1.1 దృశ్యీకరణం
సంస్కృతంలో తయారైన పదబంధం దృశ్యీకరణం. ‘దర్శనం కారయతి ఇతి దృశ్యకారః ‘అంటే ‘అతడు చేసేది దృశ్యీకరణ’ అని. దృశ్యః, కరణం అన్న పదాల మధ్యలో ‘ఈ’ అనే ప్రత్యయం చేరి ‘దృశ్యీకరణం’ అయింది.
కన్నులకు ఎదురుగా జరుగుతున్నట్లు సన్నివేశాలను, భావోద్వేగాలను చిత్రీకరించడమే దృశ్యీకరణం. అంటే జరుగుతున్న సన్నివేశాలను కవి/రచయిత చెబుతున్నట్లు కాకుండా, రచన చదివే పాఠకుని ఎదురుగా జరుగుతున్నట్లు భావన కలిగించేలా వ్రాయడాన్ని ‘రచనలలోని దృశ్యీకరణం’ అనవచ్చును. అంటే సన్నివేశాలను, సన్నివేశాలలోని ఉద్వేగాలను పాఠకుని ఎదురుగా జరుగుతున్నట్లు వ్రాయడాన్ని రచనలో దృశ్యీకరణం అనవచ్చును.
ఆలంకారిక భూషితమైన వర్ణనాత్మక భాషనుపయోగించి పాఠకుని మనస్సులో దృశ్యపరంపరలను చిత్రించడమే కవిత్వంలో దృశ్యీకరణము. ‘ఆలంకారిక భూషితమైన వర్ణనాత్మక భాష’ అన్నది దృశ్యీకరణకు అవసరమైనదిగా కనిపించినా, దీనికి కొన్ని మినహాయింపులు కనిపిస్తాయి. పూర్వ కవులలో దృశ్యీకరణం గురించి చెప్పినప్పుడు, ఈ విషయాన్ని సోదాహరణంగా చూడవచ్చు.
సందర్భోచితమైన పదజాలంతో, చిన్నపాటి వివరణలను కూడా విడువకుండా, సముచితమైన అలంకారాలను ఉపయోగిస్తూ సన్నివేశాలను చిత్రించి, కవి చెప్పదలచుకున్న భావాన్ని కవిత్వీకరించినప్పుడు, పాఠకుని మనోనేత్రం ముందు సన్నివేశాలు వరుస దృశ్యాలుగా ఆవిష్కృతమౌతాయి. పాఠకుడు తనముందే సన్నివేశం జరుగుతోందన్న భావనకు లోనై, సన్నివేశంలోని భావోద్వేగాలను పరిపూర్ణంగా అనుభవిస్తాడు.
‘దృశ్యీకరణము’ పదబంధానికి సమానార్థంతో Visualization(విజువలైజేషన్) అన్న ఇంగ్లీషు పదాన్ని తీసుకోవచ్చు.
“I can’t do fiction unless I visualize what’s going on” అంటాడు అమెరికన్-కెనేడియన్ రచయిత William Gibson. “ఏమి జరుగుతుందో నా కళ్ళముందు కనిపించకపోతే, నేను ఎలాంటి సృజనాత్మక రచనను చెయ్యలేను” అన్న అర్థాన్ని ధ్వనింపజేస్తూ.
“Visualization and belief in a pattern of reality activates the creative power of realization.” – A. L. Linall, Jr.
సృజన రచనలలో ‘విజువలైజేషన్’ అన్న ఊహకు ఊతమిస్తూ, పందొమ్మిదవ శతాబ్దంలో పాశ్చాత్య సాహిత్యంలో వచ్చిన వాదము ‘Show, not tell’ (చూపించు, చెప్పకు). ఇది ఎక్కువగా నవలాశిల్పానికి సంబంధించిన చర్చలో తొలుత కనిపిస్తుంది. సుప్రసిద్ధ 19 వ శతాబ్ది ఫ్రెంచి నవలాకారుడు గుస్తావ్ ఫ్లాబె “an author in his book must be like God in the universe, present everywhere and visible nowhere.” అన్న మాటల వెనక కూడ రచయిత రచనను చూపించాలే తప్ప తను ప్రత్యక్షంగా చెప్పకూడదన్న స్ఫూర్తి ఉంది. కానీ ఒక వాదంగా దీన్ని తొలుత ప్రతిపాదించిన వారు రష్యన్ రచయిత ఆంటన్ ఛెకోవ్(Anton Chekhov) అంటారు.
