డ్రైవింగ్‌ లెసన్‌

(వర్ధమాన కథకుడు, కవి గిరిధరరావు నేటితరం అమెరికా తెలుగు వాళ్ళ దృక్పథాల్ని, అనుభవాల్ని ఆవిష్కరిస్తున్న రచయిత. ఈ కథలో సంఘటనలు ఎందరికో స్వానుభవాలు.)

“అది కాదురా శైలూ… చెబితే అర్ధం చేసుకోవాలి. ఇక్కడ డ్రైవింగ్‌నేర్చుకోడం, లైసెన్స్‌ సంపాదించడం అంత ఈజీ కాదు…” భార్య ఎదురుగా కూర్చుని, గడ్డం పట్టుకుని, అనునయంగా చెబుతున్నాడు మధు.

చేతి వేళ్ళ గోళ్ళు కొరుకుతూ, నేల చూపులు చూస్తోంది శైలజ.

“ఐనా మీనాక్షి నేర్చుకుంటే నువ్వూ నేర్చుకోవాలని లేదు కదా? ఆ అమ్మాయి కనురెప్పలు కత్తిరించుకుందని నువ్వూ కత్తిరించుకుంటావా?” అడిగేడు మధు.

“కనురెప్పలు కాదు కనుబొమలు!” సరిచేసింది శైలజ.

“ఏదో ఒహటి లెద్దూ! ఐనా ఒకళ్ళతో కంపేర్‌ చేసుకోవద్దని నీకెన్ని సార్లు చెప్పాను?”

“దోసెలు బాగా చేయకపోతే మీనాక్షిని చూసి నేర్చుకో అంటారు. ఏదైనా కూర బాగోక పోతే, మీ అమ్మతో పోలుస్తారు. ఇప్పుడేమో ఇలా అంటారు,” నిష్టూరంగా అంది శైలజ.

“అబ్బ! అది వేరు ఇది వేరు అంటున్నానా!”

“నాకవేమీ తెలియవు. నేను డ్రైవింగ్‌నేర్చుకోవాలి. అర్జంటుగా లైసెన్స్‌ సంపాదించాలి.”

“అలా మొండి పట్టు పడితే ఎలాగ? నిదానంగా నేర్పుతాగానీ ఇక అలక పాన్పు దిగు,” అంటూ శైలజ గడ్డం పట్టుకుని, ముఖాన్ని తన వైపు తిప్పుకున్నాడు మధుబాబు.

మధు చేతిని విసురుగా నెట్టేస్తూ, “ఈ విషయంలో మీరేం చెప్పినా వినేది లేదు. రేపో ఎల్లుండో మీనాక్షి ఇండియా ఫోను చేసినప్పుడు, ఎడాపెడా అమెరికా రోడ్ల మీద కారు నడుపుతున్నానని వాళ్ళమ్మకు చెబుతుందా లేదా? ఏమిటి మాట్లాడకుండా అలా చూస్తారూ? నాల్గు రోజులు పోయాక తను డ్రైవింగ్‌ చేస్తూండగా తీయించుకున్న ఫోటోలను, వీడియో కేసెట్లను వాళ్ళమ్మకు పంపుతుంది కదా? ఏదో కూతురు ఫోటోలూ అవీ పంపిందని వాళ్ళమ్మ వూరుకుంటుందా?! అవి తీసుకుని వెళ్ళి మా అమ్మ దగ్గర కూర్చుని, ఇరుగుపొరుగు వాళ్ళను జమచేసి ఎగ్జిబిషన్‌ పెడుతుంది. ఈ సారి నేనిండియా కాల్‌చేసినప్పుడు, ఏమేయ్‌ శైలు… మీనాక్షి నీతర్వాతే కదా అక్కడకు వచ్చింది? అది అంతలా డ్రైవింగ్‌ చేస్తోంటే నువ్వెందుకు చేయడం లేదంటే నేనేం సమాధానం చెప్పాలి?” అసలు పాయింటు చెప్పింది శైలజ.

“అబ్బో అంత కధ వుందా! పోనీ నువ్వూ డ్రైవ్‌చేస్తున్నానని చెప్పు.”

“అబద్దమాడమంటారా?” అంది శైలజ కోపంగా.

“ఇదిగో శైలూ మీ బాబాయి పేరు హరిశ్చంద్రరావైనంత మాత్రాన అలా సంశయించకు. నువ్వు డ్రైవ్‌ చేస్తున్నట్లు ఫోటోలు, వీడియోలు కావాలంటే వీకెండులో నేను తీసిస్తాను.” భరోసా ఇచ్చాడు మధు.

“నేను సీరియస్‌గా చెబుతున్నా… నేను వెంటనే డ్రైవింగ్‌ నేర్చుకోవాలి”

“మరీ అంత మంకు పట్టు పడతావెందుకు శైలూ చిన్నగా నేర్చుకోవచ్చంటున్నానుగా” బతిమాలాడే ధోరణిలోనే అన్నాడు మధు.

