ప్రతీ ప్రాంతీయ సమాజమూ తమ భాష, కళలు, సంస్కృతుల మనుగడ, కొనసాగింపుల కోసం తపన పడుతుంది. ప్రత్యేకించి ఒక కళ కనుమరుగవుతోందన్న భయం ఉన్నప్పుడు దానిని కాపాడుకోవడం కోసం కొంత ప్రయత్నమూ కనిపిస్తుంది. ఇతర భారతీయ భాషలతో పోలిస్తే, తెలుగులో సాహిత్యానికి ఆదరణ తక్కువవుతోందన్న ఆందోళన ఒకటి నేటి వాతావరణంలో ఉంది. కానీ గమనిస్తే ఇలా ఆందోళన పడిన ప్రతీ తరం వెనక కొత్త తరం రచయితలు, కవులు పుడుతున్నారు, సాహిత్య సృజనను కొనసాగిస్తున్నారు. ఇన్ని కోట్లమంది మాట్లాడే తెలుగు భాషకి మరికొన్ని తరాల దాకా, కనీసం ఇప్పటికి బతికున్న తరంలో పుట్టిన ఆఖరు మనిషి చనిపోయేదాకా, ముంచుకొచ్చే ముప్పేమీ లేదు. తెలుగులో సాహిత్యానికి కొత్తగా రాబోయే లోటూ లేదు. కాని, సాహిత్యాదరణ, సాహిత్యాభిరుచి ముందుతరాలలో మరింతగా పెరగాలి అనుకుంటే – వారికి వ్రాతలో మనం ఏం మిగుల్చుతున్నాం? ఎటువంటి సాహిత్య లోకంలోకి వారిని ఆహ్వానిస్తున్నాం? బహుముఖీనమైన మన సాహిత్యంలో ఎన్ని ముఖాలను మన తరువాతి తరాలకు కనపడేలా, మరీ ముఖ్యంగా కనపడకుండా ఉండేలా చేస్తున్నాం? అన్నవి ఆలోచించవలసిన ప్రశ్నలు. మనకే ప్రత్యేకమో కాదో తెలియదు కాని, తెలుగులో సీరియస్ సాహిత్యం, సీరియస్ రచయితలు అనే ఒక ప్రత్యేక ప్రథ ఉంది. పాప్యులర్ సాహిత్యంగా పరిగణించబడే ఇతర సాహిత్యప్రక్రియల పట్ల కేవలం – హాస్యరచనలని, క్షుద్ర రచనలని, వంటింటి ఊసులని, కలల కబుర్లని – చిన్నచూపు ఉండటం మనకు చిరపరిచితం. ఈ చూపు, విచిత్రంగా పాఠకులకు ఏనాడూ పట్టలేదు – పుస్తకాదరణను పరిగణనలోకి తీసుకుంటే, వాళ్ళు తమ తమ అభిరుచులకు అనుగుణంగా అన్నిరకాల సాహిత్యాలనూ ఆదరిస్తూనే వస్తున్నారన్నది స్పష్టం. ఈ ధోరణి కేవలం సాహిత్యాన్ని, దాని ప్రయోజనాన్ని నిర్వచించి నియంత్రించబూనిన రచయితల సంఘాలది. పాఠకులు ఏది చదవాలో నిర్దేశించాలన్న దౌర్జన్యం అది. కళాకారులుగా ప్రతి ఒక్కరికీ తమదైన ఆశయం, రాజకీయ దృక్పథం, భావజాలం ఉండవచ్చు. వారు వాటికి అనుగుణంగా రచనలూ చేయవచ్చు. తప్పు లేదు. కాని, అది మాత్రమే అసలైన సాహిత్య ప్రయోజనమని, అలా కాని రచనలను, ఆయా రచయితలను ఉపేక్షించడం లేదా కువిమర్శకు గురి చేయడం సాహిత్యానికి, సదరు ఆశయానికీ కూడా హానికరమే. ఇందువల్లనే నిర్బంధసమాజాల్లో సప్తవర్ణ సమ్మిళితమైన సాహిత్యం అన్ని రంగులూ హంగులూ కోల్పోయి వర్ణవిహీనమైన ప్రాపగాండా సాహిత్యంగా మాత్రమే మిగిలేది. ఎల్లలు లేని సాహిత్యం నిజాలు చూపిస్తుంది, కలలూ కననిస్తుంది; ప్రశ్నిస్తుంది, సమాధానాలూ చూపుతుంది; ఆశయాలకు ఆలోచనలకూ స్పష్టత నిస్తుంది, మేధోమథనానికి దారి తీస్తుంది, కాసేపు ఆదమరిచి నవ్వుకునేలానూ చేస్తుంది. ఏ రకమైన సాహిత్యప్రక్రియ అయినా ఇంకొకదానికంటే గొప్ప కాదు, తక్కువా కాదు. రచయిత ఆశయం వల్ల సాహిత్యానికి విలువ పెరగదు, తరగదు కూడా. సమాజంలో దేని స్థానం దానికుంటుంది. అన్ని రకాల సాహిత్యప్రక్రియలూ సమానమైన ఆదరానికి నోచుకోగల స్వేచ్ఛాపూరిత వాతావరణంలో మాత్రమే ఔత్సాహిక రచయితలు విభిన్నమైన సాహిత్యప్రయోగాలతో ముందుకు వస్తారు. ఆ విభిన్నతతో పాటు పాఠకులూ పెరుగుతారు. భాష మనుగడ మరింత పెరుగుతుంది. రచనా విమర్శలో భావజాలపు చీటీలను తీసేసి, రచనను చర్చించడం ఒక అవసరమని సాహిత్యకారులు గమనించడం, ప్రస్తుత వాతావరణంలో మార్పు తీసుకురావడానికి దోహదపడే ఒకానొక ముఖ్యమైన అంశం. సృజన అన్ని నియమాలనూ త్రోసిరాజని బతుకుతుంది. ఇక్కడ చెల్లుబాటయ్యే నియమం ఏదైనా ఉందీ అంటే, అది ఏ నియమమూ ఉండకూడదన్నదే.

రచయితల బృందాలే మనకు మిగిలిన పాఠక బృందాలు కూడానా అన్న అనుమానం కలిగించే సంధికాలంలో నిలదొక్కుకోవడానికి తెలుగు సాహిత్యం ప్రస్తుతం అవస్థపడుతోంది. బహుశా అందుకే రచయితలు కూడా పాఠక బృందాల కోసం, రచయితలుగా తామే గుంపులో చేరాలో కూడా ముందుగానే నిశ్చయించుకుంటున్నారు. ఈ సాంఘిక సాహిత్య సంప్రదాయాలని ఎంత వంటబట్టించుకున్నా, రచన మనగలిగేది దాని నాణ్యత వల్ల మాత్రమే. పుస్తక ప్రచురణ అరచేతిలో ఉసిరికాయలా మారిపోయాక, అచ్చులో పేరు చూసుకోవడమనేది ఈనాడు ఆర్థికంగా పుష్టిగా ఉన్న అందరికీ తీరగల్గిన కలే అయింది. వేరే పత్రికవారు ప్రచురించకుంటే తామే పత్రిక పెట్టుకొని ప్రచురించుకోవడమూ ఒక పంథాగా మారింది. అందువల్లనేనా అచ్చులో తమ పేరు చూసుకోగలిగిన వారంతా తాము ‘రచయితల’మని భ్రమపడుతున్నారు? ఆ వెంటనే తెలుగునాట సంప్రదాయం ప్రకారం ఆ భుజకీర్తి ధరించి సమాజోద్ధరణ తమ బాధ్యతన్న అహాన్ని శిలువలా మోస్తున్నారు? రచయితకు సమాజం పట్ల ఎలాంటి బాధ్యతా ఉండనవసరం లేదన్నది అటుంచుదాం. నిజానికి, సమాజంలో మార్పు తేవాలంటే రచన అన్నిటికన్నా బలహీనమైన ఆయుధం అన్న నిజాన్నీ పక్కనపెడదాం. దానికంటే ముందు, రచయితలు అని ఎవరికి వారు అనుకోవడమేనా? లేదా ఏదైనా ప్రామాణికత ఉందా? చిత్రమైన విషయమేమంటే, సాహిత్యం ఇతర కళలలాగా మన లోటుపాటులు మనకు చెప్పదు. మన పాట, మన ఆట మన స్థాయేదో వెంటనే చెప్తాయి. కానీ వ్రాత అలా కాదు. మనది అనుకున్న రచనలో ఏం ఉందో, ఏం లేదో అర్థం చేసుకోవడం కూడా దానికదే ఒక అభ్యాసం. దురదృష్టవశాత్తూ తెలుగులో ఆ అభ్యాసానికి చోటు లేదు. ఇది మాతృభాష కాబట్టి, తమకు బాగా వచ్చని, ఇందులో తమ భావాలను తాము అనుకున్న విధంగానే వ్యక్తపరుచుకుంటున్నామనీ అపోహలో వ్రాసుకుపోయేవారు ఎందరో లెక్కలేదు. పైగా, రచన సహజంగా అంతరాంతరాల్లో నుండి సజీవ అనుభవంగా కాగితం మీదకి రావాలన్న ఊకదంపుడు ఉండనే ఉంది. ఆ సజీవ స్పందన ఒక మనిషి నిజంగా అనుభవించినదే అయితే, అందులోని ఉద్వేగాలు అంతే బలంగా, అంతే నిర్మలంగా అక్షరాల్లోకి తర్జుమా కాకపోతే అది ఆ అనుభవానికే అవమానం అన్న ఎరుక, రచయితల్లో కొరవడిందని ఇటీవల వస్తున్న ఎన్నో స్వగతాలు, సొంత కథలు, అదే ధోరణిలో సాగుతున్న కవితలు చెబుతూనే ఉన్నాయి. నిజానికి ప్రపంచంలో కథకు పనికిరాని వస్తువు లేదు. ఏదయినా కథగా మారుతుంది, అది ఒక మంచి కథగా చెప్పగలగాలి, కథనంలో పదును, ఒడుపు ఉండాలి. పాఠకుడిని ఆపకుండా చదివించగలగాలి. ఆ ప్రతిభ ఇప్పుడున్న రచయితలలో నూటికో కోటికో ఒకరిద్దరిలో ఉంది. సహజ ప్రతిభ చాలా కొద్దిమందికే దక్కిన వరం. మిగతా అందరికీ రచయిత కావాలి అంటే వాక్యంతో ఎంతో పరిశ్రమ అవసరం. వాక్యంతో వస్తువుతో మమేకమవ్వడం అవసరం. ఎవరికి వారే రచయిత అనుకోవడంలో అర్థం లేదు. రచనావ్యాసంగం మిగతా కళలకంటే కష్టతరమని, దానికి ఎంతో సాధన, అధ్యయనం కావాలని గమనించనంత కాలం ఎవరూ రచయితలు కాలేరు. పాఠకలోకం మీద విమర్శలు గుప్పించి తమ అసహనాన్ని చాటుకోవడం నుండి ఈ తరహా రచయితలు ఎన్నటికీ విముక్తులు కాలేరు. తమ పుస్తకపు, రచనల విలువను ఎవరూ గుర్తించడం లేదని, తెలుగునాట ఆ స్థాయి గల పాఠకులు లేరని, తమ పుస్తకాలకు అమ్మకాలు లేవని, ఇక్కడ కుట్రలూ మోసాలు జరుగుతున్నాయనీ సామాజిక మాధ్యమాలు వేదికగా గొంతెత్తి చెబుతున్న రచయితలకు కొదువేం లేదు. అయితే వీటిలో నిజమెంత? అమ్మకాలు సమీక్షలు ఎంత మేరకు రచన విలువను పట్టివ్వగలవు? అన్న ప్రశ్నల కన్నా ముందు రచయితల లోపల సుళ్ళు తిరగాల్సిన ప్రశ్న: నేను నిజంగా రచయితనేనా?

