తెలుగులో మంచి కథలు లేవూ రావూ అంటాం, వస్తే మనం గుర్తు పట్టగలమా? మనకు అసలు కథ చదవడం వచ్చా? రచయిత-రచన-పాఠకుడు అని ఆగిపోతున్నాం కాని సాహిత్యంలో అటుపైన వచ్చే అతిముఖ్యమైన సాహిత్యచర్చను మనం మర్చిపోయాం. పాఠకుడు పెట్టుకున్న అద్దాలను బట్టి, రచన ఎన్నో రంగుల్లో తారసపడవచ్చు. అది సహజం. అయితే, ఈ రంగులను దాటుకుని రచనకు స్వతంత్రమైన అస్తిత్వమంటూ ఒకటి ఉంటుంది. కథ నిజంగా ఏం చెబుతున్నదన్నది పాఠకులు చూడగల్గుతున్నారా, విస్మరిస్తున్నారా, లేక తమకు నచ్చింది తామే తీసుకుని తిరగరాసుకుంటున్నారా తెలుసుకునేందుకు అక్కరకొచ్చేది సాహిత్యచర్చ ఒక్కటే. సోషల్ మీడియాలో సాహిత్య ప్రేమికులు వేలాదిగా ఉన్న గ్రూపులున్నాయి కాని వాటిల్లో ఎవరూ సాహిత్యం గురించి విశ్లేషించరు, తమ అభిప్రాయాలు స్పష్టంగా వెల్లడిస్తూ చర్చలు చేయరు. ఇది పాఠకులే కాదు, రచయితలూ చేయరు. పుస్తక ప్రచురణ కూడా ఏటా నడిచే పబ్బంలా మారడంతో, పరస్పర పొగడ్తల భాగోతానికి ఏ విఘాతమూ కలగకుండా, ఇప్పుడు రచయితలూ జాగ్రత్తపడుతున్నారు. కనీసం వాళ్ళైనా సాటి రచయితల కథలు, కవితల గురించి ఎందుకు విశ్లేషించరు? ఏది బాగుందో, ఏది బాలేదో ఎందుకు మాట్లాడుకోరు? రచయితలూ ఈ దిశగా అడుగులు వేయడం లేదంటే వాళ్ళూ సామాన్య పాఠకుల్లాగానే కథలో తమకు నచ్చిందీ నచ్చనిదీ చూసుకుంటారే తప్ప, తమ ఇష్టాయిష్టాలకు ఆవలగా కథ ఏం చెప్తోందో చూడటం లేదు అనే అర్థం. ఒక రచనను అనుభవించేది వైయక్తికంగానే, మౌనంగానే కావచ్చు. కాని, రచన ఒక వస్తువు. దానికొక నిర్మాణపద్ధతి ఉంటుంది. అది మనముందు పరచుకున్న తీరొకటి ఉంటుంది. ప్రతీ వాక్యమూ, ప్రతీ సంఘటన, ప్రతీ వర్ణన రచనానిర్మాణంలో భాగం. ఆ నిర్మాణపద్ధతి, తీరు, నడత వల్లనే రచన అంతిమంగా బాగుండేదీ బాగుండనిదీ, ఆ రచన ఒకరికి నచ్చినా నచ్చకున్నా. తమ రచనను ఎలా ఆవిష్కరిస్తున్నాం అన్నది రచయితలు చేయవలసిన, చేసుకోవలసిన చర్చ. శాస్త్రీయ పరిశోధనలలో ఉన్నవారు ఒకరినుంచి ఒకరు నేర్చుకున్నట్టు, తమ పద్ధతుల బాగోగులు చర్చించుకున్నట్టు, రచయితలూ రచనల లక్షణాలు చర్చలు చేస్తూ, పదిమందిలో మాట్లాడుకుంటూ ఉంటే, సాటి రచయితల్లో కొందరైనా తమ రచనల గురించిన అపోహలు తొలగించుకునే వీలుంటుంది; పాఠకులకు అవగాహన పెరిగే అవకాశముంటుంది; తెలుగులో మంచి రచనలు మరికొన్ని రావచ్చనే భ్రమ కొంతయినా నిజమయే అవకాశముంటుంది.