“In the discovery of hidden things and in the investigation of hidden causes, stronger reasons are obtained from sure experiments and demonstrated arguments than from probable conjectures and the opinions of philosophical speculators of the common sort.” – William Gilbert
ఆల్బర్ట్ ఐన్‌స్టయిన్ (1879-1955) అయిదేళ్ళ వయసులో జ్వరమొచ్చి మంచాన పడినప్పుడు, ఆడుకోమని వాళ్ళ నాన్న ఓ దిక్సూచి ఇచ్చాడు. దానితో కాసేపు ఆడుకొని దిగ్భ్రమ చెందిన ఐన్‌స్టయిన్, “మన కళ్ళెదుట ఉన్నవాటి వెనుక నిగూఢమైనది ఏదో ఉంది,” అనుకున్నాడు.
ప్రకృతిలో దాగి ఉండే ఆకర్షణ శక్తుల గురించి విచారణ క్రీస్తుకు పూర్వమే గ్రీకు తత్వవేత్తలతో మొదలైంది. ఆ ఆకర్షణ శక్తుల గురించి విచారణే పదహారో శతాబ్దంలో యూరప్‌లో ఆధునిక శాస్త్రీయ విప్లవానికి (modern scientific revolution) నాంది పలికింది. ఆ విప్లవంలో ముఖ్య భాగమైన ప్రయోగ విధానానికి మూల పురుషుడు విలియం గిల్బర్ట్. అతని ప్రయోగాల వలన ఓ కొత్త శాస్త్ర విభాగం, ఎలెక్ట్రికల్ సైన్స్, పుట్టింది. గిల్బర్ట్ వైద్యవృత్తి చేస్తూనే, రెండు మూడు దశాబ్దాలు హాబీగా చేసిన పరిశోధనలను, ప్రయోగాత్మక సైన్సులో పుస్తకంగా ప్రచురించాడు. అది ప్రయోగశాస్త్రంలో మొట్టమొదటి గ్రంథం, ఆ పుస్తకం ద్వారా గెలీలియో అంతటి వాడికి మార్గదర్శకుడైన ఘనుడు గిల్బర్ట్. అతని ప్రయోగాలలోకి వెళ్ళే ముందర ఆకర్షణ శక్తుల పూర్వ చరిత్ర తెలుసుకుందాం.
ప్రకృతిలో కొన్ని వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ శక్తుల గురించి మానవుడికి అనాదిగా తెలుసు: మొదటిది పసుపురంగురాయి (amber) ని ఉన్ని, పట్టు, నూలు లాంటి వస్తువులతో రుద్దితే, ఆ రాపిడికి అది గడ్డి పోచలనీ, గుడ్డ పీలికలనీ ఆకర్షించడం; రెండోది సూదంటురాయి ఇనుముని ఆకర్షించడం.
పసుపురంగురాయి (amber) ఆకర్షణ శక్తి
దేవదారు చెట్లకి పురుగూ చీడా పట్టకుండా కాపాడేది ఆ చెట్ల బెరడు నుండి వచ్చే జిగురు. కొన్ని వేల, లక్షల ఏళ్ళకి, తగిన వేడీ వాతావరణాల మూలాన, ఆ జిగురు శిలీభవిస్తుంది (fossil). పసుపురంగులో ఉండే ఆ రాతిలో కొన్నిసార్లు పురుగులు కూడా ఉండచ్చు. ఆ రాళ్ళని ఆభరణాల పైనా, వస్తువుల మీదా అలంకరణకి వాడేవారు.
ఆదిమానవుడు కొత్తరాతి యుగం (neolithic age), అంటే పదివేల ఏళ్ళ క్రితం వ్యవసాయం చెయ్యడం మొదలెట్టాడు. అంతకు మునుపే, పాతరాతి యుగం (paleolithic age) లో, అంటే ఇరవై వేల ఏళ్ళకి పూర్వం నూలు వడకడం నేర్చుకున్నాడు. అప్పటి మానవుని చేతి పనిముట్లలో ముఖ్యమైనది నూలు వడికే కదురు (spindle). తాహతున్న వాళ్ళు ఆ రాయితో చేసిన కదురు వాడేవారు. ఆడవాళ్ళు ఎడమ చేతిలో దూదిని పట్టుకొని, కుడిచేత్తో కదురుని త్రిప్పుతూ లాఘవంగా ఎలా దారాన్ని చేసేవారో రోమన్ కవి కటల్లస్ (క్రీ.పూ. 84-54) ఇలా వర్ణించాడు:
“The loaded distaff, in the left hand placed,
With spongy coils of snow-white wool was graced;
From these the right hand lengthening fibers drew,
Which into thread ‘neath nimble fingers grew.
At intervals a gentle touch was given
By which the twirling whorl was onward driven;
Then, when the sinking spindle reached the ground,
The recent thread around its spire was wound,
Until the clasp within its nipping cleft
Held fast the newly finished length of weft.”
కదురుతో నూలు వడుకుతున్న స్త్రీ
నూలు వడుకుతూ కదురు తిప్పేటప్పుడు, ఆ రాయి ఆడవాళ్ళ బట్టలకి రాసుకొని ఓ చిత్రమైన శక్తిని చూపెట్టేది – కదురు నేలకి చేరగానే అక్కడున్న తేలికైన గడ్డిపరకలని ఆకర్షించేది. తెలివైన ఆవిడెవరో అది గ్రహించి, దానికి ‘పట్టుకునేది’ (clutcher) అని పేరు పెట్టింది; ఈ రాయినే తెలుగులో ‘తృణగ్రాహి’ అంటారు.
సూదంటురాయి ఆకర్షణశక్తి
మానవ ప్రస్థానంలో రాతియుగం తర్వాత కంచుయుగం (క్రీ.పూ. 3300-1200), దాని తర్వాత ఇనుపయుగం (క్రీ.పూ. 1200-550) వచ్చాయి. సూదంటురాయికి మరో పేరు అయస్కాంతం; అయస్ + కాంతం = ఇనుముని ఆకర్షించేది.
సూదంటురాయిని (magnet) ఎవరు కనుక్కున్నారు, దానికి ఆ పేరెలా వచ్చింది, అన్న వాటి మీద ఓ ఆసక్తికరమైన కథ ప్లనీ (Pliney, క్రీ.శ. 23-79) రచనలో ఉంది: మేగ్నస్ అనే గొర్రెలకాపరి ఓ రోజు గొర్రెలని కాచుకుంటూ ఐడా పర్వతం (Mount Ida) పైకి వెళ్ళాడు; హఠాత్తుగా అతని కర్రకీ, చెప్పులకీ ఉన్న ఇనుప మేకులు కొండ రాయికి అతుక్కుపోయాయి; ఆ రాయికి మేగ్నెట్ అన్న పేరొచ్చింది.