కొత్త పెళ్ళాం అలిగినప్పుడు ఆ మాత్రం బతిమాలకపోతే ఇంకేమైనా వుందా?!

పోనీ, ఇంతగా సంబర పడుతోంది కదాని నేర్పిద్దామనుకుంటే కళ్ళ ముందు తళ తళా మెరిసే కొత్త టయోటా కామ్రీ కారు, ఆ పైన నెలకు ముప్పై నలభై డాలర్ల వరకూ పెరిగే ఇన్సూరెన్సు! అలిగిన భార్యను లాలించో, బుజ్జగించో ఇంకా… ఎలాగోలా దారి లోకి తెచ్చుకోవచ్చు. కానీ కారు అలా కాదు కదా? ఏ చిన్న దెబ్బ తగిలినా బోలెడంత చమురు వొదులుతుంది.

“వీకెండు బయటకు డిన్నర్‌కు తీసుకెళతాగా,” అన్నాడు మధు అలాగైనా పట్టు వదులుతుందేమోనని.

బయట డిన్నరంటే అనవసరమైన ఖర్చనే శ్రీవారు అలా అనేసరికి శైలుకు కొంచెం ధైర్యం చిక్కింది. మరి కాస్త బెట్టు చేస్తే దారి లోకి వస్తాడనిపించింది.

విసురుగా సోఫా లోంచి లేచి బెడ్రూం లోకి వెళ్ళింది. మరో ఐదు నిమిషాలపాటు ఇద్దరి మధ్యా చర్చలు జరిగేక వ్రాత పరీక్ష వ్రాసి పాసయ్యేక, ఇన్సూరెన్స్‌ తీసుకుని డ్రైవింగు నేర్చుకోడం మొదలెట్టేట్టు, కాలిఫోర్నియాలో డ్రైవింగ్‌ లెస్సన్స్‌కు ఖర్చెక్కువ కాబట్టి, రోజూ సాయంత్రం వర్కు నుంచి రాగానే ఓ గంట సేపు డ్రైవింగు మధునే నేర్పేట్టు ఒప్పందం కుదిరింది.

శైలజ అలక చాలించి, “నేనేమైనా మిమ్మల్ని ముత్యాల మూటలడిగానా, రతనాల రాసులడిగానా, నాక్కూడా డ్రైవింగ్‌ వస్తే మీకూ వుపయోగమే కదా? ఎప్పుడైనా మీకొంట్లో బాగోకపోతే ఎంచక్కా నేను మిమ్మల్ని ఆఫీసులో డ్రాపు చెయ్యొచ్చు. వీకెండు షాపింగ్‌ కుదరక పోతే, వీక్‌డేస్‌లో నేనే షాపింగ్‌ చెయ్యొచ్చు, నాకెప్పుడైనా బోరనిపిస్తే సరదాగా అలా అలా మాల్స్‌ వైపు వెళ్ళొచ్చు, ఇంకా…” అంటూ భార్యలకు డ్రైవింగ్‌ వస్తే భర్తల కొచ్చే లాభాలను వల్లెవేసింది.

ఆడవారికి చేతిలో కారు, బ్యాగులో క్రెడిట్‌కార్డూ వుంటే వచ్చే తీవ్ర నష్టాల గురించి, వాటిని నివారించడానికి తీసుకోవలసిన తక్షణ చర్యల గురించి తీవ్రంగా ఆలోచించసాగేడు మధు.


పగలనక రాత్రనక కష్టపడి చదివి ఆ తర్వాత వారంలో శైలజ డ్రైవింగ్‌ రిటెన్‌టెస్ట్‌ పాసయ్యింది.

ఇన్సూరెన్స్‌వాళ్ళతో గీచి గీచి బేరమాడి శైలజకి కూడా ఇన్సూరెన్స్‌ తీసుకున్నాడు మధు.

తెలిసిన వాళ్ళు కొత్త కామ్రీ మీదెందుకు ప్రయోగాలు, కొంచెం అలవాటయ్యే వరకు రెంటల్‌ కారు తీసుకోమని సలహాలిచ్చినా, మన కారుండగా అనవసరంగా వాడెవడి మొహానో డబ్బులు పోయడమెందుకని పంచమి బుధవారం, ఓ దివ్య మైన ముహూర్తంలో నిర్మానుష్యంగా వుండే ఓ స్కూలు గ్రౌండులో, డ్రైవింగ్‌ సీటు లోకి శైలజ, పాసెంజెర్‌ సీటు లోకి మధు, మారారు.

తొందరగా డ్రైవింగ్‌ రావాలని శైలజ దేవుణ్ణి ప్రార్ధిస్తూంటే, కారు కేమీ కాకుండా చూస్తే ఓ సంవత్సరం లోపున “మాలీబు టెంపుల్‌”కి వస్తామని మొక్కుకుంటున్నాడు మధు.

