డిసెంబర్ 2018

ఫహెశ్! సాదత్ హసన్ మంటో రచనాజీవితాన్ని వెంటాడి, వేటాడిన ఒకే ఒక్క పదం. అర్థం: అశ్లీలం. అసభ్యం, కుసంస్కారం, మతానికి వ్యతిరేకం లాంటి పదాలకి తెరతీసే పదం. మంటో ఆ ఒక్క పదం కారణాన ఎన్నో యుద్ధాలు చేయవలసి వచ్చింది. కోర్టుల చుట్టూ తిరగవలసి వచ్చింది. తన రచనలను తానే సమర్థించుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇంతకీ అతని నేరమేమిటి? తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఏ కోణం నుంచి, ఏ దృష్టి నుంచి చూశాడో అదే దృష్టిని, అదే కోణాన్ని ఎక్కడా రాజీపడకుండా తన కథల్లో ప్రదర్శించాడు. ఒక రచయితకు తన పట్ల, సాహిత్యం పట్ల ఉండవలసిన నిజాయితీకి, నిబద్ధతకు మంటో నిలువెత్తు దర్పణం. మంటో చనిపోయే అరవై యేళ్ళు దాటింది. కాని, అప్పటికంటే ఇప్పుడు మంటో వంటి రచయితల అవసరం మరింతగా ఉంది. కారణం? ఈనాటికీ ఏ ప్రయోజనాలను ఉద్దేశించి రచయిత కథను మలిచాడోనన్న కనీసపు అవగాహన కూడా ఏర్పరచుకోకుండా, రచనల్లోంచి ఒకటి రెండు పదాలనో వాక్యాలనో విడదీసి తమ అభద్రతల భూతద్దంలో అవసరాల నేపథ్యంలో వాటిని చూస్తూ, చూపిస్తూ ‘ఇది అపచారం, అది మా మనోభావాలకు గాయం!’ అని విరుచుకుపడుతున్నవారు ఎక్కువైపోతున్న ఈనాటి మన సమాజం. మంటోని కేవలం కోర్టుకి ఈడ్చడంతో సరిపెట్టుకున్నారు అప్పటి సమాజోద్ధారకులు, ధర్మరక్షకులు. ఇప్పటివారిలా దాడులకు, బెదిరింపులకు, అసభ్యప్రచారాలకూ పాల్పడలేదు. రచయితలను భయపెట్టి అజ్ఞాతవాసంలోకి నెట్టేయలేదు. ఇది మనం సాధించిన ప్రగతి. ఇది సాహిత్యం, సమాజం వంటి వాటిపై మన దృక్కోణం ఏదైనా కాని, అందరమూ తలదించుకోవల్సిన పరిస్థితి.

సాహిత్యచక్షువు చూడలేనిది చూడకూడనిది ఏదీ లేదు. రచయిత కంటికి నిబంధనలు, అతని కలానికి నిర్బంధనలు ముమ్మాటికీ సమాజానికి చెరుపు మాత్రమే చేస్తాయి అన్న స్పృహ ఇప్పటికైనా రాకపోతే మనదేశపు స్వచ్ఛత మేడిపండుగా, స్వేచ్ఛ మిథ్యగానే మిగిలిపోతాయి. అలా మిగిలిపోకూడదు అంటే అశ్లీలం, అనైతికం అని ముద్రవేయబడ్డ ఆ సాహిత్యాన్ని మనం మరింతగా చదవాలి. సాహిత్యంలో అశ్లీలత ఏమిటి? మనోభావాలు ఎందుకు గాయపడాలి? సాహిత్యం కొన్ని అంశాలు స్పృశించకూడదనే నియమాలు ఎందుకు, ఎవరికోసం? – వంటివి మరింతగా చర్చించాలి. మంటోనే స్వయంగా అన్నట్టు రచయిత సమాజపు నల్లపలక మీద తెల్లగీత గీస్తాడు. ఎందుకంటే, ఆ నలుపు మరింతగా కొట్టవచ్చేలా మన అందరికీ కనిపించడానికి. సమాజంలో నలుపు చూపడం అశ్లీలమా? మంటో నిజంగానే అశ్లీలపు కథలు రాశాడా? తెలుసుకోవడం కోసం, మంటో ప్రపంచాన్ని తెలుగువారికి తెలియజేయడం కోసం, పూర్ణిమ తమ్మిరెడ్డి ఈ సంచికనుండీ మంటో కథలను ఉర్దూ మూలం నుండి నేరుగా, విధేయతతో తెలుగులోకి అనువాదం చేసి అందిస్తున్నారు. వారి శ్రమకి కృతజ్ఞతలు. మొదటగా ఈ శీర్షికలో మంటో వివాదాస్పద కథ కాలీ సల్వార్‌, కథా సంబంధిత వ్యాసం సఫేద్ ఝూట్ ప్రచురిస్తున్నాం.


ఈ సంచికలో:

  • కథలు: కాలీ సల్వార్ – పూర్ణిమ తమ్మిరెడ్డి (సాదత్ హసన్ మంటో); మా అమ్మంటే నాకిష్టం! – రంగనాథ రామచంద్రరావు (వసుధేంద్ర); స్టాంప్ ఆల్బమ్ – అవినేని భాస్కర్ (సుందర రామస్వామి); పెరటి తలుపు – తుమరాడ నరసింహమూర్తి (హెచ్. హెచ్. మన్రో-సాకి); గానుగెద్దు – గిరీష్ కె.; బేతాళ కథలు: కథన కుతూహలం-7 – టి. చంద్రశేఖర రెడ్డి.
  • కవితలు: బతుకు ఎంత పొరపాటైపోయేది! – తఃతః; నడిచొచ్చిన తోవ – రేఖాజ్యోతి; నేనే కవిత్వాన్ని – పాలపర్తి ఇంద్రాణి; కాళీపదములు 5 – పాలపర్తి ఇంద్రాణి; కొన్ని దూరాలంతే! – విజయ్ కోగంటి.
  • వ్యాసములు: సఫేద్ ఝూట్ – పూర్ణిమ తమ్మిరెడ్డి (సాదత్ హసన్ మంటో); సిలబస్: 7 బొమ్మలు చెప్పే కథ – అన్వర్; నేనొక చిత్రమైన చిక్కుముడి:2. ఆలోచనను ఆలోచిస్తున్న ఆలోచన – భైరవభట్ల కామేశ్వరరావు; అనేక రామాయణాలు: పునర్నిర్మాణాలు, ప్రతినిర్మాణాలు-శూర్పణఖ ఉదంతం – పి. సత్యవతి (కేథలీన్ ఎర్న్‌డల్); వేమూరి శారదాంబ నాగ్నజితీ పరిణయము – కాత్యాయనీ విద్మహే; విషమ సీసము – జెజ్జాల కృష్ణమోహన రావు.
  • ఇతరములు: నాకు నచ్చిన పద్యం: ఎఱ్ఱన ప్రాభాత వర్ణనం – చీమలమర్రి బృందావనరావు; పాతికేళ్ళ ప్రేమకథ (సమీక్ష) – దాసరి అమరేంద్ర; గడి నుడి 26 – కొల్లూరు కోటేశ్వరరావు.