ఆంటన్ ఛెకోవ్ చెప్పిన క్రింది విషయాన్ని చూడండి:
‘Don’t tell me the moon is shining. Show me the glint of light on broken glass’
రచనలో “చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అని చెప్పకండి. పగిలిన గాజు ముక్కలమీద ప్రకాశిస్తున్న వెన్నెలను చూపించండి” అంటున్నాడు ఛెకోవ్.
రాముడు నిద్రలేచాడు అని చెప్పడం కన్నా, కళ్ళు నులుముకుంటూ ప్రక్కనే ఉన్న గడియారం వేపు చూస్తూ ప్రక్కమీదనుంచి రాముడు లేచి కూర్చున్నాడు అని చూపించడం పాఠకుడి ఎదుట సన్నివేశాన్ని చూపిస్తుంది కదా!
“చూపించు, చెప్పకు” అన్న ఈ వాదం ముఖ్యంగా కాల్పనిక వచన ప్రక్రియలకు వర్తించేదిగా భావించబడినా, ఈ వాదాన్ని అన్ని సృజన ప్రక్రియలకూ అన్వయించవచ్చు. కాలక్రమేణా ఈ వాదం సాహిత్యం పరిధిని దాటి అధునాతన సాంకేతిక పనిముట్లను వాడుకుంటూ బోధనా పద్ధతుల్లోకి, కార్పోరేట్ రంగంలోకి, చలనచిత్రాలలోకి ప్రవేశించి ఆదరణ పొందుతోంది.
“చూపించు, చెప్పకు” అన్న వాదంపైన ఈ క్రింది రెండు అభిప్రాయాలు కూడా ఆలోచించదగినవి. Ernest Hemingway చెప్పినది ఎంతవరకు ఆచరింపదగినది అన్న అనుమానం వచ్చినా, ఆయన చెప్పినది పాటిస్తే సర్వోత్కృష్ట రచనను సృష్టించవచ్చును. అలాగే Logan P Smith చెప్పింది కూడా.
“Show the readers everything, tell them nothing.” – Ernest Hemingway
“What I like in a good author is not what he says, but what he whispers.” – Logan Pearsall Smith
పందొమ్మిదవ శతాబ్దానికి ముందే, అంటే ఆధునిక సాహిత్య యుగానికి పూర్వమే భారతీయ సాహిత్యంలోను, తెలుగు సాహిత్యంలోనూ ‘Show, not tell’ వాదాన్ని గమనించ వచ్చు.
మన కావ్యాలను శ్రవ్యకావ్యాలు, దృశ్యకావ్యాలుగా విభజించవచ్చు. శ్రవ్యకావ్యాలు విని/చదివి ఆనందించడానికి వ్రాయబడ్డవి. రంగస్థలమ్మీద ప్రదర్శించడానికి అనువుగా వుండేలా నిర్మించబడ్డవి దృశ్యకావ్యాలు. అంటే నాటకాలు.
ప్రాచీన సాహిత్యంలో తెలుగులో సింహభాగం శ్రవ్యకావ్యాలు. అయితే సంస్కృతంలో మాత్రం దృశ్యకావ్యాలు ఎక్కువ.
శ్రవ్యకావ్యాలను చదివి, అర్థం చేసుకుని, ఎవరికి వారు ఊహించుకుని, భావనలు చేసుకుని ఆనందించాలి. కానీ తెలుగు కవులు కావ్యంలో పాత్రల చేష్టల వర్ణన ద్వారా, పాత్రల సంభాషణల ద్వారా, శబ్దార్ధాలంకారాలతో పాత్రను రూపుకట్టించిన రీతిలోను, ఛందస్సు ద్వారాను శ్రవ్యకావ్యాలలోనే దృశ్యకావ్యస్ఫూర్తిని కలిగించారు. పాల్కురికి సోమనాథుడు, తిక్కన, ఎఱ్ఱన, నాచన సోమన, శ్రీనాథుడు, పోతన మొదలగు తెలుగు కవుల శ్రవ్యకావ్యాలలో మనం దృశ్యకావ్యపు ఛాయల్ని గుర్తించవచ్చు.
