ఆలూరి బైరాగి కథల్లో తాత్త్విక చింతన, కవితా ధోరణి

బైరాగి నిజానికి కథకుడికన్నా, కవిగానే ముందు పరిచయం నాకు. ఎప్పుడో యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో, చుట్టూ ఉండే స్నేహితుల్లో ఒకరు, “ఈ కవిత చదువు” అని బైరాగి వ్రాసిన “రాస్కోల్నికోవ్” కవిత ఇచ్చారు. ‘నాకు కవిత్వం అంతగా అర్థం కాదే,’ అని సంశయిస్తూనే చదివాను. ఇదీ అని చెప్పలేని ఒక స్పర్శలా అనిపించింది. బహుశా కవిత్వానికుండాల్సిన లక్షణమే అది కాబోలు.

“మానవుడెంతటి యేకాకి” అన్న వాక్యంలో నిష్ప్రయోజనమూ, అర్థరహితమూ అయిన మానవ జాతి పరిణామం మొత్తం కళ్ళకు కట్టినట్టు అనిపించింది. ఆ తరవాత చాలా యేళ్ళకు, ఒక పత్రికలో “నాక్కొంచెం నమ్మకమివ్వు” చదివి అందులోని ఆశావాదానికీ, ఆత్మవిశ్వాసానికీ మొత్తంగా లొంగిపోయాను. యాదృచ్ఛికంగా కొన్నిసార్లూ, వెతుక్కొని ఇంకొన్నిసార్లూ ఆయన కథలు చదివినా అవి కవితల్లాగే అనిపించాయి నాకు.

“నాదగు బాహు బంధనంలో ఈ విశాల విశ్వాన్ని చుట్టేస్తా” నన్న కవి కథలు వ్రాసినా కవితలాగే అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది?

కవితా ధోరణీ, కవితాత్మకతతో పాటు బైరాగి కథల్లో కొట్టొచ్చినట్టు కనిపించే విశేషాలు ఇంకా చాలానే ఉన్నాయి. అయితే, అధివాస్తవికత, ప్రతీకాత్మకత, తాత్విక చింతనా చాలా కథల్లో కనిపించి ఆయన శైలినీ, రచనా శిల్పాన్ని పట్టిస్తాయి. చేయి తిరిగిన మగ్గం నేత పనివాడు సున్నితంగా జరీ పోగుల్ని చీరల్లో నేసినట్టు తన కథల్లో బ్రతుకుని గురించీ, మనుషుల గురించీ సున్నితమైన, నిగూఢమైన భాష్యాలు చేశారాయన.

ఒక భావాన్నో, ఆలోచననో కవితలో చెప్పడానికీ, కథలో వ్యక్తీకరించడానికీ చాల తేడా వుంది. కవిత్వం బహు కర్కశమైనది. అది ఒక్క అక్షరం కూడా అవసరమైన దానికంటే ఎక్కువ వుండడానికి ఒప్పుకోదు. ఎంతో లోతైన భావాన్ని, వీలైనంత క్లుప్తంగా వ్యక్తీకరించి, మిగతాదంతా చదువరి ఊహకూ, ఆలోచనకూ వదిలేసే ధైర్యం వుంటే కానీ గొప్ప కవిత్వం పుట్టదు. అదొక అంతుపట్టని శక్తి. గొప్ప అందగత్తె మేలి ముసుగులో కనపడీ కనపడనట్టుగానే, స్పష్టాస్పష్టంగా వినిపించి కవ్వించే కవిత్వంలో అమితమైన ఆకర్షణ ఉంటుంది. అదే సాంద్రతా, గాంభీర్యమూ కథల్లో అలవోకగా చూపించడమంటే ఎంతో ప్రజ్ఞ కావాలి. కొన్నిసార్లు సాధనతో అది అలవడ్డా, చాలావరకు అది స్వతస్సిద్ధమేమో అనిపిస్తుంది.

“జీవితం ప్రశ్నిస్తోంది ఎదురు తిరిగి, ఆత్మ నసుగుతోంది జవాబు తట్టక” అన్న కవితా పంక్తుల్లో ఎంత గాఢత వుందో, “నీ హృదయపు చీకటి గదిలో మేల్కొన్నవాడు,” (జేబుదొంగ) “నిదుర మగత కాదు, మెలకువకు పదును పెట్టే మగత,” “తీరికలతో కోరికలతో నిండి వుంది గాలి,” (స్వప్న సీమ) వంటి వాక్యాల్లోను అంతే గాఢత వుంది. ఆ వాక్యాలను ఇంకా విడమరచి చెప్పకుండా అక్కడితో ఆపేయటం, దానికి ఇంకా చిక్కదనాన్నీ, కవితాత్మకతనూ ఇచ్చింది. అయితే ఆ ప్రక్రియ చాలా అప్రయత్నంగా, అలవోకగా జరిగిపోయింది. ఇటువంటి వాక్యాలే “కన్నతల్లి” కథలో — “ఆకలికీ నిండుకడుపుకీ మధ్యనున్న ఇరుకు సందులో తన్నుకులాడాడు,” “జీవితపు గోడలో విచ్చిన పగుళ్ళను పని అనే సున్నంతో నింపాలని చూస్తూ వుంటుంది”.

