పోతన భాగవతంలో దృశ్యీకరణం – 1

ఉపక్రమణిక

వేదవ్యాసమహర్షి ఇతర పురాణాలన్నీ రచించిన తర్వాత, వాటన్నింటిలోని సారాన్నంతటినీ గ్రహించి పోతపోసి భాగవతం సృష్టించారని పద్మపురాణంలో ఉంది. భాగవతాన్ని శుకయోగీంద్రుడు, పరీక్షిత్తు మహారాజుకు ఉపదేశించారు.

తెలుగు సాహిత్యంలో పండితుల ప్రశంసలను, పాఠకుల ఆదరణను పొందిన గ్రంథం పోతన భాగవతం. రెండు మూడు దశకాల పూర్వం వరకూ పోతన పద్యాలను వల్లెవేయని తెలుగు వారు వుండేవారు కాదన్నది అతిశయోక్తి కాదు. అలాగే భాగవతంలోని కొన్ని కథలు జనబహుళ్యంలో అత్యంత ప్రాచుర్యం పొందాయి.

భాగవత ప్రాశస్త్యం

భాగవత పురాణం గొప్పదనం గురించి పోతన చెప్పిన ఒక శ్లేష పద్యం –

లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతా శోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాలవాలంబు నై,
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.

(పోతన భాగవతము, ప్రథమ స్కంధం, 22)

ఈ పద్యంలో కల్పవృక్షపు లక్షణాలను చెబుతున్న అర్థం ఒకటి, భాగవతం గురించి చెప్పిన అర్థం మరొకటి కనిపిస్తాయి.

భాగవతం అనేది కల్పవృక్షం. చూడ ముచ్చటైన కాండం కలది కల్పవృక్షం. చేవదేరిన నల్లనైన మూలము కలది. చిలకల పలుకులచే మనోహరమైనది. అందమైన తీగలతో అలరారునది. రంగురంగుల పూల గుత్తులతో విరాజిల్లు వృక్షం. అతిసుందరమైన గుండ్రని ఆకారం కలది. పెద్ద ఫలాన్ని కలిగినది. స్వచ్ఛమైన, విస్తారంగా ఉండే పాదు కలది. మంచి మంచి పక్షులకు ఆలవాలమై, వాటికి మేలు చేకూర్చుతూ భూమిపైన శోభతో ప్రకాశించే వృక్షం కల్పవృక్షం. ఇది మామూలుగా
కనిపించే అర్థం.

అందమైన స్కంధాలు(పన్నెండు) కలిగినట్టిది. శ్రీకృష్ణపరమాత్ముడే మూలంగా కలిగినది. శుకయోగీంద్రుని ప్రవచనాలచే మనోజ్ఞమైనది. సద్గుణులైన పండితులచే సేవింపదగినది. సుమనోహరమైన ఇతివృత్తంతో అలరారునది. పవిత్రమైన వ్యాసుని పాదుగా గలది. సజ్జనలకు, బ్రహ్మవేత్తలకు శుభం చేకూర్చునట్టి భాగవతం అనే కల్పవృక్షం భూమి మీద అత్యంత శోభతో ప్రకాశిస్తూ వుంది.

భాగవతం ప్రాశస్త్యాన్ని అత్యంత మనోజ్ఞంగా చూపిన పద్యమిది.

చాలా మంది భక్తులు భాగవతంలోని భీష్మస్తుతి, కుంతీస్తుతి మొదలైన స్తోత్రాలను తెల్లవారుఝామున పారాయణం చేస్తారు. రుక్మిణీ కల్యాణం పారాయణం చేస్తే పెళ్ళికి ఎదిగిన అమ్మాయిలకు మంచి వరుడితో త్వరగా వివాహాలు జరుగుతాయని, గజేంద్ర మోక్షణం కథను పఠిస్తే ఈతి బాధలనుంచి విమోచనం లభిస్తుందని చాలా మంది విశ్వాసం. ఇప్పటికీ తెలుగునాట భాగవత సప్తాహాలకు మంచి ఆదరణ వుంది.

ఆదికవి నన్నయ కవిత్వగుణాలలో ఒకటైన అక్షరరమ్యత పోతన పద్యాలలో అత్యంత సుందరంగా కనిపిస్తుంది. కథల బలిమితో పాటు, అక్షరరమ్యతతో సాధించిన లయాత్మకత భాగవత పద్యాలను మక్కువతో వల్లెవేయడానికి, సామాన్యులు సైతం జ్ఞాపకముంచుకుని పదేపదే మననం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయని నా నమ్మకం. వీటన్నిటితో పాటు భాగవతంలోని మరో లక్షణం దృశ్యీకరణం.