రెడీ చెప్పుకున్న తర్వాత, మరోసారి దేవుణ్ణి తలచుకొని ఇంజన్‌ స్టార్ట్‌ చేసింది శైలజ.

కొండ చిలువ మనిషిని మింగేసి, చెట్టుకు గట్టిగా చుట్టుకున్నప్పుడు వచ్చే ఎముకలు విరిగిన శబ్దాన్ని మాంచి సౌండు సిస్టం వున్న ధియేటర్‌లో చూస్తూ, విన్నట్లు అసలు తన వంట్లో ఎముకలే క్రష్షవుతున్నట్లు ఫీలై “ప్చ్‌.. ఆగు…”అని అరిచేడు మధు.

కారు అసలు కదలకుండానే అరుస్తున్న భర్తను చూసి, కంగారుగా, అతనికి ఏమయ్యిందోనని ఆదుర్దాపడుతూ తాళాన్ని మరింత గట్టిగా తిప్పింది శైలజ.

“ప్చ్‌! ఆపమంటూంటే…!” అంటూ అతి చిరాగ్గా మొహం పెట్టి, గుడ్లు పెద్దవి చేసి మనిషంతా బిగుసుకుపోవడం చూసిన శైలజ తన తప్పేమిటో తెలీక తాళాన్ని చేత్తో తిప్పుతూ, ఆక్సెలరేటర్‌ మీద కాలుతో బలంగా నొక్కుతూ “ఏమైందండీ?” అనడిగింది.

ఆమె ప్రశ్న కారు చేస్తూన్న శబ్దంలో కలిసిపోయింది.

అంతే! ఒక్క సారిగా ఆవేశంతో వూగిపోతూ “నువ్వాపు!!!” అని కసురుకుంటూ, డ్రైవర్‌సీటు వైపు వంగి, తాళాన్ని తిప్పుతున్న శైలజ చేతిని విసురుగా లాగేసి, ఇంజన్‌ ఆఫ్‌ చేసి కారు తాళాలను తీసుకున్నాడు మధు.

“ఎందుకలా కసురుకుంటారు?” గట్టిగానే అరిచింది శైలజ కూడా.

“ఏమిటా ఇంజన్‌ స్టార్ట్‌ చేయడం…”

“మీరు రోజూ అలాగే స్టార్ట్‌ చేస్తారుగా?” అంది శైలజ బిక్కమొహంతో.

ఇప్పటి వరకు గట్టిగా ఒక్క మాట కూడా అనని వాడు, ఒక్క సారిగా అంతలా కసురుకోవడం, కళ్ళెర్ర జేయడం వింతగాను కొంచెం భయంగానూ అనిపించింది శైలజకు.

“నేనలా చేస్తానా? నేను కారు స్టార్ట్‌ చేస్తే ఎప్పుడైనా శబ్దం వచ్చిందా?” ఇంకా ఆవేశం తగ్గలేదు మధుకు.

అంతలా ఆవేశపడుతున్న భర్తతో ఇంకా వాదన పెంచడం అనవసరమనుకుంది శైలజ.

కారు దిగి, వెనుక సీట్లో కూర్చుంది తలవంచుకుని. రెండు నిమిషాల పాటు మౌనంగా వున్నారిద్దరూ.

“వెనుక కూర్చుంటే డ్రైవింగెలా వస్తుంది? మరలా ట్రై చెయ్యి.” లాలనగా అన్నాడు మధు, కారు తాళాల చేతిని శైలజ ముందుకు చాపి.

కామ్‌గా వున్న శైలును చూసి,”ఇంజన్‌ అంతలా శబ్దం చేసేసరికి… ఏమౌతుందోనని కంగారు పడ్డాను. దాంతో కొంచెం కోపమొచ్చింది. ఇంకాస్త లేటు చేస్తే ముహూర్తం దాటి పోతుంది. అబ్బ టైం వేస్టు చేయకుండా రా!” మళ్ళీ బతిమాలాడే ధోరణిలో పడ్డాడు మధు.

“ఎంత ఇంజన్‌ సౌండు గట్టిగా వస్తే మాత్రం… అంతలా అరుస్తాడా. పెళ్ళైన ఆరు నెలల్లోనే ఇంతలా అరిస్తే ముందు ముందు ఇంకెలా వుంటాడో! తనెంత బతిమిలాడినా ఈ సారి మాత్రం కరిగేది లేదు. అసలు నేనంటే ఏమనుకుంటున్నాడు? సహాయ నిరాకరణ, సత్యాగ్రహం కలిపి ప్రయోగించాలి. ఈ మగాళ్ళంతా ఇంతే. ఎప్పుడు కోప్పడతారో, ఎప్పుడు విసుక్కుంటారో, ఎప్పుడు గడ్డం పట్టుకుంటారో, ఎప్పుడు చెంపలేసుకుంటారో… ఎవరికీ తెలీదు. రెండు రోజులు మాట్లాడకుండా వంట చేయకుండా దుప్పటి ముసుగేసుకు పడుకుంటే దెబ్బకి దారిలోకొస్తాడు!” అనుకుంది శైలజ.

