సెప్టెంబర్ 2019

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (1944-2019):’నా లోపల విశ్వమంత ఆమ్రవృక్షం ఎడతెగని పరాగపవనాన్ని శ్రుతి చేస్తుంటే, గానంగా కరిగిపోయే కోకిలాన్ని, ఏకాంత ఢోలాఖేలనం ఎప్పటికీ ఇష్టం నాకు‘ అంటూ తన ప్రవృత్తిని కవిత్వంలో ప్రకటించుకున్న సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంతశర్మ తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురంలో జన్మించారు. కవులు, పండితులు అయిన తండ్రి శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారి సాహిత్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. కవిత్వమంతా రాజకీయమయమై, నిరసననూ, పోరాటాన్ని ప్రతిపాదించనిదంతా అకవిత్వంగా చూపించబడుతోన్న రోజుల్లో, ఒక సాహిత్య ప్రక్రియను ఈ తీరున అడ్డుగోడల మధ్య బిగించడం నచ్చని ఇంద్రగంటి దానిని బాహాటంగానే విమర్శించారు. బాహ్య ప్రపంచపు పోకడల ప్రేరణలతో ఉత్పన్నమవుతోన్న తనకాలపు కవిత్వ ఋతువులను గమనిస్తూ, ఆ గొంతుల్లోని ‘ఆధునికత’ను జాగ్రత్తగా జల్లెడపట్టిన సునిశిత దృష్టి ఇంద్రగంటిది. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సబ్ ఎడిటర్‌గా ఉద్యోగజీవితం మొదలుపెట్టినా, కొంతకాలం సినిమా రంగంలో పని చేసినా, ఆలిండియా రేడియోలో చేరినాకనే శ్రీకాంతశర్మ సృజనాత్మకత పూర్తిగా రెక్కలు విప్పుకుంది. ఆయన రచించిన ఎన్నో సంగీత రూపకాలు జాతీయస్థాయిలో బహుమతులు అందుకున్నాయి. ఆయన రచించిన లలితగీతాలు ఈనాటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. తెలుగు నాటకరంగానికీ, తెలుగు సాహిత్యరంగానికీ ఆయన చేసిన కృషి చెప్పుకోదగ్గది. అనుభూతి గీతాలు, ఏకాంతకోకిల, నిశ్శబ్దగమ్యం – కవితా సంపుటులు; శిలామురళి, క్షణికం, తూర్పున వాలిన సూర్యుడు – నవలలు; గంగావతరణం, వర్షనందిని, మాట మౌనం, తలుపు, కవి తిలక్‌పై చేసిన శిఖరారోహణం, మరెన్నో సంగీత రూపకాలు రచించారు. యువ నుంచి యువ దాకా అన్న కవిత్వసంకలానికి సంపాదకత్వం వహించారు. ‘హద్దుల మధ్య జీవితం జబ్బులా వార్ధక్యంలా, బెంగ పుట్టిస్తుంది కాబోలు! అందుకే, మనస్సు ఇంకా ఇంకా వెన్నెల రెక్కలు తొడుక్కుని, ఆకుపచ్చని యౌవనవనాల వైపు పరుగులు తీస్తుంది!‘ అన్న శ్రీకాంత శర్మ, అట్లాంటి యవ్వనోత్సాహంతోనే జీవన పర్యంతమూ తనను తాను మెరుగుపరుచుకుంటూ సాహిత్య సృజనలో కొత్త పుంతలు తొక్కుతూ వచ్చారు. ఇప్పుడిక హంస ఎగిరిపోయింది. ఇది విశ్రాంతి సమయం.