వంచన

“నేను వెళ్ళిపోతున్నాను” అంది గీత, హాలు లో తన సూట్‌ కేసుల ప్రక్కనే నిలబడి.
“ఎక్కడికి?!” అడిగేడు అప్పుడే ఆఫీసు నుండి ఇంటి కొచ్చిన సుబ్బారావ్‌ ఆశ్చర్యంతో, గీతకళ్ళలోకి చూస్తూ.

మౌనంగా చేతి గోళ్ళ వైపు చూసుకుంటూ కూర్చుంది గీత.
“ఎక్కడకని అడుగుతుంటే మాట్లాడవేం?” ఈసారి కొంచెం గొంతు పెంచి అడిగేడు.
గీత దగ్గరనుంచి సమాధానం లేదు.
అంతలో ఫోను మ్రోగింది.
ఫోనందుకుని, “ఐ విల్‌ బి దేర్‌ ఇన్‌ ఎ మినట్‌…” అంది గీత.
సుబ్బారావ్‌ కు చిర్రెత్తింది.
తను “ఎక్కడకి…యేమిటని ” అడుగుతున్నా వినిపించు కోకుండా ఎవరికో నిమిషంలోవస్తానని చెపుతోందేమిటి?
“ఎక్కడకని అడుగుతుంటే వినిపించడం లేదా?” కోపంగా అరిచేడు సుబ్బారావ్‌ .

కాఫీ టేబుల్‌ మీది హాండ్‌ బాగ్‌ ను భుజానికి తగిలించుకుని, రెండు చేతులతో రెండు సూట్‌ కేసులులాక్కుంటూ ఇంట్లోంచి బయటకు వెళ్ళింది గీత.
నోట మాట రాని సుబ్బారావ్‌ తెరిచిన గుమ్మం వైపు చూస్తూండి పోయాడు…ఆశ్చర్యంతో ,అయోమయంగా!

అప్పుడతనికి, గీతను ఆపాలనే ఆలోచన కూడా రాలేదు.
నిమిషం తర్వాత తేరుకుని, భుజానికి వేల్లాడుతున్న ఆఫీస్‌ బాగ్‌ ను సోఫాలోకిి విసిరేసి బయటకు పరుగెత్తేడు.

అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ లోంచి బయటకు వెళ్తూ కనిపించాయి ఓటాక్సీ మరో పాత వ్యాను.

ంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం

సుబ్బారావ్‌ హెచ్‌1బి వీసాతో హైద్రాబాద్‌ నుంచి పదిహేను నెలల క్రితం అమెరికా వచ్చాడు. మొదటి ఆర్నెళ్ళు  జీవితం కొంచెం కష్టమనిపించినా నిలదొక్కుకున్నాడు. మొదట చేరిన కన్సల్టింగ్‌ కంపెనీ ని వదిలేసి ఆర్నెల్ల క్రితమే ఓ పెద్ద కంపెనీల్‌ ఎంప్లాయీగా జాయినయ్యాడు. అక్కడ కూడా కొంత కుదురుబాటు దొరికేక…పెళ్ళి గురించిన ఆలోచనలు మొదలెట్టేడు.

సుబ్బారావ్‌  రెండు నెలల క్రితం మూడు వారాల శలవు మీద ఇండియా వెళ్ళి డాక్టర్‌ గీతను పెళ్ళి చేసుకున్నాడు.
మూడు వారాల్లో పిల్లను చూసి పెళ్ళి చేసుకోడమంటే ఒకప్పుడు ఆశ్చర్యపోయే విషయమేమో గానీ,  ఈ ఇంటర్నెట్‌ యుగం లో అది అతి సామాన్య విషయం.
దాదాపు పెళ్ళి చూపుల తతంగం అంతా అమెరికాలో వుండే కానిచ్చేసేడు సుబ్బారావ్‌ .
ముందుగా ఇంటి దగ్గర వాళ్ళు చూసి, ఫిల్టర్‌ చేసేక…అమ్మాయిల ఫోటోలను, వాళ్ళ బయోడేటాలను, కుటుంబ స్థితి గతులను ఈమెయిల్సు లో పంపిస్తుంటే, ఇక్కడ సుబ్బారావ్‌ మరోసారి వడపోసి షార్ట్‌లిస్ట్‌ ను ఇండియా పంపేవాడు. తర్వాత అట్నుంచి మరో లిస్ట్‌ వచ్చేది. ఇక్కడనుంచి కుదించ బడ్డ లిస్ట్‌  ఇండియా వెళ్ళేది…

అలా అలా రెండు నెలలు గడిచేక… దాదాపు అన్ని విధాలుగా ఓకే అనుకున్న మూడు సంబంధాలు మిగిలేయి. అందులోంచి ఒకరిని ఓకే చేసుకోడమంటే సులువేగదా!
మొత్తానికి ఇండియా లో దిగిన మర్నాటి నుండే మిగతా పనులు మొదలెట్టేడు.
ముగ్గురమ్మాయిలను విడివిడిగా కలసి మాట్లాడేడు. ఒకమ్మాయి బాగా అందంగా వున్నా మంచి చదువు వున్నా రాను రాను తనను లెక్కచేయదేమోనని రిజెక్ట్‌ చేసాడు.
రెండో అమ్మాయి బాగా అందంగా వున్నా…చదువు అంతంత మాత్రం. ఆస్తి పాస్తులు బాగానే వున్నై.
అయితే ఆ అమ్మాయి మాటల్లో అమెరికా మీద మోజెక్కువ కనపడింది. కేవలం అమెరికా రావడానికే తనతో పెళ్ళికి ఒప్పుకుంటుందే మో ననిపించి, ఆ సంబంధంకూడా వద్దన్నాడు.

ఆఖరుకు డాక్టర్‌ గీత అతనికి అన్ని విధాలానచ్చింది.
వెంటనే పెళ్ళి కూడా భారీగానే జరిగిపోయింది.
వీసా తతంగాలన్నీ పూర్తయ్యాక, ఐదు వారాల క్రితం అమెరికా వచ్చేసారిద్దరూ.
ఇక్కడకు వచ్చినప్పటి నుండి సుబ్బారావ్‌ తో అంత సఖ్యంగా లేకపోయినా మరీ యెడమొహంగామాత్రం లేదనే చెప్పొచ్చు.
కాకపోతే నిన్న సాయంత్రం ఆ నెల ఫోను బిల్లు చూసిన సుబ్బారావ్‌ గీతను కొంచెం ఘాటు గానే మందలించేడు.
మందలించక ఏంచేస్తాడు మరి?!
ఒకటా, రెండా … అక్షరాలా పద్దెనిమిది వందల డాలర్లబిల్లు!

సుబ్బారావ్‌ మందలింపు భార్యా భర్తల మొదటి ఫైటుగా ముగిసింది.
గీత రాకముందు,అపార్మ్టెంటులో ముగ్గురున్నా అంత బిల్లు ఎప్పుడూ రాలేదు మరి.
అంత బిల్లు వచ్చిందంటే ఎడాపెడా ఇండియాకు కాల్స్‌ చేసిందనుకుంటున్నారా?
బిల్లు అమౌంట్‌ చూడగానే సుబ్బారావ్‌ కూడా అలానే అనుకున్నాడు.
ఇంటి దగ్గరి వాళ్ళ మీద బెంగ తో చేసిందేమోననుకున్నాడు. తీరా బిల్లు చూస్తే ఆ కాల్సన్నీ అమెరికాలోనే కేలిఫోర్నియా లోనే ఎవరికో చేసినవి.
ఎంత క్రొత్త పెళ్ళామైనా అంత బిల్లు చూసేసరికి అదీ లాంగ్‌ డిస్తెంస్‌ కాల్స్‌ బిల్లయ్యేసరికి
కోపం ఆపుకోలేక పోయాడు సుబ్బారావ్‌ .
ంంంంంంంంంం ంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం ంంంంంంంంంంంంం

సుబ్బారావ్‌ కు చాలాసేపు ఏం చేయాలోతోచలేదు.
“ఫోనులు చేయడం కొంచెం తగ్గించమన్నందుకే అంత కోపమా? అయినా ఎక్కడకు వెళ్తుంది?ఇండియా గాని వెళ్ళడం లేదుకదా?” అనుకోగానే, చెక్‌ బుక్‌ గుర్తొచ్చింది.
వారం క్రితమే పాత బ్యాంకు అకౌంటును ఇద్దరి పేరు మీద జాయింట్‌ అకౌంటు గా మార్చేడు.
గబగబా బెడ్‌ రూం లోని బ్రీఫ్‌ కేసు లోంచి, చెక్‌ బుక్‌ తీసి చూసేడు. క్రొత్త చెక్కులేవీ వ్రాసినట్లు లేదు.
ఒకవేళ బాంకు కెళ్ళి విత్‌ డ్రా చేస్తేనో?
టెలెఫోను తీసుకుని బాంకుకు కాల్‌ చేసి అక్కౌంట్‌ ఆక్టివిటీ అంతా చెక్‌ చేసేడు.
క్రెడిట్‌ కార్డ్‌ యూజ్‌ చేసుంటే?
అన్ని క్రెడిట్‌ కార్డుల అకౌంట్లు చెక్‌ చేసేడు.
అన్నీ బాగానే వున్నాయి.

ఇండియా వెళ్ళాలంటే టికెట్లకు కనీసం వెయ్యి డాలర్లన్నా కావాలి. తనకు అందు బాటులో వున్న అక్కౌంట్లన్నీ సరిగ్గానే వున్నాయి కాబట్టి… ఇండియా వెళ్ళే చాన్సు తక్కువే!
మరి యింకెక్కడికి వెళ్ళిన్నట్టు?
సుబ్బారావ్‌ బుర్ర షాక్‌ నుంచి తేరుకుని ఇప్పుడిప్పుడే ఆలోచిస్తోంది.
పోనీ ఇండియా ఫోన్‌ చేసి కనుక్కుంటే?
కనుక్కుంటే బాగానే వుంటుంది. కానీ ఎవరిని కనుక్కోవాలి?
ఏదో మామూలుగా చేసినట్లు చేసినా, అక్కడి వాళ్ళు గీత తో మాట్లాడతామంటే తను ఇరుకునపడతాడు.

అప్పుడు గుర్తొచ్చింది టెలిఫోన్‌ బిల్లు గురించి.
రోజుల తరబడి ఆ “ఫ్రెండ్‌ ” తో మాట్లాడింది కాబట్టి, ఆ “ఫ్రెండ్‌ ” కు గీత ఎందుకు వెళ్ళిందో, ఎక్కడికి వెళుతోందో తెలిసివుండొచ్చు.
గబగబా నిన్న వచ్చిన టెలిఫోన్‌ బిల్లు కోసం, లెటర్‌ ఫోల్డర్‌ వెదికేడు.
బిల్లుకనిపించలేదు. మరలా వెదికేడు.
పొరపాటున మరెక్కడైనా పెట్టానేమోనని ఇల్లంతా వెదకడం ప్రారంభించేడు.
ఉపయోగం లేదు. ఎక్కడో మిస్సైంది.

గీత వెళ్ళేప్పుడు తనతో పాటు తీసుకెళ్ళలేదుకదా?
అయినా, ఆ బిల్లుతో తనకేం పని? కొంపదీసి తన ఫ్రెండు ఫోను నంబరు నాకు తెలియకుండా వుండాలనా??
ఆలోచించిన కొద్దీ అనుమానాలు పెరిగిపోతున్నాయి సుబ్బారావ్‌ కు.
ఒక వేళ ఆత్మహత్య చేసుకోడానిగ్గానీ వెళ్ళలేదు కదా? సుబ్బారావ్‌ కు తన మీద తనకే చిరాకేసింది అలా ఆలోచిస్తున్నందుకు!
ఆత్మహత్య చేసుకోవాలంటే బట్టలన్నీ సర్దుకొని ఇంట్లోంచి వెళ్ళాల్సిన
అవసరమేముంది? ఐనా కావాలంటే ఆ పనేదో ఇంట్లోనే చెయ్యొచ్చు.

అంతలో ఫోను మ్రోగింది. అవతలనుంచి మోహన్‌. ఓ గంటలో వస్తున్నానని చెప్పటానికి ఫోన్‌ చేసేడు.
మోహన్‌ ను ఆరాత్రికి డిన్నర్‌ కు పిలిచిన సంగతి అప్పుడు గుర్తొచ్చింది.
సుబ్బారావ్‌ తో కలిసి ఇంజనీరింగ్‌ చదివేడు మోహన్‌ . అతనికి బెస్ట్‌ ఫ్రెండ్‌ అని చెప్పుకోవచ్చు.
మూడునెలలపాటు ప్రాజెక్ట్‌ పనిమీద జర్మనీకి వెళ్ళి రెండు రోజుల క్రితమే ఇక్కడకు వచ్చాడు.
ఇల్లాంటి సమయంలో మోహన్‌ లాంటి వాళ్ళు తోడుగా వుంటే బాగుంటుందనిపించింది సుబ్బారావ్‌ కు.

ంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం
మోహన్‌ వచ్చేలోపున తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి.
ముందుగా తనెందుకు ఇంట్లోంచి వెళ్ళిపోయిందో తెలుసుకోవాలి. తర్వాత వెళ్ళడానికి కారణం కనుక్కోవాలి.
ఆ తర్వాత ముందు ముందు… అంటే మళ్ళీ తను వచ్చేక ఏం చేయాలో ఆలోచించాలి.

ఆలోచించినకొద్దీ ఫోను బిల్లు పెరిగిందని తను మందలించినందుకు మాత్రమే వెళ్ళలేదేమో ననిపించింది.
కొంపతీసి ఎవడితోనో … లేచి పోలేదు కదా?!
ఈ ఆలోచన రాగానే సుబ్బారావ్‌ కు కొంచెం వణుకు వచ్చింది.
అలా జరిగితే ఏం చేయాలి? అసలే ఈ మధ్య అలాంటి కధలు చాలా వినిపిస్తున్నాయ్‌ .
కానీ తన బోయ్‌ ఫ్రెండో, లవరో ఇక్కడే వున్నప్పుడు… తనను పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం గీత కు లేదు.
వాడినే చేసుకుని ఇక్కడకు రావచ్చు. అనవసరంగా లేచి పోయిందనో, విడాకులు తీసుకుందనో పేరెందుకు తెచ్చుకోవాలి?
అదీ కారణం కాకపోవచ్చు!
పోనీ ఈ మధ్యే ఇక్కడెవరైనా పరిచయమై …
ఆ పరిచయం కాస్తా ప్రణయమై…
ప్రణయం కాస్తా ఇంట్లోంచి పారిపోడానికి ప్రేరణనివ్వలేదుకదా?

ఈ లాంగ్‌ డిస్టెన్స్‌ కాల్స్‌ ఎవరి కోసం? ఎవడున్నాడక్కడ?
ఒహవేళ ఆమె బోయ్‌ ఫ్రెండు ఇండియా లో వుండి,పెద్దవాళ్ళ మాటలకు ఎదురుచెప్పలేక తనను పెళ్ళి చేసుకుని వుండొచ్చు కదా? వుండొచ్చు.
అవును… అలా జరిగి వుండొచ్చు కదా?!

గీత ఎక్కి వెళ్ళిన కాబ్‌ కంపెనీకి ఫోను చేసాడు. కష్టమర్‌ ను ఎక్కడ దించినదీ చెప్పంగాక చెప్పం పొమ్మన్నారు వాళ్ళు.
ఇక మిగిలినదారి ఇక్కడ గీతకు ఉన్న ఫ్రెండ్సును కాంటాక్టు చేయడమే!
వాళ్ళను కాంటాక్టు చేయాలంటే… ఫోను బిల్లు దొరకాలి.
అప్పుడు గుర్తొచ్చింది ఫోను బిల్లు కాపీ ఇంటర్నెట్లో దొరుకుతుందని.

ంంంంంంంం
రోజులతరబడి గీత కాల్‌ చేసిన నంబర్లను ఇంటర్నెట్‌ లో తన బిల్లు లోంచి ప్రింట్‌ చేసుకున్నాడు.

అప్పుడే డోర్‌ బెల్‌ మ్రోగింది.
తలుపు తీసేసరికి ఎదురుగా మోహన్‌ . .
కుశలప్రశ్నలయ్యేక “మీ ఆవిడేదిరా?” అడిగేడు మోహన్‌
చెప్పాలా వద్దా అని సంశయించి, చెపితేనే మంచిదనిపించి… జరిగినదంతా చెప్పేసాడు.

“మారేజి సెర్టిఫికేటు, పెళ్ళి ఫోటోలు నీదగ్గర వున్నాయా?” అడిగేడు మోహన్‌ .
“అవి…అవి గీత బ్యాగులోనే వుండాలి” అన్నాడు సుబ్బారావ్‌ పాలిపోయిన మొహంతో.
“పోనీ మీ ఆవిడ ఎవరికి ఫోను చేసేదో నీకు తెలుసా? ఐ మీన్‌ … ఆమె ఫ్రెండ్సు పేర్లు గాని, వాళ్ళ ఫోను నంబర్లు  గానీ?”
“ఫోను బిల్లు దొరకలేదు…ఇదిగో ఇంటర్నెట్లోంచి ఇప్పుడే ప్రింట్‌ చేశాను …” చూపించేడు సుబ్బారావ్‌ .
“ఓ సారి ఆ నంబర్‌కి  ఫోన్‌ చేద్దామా?” అదిగేడు మోహన్‌ తన సెల్‌  ఫోన్ను చేతిలోకి తీసుకుంటూ.