పది, పదిహేను నిమిషాల పాటు బతిమాడినా కరగని పెళ్ళాన్ని చూసి, ఇంటికెళ్ళాక కరిగించే ప్రయత్నం చెయ్యొచ్చని కారు స్టార్ట్‌ చేశాడు కావాలనే రోజూ కంటే ఇంజన్‌ సౌండు ఎక్కువొచ్చేలా.

“అరే నువ్వన్నది నిజమే… సౌండు ఎక్కువే వస్తోంది. ఓ సారి డీలర్‌కు చూపించాలి,” అన్నాడు శైలజ వైపు తిరిగి.

ఆమె మాత్రం వర్షించబోయే మేఘంలా కనిపించింది.


కారు పార్క్‌ చేసి, అపార్మ్టెంట్‌ లోకి వెళ్ళే దారిలో కూడా, ‘ఇంజన్‌ ఎక్కువ శబ్దం చేయడానికి కారణం శైలజ కానేకాదని,అసలు టయోటా కామ్రీలన్నీ కొత్తలో అలాగే గోలెడతాయని, ఇదే విషయం గురించి తరచూ టయోటా వాళ్ళకు కంప్లైంట్లు కూడా వెళుతుంటా’యని చెప్పి శైలజను కన్విన్స్‌ చేయబోయాడు. ఇంట్లోకి వెళ్ళాక కూడా ఆ జోకులూ, ఈ జోకులూ చెప్పి నవ్వించాలని ప్రయత్నించాడు.

“శైలూ… ఈ రోజు డిన్నర్‌ నేను వేడి చేస్తాను. నువ్వు డ్రెస్సు మార్చుకుని వచ్చెయ్‌,” అని కిచెన్‌లోకి నడిచేడు మధు.

గుత్తివంకాయ కూర, కాకర కాయ వేపుడు, ఘుమ ఘుమ లాడే రసం, వహ్వా! అన్నీ నాకిష్టమైన కూరలే చేసిందీవేళ అనుకున్నాడు మధు.

శైలజ అవేమీ పట్టించుకోకుండా నేరుగా బెడ్‌రూం లోకి వెళ్ళింది.

“ఏమిటి శైలు, అన్నం తినకుండా నిద్రపోతావా?” అడిగేడు మధు.

మౌనమే సమాధానం.

“పొరపాటున కోపగించుకున్నానని చెప్పేనా?”

“…”

“అలా అలిగితే నేనూ అలుగుతాను.”

“…”

“నాకూ అన్నం వద్దు.” అంటూ డ్రెస్‌ చేంజ్‌ చేసుకుని పడుకున్నాడు మధు.

ఎంత మొండితనం… కొత్త కారు కేమన్నా ఔతుందన్న కంగారులో గట్టిగా అరిస్తే అరిచి వుండొచ్చు. తిట్టానా, కొట్టానా? ఈ మాత్రం దానికే ఇంత అలగాలా? ఇంకా మనం బతిమాడితే మరీ చులకనైపోతాం. అరే… ఏదో ఓ మెట్టు దిగి తప్పై పోయిందన్నా వినుకోదే. తనేనా అంత పట్టుదలతో వుండేది. నేనూ వుండగలను. ఏదో ఈ గొడవ అన్నం తిన్న తర్వాత జరిగినా బాగుండేది. ఇప్పుడేమో కడుపులో పేగులు ఆకలి రాగం పాడుతున్నై. తను ఏదైనా ఒక్క మాట మాట్లాడినా సంధి ఒప్పందం మీద సైన్‌చేసి ముందు ఆకలి గోలనాపాలి.” అనుకున్నాడు మధు మంచానికి మరోవైపున.

శైలజ కోపాన్ని కూడా ఆకలి డామినేట్‌చేయడం మొదలెట్టింది.

“అబ్బ ఆకలి…” మూలిగేడు మధు.

ఆ మూలగడం నటనలో భాగమని తెలిసినా “ఆకలైతే వెళ్ళి తినొచ్చు. ఇక్కడ మూలిగి ప్రక్క వాళ్ళ నిద్ర చెడగొట్టనక్కరలేదు,” అంది శైలజ గోడతో మాట్లాడుతున్నట్లు.

“నాకొక్కడికీ వంటింట్లోకి వెళ్ళాలంటే భయం.”

“వూరికే తిట్టడానికి, అరవడానికి మాత్రం భయముండదు”

“ఏదో కారు పాడౌతుందన్న ఆదుర్దాలో అలా అన్నానని చెప్పానుకదా… పద వెళ్ళి అన్నం తిందాం.”