రామాయణం, మహాభారతం, భాగవతం మొదలైన కావ్యాలలో ప్రాచీన కవులు కథను చెప్పడం నుంచీ కథను కళ్ళ ముందు చూపించిన సందర్భాలనెన్నింటినో మనం గమనించవచ్చు. అంటే మన పూర్వ కవులు కొన్ని శతాబ్దాల నుంచీ ‘కళ్ళ ఎదురుగా సన్నివేశం జరుగుతున్నట్లు చిత్రించే’ పని చేస్తూ వచ్చారు.
పోతన భాగవతాన్ని పరిశీలిస్తే, చాలా సందర్భాలలో అత్యంత ప్రతిభావంతంగా ప్రదర్శించిన దృశ్యీకరణ రచనాపద్ధతిని గమనించవచ్చు.
1.2 పోతన కవితా లక్షణాలు
మహాభాగవతం రచనతో ప్రసిద్ధుడైన పోతన రచించిన ఇతర కృతులు నారాయణశతకం, వీరభద్రవిజయం, భోగినీదండకం. శృంగారరచనగా గుర్తించబడ్డ భోగినీదండకం వ్రాసినప్పటికీ, పోతనను భక్త కవిగానే సాహితీప్రపంచం గుర్తించింది.
పోతన కవిత్వంలో, ప్రధానంగా భాగవతంలో కనిపించేవి – భక్తి భావం, శ్రవణ సుభగత్వం కోసం సమర్థవంతంగా శబ్దాలంకారాల ప్రయోగం, సందర్భానికి తగిన ఛందస్సును ఎన్నుకునే నేర్పు, తెలుగు, సంస్కృత పదాలను సమతూకంలో వాడడం.
శ్రీరాముని అనుజ్ఞతో తాను భాగవతాన్ని తెలుగు చేస్తున్నట్లు పోతన చెప్పాడు. కవులు చాలావరకు రాజుల కోరిక మేరకు కావ్యాలు రచిస్తున్న కాలంలో భగవంతుడైన శ్రీరాముని ఆనతి మేరకు భాగవతాన్ని వ్రాస్తున్నానని చెప్పడంతోనే భాగవతమంతా పరచుకున్న పోతన భక్తి భావన ప్రస్ఫుటమౌతోంది.
క.
పలికెడిది భాగవతమట
పలికించెడివాడు రామభద్రుండట నే
పలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాథ పలుకగనేలా!
(పోతన భాగవతము, ప్రథమ స్కంధం, 18)
భాగవతాన్ని చదివిన పాఠకులకు కూడా ముక్తి దొరుకుతుందని ఈ క్రింది పద్యంలో పోతన చెప్పాడు.
క.
నిగమములు వేయి జదివిన
సుగమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్
సుగమంబు భాగవతమను
నిగమంబు బఠింప ముక్తినివసనము బుధా
(పోతన భాగవతము, ప్రథమ స్కంధం, 140)
భాగవతంలోనే ‘ఒనరన్ నన్నయతిక్కనాదులు…’ పద్యంలో, వ్యాసభాగవతాన్ని తెనిగించడం తన పూర్వ జన్మ సుకృతమని, భాగవతాన్ని రచించి మోక్షం పొందుతానని చెప్పారు పోతన.
భామహుడు కావ్యాన్ని ‘శబ్దార్థౌ సహితౌ కావ్యమ్’ అని నిర్వచించారు. అంటే శబ్దార్థములుతో కూడినది కావ్యము అని. ఈ నిర్వచనాన్ని ఇంకో రకంగా చూస్తే ‘శబ్దార్థములు పరస్పరోపకారకములై వర్థిల్లుట’ అని. ఈ సిద్ధాంతాన్ని పోతనతో సహా మన పూర్వ కవులెందరో అనుసరించారు.
శబ్దార్థాలు కావ్యానికి శరీరం, ఆత్మగా భాసిల్లుతాయి. శబ్దాలంకారాలు కావ్య శరీరానికి, అర్థాలంకారాలు కావ్య భావానికి సొగసులద్ది శోభ చేకూర్చుతాయి. పోతన భాగవతం కావ్యమంతటా శబ్దాలంకారాల ప్రయోగం, అర్థాలంకారాల నియోగం మనం గమనించవచ్చు. అలాగే శబ్దార్థాల సమన్వయానికి ఛందస్సుతోడ్పాటు చాలా అవసరం. ఏ భావం చెప్పడానికి ఏ ఛందస్సు సరైనదో ఆ ఛందస్సునే వాడడం ఉత్తమశ్రేణి కవుల లక్షణాలలో ఒకటి. పోతన ఉత్తమశ్రేణికి చెందిన కవులలో ఒకరు!
క.
కొందఱికి దెనుగు గుణమగు
గొందఱికిని సంస్కృతంబు గుణమగు రెండున్
గొందఱికి గుణములగు నే
నందఱ మెప్పింతు గృతుల నయ్యయ్యెడలన్
(పోతన భాగవతము, ప్రథమ స్కంధం, 20)
పోతన భాగవతంలో ఉపయోగించిన భాషగురించి చెప్పిన పద్యం ఇది. ఇందులో తెలుగు భాషను ఇష్టపడే వారు కొందరు, సంస్కృతభాషను ఇష్టపడేవారు మరి కొందరు, ఈ రెండు భాషలను ఇష్టపడే వారు ఇంకొందరు వుంటారు. సందర్భానికి తగినట్లు రెండు భాషలను ఉపయోగించి, అందరినీ మెప్పించే విధంగా కావ్యరచన చేస్తానని పోతన చెప్పారు.
ఏ భావాన్ని చెప్పడానికి ఎలాంటి శబ్దాలను వాడుతున్నారు అన్నది కవి ప్రతిభను అంచనావేయడానికి పనికొస్తుంది.
శబ్ద మాధుర్యం, సంస్కృత తెలుగు పదాల మేలి మేళవింపు, సందర్భానికి తగిన పద్యం నడక, పరిసరాలనుగాని, భావాలను గానీ వర్ణించేటప్పుడు మనకు కళ్ళకు కట్టినట్టు చూపడం – పోతన భాగవతపద్యాలలో ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాలు. పోతన కవిత్వంలో ఈ శిల్పపరమైన లక్షణాలకు తోడుగా భక్తి భావనలు కావ్యానికి అంతర్వాహినిగా ఉంటాయి.
1.3 పూర్వ కవుల దృశ్యీకరణ
ఈ అధ్యాయం ఆరంభంలో దృశ్యీకరణం గురించి చెప్పినప్పుడు, మన ప్రాచీన కవులు చాలామంది ‘చెప్పకు, చూపించు’ అన్న సూత్రాన్ని తమ రచనలలో చూపించినట్లు చెప్పుకున్నాం.
కాళిదాసు కావ్యాలను మొదలుకొని, పోతన సమకాలీనుడైన శ్రీనాథుని రచనల వరకు పరిశీలిస్తే ప్రాచీన కవులలో చాలా మంది కథ చెప్పడానికి ప్రాధాన్యతనిస్తూనే, సందర్భాన్నిబట్టి కథలలోని సన్నివేశాలను పఠితుల మనోనేత్రం ముందు ప్రదర్శించడానికి ప్రయత్నించారనిపిస్తుంది.
ఇప్పుడు కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం.
ఈ క్రింది పద్యం పాల్కురికి సోమనాథుని పండిత్యరాథ్యచరిత్ర లోనిది.
తొలికోడి కనువిచ్చి నిలిచి మై వెంచి
జలజల రెక్కలు సడలించి నీగి
గ్రక్కున కాలార్చి కంఠంబు విచ్చి
ముక్కున నీఁకెలు చక్కొల్పి కడుపు
నిక్కించి మెడ సాచి నిక్కి మిన్సూచి
కొక్కొరో కుఱ్ఱని కూయకుమున్న!
(పండితారాథ్యచరిత్ర)
తొలికోడి కళ్ళు విప్పింది. నిలుచుంది. శరీరాన్ని సాగదీసుకుంది. టపటపమంటూ రెక్కలాడించింది. ఒళ్ళు విరుచుకుంది. గబగబా కాళ్ళనాడించి కదిలించింది. గొంతును సవరించుకుంది. ఈకలను ముక్కుతో సరిదిద్దుకుంది. పొట్టను లోపలకు బిగబట్టింది. మెడను నిటారుగా సాగదీసి పైకి చాపింది. ఆకాశం వైపు చూస్తూ ‘కొక్కొరో కుఱ్ఱని’ కూసింది.