పోతన భాగవతంలోని దృశ్యీకరణం అంశం మీద ఈ వ్యాసం వ్రాయడానికి నన్ను ప్రేరేపించినవి పోతన కవిత్వంతో బాటు వారి వ్యక్తిత్వం కూడా.

పోతన వ్యక్తిత్వం

భాగవతం అవతారికలో పోతన తన కవిత్వలక్షణాలను చెప్పారు. భాగవతాన్ని అనువదించడానికి కారణాలను కూడా వివరించారు. పోతన కవిత్వలక్షణాలను తదుపరి వ్యాసంలో వివరించేముందు వారి వ్యక్తిత్వం గురించి కొన్ని మాటలు.

పండితులు, సాహితీ చరిత్రకారులు పోతన వ్యక్తిత్వం గురించి చెప్పిన విషయాలను శ్రద్ధగా గమనించినప్పుడు ఆనాటి కవులలో పోతన ఒక విభిన్న వ్యక్తిత్వం కలవాడని తెలుస్తుంది. సాటి కవులు రాజాశ్రయాలలో జీవిస్తూ, రాజుల కోసమే రచనలు చేసి, తమ కావ్యాలను రాజులకు అంకితం చేస్తున్న కాలంలో కవిత్వానికి పవిత్రతను ఆపాదించి, కవిత్వాన్ని అమ్మకూడదన్న కట్టుబాటు పెట్టుకున్న కవి పోతన!

కాటుకకంటినీరు చనుకట్టుపయింబడ నేల ఏడ్చెదో!
కైటభదైత్యమర్దనుని గాదిలికోడల ఓ మదంబ ఓ
హాటకగర్భురాణి నినునాకటికై గొనిపోయి యల్ల క
ర్ణాటకిరాటకీచకుల కమ్మ ద్రిశుద్ధిగ, నమ్ము భారతీ!

పోతన వ్రాసినట్లు ప్రచారంలో ఉన్న ఒక చాటుపద్యమిది. దీని వెనుక ఒక చిన్న కథకూడా ప్రచారంలో ఉంది. పోతన ఒకరోజు పొలం దున్నుతూ చెమటలోడుస్తున్నాడట. అటుగా పల్లకీలో వెళుతున్న శ్రీనాథమహాకవి ‘బావా ఎందుకింత శ్రమ పడుతున్నావు. నువ్వు వ్రాస్తున్న భాగవతాన్ని ఏ రాజుకో, చక్రవర్తికో అంకితమిచ్చి నాలుగురాళ్ళు సంపాదించుకోవచ్చుకదా!’ అన్నాడట. పోతన నవ్వి ఊరుకున్నాడట. అప్పుడు సరస్వతీ దేవి, శ్రీనాథుడి మాట విని పోతన నన్ను ఏ రాజుకో అమ్మేస్తాడేమోనని భయపడిందట. ఆ రాత్రి పోతనకు కలలో కనబడి కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడ్చిందట. ‘ఏడవకు తల్లీ’ అని మనసార ఓదార్చుతూ, ‘నీకు ఎలాంటి కష్టం కలిగించనమ్మా, నిన్నెవరికీ అమ్మనమ్మా’ అని భరోసా ఇచ్చాడట పోతన!

ఈ పద్యంలో రాజులకు కావ్యాలను అంకితమివ్వడంపైన పోతన గారి అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఇలాంటి భావననే మరో విధంగా వ్యక్తం చేసిన ఇంకో చాటు పద్యం ‘బాలరసాలసాల …’

1 ‘బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్
గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి గహనాంతరసీమల కందమూల కౌ
ద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై’

ఈ పద్యం మంచన గారి కేయూరబాహు చరిత్రలోని ఈ క్రింది పద్యానికి పోలినది. మొదటి పాదంలో ఒక పదం, మూడవ పాదంలో కొన్ని పదాల మార్పు తప్పించి రెండు పద్యాలు ఒకటే. సాహితీచరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, మంచన పోతనకంటే ముందు కవి. క్రీ.శ. 1300 ప్రాంతాలలోని వాడంటారు.  