ఆకర్షణశక్తి గురించిన ఆలోచనలు
ప్రకృతిలో, రెండు వస్తువుల మధ్య ఏ ప్రమేయమూ లేకుండానే ఆకర్షణ శక్తి ఉండడం ఆదిమ కాలం నించీ మానవుడిని అబ్బురపరుస్తూ ఉండేది. ఈ ఆకర్షణ శక్తి ఎలా వచ్చిందనే దాని గురించి తత్త్వవేత్తల నుండి వృక్షశాస్త్రవేత్తల వరకూ రకరకాల ప్రతిపాదనలు చేశారు. పాశ్చాత్య తాత్త్వికతకు ఆద్యుడైన థేల్స్ (క్రీ.పూ. 626-548), ప్రకృతి ఓ క్రమాన నడుస్తుందనీ, దాని నియమాలు మానవుడు వివేచనతో కనుగొనవచ్చుననీ, అలౌకిక కారణాలు అనవసరమనీ భావించాడు. ప్రాణం ఉన్న జీవాలకే చలనం ఉండటాన, సూదంటురాయి ఆకర్షణశక్తికి కారణం సూదంటురాయిలో జీవం (soul) ఉందనీ, అందుకే అది ఇనుముని ఆకర్షిస్తుందనీ భావించాడు.
సూదంటురాయికి అంటుకున్న ఇనుముకి కూడా ఆకర్షణ శక్తి కలుగుతుందని (principle of induction) గ్రీకులకి తెలుసు. దీని గురించి ప్లేటో (క్రీ.పూ. 428-348) రచనలో సోక్రటీస్ (క్రీ.పూ. 470-399) కవుల ప్రతిభ మీద అయాన్ అన్న కావ్యగాయకుడితో చేసిన సంభాషణ: “హోమర్ కావ్యం ఉద్భవించింది వాగ్దేవి (Muse) అనుగ్రహం వలన; ఆ అనుగ్రహ ప్రభావంతో కవిత్వం చెప్పాడు కాని, సొంతంగా కష్టపడి సంపాదించిన ప్రజ్ఞ వలన కాదు. హోమర్ ద్వారా సంక్రమించిన ప్రభావంతో నువు గానం చేశావే కాని నీ సొంత ప్రతిభ వలన కాదు. నీ ద్వారా సంక్రమించిన ప్రభావంతో ప్రేక్షకులు ముగ్ధులయారు. ఇదంతా సూదంటురాయి ఆకర్షణ లాంటిది; ఆకర్షించిన మొదటి పోగు హోమర్ అయితే, రెండో పోగు నీవు, మూడోది ప్రేక్షకుడు. అలా ఈ పోగులన్నీ కలిసి ఓ గొలుసుగా ఏర్పడటానికి కారణం సూదంటు రాయి ఆకర్షణే. అలాగే హోమర్ కవిత్వాని కీ, నీ పాటకీ, ప్రేక్షల ఆనందాని కీ మూలం వాగ్దేవి మహిమే.”
ప్లేటో వద్ద శిక్షణ పొందిన అరిస్తాటిల్ (క్రీ.పూ. 384-322) ఏథెన్స్లో లైసియం అన్న విద్యాలయాన్ని స్థాపించాడు. అతని శిష్యుడు అలెక్సాండర్ అనేక దేశాలపై దండయాత్రలు సాగిస్తూ ఆయా దేశాలలో ఉన్న రకరకాల వస్తువులనీ, మొక్కలనీ, జంతువులనీ గురువుకి చేరవేసేవాడు. అవి అరిస్తాటిల్కి సర్వ శాస్త్రాల గురించీ విచారించడానికి ఉపయోగపడ్డాయి. అలెక్సాండర్ మరణంతో అతని సామ్రాజ్య పతనం మొదలైంది. ఏథెన్స్ ప్రజలు అలెక్సాండర్ వర్గానికి ఎదురు తిరగడంతో అరిస్తాటిల్కి ప్రాణాపాయం కలిగింది. తన విద్యాలయాన్నీ, యావదాస్తినీ థియోఫ్రాస్టస్ (క్రీ.పూ. 372-287) అన్న సహచరుడికి అప్పగించి, “తత్వశాస్త్రానికి మరొకసారి హాని జరగనివ్వను,” అని అరిస్తాటిల్ ఏథెన్స్ వదలి వెళ్ళాడు.
వృక్షశాస్త్రపు పితామహుడిగా పేరు పొందిన థియోఫ్రాస్టస్, ఇతర శాస్త్రాలలో కూడా పరిశోధన చేశాడు. పలు ప్రాంతాల రాళ్ళని వర్గీకరిస్తూ “On Stones” అన్న గ్రంథం రాశాడు. గడ్డి పరకలనే కాక, కంచు, ఇత్తడి రేకులని కూడా పసుపురంగురాయి ఆకర్షిస్తుందన్నాడు. వేడికో, చలికో రాళ్ళు ఘనీభవిస్తాయనీ, వాటిలో కూడుకున్న పదార్థాలని బట్టి రకరకాల గుణాలు సంప్రాప్తిస్తాయనీ, కొన్ని వేడికి కరుగుతాయనీ, కొన్ని కరగవనీ, కొన్ని నీళ్ళలో పడితే నీటి రంగు మారుస్తాయనీ, ఆకర్షణశక్తి కూడా అలా వచ్చిన గుణమనీ అన్నాడు. థేల్స్ ఆకర్షణ శక్తి జీవం నుండి వచ్చిందని ప్రతిపాదిస్తే, థియోఫ్రాస్టస్ ఆకర్షణ శక్తి లాంటి వస్తు స్వభావం ఆ వస్తువులోని పదార్థాల మీద ఆధారపడి ఉంటుందని ప్రతిపాదించాడు. థియోఫ్రాస్టస్ది శాస్త్రీయంగా చేసిన మొదటి పరిశోధన అనొచ్చు.
లుక్రీషియస్ (క్రీ.పూ. 99-55), “పదార్థాల స్వభావం (On the Nature of Things),” అన్న మహాకావ్యం లో కూడా సూదంటురాయి ఇనుప రజనుని ఆకర్షించి దానిని గొలుసులా చేస్తుందంటాడు:
“Now to other things!