“స్టార్ట్‌ చేస్తేనే పాడయ్యే కారును అంత పోసి ఎందుకు కొన్నట్లో… ఐనా నన్నెందుకలా తిట్టి ఏడిపించారూ? సారీ చెబితేనే నేనన్నం తింటాను?”

“అబ్బా తప్పైందంటున్నాను కదా. సారీ… ఇంకెప్పుడూ కోప్పడను… రేపు డ్రైవింగ్‌ ప్రాక్టీసుకు వెళ్ళినప్పుడు నిన్నొక్క మాటంటే అప్పుడడుగు.”

“మీతో మళ్ళీ డ్రైవింగ్‌ ప్రాక్టిసుకొస్తే ఒట్టు.”

“మరి డ్రైవింగెలాగ?”

“నా తంటాలేవో నేను పడతాను. అంతే గానీ మీ దగ్గర మళ్ళీ డ్రైవింగ్‌ నేర్చుకోడమా?”

అలా మొదలైన మాటలు ఐదు నిమిషాల తర్వాత ఇద్దరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సాగాయి. డైనింగ్‌టేబిల్‌మీది కూరలు మళ్ళీ మైక్రోవేవ్‌లో వేడెక్కాయి. ఇకముందు పోట్లాడుకోకూడదనుకుంటూ భోజనం ముగించేరు. తర్వాత రెండు దేశాల మధ్య యుద్దం ముగిసేక గెలిచిన దేశంలో ఓడిపోయిన దేశం కలిసినట్లు… ఓడిన దేశంలో గెలిచిన దేశం కలిసినట్లూ… ఒకరి ఒడిలో ఒకరు ఒదిగిపోయారు.

ఆ విధంగా ముగిసింది డ్రైవింగ్‌ప్రాక్టీసు మొదటిరోజు.


ఆ మర్నాడు నిన్నటి డ్రైవింగ్‌ప్రాక్టీసు తాలూకు తుఫాను చాయలక్కడక్కడా ఇంట్లో కనిపించినా, పెద్దగా ప్రభావమైతే లేదు. సాయంత్రం వర్క్‌నుంచి వచ్చేక, “డ్రైవింగ్‌ప్రాక్టీసు చేస్తావా?” అడిగేడు మధు.

“నీతో ప్రాక్టీసంటే మళ్ళీ ఇద్దరం అరచుకోడం తిట్టు కోడమేగా!”

“నిన్నంటే అలా జరిగింది. రోజూ అలా జరగాలని రూలేం లేదుగా రెడీ అవు వెళ్దాం” అన్నాడు మధు.

డ్రైవింగ్‌క్లాసు జరిగేప్పుడు శైలజ ఏమైనా చిన్న పొరపాట్లు చేసినా విసుక్కోకూడదు, కోప్పడకూడదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అలగ కూడదు… లాంటి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. శైలజ ఐతే ఒప్పందాలన్నింటిని పేపర్‌మీద వ్రాసి ఇద్దరూ సంతకాలు చేస్తే ఇంకా బాగుంటుందని ముందు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రతిపాదించింది.
కానీ ఆ తతంగమంతా మరీ అతిగా వుంటుందని మధుబాబు అంగీకరించలేదు. మన జాగర్తలో మనముంటే మంచిదని ఒప్పందాలపై ఒట్లు పెట్టుకున్నారు.

తర్వాత నాలుగు రోజులపాటు డ్రైవింగ్‌ క్లాసులు పూర్తిగా సామరస్య పూరక వాతావరణంలో జరక్క పోయినా అలిగి అన్నాలు మానేసే స్ధాయికి వెళ్ళినా తినడం మాత్రం వాళ్ళెప్పుడూ మానెయ్యలేదు. భర్త విసుక్కోవడం, కోపంగా అరవడం భార్య కసురుకోడం, మూతి ముడుచుకోడం… లాంటి చెదురుమదురు సంఘటనలు జరిగినా, అక్కౌంట్లన్నీ ఏరోజు కారోజు సెటిల్‌ చేసుకునేవాళ్ళు. ఒక శుక్రవారం సాయంత్రం యధాప్రకారం ఒకరినొకరు తిట్టుకోరాదని ఒట్లు వేసుకుని బయల్దేరారు.

ఆ మర్నాడే శైలజ డ్రైవింగ్‌ టెస్ట్‌ ఇస్తోంది. బెండకాయ వేపుడు తాలూకు వాసన చూసిన మధు ముందుచూపుతో భోజనం చేసి బయల్దేరదామన్నాడు. కానీ ఒప్పందాలపైనా, ఒట్టులపైనా అపారమైన విశ్వాసంగల శైలజ అందుకు ఒప్పుకోలేదు.

శైలజ డ్రైవింగ్‌లో చాలా తేడా కనబడుతోంది. మొదటి రోజు కంటే చాలా బాగా డ్రైవ్‌ చేస్తోంది. మధు కూడా చాలా ఆశ్చర్య పోయాడు.