“చేద్దాం…నా ఫోన్‌ తో చెయ్యి” అన్నాడు సుబ్బారావ్‌ .
“నా అనుమానం  నిజమై గీత అక్కడే వుంటే, నీనంబర్‌ నుంచి ఫోనుచేస్తే అవతలి వాళ్ళు ఫోనెత్తరు ఇదే ఊరునుంచి పేఫోన్‌ నుంచి చేసినా కూడా … నాసెల్‌ నంబరు ఏరియా కోడు ఇక్కడిది కాదు” నంబరు డయలు చేస్తూ చెప్పాడు మోహన్‌ .
నిజమే అవతలి వాళ్ళు కాలర్‌ ఐడిలో నంబరు చూడొచ్చు కదా!
అవతల ఫోను రింగైన చప్పుడు.
ఆ నంబర్‌ డిస్కనెక్ట్‌ చేశారని మెసేజ్‌.

“సుబ్బు… నీ కంప్యూటర్‌ ఆన్‌ చేస్తావా?” అడిగేడు మోహన్‌ .
“ఆన్‌ చేసేవుంది. ” అంటూ మోహన్‌ ను బెడ్‌ రూంలోని కంప్యూటర్‌ దగ్గరకు తీసుకెళ్ళేడు.

ఇంటర్నెట్‌ లో టెలిఫోన్‌ డైరెక్టరీలను సెర్చ్‌ చేసి, నంబరు తో అడ్రస్‌ తెచ్చేసైటులను వెదికి, వాళ్ళదగ్గర వున్న ఫోన్‌ నంబర్‌ ఎవరిదో కనుక్కోడానికి ట్రై చేసారు.
వూహు… నో ఊజ్‌ !
“మీ ఇద్దరికి మరేమైనా గొడవలు జరిగాయా?” అడిగేడు మోహన్‌
“లేదు…” అన్నాడు సుబ్బారావ్‌ .
“చూస్తూంటే తను చాలా ప్లాన్‌ చేసి వెళ్ళి పోయినట్లుంది. నీ కెవరి మీద నైనా అనుమానంగా వుందా? ” సుబ్బారావ్‌ కళ్ళలోకి పరిశీలనగా చూస్తూ అడిగేడు మోహన్‌ .
“నా అనుమానమంతా గీత మీదే… ఇంకెవరి మీదుంటుంది?”
“సరే… ఇప్పుడేం చేయాలనుకుంటున్నావ్‌ ”
“ముందు పోలీసు రిపోర్టిస్తాను నా భార్య కనిపించడం లేదని. తర్వాత ఈ రాత్రికి ఇండియా కాల్‌ చేసి చెబుతాను జరిగినదంతా” అన్నాడు సుబ్బారావ్‌
“సుబ్బు…అన్నీ బాగా ఆలోచించి చెయ్యి. పోలీసు రిపోర్టిస్తే నువ్వే ఇబ్బంది పడతావేమోనని పిస్తోంది.”
“ఎలా?”
“పోలీసు రిపోర్టిస్తే వాళ్ళు ముందుగా సస్పెక్ట్‌ చేసేది నిన్నే. ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో తెలీదు. ఒక్క ఫోను బిల్లు గొడవ వల్లే వెళ్ళి పోయిందంటే పోలీసులు అసలే నమ్మరు. రిపోర్టివ్వగానే మొదట నిన్ను అరెస్టు చేసినా చెయ్యొచ్చు. ఎలా చూసినా నీకే రిస్కు ఎక్కువ ఇందులో”

మోహన్‌ చెప్పింది కొంత వరకు నిజమేననిపించింది.
“మరి… మరెలా…”
“ముందు ఇండియా కాల్‌ చేసి పెద్ద వాళ్ళతో మాట్లాడు. నేను సోమవారం మళ్ళీ నిన్ను కలుస్తాను. డబ్బు ఖర్చైనా మంచి అటార్నీని కలిసి సలహా తీసుకుందాం. ఆ తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలో. సరేనా? ఏం బెంగ పెట్టుకోకు. ఈ వ్యవహారం అంతు చూట్టానికి నేనున్నానని మర్చిపోకు” అన్నాడు మోహన్‌ బయటకు వెళ్ళడానికి లేస్తూ.

