనకింకెప్పటికి అలవడుతుంది? లేని విలువలను ఈ సంకలనాలకు ఆపాదించడం ఆపి, మన చేతుల్లో నుండి చల్లగా జారుకుంటోన్న ఉత్తమ ప్రాచీన సాహిత్యమేదైనా ఉంటే దానిని పునఃప్రచురించుకుంటే, కనీసం కొత్త చెత్తను కాస్త తగ్గించుకున్నవారమవుతాం.

ఈనాడే పుట్టిందీ కాదు, ఈ ఏటితోనే పోయేదీ కాదు. ఎవరు మహాకవి? ఎవరు ఎందుకు కాదు? అన్న చర్చలు సమయసందర్భాలతో నిమిత్తం లేకుండా తెలుగు సాహిత్య సమూహాలలో ఉండుండీ అలజడి రేపడానికి కారణం లేకపోలేదు. మనకు కవిత్వాన్ని (ఆ మాటకొస్తే ఏ సాహిత్య ప్రక్రియనైనా) చదివి అర్థం చేసుకోవడం కన్నా ముందే, అది రాసిన కవిని, ఆ కవిత్వాన్ని ఒక వాద-భావ-వర్గ ప్రాతిపదికలపై ఒక మూసలో పడేయడం మీద మోజు ఎక్కువ. కవిత్వం పలికించిన స్వరం కన్నా, దాన్ని వినిపించిన శరీరం పట్ల ఆసక్తి ఎక్కువ. మనముందున్న నాలుగు పంక్తులు ఏం చెబుతున్నాయన్న స్పృహ కన్నా, కవిని పట్టి కుదిపివేసిన ఏ అనుభవం ఎలా మూర్తిమంతమై పదాలలోకి ఒదిగింది అన్న వివేచన కన్నా, ఆ పంక్తుల వెనుక ఉన్న మనుష్యులు, వారితో ముడిపడ్డ రాజకీయాలూ మనకు ముఖ్యం. ఇక్కడ కవిత్వాన్ని కవిని విడదీసి చూడలేం, కవిత్వాన్ని రాజకీయాన్ని విడదీసి మాట్లాడలేం, కులమతాలకు అతీతంగా కవిని గౌరవించలేం.

కవిత్వం తమ స్వార్థం కోసం సామాజిక రాజకీయ వైషమ్యాలను రేకెత్తించి పబ్బం గడుపుకోవాలనుకునే అవకాశవాదుల చేతిలో ఒదగాల్సిన ఆయుధం కాదు. మన ప్రస్తుత అవసరాల కోసం పనికి రావాల్సిన పనిముట్టు అసలే కాదు. సృజన ఉద్దేశము వేరు. దాని ప్రయోజనమూ లక్ష్యమూ వేరు. కవిత్వానికి రంగూ రుచీ వాసనా ఉండాలన్న మాటలు నిజమైన కవిత్వ ప్రేమికులకు చెప్పే రహస్యం ఒకటైతే, కవిత్వం కూడా రాజకీయంగా మారిపోయిన నేటి తెలుగు సాహిత్య వాతావరణంలో, ఈ మాటలు స్ఫురింపజేసే అర్థం మరొకటి. విశ్వనాథ ఏ కాలం వాడో జాషువా అదే కాలం వాడు. జీవిత నేపథ్యం, జీవన విధానం, అవి ఇరువురిలో కలుగజేసిన స్పందనలు పోల్చలేనివి. ఆ భిన్నత్వమే భిన్న దృక్పథాలను సమానంగా పోషిస్తూ, సాహిత్యానికి జీవలక్షణాన్ని ఆపాదిస్తుంది. అందరి కవిత్వమూ మనకు నచ్చక్కర్లేదు. కాని, ఎవరి కవిత్వం పట్ల సహానుభూతి ఉన్నదో వారిని మెచ్చుకోవడం కన్నా ఎవరి పట్ల వ్యతిరేకత ఉన్నదో వారిని చులకన చేయడం ప్రస్తుతం మనం అలవర్చుకున్న ఏకైక సాహిత్యావసరం. మహాకవి, యుగకవి వంటి డొల్ల పదాల మీద ఉన్న ఆసక్తి, వాటిని తమకు నచ్చిన పేర్లకు అతికించడంలో ఉన్న శ్రద్ధ, స్వయంసంపూర్ణమూ సర్వస్వతంత్రమూ అయిన కవిత్వం మీద ఉండి ఉంటే, బహుశా ఈ చర్చలెంత హానికరమో, అనవసరమో కొంతయినా అర్థమయ్యేదేమో. మనుష్యులుగా ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు, బలహీనతలు, నమ్మకాలు వారికుండటంలో అనౌచిత్యం ఏమీ లేదు కానీ, సాహిత్యపు ముసుగులో కొందరు ఎక్కడికక్కడ స్వయంలబ్ధి సమూహాలుగా విడివడి నిర్లజ్జగా తమ రాజకీయాలను, ద్వేష ప్రకటనలనూ సాహిత్యంగా, సాహిత్యావసరంగా అమ్మజూడటమే ప్రస్తుత తెలుగు సాహిత్య వాతావరణం లోని విషాదం. గొంతు ఎవరిది పెద్దదయితే వారిదే అధికారం అనుకొనే ధోరణిలోనే ప్రపంచమంతా ఉన్నది. కాని సాహిత్యసృజనని కూడా అదే తీరున విమర్శించలేం నియంత్రించలేం అన్న వివేకం కొరవడిన స్థితిలో ఉన్నాం. చివరకు, కవి రాసిన కవిత్వం గురించి మాట్లాడగలమే కాని, రాయని కవిత్వం గురించి ఎందుకు రాయలేదని కవిని ప్రశ్నించలేం, నిందించలేం అన్న కనీస సాహిత్య సంస్కారం కూడా మనకు అలవడని అధమస్థాయిలో ఉన్నాం మనం. ఈ పుట్టకురుపు ఉన్నది, ఇంతగా ప్రబలిందీ కేవలం తెలుగు సాహిత్యావరణంలోనేనా!

ఏ కొద్దిమందో ఉంటారు. వారి భావాలు, ఆశయాలు, ఎంచుకున్న దారులు వంటివాటితో మనకు మమేకత ఉండకపోవచ్చు. పైపెచ్చు విరోధమూ ఉండవచ్చు. కాని, వారిని మనస్ఫూర్తిగా గౌరవించకుండా ఉండలేం. తమ ఆశయం పట్ల వారికున్న నిబద్ధత, అది సాధించడం కోసం చేసే నిరంతర పోరాటం, అహోరాత్రాలు జ్వలించిపోయే తపన, ప్రాణాలైనా అర్పించగల త్యాగశీలత, వారిని ప్రత్యర్థులు కూడా గౌరవించేట్టు, అభిమానించేట్టు చేస్తాయి. అలాంటి కొద్దిమందిలో ఒకరు శివసాగర్ అనే పేరుతో ప్రసిద్ధికెక్కిన కంభం జ్ఞానసత్యమూర్తి (15 జులై, 1931 – 17 ఏప్రిల్, 2012). సమాజపు అసమానతల పట్ల అసహనంతో విప్లవోద్యమ మార్గాన్ని ఎంచుకున్న ప్రతీ యువతీయువకుడి నోటా కదను తొక్కే కవితా పంక్తులు ఇద్దరు కవులవి. ఒకరు శ్రీశ్రీ, మరొకరు శివసాగర్. అయితే కేవలం కవిగా కలమే కాకుండా సైనికుడిగా ఆయుధమూ పట్టినది, ‘ప్రజలను సాయుధం చేస్తున్న రివల్యూషనరీ కవి నేడు’ అంటూ విప్లవకవిత్వానికి దారి వేసినది శివసాగర్ మాత్రమే. వయోవిద్యాప్రాంతీయభేదాలనేవి లేకుండా జనవాహినిలో నినాదస్థాయికి చేరుకున్నది ఆయన కవిత్వం మాత్రమే. కవిత, పాట రెండు దారులుగా సాగిన ఆయన సాహిత్య ప్రస్థానంలో మొదటగా 1983లో ప్రచురించిన ఉద్యమం నెలబాలుడు ఎందరినో ప్రభావితం చేసింది. ప్రజలను కదిలించడంలో పాటకున్న బలాన్ని తెలుసుకున్న శివసాగర్ కలంనుంచి నరుడో భాస్కరుడో, చెల్లీ చెంద్రమ్మా, నల్లాటి సూరీడూ, ఓ విలుకాడ! వంటి పాటలు ఇప్పటికీ ప్రముఖంగానే ఉన్నాయి, ఇక ఎప్పటికీ ఉంటాయి. భూమీ ఆకాశం కలిసే చోట/ పొన్నపూలు రాలిపడిన చోట/ వీధిదీపాలు ఉరిపోసుకున్న చోట/ నేలమాళిగ కన్నీరు కార్చిచ్చు అయినచోట/ తిరిగి వస్తాను/ తిరిగి లేస్తాను/ నాకోసం ఎదురు చూడు/ నాకోసం వేచి చూడు అని చాటిన ఆ విప్లవకవి వర్ధంతి సందర్భంగా ఈ సంచిక ఆయన స్మృతిలో వెలువరిస్తున్నాం. సమయం తక్కువగా ఉన్నప్పటికీ అడగగానే నివాళి రాసి పంపిన నరేష్కుమార్ సూఫీ, బొమ్మ పంపిన అన్వర్, అరుదైన శివసాగర్ జైలు డైరీ ప్రతి పంపి సహాయం చేసిన గుర్రం సీతారాములుగార్లకు మా కృతజ్ఞతలు.

కథ అంటే ఏమిటి? దాని లక్షణాలేమిటి? అన్న ప్రశ్నలకు ఇప్పటిదాకా ఏ సాహిత్య సమాజమూ స్పష్టమైన సమాధానమివ్వలేదు. రచయితలు, విమర్శకులు వారి భావాలు, వాదాలు, అభిప్రాయాలను బట్టి తమకు తోచినట్టుగా ఈ ప్రశ్నలకు స్థూలంగా, అస్పష్టంగా కవితాత్మకమైన వివరణలను ఇచ్చుకున్నారు తప్ప సరైన సమాధానాలను ఇవ్వలేకపోయారు. నిర్దిష్టత లేని వివరణలు కేవలం వర్ణనలే అవుతాయి తప్ప నిర్వచనాలు కాబోవు. వాటి ఆధారంగా సాహిత్యలక్షణ చర్చలు జరగలేవు, జరపకూడదు.

ఇది కథ ఎలా అయింది? అన్న ప్రశ్న లాగానే, ఇది కథ ఎందుకు కాదు? అన్న ప్రశ్న కూడా ఇప్పటిదాకా ఉన్న సాహిత్య వర్గీకరణలను, సంప్రదాయ ధోరణులను సవాలు చేస్తుంది. తమ మధ్య స్పష్టమైన విలక్షణతను చూపించగల కథ-కవిత-వ్యాసం వంటి ప్రక్రియలు కూడా కొన్నిసార్లు ఒకదానిలోకి ఒకటి కలిసిపోతుంటాయి. అందువల్ల సాహిత్యపు విశాలస్వభావాన్ని ఎవరూ పూర్తిగా అర్థం చేసుకొనడానికి ప్రయత్నిస్తున్నట్టు గాని, సాహిత్య ప్రక్రియలను కుంచించి వర్గీకరించే కొద్దీ వాటి మధ్య ఎల్లలు చెరిగిపోతుంటాయన్న స్పృహ రచయితలకు విమర్శకులకు కలుగుతున్నట్టు గాని, కనిపించడం లేదు. ఈ కారణానికే, ఒక రచనను ఏదో ఒక ప్రక్రియలోకి ఇమడ్చకుండా చూడలేని పరిమితి, తమకున్న నిర్వచనాల్లోకి ఒదగని రచనలను అస్పష్టమైన వివరణలతో కొత్త ప్రక్రియగా భావిస్తూ సాహిత్య లక్షణాలను పునర్నిర్వచిస్తున్నామన్న భ్రమ, తెలుగు సాహిత్య సమాజంలో ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. ఇతర భాషా సాహిత్యాలలో ఈ రకమైన సాహిత్య లక్షణాల గురించిన చర్చ, ఇటీవల దాదాపుగా కనుమరుగవుతోంది. ఆయా భాషల రచయితలు మునుపెన్నడూ లేని తీరున వాక్య, వస్తు పరమైనవే కాక సాంకేతికతనూ ప్రతిభావంతంగా వాడుకుంటూ సాహిత్య ప్రయోగాలు చేస్తున్నారు, కథాది సాహిత్య ప్రక్రియలకు ఉన్న సరిహద్దులు చెరిపివేస్తున్నారు. తమ రచనలను ప్రత్యేక ప్రక్రియలుగా కొందరు రచయితలు పేర్లు పెట్టుకుంటున్నా అవి కేవలం వారి- వాటి- గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నాలుగానే మిగిలిపోతున్నాయి. అందువల్ల ఈ గురుతుచీటీలకు, పాఠకుడి పఠనానుభవాన్ని ప్రభావితం చెయ్యగల శక్తి ఉన్నదా, ఉంటే దాని పరిధి ఏమాత్రం అన్నవి, ఆలోచించవలసిన విషయాలు.

నిజానికి వర్గీకరణ అన్నది, రచన పట్ల ముందస్తు అంచనాలను, అభిప్రాయాలను ఏర్పరచుకోవడానికి, పాఠకుడి దృష్టిని రచనాంశానికి దూరంగా మళ్ళించడానికి మాత్రమే దోహదపడుతుంది తప్ప ఒక రచనను రచనగా స్వీకరించడానికి, ఆ రచనని లోతుగా ఆస్వాదించడానికి సాయపడదు. ఇలా ఉంటే కథ, ఇలా ఉంటే కాదు, ఇది ఇది, ఇది ఇంకొకటి అంటూ విభజనలు ఎక్కువయే కొద్దీ అవి ఒకటైపోతుంటాయి. అందువల్ల, నిర్వచించిన మరుక్షణం ఆ నిర్వచనానికి వెలుపలగా నిలబడే లక్షణం ఉన్న సాహిత్యానికి, ఈ రకమైన వర్గీకరణలు అవసరమా అన్నది ముఖ్యమైన ప్రశ్న. శోధనకు సంబంధించిన సౌలభ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ నామకరణాలు ఒక వెసులుబాటే తప్ప సాహిత్య అవసరం కాదన్నది, మా స్థిరమైన అభిప్రాయం. ఈ ఆలోచనలతో, ఈ సంచిక నుండి ఈమాటలో ఒక ప్రయోగం మొదలు పెడుతున్నాం. ముందు పేజీలోను, రచనల పేజీలోను, రచనల కేటగిరీల ప్రస్తావన తీసివేస్తున్నాం. తద్వారా పాఠకుల దృష్టి కేవలం రచన మీద మాత్రమే ఉంటుందని, రచన చెప్తున్నదేమిటో మాత్రమే చూడబోతారని, అలా సాహిత్యాన్ని ప్రక్రియల పావురాల గూళ్ళల్లో పెట్టే ధోరణి కొంతైనా పోతుందని మా నమ్మకం. ఈ ప్రయోగం ఎటువంటి ఫలితాలనివ్వబోతోందో, మనమంతా కలిసి గమనిద్దాం.

ఈమాట జులై 2007 సంచికతో మొదలై నిరాఘాటంగా షుమారు పన్నెండేళ్ళు సాగిన నాకు నచ్చిన పద్యం శీర్షిక అనివార్య కారణాల వల్ల వచ్చే సంచిక నుండీ ఆగిపోతున్నదని చెప్పడానికి చింతిస్తున్నాం. కేవలం ఒక పద్యానికి అర్థం చెప్పడమే కాదు, ఆ పద్యం ఎందుకు మంచి పద్యమో, అందులో కవి గొప్పతనమేమిటో, ఇలా వివరించి చెప్తూ పద్యకవిత్వపు లోతులని నేటి పాఠకులకు అందజేయడం ద్వారా వారికి పద్యాన్ని, తద్వారా కవిత్వాన్ని చదవడం ఎలాగో కూడా తెలియజెప్పిన శీర్షిక ఇది. మొదలైన నాటినుండీ ఎందరో పాఠకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన శీర్షిక ఇది. ఈ శీర్షికను ఇన్నేళ్ళపాటు సమర్థవంతంగా పాఠకాదరణకు ఇంతగా నోచుకొనేలా నిర్వహించిన చీమలమర్రి బృందావనరావు, భైరవభట్ల కామేశ్వరరావులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రతీ సంచికకూ కాకపోయినా, ఇక ముందు కూడా వారికి నచ్చిన పద్యాలను అప్పుడప్పుడు ఈమాట పాఠకులతో పంచుకుంటూ ఉంటారని, ఉండాలని ఆశిస్తున్నాం. ఇదే సందర్భంలో, ఈ శీర్షికను ఇక ముందు కొనసాగించటానికి, ఇదే ధోరణిలో తమకు నచ్చిన పద్యాలను పాఠకులకు పరిచయం చెయ్యడానికి, ఇతర కవిపండితరచయితలను సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

ఇటాలియన్ ఆపెరాలను తెలుగులో యక్షగానాలుగా పునఃసృజిస్తున్న తిరుమల కృష్ణదేశికాచార్యుల మరొక నాటిక సేవికయే నాయిక; నలభై అయిదేళ్ళకు పైగా అమెరికా విశ్వవిద్యాలయాలలో తన తెలుగు సాహిత్య పరిశోధనలో భాగంగా రాసిన వ్యాసాలే కాక ఎన్నో అనువాదాలు కూడా చేసిన ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావు అమోఘమైన కృషిని తెలుగువారికి పరిచయం చేసే ఉద్దేశ్యంతో పరుచూరి శ్రీనివాస్ ఆయనతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం కోసం జరిపిన ఇంటర్‌వ్యూ; ఇటీవల మరణించిన విశిష్ట కథకుడు కవనశర్మ స్మృతిలో దాసరి అమరేంద్ర నివాళితో పాటూ ఆయన కథలు; ఇతర రచనలు, గడి నుడి…ఈ సంచికలో.

