కేవలం తన ఆలోచనలను అక్షరబద్ధం చేసుకొని చూసుకోవడమే రచయిత లక్ష్యమైతే సాహిత్యం అనేదే ఉండదు. తన ఊహలు, అభిప్రాయాలు, ఆలోచనలు పదిమందికి తెలుపవలసి ఉన్నదనే స్పృహ సాహిత్యానికి, ప్రత్యేకించి ఆత్మకథాసాహిత్యానికి మూలబీజం. రచనకు కావలసిన ముడిసరుకులన్నీ జీవితంలోనే ఉంటాయి. కానీ అనుభవాన్ని రచనగా మార్చే పాటవం, ఆ చెప్పడంలో తనలోకి తాను నిజాయితీగా చూసుకునే చూపు రచనలను మనకు దగ్గర చేస్తాయి. అనుభవాలు వ్యక్తిగతమై, మనిషి లోతులు, బలహీనతలతో సహా అర్థమవుతున్న కొద్దీ, ఆ రచయిత మనిషిగా పాఠకుడికి ఆప్తుడవుతాడు. బహుశా ఇందుకే ఆత్మకథలు ఎప్పుడు ఎవరు రాసినా చెల్లుతూనే ఉన్నాయి. అవి శ్రీపాద అనుభవాలూ- జ్ఞాపకాలూ, దాశరథి జీవనయానం లాగా తమ తమ జీవితాల సాక్షిగా పాఠకులకు ఆనాటి చరిత్రను పరిచయం చేయవచ్చు. అబ్బూరి వరదకాలం లాగా, ఆచంట జానకిరామ్ సాగుతున్న యాత్ర లాగా, తమ జీవితాల్లోని ముఖ్య సంఘటనలను, ప్రముఖుల సాంగత్యాన్నీ మాత్రమే పొందుపరచవచ్చు. లేదూ, తమ మామూలు జీవితానుభవాలనే ముళ్ళపూడి శ్రీదేవిలా నెమరేసిన మెమరీస్ గానో, సోమరాజు సుశీలలా ఇల్లేరమ్మ కతలు గానో చెప్పి ఆకట్టుకోనూవచ్చు. ఒక ‘నేను’ తన జీవితంలోని బాధనైనా సంతోషాన్నైనా, తనకు తానుగా సాధించుకున్న విజయాలైనా పరాజయాలైనా, తన తలపొగరైనా, గర్వభంగమైనా, పంచుకోదగినదేనని నిస్సంకోచంగా నమ్మి ఉండకపోతే, ఈ రోజు మనకు అందుబాటులో ఉన్న సాహిత్యంలో సింహభాగం వెలుగు చూసేది కాదు. నిరాధారమూ, అసమంజసమూ, అసందర్భమూ అయితే తప్ప, స్వోత్కర్ష, పరనింద కూడా సాహిత్యంలో చొరబడరానివేం కావు. అందుచేత, ఎవ్వరైనా ఏదైనా ఎలాగైనా చెప్పవచ్చు. కానీ, నిజం నిక్కచ్చిగా చెప్తున్నామన్న అపోహలో అకారణమైన అక్కసునీ, ఇతరుల పట్ల ద్వేషాన్నీ కథలుగా, ఆత్మకథలుగా రాయడం సరి కాదు. సాహిత్యానికున్న పరిధినీ విశాలమైన వేదికనూ స్వార్థ ప్రయోజనాల కోసం ఆక్రమించుకుంటే, ఇప్పటిప్పుడు అడ్డుకునేవారు లేకపోవచ్చు. అంతమాత్రాన, రాసినదంతా సాహిత్యమూ కాదు, సాహిత్య చరిత్ర అంతకన్నా కాబోదు. తాత్కాలికమైన ఉద్వేగాలూ స్నేహాలూ శత్రుత్వాలూ కాలంతో కరిగిపోయాక, నిజాయితీగా తమ కథలు వినిపించిన గొంతులే మిగిలి, ముందుతరాలకు తమ కాలపు సాహిత్య చరిత్రను నిష్పక్షపాతంగా చెప్తాయి.