సాహిత్యం అంటే ఇలానే ఉండాలి, ఇవి మాత్రమే చెప్పాలి, ఇలా మాత్రమే చెప్పాలి అన్నది కనపడని కంచె. సమాజపు కట్టుబాట్లను లెక్కచేయకుండా తమవైన అభిప్రాయాలని ధైర్యంగా వెల్లడించిన రచయితలు ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలోనైనా ఎంతోమంది లేరు. అంతమాత్రాన అలా చెప్పినవారు సమాజ వ్యతిరేకులో దేశద్రోహులో కారు. భిన్న ప్రవర్తనలనూ, విశ్వాసాలనూ నిరసించి హేళన చెయ్యడం, మన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకునేవారి పట్ల ద్వేషం కక్కడం, చివరకు హింసకు కూడా తెగించడం, మనముందున్న నేటి నాగరికత. సామూహిక ధోరణులకు, అభిప్రాయాలకు, నమ్మకాలకు వంతపలికే సాహిత్యాన్నీ కళలనూ మాత్రమే ఆదరించడం ఈ సంకుచిత ధోరణిలోని భాగమే. ఏ భిన్నస్వరం వెలువడ్డా దౌర్జన్యంతో నొక్కివేయడం ఈ ఆధిపత్యధోరణికి మరోకోణమే. అందుకే గొంతు పెగుల్చుకోలేనివారి స్వరమై బిగ్గరగా, బలంగా, మనముందుకొచ్చిన సాహిత్యం ఈనాటికీ బహుతక్కువ. ఆ సాహిత్యానికి దక్కిన ఆదరణ, గౌరవం ఇంకా తక్కువ. సమూహాల్లో కలవలేక అవస్థపడుతున్న మనుష్యుల లోలోపలి సంక్షోభాలనూ సంకోచాలనూ నిజాయితీగా నిబ్బరంగా చెప్పుకోనిస్తున్నామా? ఆ జీవితాలు చెప్పే సత్యాలను అంగీకరిస్తున్నామా? ఏ చట్రంలోనూ బిగియకుండా, ఏ నిరసనలకూ వెరవకుండా, జీవితాన్ని దాని అన్ని ఎత్తుపల్లాలతో, చీకటివెలుగులతో పాఠకుల ముందుకు తెచ్చే కథలను భూతద్దం పెట్టి వెదుక్కోవాల్సిన పరిస్థితి నుండి మన సాహిత్యచరిత్రేం పెద్దగా ఎదగలేదు. ఇప్పుడే కాదు, అట్లాంటి జీవితాలను, భిన్నస్వరాలను మన సాహిత్యంలోకి, కళల్లోకి, సమాజంలోకీ సాదరంగా ఆహ్వానించుకోలేనంతకాలం ఆ ఎదుగుదల అసాధ్యం. ఇటువంటి పరిస్థితుల్లో టెలింగ్ ది ట్రూత్ అబౌట్ మి అన్న ఎ. రేవతి ఆత్మకథను, రచయిత్రి పి. సత్యవతి ఒక హిజ్రా ఆత్మకథగా చేసిన తెలుగు అనువాదానికి ఈ ఏటి కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు లభించడం ఆశావహమైన విషయం. సమాజం చూపే అనాగరిక వివక్షను, భాషభాషల్లోనూ వినిపించాలనుకున్న ధైర్యానికి దక్కిన గౌరవమిది. సమాజంలోని పెనుచీకటిని వేలెత్తిచూపి, జీవించే హక్కు కోసం నిర్భయంగా చేసిన ఒక మనిషి పోరాటం గుర్తించదగినది, స్వాగతించదగినది, గౌరవించి గెలిపించదగినది. సమాజం భిన్నత్వానికి పర్యాయపదం. అందుకే, ఈ తరహా సాహిత్యాన్ని సమాజం స్వీకరించే తీరును బట్టి ఇకముందయినా అది భిన్నత్వంలో ఏకత్వం చూసి పురోగమిస్తుందా లేక తనను తాను చీల్చుకొని అధోపతనం అవుతుందా అన్నది చూచాయగానైనా తెలుస్తుంది.