And I’ll begin to treat by what decree
Of Nature it came to pass that iron can be
By that stone drawn which Greeks the magnet call
After the country’s name (its origin
Being in country of Magnesian folk).
This stone men marvel at; and sure it oft
Maketh a chain of rings, depending, lo,
From off itself! Nay, thou mayest see at times
Five or yet more in order dangling down
And swaying in the delicate winds, whilst one
Depends from other, cleaving to under-side,
And ilk one feels the stone’s own power and bonds-
So over-masteringly its power flows down.”
ఓ గిన్నెలో ఇనుప నలుసులను పోసి, గిన్నె క్రింద సూదంటురాయిని కదిల్చితే, నలుసులు కదలడాన్ని కూడా వర్ణించాడు. సూదంటురాయి ఆకర్షణకి వస్తువులు అడ్డం రావని వర్ణించిన రచన ఇదే మొదటిది కావొచ్చు:
“It happens, too, at times that nature of iron
Shrinks from this stone away, accustomed
By turns to flee and follow. Yea, I’ve seen
Those Samothracian iron rings leap up,
And iron filings in the brazen bowls
Seethe furiously, when underneath was set
The magnet stone. So strongly iron seems
To crave to flee that rock.”
క్రైస్తవ తత్వవేత్తలలో ముఖ్యుడైన సెయింట్ అగస్టీన్ (354-430), తన “దేవుని నగరం (City of God)” గ్రంథంలో ఇండియా నుండి వచ్చే సూదంటురాళ్ళు తనకు దిగ్భ్రమ కలిగించాయన్నాడు. వెండి గిన్నెలో ఇనుప నలుసులు ఉంచి గిన్నె క్రింద సూదంటురాయిని కదిపితే, ఇనుప నలుసులు కూడా కదిలాయని అబ్బురపడ్డాడు. బరువైన ఇనుముని లాగగలిగిన రాయి, అతి తేలికైన గడ్డిపరకని ఎందుకు లాగలేదు, అని సూదంటురాయికీ పసుపురంగురాయికీ ఉన్న భేదాన్ని చరిత్రలో మొదటిసారిగా ప్రశ్నించాడు.
ప్రకృతిలోని ఈ సహజ ఘటనలకే కారణాలు తెలియనప్పుడు, దేవుని మహిమలని శంకించే సంశయాత్ముల వాదనలు అర్థరహితమని వాదించాడు. వజ్రాన్ని సూదంటురాయి దగ్గర పెడితే, అది ఆకర్షణని కోల్పోతుందని, తను “చదివానని” రాశాడు. ఆ అపోహ మరికొన్ని వందల సంవత్సరాల పాటు కొనసాగింది. సూదంటురాయి చుట్టూ అనేక మూఢ నమ్మకాలు చోటు చేసుకున్నాయి: ఉదాహరణకి వెల్లుల్లితో రుద్దితే దాని ఆకర్షణ శక్తి పోతుందనీ, విడిపోయిన భార్యాభర్తలను సూదంటూరాయితో దగ్గరకు తేవచ్చనీ, ఇలా అనేకం.
చైనీయుల దిక్సూచి
పురిలేని దారానికి కడ్డీ లాంటి సూదంటురాయిని వేలాడదీస్తే, ఆ కడ్డీ ఉత్తర-దక్షిణ దిశల వైపు తిరుగుతుందని ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా తెలుసు. సూదంటురాయి ఆకర్షణ శక్తి గురించి మానవునికి రెండువేల ఏళ్ళకు పూర్వమే తెలిసినా, దాని దిశాత్మక గుణం (directional property) గురించి బహుశా క్రీస్తు శకం ఆరో శతాబ్దం దాకా తెలియలేదు. “సూదంటురాయిని దారానికి వేలాడతీయాలనే ఆలోచన ఎందుకు రావాలి? దానికీ, ఉత్తర దక్షిణ దిశలకీ సంబంధముంటుందని ఎవరు ఊహించగలరు?” అంటూ జె.డి. బెర్నాల్ అన్న బ్రిటీష్ శాస్త్రవేత్త, సూదంటురాయి దిశాత్మక గుణాన్ని తెలుసుకోవడం భౌతికశాస్త్ర చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సంఘటన అన్నాడు.
దిక్సూచిని మొట్ట మొదట చైనీయులు కనిపెట్టారు; ఎలా కనుగొన్నారన్న కథ చాలా అబ్బురపరుస్తుంది. చైనీయులకి శవాలని పూడ్చిపెట్టే స్థలం చాలా పవిత్రమైనది; మనిషి బతికి ఉన్న చోట కంటె శవంగా పడి ఉన్న చోటే ఎక్కువ కాలం గడుపుతాడు కనుక, ఇంటి కన్నా ఖననం చేసే స్థలం ముఖ్యం. ఆ స్థలం కనుక్కోడానికి ఓ పలక మీద గరిటెని గిరగిరా తిప్పితే, గరిటె ఆగినప్పుడు దాని కాడ ఎటు వైపు చూపితే ఆ దిక్కు పవిత్రమైనదని భావించేవారు. గరిటె తయారు చేయడానికి రకరకాల లోహాలని వాడేవారు; సూదంటురాయితో చేసిన గరిట మాత్రమే ఎప్పుడూ ఒకరకమైన దిశలను చూపడంతో అది ఎక్కువ వాడుకలోకి వచ్చింది. ఇదే దిక్సూచి తయారీకి దారితీసింది. (చైనీస్ రెస్టారెంట్ లో ఇప్పటికీ సూప్ వడ్డించినప్పుడు ఇలాంటి స్పూనే ఇస్తారు.)
దిక్సూచితో సముద్రయానం వేగవంతమయింది. దిక్సూచికి ముందర సముద్ర ప్రయాణం పక్షుల సాయంతో చేసేవారు. నౌక నుండి, పావురాలని వదిలితే అవి తీర ప్రాంతానికి ఎగిరేవి; వాటి త్రోవనే నౌక సాగేది. దీనికి సాక్ష్యంగా మొహెంజదారో కాలపు (క్రీ.పూ. 2500-1750) అవశేషాలలో దొరికిన రాతి ముద్రలో (seal) పడవనీ, పక్షులనీ చూడొచ్చు.