సిగిౙ్మండ్ క్రిజ్‌జనావ్‌స్కీ (1887-1950): యావత్ప్రపంచంలో పేరెన్నిక గన్న రచయితల పంక్తిలో నిలబడవలసింది పోగా, జీవిత కాలంలో ఇంచుమించు విస్మృతుడైపోయి తనను తాను ‘అనామకుడిగా ప్రసిద్ధుడ’నని వర్ణించుకున్న సిగిౙ్మండ్ క్రిజ్‌జనావ్‌స్కీ, తన కథలను బ్రతికుండగా ప్రచురణలో చూసుకోలేకపోయాడు. అతని కథలను స్టాలినిస్ట్ ప్రభుత్వం ప్రచురించనీయక పోవడంతో బ్రతికి ఉండగా అతను ఒక రచయిత అన్న సంగతి సాటి రచయితలతో సహా ఎవరికీ తెలియరాలేదు. ఒక ఇరుకైన గదిలో ఒంటరిగా అతను తన కథలనే అద్భుతలోకాలు సృష్టించాడు. వాస్తవంలో సాధ్యం కాని వాటిని భాష సాధ్యం చేయగలదని నమ్మిన సిగిౙ్మండ్ కథలు వర్గీకరణకు లొంగవు. అతని కథలను వాస్తవికతపై చేసిన ప్రయోగాలుగా అభివర్ణించుకున్నాడు ఈ అధివాస్తవిక కథకుడు. అతని కథలలోని పాత్రల అస్తిత్వం అభూత కల్పన; కానీ అవి ఉండేది, పాటించేది భౌతిక జగత్తు ధర్మాలనే. వాస్తవికతకు అద్దిన ఒక కొత్త కళాదృక్పథం అతని సాహిత్యం. వాస్తవం అనేది సంపూర్ణమూ, స్వతంత్రమూ కాదు; అది మనకు ఎన్నటికీ పూర్తిగా అవగతం కాదు; అది కేవలం ఒక పగిలిన ముక్కల కూర్పు వంటిది–ఇదీ వెస్టర్న్ ఫిలాసఫీతో పాటు వేదాంతాన్నీ శ్రద్ధగా చదువుకున్న సిగిౙ్మండ్ కథలలో కనిపించే దృక్పథం. అత్యంత సూక్ష్మమైన అస్తిత్వం ఉన్న పదార్థాలను లోతుగా పరిశీలించడం ద్వారా, తాత్వికసమస్యలను కళాకారుడి దృష్టితో దర్శించడం ద్వారా, వాస్తవికత గురించి కొంతైనా అర్థం చేసుకోవచ్చనే ప్రయత్నం అతని కథలలో కనిపిస్తుంది. 1920 నుంచి 1940ల వరకూ అసామాన్యమైన సృజనతో అతని కలం సృష్టించిన ఒక అద్భుతమైన సాహిత్యప్రపంచం అతని మరణం తరువాత కూడా రహస్యంగా కాపాడుకోబడింది. చివరకు 1976లో వదీమ్ పెరెల్మూతర్ అనే రష్యన్ సాహిత్యవేత్త ద్వారా మొదటిసారిగా వెలుగు చూసిన ఇతని కథలను, గత పదేళ్ళలో వచ్చిన ఆంగ్లానువాదాల వల్ల, ప్రపంచం ఇప్పుడిప్పుడే చదువుతూ అబ్బురపడుతున్నది. ఈ అద్భుత కథకుడి కథలను అనువదించడమే కాక, వాటికి అనుబంధంగా సిగిౙ్మండ్ సాహిత్య దృక్పథాన్ని సరళంగా వివరించే వ్యాసంతో ఒక సమగ్రమైన పరిచయాన్ని అందిస్తున్న పప్పు నాగరాజుకు అభినందనలతో, అతను పడిన శ్రమకు కృతజ్ఞతలతో ఈ సంచికను సిగిౙ్మండ్ విశేష సంచికగా విడుదల చేస్తున్నాం.

ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!

మెకాలే విధానాల వలన తెలుగు పరిపాలనా భాషగా కాకుండా పోవడంతో ఇంగ్లీషు భాష ప్రాచుర్యం పెరిగి తెలుగుకు ఆదరణ పోయింది. ఆపైన కొంత కాలానికి లార్డ్ కర్జన్ విశ్వవిద్యాలయాలలో ఇంగ్లీషులో చదువుకుంటున్న వారివల్ల వారి వారి ప్రాంతీయ భాషలకు ఏ ఉపకారమూ జరగటం లేదని గమనించి స్కూళ్ళల్లో కాలేజీల్లో ప్రాంతీయభాషలకు ప్రాధాన్యం కల్పించాలని తీసుకున్న నిర్ణయం తెలుగు దగ్గరికి వచ్చేసరికి, లాక్షణిక-గ్రామ్య/గ్రాంథిక-వ్యావహారిక భాషావివాదంగా దారి తప్పి ఇప్పటికీ సరిబాట పట్టలేదు. ఇప్పటికీ ఎడతెగని ఈ భాషావివాదపు మూలాలు ఏమిటి? అప్పుడున్న రాజకీయ సాంఘిక పరిస్థితులు ఏమిటి? ఇందులో చిన్నయ సూరి, గిడుగు రామమూర్తి, జయంతి రామయ్య పంతులు, గురజాడ అప్పారావు వంటి పండితులు పోషించిన పాత్ర ఏమిటి? తెలుగు ఇప్పటికీ కూడా కవిత్వం, కథలు, నవలలు రాసుకునే భాష అయ్యింది కానీ కొత్త ఆలోచనలు తయారుచేసే భాష ఎందుకు కాలేదు? అలా కావాలంటే ఇకముందు మనం ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ వెల్చేరు నారాయణరావు, పరుచూరి శ్రీనివాస్ రాస్తున్న విశ్లేషణాత్మక వ్యాసంలోని రెండవ భాగం ఈ సంచికలో ప్రచురిస్తున్నాం; ఈ సందర్భంగా రెండు అరుదైన పుస్తకాలు–టేకుమళ్ళ కామేశ్వరరావు రాసిన వాడుక భాష: రచనకు కొన్ని నియమాలు, సామినేని ముద్దునరసింహం నాయుడు రాసిన హిత సూచని–గ్రంథాలయంలో చేరుస్తున్నాం. వీటిని శ్రమతో కూర్చి అందించిన ఆంధ్రభారతి సైట్ నిర్వాహకులు వాడపల్లి శేషతల్పశాయికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం; లియో తోల్‌స్తోయ్ బృహత్కథానిక డెత్ ఆఫ్ ఇవాన్ ఇల్యిచ్‌ను సమూలంగా తెలుగులోకి దంతుర్తి శర్మ చేసిన అనువాదం; భైరవభట్ల కామేశ్వరరావు తార్కికచింతనాత్మక వ్యాసం మూడవ భాగం; ఇతర వ్యాసాలు, కథలు ఈ సంచికలో మీకోసం.

ఫహెశ్! సాదత్ హసన్ మంటో రచనాజీవితాన్ని వెంటాడి, వేటాడిన ఒకే ఒక్క పదం. అర్థం: అశ్లీలం. అసభ్యం, కుసంస్కారం, మతానికి వ్యతిరేకం లాంటి పదాలకి తెరతీసే పదం. మంటో ఆ ఒక్క పదం కారణాన ఎన్నో యుద్ధాలు చేయవలసి వచ్చింది. కోర్టుల చుట్టూ తిరగవలసి వచ్చింది. తన రచనలను తానే సమర్థించుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇంతకీ అతని నేరమేమిటి? తనచుట్టూ ఉన్న సమాజాన్ని ఏ కోణం నుంచి, ఏ దృష్టి నుంచి చూశాడో అదే దృష్టిని, అదే కోణాన్ని ఎక్కడా రాజీపడకుండా తన కథల్లో ప్రదర్శించాడు. ఒక రచయితకు తన పట్ల, సాహిత్యం పట్ల ఉండవలసిన నిజాయితీకి, నిబద్ధతకు మంటో నిలువెత్తు దర్పణం. మంటో చనిపోయే అరవై యేళ్ళు దాటింది. కాని, అప్పటికంటే ఇప్పుడు మంటో వంటి రచయితల అవసరం మరింతగా ఉంది. కారణం? ఈనాటికీ ఏ ప్రయోజనాలను ఉద్దేశించి రచయిత కథను మలిచాడోనన్న కనీసపు అవగాహన కూడా ఏర్పరచుకోకుండా, రచనల్లోంచి ఒకటి రెండు పదాలనో వాక్యాలనో విడదీసి తమ అభద్రతల భూతద్దంలో అవసరాల నేపథ్యంలో వాటిని చూస్తూ, చూపిస్తూ ‘ఇది అపచారం, అది మా మనోభావాలకు గాయం!’ అని విరుచుకుపడుతున్నవారు ఎక్కువైపోతున్న ఈనాటి మన సమాజం. మంటోని కేవలం కోర్టుకి ఈడ్చడంతో సరిపెట్టుకున్నారు అప్పటి సమాజోద్ధారకులు, ధర్మరక్షకులు. ఇప్పటివారిలా దాడులకు, బెదిరింపులకు, అసభ్యప్రచారాలకూ పాల్పడలేదు. రచయితలను భయపెట్టి అజ్ఞాతవాసంలోకి నెట్టేయలేదు. ఇది మనం సాధించిన ప్రగతి. ఇది సాహిత్యం, సమాజం వంటి వాటిపై మన దృక్కోణం ఏదైనా కాని, అందరమూ తలదించుకోవల్సిన పరిస్థితి.