సరే అన్నట్లు తలూపి, “ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోకూడదూ” అన్నాడు సుబ్బారావ్‌ .
“ఉండొచ్చుగానీ…ఉదయాన్నే అర్జంటు పనొకటి వుంది. నువ్వు మాత్రం ఏమీ జరగనట్లే వుండు. ఏమో నీ భార్య తిరిగి రావొచ్చేమో…ఇంకేమైనా డెవలప్మెంట్స్‌ వుంటే సెల్‌ కు కాల్‌ చెయ్యి. బై మరి” అంటూ బయటకు నడిచాడు మోహన్‌ .
ంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం

“ఇప్పటికిప్పుడు నిన్ను తన భార్యగా నిరూపించే సాక్ష్యాలేవీ సుబ్బారావ్‌  దగ్గర లేకుండా నువ్వు తెచ్చెయ్యటం బాగుంది. మన ప్లాను సక్సెస్‌ కావాలంటే సుబ్బును మరో వారం పాటు ఏంచేయకుండా ఆపాలి. కనీసం వారం పట్టదూ …  ఇండియా నుంచి సాక్ష్యాలు తెప్పించులోవాలంటే?” అడిగాడు గీతను మోహన్‌, సుబ్బారావ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌!

వాళ్ళ ప్లానులోని మొదటి అంకం విజయాన్ని సెలబ్రేట్‌  చేసుకోడానికి కారులో డిన్నర్‌ కు బయలుదేరారు.
కారు వేగంగా వెళుతోంది. తెలిసిన వాళ్ళెవరైనా చూస్తే ప్రోబ్లెం అవుతుందని గీత చెప్పినా వినిపించుకోలేదు మోహన్‌.
“ప్రపంచం కొన్ని సార్లే చిన్నది. చాలా చాలా సార్లు పెద్దది. నేను చూడు అమెరికాలో  ఉండికూడా జర్మనీ లో ఉన్నట్లు సుబ్బారావ్‌ ను మిగిలిన ఫ్రెండ్సును నమ్మించలేదూ” అన్నాడు మోహన్‌ .
“నాకేమీ ప్రోబ్లెం ఉండదుగా?” అడిగింది గీత.
“ఆరు నెలలు పైగా ఆలోచించి వేసిన ప్లాను. నీ పాస్‌ పోర్ట్‌ నీదగ్గరే వుందిగా?” అడిగేడు మోహన్‌ .
వుందన్నట్లు తలూపింది గీత హాండ్‌ బాగ్‌ ను చూసుకుంటూ.
“అవునూ, ఒక్క దానివీ మాల్‌ లో ఇప్పటి దాకా ఏంచేసావ్‌?” అడిగేడు మోహన్‌ .
“ఏం చేస్తాను భయ భయంగా నీ కోసం ఎదురుచూస్తున్నాను.” అంది గీత.
“సుబ్బారావ్‌ ముందు ఏమీ తెలియనట్లు నటించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
మొత్తానికి పోలీసులకు రిపోర్టివ్వకుండా ప్రస్తుతానికి ఆపగలిగా… ప్చ్‌.. నాకప్పుడే గ్రీన్‌ కార్డ్‌ రాకుంటే మనకీ సమస్యలే వుండేవి కావు. ఐనా ఇప్పుడేమైంది? మళ్ళీ మనం కలుసుకున్నాం, రేపే వెళ్ళి పెళ్ళి చేసేసుకుందాం!” అంటూ లేను చేంజ్‌ చేసాడు మోహన్‌… మాటల్లో పడి బ్లైండ్‌ స్పాటును చూసుకోకుండా.