పడవ, పక్షులు ఉన్న మొహెంజదారో కాలపు రాతి ముద్ర
వైకింగులు (Vikings) ఇలాగే కాకుల ద్వారానే క్రీ.శ. 900 ప్రాంతంలో ఐస్లాండ్ని కనుగొన్నారు; అంటే అప్పటికి దిక్సూచి యూరప్ లో వాడలేదు. 1200 నాటికి దిక్సూచి వాడుక పెరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయి కానీ, దిక్సూచిని యూరోపియన్లు స్వతంత్రంగా కనుగొన్నారా లేక చైనా నుండి అరబ్బుల ద్వారా యూరప్ చేరిందా అన్నది తేలలేదు.
రోజర్ బేకన్
పదమోడో శతాబ్దంలో క్రైస్తవ మతంలో రెండు క్రొత్త వర్గాలు ఏర్పడ్డాయి. ఒకటి సెయింట్ ఫ్రాన్సిస్ స్థాపించినది; ఈ వర్గీయులని ఫ్రాన్సిస్కన్స్ అంటారు; పేదరికాన్ని ఆశ్రయించి, ప్రజలకి దగ్గరయి, నిరాడంబరంగా క్రీస్తులాగా బ్రతకడం వీరికి ముఖ్యం (శాన్ ఫ్రాన్సిస్కో నగరం పేరూ, ఈ మధ్యనే చనిపోయిన పోప్ పేరూ, ఈ సెయింట్ ఫ్రాన్సిస్ నుంచే). రెండోది సెయింట్ డొమినిక్ స్థాపించినది; ఈ వర్గీయులని డొమినికన్స్ అంటారు; బోధన, పాండిత్యం, దైవ చింతన వీరికి ముఖ్యం. మొదటి వర్గంలో రోజర్ బేకన్, రెండో వర్గంలో సెయింట్ థామస్ ఎక్వినాస్ ప్రముఖులు.
రోజర్ బేకన్ (1214-1294) ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని, 1256 లో ఫ్రాన్సిస్కన్స్ వర్గంలో చేరి సన్యాసి అయ్యాడు. స్వభావరీత్యా దురుసువాడైన బేకన్, తన విశ్వాసాలను నిర్భయంగా ప్రకటించి, ధనార్జన చేసే పూజారులను ఖండించి, తోటి క్రైస్తవుల ఆగ్రహానికి గురయ్యాడు. జీవితంలో చాలా కష్టాల పాలయి, ఏకాంత కారాగార శిక్ష అనుభవించాడు.
HG Wells, “The Work, Wealth and Happiness of Mankind” లో, సంఘంలో నెలకొన్న భావాలకీ, జీవన విధానానికీ ఎదురుతిరిగి, మానవ పురోగతికి, మొదట ప్రాచీన గ్రీకులూ, మధ్యకాలంలో ప్రయోగాత్మక తాత్వికులూ, తర్వాత ఫ్రెంచ్ ఎన్సైక్లోపీడీయలిస్టులూ కృషి చేశారన్నాడు. మధ్యయుగపు ప్రయోగాత్మక తాత్వికులలో రోజర్ బేకన్ ముఖ్యుడు.
అధికారులకి అనుచితమైన గౌరవం ఇవ్వడం, పాత ఆచారాలని గుడ్డిగా పాటించడం, అనుభవశూన్యులని అనుకరించడం, తమ అజ్ఞానాన్ని మిడిమిడి జ్ఞానంతో కప్పిపుచ్చుకోడం, అజ్ఞానానికి కారణాలు అని, ప్రతిదానినీ స్వయంగా ప్రయోగం చేసి నిర్ధారించుకోవాలని బేకన్ చెప్పాడు. కాంతి మీదా, భూతద్దాలమీదా పరిశోధనలు చేశాడు. తుపాకి మందు తయారు చేసే పద్ధతిని వివరించాడు. భవిష్యత్తులో పశువులకు బదులు యంత్రాలు లాగే బళ్ళలో ప్రయాణిస్తామనీ, పక్షులవలె ఎగిరే వాహనాలలో విహరిస్తామనీ అన్నాడు.
బేకన్ పారిస్‌లో ఉన్నప్పుడు ఓ విశిష్ట వ్యక్తిని కలుసుకున్నాడు. అతడు ప్రయోగ తత్వాన్ని సరిగా అర్థం చేసుకున్న ఒకే ఒక్క మేధావి అనీ, పిడివాదనల జోలికి పోకుండా జ్ఞాన సముపార్జనలో లీనమయి, వైద్యం, రసవాదం, ఖగోళం, ఇలా అనేక శాస్త్రాలలో ప్రవీణుడయ్యాడనీ, యుద్ధ పరికరాలతో సహా అన్ని రకాల పనిముట్లనీ వాడటంలో ప్రజ్ఞావంతుడనీ, ధనాశ లేశమైనా లేనివాడనీ, ఇలా ఆకాశానికెత్తేశాడు.
యుద్ధరంగం నుండి ఓ చారిత్రాత్మక ఉత్తరం
బేకన్ అంతగా శ్లాఘించిన విశిష్ట వ్యక్తి ఎవరు? అతని పేరు పీటర్ ది మారికోర్ట్; అతని వ్యక్తిగత జీవితం గురించి మనకి తెలిసింది చాలా తక్కువ. ఫ్రాన్స్ లో పికార్డీ ప్రాంతంలో మారికోర్ట్ అన్న గ్రామానికి చెందిన వాడయి ఉండవచ్చు. తర్వాత “పీటర్ ది పెరెగ్రినస్” అన్న గౌరవ నామం వచ్చింది. క్రైస్తవ మతయుద్ధంలో (crusade) పాల్గొని Holy Land కి వెళ్ళి రావడాన pilgrim (పెరెగ్రినస్ ) అన్న గౌరవ నామధేయం వచ్చి ఉంటుంది.
1266 లో Charles of Anjou దక్షిణ ఇటలీ కి చెందిన ముస్లిం మతస్థులు నివసించే Lucera అనే పట్టణాన్ని ఆక్రమించాడు. పట్టణ ప్రజలు తిరుగుబాటు చేశారు; వాళ్ళని అణచడానికి ఛార్లెస్ సైన్యం పట్టణాన్ని ముట్టడించింది. రెండు మూడేళ్ళు సాగిన ముట్టడి మూలంగా ప్రజలు ఆకలితో అలమటించి చివరకి లొంగిపోయారు. ఛార్లెస్ సైన్యం లో పెరెగ్రినస్ ఓ ఇంజనీరో, సైనికుడో అయి ఉండాలి.