డిసెంబరు, జనవరి నెలల్లో హైదరాబాదు, విజయవాడలలో జరిగే పుస్తక మహోత్సవాలు ఏటేటా మరింత బలపడి సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. వేల పుస్తకాలు ఒకేచోట అందుబాటులో ఉండే ఈ ప్రదర్శనలకు విచ్చేస్తున్న వారి సంఖ్యా అదే తీరున ఉంటోంది. సామాజిక మాధ్యమాలు, ప్రచురణ రంగంలో వచ్చిన మార్పుల పుణ్యమా అని రచయితల సంఖ్య పెరిగింది. రచయితలకూ పాఠకులకూ మధ్య దూరం తగ్గింది. ఈ స్నేహభావాలన్నీ పుస్తక ప్రదర్శనల్లో కనిపించడమే గాక, సాహితీప్రియులు పెద్ద సంఖ్యలో పుస్తకప్రదర్శనకు విచ్చేసేందుకు కూడా దోహదం చేస్తున్నాయి. తెలుగు సాహిత్యరంగం ఈ రెండు ప్రదర్శనలే లక్ష్యంగా పుస్తక ప్రచురణ చేపడుతోంది అనడం అతిశయోక్తి కాదు, ఎంతో మంది రచయితలు ఇక్కడి అమ్మకాలే కొలమానంగా పుస్తకాలను సిద్ధం చెయ్యడం అసమంజసమూ కాదు. కాని, పుస్తక ప్రచురణ, ప్రదర్శన, విక్రయం – ఇవన్నీ ఇలా ఈ రెండు ప్రాంతాలకు, కొన్ని రోజులకూ మాత్రమే పరిమితం కాకూడదు. తెలుగునాట సాహిత్యానికి ఆదరణ అంతగా లేదన్న అభియోగం నిజం కాకూడదంటే ఈ పుస్తకాలను, ఈ పుస్తకాల పండుగలను మిగతా ఊళ్ళకు, చిన్న చిన్న పట్టణాలకూ తీసుకురావాలి. సాహిత్యం ఒక సాంస్కృతిక సందర్భం కూడా కావాలి. చిన్నచిన్న ఊళ్ళల్లోనూ పుస్తకాల దుకాణాలుంటాయి. కాని, అవి ముఖ్యంగా నిత్యావసరాలకు ఉపయోగపడేవే కాని సాహిత్యాభిలాషను పెంపొందించే ఉద్దేశ్యంతో నడిచేవి కావు. ఆర్థిక కారణాలవల్ల సాహిత్య ప్రచురణకర్తలు, పంపిణీదారులు అలాంటి ఊళ్ళలో ఏడాది పొడుగునా దుకాణాలు తెరవలేరు. అయితే, అంత చిన్న ఊళ్ళల్లో కూడా పండగలకు జాతరలు, ప్రతి ఏటా తిరణాళ్ళ వంటివి జరుగుతాయి. ప్రతీ ఏడూ జరిగే ఆ పండుగలు వారి సామూహిక సామాజిక సాంస్కృతిక స్పృహలో భాగం కనుక జనం వాటిని గుర్తు పెట్టుకుంటారు. వాటికోసం ఎదురు చూస్తారు. వాటి గురించి మాట్లాడుకుంటారు. సంగీతం, సాహిత్యం – కళ ఏదైనా సమాజంలో ఆదరణ పొందాలి అంటే అది ఆ సమాజపు సాంస్కృతిక స్పృహలో, ఆ ఊరి ప్రజల సంభాషణలో భాగం కావాలి. పుస్తకాల పండగ కూడా అలాంటిదే, అదీ మనదే అన్న భావనను వారి స్పృహలో భాగం చెయ్యగలిగితే, ఆ సందర్భానికి కూడా క్రమేణా ఎదురు చూస్తారు. పుస్తకాలు కొంటారు, అంతకంటే ముఖ్యంగా చదువుతారు. సమకాలీన సాహిత్యంతో పరిచయం కలుగుతుంది. అవగాహన ఏర్పడుతుంది. మెల్లగా, మంచి సాహిత్యాన్ని గుర్తుపట్టడమూ ఆదరించటమూ అలవాటవుతుంది. నగరాలంత పెద్ద స్థాయిలో కాకున్నా ఊళ్ళల్లో పాఠశాలల ఆటమైదానాల వంటి చిన్న ప్రదేశాలలో, ఏదో ఒక స్థాయిలో గ్రంథాలయాల్లో, ఖాళీగా ఉన్న కళ్యాణమండపాల్లో పుస్తకోత్సవాలు ఏర్పాటు చేయవచ్చు. మొదట్లో ప్రచురణకర్తలకు, నిర్వాహకులకూ ఇవి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా లేకపోయినా, చిన్న చిన్న పట్టణాల్లో, ప్రతీ ఏడాదీ జరిగే జాతరలు, ఉత్సవాల లాగానే, పుస్తకాల పండుగ కూడా ఒకటి వాళ్ళకు గుర్తుండేట్టు చేయగలిగితే, పండుగలా జరపగలిగితే, సమకాలీన సాహిత్యాన్నీ ఆ చిన్న పట్టణాల సామూహిక స్పృహలో భాగం చెయ్యవచ్చు. తద్వారా సాహిత్యాభిరుచిని మరింతగా పెంపొందింపవచ్చు. అయితే, ఈ మార్పు ఏ ఒకటీ రెండేళ్ళలోనే వచ్చేది కాదు. కాని, గొప్ప సంకల్పాలు, గొప్ప ప్రణాళికలు ఎప్పుడూ ఎక్కువ సమయాన్నే కోరుకుంటాయి కదా.

ప్రపంచం గత యాభయ్యేళ్ళలోనే మనం ఎన్నడూ ఊహించనంతగా మారింది. ఆ మార్పులకు తగ్గట్టు ప్రపంచమంతా తనను తాను దిద్దుకుంటోంది కానీ తెలుగునాట పిల్లల పెంపకం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. ఒక కుటుంబంగానో సమాజంగానో ఇన్నేళ్ళుగా మనం ప్రతిపాదించుకున్న విలువలకీ సంప్రదాయాలకీ గండికొడుతూ కొత్త నీరు మన వైపు ఉధృతంగా దూకుతున్నప్పుడు, దానిని అడ్డుకోలేక, తమవని చెప్పబడుతున్న ఏ విలువలనూ బలంగా నిలుపుకోలేక ఈ కాలపు పిల్లలు నలిబిలి అవుతున్నారు. ప్రత్యేకించి బాల్యం నుండి కౌమారంలోకి ఎదిగే కాలం ఎంతో సంక్లిష్టమైనది. ఆ వయసులో వారి మనసుల్లో శరీరాల్లో ఎన్నో మార్పులు వస్తాయి. కొత్త కొత్త ఆలోచనలూ ఇష్టాలూ కలుగుతాయి. మేధోపరమైన కొత్త ఊహలు, కుతూహలాలు ఏర్పడతాయి. మానసిక అవసరాలు, శారీరక ఆకర్షణలు అర్థమవుతాయి. ప్రపంచపు రంగులు ఒక్కొక్కటిగా గోచరమవుతాయి. ఈ మానసిక శారీరక ఆవరణలను, ఊహాప్రపంచాలను, సమాజపు పోకడలను ఏకకాలంలో అర్థం చేసుకోవడానికి వాళ్ళెంతో సంఘర్షణకు లోనవుతారు. ఆ సంఘర్షణను దాటే మార్గాలను వాళ్ళకు సూచించకుండా వాళ్ళ నుండి ఒక ఆదర్శవంతమైన ప్రవర్తననూ జీవితాన్నీ ఆశించడం సరికాదు. ఏదో ఒక ఊతాన్ని ఆధారంగా చేసుకుని, ఆ సంఘర్షణను దాటుకుని, తమవైన విలువలను, ఆదర్శాలను, ఆకాంక్షలనూ స్వేచ్చగా ఏర్పరచుకోవడానికి అనువైన వాతావరణం ఏర్పరచగలగాలి. అందుకు తోడ్పడగలిగినది ఒక్క సాహిత్యం మాత్రమే. పేరుకైనా బాలసాహిత్యం ఎంతో కొంత తెలుగులో ఉంది కాని, యంగ్ అడల్ట్ లిటరేచర్ అనబడే కౌమార సాహిత్యం అనేది పూర్తిగా మృగ్యం. ఎందుకంటే పిల్లలు-పెద్దలు అనే రెండే ప్రాయాలు మనకు. ఈ రెంటి మధ్య ఉండే కౌమార్యప్రాయపు ముఖ్యతను మనం ఎప్పుడూ గుర్తించలేదు. ఎందుకంటే తెలుగునాట అది అత్యంత విలువైన కాలం. ఎంట్రన్సులకి సన్నద్ధమయ్యే కాలం. మార్కులతో రాంకులని, రాంకులతో జీవితాన్ని మెలిపెట్టి ఉక్కిరిబిక్కిరి చేసే కాలం. ఈ చదువు, ఉద్యోగం అనే తిరగలిరాళ్ళ మధ్య పిల్లల కౌమార్యం నలిగి ఉనికి కోల్పోతుంది. తమ మనసులో భావాలు పంచుకోవడానికి, కనీసం తమ ఆలోచనలకు ఊహలకు స్పష్టత నిచ్చుకోడానికీ వారికి సమయమూ ఉండదు, ప్రోత్సాహం అంతకంటే ఉండదు. అందువల్లే కదా, ఆ వయసులో పిల్లలు తప్పులు చేసేది? సామాజికము, వైయక్తికము, నైతికమూ అయిన విలువలు వారికి ఎలా కట్టుబడతాయి? ప్రేమ, శృంగారం, నడత, బాధ్యత వంటి వాటి గురించి వారికి తెలుగు సినిమాలు, టి.వి.ల వెకిలితనం ద్వారా తప్ప తెలిసే మార్గం ఇంకేమిటి? సంస్కృతి, ధర్మం, మర్యాద అంటూ వారిని కట్టుబాటు చేయడం తప్ప మన పెంపకాల్లో ఇంకేం మిగిలింది? ఆ వయసులో వారికి ఆ వయసు సాహిత్యం కావాలి. వారి మనసుల్లో జరిగే సంఘర్షణలకు అక్షరరూపం కావాలి. వారికి వ్యక్తిత్వం పట్ల స్పష్టతనిచ్చే కథలు కావాలి. తప్పులు, దిద్దుబాట్లు విప్పి చెప్పి ఓదార్పునూ భరోసాను ఇచ్చి, వాళ్ళ జీవితాన్ని పట్టి చూపిస్తూ కూడా తీర్పులకు తెగబడే తెంపరితనం లేని సాహిత్యం కావాలి. దురదృష్టవశాత్తూ ప్రస్తుత సమాజంలో పిల్లలు సోషల్ మీడియాలో పెరుగుతున్నారు. బాల్యం నుంచి నేరుగా యవ్వనంలోకి దూకుతున్నారు. వ్యక్తిత్వాలు రూపుదిద్దుకునే కౌమారాన్ని ఇంకాస్త మెలకువతో గమనించుకోవడానికి, ఆ జీవితాన్ని అక్షరబద్ధం చేయడమొక అవసరం. ఆ వయసు వాళ్ళని వాళ్ళ కథలు నిస్సంకోచంగా, నిర్భయంగా చెప్పుకోనివ్వాలి. కథలు, నవలల పోటీలు, ప్రోత్సాహాలు కావల్సింది జీవితం మీద అభిప్రాయాలు ఏర్పడిన రచయితలకంటే ముఖ్యంగా అవి ఏర్పడబోతున్న తరానికి.

కలలూ కుతూహలమూ రెండూ పచ్చగా చిగుర్లేసే కాలం ఏ మనిషి జీవితంలోనైనా బాల్యమేనేమో. మనిషిగా శారీరకంగాను, మానసికంగానూ దృఢంగా ఎదగడానికి పౌష్టికాహారం, వ్యాయామం, మంచి సమాజం అవసరమైనట్టే మంచి సాహిత్యమూ అవసరమే. వీటిని కనీస అవసరాలుగా గుర్తుపట్టాలి. ప్రస్తుత తెలుగు సమాజంలో ఎదిగే పిల్లలకు వీటిలో ఏవి ఏరీతిన దక్కుతున్నాయన్నది ప్రశ్నార్థకమే. మొదటినుండీ మన సమాజంలో పిల్లలకు గౌరవనీయమైన స్థానం లేదు. ఒదిగి ఉండటాన్ని అభినందించినట్టు ప్రశ్నించడాన్ని అభినందించడం; అమాయకత్వాన్ని అక్కున చేర్చుకున్నట్టు, పరిశోధకతనూ కుతూహలాన్నీ చప్పట్లు కొట్టి ఉత్సాహపరచడం ఉండదు. తమను ఇబ్బంది పెట్టే పిల్లల ప్రశ్నలను కొట్టిపారేయకుండా, పక్కకు నెట్టేయకుండా సమాధానం ఇవ్వడం కనపడదు. ఈ పరిస్థితి ఇప్పుడిప్పుడే మారుతున్నట్టు కనపడుతోన్నా, మారాల్సిన దానితో పోలిస్తే ఆ శాతం ఏమంత చెప్పుకోదగ్గది కాదు. కుతూహలం జ్ఞానాన్ని పెంచుకోవడానికి మొదటి మెట్టు. ఆలోచించడం, ప్రశ్నలు వేసుకోవడం, ప్రశ్నించడం, జవాబులు వెదుక్కోవడం, సమాధానాలు సృష్టించుకోవడం, ఇవన్నీ పుస్తకాలు నేర్పిస్తాయి. అలాంటి పుస్తకాలు చదవడం ఎంత చిన్నవయసులో అలవడితే, అంత త్వరగా వాళ్ళు స్వతంత్రులవుతారు. ఈ చిన్నపిల్లలకు ఏ పుస్తకాలు కావాలి? ఆహ్లాదకరమో, ఆలోచనాసహితమో – అసలు బాలసాహిత్యం అంటే ఎలా ఉండాలో ఈ విభాగంలో కృషి చేస్తున్న ఎందరికి అవగాహన ఉంది? బాలసాహిత్యం అన్న చీటీ అయితే తగిలిస్తారు కానీ ఇప్పటికీ పిల్లలకు తగిన పుస్తకాలంటే ఠకామని చెప్పుకునేందుకు గట్టిగా పది పుస్తకాలైనా కనపడవు. తానా, మంచి పుస్తకం వంటి ప్రచురణలు ఈ ఖాళీలను గుర్తుపట్టి, పోటీలను పెట్టి తమ ప్రోత్సాహం ఉంటుందన్న హామీ ఇస్తున్నా, నిజానికి ఈ పోటీల్లో గెలుపొందిన పుస్తకాల స్థాయి, ఆ పుస్తకాల్లోని బొమ్మల స్థాయి చెప్పుకోదగినవిగా లేవు. పసి హృదయాలకు ఆసక్తి, ఇష్టం కలిగించడం సామాన్యమైన విషయం కాదు. కథకుడు ఎక్కడో ఆకాశంలో నిలబడి చెప్పే నీతి బోధలతోనో, బాలసాహిత్యం అనగానే లేనిపోని పెద్దరికాన్ని తలకెత్తుకుని ‘పిల్లలూ…’ అంటూ మొదలెడితేనో సాధ్యమయ్యే పని కాదు. నిజానికి అలా మొదలెట్టే రచయితలను కొరతవేసే చట్టం ఒకటి రావాలి. సమాజంలోనే పిల్లలను చూసే పద్ధతి, వాళ్ళతో సంభాషించే పద్ధతి, వాళ్ళను గౌరవించే పద్ధతి మారితే తప్ప; పిల్లలకు ఏం కావాలన్న దాని మీద కొందరికైనా కనీస అవగాహన, స్పష్టమైన అభిప్రాయం, దృక్పథం ఏర్పడితే తప్ప; బహుశా ఈ బాలసాహిత్య విభాగంలో లోటు పూడ్చలేనిదిగా ఉంటూనే ఉంటుంది. ఊహ తెలిసిన నాటి నుండి పిల్లలను చదువు అన్న చట్రంలోకి నెట్టి, వాళ్ళ ఊహలని, భవిష్యత్తుని ఉద్యోగం, హోదా, డబ్బు అన్న మాటల చుట్టూ అల్లి విప్పుకోలేని పీటముళ్ళతో వారిని బందీలను చేసే సమాజం సజీవంగా ఉన్నంతకాలం, పిల్లల సృజనాత్మకత గురించి, సంతోషం గురించి బెంగపడక తప్పదు. ఆ సమాజానికి బాలసాహిత్యం అతిశయోక్తి. అనవసరపు ప్రయాస. పిల్లలు చాలా తెలివైనవారని, ఎదిగే క్రమంలో ఎన్నో అనుభవిస్తారని, పరిశీలిస్తారని, మార్పులకు లోనవుతారని గ్రహించడం ముఖ్యం. వారి లోకాన్ని అంతే లోతుగా వారికి పరిచయం చేయడం అవసరం. పెద్దల ప్రపంచం లానే పిల్లల ప్రపంచమూ సంక్లిష్టమైనదని గ్రహించి ఆ గౌరవంతో రచనలు చేస్తే తప్ప మంచి బాలసాహిత్యాన్ని ఆశించలేం. ‘పిల్లలకేమండీ చీకూ చింతా లేని ప్రపంచం’ అనే వారెవరికీ బాల్యం గుర్తు లేదనో, అర్థం కాలేదనో, అసలు లేదనో అనుకోవాలి. ఇతరదేశాల్లో వస్తున్న బాలసాహిత్యపు మేలి రచనలను, మన పిల్లలతో పాటు ఇలాంటి పెద్దవాళ్ళకీ పాఠాలుగా చెప్పాలి.

