“Each of us needs something of an island in his life—if not an actual island, at least some place, or space in time, in which to be himself, free to cultivate his differences from others” – John C. Keats.
ప్రతి మనిషికీ జీవితంలో తానొక్కడూ మనగల్గిన ద్వీపపు అవసరం ఉంది, నిజంగా ద్వీపం కాకపోయినా కనీసం తనకు తానుగా ఉండగల్గిన ఒక ప్రాంతము, సమయమూ కావాలి. 1820లో టైఫస్ విజృంభణతో ఇటలీలోని నేపుల్స్ హార్బర్లో ఒక ఓడలో చిక్కుపడి బందీ అయేనాటికి క్షయ వ్యాధితో బాధపడుతున్న తన జీవితంలో మిగిలున్నది నాలుగు నెలలేనని ఇంగ్లీష్ కవి జాన్ కీట్స్కి తెలుసు. అప్పటికతని వయసు పాతికేళ్ళు. ఆ స్థితిలో కూడా అతను కొత్త కవిత్వం చదివాడు, రాశాడు. గతంలోకి తొంగిచూసుకుని అనుభవాలన్నింటినీ ఓ క్రమపద్ధతిలో రాతగా పదిలపర్చుకున్నాడు. ఆ ఏకాంతంలో తన అన్నేళ్ళ జీవితానికీ అతనొక కొత్తచూపు ఇచ్చుకున్నాడు. మానవ చరిత్రలో ఇటువంటి విపత్తులు రావడం, ప్రపంచాన్ని కబళించడం కొత్తకాదు; మానవాళి దానిని దాటుకొని తిరిగి తననూ సమాజాన్నీ పునర్నిర్మించుకోవటమూ కొత్త కాదు. అప్పటి టైఫస్ అయినా ఇప్పటి కొరోనా అయినా ఇదే సత్యం. కానీ మనమే ఒక చిత్రమైన స్థితిలో కాలం గడుపుతున్నాం. ఇళ్ళలో నిజంగా బందీ అయినవారు కొందరే అయినా, బందీ అయ్యాం అన్న భ్రమను మోస్తున్నవారు మాత్రం లెక్కకందనంతమంది. సోషల్ మీడియా మనిషిలోని సంఘజీవిని ఏనాడో మరుగుపరిచింది. అది కట్టిన కోటగోడలతో అతడేనాడో ఒంటరివాడయ్యాడు. ఇప్పుడు వినపడుతున్న ఒంటరి కేకల్లోనూ మనిషికి మనిషి ఎడమవుతున్నాడన్న బాధ కనిపించదు, నిజంగా సాటిమనిషికి సహాయం చేయలేకపోతున్న వ్యథ కనిపించదు. ఒక మిథ్యాప్రపంచంలో బ్రతుకుతూ బైట ప్రపంచాన్ని ఊహిస్తూ, నిందిస్తూ లేదా దానికి భయపడుతూ సాగిస్తున్న వ్యాఖ్యానాలే అన్ని దిక్కుల్లోనూ కనపడుతున్నాయి తప్ప సంవేదనతో ప్రతిధ్వనించే గొంతులెక్కడ? ఏ సమాచార సంబంధాలూ తెగిపోనివాళ్ళు, సరుకులు నెలలకు సరిపడా కొనిపెట్టుకున్నవాళ్ళు, ఉద్యోగానికి, జీవితానికి సంబంధించి ఏ అభద్రతా లేనివాళ్ళూ కూడా ఈ బూటకపు అరుపులకు గొంతు కలపడం మందిమనస్తత్వమే తప్ప మరొకటి కాదు. హామ్స్టర్ వీల్ లాంటి జీవితానికి అంకితమైపోయి, నిదానించి తన గురించి తన సమాజం గురించి స్పష్టత తెచ్చుకోవడానికి అవసరమైన కనీస సమయాన్ని పూర్తిగా సోషల్ మీడియాకే ధారాదత్తం చేసిన మనిషి ఈ రోజు కొత్తగా ఈ ఒంటరి గీతాన్ని పాడటంలో అర్థం లేదు. మనందరం కీట్స్లా మన జీవితానికో కొత్తచూపు ఇచ్చుకోలేకపోవచ్చు కానీ అనుకోకుండా దొరికిన ఈ ద్వీపంలో మన గురించి మనం కనీసపాటి స్పష్టత తెచ్చుకోగలిగితే జీవితంలోనైనా ప్రపంచంలోనైనా రాబోయే విపత్తులకు సిద్ధపడే శక్తిని సంపాదించుకుంటాం. అందుకే, బయటకు వెళ్ళే స్థితి లేకపోతే లోపలికి ప్రయాణం చెయ్యండన్న నానుడి ఈరోజు మరింతగా అవసరం.