ఆగస్టు 12, 1269న పెరెగ్రినస్ యుద్ధరంగం నుండి అయస్కాంతం మీద సైంటిఫిక్ మోనోగ్రాఫ్ లాంటి ఉత్తరం ఒకటి తన స్నేహితుడికి రాసాడు. అప్పుడు (మధ్య యుగంలో) విశ్వం గురించిన భావనలివి: భూమి ఒక నిశ్చలమైన గోళం; దాని చుట్టూ పది పరలోకాలు (heavens), భూమిని కేంద్రంగా చేసుకుని తిరుగుతున్నాయి; చిట్ట చివరి గోళంలో దేవుడు కూర్చొని అన్ని లోకాలనీ కాస్తూ ఉంటాడు; లోకాలన్నీ ఒకే ఇరుసుమీద తిరుగుతుంటాయి; ఆ ఇరుసు చివరి లోకాన్ని తాకే చోటు ధ్రువం (pole).
సూదంటురాయికి నిర్దిష్టమైన ధ్రువాలు ఉంటాయని పెరెగ్రినస్ కనిపెట్టాడు. అప్పటికే దిక్సూచి వాడుకలో ఉన్నా, అది ఉత్తర-దక్షిణ దిశల పరంగా సమరేఖలోకి వస్తుందని తెలుసు కాని, దిక్సూచికి ధ్రువాలున్నాయని తెలియదు. పెరెగ్రినస్ చేసిన ప్రయోగం: సూదంటురాయిని తీసుకొని, దానిని నునుపుగా చేసి, గుండ్రటి గోళాకారంలోకి తేవాలి; ఓ సూదిని గోళంపైన పెట్టి ఆ సూది పొడవునా గోళం మీద గీత గీయాలి; సూదిని మరోచోట పెట్టి, మరో గీత గీయాలి. ఇలా గీస్తూ పోతే ,ఆగీతలన్నీ గోళంపై రెండు చోట్ల కలుసుకుంటాయి – అవే ధ్రువాలు, ఆ గీతలే ధ్రువాంశ రేఖలు (meridians).
మిగిలిన చోట్ల కన్నా ధ్రువాల దగ్గర సూదిపై ఆకర్షణ ఎక్కువనీ, దానిని బట్టి రేఖలు గీయనవసరం లేకుండా ధ్రువాలని కనుక్కోవచ్చనీ, గోళంపై సూది ఎక్కడైతే నిటారుగా నిలబడుతుందో అదే ధ్రువమనీ, ఆ రెండు ధ్రువాలూ గోళం మీద ఎదురెదురుగా ఉంటాయనీ రాశాడు.
పెరెగ్రినస్ సూదంటురాయి సూదిని ఆకర్షించడమే కాక నిర్దిష్టమైన స్థానంలో ఉండేటట్లు ప్రభావం చేస్తుందన్నాడు. సూదిని ధ్రువం దగ్గర పెడితే అది నిటారుగా నిలబడుతుందనీ, మిగిలిన చోట్ల ఎక్కువ తక్కువలుగా వంగుతుందనీ చూపెట్టాడు. అలా మొదటిసారిగా సూదంటురాయి చుట్టూ ఓ అయస్కాంత క్షేత్రం (magnetic field) నెలకొని ఉందనే ఆధునిక భావన తొలి రూపాన్ని వెలిబుచ్చాడు.
ధ్రువాలు కనుగొన్న తర్వాత, ఏది ఉత్తర ధ్రువమో, ఏది దక్షిణ ధ్రువమో ఎలా గుర్తించాలో కూడా ఆ ఉత్తరంలో రాశాడు: ఓ చిన్న బుట్టలో రెండు ధ్రువాలూ అంచుకి సమాన దూరంలో ఉండేటట్లు సూదంటురాయిని పెట్టి, ఆ బుట్టని నీళ్ళున్న పెద్ద గిన్నెలో తేలేటట్లు ఉంచితే, బుట్టలోని రాయి ఆకాశంలో ఉత్తర ధ్రువం వైపు తిరుగుతుంది. దానిని మరో స్థానంలోకి కదిపితే, అది మరలా తిరిగి “దైవేచ్ఛ మూలాన” ఉత్తర ధ్రువం వైపు వస్తుంది. ఆకాశంలో ధ్రువాలు తెలిస్తే సూదంటురాయి ధ్రువాలు కూడా తెలిసినట్లే.
రాయిలో ఉత్తర దక్షిణ ధ్రువాలు తెలుసుకున్న తర్వాత, ఒకదాని ప్రభావం వేరే దానిపై ఎలా ఉంటుందో కనుగొన్నాడు: ఇంతకుముందు లాగే ఓ రాయిని బుట్టలో తేలేటట్లు ఉంచి, మరో రాయిని చేతిలో ఉంచుకొని, చేతిలో ఉన్నదాని ఉత్తర ధ్రువాన్ని బుట్టలో ఉన్నదాని దక్షిణ ధ్రువం వైపు చూపెడితే బుట్టలోని రాయి చేతిలోని రాయివైపు వస్తుంది.
దిక్సూచిని ఎలా తయారుచెయ్యవచ్చో కూడా ఆ ఉత్తరంలో విపులంగా రాశాడు. ముందు గిన్నెలోని నీళ్ళలో తేలే దిక్సూచి గురించి రాసి, దానితో సంతృప్తి పడక, అంతకన్నా నాణ్యమైనదానిని తయారుచేశాడు: నీటి గిన్నె లేకుండా, ఓ సన్నటి చీలని (pivot) నిలబెట్టి దానిలో గుండా సూదంటురాయి తిరిగేటట్లు అమర్చి, దానిని ఓ గాజు పెట్టెలో పెట్టాడు. నావికులకి ఈ దిక్సూచి బాగా ఉపయోగపడింది.