సాహిత్యచక్షువు చూడలేనిది చూడకూడనిది ఏదీ లేదు. రచయిత కంటికి నిబంధనలు, అతని కలానికి నిర్బంధనలు ముమ్మాటికీ సమాజానికి చెరుపు మాత్రమే చేస్తాయి అన్న స్పృహ ఇప్పటికైనా రాకపోతే మనదేశపు స్వచ్ఛత మేడిపండుగా స్వేచ్ఛ మిథ్యగానే మిగిలిపోతాయి. అలా మిగిలిపోకూడదు అంటే అశ్లీలం, అనైతికం అని ముద్రవేయబడ్డ ఆ సాహిత్యాన్ని మనం మరింతగా చదవాలి. సాహిత్యంలో అశ్లీలత ఏమిటి? మనోభావాలు ఎందుకు గాయపడాలి? సాహిత్యం కొన్ని అంశాలు స్పృశించకూడదనే నియమాలు ఎందుకు, ఎవరికోసం? వంటివి మరింతగా చర్చించాలి. మంటోనే స్వయంగా అన్నట్టు రచయిత సమాజపు నల్లపలక మీద తెల్లగీత గీస్తాడు ఎందుకంటే ఆ నలుపు మరింతగా కొట్టవచ్చేలా మన అందరికీ కనిపించడానికి. సమాజంలో నలుపు చూపడం అశ్లీలమా? మంటో నిజంగానే అశ్లీలపు కథలు రాశాడా? తెలుసుకోవడం కోసం, మంటో ప్రపంచాన్ని తెలుగువారికి తెలియజేయడం కోసం, పూర్ణిమ తమ్మిరెడ్డి ఈ సంచికనుండీ మంటో కథలు ఉర్దూ మూలం నుండి నేరుగా, విధేయతతో తెలుగులోకి అనువాదం చేసి అందిస్తున్నారు. వారి శ్రమకి కృతజ్ఞతలు. మొదటగా ఈ శీర్షికలో మంటో వివాదాస్పద కథ కాలీ సల్వార్‌, కథా సంబంధిత వ్యాసం సఫేద్ ఝూట్ ప్రచురిస్తున్నాం.


(అడగ్గానే బొమ్మలు గీసి ఇచ్చిన అన్వర్‌కు
బోలెడన్ని కృతజ్ఞతలు బోలెడంత ప్రేమతో – సం.
)

ఈ సంచిక ఈమాట ఇరవయ్యవ జన్మదిన సంచిక. ఈమాట ఇన్నేళ్ళుగా కేవలం నడవలేదు. ఇరవై ఏళ్ళుగా ఇంతింతై ఎదిగింది. రెక్కలుగట్టుకు ఎగిరింది. అమెరికా తెలుగువారికోసం ప్రాణం పోసుకున్న ఒక చిన్న ప్రయత్నం ఈరోజు ఎల్లలు లేని ప్రపంచపు తెలుగు పత్రికగా మూర్తిమంతమయింది; ప్రపంచవ్యాప్తంగా పాఠకుల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ తెలుగు సాహిత్యరంగంలో తనకంటూ ఒక ఉనికిని, ఒక గౌరవాన్ని సంపాదించుకుంది. ఇందుకు కారణం మా శ్రమ మాత్రమే కాదు. అంతకు ఎంతో ఎక్కువగా మీ ప్రోత్సాహసహకారాలు, ఆదరాభిమానాలే అన్నది సుస్పష్టం. మీ అండ ఇలా ఉన్నంత కాలం ఈమాట నిరాఘాటంగా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఇది మా నమ్మకమే కాదు. మామాట కూడా. తెలుగు సాహిత్యానికి ఒక మూలకేంద్రంగా ఈమాట ఉండాలన్న కోరికతో సాంకేతిక భాషాసాహిత్యాల పరంగా నవతరాలలో పరిణమిస్తున్న అభిరుచులకు అనుగుణంగా పాతకొత్తల మేలుకలయికగా ఈమాటను తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. కాలానుగుణంగా మారుతూ వస్తున్నా, ఈమాట ఆశయాలలో కాని, సాహిత్యం పట్ల, పరిష్కరణ-ప్రచురణ పద్ధతుల పట్ల ఉన్న శ్రద్ధ, ఆచరణలలో కాని ఏ మార్పూ లేదు. ఇది ముందుముందు కూడా ఇలాగే కొనసాగుతుందని, ఏ రచననైనా నిరపేక్షంగా సాహిత్య పరిధులలోనే పరిశీలిస్తూ, రచయితలకు విమర్శ, పరిష్కరణల అవసరం తెలియజేస్తూ, వారికి వెన్నుదన్నుగా నిలబడి ప్రోత్సహించే మా ధోరణిలోనూ ఏ మార్పూ రాదని హామీ ఇస్తున్నాం. ఈ ప్రయత్నంలో మేము కొందరి మనసులు నొప్పించి, మరికొందరిని నిరాశపరచి ఉండేవుంటాం. అది ఈమాట పట్ల, సాహిత్యం పట్ల మాకున్న అభిమానాన్ని, గౌరవాన్ని నిలుపుకొనే ఉత్సాహంలో మేము తెలియక చేసిన పొరపాటే కాని తెలిసి చేసిన తప్పిదం కాదని సవినయంగా మనవి చేస్తున్నాం. తప్పులుంటే మన్నించి ఈ సాహిత్యప్రయాణంలో తోడు రమ్మని, తోడు కమ్మని, ప్రపంచం నలుమూలలా ఉన్న రచయితలనూ పాఠకులనూ మరొక్కసారి మనసారా ఆహ్వానిస్తున్నాం. రండి, అందరం కలిసి సాగుదాం. ఈమాటను మరిన్ని పదుల మైలురాళ్ళు దాటిద్దాం.