పై ద్విపదలో కూత వేయడానికి ఆయత్తమౌతున్న తొలికోడిని దృశ్యీకరించారు పాల్కురికి సోమన. ఏ చిన్నపాటి వివరణను విస్మరించకుండా అప్పుడే కళ్ళు విప్పి, అంచెలంచెలుగా కూతవేయడానికి నిలబడిన కోడిని పాఠకుని మనోనేత్రం ముందు నిలిపారీ కవి. పాల్కురికి కాలం నాటికి సినిమాలు లేవు, కెమెరాలు లేవు. కాని పాల్కురికి కోడికూత సన్నివేశాన్ని ముక్కలుగా విడగొట్టి…ఒక ముక్క తర్వాత మరో ముక్కను పద్యంలో చెప్పిన క్రమంలో పేర్చుకుంటూ పోతే – కూతకు సన్నద్ధమౌతున్న ఒక కోడి పాఠకుడి ముందు నిలుస్తుంది. సాధారణ భాషను వాడుతూ, ఏ అలంకారాన్ని ఆసరాగా తీసుకోకపోవడం గమనించదగ్గ విషయాలు.
డా. ముదిగొండ శివప్రసాద్ ‘కోడికూతను ఇంత సహజంగా తెలుగులోనేకాదు, మనమెరిగిన ఏ భాషాగ్రంథంలోనూ ఇంత వరకు మరెవరూ వర్ణించలేదనడం అతిశయోక్తి కాదు’ అన్నారు.
కాళిదాసు రఘువంశం కావ్యంలో ఇందుమతీ స్వయంవరం సన్నివేశంలోని ఈ క్రింది శ్లోకం చూద్దాం.
సంచారిణీ దీపశిఖేవ రాత్రౌ యం యం వ్యతీయాయ పతింవరా సా
నరేంద్రమార్గాట్ట ఇవ ప్రపేదే వివర్ణభావం స స భూమిపాలః – (రఘువంశః 6-67)
ఇందుమతి తనకి నచ్చిన వాణ్ణి ఎంచుకోవడానికి జరుగుతున్న స్వయంవరం. చాలా మంది రాజులు ఆమె అందచందాలకు మెచ్చి, ఆశతో వచ్చి కూర్చున్నారు. ఇందుమతి నడుస్తున్న దీపశిఖలా వారిని చూసుకుంటూ వెడుతోంది. ఆమె దగ్గరకు రాగానే, తననే వరించాలన్న ఆశ, వరించబోతోందన్న ఆనందంతో ఎదురుగా ఉన్న రాజు మొహం వెలిగిపోతోంది. ఆమె దాటి ముందుకు వెళ్ళగానే ఆ రాజు మొహంలో కాంతి తగ్గుతోంది – ఆశ, ఆనందం క్షీణించి!
చీకటిలో దీపాన్ని పట్టుకుని నడుస్తున్నప్పుడు, దగ్గరగా ఉన్న వస్తువుల మీద కాంతి పడడం, మనం ముందుకు సాగినప్పుడు ఇంతకు మునుపు కాంతితో ప్రకాశించిన వస్తువులు చీకట్లలోకి మాయమవడం మనకు తెలిసిందే!
ఇందుమతి సంచారిణీ దీపశిఖ అంటే ఇందుమతి తేజస్సుతో, అందంతో నడుస్తున్నది అని. ఆమె తేజస్సువల్ల, ఆమె అందాన్ని దగ్గరగా చూసిన ఆనందంవల్ల రాజుల ముఖాలు కాంతితో కళకళ లాడాయి. ఇందుమతి కాస్త దూరమవ్వగానే అంతకు మునుపు కాంతితో ప్రకాశించిన ముఖాలిప్పుడు వెలవెల పోయాయి – ఇందుమతి తేజస్సు దూరమవడం వల్ల, ఆమె తమను ఎన్నుకోలేదన్న నిరాశతోనూ!