పెరెగ్రినస్ అయస్కాంతపు శక్తితో శాశ్వత చలన యంత్రాన్ని కూడా చెయ్యవచ్చని భావించాడు: ఇనుప పళ్ళున్న ఒక వెండి చక్రానికి సూదంటురాయిని ఒకచోట అతికించితే, ఇనుప పన్ను సూదంటురాయి వైపుకు తిరుగుతుంది; అది వేగంగా జరిగి క్రిందికి పోగా, తర్వాతి పన్ను సూదంటురాయి వైపు వస్తుంది; అలా చక్రం శాశ్వతంగా తిరుగుతూ ఉంటుంది. (ఇటువంటి శాశ్వత చలన యంత్రం నిజానికి పనిచేయదు. దీనికి కారణం తాపగతి శాస్త్రంలోని మొదటి సిద్ధాంతం.) అయస్కాంత శక్తి ద్వారా శాశ్వత చలనాన్ని సాధించలేకపోయినా, కొన్ని వందల సంవత్సరాల తర్వాత అయస్కాంత శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే మార్గం మానవుడు కనిపెట్టాడు కాబట్టి పెరెగ్రినస్ భావనకి మనం కొంత విలువ ఇవ్వాలి.
మహాసముద్రయానం
స్పెయిన్ సామ్రాట్టుల సహకారంతో కొలంబస్ (1451-1506) నావిక దళం అట్లాంటిక్ సముద్రాన్ని దాటి, కొత్త ప్రపంచాన్ని “కనుగొన్నది”. పోర్చుగీస్ రాజు ఆదేశంపై వాస్కోడి గామా (1460-1524) నావిక దళం అట్లాంటిక్, హిందూ మహాసముద్రాలని దాటి ఇండియా చేరింది. మరో పోర్చుగీస్ దళం ఫెర్డినాండ్ మాజెల్లన్ (1480-1521) నాయకత్వాన అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలని దాటి భూమి చుట్టూ తిరిగి వచ్చింది. ప్రపంచం ఏకమయింది. ఈ మహా సామ్రాజ్య సాధనలో ఎప్పుడూ ఉత్తర దిక్కుని చూపే ఆ దిక్సూచి పాత్ర ఘనమైనదని ఒప్పుకోవాలి.
అయస్కాంతపు వంపు (Magnetic Dip)
పెరెగ్రినస్, అయస్కాంత గోళం మీద పెట్టిన సూది ఉత్తర దక్షిణ ధ్రువాలు చూపడమే కాక ఏటవాలుగా వంగుతుందని కనిపెట్టాడు. ఈ వంపుని సరిగా గుర్తించి పరిశోధించిన వాడు ఇంగ్లాండులోని బ్రిస్టల్ కి చెందిన రాబర్ట్ నార్మన్ (1550-1600). ఇతను దిక్సూచి చెయ్యడంలో మంచి నేర్పరి; నౌకాయానానికి సంబంధించిన ఇతర పరికరాలని తయారుచేస్తుండేవాడు; కవిత్వాభిమాని కూడాను.
ఎంత జాగ్రత్తగా చేసినా, సూదిని అయస్కాంతపరచి దానిని ఇరుసు (pivot) మీద పెడితే ఉత్తరపు మొన కొంచం వంగేది. దానిని సరిచెయ్యడానికి, నార్మన్ దక్షిణ మొన వైపు కాస్త మైనము రాసేవాడు. ఓ రోజు చాలా జాగ్రత్తగా దిక్సూచిని తయారు చేశాడు; అది కాస్త వంగింది. మైనం పెట్టడానికి ఇష్టపడక, ఉత్తరం వైపు సూదిని కాస్త కత్తిరించపోయి పొరబాటున ఎక్కువ కత్తిరించడంతో, చెడిపోయింది. విసుగెత్తి, అసలు ఎందుకు వంగుతుందో తెలుసుకోడానికి ఓ ప్రయోగం చేశాడు.
ఓ సూదిని తీసుకొని దానికి మధ్యలో ఓ బెండు బిరడాని (cork) తగిలించాడు; ఆ బిరడా, సూది, నీటి మట్టంకి కాస్త క్రింద ఉండేటట్లుగా బిరడాని కొంచం కొంచం కత్తిరిస్తూ పోయాడు. బిరడాతో ఉన్న ఆ సూదిని తీసుకొని సూదంటురాయితో రుద్ది అయస్కాంతపరచి మరలా నీటిలో వదిలాడు. ఆ సూది నీటిలో వంగింది; కాని సూది నీటి అడుగుకి చేరలేదు; ఆకర్షణ ప్రభావమైతే అది గిన్నె అడుగుకి చేరాలి. సూదంటురాయి చుట్టూ ఓ క్షేత్రం ఉందనీ దాని మూలంగా అది వంగుతుందనీ నార్మన్ భావించాడు. మరో రెండు మూడు వందల సంవత్సరాలకి కాని శాస్త్రజ్ఞులు అయస్కాంత క్షేత్రమనే భావనని పూర్తిగా అర్థం చేసుకోలేదు. నార్మన్ వినమ్రంగా తనకన్నా బాగా చదువుకున్న వారే దీని మూలాల గురించి సరయిన వివరణ ఇవ్వగలరని అన్నాడు.
విలియం గిల్బర్ట్
విలియం గిల్బర్ట్ 1540 లో కోల్చెస్టర్ పట్టణంలో పుట్టాడు. అతనికి నలుగురు తమ్ముళ్ళు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బి.ఏ., యం.ఏ. డిగ్రీలు సంపాదించి 1569 లో యం.డి. పట్టా పొందాడు. మూడేళ్ళు ఖండాంతర సంచారం చేసి 1573 లో లండన్ తిరిగి వచ్చి, వైద్యుడిగా ప్రాక్టీస్ మొదలెట్టాడు. వృత్తిలో పేరు సంపాదించి, అనేక పదవులు చేపట్టి, చివరకి కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్కి ప్రెసిడెంటయ్యాడు. 1600 లో ఎలిజబెత్ రాణి వైద్యబృందంలో ఒకడిగా నియమితమయ్యాడు. రాణి 1603 మార్చిలో మరణించింది. గిల్బర్ట్ అదే ఏడాది నవంబరులో లండన్‌ని ఆవరించిన భయంకరమైన ప్లేగువ్యాధి మూలంగా చనిపోయాడు.
గిల్బర్ట్ అనేక రకాల గోళాలు, ఖనిజాలు, పరికరాలు సేకరించాడు; విరివిగా పుస్తకాలు కొన్నాడు. తమ్ముళ్ళ సంరక్షణ కోసం బ్రహ్మచారిగా ఉండిపొయ్యాడు. పరిశోధన కోసం ఎంత ఖర్చు చెయ్యడానికైనా వెనుకాడలేదు. తన అనంతరం తన సేకరించినవన్నీ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్కి చెందాలని వీలునామా రాసాడు; కాని 1666లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో అవన్నీ ఆహుతయ్యాయి. సూదంటురాయి పరిశోధనల మోహంలో పడి, పెళ్ళి చేసుకోకుండా, ఉన్న డబ్బు, సమయం వాటికే వెచ్చించాడు. స్నేహితులతో ఇంట్లో చర్చలు జరపడం, పరికరాలతో ప్రయోగాలు చెయ్యడం అతని హాబీ. (ఇలాంటి చర్చలే ప్రపంచ ప్రసిద్ధమైన రాయల్ సొసైటీ స్థాపనకు దారి తీశాయి.)
