పైకి అనిపిస్తుందేమో–
అలుముకున్న అమవస నిశిలో
నిజం ఒక దిక్కులేని సినీవాలి అని,
భయంతో కనిపించీ కనిపించక
దోబూచులాడే ఓ చంద్రరేఖ,
నిస్సహాయ నిటలాన వక్రరేఖ అని
గతించిన వెన్నెలల విషాద చారిక అని!
తరిమి తరిమి పైకి కవిసే చీకటి
ఆక్రమణల పెను భయమని
విశాలాకాశంలో నామరూపాలు లేకుండా
ఆ అజ్ఞాతంలోనే ముగిసిపోతుందని
తెలుపుకు నలుపు పూసిపూసి మార్చేస్తారని
అబద్ధం చెప్పి చెప్పి ఇదే నిజమంటారని!
తను బతికి వెలిగిపోవాలని కాదు దాని ఆక్రోశం
తనకు పురా వైభవం రావాలని కాదు ఆరాటం
రేఖామాత్రంగా నైనా మిగిలే యత్నం చేయకుంటే
తనకే కాదు,కౌముది ఉనికికే ప్రమాదమని
‘నిజం’ శాశ్వత సమాధిలో బిగిసి పోతుందని!
అమవస పద్మవ్యూహంలో నక్కిన
కౌముదీ సౌభద్రం సినీవాలి
అబద్ధాల చక్రవ్యూహంలో చిక్కిన
ఒంటరి అభిమన్యం నిజం- వాలీ, సోలీ!
వాలీ, సోలీ, కొస ప్రాణమనిపించినా
ఇది మరణించే పాండురం కాదు,
ఆ బాలపాండవం కాదు
రాబోయే పున్నమికిదే తొలి అంకురం!
కణకణల నిప్పైన నిజాన్ని దాచుకున్న శీతల గర్భం!