ఈ శ్లోకం తర్వాత కాళిదాసు ‘దీపశిఖ కాళిదాసు’ అయ్యారు. ఉపమాలంకారం గురించి చెప్పేప్పుడు గుర్తుతెచ్చుకునే శ్లోకమైనా, ఇక్కడ కాళిదాసు ఇందుమతీ స్వయంవరంలో ఒక సన్నివేశాన్ని దృశ్యీకరించారు. ఈ శ్లోకం చదివినప్పుడు అందచందాలతో మెరిసిపోతూ నడుస్తున్న ఇందుమతి, ఆమెపై ఆశతో వరసగా కూర్చున్న రాజులు, రాజుల ముఖాలను వెలిగించిన ఇందుమతి తేజస్సు, ఆమె దాటిపోగానే కాంతి తగ్గిన రాజుల ముఖాలు కనిపిస్తాయి. కవిత్వంలో దృశ్యీకరణకు ఈ శ్లోకం ఒక గొప్ప ఉదాహరణ.
తిక్కన విరాటపర్వంలోని పద్యం:
సీ.
దైన్యంబు తలపోఁత తలకొన్నఁ జెలువకా
ననమున వెల్లదనంబు గదిరె
భయరసవేగంబు పైకొని ముట్టినఁ
గాంతకుఁ దనులత కంపమడరె
బెగ డంతకంతకు మిగిలిన నింతికిఁ
బదముల నడఁ దొట్రుపాటు బెరసెఁ
దల్లడం బొందినఁ దన్వికి నవయవం
బులనెల్ల ఘర్మాంబు కళిక లెసఁగెఁ
ఆ.
దలఁకు పుట్టెఁ గొంకు కొలఁదికి మీఱె వె
న్బాటు దోఁచె ముట్టుపాటు దొడరె
వెఱగుపాటు దనికె నెఱనాడె నొవ్వు నె
వ్వగలు వగల నీనె దిగులు వొదివె
(మహాభారతము, విరాటపర్వం 106)
తనకు కలిగిన దుఃఖానికి, దురవస్థకు ద్రౌపది ముఖం దైన్యంతో తెల్లబోయింది. భయంతో శరీరంలో వణకు పుట్టింది. ఆమె మనస్సులో వ్యాకులత క్షణక్షణానికి ఎక్కువై అడుగులు తడబడినాయి. కలత ఎక్కువై వంటినిండా చెమటలు పట్టాయి. భయం వేసింది. భయంవల్ల నిశ్చేష్టురాలైంది. బాధతో ద్రౌపది శోకమూర్తి అయింది.
మహాభారతంలోని తిక్కన విరాటపర్వంలోని పద్యమిది. ఈ పద్యంలో ద్రౌపది మానసికస్థితి వల్ల ఏర్పడ్డ శారీరకావస్థలను కళ్ళకు కట్టినట్టు చూపించారు తిక్కన. ఇది కదా దృశ్యాన్ని చిత్రీకరించడమంటే!
చం.
కనుఁగొని కోపవేగమునఁగన్నుల నిప్పులు రాల నంగముల్
గనలఁగ సాంద్రఘర్మసలిలంబులు గ్రమ్మి నితాంతదంతపీ
డనరటదాస్యరంగవికటభ్రుకుటీచటులప్రవృత్తన
ర్తనఘటనాప్రకారభయదస్ఫురణాపరిణద్ధమూర్తియై
(మహాభారతము, విరాటపర్వం 133)
కీచకుని చూసిన భీమునికి కోపంతో కళ్ళనుంచీ ఎర్రని నిప్పులు కురిసాయి. ఆవేశంతో అవయవాలు వేడెక్కడంతో, వళ్ళంతా చెమట పట్టింది. ఆవేశంతో వచ్చిన కోపంతో పళ్ళు కొరికినప్పుడు పటపట మనే శబ్దం వచ్చింది. ఎర్రని కళ్ళు, మొహమ్మీద చెమట బిందువులు, పళ్ళు కొరుకుతున్నప్పుడు కదిలే మొహమ్మీద కండరాలు…అన్నీ కలిపిచూస్తే భీముని ముఖరంగస్థలమ్మీద, కదులుతున్న కనుబొమలు నాట్యం చేస్తున్నట్లు అగుపించాయి. చదివే పాఠకుల కళ్ళ ముందు కోపంతో రగులుతున్న భీముని ముఖం కనిపిస్తుంది.
ఎఱ్ఱన రచించిన హరివంశంలోని ఈ పద్యాన్ని చూద్దాం.
శా.