బాలరసాలపుష్ప నవపల్లవ కోమల కావ్య కన్యకన్
గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి మరి యంతకు నాయతి లేనినాడు/ కౌ
ద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై

భాగవతం ప్రథమస్కంధంలోని కృతిపతినిర్ణయములో కూడా ఇలాంటి భావననే వ్యక్తం చేసిన మరొక పద్యం –

ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు, వాహనంబులున్,
సొమ్ములుగొన్ని పుచ్చికొని , చొక్కి, శరీరము వాసి,కాలుచే
సమ్మెట వ్రేటులంబడక, సమ్మతితో హరికిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్.
(పోతన భాగవతము, ప్రథమ స్కంధం – 13)

‘అధములైన ఈ రాజులకు కావ్యాలను అంకితమిచ్చి, వారు ఇచ్చే అగ్రహారాలను, వాహనాలను, ఆభరణాలను, కానుకలను తీసుకుని, ఆనందంగా ఇక్కడ జీవించి, మరణం తర్వాత యముడితో సమ్మెట దెబ్బలు తినకుండా, బమ్మెర పోతన అనే వాడొకడు లోక శ్రేయస్సుకోసం తన భాగవతకావ్యాన్ని శ్రీహరికి మనఃపూర్వకంగా అంకితమిస్తున్నాడు’ అని పోతనే చెప్పారు.

కావ్యాలను రాజుల కోసం వ్రాసి అంకితమిచ్చిన కవులేదో తప్పుచేసారని కాదు. కానీ ఒక విశ్వాసానికి కట్టుబడి పాటించిన పోతన వ్యక్తిత్వం నాకు నచ్చింది.

వామనచరిత్ర, గజేంద్ర మోక్షణం ఘట్టాలు

ఈ వ్యాసంలో పోతన భాగవతంలోని అష్టమ స్కంధంలోని వామనచరిత్ర, గజేంద్ర మోక్షణం ఘట్టాలలోని కొన్ని సందర్భాలను ఎన్నుకుని, ఆయా సందర్భాలలోని దృశ్యీకరణలను స్థూలంగా పరిశీలించాను. ఈ ఘట్టాలనే ఎన్నుకోవడానికి వ్యక్తిగతమైన అభిరుచితోపాటు, ఆ ఘట్టాలలో దృశ్యీకరణ మరింత మెరుగుగా ఉందనిపించడం కూడ కారణమే.

పోతన భాగవతాన్ని చదువుతున్నప్పుడు, చాలా సందర్భాలలో అక్కడ జరుగుతున్న సన్నివేశాలు నా కళ్ళ ముందు కనిపిస్తున్న అనుభూతి కలిగింది. అలా అనుభూతిని కలిగించడానికి ఆ సన్నివేశాలు, ఆ సన్నివేశాలను అక్షరీకరించిన తీరు కారణాలుగా అనిపించాయి.

భాషను, అలంకారాలను, ఛందస్సును, ఊహాశక్తిని ఉపయోగించి కథలో జరుగుతున్న సన్నివేశాన్ని పాఠకుల కళ్ళముందు నిలపడానికి కవులు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా సన్నివేశానికి సరిపోయే భాష, అనువైన శబ్దార్థాలంకారాల సహకారంతో పాఠకుని మనోనేత్రం ముందు జరుగుతున్న సన్నివేశాన్ని నిలిపే యత్నం చేస్తారు. కవులు చేసే ఈ ప్రయత్నాలను మనం అన్ని కావ్యాలలోనూ గమనించవచ్చు. ఈ ప్రయత్నాలలో సన్నివేశం కూడా సహకరించాలి. సన్నివేశ బలం లేనప్పుడు కళ్లకు కట్టినట్లు చెప్పాలన్న కవి ప్రయత్నాలన్నీ నిష్ఫలమవుతాయి.

భాగవతమంటే భగవంతుని కథలే కదా! కథలను పాఠకుని మనసుకు హత్తుకునేలా చెప్పడమంటే, పాఠకుని కళ్ళ ముందు కథను నిలపాలి. అందుకే పోతన ఈ గ్రంథరచనకు దృశ్యీకరణ కథనశిల్పాన్ని ఎన్నుకుని వుంటారనిపిస్తుంది.

పూర్వపరిశోధనలు

ఇంతకు మునుపు చాలా మంది పండితులు పోతన భాగవతాన్ని పరిశీలించారు, పరిశోధించారు. పోతన భాగవతంలో భక్తితత్వం, తాత్త్వికాంశాలు, ఆలంకారిక వైభవం, ప్రతీకాత్మకత, భాగవతంలో స్త్రీ పాత్రలు, పోతన కవిత్వతత్త్వం మొదలైన విభిన్న కోణాల్లో భాగవతాన్ని పరిశీలించారు, విస్తృతంగా పరిశోధనలు చేసారు.

