జులై 2019

ఏ ఏటికాయేడు ఇబ్బడిముబ్బడిగా కథలు, కవిత్వ సంకలనాలు ప్రచురింపబడటం తెలుగునాట రానురానూ రివాజుగా మారుతోంది. ఊరికొకరుగా వెలిసి సాహిత్యాన్ని తమ భుజాలకెక్కించుకు మోస్తున్నామని చెప్పుకోడం చూపించుకోడం మొదలయ్యాకే మన సాహిత్య ప్రమాణాలు ఏ ఎత్తులో ఉన్నాయో మరీ స్పష్టంగా అందరికీ తెలిసివస్తోంది. పేరు పొందిన కథా/కవిత్వ సంకలనాలు ఏవి తీసుకున్నా అందులో చేర్చబడని కథల/కవితల చర్చ అనివార్యంగా వాటితో జతపడి ఉంటుంది. కానీ, నిజానికి అసలు సమస్య అది కాదు. ఎంపిక చేయబడుతున్న రచనలూ నానాటికీ తీసికట్టుగా తయారవుతుండడం, ఏ సంకలనాన్ని గమనించినా అది ఒక ఏడాదిలో వచ్చిన గొప్ప రచనల తాలూకు జ్ఞాపికగానో లేదంటే ఆ ఏడాది వినపడ్డ కొత్త గొంతుకలను మరికొందరికి పరిచయం చేసే ప్రయత్నంగానో కనపడకపోతుండడం, సాహిత్యేతర ప్రయోజనాలే ఈ సంకలనాలు క్రమం తప్పకుండా విడుదలయ్యేలా ప్రోత్సహిస్తున్నాయన్న నిజం సాహిత్యావరణంతో అంతగా పరిచయం లేని మామూలు పాఠకులకు కూడా అర్థమయ్యేంత స్పష్టంగా ఈ రాజకీయాలు పెచ్చుపెరిగిపోవడం, కలవరపెట్టే విషయాలు.

నాలుగు రచనలు మన ముందున్నప్పుడు వాటిలో ఏది అత్యుత్తమ రచనో బేరీజు వెయ్యడం, నాలుగింటినీ విలువ కట్టి వరుసలో ప్రకటించడం అసాధ్యమైతే కావచ్చు కానీ, ఇన్ని ప్రింట్ పత్రికలు, కొత్తగా పుట్టుకొస్తోన్న వెబ్ పత్రికలు, ఏడాది పొడుగునా ప్రచురిస్తోన్న ఇన్ని వందల రచనల్లో నుండి ఒక కనీస స్థాయిలో నిలబడగల రచనలను ఎంపిక చేయలేకపోవడం దుర్గతి. తోడుగా, ఏ ఏ అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారో, ఏ ప్రాతిపదికన ఎంపిక జరిగిందో మాటవరసకు కూడా ప్రకటించని సంపాదకుల అలక్ష్యం. తమ రచనలు ఎట్లాంటి సంకలనాలలో ప్రచురింపడుతున్నాయో కనీస వివరం తెలియని స్థితిలో ఉంటున్నామని రచయితలే చెప్పుకుంటున్నారు. ముందుగా రచయితలకు తెలియబరచడం, అనుమతి తీసుకోవడం అక్కర్లేని పనులయ్యాయి. ఆపాటి గౌరవాన్ని కూడా ఆశించకుండా, తమ రచనలను అచ్చులో చూసుకుంటే చాలన్న తృప్తితో బ్రతుకుతున్నారా తెలుగు రచయితలు? వెబ్‌ పత్రికలలో రచనలు పరిశీలనకు అనర్హమైనవనీ, ప్రింట్‌ పత్రికలలో ప్రచురింపబడ్డ రచనలనే ఈ సంకలనాలకు పరిశీలిస్తామనీ బిగ్గరగా చెప్పుకుంటున్న సంపాదకవర్గాలది మరో వింత పోకడ. సాంకేతికతను కళకు విరోధిగా భావించే మూర్ఖత్వమిది. లేదా వెబ్‌పత్రికలలో వస్తోన్న సాహిత్యాన్ని గమనించలేని అలసత్వం. మాధ్యమాలను బట్టి, రచయిత పేరును బట్టీ కాక, అక్షరాలను బట్టి రచనలకు విలువగట్టే ధోరణి మనకింకెప్పటికి అలవడుతుంది? తామరతంపరగా పుట్టుకొస్తున్న ఈ సంకలనాలకు లేని విలువలను ఆపాదించడం ఆపి, మన చేతుల్లో నుండి చల్లగా జారుకుంటోన్న ఉత్తమ ప్రాచీన సాహిత్యమేదైనా ఉంటే దానిని పునఃప్రచురించుకుంటే, కనీసం ఈ కొత్త చెత్తను కాస్త తగ్గించుకున్న వాళ్ళమవుతామేమో.