పక్క లేనులో వస్తున్న ట్రక్కు డ్రైవరు, సిగ్నలు లేకుండా హటాత్తుగా ముందుకొచ్చిన కారును చూసి కంగారుగా బ్రేకులు వేయడానికి ప్రయత్నించాడు.
కానీ అప్పటికే ట్రక్కు ముందు భాగం మోహన్‌ కారును ఢీ కొనడామూ
మొహన్‌ కారు వెళ్ళి ముందున్న  మరోకారును గుద్దుకోడమూ …
అది వెళ్ళి మరో కారును…!
ంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం

అప్పుడే స్పృహలోకి వచ్చింది గీత.
మొదట మోహన్‌ … తర్వాత సుబ్బారావ్‌ గుర్తొచ్చారు.
కాళ్ళూ చేతులూ కదిలించి చూసింది. అంతా బాగానే ఉన్నట్లనిపించింది.
గీత  అటు ఇటు కదలడం చూసి బెడ్‌ దగ్గరకు వచ్చిందో నర్స్‌.
“ఎలా వుంది? కదలొద్దు… అలాగే పడుకుని రెస్ట్‌ తీసుకో… నీ భర్త ఈపాటికి వస్తూంటాడు” అందామె, గీత కళ్ళను పరిశీలిస్తూ.
“నా భర్త… అంటే…” ఏక్సిడెంటుకు ముందు జరిగిన విషయాలు గుర్తొచ్చాయి గీతకు.
“నీ బ్యాగులో దొరికిన వివరాలతో పోలీసులు నీ భర్తకు కబురు చేసారు…” చెప్తోందామె.
“మరి మోహన్‌ … నాతో… నాతో పాటు కారులో వున్నతను…”
“అయామ్‌ వెరీ సారీ టు సే దిస్‌ … అతనక్కడికక్కడే చనిపోయాడు. ఎక్స్ర్టీమ్లీ సారీ…” అంటూ బయటకు వెళ్ళింది నర్స్‌ .
“మోహన్‌ …. మోహన్‌ …” గీత కళ్ళలోంచి నీరు.
“ఎలా ఇప్పుడెలా? ఏం చేయాలి నేనిప్పుడు?
సుబ్బారావ్‌ వచ్చే లోగా ఇక్కడ నుంచి పారిపోతే? ఓ మై గాడ్‌ నేను మోహన్‌ తో బాటు కారు లో వున్నానని సుబ్బారావ్‌ కి తెలిస్తే…
ఇప్పుడు నాకేది దారి?” వాపోతోంది గీత మనసు.

గీత కళ్ళ వెంట నీళ్ళు కారుతున్నాయి.
అలికిడికి తల కొంచెం ప్రక్కకు తిప్పి చూసింది.
గదిలోకి వస్తున్నాడు సుబ్బారావ్‌ .
“గీతా …” పిలిచేడు సుబ్బారావ్‌
“…” కుమిలిపోతూ ఏడుస్తోంది గీత.
“నిన్న… నిన్న మీరు ఫోను బిల్లు గురించి కోప్పడ్డారని మా ఫ్రెండు దగ్గరకని బయల్దేరాను.
దారి మధ్యలో తన దగ్గరకు వెళ్ళ బుద్ది వేయక ఒక మాల్‌ దగ్గర టాక్సీ దిగాను. అక్కడే కూర్చుని చాలా సేపు ఆలోచించాను. మిమ్మల్ని రమ్మని ఫోను చేద్దామనుకుంటూంటే… ఎవరో మోహనట…మీరు నాకోసం ఆదుర్దా పడుతున్నారని చెప్పేడు. మీకు తను చాలా క్లోసు ఫ్రెండునని చెప్పాడు. ఈ రాత్రి మనింటికి డిన్నర్‌ కని వచ్చాడట. నాకూ గుర్తొచ్చింది. మీరు మీ ఫ్రెండును డిన్నర్‌ కు పిలిచిన సంగతి.మనింటి వరకు రైడిస్తానన్నాడు. ఫోను చేయకుండా వచ్చి మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చెయ్యొచ్చన్నాడు…సారీ … మిమ్మల్ని చాలా కంగారు పెట్టేను”

ఇంకా ఏడుస్తూనే ఉంది గీత.
“మోహన్‌ ఏడీ? ఎలావున్నాడు?”అడిగేడు సుబ్బారావ్‌
“పాపం … అతను చనిపోయాడట” ఇంకాస్త బిగ్గరగా ఏడుస్తూ చెప్పింది గీత
ఫోను నంబర్ల గురించి ఎలాంటి కధ  చెప్పాలా అని ఆలోచిస్తూ,
ముందు ముందు బయటపడే మార్గం కోసం అన్వేషిస్తూ!