తెలుగునాట తెలుగు చదవడం రాయడం అటుంచి సరిగ్గా మాట్లాడడం కూడా అరుదైపోతున్న ఈ రోజుల్లో, ఎక్కడో అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో కొందరు పుస్తకాలు చదవడం ఇష్టం ఉన్నవారు కలుసుకోవడం, తాము చదివిన కథలూ నవలలూ కవితల మంచీచెడ్డలు మాట్లాడుకోవడం, ఆపైన ఆ ఆసక్తి, అభిరుచులే డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ పేర ఎదిగి ఒక సంస్థగా మారి అమెరికా తెలుగు ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడమే కాక, ఇరవై యేళ్ళు నిరాఘాటంగా నడవడం అసామాన్య విషయం మాత్రమే కాదు, ఎంతో సంతోషం కలిగించే విషయం కూడా. డీటీఎల్‌సీ అని అందరూ పిలుచుకొనే ఈ బుక్ క్లబ్ కేవలం పుస్తకాలు చదవడంతోనే ఆగిపోక, నిక్కచ్చిగా విమర్శ చేయడం, ఎంతో శ్రమతో, నిరపేక్షతో, కేవలం తెలుగు సాహిత్యం పట్ల ప్రేమతో మరుగునపడిన పుస్తకాలను ప్రచురించే బాధ్యత కొంత తలకెత్తుకోవడం, తెలుగు భాషాసాహిత్యాల గురించిన సభలు నిర్వహించడం ఎంతో హర్షించదగిన పరిణామం. వీరి స్ఫూర్తితో అమెరికాలోని ఎన్నో నగరాలలో తెలుగు సాహిత్య సంఘాలు వెలిశాయి, తెలుగు కథ కవితల గురించి మాట్లాడుకుంటున్నాయి, ఏం చేస్తే మన తెలుగు భాష కలకాలం బ్రతికి ఉంటుంది, మరింత అభివృద్ధి చెందుతుంది, మనం ఎలా దీన్ని కాపాడుకోవాలి అని ఆలోచిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. డీటీఎల్‌సీ పుట్టి ఇరవై యేళ్ళు అయిన సందర్భంగా సెప్టెంబర్ 29-30 తారీకులలో ఇరవై యేళ్ళ పండగ పేరుతో తెలుగులో ప్రామాణిక భాష అవసరమూ ఆవశ్యకత, తెలుగులో ప్రచురణ వ్యవస్థ, ఇత్యాది అంశాలపై ఒక చక్కటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, డీటీఎల్‌సీ వారి కృషికి, తెలుగు పట్ల వారి ప్రేమకు, వారి నిస్వార్థ ప్రయత్నాలకూ ఈమాట తరఫున హార్దికాభినందనలు తెలుపుతున్నాం.

ఇటాలియన్ ఆపెరాలను తెలుగు యక్షగానాలుగా పునఃరచించే బృహత్ప్రయత్నంలో తిరుమల కృష్ణదేశికాచార్యుల రెండవ రచన ప్రచ్ఛన్న పరిణయము. ఇల్ మాత్రిమోనియో సెగ్రెతో (రహస్య వివాహం) అన్న పేరుతో ఈ ఆపెరా మొదటిసారి 1792లో వియెన్నాలో ప్రదర్శింపబడినప్పటినుంచీ ఇప్పటికీ ప్రేక్షకాభిమానాన్ని నోచుకుంటూనే ఉంది. ఒక ఆంగ్లనాటకాన్ని ఆధారంగా చేసుకొని జొవాన్ని బెర్తాతి రచించిన ఈ రూపకాన్ని ప్రముఖ సంగీత కర్త దొమీనికో చిమరోసా స్వరబద్ధం చేశాడు. ఆయన స్వరబద్ధం చేసిన ఎనభైకి పైగా రూపకాలలో ఇది అత్యంత ప్రాచుర్యం పొంది, ఇప్పటికీ కాలానుగుణంగా భిన్న సాంస్కృతిక నేపథ్యాలకు అన్వయించబడి ప్రదర్శించబడుతోంది; ఈ సంచికలో నలుగురు రచయితలు మొట్టమొదటిసారిగా వారి కథలు కవితలు ఈమాట పాఠకులకు అందిస్తున్నారు. ఈమాట తరఫున వారికి హార్దికస్వాగతం; కె. రాణి పాడిన కొన్ని అపురూపమైన పాటలను శబ్దతరంగాలలో సమర్పిస్తున్నారు పరుచూరి శ్రీనివాస్; వినూత్నమైన కథలు, కవితలు, విశేష పాఠకాదరణకు నోచుకున్న గడి, తదితర రచనలతో ఈ సంచిక మీకోసం…

స్వేచ్ఛాభారతంలో ఇంకొక రోజు, ఇంకొక దౌర్జన్యపర్వం. ఈసారి మళయాళ రచయిత హరీశ్‌పై దాడులు. కారణం? షరా మామూలుగానే మనోభావాలు గాయపడటం. మా స్త్రీలను అవమానించేలా నీ నవలలో ఒక పాత్ర మాట్లాడింది కాబట్టి నీ భార్యాబిడ్డలను బలాత్కారం చేస్తాం, నీ చేతులు నరికేస్తాం అని బెదిరింపులు. ఈ రకమైన న్యాయం మధ్యప్రాచ్య తాలిబన్లకూ, మనదేశపు ధర్మగంగబిందువులకూ మాత్రమే సబబనిపిస్తున్నట్టుంది. ఇది భౌతికమైన దాడి. ఇక రెండవది, మానసికమైన దాడి. ఒక రచన ఆధారంగా రచయిత నైతికత, శీలం అంచనా వేయడం, సోషల్ మీడియా ముసుగులో అవమానాలు, ముద్ర వేయడాలవంటివి. పైకి వేరుగా అనిపించినా ఈ రెండు రుగ్మతలకూ మూలం ఒకటే–తమకు తప్పనిపించే భావాలపై ఉండే విపరీతమైన అసహనం, దానితో వచ్చే క్రూరత్వం. సక్రమమైన రీతిలో స్పందించలేని, వ్యతిరేకించలేని దుర్బలత్వం, దాని ద్వారా వచ్చే అనైతిక ప్రవర్తన, ఇందుకు కారణాలు. ఏ మంచి కోసమైనా సరే, ఎంతమాత్రమూ సమర్థించకూడని లించింగ్ మాబ్ మెంటాలిటీ ఇది. తమను, తమ జీవితపు సంఘటనలను, తమ వాదాభిప్రాయాలను పేలవమైన కథలుగా చెలామణీ చేసే రచయితలు లేరని కాదు కాని, కథలన్నీ రచయిత అనుభవాలుగా, పాత్రల ఉద్దేశాలన్నీ రచయిత అభిప్రాయాలుగా మాత్రమే అనుకోవడం, రచయితకు కాల్పనిక దృష్టి లేదని అవమానించినట్టే. స్పందన వ్యక్తపరచిన అభిప్రాయం గురించి ఉండాలి కానీ వక్త గురించి కాదనేది మౌలిక జ్ఞానం. విమర్శ రచన గురించే తప్ప రచయిత గురించి కాదనేది కనీస మర్యాద. పాఠకుల మాట అటుంచి, కనీసం ఇది విమర్శకులకూ రచయితలకూ అలవడనంత వరకూ సాహిత్యస్పందన దొమ్మిలాట స్థాయిని దాటదు. తమకు నచ్చినట్టే, నచ్చినవే రాయాలి, అనాలి, వినాలి, చూడాలి అనే సాంస్కృతిక నాజీల దౌర్జన్యమూ ఆగదు. రచయితకు, ఆమాటకొస్తే ఏ కళాకారునికైనా తన సృజనను, అది ఎంత వివాదాస్పదమైనదైనా సరే, నిర్భయంగా ప్రకటించగలిగే, ప్రదర్శించగలిగే స్వేచ్ఛ ఉండాలి. ఆ తర్వాతే ఏ చట్టబద్ధమైన నిరసనైనా. మనిషిని జంతువు నుండి వేరు చేసే ఒక గొప్ప శక్తి మాట. ఆ మాటకున్న శక్తిని సంపూర్ణంగా గుర్తించేది, దాని విలువను నిలబెట్టగలిగేది సమర్థులైన రచయితలే. వారికి ఆ స్వేచ్ఛనివ్వలేని సమాజం ఒక జంతుసమూహం మాత్రమే.

కళా సృజన అడవినుండి రాజాస్థానాలకు వెళ్ళిననాటినుండీ బహుశా దానికి వాణిజ్య విలువ ఏర్పడింది. రాజులు, జమీందారులూ పోయాక అది చాలా వరకూ పడిపోయింది. ఆ తర్వాత ప్రజాస్వామ్య యుగంలో, మానిటరీ బెనిఫిట్ స్థానంలో జనాదరణ వచ్చి కూర్చుందని చెప్పవచ్చు. దానికి మూలసాధనం ప్రచారసాధనాలయ్యాయి. అవి టెక్నాలజీతో మరింత ఎక్కువై, ఇంటర్నెట్ వచ్చాక బ్లాగుల్లో ఇన్‌స్టంట్ ప్రతిస్పందన నుంచి, ఇప్పుడు సోషల్ నెట్‌వర్కింగ్ ద్వారా అత్యంత వేగంగా ఎక్కువమంది జనాలకి ప్రచారం కావడం వరకూ వచ్చింది. ఇదొక అద్భుత మాయా ప్రపంచం! అయితే, కళని వాణిజ్యంగా కాక, తమ జీవితాన్వేషణగా, ఒక ఆంతరంగిక తపస్సుగా చేసుకున్న కళాకారులూ కనిపిస్తారు. వాళ్ళకు శ్రోతలు కొట్టే చప్పట్లు కాని, పాఠకులు పెట్టే లైకులు కానీ పట్టవు. విలా కేథర్ కథలో, ఒక సాయంపొద్దును చూస్తూ మైమరచిపోయిన శిల్పి అలాంటి వాడు. బాలసుధాకర్ కవితలో, రాతి కాలాన్ని నిర్దయగా ఛీకొట్టే పాటగాడు అలాంటి వాడే. ఏదో పిలుపునందుకుని మోస్తున్నవన్నీ పక్కనపెట్టి ఒక ప్రయాణానికి బయలుదేరిన కవి, జీవితానందం ఇప్పుడు ఈ రోజు ఈ క్షణం మాత్రం వీలయినంత లేనితనంలో ఉందనిపిస్తుంది, అంటున్న కుంచె కవీ కూడా ఆ బాపతువాళ్ళే! వీళ్ళలో కొంతమందికి అప్పుడప్పుడూ ప్రపంచం ముళ్ళకిరీటం పెడుతూ ఉంటుంది. ఎంతోమందికి పిచ్చివాళ్ళని బిరుదిచ్చి దూరంగా జరిగిపోతుంది–అది వాళ్ళ అదృష్టం, ప్రపంచం దురదృష్టం!

సాంస్కృతికంగా బలమైన సమాజాల్లో ప్రతీ తరం రాబోయే తరాలకు బహుముఖీనమైన కళావారసత్వాన్ని ఇచ్చి వెళ్ళడం, ఆ నీడన కొత్త తరాలు తమ ఆలోచనలను రూపు దిద్దుకోవడం పరిణామక్రమంగా జరిగే విషయం. ఆ వారసత్వం లేని సమాజం ఎక్కువకాలం ఉండలేదు. తెలుగులో సాహిత్యసంగీతాది కళలలో లబ్ధప్రతిష్టులైన ఎందరో కళాకారులు నిన్నటి యువతరానికి తమ వారసత్వాన్ని అందించి పడమటిగూటికి చేరుకుంటున్నారు. వారికి వారి కళ పట్ల ఒక స్పష్టమైన జ్ఞానం, కళలకు లక్షణాలే కాని కచ్చితమైన నిర్వచనాలు ప్రయోజనాలు ఉండవన్న విచక్షణ ఉన్నది. అది వారి వారి సృజనలో ప్రతిఫలించింది. ఆ బహుముఖీనత వల్లనే ఆ కళలు పండితపామర విచక్షణ లేకుండా పదిమందికీ చేరినది, అందరినీ అలరించినదీ. అలా చేరితేనే మంచిదనో గొప్పదనో కాకపోయినా కళ సమాజంలో ఎక్కువమందిని చేరగలగాలి. వారి అభిరుచిని పెంపొందించగలగాలి. కనీసం మంచీ చెడూ చర్చించే అవకాశం ఇవ్వగలగాలి. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. సృజనకున్న అనేకరూపాలను సమానంగా సహృదయంతో స్వీకరించి విశ్లేషించగల విమర్శా దృక్పథం ప్రస్తుతం సంగీతం, చిత్రకళ వంటి ఇతర కళలలో కొంతయినా కనిపిస్తున్నది కాని తెలుగు సాహిత్యంలో మాత్రం లేదు. బహుముఖీనతను విస్మరించి నిర్వచనాల సంకెళ్ళలో ఒకే రకమైన సాహిత్యాన్ని రచయితలు విమర్శకులు అందలమెక్కించడం వల్లనే సాహిత్యం తెలుగు సమాజంలో ఒకప్పటి ప్రాభవాన్ని పోగొట్టుకున్నది. సాహిత్యరంగంలో నిన్నటి తరం నేటి తరానికి అందించిన వారసత్వం ఎటువంటిది, అది రేపటికి ఎలా ఉండాలి? అని ప్రశ్నించుకోవలసిన సమయం వచ్చి కొంత కాలమయినా ఎవరూ ఆవైపుగా ఆలోచిస్తున్న దాఖలాలు లేవు. రచయితలు ఇప్పటికీ పాతకాలపు సాహిత్య భావనలనే పట్టుకుని వేలాడడం, విమర్శకులు సాహిత్యరూపలక్షణ పరిమితీపరిణామాలపై చర్చ విస్తృతంగా జరపకపోవడం ఇందుకు కారణాలు. ఈ స్థితిని సంస్కరించే దిశగా నేటి సాహిత్యకారులు అడుగువేస్తారని, రేపటితరంలో వారి వారసత్వంగా చక్కటి సాహిత్యాభిరుచిని పెంపొందిస్తారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆశించడం ఎండమావి చందమే అయినా అది ఎప్పటికీ అత్యాశ కాకూడదనే మా ఆశ.

తెలుగులో లలిత సంగీత సృష్టికర్త, గాయకుడు, రచయిత, గేయనాటక సంగీత రూపకకర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, రేడియో జేజిమామయ్య బాలాంత్రపు రజనీకాంతరావుగారి గురించి క్లుప్తంగా చెప్పడం అసంభవం. రజనిగా పదిమందీ పిలుచుకునే ఆయన పూర్ణాయుర్దాయం తర్వాత కాలధర్మం చెందటం సహజమే అయినా ఒక తరం ముగిసిపోయిందన్న బాధ కూడా కలగకమానదు. ఈ సందర్భంలో, ఈమాటలోని ఆయన రచనలు ఒకసారి గుర్తు చేసుకుందాం. చలంతో రజని ముఖాముఖీ; బాలల సంగీత రూపకం కొండనుంచి కడలి దాకా; తెలుగులో మేఘసందేశం ఆడియో రూపకం; పరుచూరి శ్రీనివాస్ సమగ్ర పరిచయ వ్యాసం తెలుగు లలిత సంగీతంలో రజనీ గంధం; కొడవటిగంటి రోహిణీప్రసాద్ రాసిన 88 ఏళ్ళ యువకులు; కొత్తగా ఈ సంచికలో, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు సంపాదకీయంలో వెలువడిన ప్రసారతరంగిణి రేడియో కార్యక్రమాలపై వ్యాస సంకలనం నుంచి రెండు వ్యాసాలు; రజనితో అనుబంధం గురించి మంగళంపల్లి బాలమురళీకృష్ణ పంచుకున్న ముచ్చట్లు; ఎన్నో వివరాలు విశేషాలతో నిండిన రజని రేడియో ఇంటర్‌వ్యూ; ఒక అరుదైన ఆంగ్ల సంగీతరూపకం, ఎ థిమాటిక్ మ్యూజిక్ పీస్ ఆదికావ్యావతరణం – ది బర్త్ ఆఫ్ ఆన్ ఎపిక్; రజని బహుముఖ ప్రజ్ఞను స్థాలీపులాకన్యాయంగానైనా పాఠకులకు పరిచయం చేస్తాయని ఆశిస్తున్నాం. ఇవే కాక, కథలు, కవితలు, సమీక్షలు…

ఇటాలియన్ ఆపెరా రచయిత ద పోన్తె (Da Ponte), సంగీత స్వరకర్త మొజార్ట్ (Mozart) కలయికలో వచ్చిన మూడు రూపకాలు — లె నోట్జె ది ఫిగారొ, దాన్ జియోవాన్ని, కొసీ ఫాన్ తుత్తె– 18వ శతాబ్దం నుంచి ఇప్పటిదాకా బహుళ ప్రజాదరణకు నోచుకుంటూనే ఉన్నాయి. వీటిలో మూడవదైన కొసీ ఫాన్ తుత్తె (Così fan tutte) రెండు జంటల మధ్య జరిగిన కథ. తమ ప్రియురాళ్ళ ప్రేమకు ఇద్దరు యువకులు పెట్టిన పరీక్ష. ఒక హాస్య నాటికగా ఉద్దేశించబడిన ఈ ఆపెరా మొదట మొదట అంతగా ఆకట్టుకోకపోయినా రాను రాను మొజార్ట్ ముఖ్యమైన ఆపెరాలలో ఒకటిగా నిలిచింది. ఎన్నో ఆధునిక రూపాంతరాలలో కూడా ఇప్పటికీ ప్రదర్శించబడుతున్న ఈ ఆపెరా, అత్యంత ఉదాత్తమైన స్థాయినుంచి, అధమస్థాయి వరకు ప్రేమలోని ఎన్నో రంగులను స్పృశిస్తుంది. మానవ స్వభావంలోని చీకటి కోణాలనూ చూపెడుతుంది. ఈ ఆపెరాను ఒక యక్షగాన పద్ధతిలో ఇంతులందఱు నింతయే అనే సంగీత రూపకంగా అనుసృజించారు తిరుమల కృష్ణదేశికాచార్యులు. ఇటువంటి ప్రయోగం తెలుగులో బహుశా ఇదే మొదటిసారి; తెలుగు భాషలో ఒక పదంతో క్రియకు ఉండే సంబంధాన్ని విభక్తి ఎలా సూచిస్తుందో, దానికి చిన్నయసూరి ప్రతిపాదించిన సూత్రం ఏమిటో, ఆ సూత్రం సూచిస్తున్న భాషా లక్షణం ఏమిటో, దానికి లొంగని ప్రయోగాలు ఏమిటో, వాటి వెనకనున్న కారణాలు ఏమిటో, జడ ద్వితీయకు ప్రథమ అనే వ్యాసంలో ఆసక్తితో వివరిస్తున్నారు భైరవభట్ల కామేశ్వరరావు; వీటితోబాటుగా ఆర్టిస్ట్ అన్వర్ ఇస్తున్న సిలబస్ పాఠాలు; పరుచూరి శ్రీనివాస్ సమర్పిస్తున్న అలనాటి లలితగీతాలు; ఇంకా, కథలు, కవితలు, వ్యాసాలు…

గమనిక: ఎంతోమంది పాఠకులు అడుగుతున్నందువల్ల, శ్రీశ్రీ పదబంధ ప్రహేళికల సమాధానాలు ఇప్పటిదాకా ప్రచురించిన గడులకు ఆయా గడుల ఆధారాల కిందన జతచేశాం. ఇకనుంచీ ప్రచురించబోయే గడులకూ ఈ సదుపాయం కలగచేస్తాం.