ఏకాంతంలో ఒక బైరాగి

ఎక్కువమందికి బైరాగి అర్థంకాడు. రష్యన్ మహాకవి బ్రాడ్‌స్కీ లాగు కష్టతరమైన కవి. చిత్రకారుల్లో వాంగో లాగు సర్వ స్వతంత్రుడు. తాత్వికుల్లో నీషేలా తీక్ష్ణ దృష్టి గలవాడు. ఏకాంతం సిద్ధించని వాడు కవి గాడు, యావజ్జీవితం బైరాగి ఏకాంతాన్ని మకుటంలా ధరించినవాడు. స్వేచ్చా ప్రియత్వం వినా కవికి మరో మార్గం లేదు — బైరాగి దాన్ని ఊపిరిగా చేసుకుని బ్రతికినవాడు. పత్రికల్లో తన పేరు చూసుకోవాలని, నలుగురు తన కవిత్వాన్ని చదివి తనకు పట్టం కట్టాలని — ఇటువంటి వాటి మీద పూర్తిగా ఆసక్తి లేని వాడు. అవన్నీ తన ఏకాంతాన్ని భంగపరిచేవే అన్న తీవ్రమైన ఎరుక గలవాడు. చాలా మంది కవులకు బైరాగికున్న కవిత్వ తత్వ నేపథ్యం లేదు. ‘నీ ఆత్మకు ఆహారం వనస్పతి వంటకాలా’ అనగలిగిన వాడు బైరాగి. అందుకే కృష్ణ శాస్త్రి అంతటి వాడు ఆగమగీతికి రాసిన ముందుమాటలో –

‘బైరాగి గాలికెరటమున్నూ, మనిషిన్నీ.
బైరాగి మనిషిన్నీ, బైరాగిన్నీ.
బైరాగి అరేబియావాని ఒంటెన్నూ’

అన్నాడు. అంతే కాదు —

‘బైరాగి అరేబియావాని ఒంటె. మన హృదయంలో మూతి పెట్టడంతో ప్రారంభించి, మనిషంతా దూరిపోయి నిండిపోతాడు, మనలోనుంచి మనల్నే బైటికి తోసేసి. అంటే “తన తనం” అంతా తోసేసి’.

పాఠకుల్లో తాత్విక కాంక్ష రగిలించనివాడు మహాకవి కాలేడు.

తెలుగులో తొలి తాత్విక కావ్యం — ‘నూతిలో గొంతుకలు’ గురించి అదే పీఠికలో:

“ఆ రోజులలోనే అచ్చయి వెలువడి వచ్చిన (1955 కాబోలు) “నూతిలో గొంతుకలు” చదివాను. మానవుడి సహజవేదనలో మథనపడి పూర్ణత్వాన్ని దాదాపు కవిగా బైరాగి అందుకున్నాడా అనిపించింది”

బైరాగి మాటల్లో:

నూతిలో గొంతుకలు సంశయ కావ్యం. దీనిలో మానవుడు ‘ఏది త్రోవ?’ అనే అడుగుతున్నాడు. ‘నాన్యః పథా విద్యతే యనాయ’ అని చెప్పగలిగే స్థితిలో లేడు. చీకటిలో ప్రారంభమైన ఈ కావ్యం ‘ఆవేదనల అనంతంలో అంతమైన జీవితాలను’ చర్చిస్తున్నది. దీనిలోని నాయకులు ‘హేమ్లెట్, అర్జునుడు. రాస్కల్నికోవ్’ సందిగ్ధావస్థలో ఒక క్రమబద్ధమైన పరిణామాన్ని సూచిస్తున్నారు. హేమ్లెట్ వేదన కర్మపూర్వం. అర్జునుడి వేదన కర్మక్షేత్రంలో తక్షణికం. రాస్కల్నికోవ్ బాధ కర్మ తరువాత. అది మానవుని సహజవేదన. అతణ్ణి త్రికాలాల్లోనూ వెంటాడుతుంది. ఆ బాధలో మథన పడనివాడు పూర్ణత్వాన్ని అందుకోలేడు. ