ఆగస్ట్ 2019

‘నీ జీవితం కాలిపోతుంటే మిగిలే బూడిదే కవిత్వం’ అని కెనేడియన్ కవి, గాయకుడు లెనార్డ్ కోహెన్ అంటాడు. కె. సదాశివరావు వ్రాసిన చలిమంటలు అనే కథలో రచయిత పరంజ్యోతి, తన రచనలేవీ ఎక్కడా ప్రచురించడు. అతనితో వ్యక్తిగత పరిచయం ఉన్నవారికి తప్ప అతని ప్రజ్ఞ మిగతా లోకానికి తెలియదు. అలాంటి వారి ద్వారా పరంజ్యోతి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయిన తరువాతి తరం రచయిత ఒకడు, అతన్ని వెదుక్కుంటూ వెళతాడు. తన కవితలను వినాలనీ, పదిమందికీ తెలియజేయడానికి వాటిని ప్రచురించాలనీ, ఉవ్విళ్ళూరుతున్న ఇతనికి ఆ రాత్రి వెచ్చదనం కోసం ఒక చలిమంట రగిల్చి, తన కవితలు చదివి వినిపిస్తూ, చదివినవి చదివినట్టు ఆ మంటలో వేస్తాడు పరంజ్యోతి. విస్తుపోయి చూస్తోన్న ఇతనితో, అవన్నీ చిత్తు ప్రతులనీ, ప్రతి రచననూ ఎన్నోసార్లు తిప్పి వ్రాశాననీ, అవన్నీ ఉండక్కర్లేదనీ చెప్తాడు. ఒక పరిణత కవి, ఒక ఊహను కాగితం మీద పెట్టి, అది కవితగా రూపాంతరం చెందేవరకు ఎంతలా తపిస్తాడో; కవిత్వ పరిణామ దశల్లో ఉన్న ఎన్నో అంతరాలు దాటుకుని ఉత్తమ ప్రతినే వెలువరించడానికి ఎలా ప్రయత్నిస్తాడో; అది ఒక్కొక్కసారి ఒక జీవితకాలపు సాధన ఎందుకవుతుందో ఈ కథ చెప్తుంది. తాము రాసినవి ప్రపంచానికి చూపించాలన్న తాపత్రయం లేకుండా తమ దగ్గరే అట్టిపెట్టుకోవడం వెనుక తమ సాహిత్యసాధక ప్రయోజనాలు ఏమిటో తన మరణానంతరం తన రచనలు వేటినీ మిగల్చవద్దని మిత్రుణ్ణి కోరిన కాఫ్కా, వేల కవితలు రాసినా తాను బ్రతికుండగా గుప్పెడే ప్రచురించిన ఎమిలీ డికిన్‌సన్ లాంటి రచయితలకే తెలియాలి. విరివిగా సాహిత్య సృజన చేస్తూ కూడా ధన, కీర్తి కాంక్షలకతీతంగా ఆ రచనలను జీవితాంతం తమకు తామే మోసిన వారి నిర్మోహత్వాన్నీ, అంతకు మించి, అన్నాళ్ళ వాళ్ళ పరీక్షకూ, అటు పైన ఇన్నేళ్ళ కాల పరీక్షకూ తట్టుకుని ఈనాటికీ ఆ రచనలింత ప్రాభవంతో మనముందుండటాన్నీ, గమనించి చూడటం ఎన్నో కొత్త పాఠాలను నేర్పిస్తుంది. ఈ సోషల్ మీడియా యుగంలో, అట్లాంటి స్వీయ నియంత్రణ ఊహకు కూడా అందని మన సృజనకారులకు ఆ పాఠాలిప్పుడు మరీ అవసరం. ప్రచురణ అన్నది కేవలం కాగితాలకో, వెబ్ పేజీలకో, వ్యయానికో మాత్రమే సంబంధించిన విషయం కాదు. చాలా సందర్భాల్లో, అది రచయితకూ రచనకూ మధ్య సాగిన రహస్య సంభాషణను ఒక కొలిక్కి తెచ్చే దారి కూడా. తన కవితలన్నీ చిత్తు ప్రతులేనని, కవిత రాసిన నలభయ్యేళ్ళ తరువాత కూడా దాని గురించి ఆలోచిస్తూ అవసరమైన మార్పులు చేస్తానని, తన కవిత్వమసలు లిట్మస్ టెస్ట్ దాటనే లేదనీ చెప్పే అజంతాలు అరుదు, మంచి కవిత్వం లాగే. కానీ ఇప్పుడు, రచనను తీర్చిదిద్దటం అటుంచి, ప్రచురించే ముందు తాము రాసినది మరొక్కసారి చూసుకున్నారన్న నమ్మకం కూడా కలిగించని రచనలే ఎటు చూసినా. తనగొంతు తాను గొప్పగా వినిపిస్తున్నానన్న భ్రమలో, శబ్దవమనమే భావస్వేచ్ఛగా పొరబడుతూ, ఏ కొద్దిపాటి విమర్శనూ తీసుకోలేకుండా ఉన్న కూపస్థ మండూకాల బెకబెకలే ఎటు విన్నా. రచయితలుగా తాము ముందుకు రాకుండా రచనా ప్రక్రియ పట్ల గౌరవం, రచన గురించి రచనే మాట్లాడాలన్న పట్టుదల ఉన్నవాళ్ళు, ప్రస్తుతం మనకు వేళ్ళ మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. అయినా, మన సాహిత్య దశను దిశను మార్చడానికి ఆ కొద్ది గొంతులే చాలు, మనం వినగలిగితే.