“చాలా ఇంప్రూవయ్యావు శైలూ. కాకపోతే మరీ అంత స్లోగా వెళ్ళకూడదు. ఒక్కోసారి ఆగేప్పుడు ఇప్పుడేస్తున్నట్లు సడన్‌గా బ్రేకు వెయ్యకూడదు,” అన్నాడు మధు.

“అంత స్లోగా వెళుతున్నానా…” అంటూ ఒక్క సారిగా స్పీడు పెంచింది శైలజ.

“మరీ అంత స్పీడొద్దు, కొంచెం స్లో చెయ్యి,” అని ఎదురుగా నాలుగు రోడ్ల కూడలికి ముందున్న ఆల్‌వే స్టాపు సైను దగ్గరవడం చూసి, “అరె… ఆపు… ఇక్కడాపు… స్టాపు సైనుందాపు…” పెద్దగా అరిచేడు మధు.

కంగారుగా ఆపడానికి ట్రై చేసినా వెంటనే ఆగలేదు కారు. కీచుమని శబ్దం చేస్తూ నాలుగు రోడ్ల కూడలిలో అడ్డంగా తిరిగి ఆగింది.

లక్కీగా రోడ్డు మీద ట్రాఫిక్కేమీ లేదు.

శైలజ చేతులు స్టీరింగ్‌ మీద బిగుసుకుపోయి వణుకుతున్నై. ప్రక్క సీట్లోని మధు వైపు చూసింది. తను కూడా పళ్ళు బిగించి, కళ్ళు పెద్దవి చేసి శైలజ వైపు వణుకుతూ చూస్తున్నాడు.
నిమిషం తర్వాత శైలజే ముందుగా తేరుకుని, కారును రైటుకు తిప్పి, కర్బ్‌ ప్రక్కనే పార్క్‌ చేసింది.

“ఎందుకంతలా అరిచేరు?” అనడిగింది మధు వైపు కోపంగా చూస్తూ.

“ఈ రోడ్డు మీద ఇప్పుడు ట్రాఫిక్‌ వుంటే మన పని ఏమయ్యేది. ఏంటా డ్రైవింగ్‌? పైగా ఎందుకు అరిచావంటావా?” అంత పెద్దగా మధు అరవగలడని శైలజకు అప్పుడే తెలిసింది.

శైలజ మొహం కోపంతో ఎర్రగా కందిపోయింది.

“నువ్వలా పెద్దగా అరిచి కంగారు పెట్టకపోతే, నేను స్టాప్‌సైను దగ్గర మామూలుగానే ఆగేదాన్ని. అనవసరంగా బీపీ పెంచుకుని అరిచి నన్ను కంగారు పెట్టావ్‌,” అంది శైలజ.

తప్పు నీదంటే, నీదే ననుకుంటూ ఇల్లు చేరేరు. ఒకరినొకరు నోరు మూసుకోమనే వరకు మాటలు సాగేయి. ఆపైన ఇద్దరి మధ్యా మాటలే లేవు.

మధు బెడ్‌రూంలో పడుకుంటే శైలజ హాల్లో పడుకుంది.


మరుసటి రోజు మధ్యాహ్నం, బద్రి వాళ్ళు వచ్చే వరకు ఇద్దరి మధ్యా ఎలాంటి మాటలూ లేవు.

బద్రి, సుజాతలు మధు వాళ్ళుండే అపార్మ్టెంట్‌ కాంప్లెక్స్‌లోనే వుంటారు. అమెరికా వచ్చి నాలుగేళ్ళవుతోంది. మధుబాబుకు, బద్రికీ దూరపు చుట్టరికం కూడా వుండడంతో ఒక్కోసారి చెప్పా పెట్టకుండా వీళ్ళింటికి వాళ్ళు వస్తూంటారు, వాళ్ళింటికి వీళ్ళూ వెళుతూంటారు.

వచ్చిన రెండు నిమిషాల్లో మధు శైలజలు గొడవ పడ్డట్టు అర్ధమైపోయింది బద్రీ వాళ్ళకు. ఆమాట ఈమాటా అయ్యేక డ్రైవింగ్‌నేర్చుకోడం ఎంతవరకూ వచ్చిందని అడిగేడు బద్రి శైలజ నుద్దేశించి. ఏదో అలా జరుగుతోందని చెప్పింది శైలజ.

అంతకు మునుపున్న వుత్సాహం శైలజలో కనిపించక పోయేసరికి సుజాత అడిగింది “ఏమిటి ఇద్దరి మధ్యా ఫైటయ్యిందా”అని. ఇద్దరూ మాట్లాడలేదు.

“పొద్దున గానీ, నిన్న గానీ డ్రైవింగ్‌ ప్రాక్టీసుకెళ్ళారా?”అడిగేడు బద్రి చిరునవ్వుతో.

నిన్న వెళ్ళామని చెప్పారిద్దరూ.