ఉదాహరణకు డా॥ ప్రసాదరాయ కులపతి గారు భాగవతం మీద చేసిన “ఆంధ్రభాగవత విమర్శ” లో భాగవత మూలాలను పరిశోధించారు. డా॥ శ్రీరామమూర్తి ధూళిపాల గారు తమ సిద్ధాంత వ్యాసం “శ్రీమదాంధ్ర మహాభాగవతానుశీలనం” లో భాగవతాన్ని సమగ్రంగా పరిశీలించారు. భాగవతంలోని ప్రతీకాత్మకత గురించి డా॥ వేంకటేశ్వర్లు వీపూరి గారు పరిశోధించారు. పోతన కవిత్వంలోని వ్యాకరణాంశాలను గురించి డా॥ పాండురంగశర్మ ఆర్ గారు, భాగవతకావ్యంలో అలంకారప్రయోగం
గురించి వెంకటమురళి గోదావరిగారు పరిశోధనాగ్రంథాన్ని వ్రాసారు. ఇంకా ఎందరో పోతన భాగవతాన్ని వివిధ కోణాలలో పరిశీలించి, పరిశోధించారు.

పరిశోధకులలో కొందరు అక్కడక్కడా పోతన దృశ్యచిత్రీకరణం గురించి ప్రస్తావించారు గాని పోతన భాగవతం కలిగించే సన్నివేశవీక్షణానుభూతి గురించి ఎవరూ లోతుగా పరిశీలించ లేదనిపించింది. ఒక భావాన్ని వర్ణించేటప్పుడు, ఆ భావం భౌతికస్థితిలో ఎలా ఉంటుంది, ఏయే వివరాలతో ఆ భావానికి ఒక రూపం ఇచ్చి, కదలాడే బొమ్మల రూపంలో చూపించవచ్చు అన్నది పోతన కవిత్వశిల్ప 2 రహస్యం అని నాకనిపిస్తుంది. దీనినే నేను ‘కవిత్వంలో దృశ్యీకరణం’ అంటున్నాను.

దృశ్యీకరణం

దృశ్యీకరణం అన్నది కవితాశిల్పానికి సంబంధించిన అంశం. దృశ్యీకరణం గురించి తరువాతి సంచికలలో స్థూలంగా వివరిస్తాను.

సంస్కృతం, తెలుగు వాఙ్మయాల్లో పోతనకు పూర్వం వచ్చిన కావ్యాలలో దృశ్యీకరణ అంశాలు కనిపిస్తాయి. మహాభారతంలోను, రామాయణంలోను, తర్వాత వచ్చిన కావ్యాలలోనూ దృశ్యీకరణలు కనిపిస్తాయి. పోతనకు పూర్వకవుల కావ్యాలలోని దృశ్యీకరణలను సంచికలలో స్థూలంగా పరిశీలిస్తాను.

ఈ కవిత్వశిల్పాన్నే ‘రూపశిల్పం’ అంటారు డా. ప్రసాదరాయకులపతిగారు తమ ‘ఆంధ్రభాగవత విమర్శ’ గ్రంథంలో(పుట – 119)

పోతనకు పూర్వం కవిత్వంలో కాలిబాటగా వున్న దృశ్యీకరణను, సుందరమైన రహదారిగా మార్చడానికి పోతనామాత్యులు ప్రయత్నించారనిపించింది.

వామన చరిత్రనుంచి ఎన్నుకున్న దృశ్యీకరణలను సోదాహరణంగా రెండవ వ్యాసంలోనూ, గజేంద్ర మోక్షణంనుంచి ఎంచుకున్న దృశ్యీకరణలను మూడవ విడత వ్యాసంలో వివరిస్తాను.

భాగవతంలో పోతన అక్షరాలతో చిత్రీకరించిన దృశ్యాలకు, ఇప్పుడు అందుబాటులో ఉన్న ఛాయాగ్రహణసాంకేతికతతో ఎలా చిత్రీకరించవచ్చో సమన్వయించి, సందర్భోచితంగా వివరించడానికి వచ్చే రెండు, మూడు విడతల వ్యాసాలలో ప్రయత్నిస్తాను.

పోతనకు తర్వాత వచ్చిన కవుల రచనలలోనూ ఎన్నో దృశ్యీకరణలను చూడవచ్చు. అందరి కవుల రచనలను పరిశీలించడం, పరిశోధనావ్యాస పరిమితుల దృష్ట్యా చాలా కష్టమైన పని కనుక కొన్ని కావ్యాలను ఎంపిక చేసుకొని, ఆ కావ్యాలలో దృశ్యీకరణ సందర్భాలను నాలుగవ విడతలో పరిశీలిస్తాను.

దృశ్యీకరణం గురించి, పోతన కవిత్వలక్షణాల గురించి, పోతనకు పూర్వకవుల కవిత్వంలో దృశ్యీకరణం గురించి తరువాత సంచికలో పరిశీలిద్దాం.

(సశేషం)