ఆంగ్లోపన్యాసకులుగా ఉద్యోగజీవితాన్ని కొనసాగించిన సూరపరాజు రాధాకృష్ణమూర్తి ప్రాచ్య పాశ్చాత్య తత్వరీతులను మథించి విశ్వసాహిత్యాన్ని ప్రాచ్య దృష్టితో, ఆత్మతో పరిశీలించి, భారతీయ సాహిత్యంతో అనుసంధానించి విశ్లేషించి తెలుగు పాఠకలోకానికి ఒక కొత్త దృక్కోణాన్ని పరిచయం చేసిన విమర్శకులు. షేక్స్‌పియర్, ఎలియట్, బోద్‌లేర్, హాప్కిన్స్, దాన్తె, కాఫ్కా తదితరుల రచనలపై వారి విమర్శ, విశ్లేషణ భారతీయ చింతనతో ముడిపెట్టి చేసిన వ్యాఖ్యానం ఇరుభాషల సాహిత్యంతో సుదీర్ఘకాలంగా మమేకమైనందువల్ల దక్కిన సాధికారత వలన మాత్రమే కాక, ఉపనిషత్తులనీ గీతనీ నిశితంగా చూసిన చూపుతో ముడిపెట్టినందువల్ల కూడా బహు ప్రత్యేకం. ఏ వాదానికి ముడిపడివున్నా, ఆ వాదపు లోతుపాతులు కేవలం నామమాత్రంగానో, అరకొరగానో అర్థం చేసుకున్నవారి రచనలు బలహీనమైన చట్రాల్లో ఇరుక్కుని ఉండి, కేవలం శుష్కనినాదాలు, సందేశాలుగానే మిగలడం, వాటిలో సాహిత్య విలువలు మృగ్యమవడం సర్వసాధారణం. అందుకు భిన్నంగా రచనావ్యాసంగాలను కొనసాగించిన కా.రా. కథలను, శ్రీశ్రీ, బైరాగుల కవిత్వాన్ని రాధాకృష్ణమూర్తి గమనించిన తీరు, ‘మార్క్సిజాన్ని, సనాతనధర్మాన్ని, కలిపి ఒక్క ముక్కలో పట్టుకున్నాడు శ్రీశ్రీ, మరొకడు కా.రా.’ అన్న వారి పరిశీలన ఎన్నదగినవి. ‘ఎత్తగలడా సీత జడను’ అన్న వేటూరి సినీగీత సాహిత్యంలోని శ్లేషను, సౌందర్యాన్ని విప్పి చెప్పినా, కృష్ణుని పిలుపు పేరిట భగవద్గీతకు వ్యాఖ్య రాసినా అటు పండితులను మెప్పించేదిగానూ, సామాన్య పాఠకుల స్థాయిని పెంచేదిగానూ ఉండటం అబ్బురపరుస్తుంది. అగ్నిమీళేతో 2012లో తన తొలి కవితా సంపుటి ప్రచురించిన ఈ కవి, తిరిగి 2021లో జ్ఞానదేవ్ మరాఠీ రచన అమృతానుభవంను తెలుగులోకి అనువాదం చేశారు. మాణిక్యవాచకుల తిరువాచకపు స్ఫూర్తిని మాణిక్యవాణి పేరిట తెలుగులోకి తెచ్చారు. శివభక్తతన్మయతలో నడిచే ఈ చిన్న పుస్తకానికి కూడా మధ్య మధ్యలో కనపడే వ్యాఖ్యలే అసలైన ఆకర్షణ. శంకరభాష్యసహిత గీతకు వీరు చేసిన తెలుగు అనువాదం, ఈశ, కేన, కఠ, మాండూక్య ఉపనిషత్‌లకు ఈయన రాసిన అతిసరళమైన వ్యాఖ్య ఎలాంటివారినైనా ఆ ఆధ్యాత్మిక, తాత్విక లోకంలోకి సాదరంగా స్వాగతిస్తుంది. ఇరుకైన చూపులతో జీవితాన్ని, సమాజాన్ని, సాహిత్యాన్ని దర్శిస్తున్న రోజుల్లో ఉన్నాం. తత్వమీమాంస మనిషి హృదయాన్ని ఎలా విశాలం చేస్తుందో సూటిగా స్పష్టంగా చెప్పే రచనలు రాధాకృష్ణమూర్తిగారివి. జీవితాన్నైనా సాహిత్యాన్నైనా పరికించడానికి మన దగ్గర ఉండాల్సిన ప్రశ్నలను, బుద్ధిని పరిచయం చేస్తాయీ రచనలు. గొప్ప గొప్ప రచనలన్నింటిని లోతుల దాకా తీసుకెళ్ళి చూడగల సమర్థులంటూ ఉంటే, వాటిని సరిపోల్చి చూసినప్పుడు కనపడే సారూప్యాలెంత ఆశ్చర్యకరంగా ఉంటాయో వారి విశ్లేషణ ద్వారా గమనించవచ్చు. ఆయా సాహిత్య రసనిధులకు రహస్యంగా దాచిన తాళంచెవులను తన విమర్శల్లో పొందుపరిచి తెలుగు విమర్శను సంపద్వంతం చేసిన సాహితీకృషీవలురు సూరపరాజుగారు. వారి నిష్క్రమణతో ఆంధ్రాంగ్లసంస్కృత సాహిత్యాలనిట్లా కలబోసి విచారించి ఆ వివేచనను పదిమందికీ పంచగల ముందటితరం మహనీయుల్లో మరొకరిని కోల్పోయాం.

What is freedom of expression? Without the freedom to offend, it ceases to exist.” – Salman Rushdie.

ద్వేషం అనే విత్తనం మొలకెత్తితే అది ఎప్పటికీ చావదని, కలుపుమొక్కల్లా విస్తరిస్తూనే ఉంటుందని చాటడానికి రచయిత సల్మాన్ రుష్దీపై ఇటీవల జరిగిన హత్యాప్రయత్నం ఒక ఉదాహరణ. తమ స్వార్థం కోసం, గుర్తింపు కోసం, న్యూనతలను కప్పిపుచ్చుకోవడం కోసం, కొన్ని ప్రభుత్వాలు, మతసంస్థలు సమాజంలో ద్వేషాన్ని పెంచిపోషిస్తూనే ఉన్నాయి. ఆ విద్వేషానికి స్వ-పర భేదం లేదని, తమ లక్ష్యం నెరవేర్చడం దగ్గర ఆగిపోవాలని తెలీదని, అదుపు తప్పి, నిలబడ్డ నేలనంతా మహాభూతమై కబళిస్తుందని చరిత్ర ఎన్నిసార్లు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. చేయిస్తున్నారు. చెడుపిలుపులకు, చర్యలకు సత్వరం ప్రతిస్పందించే జాంతవిక సమూహమొకటి సమాజంలో ఎప్పుడూ ఉంటుంది. ముల్లాల ఫత్వాలు అమలు చేయడానికైనా, మసీదులు కూలగొట్టడానికైనా, కులమతాల పేరిట అసహాయులపై దాడికైనా ఈ మూర్ఖపు మూక సదా సన్నద్ధంగా ఉంటుంది. సొంత ఆలోచనంటూ లేని వీరికి ఎప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే, ఎంతటి దేవుడినైనా విమర్శించగలిగే, చివరికి హేళన కూడా చేయగలిగే అధికారం -మహాభక్తులకు, కళాకారులకు- ఇద్దరికే ఉందని. నిఖార్సైన ఏ కళాకారుడూ మతసంస్కృతులలోని సత్సంప్రదాయాన్ని విమర్శించడు. హేళన చేయడు. కాని సంప్రదాయం అనే ముసుగులో జరిగే ఘోరాలను, అత్యాచారాలను; పవిత్రత, మర్యాద అనే పట్టుబట్టలు కప్పుకున్న మానవమృగాలను విమర్శిస్తాడు. మతం పేరిట నాయకులు చేసే అన్యాయాలను, అక్రమాలను ఎత్తిచూపుతాడు. అందుకే, “Respect for religion has become a code phrase meaning ‘Fear of Religion’. Religion, like all other ideas deserve criticism, satire and yes, fearless disrespect” అంటాడు రుష్దీ. ఏ మతమూ విమర్శ, వ్యంగ్యం, నిర్భయాపూరితమైన తిరస్కారాలకు అతీతం కాదని, కారాదని నమ్మే వారి వల్ల నిజానికి సంస్కృతీసాంప్రదాయాలకు లేశమంతైనా హాని జరగదు. కాని, పదిమందిని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకునే నాయకుల మనోభావాలు మాత్రం గాయపడతాయి. ఏ మతమైనా మొట్టమొదట బహిష్కరించవలసినది, మనోభావాలు గాయపడుతున్నాయని దౌర్జన్యానికి దిగేవారినే. ఎందుకంటే వీరికి నిజంగా ఏ మతంతోనూ, ధర్మంతోనూ సంబంధం లేదు. మమేకమవ్వగలిగిన గుణం లేదు. వీరి దౌర్జన్యానికి బలిపశువులు కావాలి అంతే. ఎమ్. ఎఫ్. హుసేన్ చిత్రాలు తగలబెట్టి అతన్ని దేశంనుంచి వెళ్ళగొట్టినా, పెరుమాళ్ మురుగన్‍ను వెంటాడి వేధించినా, రుష్దీని తిరిగి స్వదేశం లోకి రానియ్యకపోయినా, వాటి వెనుక వీళ్ళకున్న అసలు కారణాలు న్యూనత, అధికార దాహం, ఆలోచనాలేమి. కోహం రండే అని అప్పుడెప్పుడో మన దేశంలో ఉదారవాదం పరిఢవిల్లిన కాలంలో అన్నాడు కాబట్టి సరిపోయింది కాని అదే మాట ఇప్పుడంటే కాళీదాసుకూ కాళ్ళూ కీళ్ళూ విరిచేసి వుందురు కాషాయభక్తులు. ఎవడబ్బసొమ్మని కులికేవు రామా అన్న రామదాసుని తరిమితరిమికొడుదురు. తాలిబన్‍ల పాలనలో ఉన్న ఆఫ్గనిస్తాన్‍లోను, మతప్రభుత్వాలు రాజ్యం చేస్తున్న ఇతర ముస్లిమ్ దేశాలలోనూ స్త్రీలు, పిల్లలు, మైనారిటీలు, తదితరుల జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో కొత్తగా ఎవరికీ చెప్పనక్కర్లేదు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని కోరుకునే ఎవరైనా ముందు చేయవలసింది మతాన్ని అధికారానికి దూరంగా పెట్టడం. మతం, దైవం పేరుతో సమూహాలను రెచ్చగొట్టి, విమర్శను హత్య చేసి, కళాకారులను పాత్రికేయులను నియంత్రించి, నిర్బంధించి నియంతృత్వం సాగిస్తున్న ప్రభుత్వాలున్నంతవరకూ ఈ పరిస్థితి మారుతుందని ఆశించడం కష్టం. హింస ఏ మతంలో జరిగినా, ఏ కారణంతో జరిగినా హింసే. రుష్దీపై జరిగిన హత్యాప్రయత్నాన్ని నిరసిస్తూ మన దేశంలో ఏ గొంతూ బలంగా వినపడకపోవడంలో ఆశ్చర్యం లేదు. మన దేశంలో అభ్యుదయవాదుల, ప్రగతిశీల ఉద్యమనాయకుల దృక్పథం వారి వర్గశత్రువుల దృక్పథమంత సంకుచితంగానే ఉందని, ఉంటుందని వారూ పదేపదే నిరూపించుకుంటూనే ఉన్నారు. వెన్నుదన్ను ఇచ్చే మనుషుల సంఖ్యతో సంబంధం లేకుండా, ఇట్లాంటి సందర్భాల్లో గొంతెత్తి అసమ్మతిని, వ్యతిరేకతనూ బలంగా తెలపడమే సంఘంలో ఆలోచనాపరులింకా ఉన్నారన్న హెచ్చరిక!

సృజన స్వేచ్ఛని కోరుకుంటుంది. ఆలోచనలోనూ, వ్యక్తీకరణలోనూ హద్దురాళ్ళు లేని ప్రపంచాన్ని స్వప్నించే సృజనకారులు ఒక మామూలు ఊహకి తమదైన అస్తిత్వాన్ని అద్ది, దానికి నవ్యతనూ ప్రాణశక్తినీ అందజేస్తారు. తరతరాలుగా సృజన బ్రతుకుతున్నది ఈ స్వేచ్చా ఊహల పునాదుల పైనే. ఆలోచనలో కొత్తదనం మాటెలా ఉన్నా, వ్యక్తీకరణలో కొత్తదనాన్ని చూపించగలిగితే, విషయాన్ని నిమిషాల మీద దేశాలను దాటించి వైరల్ చేసేందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో వేదికలు. ఇన్‍స్టంట్ అటెన్షన్, ఓవర్ నైట్ సెలబ్రిటీ హోదా కొందరు సృజనకారుల మీద పని చేస్తున్న తీరు విపరీతంగా అనిపించడంలో ఏ ఆశ్చర్యమూ లేదు. కొత్తొక వింతలా కొత్త పుంతలు తొక్కుతూ తమ కళలను వేయినొక్క విధాలుగా ప్రదర్శించుకుంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారీ సృజనకారులు. వీళ్ళ సంగతలా ఉంచితే, అన్నిటినీ తమ మనోభావాల మీదుగా వడపోసి చూసుకునే బృందం సమాజంలో శరవేగంగా విస్తరిస్తోంది. ఈ మనోభావాలకు ఏ రకమైన సప్రమాణికతా లేదు, ఉండదు. ఇంటర్‍నెట్ అప్పనంగా ఇచ్చిన అనామకత్వం తప్ప మరే అర్హతా లేని వాళ్ళు, ఆత్మన్యూనతతో నిండిన అజ్ఞానం తప్ప మరే ఆస్తీ లేని వాళ్ళు, సమయాన్ని ఏ ఏట్లో కలుపుకోవాలో తెలీక దిక్కు తోచనట్టు తిరిగే వాళ్ళు, ఇట్లాంటి విషయాల్లో అభిప్రాయ ప్రకటనలకు, చర్చలకు సదా సిద్ధమంటూ ముందుకొస్తారు. అవసరమున్నా లేకున్నా అసంబద్ధమైన అభిప్రాయాలను గుప్పించి, తద్వారా ఒకరి భావవ్యక్తీకరణ స్వేచ్ఛని అడ్డుకుని, కొండొకచో గెలిచి, దరిమిలా సమాజాన్ని​ నియంత్రించ​గలమనుకుంటున్న ఈ కురచ మనస్తత్వాలను చూసి జాలిపడాలో అసహ్యపడాలో భయపడాలో తేల్చుకోలేని స్థితికి చేరుకున్నాం. ఈ రకమైన దౌర్జన్యం మతసాంస్కృతిక విషయాలలో మరింతగా ప్రబలివుంది. ఇటీవలి ఇంకొక ఉదాహరణ, శ్రావణభార్గవి అనే గాయకురాలు చేసిన ఒక వీడియోపై చెలరేగిన సోషల్ మీడియా దుమారం. ఆ గాయకురాలి వీడియో మెలోడ్రమటిక్‍గా ఉండటం సత్యదూరం కాదు. సాహిత్యాన్ని అర్థం చేసుకోకుండా సాగిన ఆమె అపరిపక్వ ప్రదర్శన గురించిన విమర్శలూ సహేతుకమే. కాని, దుమారం లేపిన నైతిక కాపలాదారులకు ఆ గాయకురాలి ప్రదర్శన నచ్చకపోవడానికి ఉన్న వేయి కారణాల్లో ఇవి లేవు. విమర్శల పేరిట వాళ్ళన్న మాటలివీ: ఆమె చీర కొంగు చుట్టుకోలేదు, వెనుక భాగం చూపిస్తూ కెమెరా ముందు నిలబడింది-అది అసభ్యం. ఆమె ఆమె కాళ్ళకు పసుపు పూసుకోలేదు, వేళ్ళకు మెట్టెలు లేవు-ఇది హైందవ సాంప్రదాయం కాదు. దేవుళ్ళకు ఆపాదిస్తే చాలు శృంగారం కూడా అతిపవిత్రమూ ఆముష్మికమూ అయిపోయే మనదేశంలోని కొందరు భక్తులకు ఆ పాట అర్థం సందర్భం ఏమీ తెలియకపోయినా, ఆ ‘దేవుళ్ళ’పాటలో అమ్మవారు తప్ప వేరొకరు కానరావడం తట్టుకోలేని కష్టమయింది. ఈ తీరుగా సాగిన వీళ్ళ అభ్యంతరాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మునుపొకపరి చెప్పినట్టు, తెలుగునాట సహేతుకమైన సంగీత సాహిత్య విమర్శలు ఎలాగూ లేవు, కనీసం సంస్కారం కూడా లేదని నిరూపించడం తప్ప​, సోషల్ మీడియా కల్మషాన్ని మరింత ఉత్సాహంగా పదే పదే ప్రసారం చేయడం ద్వారా ఈ పత్రికలు, టి.వి. ఛానెళ్ళు సాధిస్తున్నదేమిటి? ఈ విమర్శలు గుప్పించిన వాళ్ళలో ఎవరైనా, తామెలాంటి నిజాయితీతో, దయతో, ఋజుప్రవర్తనతో బ్రతుకుతున్నామన్న ఆత్మవిమర్శ చేసుకుంటారా? ఇతరుల అభివ్యక్తిని సంస్కృతికి, సంప్రదాయానికి చేటు అని అఘాయిత్యం చేసే వీరు తమ తమ తక్షణ కుటుంబీకులు, సన్నిహితుల దృష్టిలో తామెలాంటివారనిపించుకుంటున్నారో గమనించుకుంటారా? ఇలా వారి వారి నేలబారు బుర్రలకు తోచినట్లుగా ఈ సంస్కృతీసంప్రదాయ పరిరక్షకులు చెప్పే అభ్యంతరాలకు సహేతుకమైన ధార్మిక సాంస్కృతిక ప్రాతిపదికలు ఎన్నడూ లేవు. ఎప్పటికప్పుడు కొత్తగా విషం చిమ్మడానికి కారణాలు వెతుక్కునే వీరిని ఎవరూ సమాధానపరచలేరు. వీరివల్ల సంఘం ఎన్ని రకాలుగా చీలిపోగలదో అన్ని రకాలుగానూ చీలిపోతూనే ఉంది. సమాజంలో నానాటికీ ప్రబలిపోతోన్న ఈ కల్మషం బహురూప శత్రువు. దీనితో యుద్ధం చేయలేం. తెంపిన ప్రతీ తలకూ వెయ్యి కొత్త తలలు వేసే దీనిని అరికట్టలేం. ఇది చేదునిజం. కాని, ఏ లాభమూ లేకున్నా నూరు టంకములు చేసెడి చీరలు కొరికే చిమ్మెటల లాంటి ఈ నైతిక కాపలాదారుల మూర్ఖత్వాన్ని పక్కకు తోసి, కళాకారులు తమ సృజనను కాపాడుకోవడం ఇప్పుడొక సామాజిక అవసరం. కవులు రచయితలు, గాయకులు, నటులు, చిత్రకారులు ఎవరైనా సరే, ధైర్యంగా, ఎవరికీ ఏ సంజాయిషీలు ఇచ్చుకోకుండా, తమ తమ సృజనాప్రపంచాలను ధిలాసాగా ఆవిష్కరించుకోవడం ముఖ్యం.

నువ్వెందుకు రాస్తున్నావు? రాయడం అన్న ప్రక్రియలో ఎంతో కొంత దూరం ప్రయాణించిన అందరికీ ఏదో ఒక సమయంలో ఎదురయే ప్రశ్నే ఇది. ఒకానొకప్పుడు, ఔత్సాహిక రచయితలకు, ఈ ప్రశ్నకు జవాబుగా తమ అభిమాన రచయిత పేరు ఉండేది. వాళ్ళ సిద్ధాంతాలు, ఆదర్శాలు, వాళ్ళు చూపించిన జీవన విధానం, కలల ప్రపంచం పాఠకులకు, సాటి రచయితలకు ఆదర్శప్రాయంగానూ, అందుకోవాలనిపించేవిగానూ ఉండేవి. ఇంచుమించు అందరు రచయితలూ జీవితానుభవాలను భద్రం చేసుకోవాలనో, రాతని ఒక ఆయుధంగా వాడుకుని దేన్నైనా సాధించాలనుకునో, రాయడమొక అలవాటుగానో వ్యసనంగానో మారడం వల్లో, కేవలం కాలక్షేపపు ప్రక్రియగానో చదువు నుండి రాతలోకి దిగుతారు. రచనకు కావలసిన ముడిసరుకు జీవితంలోనే దొరికినా, దానిలోకి ప్రాణశక్తిని నింపేది రచయితలోని సృజనాత్మకత, ఊహాశక్తి. రచనావ్యాసంగం లోకి దిగడానికి కారణం ఏదైనా, ఒకసారి మొదలంటూ పెట్టాక దానిపట్ల నిబద్ధత తప్పకుండా ఉండవలసిందే. అందుకే ముఖ్యంగా, ఎవరికో జవాబివ్వడానికి కాకున్నా, రచయితలకు నేనెందుకు రాస్తున్నాను? అన్న ప్రశ్నతో ప్రయాణం తప్పదు. ఈ మొదటి ప్రశ్నకు సమాధానం ఏదైనా రచయితకు అటుపైన తమ వ్యాసంగాన్ని కొనసాగించే క్రమంలోనూ, నిజాయితీతో కూడా సృజన వెలువడాలంటే ఆత్మ విమర్శ తప్పదు. అభ్యాసమూ తప్పదు. తన సృజనాత్మకతను, తన సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేసుకోగలగాలి. కథ చెప్పాలనే తపనకన్నా ఆ కథను ఎలా చెప్పాలి అన్న ఆలోచన ముఖ్యం. ప్రపంచసాహిత్యంలో కథనరీతులు పరిశీలించాలి. ఆ పరిచయంతో తన కథనాన్ని కొత్తదారులు పట్టించడానికి ప్రయత్నించాలి. రాయడం చాలామందే రాస్తారు. కాని ప్రభావవంతంగా రాసే నైపుణ్యత కావాలంటే ముందు చాలా చదవాలి, నేర్చుకోవాలి అని తెలుసుకోవడం ముఖ్యం. కాకిపిల్ల కాకికి ముద్దల్లే, తమ రచనలు తమకు అద్భుతంగా అనిపిస్తాయని, కాని ఆ రచనల అసలు విలువు విమర్శ వల్లే తెలుస్తుందని గుర్తుంచుకోవడం ముఖ్యం. ప్రోత్సాహాన్ని, పొగడ్తను ఆశించి రచనలు చేసిన వారెందరు కాలపరీక్షకు నిలబడ్డారో మనకు తెలీని విషయమేం కాదు. మంచి రచయిత ఒక మంచి విమర్శకుడు, పాఠకుడూ కూడా. అందుకే సమర్ధులైన రచయితలకు ఏది సద్విమర్శో, ఏది అపరిపక్వమైన అభిప్రాయమో తెలిసిపోతుంది. అలా ఒక మంచి రచయిత కావాలంటే తనను తాను అన్నిరకాల విమర్శలకూ ఎదురొడ్డక తప్పదు. అలాకాక, రాసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ సాహిత్య సమాజాలను, అవి ఇచ్చే కుహనా పొగడ్తలను, వాటి తోడ్పాటును దాటుకుని వెళ్ళకపోతే, సృజనాత్మకత ఒక ఇరుకైన చట్రంలోనే కొట్టుకులాడుతుంది. సాహిత్య కూటములు, సాహిత్య కార్యక్రమాలు నిజానికి చెయ్యవలసింది, రచయితను నిరంకుశంగా పదును పెట్టడమే. కానీ తెలుగు నాట ఈ సాహిత్య వికాసం వెర్రి తలలు వేసి సాహిత్య కార్యక్రమాలు వంతులవారీగా ఒక్కొక్కరి అజమాయిషీలో ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలతో ముగిసిపోతోంది. సాహిత్యం, దాని చుట్టూ దట్టంగా అల్లుకుపోతున్న రాజకీయాలను చూసి వెగటు చెంది, ఏ ఆదర్శాలూ బిగ్గరగా వల్లించకపోయినా ఎవ్వరికీ ఏ చేటూ చెయ్యని మిగతా సమాజమే ఈ కుహనా రచయితల కంటే మేలని పాఠకులను తరిమేసేలా ఉంది.

తెలుగులో ప్రపంచస్థాయి సాహిత్యం రావట్లేదని, సాహిత్య విమర్శ లేదని, రచయితలు ఎక్కువగా చదవరని, నేర్చుకోరని, విమర్శను ఏ రకంగానూ తీసుకోలేరని, కూపస్థమండూకాల్లా ఉంటారనీ వింటూంటాం. రచయితలు దురాచారాల్ని చీల్చి చెండాడాలని, పీడితపక్షాన నిలబడి గళమెత్తాలని, సాహిత్యం సమాజపు అభ్యుదయం కోసమేననీ రొడ్డకొట్టుడు ఉపన్యాసాలు, పిలుపునివ్వడాలు కూడా వింటూంటాం. (అలా అని మనకు సాహిత్యప్రశంస లేదనుకునేరు! తెలుగు సాహిత్య సమాజాల్లో ఏ పుస్తకావిష్కరణకు వెళ్ళినా బాజాభజంత్రీలతో పనిలేనంత పొగడ్తల వెల్లువ. సాహిత్యకారుల వ్యక్తిగత సంబంధాలు, వృత్తిఉద్యోగాలు, వాళ్ళ వ్యక్తిత్వాలతో మాత్రమే ముడిపడ్డ ‘సాహిత్య సంభాషణలు’ తెలుగునాట ఎటు తిరిగినా ఎదురొచ్చే నిత్యదృశ్యాలు.) అయితే, ఇంత మామూలైపోయిన మాటల మధ్య, మచ్చుకైనా కనపడని, వినపడని అంశమేదైనా ఉందీ అంటే, అది సంస్కారం. కనీస సంస్కారం. సాహిత్యంలోనైనా సమాజంలోనైనా మౌలికమూ ముఖ్యమూ అయిన ఈ సంస్కారం, ప్రస్తుత సమాజంలోను, సాహిత్య చర్చల్లోనూ పూర్తిగా మృగ్యమైపోయింది. ప్రపంచ స్థాయి సాహిత్యం రాలేదని విమర్శకులు, విమర్శలో పస లేదని రచయితలూ ఒకర్నొకరు వేలెత్తి చూపుకోవడం సరే, కానీ దాని కన్నా ముందు, నిజానికి సాహిత్య సంభాషణల్లో ప్రధానంగా ఉండవలసినది, మనం కాపాడుకోనందుకు ఆందోళన పడవలసినదీ మనుషుల మధ్య మచ్చుకైనా కనపడని సంస్కారపు జాడల గురించి. నచ్చిన కవి, రచయిత, నటుడు, గాయకుడు, చలన చిత్రం, చిత్రకళ- ఇంకెవరైనా, ఏదైనా సరే అందరికీ ఒకే తీరున నచ్చనక్కర్లేదనే కనీస అవగాహన లేకపోవడం. కొడవటిగంటి, చలం, విశ్వనాథ, జాషువా ఎవరైనా కానీండి, మన వాదజాలానికి సంబంధించినా, సంబంధించకున్నా మనకు చాతనయింది విగ్రహాలు కట్టి పూజించడం, కాదన్నవారిని అసభ్యంగా దూషించడం. కొడవటిగంటి నీకు మహానుభావుడైతే నాకు కానక్కర్లేదు. నా దృష్టిలో అతను ఒక అతిమామూలు కథకుడు కావచ్చు. విశ్వనాథ నీకు దేవుడైతే నాకు అతను కేవలం ఒకే మూస దృక్పథంతో రచనలు చేసిన ఒక వ్యక్తి మాత్రమే కావచ్చు. ఒక కవి, రచయిత, శిల్పి, చిత్రకారుడి సృజన లోతుపాతుల గురించిన చర్చ మనకు ఎప్పుడూ పట్టలేదు. ఆమాటకొస్తే మనం గుడ్డిగా ఇలా అభిమానించే చాలా మంది సృజన స్వరూపాన్ని అభిమానులమని చెప్పుకుని గుండెలు విరుచుకునే వారెవరూ ఎప్పుడూ లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కాని, అలా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఎవరైనా విమర్శిస్తే ఆ అభిప్రాయం వెలిబుచ్చిన వారిని – వారెవరైనా సరే, విద్యాధికులయినా, అధ్యాపకులయినా, అద్భుత విశ్లేషకులైనా, వారి జ్ఞానం ఎలాంటిదయినా – నీచంగా ఎద్దేవా చేయడం, అసభ్యంగా మాట్లాడడం మాత్రం వెన్నతో పెట్టిన విద్య అయింది. సోషల్ మీడియా వచ్చాక ఈ జాడ్యం మరింత ప్రబలమయింది. ఇదేదో ట్రోల్స్ అనబడే పరదాల చాటు కులమతజాడ్యులు, మూర్ఖాభిమానులు మాత్రమే చేస్తున్నది అయితే ఆందోళన లేకపోను. ఇది కవులు, రచయితలు, అభ్యుదయవాదులు, ధర్మసంరక్షకులు, అరుణపతాకులు, కాషాయకేతనులు, అస్తిత్వవాదులు – ఇలా సమాజపు ప్రతీ పార్శ్వం నుంచి, ఎవరినుంచయితే ఇలాంటి ప్రవర్తన ఏ మాత్రమూ ఆశించమో వారి నుంచీ ప్రబలంగా రావడం సమకాలీన విషాదం. అఘాయిత్యంగా విరుచుకుపడటం, అన్యాయంగా సాటి మనిషి మీద విషం చిమ్మడం, అడుగుకొకటిగా కనపడుతున్నప్పుడల్లా మరీ మరీ అనిపించేది ఒక్కటే: ముందు మనిషి నేర్వవలసినది సాటి మనిషి పట్ల సంస్కారంతో ప్రవర్తించడం. పైపై మాటలతో కాదు, నిజంగా విరుద్ధాభిప్రాయాల పట్ల గౌరవం చూపడం, తమ అభిప్రాయాన్ని, తమ వ్యతిరేకతను మర్యాదగా తెలియజేయడం. కాని, రాజకీయనాయకుల నుంచి మామూలు మనుషుల దాకా అందరిలోనూ పాకివున్న రోగం ఇది. దీన్ని ఎలా రూపుమాపడం? ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఆ గౌరవాన్ని, అందులో తమ బాధ్యతనూ ఎలా వీరికి తెలిసేలా చేయడం? ఇప్పటికీ, అసభ్యపదజాలంతో దూషించడం, తొడలు గొట్టటం, మీసాలు తిప్పటం లాంటి జాంతవికప్రవర్తన నుంచి బయటకు రాని సమాజం నుండి, ఆత్మవిమర్శ, నిజసంస్కారం లేని సమాజం నుండి, ఉత్తమసాహిత్యమనే కాదు, ఏరకమైన ఉన్నతినైనా ఎలా ఆశించగలం?

డబ్బు సంపాదించకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ రాదంటుంది మాలతీచందూర్ నవల్లోని నాయిక ఒకతె. ఇంటి శుభ్రత గురించీ ఆడపిల్లల చదువు ఆవశ్యకత గురించీ రంగనాయకమ్మ తనదైన సూటిగొంతుకతో చదువుకున్న కమల నవల్లోనూ మిగతావాటిలోనూ మాట్లాడుతుంది. రాబడితో నిమిత్తం లేకుండా ఆహారానికీ అలవాట్లకీ సంబంధించిన మంచి విషయాలను, ఉన్నంతలో ఇంటినీ జీవితాన్నీ ఉత్సాహభరితంగానూ ఆరోగ్యవంతంగానూ నిలుపుకునే మార్గాలను చర్చించారు ఒకతరం స్త్రీవాద రచయిత్రులందరూ. ఒక ఆరోగ్యవంతమైన సమాజానికి ఆరోగ్యవంతమైన మనుషులూ మనసులూ ఆలోచనలూ కుటుంబాలూ కావాలని వాళ్ళు గుర్తుపట్టారు. జీవితానికింకాస్త అదనపు సౌందర్యాన్ని అద్దుతూ బుర్రలని ఖాళీగా ఉండనీయని పనులను బాహాటంగా సమర్ధించారు. స్త్రీల జీవితాల పట్ల అసలైన అక్కర కనపరిచి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి ఉద్యోగాలకు వెళ్ళేలా ఉత్సాహపరిచి కుటుంబంలో వాళ్ళ పాత్రను గుర్తెరిగి నడుచుకునే వివేచన పంచారు. ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగే సందర్భాలను దాటే మార్గాలను చర్చించారు, తద్వారా ఎందరికో దన్నుగా నిలబడ్డారు. ఆడువారికి ఆత్మగౌరవాన్ని స్వావలంబననూ మించిన అలంకారాలు లేవని పునరుద్ఘాటించారు. ఆ ప్రయత్నంలో సమాజంతో మాటలూ పడ్డారు. ఎవరేమన్నా ఓ తరానికి ఆ సాహిత్యం చేసిన మేలు కొలవలేనిది. నిజానికి ఆ తరాన్ని ముందుకు నడిపించిన సాహిత్యమది. ఇప్పటి సమాజం మారింది. ఆ కనీస చదువు ఉద్యోగాలు చాలామంది సంపాదించుకునే స్థితికి వచ్చారు. ప్రపంచం వేగవంతమయింది. ఎందరో ఆడపిల్లలు పైచదువులు చదువుకుంటున్నారు. మగపిల్లలతో సమానంగా ఇష్టపడ్డ ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. ఆత్మగౌరవాన్ని, నిర్బరతనూ చాటుకుంటున్నారు. కాని, ఈ కొత్తప్రపంచం కూడా పూలబాట కాదు. జీవితపు పగ్గాలు ఎవరి చేతుల్లో వాళ్ళకి ఉన్నట్టే ఉన్నా వివక్ష అన్నిరకాలుగా ఇంకా వేళ్ళూనుకునే ఉంది. స్త్రీకి భద్రత ఇంకా కరువయ్యే ఉంది. ఒకప్పటికన్నా ఇప్పుడు స్త్రీలు ఎదుర్కుంటున్న సమస్యలు మరింత లోతైనవి వ్యక్తిగతమైనవిగా మారాయి. శారీరక శ్రమలను సామాజిక ఆంక్షలను మించి వాళ్ళ మానసిక ఆవరణలను కుదిపేస్తూ ఎన్నో కొత్త సమస్యలు వచ్చి చేరుతున్నాయి. కొన్ని పాత సమస్యలే కొత్తముఖాలతో ఎదురవుతున్నాయి. కొంత ప్రగతి సాధించినా ఇంకా వివక్షను, పురుషాధిక్యతనూ ఎదుర్కొంటూనే ఉన్నారు. నిస్సహాయత వల్లో, నిర్బంధం వల్లో తమ శారీరక మానసిక అవసరాలను నిర్లక్ష్యం చేసుకుంటూనే ఉన్నారు. కోరి ఎంచుకుని ప్రయాణిస్తున్న మార్గాల్లో ఎదురవుతున్న ఒత్తిడిని ప్రస్తావించడమూ చర్చించడమూ తిరిగి తమను వెనక్కి లాగుతాయన్న భయం వల్లో, ఆ చర్చలను తమ ఓటమికి చిహ్నంగా ముద్ర వేస్తారన్న ఆలోచనలో నుండి కలిగిన నిస్పృహ వల్లో ఎప్పటిలాగే మౌనాన్ని ఆశ్రయిస్తున్నవారే అత్యధికులు. తమ సమస్యలను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా తమజీవితాలలో ఆనందాన్ని నింపుకోగలగాలి అన్నది చాలామంది స్త్రీలకు ఈనాటికీ తెలియదు. అది తమ జన్మహక్కని కనీసం ఊహకూ రాని వారు చుట్టూ కోకొల్లలుగా కనపడుతూనే ఉన్నారు. గ్రామీణ, పట్టణ, నాగరిక సమాజాల స్త్రీల సమస్యలు పైకి వేరువేరుగా కనిపిస్తున్నా వాటి మూలాలు ఒకటే. ఆ సమస్యల అసలు రంగు ఒకటే. సాహిత్యపు ఆలంబన సమాజానికి ఇలాంటి సంధికాలాల్లోనే మరింత అవసరం. అయితే, ఒకప్పటిలా ఇప్పటి స్త్రీవాద రచయిత్రులెవరూ ఈ సమస్యలను తమ సాహిత్యం ద్వారా చర్చిస్తున్న దాఖలాలు ఎక్కువగా లేవు. ఆవేశంతో ఏదో నాటకీయమైన ముగింపో పరిష్కారమో చూపించే కాల్పనికసాహిత్యం పెదవి విరిచి పక్కకు పారేసేది మాత్రమే అవుతుంది. అలా కాక, నిజజీవితానికి దగ్గరగా ఉండి, ఒక ఆలోచనను, ఆచరణయోగ్యమైన పరిష్కారాన్ని సూచించేది, లేదూ కనీసం సమస్యను కూలంకషంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేది, అది కూడా కాదంటే హీనపక్షం మీమీ జీవితాల్లో ఇటువంటి సమస్యొకటి ఉందీ అని హెచ్చరించే సాహిత్యం అర్థవంతమవుతుంది. అట్లా ఈకాలపు స్త్రీ అవసరాలను, ఇబ్బందులనూ లోతుగా గమనించి అర్థం చేసుకొని వివేచనాత్మకమైన సాహిత్యాన్ని సృజిస్తోన్న స్త్రీవాద రచయితలు ఇప్పుడు మనకున్నారా? ఈనాడు తెలుగునాట అలాంటి స్త్రీవాద సాహిత్యం అసలు ఉన్నదా?

ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలన్నింటిలోనూ వార్తాపత్రికలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అవి ప్రభుత్వాన్ని నిలదీసి విమర్శించే అక్షరదళాలు. అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించే ప్రజాగళాలు. అందుకే దృశ్యమాధ్యమాలు ఎంత ప్రాచుర్యంలోకి వచ్చినా వార్తాపత్రికల ప్రాధాన్యం ఒకింత తగ్గిందేమో తప్ప పూర్తిగా సమసిపోలేదు. నిజానికి విజువల్ మీడియా కూడా తమ కథనాలకోసం పత్రికా విలేకరుల వార్తలపైన, వారి పరిశోధనాత్మక పాత్రికేయత మీదే ఆధారపడుతుంది. అందువల్ల వార్తాపత్రికలు తమ ఉనికినీ ప్రాభవాన్ని పోగొట్టుకోవడమన్న మాట లేదు. సమస్యల్లా, మిగతా మీడియాతో పోటీపడే క్రమంలో పత్రికలు తమ ప్రమాణాలను దిగజార్చుకుంటూ వారి మూసల్లోకి ఒదిగే ప్రయత్నం చెయ్యడంతోనే. వార్తాకథనం రాయడం కష్టం. దానికి తర్ఫీదు కావాలి, నేర్పు కావాలి. వార్తావాక్యం సూటిగా, సరళంగా ఉండాలి. అందులో సత్యం స్పష్టంగా నిష్పక్షపాతంగా కనిపించాలి. శీర్షిక క్లుప్తంగా వార్తాకథనాన్ని పరిచయం చెయ్యాలి. పాఠకుడిని తమ అలంకారాలతో ప్రభావితం చెయ్యడం వార్తల పని కాదు. వార్తావాక్యం న్యాయాధికారి కాదు. న్యాయనిర్ణేత కాదు. సత్యావిష్కరణకు పనిముట్టుగా మాత్రమే మిగలాల్సిన వార్త సంఘటన పట్ల తీర్పు చెప్పకూడదు. ఇట్లాంటి లక్షణాలున్న వార్తలు ప్రచురించే పత్రిక కోసం నేడు తెలుగునాట వెదుకులాట అవసరమవుతోంది. వాడుకభాషలో కూడా మాట్లాడే భాష వేరు, రాసే భాష వేరు. ప్రపంచంలోని అన్ని భాషలలోనూ వాడుక భాషకు సంబంధించిన యాసలు ఎన్నివున్నా రాసే భాష కొంత భిన్నంగా ఉంటుంది. ఏ ప్రాంతీయభాష/యాస వాడినా వాక్యం వార్తావాక్యంగా ఉండాలి. ప్రామాణికత ఆ వాక్యలక్షణం ద్వారానే వస్తుంది. ఆ ప్రమాణాలను అందుకునేందుకు నిరంతర కృషి కొనసాగేది కనుకే, నిన్నామొన్నటి దాకా తెలుగునాట వాక్యరచనకు కథలనూ కవితలనూ నవలలనూ కాక వార్తపత్రికల భాషను, అక్కడి వాక్య లక్షణాలను ప్రామాణికంగా తీసుకునేవారు. కాని, వార్తావాక్యం అంటే ఏమిటో కూడా సమకాలీన విలేకరులకు అర్థం అవుతున్న దాఖలా లేదు. వర్ణనలు, అతిశయోక్తులు, ఆరోపణలు, అభిప్రాయాలు, చవుకబారు శీర్షికలు- వార్తాపత్రికల్లో ఇప్పుడున్నవన్నీ ఇవే. వార్తాపత్రికల భాషకు, పల్ప్ వెబ్‌సైట్ల భాషకూ తేడా కనపడటం లేదు. కథలు వార్తలుగా, వార్తలు కథలుగా, ఎవరు కథకులో ఎవరు విలేకరులో తేడా కనిపించని సమయంలో, సమాజంలో ఉన్నాం. సినిమాల ద్వారా ప్రాచుర్యానికి నోచుకునే కొన్ని పదబంధాలు జనాల నోళ్ళల్లో నానుతాయి. వీధిభాషలో ప్రజలు రకరకాల ఊతపదాలు, వ్యక్తీకరణలు వాడతారు. అంతమాత్రాన వాటికి ప్రామాణికత రాదు. అలాంటి భాషను తమ వార్తల్లోను, శీర్షికల్లోను వాడే వార్తాపత్రికల స్థాయి ఎలాంటిది? ఈ పాత్రికేయులకు ఇలాంటి భాషను ఏ విశ్వవిద్యాలయాల జర్నలిజం కోర్సులు నేర్పుతున్నాయి? ఆయా పత్రికల సంపాదకులు ఇలాంటి వాక్యాన్ని ఎలా అంగీకరిస్తున్నారు? సృజనాత్మకత పేరిట యథేచ్ఛగా వెలువడుతున్న వార్తలూ శీర్షికల్లోని చవకబారుతనాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? చివరకు ఘోరప్రమాదాలను, అత్యంత దయనీయం, దారుణం అయిన సంఘటనలను కూడా ప్రాసలు, పంచ్‌లైన్ల లౌల్యంలో బాధ్యతారహితంగా అమానవీయంగా ఎలా రాయగలుగుతున్నారు? వార్తాపత్రికలే రాజకీయపార్టీలకు తొత్తులై వారి బాకాలుగా, వారికి భజంత్రీలుగా మారి తమ స్వతంత్ర ఉనికిని పోగొట్టుకున్న ఈ కాలంలో, ప్రతిరోజూ నిజాలు కళ్ళెదుటే దారుణంగా హత్య కాబడుతుంటే, భాష గురించా తమ దిగులు అని మీరు నిలదీయవచ్చు. అవును, అదీ నిజమే. కాని, వార్త ఉండవలసినట్టు ఉంటే కనీసం అది హత్య అని అనిపించకుండా ఉంటుంది. వార్తావాక్యానికి ఉండాల్సిన సర్జికల్ ప్రిసిషన్ అదే కదా.