ఇటువంటి వాక్యాలు చదివినప్పుడు కథకుడు కవిలా అనిపిస్తాడు. అంతే కాదు, తన కథల్లోని పాత్రలనూ, ఆ పాత్రల జీవితాలనీ ఒక రకమైన డిటాచ్‌మెంట్‌తో గమనిస్తూ ఈ వ్యాఖ్యల్ని యథాలాపంగా చేసినట్టు వుంటుంది ఆయన ధోరణి.

అదే డిటాచ్‌మెంట్ వల్ల ఆయన కథల్లో ఎంతో తాత్త్విక పరిశీలన, తాత్త్విక చింతన కనిపిస్తాయి. “అగాధపుటంచున” అనే కథలో బైరాగి ఆత్మహత్యలోని సంఘర్షణా, వేదనా అద్భుతంగా చిత్రీకరించాడు. “జీవితం మృత్యువులో వికసిస్తుంది, మృత్యువు జీవితంలో వాడిపొతుంది,” “తనకు మించిన శక్తిని గుర్తించి పరాజయం అంగీకరించడమే ఆత్మహత్య”, “ఆవేశాల అగ్నిలో కాలిపోయే మానవుని ఆత్మకు శాంతి యెక్కడ”, అని వ్యాఖ్యానిస్తాడు. ఈ కథ దాదాపు “రాస్కోల్నికోవ్” కవితకు కొనసాగింపేమో అనికూడా అనిపిస్తుంది.

“జేబుదొంగ” కథలో మనిషిలో దేవుణ్ణి చూసిన క్షణాన్నీ, చూడాల్సిన అవసరాన్నీ పెద్దగా వివరించడు కానీ, అలా చూడగలిగిన క్షణాన్ని “జీవితపు రక్తోజ్జ్వల ముక్తిక్షణమా” అని పిలుస్తాడు. అసలు ఈ కథ ఎత్తుగడే ఒక అద్భుతం. “మనిషీ దేవుడూ ఒక దశలో ఒకటే” అన్న భావన అర్థమవుతుంది కానీ, విచిత్రంగా ఈ కథలో వర్ణనంతా మనిషి గురించే.

“అతడు వచ్చిన క్షణం మెరుపు మెరుస్తుంది, ఉరుము ఉరుముతుంది. తప్ప తాగిన తుఫానులో ప్రపంచపు పర్వతశిఖరాగ్రాలపై పాలుగారే పసిపాపలు సెలయేళ్ళ జలజలలా నవ్వుతూ పరిగెత్తుతారు. అతడే మనిషి.” ఇది చదివినప్పుడు కొంచెం తికమక తప్పదు.

ఆ “అతడు” ముందు నిరుద్యోగి ప్రసాదరావేమో అనుకుంటాం. కథ చివరికి ఆ “అతడు” ఎవరో తెలిసినప్పుడు, “అసలు మనిషికీ, దైవానికి తేడా ఏమిటి” అన్న ఆలోచనా మీమాంసా తప్పవు. మానవుడు, దైవత్వమూ గురించి ప్రస్తావించిన ఈ కథలో, నిరుద్యోగమూ, ఆకలీ, అవసరమూ, ఆధిక్యతా అన్నీ చర్చకొస్తాయి. నా దృష్టిలో “దివ్య భవనం” కథా సంకలనంలో ఇది అద్భుతమైన కథ. ప్రపంచ కథల స్థాయి కథ ఇది.

మనిషన్నవాడికి ఎప్పుడూ ఏదో ఒక ప్రేమా, ప్రేమించినదాన్ని పొందాలన్న ఆరాటమూ తప్పవు. దాన్నే బైరాగి పాము పడగ పైనుండే నాగమణిగా అభివర్ణించాడు “నాగమణి” కథలో.

“లోకాన్ని గమనించు. ఏదో ఒక మేరకు ప్రేమలేనిదే లోకం నిలువదు. ఎవరి ధోరణిలో వారు ఏదో ఒక శక్తి మేరకు, శక్తికొద్దీ ప్రేమిస్తూనే వుంటారు. తారతమ్యాలుంటాయి, కానీ మూలం ఒకటే,” అంటాడు కథలోని రచయిత రాజు. ఆ ప్రేమ అవధులు దాటినప్పుడు “ఉద్రేకం”గా మారి మనిషిని తుఫానులో సముద్రంలోకైనా నడిపిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ నాగమణి వుంటుంది. అతను దానికోసం వెతుకుతూనే వుంటాడు. ఆ నాగమణికోసం వెతుకులాటే జీవిత పరమార్థమా?

ప్రేమా, జీవితమూ, మృత్యువుతో పాటు ఆయన కథల్లో ఆశ కూడా తరచూ ప్రస్తావించబడింది. “బీజాక్షరి” కథలోని కథకుడు ఒక్క వాక్యం కంటే ఎక్కువ వ్రాయలేక ఆగిపోయాడు. కానీ, చివరికి తన గదిలోకొచ్చిన బాలుని అరచేతి పైన “ఆశ” అన్న బీజాక్షరాలను వ్రాసి ముగిస్తాడు.