“మరదీ సంగతి… బాగా పోట్లాడుకున్నారా?” నవ్వుతూ అడిగేడు బద్రి.

మాట్లాడలేదిద్దరూ.

“ఇదిగో శైలూ, భర్తల దగ్గర డ్రైవింగ్‌ నేర్చుకునేప్పుడు గొడవలు మామూలే. వాటిని పార్కింగ్‌లాట్‌ లోనే మర్చిపోవాలి. ఇంట్లోకి మోసుకు రాకూడదు,” చెప్పింది సుజాత.

“మీరు నేర్చుకునేప్పుడు, మీ మధ్య కూడా గొడవలయ్యేవా?” ఆశ్చర్యంగా అడిగేడు మధు.

“అబ్బే మా మధ్య గొడవలే జరగలేదు. నా సంగతి నీకు తెలుసుగా మధూ, నా సహనం, ఓర్పూ…” అన్నాడు బద్రి, సుజాత వైపు చూసి కన్ను గీటుతూ.

“నిజంగా మీ మధ్య గొడవలేమీ జరగలేదా?!” ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టాడు మధు బద్రి వంక, సుజాత వంక అపనమ్మకంగా చూస్తూ.

“మరే! ఈయన గారి ఓర్పు గురించి, సహనం గురించే చెప్పుకోవాలి. ఆయనన్నీ అలాగే చెబుతారు మధూ. నేను డ్రైవింగ్‌ నేర్చుకునేప్పుడోసారి గొడవై, ఈయన దగ్గరనుంచి విడాకులు తీసుకుందామనుకున్నా. తర్వాత తనే ఓ వారం రోజులు బతిమిలాడి చెంపలేసుకున్నారు,” చెప్పింది సుజాత, బద్రి వైపు కొంటెగా చూసి నవ్వుతూ.

“అప్పుడు విడాకులు తీసుకున్నా పోయేది. ఇప్పుడు ప్రశాంతంగా వుండేవాణ్ణి!” అన్నాడు బద్రి, సుజాతను వెక్కిరిస్తూ.

“అలాగా పాపం… ఇప్పుడు కావాలన్నా విడాకులివ్వడానికి నేను రెడీ,” చెప్పింది సుజాత.

“ఇంక ఆపు సుజీ… వాళ్ళు నిజమేననుకుంటారు,” అన్నాడు బద్రి.

“నిజంగా మీ మధ్య అంత పెద్ద గొడవలయ్యాయా?” ఆశ్చర్యంగా అడిగింది శైలజ.

“అబ్బే… అంత దూరం వెళ్ళలేదులే… అవును సుజాతా! వెస్లీ స్కూల్‌గ్రౌండ్‌లో జరిగింది ఇంకా నీకు గుర్తుందా?” అడిగేడు బద్రి.

“గుర్తు లేకేం మహానుభావా! అప్పుడేగా ఓ రోజంతా ఇద్దరం నిరాహార దీక్ష చేసింది,” అంది సుజాత.

“కాబట్టి భార్యలకు భర్తలు డ్రైవింగ్‌ నేర్పడం… నేర్చుకునే ప్రక్రియలో ఇద్దరూ దెబ్బలాడుకోవడం… తర్వాత వాటన్నింటినీ ప్రణయకలహాలుగా గుర్తుంచుకొని తర్వాత నవ్వుకోడం… ఇదంతా సర్వ సాధారణ విషయం. డ్రైవింగ్‌ నేర్పించేటప్పుడు భర్తల నుండి బయటపడే కోపం, భార్య మీద పొంగే ప్రేమకు కొలమానం. ప్రేమ ఎంత ఎక్కువ వుంటే అంత ఎక్కువ కోప్పడతారన్న మాట. ఇంతకీ ఎప్పుడమ్మా నీ రోడ్‌ టెస్ట్‌?” అడిగేడు బద్రి శైలజను.

“మధ్యాహ్నమేనండి…” చెప్పింది శైలజ బద్రి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ.

“మరయితే త్వరగా రెడీ కండి. మేము మరలా సాయంత్రం కలుస్తాం,” అంది సుజాత సోఫా లోంచి లేస్తూ.

“బెస్టాఫ్‌లక్కమ్మా. లైసెన్స్‌ వస్తే సాయంత్రం మమ్మల్ని డిన్నర్‌కు తీసుకెళ్దువు,” అన్నాడు బద్రి బయటకు నడుస్తూ.

“కాఫీ తాగి వెళ్దురు కూర్చోండి,” అన్నాడు మధుబాబు.

“లేదు లేవోయ్‌! ఎలాగూ సాయంత్రం వస్తాముగా,” అంటూ బయల్దేరారు బద్రి, సుజాత.

వాళ్ళు బయటకు వెళ్ళేక, అయ్యో టైమవుతోందే అనుకుంటూ గబగబ రెడీ అవడం మొదలెట్టారు మధు, శైలజ.