రచనలు ఎందుకు పత్రికలకు పంపాలి? ఎప్పుడు అచ్చేస్తారో, ఎందుకు వేస్తారో, వేస్తారో వెయ్యరో కూడా చెప్పని పత్రికల దగ్గర పడిగాపులు పడే కన్నా, అనుకున్నదే తడవు ప్రచురించుకొనే వెసులుబాటిచ్చే సొంత వేదికలు, క్షణాల్లో స్పందనని కళ్ళ ముందుంచే సోషల్ మీడియా ఖాతాలే మెరుగని రాసే గుణమున్న అందరికీ అనిపించడంలో చిత్రమేమీ లేదు. అయితే, సాహిత్యవ్యాసంగం మిగతా కళలలాగా ఎవరి స్థాయి వారికి ప్రత్యక్షంగా తెలియనీయదు. ఇది నా అనుభవం, నా ఇష్టమొచ్చినట్టు రాసుకుంటాను అన్న ధోరణి సాహిత్యవ్యాసంగపు ఎదుగుదలకు అడ్డుకట్ట వేస్తుంది. చిత్రిక పట్టడం వల్ల తొలిప్రతిలోని నిజాయితీ పోతుందన్నదీ శుద్ధ అబద్ధమే. చాలామంది రచయితలకు తమ రాతలలో ఏం లోపించిందో తెలియదు. ఎవరో కొందరు మినహాయింపుగా ఉన్నప్పుడు, వారినే ఆదర్శంగా తీసుకోవడం పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం లాంటిది. ఆలోచనల్లోని స్పష్టత అక్షరాల్లోకి రావడం లేదని గమనించుకునే తెలివి అందరికీ ఉండదు. రాద్దామనుకున్న దానికి, రాసిన దానికీ ఉన్న భేదాలు తరచి చూసుకునే ఓర్పూ కొద్దిమంది ఆస్తే. కానీ అది వాళ్ళ సాహిత్య సృజనకేమీ అడ్డు కాదు. ప్రచురణకు అసలే అడ్డు కాదు. అయినప్పటికీ, రాద్దామనుకున్నదేదో రాశారో లేదో, రాసినది ఎంతవరకూ దానికది సంపూర్ణంగా స్వతంత్రంగా నిలబడగలుగుతుందో లేదో, మూడో మనిషి చేతుల్లోకి చివరిప్రతి వెళితేనే రచయితకు తెలుస్తుంది. ఒక బ్లాగుకో, సోషల్ మీడియా అకౌంట్‌కో మన రచనను అప్పగించే కన్నా, పత్రికకు పంపిస్తే అన్నిటికంటే ముందు, అది రచయిత, రచయిత తరఫువాళ్ళు, లేదా రచయిత ఆమోదించిన, రచయిత ఆజ్ఞలకు షరతులకు లోబడి మాట్లాడనున్న ఒకానొక ఆంతరంగిక వృత్తాన్ని దాటుకుని, రచనను వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టకుండా చూడగల మరొక వృత్తంలోకి వెళుతుంది. అది, ఒక రచనను సర్వస్వతంత్రంగా నిలబెట్టి, దాని విలువను కేవలం సాహిత్య విలువ, ప్రతిభ ఆధారంగా బేరీజు వేస్తుంది. పత్రిక స్థాయి, ప్రమాణాలు మంచివైతే, రచయితకు ఒక చక్కని పరామర్శ/విమర్శ దొరుకుతాయి. పరిష్కర్తలయిన సంపాదకులతో చర్చలు సాహిత్య దృక్పథాన్ని విశాలం చేస్తాయి, అభిధనూ ధ్వనినీ మరింత బలంగా రచనలో వాడుకోవడం నేర్పుతాయి. ఇలా రచనను ఒక కొత్త చూపుతో గమనించుకునే వీలు కలుగుతుంది. ఎడంగా నిలబడి తప్పొప్పులను చర్చించే సావకాశం దొరుకుతుంది. రచన తిరస్కరించబడినప్పుడు, దానికి కారణాలు అర్థమయ్యే కొద్దీ రచనను శ్రద్ధగా గమనించడం అలవాటవుతుంది. ఇవన్నీ రచనను ఉద్వేగభరితంగా మాత్రమే కాక, తార్కికంగా కూడా బలపరుచుకునే వీలిస్తాయి. ఆలోచనల్లో స్పష్టత తెచ్చుకోవడం, అనవసరమైన పదాల, వాక్యాల ఏరివేత అలవాటుగా మారడమన్నది ఒక పరిష్కర్త సహాయంతోనే సాధ్యమవుతుంది. అలా రచనలను మెరుగు పెట్టుకొనే కొద్దీ రచనావ్యాసంగం దానికదే పదును తేలుతుంది. దీనివల్ల తెలుగు భాషకో, తెలుగు సాహిత్యానికో ఈ రోజుకీ రోజు ఏదో లాభిస్తుందన్న అత్యాశ కాదు కానీ విమర్శ తిరగలిలో నలిగితే మంచి సాహిత్యపుటలవాట్లు కొద్దిమందికయినా అబ్బుతాయని నమ్మకం.

ఒక భాషకు చెందిన సాహిత్యం, ప్రత్యేకించి ఒక కాలానికి చెందిన సాహిత్యం కొన్ని సారూప్యాలను కలిగి ఉండటం గమనిస్తాం. అది కొన్ని విభజనలకు లోబడే రీతిలో కొన్ని ధోరణులను ప్రస్ఫుటంగా వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఈ ధోరణులను దాటి రాసే అరుదైన సాహిత్యకారులు ఉంటే ఉండవచ్చు గాక. కాని, సమకాలీన సామాజిక ధోరణులు, సమకాలీన ప్రసిద్ధ సాహిత్యకారుల దృక్పథాలు, చాపకిందనీరులా ఒక భాష సాహిత్యాన్ని ప్రభావితం చేస్తాయనడం అతిశయోక్తి కాదు. నిలవనీరులా సాహిత్యమిలా పాతబడే సందర్భాల్లో అనువాదసాహిత్యపు అవసరం స్పష్టమవుతుంది. ఒకే కాలానికి చెందిన, ఒకే నేలకు చెందిన మనుషులు, మరొక భాషలో, మరొక ప్రాంతంలో చేస్తున్న ప్రయోగాలను, వేస్తున్న ముందడుగులను చూపెడుతుంది. పరభాషల రచయితలు తమ తమ జీవనవాస్తవికతను సాంస్కృతిక వారసత్వాన్ని ఎలా నిలబెట్టుకుంటున్నారో గమనించే వీలిస్తుంది. వేరే వేరే సంస్కృతులు, వాతావరణాలలోని మనుషుల మధ్యనున్న భిన్నత్వాన్నీ ఏకత్వాన్నీ కూడా మిగతావారికి పరిచయం చేస్తుంది. అందువల్ల ఒక భాషలోని సహజ సాహిత్యం ఎంత ముఖ్యమో అనువాదసాహిత్యం కూడా అంతే ముఖ్యం. ఇలా ప్రపంచభాషలనుంచి ప్రోదిపడ్డ అనువాదాల వల్ల ఆంగ్లసాహిత్యం ఎంత పరిపుష్టమయిందో వేరుగా చెప్పక్కర్లేదు. అయితే, ఇది కేవలం రాశికే సంబంధించిన విషయం కాదు కనుక, అనువాదకులు కూడా తమ పని పట్ల ఆ గౌరవాన్ని, జాగ్రత్తని కలిగి ఉండాలి. కేవలం రెండు భాషలూ అర్థమవుతాయన్న మాట దగ్గర ఆగిపోకుండా, రెండు భాషలలోని నుడికారాన్ని ఆకళింపు చేసుకోవాలి. రెండు భాషలలోని వ్యావహారిక పదాలను, జాతీయాలను, వాడుకలో పదాలకున్న భిన్నార్థాలను తెలుసుకోవాలి. ఆపైన మూలభాషలోని సహజత్వాన్ని అనువాదభాషలోకి అంతే సహజంగా తేవాలి. మూలంలోని వాక్యాన్ని అనువాదభాషలోకి అలాగే తేవడం కృతకమైన పని. ఎందుకంటే మూలం ఏదైనా, అనువదించబడ్డాక అది ఆ భాషాసాహిత్యం అవుతుంది. అందువల్ల ఆ అనువాదం తెలుగులోకి అయితే అది తెలుగు భాష, వ్యాకరణం, నుడికారాలతో అలరారవలసిందే. కొన్ని రచనలు కేవలం తెలుగులో చెప్పబడతాయి. మరికొన్ని కథావస్తువులు తెలుగు నేల, సంస్కృతిలో ప్రతిక్షేపించబడతాయి. మూలానికి విధేయత అంటే, ఏ పదానికాపదం తెలుగులో చెప్పడం కాదు, మూలరచన ఉద్దేశ్యాన్ని మార్చకపోవడం, అదేసమయంలో మూలరచన ధ్వనినీ అనువాదభాషలోకి తేగలగడం. ఆ దృష్టితో చూసినప్పుడు, సృజనాత్మకత పరంగా, అనువాదసాహిత్యం సహజసాహిత్యానికేమాత్రమూ తక్కువ కాదు. ఇంటర్నెట్ వల్ల ఇప్పుడు ఇతర భాషల ఉచ్చారణ, వాడుక, భిన్నార్థాలవంటివి అందరికీ అందుబాటుకొచ్చాయి. ఆ రకంగా, అనువాదకుల విషయవస్తు సేకరణ సాంకేతికత వల్ల కొంత సులభమైన మాట నిజమే అయినా, మూలభాషలోని సాహిత్యరీతికి సరిపోయిన వ్యక్తీకరణను అనువాదభాషలోకి తేవడమన్న కష్టం నిత్యనూతనమైనదే. పైపెచ్చు, సృష్టిలో సృజనకారులకు ఉన్న వెసులుబాటు ప్రతిసృష్టిలో ఉండదు. అందువల్ల, సృష్టి ప్రతిసృష్టి రెండూ శ్రమపూరితాలే అయినా అనువాదకుల పని మరింత కష్టమైనది, వారి బాధ్యత మరింత గురుతరమైనది. ఇది కేవలం అనువాదకులే కాదు, పాఠకులు, ప్రచురణకర్తలూ గమనించాలి. మూలరచయితతో పాటు అనువాదకుల పేర్లనూ పుస్తకాలపై ప్రముఖంగా ప్రచురిస్తూ, ఈ ప్రక్రియకూ సముచిత గౌరవాన్నివ్వడం, సాహిత్య సమాజపు కనీస కర్తవ్యం.

కాలాతీతమైన సాహిత్యం అని అనడం కొన్ని సందర్భాల్లో కొన్ని రచనలకు సంబంధించి మంచి విశేషణమే కాని, అలా కాని సాహిత్యాన్ని కొట్టిపారేయడానికి లేదు. కాలానుగుణమైన సాహిత్యం కూడా ఒక సామాజిక అవసరం. సమకాలీన సమాజపు పోకడలను నిశితంగా గమనించి చాప కింద నీరులా పాకే దుష్ప్రభావాలను ఎత్తి చూపుతూ సాహిత్య సృజన చేయడం కొన్నిసార్లు ప్రథమ చికిత్స లాంటి అవసరం. ఎనభైల దశకంలో తెలుగునాట స్త్రీవాద సాహిత్యం చేసింది దాదాపు అలాంటి పనే. స్త్రీ చేతన కోసం రచయిత్రులు కూడి పరిశ్రమ చేసిన ఉద్యమకాలమది. తమ తమ జీవితాల పట్ల, హక్కుల పట్లా స్త్రీలకు ఉండాల్సిన అవగాహన గురించి, గౌరవం గురించీ గొంతెత్తి మాట్లాడిన తరమది. హద్దుల్లేని జీవనోత్సాహం కోసం కనపడ్డవన్నీ కూల్చేయమని ప్రబోధించిన వేలంవెర్రి అచ్చు కాగితాల మధ్య మానసిక శారీరక ఆరోగ్యాల గురించి, స్త్రీ తనకు తానుగా మొదటగా మిగుల్చుకోవలసిన హుందాతనం గురించి, కన్నబిడ్డలైనా వేలెత్తి చూపే వీల్లేని వ్యక్తిగతనిర్ణయ స్వాతంత్రాల గురించి, జీవించే హక్కు గురించీ మాట్లాడిన సత్యవతిగారి కథల్లోని సూక్ష్మదృష్టికి వెలకట్టలేం. అభ్యుదయ సాహిత్యం అంటే మొహం మీద కొట్టినట్టుండే ఆవేశాలో ఉపదేశాలో, నినాదాలో సందేశాలో కావని, చుట్టూ ఉన్న సమాజంలో నుండి నడిచి వచ్చినట్టుండే పాత్రల సంఘర్షణ, పోరాటం, నిబ్బరం, నిజాయితీతో కూడిన లోచూపు ఉన్న కథలే ఆలోచనలను రగిలించగలవని, నిజమైన అభ్యుదయానికి దారి తీయగలవని పి. సత్యవతి కథలు రుజువు చేస్తాయి. నిన్ను నువ్వు చూసుకోవడం నేరం కాదని, నీ కోసం నువ్వు బతకడం ఒక జీవనావసరమని, నీ గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించడమొక కనీస బాధ్యత అనీ స్త్రీలకు లోపల నిండు ధైర్యాన్ని కలిగించిన అభయవచనాలామె కథలు. రెచ్చగొట్టడానికీ ఆలోచన కలిగించి భరోసానివ్వడానికీ మధ్య ఉన్న తేడాని పట్టుకుని రాశారు కనుకే, కాలానుగుణంగా వచ్చిన ఆ కథలు ఇప్పటికీ గుర్తింపుకి నోచుకుంటున్నాయి. అవకాశం ఉండి కూడా, ఆమె తెలుగులో నేరుగా చేసిన కృషి కళ్ళబడనట్టు, సాహిత్య అకాడెమీ ఆమెకు అనువాద కేటగిరీలో అవార్డు ప్రకటించి తన హ్రస్వదృష్టిని చూపుకుంది. ఇదేమీ ఆశ్చర్యం కాదు – అకాడెమీ అవార్డులు కనీసం తెలుగుకి సంబంధించి ఎన్నేళ్ళుగానో మూసలో ఇరుక్కుని ఉన్నాయి. అవార్డులు ఒక పరిమితిగా మారిన కాలమిది. రచనా ప్రక్రియ, ప్రాంతం, వాదం, చివరిగా వయసు – ఇలాంటి బేరీజుల మధ్య నలిగిపోతూ తెలుగు సాహిత్య అకాడెమీ అవార్డు విలువ నానాటికీ దిగజారుతోంది. అయితే నిజమైన సాహిత్యం ఎల్లలు దాటి తన ఉనికిని చాటుకుంటుంది. కన్నడిగుల ప్రతిష్టాత్మకమైన కువెంపు జాతీయ సాహిత్యపురస్కారం మొట్టమొదటిసారి ఒక తెలుగు రచయితకు రావడం, సత్యవతిగారి సాహిత్యప్రతిభకు నిదర్శనం. సాహిత్యానికి పైవరుసల్లో ఎన్నో గళ్ళలో టిక్ మార్కులు పడితే తప్ప అవార్డులు వరించని ఈ కాలంలో, తాము పొందడం ద్వారా అవార్డుల గౌరవాన్ని పెంపొందించే సాహిత్యం సత్యవతిగారి లాంటి ఏ కొద్దిమంది రచయితలకే సొంతం. అలాంటి సాహిత్యమే మనకిప్పుడు అవసరం.

మన సమాజంలో ఒక ఆనవాయితీ ఉంది. ‘పెద్ద’వారు, ‘గొప్ప’వారు, బడా ‘బాబు’ల వంటివారు మామూలు ప్రజలు కొనవలసి వచ్చేవి చాలా చాలా కొనరు. అవి వారికి ‘కాంప్లిమెంటరీ’గా వస్తాయి, వారిని ప్రసన్నం చేసుకోగోరిన వారినుంచి. వారూ అలా తాయిలాలు ఆశిస్తారు, సాధిస్తారు. అయితే కాంప్లిమెంటరీగా ఏదైనా ఇప్పించుకున్నంత మాత్రాననే పెద్దవారు గొప్పవారు ఎవరూ కారు. పెద్దరికం, గౌరవం వచ్చి వారి మీద పడిపోవు. డబ్బులు పెట్టి కొనుక్కోవడం వారనుకున్నట్టు నామోషీ కాదు. కాని, ఆ అపోహ మాత్రం మనలో వేళ్ళూనుకునిపోయింది. తెలుగు సాహిత్యసమాజమూ ఇందుకు మినహాయింపు కాదు. వేరే దేశాల్లో, వేరే భాషల్లో సాధారణంగా ఏ బుక్‍షాపులోనో, పుస్తకోత్సవాలలోనో జరిగే పుస్తకావిష్కరణ సభలో వేదిక మీద రచయిత ఒక్కడే ఉంటాడు. తన పుస్తకం నుంచి కొంతభాగం చదివి వినిపిస్తాడు, శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిస్తాడు. సంధానకర్తగా అక్కడ వేరెవరైనా ఉన్నా, వాళ్ళు పుస్తకానికి సంబంధించిన చర్చనే నడుపుతారు. దానికి కొనసాగింపుగా పాఠకులు ఆ పుస్తకాన్ని పరిశీలిస్తారు, నచ్చితే కొనుక్కుంటారు, రచయిత స్వహస్తాలతో సంతకం చేసి ఇస్తాడు కూడా. పాఠకులు, రచయితా ఒకే తలంలోకి వచ్చి, సాహిత్య సంస్కారాన్ని పెంపొందించుకునే ఇలాంటి ఒక దృశ్యం తెలుగులో ఊహకు కూడా అందదు. కొత్తొక వింత అనిపించుకోవడం కోసం ఆవిష్కరణలు హోటళ్ళలో, బారుల్లో అయినా జరుపుతారు కాని బుక్‍షాపులకు మాత్రం ఆమడ దూరంలో ఉంటారు. అధ్యక్షులుగానో ప్రత్యేక ఆహ్వానితులగానో ఎప్పుడూ విచ్చేసే ఆ కొద్దిమందే ఎంత ఇరుకుగా ఉన్నా వేదికమీదే సర్దుకుంటారు. సాహిత్యం గురించి, సాహిత్యబాధ్యతల గురించి, రచయితకూ తమకూ ఉన్న బంధం గురించి, రచయిత వ్యాసంగంలో తమ పాత్ర గురించి, రచయిత ప్రతిభ గురించి- ఉన్నవీ లేనివీ కలిపి కుట్టిన ఊకదంపుడు ఉపన్యాసాల అనంతరం, పుస్తకాన్ని అందరూ కలిసి గిఫ్టురాపునుంచి ఆవిష్కరిస్తారు. అప్పటికప్పుడే సదరు రచయిత ఆ వేదిక మీద పెద్దలందరికీ గౌరవాదరాభిమానాలతో తన పుస్తకాన్ని వినయంగా సమర్పించుకుంటాడు. ఆ కాపీ అలా కాంప్లిమెంటరీగా రాకపోతే తమ గౌరవానికి భంగం కలిగినట్టు సదరు ఆహ్వానితులు చిన్నబుచ్చుకోవడం కద్దు. ఆపైన అచ్చేసిన ఐదువందల కాపీలలో కనీసం రెండు మూడొందలు రచయితే అందరికీ ఉచితంగా ఇవ్వడమూ లేదా తానే గంపగుత్తంగా తెలిసినవాళ్ళందరికీ పంపడమూ కద్దు. ఈ ప్రహసనం ఇంత రివాజుగా మారాక కూడా రచయితలందరూ మా పుస్తకాలు ఎవరూ కొనరు, వాటికి ఆదరణ లేదు, తెలుగువారికి సాహిత్యాభిమానం శూన్యం అని ఆక్రోశించడమే ఆశ్చర్యం. రచన నిజంగా గొప్పగా ఉంటే పాఠకుడే అడిగి మరీ కొనుక్కుంటాడు అన్న విషయం ప్రస్తుతానికి పక్కన పెట్టినా, తన రచన మీద గౌరవం ఉన్న ఏ రచయితా తన పుస్తకాన్ని ఉబ్బరగా ఎవరికీ ఇవ్వడు. ఇవ్వకూడదు. మరి అలా ఇస్తున్నాడూ అంటే కారణం? తన గుర్తింపు కోసం, ఆ పెద్దల ఆమోదం, సాహచర్యం కోసం. అబద్దపు రివ్యూల కోసం లేదూ కనీసం కానిమాటలు దొర్లకుండా వాళ్ళ ముందరి కాళ్ళకు బంధం వెయ్యడం కోసం. ఈ రొంపిలోకి ఇంకా దిగని, దిగాలనుకోని రచయితలుంటే, వారికి మేమొక సలహా ఇవ్వదలచాం. అది ఇదీ: పుస్తకావిష్కరణ సభలు పుస్తకాల దుకాణాలలోనే పెట్టండి. అచ్చు వేసిన ప్రతులన్నీ, ఐదుకు మించకుండా తీసుకొని, మిగతావన్నీ ప్రచురణకర్త/పంపిణీదారుడి దగ్గరే ఉంచండి. అమ్మే బాధ్యత వారికే అప్పచెప్పండి. సభకు విచ్చేసిన పెద్దలు, పిన్నలు, అతిథులు, ఆహ్వానితులు, ఉపన్యాసకులు, శ్రోతలు, ఆపైన పాఠకులు అందరూ, ఏ మినహాయింపూ లేకుండా నచ్చితే పుస్తకం కొనుక్కుంటారు, లేకుంటే లేదు. మిమ్మల్ని మీరైనా మరొకరైనా రచయితగా గుర్తించాలంటే, ఇట్లాంటి నిబద్ధత ఒక కనీస అర్హత. ప్రచురణకర్త కష్టానికి ఇదొక కనీస గౌరవం. సాహిత్యపు మనుగడా? దిగులొద్దు. దాని జీవితం మనం చింతించాల్సినంత చిన్నదేం కాదు.

చీమ తల కన్నా చిన్నదేదీ అంటే, అది తినే ఆహారం అని సామెత. తెలుగులో వెలువడుతున్న పుస్తకాలలోని సాహితీనాణ్యత కన్నా కనాకష్టంగా ఉన్నదేదీ అంటే, జవాబు ఆ పుస్తకాల ముందుమాటలు అని. పుస్తకం నుంచి కాపీ పేస్టు ఉటంకింపులు, వాటి మీద కాసిని ప్రశంసలతో, ఈ రచయిత ఇలాంటి రచనలు మరెన్నో చెయ్యాలనే ఆశీర్వాదపు ఆకాంక్షతో ముగించడం – తెలుగునాట ముందుమాట కేవలం ఒక కాండెసెండింగ్ టెంప్లెట్‌. అడిగో అడిగించుకునో, కొండొకచో నవతరం పట్ల ఇది తమ గురుతరబాధ్యత అనుకునే స్మగ్వినయంస్మగ్వినయము = A state of being smug about one’s apparent వినయము. చూడుడు: వ్యథ – 2004‌తో తామే భరోసా ఇచ్చో, ముందుమాటలు రాసే సాహిత్యప్రముఖులందరికీ తెలియాల్సింది దాని వల్ల వారి కీర్తి ఏమీ పెరగదని, వారికి కొత్త గుర్తింపేమీ రాదని. సరికదా, ఆ ముందుమాట పేలవంగా ఉంటే ఉన్న కాస్త గౌరవమూ పోతుందని. ఉండే ప్రాంతాన్ని బట్టో, లేదూ తాము చదివిన ఏ ఒకటో రెండో కథలూ కవితలను బట్టో కవిరచయితలకు ప్రవాసం, భావుకత్వం, ఆవేశం, అర్బన్, స్త్రీవాదం వంటి ముద్రవేసి, సదరు ముద్రకు అనుగుణంగా కొన్ని పాదాలు, పేరాలు ముక్కలుగా ప్రస్తావించి పోల్చుతూ, తమ జ్ఞానాన్ని ప్రదర్శించడం – రాసే ముందుమాట ఆ పుస్తకం గురించో లేక తమ గురించో అర్థంకాని స్థితికి వచ్చేశాం. పుస్తకం ప్రపంచానికి కిటికీ అయితే ముందుమాట పుస్తకానికి కిటికీ. ముందుమాట పుస్తకానికి ఒక దిక్సూచి. అది రచయితను, వారి సాహిత్యాన్ని, శకలాలుగా కాక సంపూర్ణంగా విశ్లేషించి విమర్శిస్తుంది. పాఠకుడు తనంతటతాను తెలుసుకోలేని విభిన్నపార్శ్వాలని చూపిస్తుంది. అవసరమైన చోట ఆ సాహిత్యానికి ఒక చారిత్రిక సందర్భాన్నీ ఇస్తుంది. అందుకని, ముందుమాట రాయాలంటే ముందు ఆ పుస్తకంతో కొంతకాలం బతకాలి. దాని వస్తువును కూలంకషంగా పదివైపుల నుంచి పరిశీలించాలి. మంచిచెడ్డలు, లోతుపాతులు బేరీజు వేయాలి. ముందుమాట రాయడంలో ఒక కొత్తవిషయాన్ని కనుక్కున్న శాస్త్రజ్ఞుడి శ్రమ, ఆనందం, గర్వం ఉండాలి. అయితే, ఇంత అర్థవంతమైన ముందుమాటలు మనకు తెలుగులో కనపడవు. అలాంటి అవకాశం అన్నిసార్లూ రచయితలు కల్పిస్తున్నారా అన్నది ప్రశ్న అయినప్పుడు ముందుమాట రాయలేనని తప్పుకొనే ఆదినిష్ఠూరం అందరికీ మంచిది. వెరసి, ఈ టెంప్లెట్ ముందుమాటలను రచయితలు ఆశించడంలో సదరు ముందుమాటకులు-రచయితలు తాము ఒకే సాహిత్యపరమైన రాజీకి చెందినవారిమని సూచించడం, తద్వారా తమ సాంగత్యాన్ని ప్రదర్శించడం మినహా వేరే ఉద్దేశ్యం కనిపించదు. సమస్య ఏమిటంటే, ఈ తప్పనిసరి ముందుమాటల వల్ల పుస్తకం తనంతట తానుగా నిలబడగల అవకాశాన్ని కోల్పోతుంది. ముందుమాటకులు ఎంత ఇరుకు చూపుతో కథలను లేదా కవిత్వాన్ని పరిచయం చేస్తారో, అదే ఇరుకు దారి పాఠకులకూ ఎదురుగా కనపడి, రచన వైశాల్యాన్ని గుర్తించడం కష్టమయేలా చేస్తుంది. పుస్తకంలోని కొత్త ధోరణులకు, పరిచయాత్మకంగా పాఠకులకు అడ్డం పడకుండా ఉండే ముందుమాటల వల్ల లాభం లేకపోయినా నష్టం లేదు. కాని, తమ రచనల పట్ల గౌరవమూ నమ్మకమూ ఉన్న రచయితలే ఆలోచించుకోవాలి, ఇట్లాంటి ముందుమాటలు ఎవరి కోసం, ఎందుకోసం అన్నది. అయినా ముందుమాటకులు ప్రాచీనకవిత్వం చదువుకున్నారో లేదో కానీ, శతకాలు బానే చదువుకున్నారు. కొండ అద్దమందు కొంచమై ఉంటుందిరా అంటే, కొంచముండుటెల్ల కొదువ కాదని అరువు మాటలతోనే బైఠాయిస్తారు.

ప్రసిద్ధ సాహిత్యకారుల జయంతులు వర్ధంతులూ పేరిట ఉండుండీ కొంత చప్పుడు చెయ్యడం ద్వారా, తెలుగుజాతి, భాష మీద తనకింకా ప్రేమ ఉందని చాటుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఈ చప్పుళ్ళు చేసే తెలుగుజాతి పరిధి మాత్రం చాలా చిన్నది. ఏనాడో రాసేసి చేతులు దులిపేసుకున్నవాళ్ళు, ప్రస్తుతం విరివిగా రాస్తున్నవాళ్ళు, రేపో మాపో తమ ప్రచురణలతో ముందుకు రాబోతున్నవాళ్ళు, పత్రికల, సభల నిర్వహకులు – తెలుగుసాహిత్య వర్తమాన చిత్రంలో ఎటు తిరిగినా కనపడేది ఈ నలుగురే. ఏతావాతా రచయితలే మనకు మిగిలిన పాఠకులు. వీరందరికీ ఒకరితోటి ఒకరికి అవసరం. కనుక సాహిత్యానికి సంబంధించి ఉన్నదున్నట్లు చెప్పడానికి భయం. అందుచేత వీరివల్ల సాహిత్యానికి ఒనగూడే లాభం ఏమిటన్నది అర్థం కాదు కాని, నష్టం మాత్రం ఊహించలేనిదేం కాదు. సాహిత్యాన్ని అభిరుచిగా, అలవాటుగా ఇంటింటిలోనూ కనీసం పత్రికలుగానైనా చూసే రోజులనుండి కేవలం సోషల్ మీడియా గుంపుల్లో బాతాఖానీకి పనికొచ్చే భాషగా మిగుల్చుకోవడంలోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆలోచనల లోతులను లైకుల సంఖ్యతోను, ప్రతిపాదనల బలాన్ని మంది షేర్‌లతోనూ కొలుచుకోవడం మొదలైనప్పుడే, నిజమైన పాఠకుడికోసం విభిన్నంగా శ్రద్ధగా రాయడం పట్ల కవిరచయితలకు అవసరమూ లేకపోయింది. అందుకే ప్రస్తుత సాహిత్యంలో తక్షణ స్పందనలు, హాయిగొలిపే కబుర్లూ కనపడ్డంతగా ఆలోచనతో రాసే రాతలు కనపడవు. ఆలోచన కలిగించే రాతలు అసలే అరుదు. సాహిత్యం మనకు కేవలం ఒక వానపడుతుంటే హాయికోసం పట్టుకొనే హస్తాభరణంగానో, లేదూ కాఫీ టేబుల్ మీద పెట్టుకొనే అలంకరణగానో మిగిలిపోయింది. మనకు సాహిత్యం ఇష్టం అని చెప్పుకొని భుజాలు చరుచుకోవడంపై ఉన్న శ్రద్ధ, ఆసక్తి నిజంగా సాహిత్యం పట్ల లేదు. అందుకే, ఒక సమకాలీన రచయిత రచనల మీద విశ్లేషణ కన్నా, శ్రీశ్రీ పుస్తకపు రీప్రింట్ ఫేస్‌బుక్ గోడల మీద ఎక్కువ హంగామా చేస్తుంది. జాషువాని కులమనో కరుణరసమనో ఒక ఇరుసులో బిగించి చప్పట్లు కొడతాం. విశ్వనాథ అయితే దైవం లేకుంటే దయ్యం, కేవలం అంతే. అడపాదడపా ఏ త్రిపురనో, మోనో, ఇంకెవరినో తలచుకున్నా అది వారి వ్యక్తిగతస్నేహాలు జ్ఞాపకాల నెమరువేత స్థాయిని దాటనివ్వం. వారిగురించి ఎప్పుడూ చెప్పే మాటలే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం. వారి వర్ధంతులూ జయంతులూ, విగ్రహాలూ పటాల ఆవిష్కరణలూ మాత్రమే మనకు ముఖ్యం. ‘తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుల’ని ఒక మాటనేసి, సదరు ఫేస్‌బుక్ పోస్టుల కింద నమస్కారాల ఎమోజీల దండలు వేసి ఎవరి దారిన వారు పోవడం మినహా తెలుగుసాహిత్యకారుల చేతిలో నిశితమైన సాహిత్య విమర్శ విశ్లేషణకు నోచుకున్న ఒక్క తెలుగు కవి/రచయిత కనపడరు. ఇలా సందర్భాల నెపంతో గొప్ప కవిరచయితలకు గౌరవం ఇవ్వకపోగా ద్రోహం చేస్తున్నాం. వాళ్ళ ప్రాసంగికతను చెరిపేస్తున్నాం. అవమానపరుస్తున్నాం. పాత కళ్ళద్దాలను కొత్తతరానికి బలవంతంగా అంటించి వేడుక చేస్తున్నాం. కొత్త వెలుతురులోకి పాత సాహిత్యాన్ని తీసుకెళ్ళలేనప్పుడు, ఊరికే ఉత్సవాల పేరిట అయినవాళ్ళకి వాయినాలిచ్చుకునే చందాన సాగుతున్న ఈ తంతు అనవసరపు ఆర్భాటమే. సాహిత్యసృజన, విమర్శ సమయాన్ని కోరతాయి. తెలుగువాళ్ళు తెలివైనవాళ్ళు. సమయం విలువ తెలిసినవాళ్ళు. దాన్ని సాహిత్యంలో పారేసుకోరు.

ఈమాటలో మొదటినుండీ శబ్దతరంగాలనే శీర్షిక కింద ఎన్నో అపురూపమైన ఆడియోలు ప్రచురించాం. ఇవి పాఠకులను ఎంతగానో అలరించాయి కూడా. అయితే, కాలం గడిచేకొద్దీ పాతసంచికల రచనలు మరుగున పడడం సహజం. అలా మరుగున పడినవాటిని వెలికితీసి అందరికీ అందుబాటులో ఉంచాలనేది మా కోరిక. మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఈమధ్య కాలంలో తెలుగులో ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. ఇది ఇప్పుడు అందరూ వాడుతున్నదీ, అందరూ తేలిగ్గా కావలసినవి వెదుక్కుని ఆనందించగలిగినదీ కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. ఎందరో ఔత్సాహికులు ఈమాట లోని కథలను కవితలను ఆడియోరూపం లోకి తెస్తున్నారు. వారికి మా కృతజ్ఞతలు. వాటిని ఈ ఛానల్ ద్వారా ప్రచురించబోతున్నాం. కథలతో పాటు అలనాటి పాటలు, రూపకాలు, అరుదైన సాహితీవేత్తల గొంతులు, సంభాషణలు, ప్రాచుర్యంలో ఉన్న ప్రైవేట్ గీతాలు ఇలా అన్నింటినీ ఇక్కడ పొందుపరచబోతున్నాం. ఇలా ఈమాటలోని ఆడియోలు అన్నీ సమయానుకూలంగా అక్కడ అందరికీ సులభంగా అందుబాటులో ఉంచబోతున్నాం. అంతే కాక, సరికొత్త ఆడియో వీడియో రచనలకు కూడా చోటు కల్పించబోతున్నాం. ఈ మహాప్రయత్నంలో మాకు సహకరించి, ముందుండి నడిపిస్తున్న ప్రశాంతి చోప్రాగారికి, సహాయ సహకారాలందిస్తున్న పరుచూరి శ్రీనివాస్, తదితరులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా, పాఠకుల నుంచి కూడా కంటెంట్ ఆహ్వానిస్తున్నాం. ఈమాట నియమావళికి అనుగుణమైన శబ్ద-దృశ్య-రచనలను ఈ ఛానల్ ద్వారా ప్రచురించగలం. ఈ ఛానల్‌‍కు సబ్‌స్క్రయిబ్ చేసి మా ప్రయత్నాన్ని విజయవంతం చేయమని ఈమాట పాఠకులకు మనవి.

శ్రీమతి పిల్లంగొల్ల శ్రీలక్ష్మిగారికి సాహిత్యాభివందనాలు!

నేడే తెలిసింది, ఈనాడే తెలిసింది, కమ్మని కలలకు రూపం వస్తే… అని ఒక సినీకవి ఆనాడు ఏసందర్భానికి రాశాడో కాని, ఆపాట ఈపూట ఈమాటలో మానోట పాడబడుతుందని ఆయన ఊహకు అందడం జరిగివుండదు. తెలుగు సాహిత్య అకాడెమీ కార్పొరేషన్ కో. & సన్స్ లిమిటెడ్‍కు శ్రీమతి పిల్లంగొల్ల శ్రీలక్ష్మిగారిని ఓనరుగా రాష్ట్రప్రభుత్వం నియమించడం తెలుగు (సంస్కృతానికి కూడా) భాషకు, సాహిత్యానికి ఒక అనిదంపూర్వగౌరవంగా మేము భావించడం జరిగింది. సాహిత్యరంగేతర్ అని శ్రీలక్ష్మిగారి నియామకాన్ని కొందరు విమర్శించడాన్ని మేము ఖండిస్తున్నాం. అసలు తెలుగులో కవి, రచయితలు కాన్దెవరు? ఖర్వాటుడికి ఈర్పెనెందుకు? అని ప్రశ్నిస్తున్నాం. ప్రస్తుత సాహిత్యకారులు, కారకులలో ఎవరూ కూడా ఈ పదవికి అర్హులు కారని, ఇంతకుముందు ఓనరులైన కారుల వల్ల అకాడెమీ ఎక్కని ఎత్తులేమైనా అరాకొరా మిగిలివుంటే అవి ఎక్కించేయాలని, రాష్ట్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక నిజాలు నిజంగా ఇవీ అని మేము మనసుతో నమ్మడం జరిగింది. అచ్చతెలుగులో ఏదైనా చేయడం జరిపించగల శ్రీలక్ష్మిగారిని నియమించడం అనేది రాష్ట్రప్రభుత్వం తెలుగు లాంగ్వేజీ పట్ల ఎత్తూ లావూ తెలియని మమకారంతో, దానిని తెగబతికించాలన్న ఆవేదనతో, తెలుగు స్త్రీచెల్లెలి అభ్యుదయం కోసం ఒక అన్న తీసుకున్న నిర్ణయంగా కూడా గుర్తించి మేము సంతోషపడడం జరిగింది. శ్రీలక్ష్మిగారి భుజాలమీద, తల మీద, టేబుల్ మీద ఎంతో నమ్మకంతో పెట్టబడిన ఈ బాధ్యత బరువైనది. అయినా, ఎవరికీ అందనంత ఎత్తులో ఆండ్రోమెడా నక్షత్రమండలానికి ఇటు అంచుపై ఉన్న ప్రస్తుత తెలుగు సాహిత్యాన్ని అటు అంచుపైకి జరపడం చేయించగలరని వీరి శక్తిపై వంచన లేకుండా మేము నమ్మడం జరిగింది. ఇదే సమయంలో, 2పు లేదా 10ర, 5పు లేదా 25ర, 10పుస్తకాలు లేదా 50పైగా రచనలు స్వయంకృషితో, స్వార్థంతో (స్వ+అర్థంతో, స్వీయార్థంతో) ప్రచురించుకున్నవారికి వరుసగా బి.ఎ, ఎమ్.ఎ, డాక్టరేట్ గౌరవ పట్టాలతో పాటు, కులకవితాతిలక, మతకథాజాతిరత్న, సంప్రదాయసాహిత్యకాషాయసింధు, అభ్యుదయసాహిత్య‌అరుణబిందు, అస్తిత్వసాహిత్యషాజహాన్, మైనారిటీసాహిత్యమోజెస్ వంటి బిరుదులు కూడా అకాడెమీ ఇవ్వాలన్న మా చిరకాల కోరికను శ్రీలక్ష్మిగారు తమ క్రియాశీలక పనిలో భాగంగా అమలు చేయడం జరిపించగలరని మాకు ఒక ఆశ కూడా పుట్టడం జరిగింది. ఎలాగైతే దేశస్థాయిలో వ్యక్తిస్వేఛ్ఛ, వాక్స్వాతంత్ర్యం వంటివి ప్రజ మంచి కోసం తుడిచిపెట్టబడుతున్నాయో అలాగే సాహిత్య మంచి కోసం, విమర్శ, విశ్లేషణ వంటివి కూడా సాహిత్య మినిమం రిక్వయిర్‍మెంట్లనుంచి తుడిచిపారేయాలని ఈ సందర్భంగా మేము బాధతో డిమాండ్ చేయడం జరుగుతోంది. తమ సరస్వతి సేవలో భాగంగా, శ్రీలక్ష్మిగారు ఫేస్‍బుక్, వాట్సాప్ వంటి వేదికలలో విస్తరించిన సాహిత్య కూటములు, తండాలు, గుంపులు, గ్రూపులు, సెల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషనులలో చేరాలని, అక్కడి సాహిత్య రాజకీ సేవలో తరించాలని మాకు తపన రావడం కూడా జరుగుతోంది. అంతే కాకుండా, జన్మతః ఉద్దండులై కూడా, అహర్నిశలు కథాకథనశైలీశిల్పాది లక్షణాలను మధిస్తూ సాధిస్తున్న తమ దైనందిన యూజ్‍లెస్ డ్రజరీకి దూరంగా, స్వల్పతెరపి కోసం మాసిక త్రైమాసిక వార్షికాలుగా, ఆహ్లాదకరమైన పరిసరాలలో వనభోజనాలతో, ఉల్లాసమైన తుళ్ళింతలతో ఉల్లాసంగా తుళ్ళిపడుతూ రెండురోజులు, పెళ్ళికిముందు సంగీత్ సెరిమొనీ వంటి ఎల్లలు లేని ప్రేమయికస్నేహసౌభ్రాతృసిస్టర్‍హుడ్ [ఇది తత్సంతద్బం తెలుగుపదం అని తెలియడం జరిగింది – సం.] వాతావరణంలో హర్షానందాతిరక్తతతో గడిపి, ఎన్నో మధుర యాదిలనూ తీపి మెమరీసునూ మనసులోను, ఇంకా ఎన్నో సెల్ఫీలనూ పికె‍ఎ‍ఫ్‍సి తరహా గ్రూపు ఫోటోలనూ సెల్ఫోనులలోనూ నింపుకొని సేదతీరి, మండే మార్నింగుకల్లా మండే గుండెలతో తమ సామాజికబాధ్యతను భుజాలకెత్తుకుంటున్న ఫ్రంట్‍లైన్ సేవియర్స్ సాహిత్యకారసంగమాలడెక్‍లలో కూడా శ్రీలక్ష్మిగారు పేకముక్కల్లే కలిసిపోయి వాటిని మరింత దిగ్విజయం చేయాలని తెలుపుకుంటూ వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.