1600 సంవత్సరానికి సైన్సు పరంగా రెండు రకాల ప్రాముఖ్యత ఉంది, ఒకటి గర్హించ వలసిందీ, మరొకటి గర్వించ తగినదీ. గర్హించ వలసింది: క్రైస్తవ మతబోధనలకి వ్యతిరేకంగా, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడన్న కోపెర్నికస్ భావనలని ప్రచారం చేసినందుకు, బ్రూనో సజీవదహనానికి గురయ్యాడు. అదే సంవత్సరంలో గిల్బర్ట్ ఇరవై ఏళ్ళ పరిశోధనల ఫలంగా లాటిన్లో, “The Magnet” అన్న పుస్తకాన్ని ప్రచురించాడు; అయస్కాంతం గురించి అప్పటికే జరిగిన పరిశోధనలు, తను చేసిన ప్రయోగాలు, వాటి ఫలితాలు, ముందు చెయ్యవలసిన పరిశోధనలు – ఆ వివరాలన్నీ ఆ పుస్తకంలో పొందుపరచాడు. ఆ పుస్తకం ఈనాటి PhD థీసిస్ లాంటిది. గెలీలియో ఆ పుస్తకాన్ని కొత్త ప్రయోగ తత్వానికి నాంది అని పొగిడాడు. కోపెర్నికస్ సిద్ధాంతాలని గిల్బర్ట్ సమర్థించాడు. బహుశా రాణి గారి వైద్యుడు కావడాన అతనికి మతాధికారుల బారినుండి రక్షణ కలిగి ఉండొచ్చు.
రాణికి దిక్సూచి చూపుతున్న గిల్బర్ట్
భూగోళం ఓ పెద్ద ఆయస్కాంతం
గిల్బర్ట్ మొట్టమొదటిగా తన పరిశోధనలో పరలోకానివీ, సూదంటురాయివీ, భూమివీ, ఈ మూడింటి ధ్రువాలను పోల్చి, సూదంటురాయి భూమి ధ్రువాలకు ఆకర్షితమవుతుందిగాని పరలోక ధ్రువాలకి కాదు అని తేల్చి చెప్పాడు. అది నిరూపించడానికి సూదంటురాయితో ఓ బుల్లి భూగోళాన్ని (terrella) తయారుచేశాడు. ఆ గోళం మీద వేర్వేరు చోట్ల సూదిని పెట్టి అది ఏదిశగా తిరిగినదీ నమోదు చేశాడు. ఈ ప్రయోగాలన్నీ పెరెగ్రినస్ చేసిన వాటిలాగే ఉన్నాయి. కాని పెరెగ్రినస్ గోళం పరలోకానికి నమూనా అయితే గిల్బర్ట్ది భూమికి నమూనా.
భూమి చుట్టూ ఓ వలయంలా దాని ఆకర్షణ శక్తి పరచుకొని ఉంటుందనీ, ఆ వలయంలో ఉన్న అయస్కాంతాల మీద పడే ప్రభావం పెరెగ్రినస్, నార్మన్ చేసిన ప్రయోగాల ఫలితాలకి కారణమనీ చూపెట్టాడు.
భూమి చుట్టూ పరచుకున్న ఆకర్షణ వలయం
విద్యుత్ శాస్త్రపు పుట్టుక
గిల్బర్ట్ తన పుస్తకంలో విషయాంతరంగా (side topic) ఓ అధ్యాయంలో పసుపురంగురాయి ఆకర్షణ గురించి రాశాడు. సూదంటురాయి ఆకర్షణకీ, పసుపురంగురాయి ఆకర్షణకీ తేడా ఏమిటి? ఒకటి ఇనుముని ఆకర్షిస్తుంది, రెండోది గడ్డిపరకని ఆకర్షిస్తుంది; ఒకటి దిక్కుని సూచిస్తే, రెండోది సూచించదు. గిల్బర్ట్ క్రమమైన పరిశోధనలు చేసి, అంతకుముందు ఆ విషయం మీద ప్రవచించిన వాళ్ళని దుయ్యబట్టాడు. వాళ్ళు అనుకున్నట్లు రాపిడితో కలిగే ఆకర్షణ పసుపురంగురాయికి మాత్రమే పరిమితం కాదనీ, అనేక ఇతర పదార్థాలలోనూ ఉంటుందనీ , ఓ పెద్ద జాబితా ఇచ్చాడు – వజ్రం, నీలం, సూర్య కాంతం, కృష్ణ పటలం, స్ఫటికం, నీలమణి, శిలాస్ఫటికం, అంజనం, గాజు, గంధకం, సిందూరం, అభ్రకం, మైనం, ఉన్ని, … ఇలా ఎన్నో. గంధకానికున్న గుణమే నీలమణి కున్నదంటే ఆశ్చర్యమేసింది. పసుపురంగురాయిలో అనాదిగా ఇరుక్కుపోయిన కీటకాల మూలంగా ఏదో శక్తి దాగి ఉందన్న భావనలన్నీ తలక్రిందులయ్యాయి. ఆ శక్తికి మూలమేమిటో తెలియదు కాని అది అనేక పదార్థాలలో ఉన్నదన్నది రుజువయింది.
పసుపురంగురాయి (amber) కి గ్రీకు భాషలో ఎలెక్ట్రాన్ అని పేరు. రుద్దితే ఆకర్షించే గుణమున్న వాటికి ‘ఎలెక్ట్రిక్స్’ (electrics) అనీ, లేని వాటికి ‘అన్ ఎలెక్ట్రిక్స్’ (anelectrics) అనీ పేర్లు పెట్టాడు. ‘అన్ ఎలెక్ట్రిక్స్’ కి కూడా పెద్ద లిస్టు ఇచ్చాడు: వెండి, బంగారం, రాగి, ఇనుము, చెక్క, ముత్యం, … ఇలా చాలా.
గిల్బర్ట్ తయారు చేసిన ఎలెక్ట్రోస్కోప్
ఇతరులని అదే ప్రయోగాలు చేసి తన ఫలితాలతో పోల్చి సరిచూడమన్నాడు. అందుకుగాను ఓ సాధారణ పరికరం తయారుచేశాడు. దానికి వెర్సోరియం (versorium) అని పేరు పెట్టాడు; ఆధునిక పరిభాషలో అది ఎలెక్ట్రోస్కోప్ – ఓ కొనపై వేలాడే తేలికైన లోహపు కడ్డీ; దిక్సూచిలో ఉన్న సూదిలాంటిదే. రుద్దిన ఎలెక్ట్రిక్ని కడ్డీ దగ్గరకు తెస్తే, కడ్డీ దానివైపు తిరుగుతుంది. ఎలెక్ట్రికల్ సైన్సులో ఇదే మొట్టమొదటి పరికరం.
మతం నుండీ, తత్వశాస్త్రం నుండీ విడిపోయి వికసించిన శాస్త్రీయ విజ్ఞానం
పైన పేర్కొన్న పుస్తకంలో, HG Wells రోజర్ బేకన్ తో పాటు డిడెరట్ అన్న తత్వవేత్తని శ్లాఘించాడు. ఫ్రాన్స్‌కి చెందిన డెనిస్ డిడెరట్ (1713-1784) క్రైస్తవ పూజారిగా శిక్షణ పొంది, అది నచ్చక, రచయితగా జీవితం మొదలెట్టి, 1748 లో ఓ అశ్లీలమైన నవల రాసి, దాని మూలంగానూ, ఇతర రచనల మూలంగానూ, జైలు పాలయ్యాడు. మూడు నెలల తరువాత అధికారులు, “మళ్ళీ ఇలాంటి వెధవ రాతలు రాస్తే, నెలలు కాదు, ఏళ్ళ తరబడి, జైలు పాలవుతావు,” అని హెచ్చరించి విడిచిపెట్టారు. బుద్ధి వచ్చిందని చెప్పి, ఎన్సైక్లోపేడియా సంపాదకుడిగా అనేక సంవత్సరాలు పనిచేసి, పేరు తెచ్చుకున్నాడు. ఎన్సైక్లోపేడియా ఫ్రెంచ్ విప్లవానికి దారి తీసిందంటారు.
డెనిస్ డిడెరట్ రాసిన నవలలో, “బహుశా అతిముఖ్యమైనదీ, ఎవరూ చదవనిదీ,” అన్న చివరి అధ్యాయానికి ముందున్న అధ్యాయం, చిత్రమైన క్లైమాక్స్‌తో ఉంటుంది. కథానాయకుడు తనకొచ్చిన పీడకలని ఇలా వివరిస్తాడు:
“రెక్కల గుర్రానెక్కి, ఆకాశంలోకి ఎగురుతూ వెళ్ళి, వేలాడుతున్న ఓ పెద్ద భవనం ముందు వాలాను. అక్కడ గుడ్డ పేలికలని మించని బట్టలేసుకొని అర్ధ దిగంబరులైన వికారమైన మనుషులు ఓ ముసలాయన చుట్టూ మూగి ఉన్నారు. ఆయన ఏమీ మాట్లాడకుండా గిన్నెలోని ద్రావకాన్ని పీల్చి గాలిలో బుడగలు ఊదుతూ ఉన్నాడు; ఇతరులు ఆ బుడగలని ఇంకా పైకి ఊదుతున్నారు.
ఇంతలో దూరాన్నుంచి చిన్న తల, బక్క దేహం, కాడల్లాంటి చేతులు, పొట్టి కాళ్ళు ఉన్న ఓ పిల్లవాడు మా వైపు రాసాగాడు. మా దగ్గరకొచ్చేకొలదీ అతని శరీరం త్వరత్వరగా పెరగసాగింది. అలా పెరిగే క్రమంలో నేను అతని అనేక రూపాలని చూశాను: టెలెస్కోప్ని ఆకాశం వైపు తిప్పడం, పైనుండి క్రిందకి పడే రాయి వేగాన్ని లోలకంతో లెక్కకట్టడం, పాదరసం ఉన్న గొట్టంతో పీడన కొలవడం, చేతిలోని పట్టకంతో కాంతిని ఛేదించడం. అతని రూపం బ్రహ్మాండమైంది: తల ఆకాశాన్ని అంటింది; కాళ్ళు పాతాళం లోతులని చూశాయి; చేతులు రెండు దిశలనీ తాకాయి. అతని చేతిలోని దీపం ఆకాశం అంతటా, అగాధాలలో, నేల నలు మూలలా, వెలుగు ప్రసరించింది.
ఎవరీ మహాకాయుడని అడిగాను. ప్లేటో ప్రత్యక్షమయి, ‘ప్రయోగం’ అని సమాధానమిచ్చి, ‘మనం వెంటనే పారిపోవాలి’ అంటే భయపడి నేనూ పరుగు తీశాను. మరుక్షణం ఆ రూపం భవనాన్ని ఒకే ఒక్క వ్రేటుతో కూలదోసింది. నేను కల నుండి మేల్కొన్నాను.”
ఎలెక్ట్రికల్ సైన్సు ప్రయోగాలతో ఎలా వృద్ధి చెందిందో వచ్చే వ్యాసాలలో వివరిస్తాను.
మూలాలు:
- Park Benjamin. A History of Electricity. (The Intellectual Rise in Electricity) From Antiquity to the Days Benjamin Franklin. John Wiley & Sons. 1898. నా వ్యాసానికి ఈ పుస్తకమే ఆధారం; Benjamin కి చాలా ఋణపడి ఉన్నాను.
- Rom Harre. Great Scientific Experiments: twenty experiments that changed our view of the world. Phaidon Press. 1981.
- J.D. Bernal. A History of Classical Physics: From Antiquity to the Quantum. Barnes & Noble. 1997. (Originally published as The Extension of Man in 1972.)
- The Letter of Petrus Peregrinus on the Magnet, A.D. 1269. Translated by Brother Arnold. McGraw Hill. 1904.
- William Gilbert. On the Loadstone and Magnetic Bodies, and on The Great Magnet of Earth. Translated by P. Fleury Mottelay. John Wiley & Sons. 1893.
- David Wootton. The Invention of Science: A New History of the Scientific Revolution. HarperCollins. 2015.
- Wikipedia and Wikimedia Commons