డ్రైవింగ్‌టెస్ట్‌ అపాయింట్మెంట్‌కు గంట ముందే డి.ఎమ్‌. వీ. ఆఫీసుకు చేరుకున్నారిద్దరూ. దారిలో ఇద్దరి మధ్యా మాటలు ఇండైరెక్ట్‌ స్పీచ్‌లోనే సాగినై.

అంటే, “స్టాప్‌ సైనులు చూసుకుని డ్రైవ్‌ చేస్తే బాగుంటుంది,” అని మధు అంటే “ఆ విషయం మాకు తెల్సు. ఏడాదిగా డ్రైవింగ్‌ చేస్తున్నవాళ్ళు ఈల్డ్‌ దగ్గర ఎలా వెళ్ళాలో నేర్చుకుంటే మంచిది” అంది శైలజ విండో అద్దం లోకి చూసి. “పదిహేను వేల మైళ్ళ ఎక్స్పీరియన్సు వున్న నాలాంటి వాళ్ళు పొరపాట్లంటూ చేయరు చేసినా ఎల్లాంటి ప్రమాదమూ లేకుండా బయట పడతారు,” అని విండో అద్దం వైపు మొహం పెట్టి చెప్పాడు మధు.

అలా రెండు విండో అద్దాలతో సంభాషణ జరుగుతూండగానే, ఆఫీసు వచ్చింది. కౌంటర్‌లో రిపోర్ట్‌చేసేక ఓ పావు గంటకు శైలజను పిలిచారు. టెస్ట్‌కు బయలుదేరబోయే ముందు “బెస్టాఫ్‌లక్‌” చెప్పాడు మధు.

పావు గంట లో కారు తిరిగి డీ. ఎం. వి. ఆవరణ లోకి ప్రవేశించింది.

ఉత్కంఠతో శైలజ వైపు చూసేడు. మౌనంగా తలొంచుకుని, “ఇంకోసారి రోడ్‌టెస్ట్‌కు అపాయింట్మెంట్‌ తీసుకొని వస్తా”నంటూ ఆఫీసు లోపలకు వెళ్ళింది.

‘అంటే టెస్ట్‌ పోయిందన్న మాట. మొదటి సారి కొంచెం కష్టమేలే. ఐనా నేను చెప్పినట్లు తను నేర్చుకుంటే కదా… ఈ సారి డబ్బులు పోతే పోయాయి, ఎవరైనా ఇన్స్ర్టక్టర్‌ దగ్గర రెండు మూడు క్లాసులిప్పిస్తే సరి. నేను పేషెన్స్‌ లేకుండా విసుక్కోవడం, రోజూ ఇద్దరం గొడవ పడ్డం, ఈ గోలంతా ఎందుకు?’ అని ఆలోచిస్తూండగానే వచ్చేసింది శైలజ.

“మరేం వర్రీ కాకు… ఇంకొంచెం ప్రాక్టీసు చేసి వస్తే ఈ సారి గేరంటీగా వస్తుంది,” వూరడించ బోయాడు.

మధు కళ్ళలోకి చూసి చిలిపిగా నవ్వుతూ, చేతిలోని లైసెన్స్‌ పేపర్ను మధు చేతికి ఇచ్చింది.

“అమ్మ దొంగా… మరి లైసెన్స్‌ వచ్చినట్లు చెప్పలేదేం? చూడు నేను ఓర్పుగా నేర్పబట్టి ఇంత త్వరగా, అదీ ఫస్ట్‌టైమే నీకు లైసెన్స్‌ వచ్చింది,” అన్నాడు మధు.
“నువ్వు ఓర్పుగా నేర్పావా మహానుభావా? ఏది… ఇలా నా కళ్ళలోకి చూసి చెప్పు… నేను కష్టపడి నీ చేత తిట్లు తింటూ… సహనంతో ప్రాక్టీసు చేయబట్టి వచ్చింది,” అంది శైలజ పాత గొడవలనూ అలకలనూ బుజ్జగింపులనూ గుర్తు చేసుకుంటూ.

“నువ్వు ఎన్నైనా చెప్పవోయ్‌… నేను ఓపిగ్గా నేర్పబట్టే నీకు లైసెన్స్‌ వచ్చింది,” అంటూ, శైలజ చేతిలోంచి కారు తాళాలు తీసుకున్నాడు మధు.

“తాళాలు తీసుకుంటారేం… నేను డ్రైవ్‌ చేస్తానుగా,” అంది శైలజ.

“లైసెన్స్‌ వచ్చిందిగా! తర్వాతెప్పుడైనా చేద్దువులే. మీ అమ్మ కెప్పుడు ఫోను చేస్తావ్‌ లైసెన్స్‌ గురించి చెప్పడానికి? వెళ్ళగానే సుజాతకు కాల్‌ చేసి చెప్పు సాయంత్రం మనింటికి రమ్మని…” అంటూ కారు స్టార్ట్‌ చేశాడు మధు.