స్మేరంబై తిలకింపనేర్చుచు, బొరిన్ మీజేతులన్ గన్నులిం
పారం దోముచు, చేవబూని పిఱుదొయ్యన్ మీది కల్లార్చుచున్
శ్రీరమ్యాంఘ్రియుగంబు గింజుకొనుచున్ జెల్వంబు రెట్టింపగన్
పై పద్యం ఎర్రన హరివంశం లోనిది. శకటాసురుణ్ని చంపేముందు బాలకృష్ణుడి వర్ణన. ఒక్క ‘శ్రీరమ్యాంఘ్రి యుగం’ వద్దనే బాలుడు బాలకృష్ణుడని బయటపడుతుంది. లేకుంటే బాలకృష్ణుడిని మామూలు బాలుడిలా మన కళ్లెదుట నిలిపే దృశ్యమిది!
ఈమాటలో భైరవభట్ల కామేశ్వరరావుగారి వివరణ సంక్షిప్తంగా నా మాటల్లో:
ఈ పద్యంలో రెండు ప్రత్యేక గుణాలు కనిపిస్తాయి. ఒకటి – వర్ణనలలో శబ్దంపై కన్నా అర్థం పైనా, చిత్రాన్ని రూపుకట్టించడం పైనా ఎఱ్ఱనకి దృష్టి యెక్కువ. రెండు – సామాన్యుల జీవితాలలో కనిపించే సాధారణ దృశ్యాలూ సంఘటనలూ సంభాషణలూ ఎఱ్ఱన కవిత్వంలో అక్కడక్కడ తొంగిచూస్తూ, మన మనసుల్ని కట్టిపడేస్తూ ఉంటాయి. అలా కట్టిపడేసే ఒక అపురూప వర్ణన ఇది.
పసివాడు నోటిలో రెండు చేతులూ కుక్కుకుంటూ గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. కన్నీటికి కరిగిన కాటుక ఆ బాలుడి ముఖమంతా అలముకొన్నది. మాటిమాటికీ మీజేతులతో (అంటే చేతుల పైభాగం) కన్నులు నులుముకొంటున్నాడు. చేవబూని – అంటే కాస్త బలం తెచ్చుకొని, పిఱుదు మెల్లిగా పైకి లేపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పసివాని పాదాలు ఎంతో శోభతో మనోహరంగా ఉన్నాయి. ఆ లేలేత పాదాలను గింజుతూ తంతూ ఉంటే అతని అందం రెట్టింపవుతోంది!
అమ్మ దూరంగా వెళ్ళేసరికి ‘ఉంగా ఉంగా’ అంటూ గుక్కపట్టి ఏడ్చే పసివాని రూపం ఈ పద్యంలో మన కళ్ళముందుంచారు ఎఱ్ఱన.
1.4 వ్యాస భాగవతంలో దృశ్యీకరణం – స్థూల పరిచయం
పోతన భాగవతానికి మూలం వ్యాసుని భాగవతం.
పోతన దృశ్యీకరణానికి వ్యాస భాగవతంలో మూలాలున్నాయా అని స్థూలంగా పరిశీలించినప్పుడు, మూల రచనలో స్వభావం గురించి చెప్పినంతగా స్వరూపాన్ని చూపలేదనిపించింది.
వామన చరిత్రలో బలిచక్రవర్తి పోసిన నీరు వామనుని చేతిని తాకగానే, వామనుని శరీరం ఆశ్చర్యకరరీతిలో పెరిగిందని, పెరిగిన వామనుని రూపంలో పృధ్వి, ఆకాశం, దిక్కులు, స్వర్గం, పాతాళం, సముద్రాలు, పశు పక్ష్యాదులు, మానవులు, దేవతలు, ఋషులు మున్నగువారు అందరునూ అంతర్భాగమయ్యారని రేఖా మాత్రంగా ఈ క్రింది శ్లోకంలో వ్యాసుడు చెప్పారు.
భూః ఖం దిశో ద్యౌర్వివరాః పయోధయస్తిర్యఙ్నృదేవా ఋషయో యదాసత
(అధ్యాయం 20, శ్లోకం 21)
ఆ సందర్భంలో, అదే విషయాన్ని తెలుగు భాగవతంలో పోతన ‘ఇంతింతై వటుడింత యై మరియు దా నింతై…’ అంటూ పెరుగుతున్న వామన రూపాన్ని దృశ్యీకరించి పాఠకుల కళ్ళ ముందు సాక్షాత్కరింప చేసాడు.