ఈ రకమైన ప్రతీకాత్మకతా, అధివాస్తవికత కూడా బైరాగి కథన శైలిలో ప్రత్యేకతలు. ఆయన వ్రాసిన కథల్లో చాలా కథలు అధివాస్తవికతా (Surrealism) శైలిలో వుంటాయి. ఆ శైలిలో వ్రాయడానికి అద్భుతమైన ప్రతీకలని వాడతాడు బైరాగి.

“దివ్యభవనం” కథ పూర్తిగా ఈ ధోరణిలో వ్రాసిన కథ. ఒక పారదర్శకమైన భవంతి, ప్రవేశ ద్వారం వంటిది ఏదీ కానరానిది, లోపలికి దారి తెలియక తలలు బద్దలు కొట్టుకున్న మనుషుల రక్తంతో తడిసిన మెట్లు వున్నదీ, ఇటువంటి భవనానికి ఎవరికి తోచిన భాష్యం వారు చెప్పుకోవచ్చు. ఇటువంటిదే ఇంకో కథ “స్వప్నసీమ”. ఈ కథల్లోనూ, ఇంకా చాలా కథల్లోనూ బైరాగి ప్రతీకలను విరివిగా వాడాడు.

“దీపస్తంభం” కథలో దీపాన్ని ఆశకు ప్రతీకగా, “నాగమణి” కథలో నాగమణిని ప్రేమ-కోరికలకు ప్రతీకగా, “బీజాక్షరి” కథలో బాలుణ్ణి భవిష్యత్తుకు ప్రతీకగా వాడాడు. ఇటువంటి ప్రతీకలు (metaphors) వాడడం వల్ల కథకు చిక్కదనమూ, క్లుప్తతా చేరతాయి.

సామాన్య జన జీవన చిత్రణలోనూ బైరాగి గొప్ప కథలు వ్రాశాడు. “దరబాను” నేపాల్ నుంచి చెన్నై వలస వచ్చిన లక్ష్మణ సింగు కథ. చిన్న పల్లెటూరి నించి పెద్ద పట్టణానికి వలస వచ్చినవారి జీవితంలో పరుచుకునే ఒంటరితనమూ, ఆత్మ న్యూనతా సున్నితంగా వర్ణించాడు బైరాగి. ఈ కథలో బైరాగి లక్ష్మణ్ సింగు కెదురుగా వున్న ఒక తెల్లటి గోడని అతని భవిష్యత్తుకి తార్కాణంగా ఉపయోగించారనిపిస్తుంది.

“కథ” అంటే వస్తువు మాత్రమే కాదు, శైలీ శిల్పమూ కూడా. బైరాగి కథల్లో వస్తు వైవిధ్యంతో పాటు విలక్షణమైన శైలీ, సునిశితమైన శిల్పమూ కలిసి ఆయనను ఒక ప్రపంచ స్థాయి కథకుడిగా నిలబెడతాయి.

సాహిత్య సృష్టి అన్నది రచయిత ఉబుసుపోకకు చేసేది కాదు. ఆలోచన, ఆవేశం, ఊహ, భాష, మానవ సంఘం మీద ప్రేమ అన్నీ కలిసిన ఒక చోట రచయిత మనసులోంచి పుట్టుకొచ్చే ప్రవాహం. వారి వారి మానసిక ప్రపంచాన్ని ఆవిష్కరించే వేదిక. అది కథా, కవితా, నాటకమా అన్నది పక్కన పెడితే, ముందు తరం రచయితలని తలచుకోవడమే కాదు, ఆయన సాహిత్యాన్నుంచి నేర్చుకోవడానికీ, తెలుసుకోవడానికీ ఎంతైనా వుంది. ప్రతిభాశాలి, సౌజన్యమూర్తి అయిన ఆలూరి బైరాగి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోతాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు.


శారద

రచయిత శారద గురించి:

బ్రిస్బేన్ నగరంలో నివసించే శారదగారు తెలుగులో, ఇంగ్లీష్‌లో కథలు, అనువాదాలు వ్రాస్తూ వుంటారు. 1996 లో మొదలైన కథా రచనతో దాదాపు నలభై తెలుగు కథలు, ఇరవై అనువాద కథలూ ప్రచురించారు. “నీలాంబరి”, “మలయ మారుతం” పేర్లతో రెండు కథా సంపుటాలు వెలువరించారు. “వీలునామా” అనే అనువాద నవలా, “తమసోమా జ్యోతిర్గమయా” అనే తెలుగు నవలా “శంకరాభరణం” అనే అనువాద కథల సంపుటీ వెలువరించారు. త్వరలో రాబోతున్న “విజ్ఞాన శాస్త్రంలో వనితలు” అనే పుస్తకంలో ప్రపంచంలోని మహిళా శాస్త్రవేత్తలను పరిచయం చేస్తున్నారు. కథా రచనతో పాటు సంగీతం వీరికి చాలా ప్రియమైన వ్యాపకం. వీరి బ్లాగు రచనలు https://neelambari.blog/ లో చదవొచ్చు.

 ...