ఈ క్రింది మూడు శ్లోకాలు వ్యాస భాగవతంలోని గజేంద్ర మోక్షణంలోని అష్టమ స్కంధం, నాలుగవ అధ్యాయం లోనివి.
తం తద్వదార్తముపలభ్య జగన్నివాసః
స్తోత్రం నిశమ్య దివిజైః సహ సంస్తువద్భిః
ఛన్దోమయేన గరుడేన సముహ్యమానశ్
చక్రాయుధోऽభ్యగమదాశు యతో గజేన్ద్రః
(అధ్యాయం 4, శ్లోకం 31)
సోऽన్తఃసరస్యురుబలేన గృహీత ఆర్తో
దృష్ట్వా గరుత్మతి హరిం ఖ ఉపాత్తచక్రమ్
ఉత్క్షిప్య సామ్బుజకరం గిరమాహ కృచ్ఛ్రాన్
నారాయణాఖిలగురో భగవన్నమస్తే
(అధ్యాయం 4, శ్లోకం 32)
తం వీక్ష్య పీడితమజః సహసావతీర్య
సగ్రాహమాశు సరసః కృపయోజ్జహార
గ్రాహాద్విపాటితముఖాదరిణా గజేన్ద్రం
సంపశ్యతాం హరిరమూముచదుచ్ఛ్రియాణామ్
(అధ్యాయం 4, శ్లోకం 33)
పై మూడు శ్లోకాలలో బాధపడుతున్న గజేంద్రుని స్తోత్రం విని, గరుత్మంతుని వాహనంగా చేసుకుని చక్రాయుధుడు గజేంద్రుడు ఉన్న చోటకి వేగంగా వచ్చారు. గరుత్మంతుని మీద ఉన్న చక్రధారిని చూసి, సరస్సులోపల బాధపడుతున్న కరిరాజు ‘నారాయణా అఖిల గురో నమస్తే’ అని పద్మంతో ఉన్న తొండంతో వందనం చేయడానికి ప్రయత్నించాడు. నారాయణుడు గజేంద్రుని అవస్థను చూసి, మొసలితో సహా గజేంద్రుడిని సరస్సులోనుండి పైకి తీసాడు. మొసలి తలను చక్రాయుధంతో నరికి వేసాడు. సంక్షిప్తంగా పై శ్లోకాలలోని భావం ఇది.
వ్యాసుడు విషయానికి ప్రాధాన్యతనిచ్చి, మహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడాన్ని మూడు శ్లోకాలలో ‘కట్టె కొట్టె తెచ్చె’ అన్న చందంగా తేల్చేసాడు. సన్నివేశ చిత్రీకరణ ఇక్కడ జరగలేదు. పాఠకులకు లేదా శ్రోతలకు, ఈ సన్నివేశంలో ఏమి జరిగిందో తెలుస్తుంది తప్ప వారి ఊహలకు ఊతమిచ్చే వర్ణనలు, వివరాలు ఈ శ్లోకాలలో లేవు.
పోతన భాగవతంలో గజేంద్రుని రక్షించే సన్నివేశాలు సవివరంగా, అందంగా చిత్రీకరించ బడ్డాయి. ‘అలవైకుంఠపురంలో…’ మొదలుకుని ‘తమముం బాసిన రోహిణీ …’ వరకు 21 పద్య వచనాలలో విస్తారంగా, కళ్ళకు కట్టినట్లు వ్రాసారు పోతన.
వ్యాస భాగవతంలో వామన చరిత్ర, గజేంద్ర మోక్షణం కథలను దృశ్యీకరణం దృష్టి కోణంలో స్థూలంగా పరిశీలించినప్పుడు, దృశ్యీకరణం రేఖా మాత్రంగా అక్కడక్కడ కనిపించినా, వ్యాసుడు సూటిగా విషయం చెప్పారనిపించింది.
భగవంతుని కథల కదంబం భాగవతం. భాగవతంలోని అన్ని కథలలోనూ సందర్భానుసారం సన్నివేశాలను దృశ్యీకరించారు. తరువాత సంచికలలో వామన చరిత్ర, గజేంద్ర మోక్షణం కథలలో పోతన దృశ్యీకరణను పరిశీలిద్దాం.
(సశేషం)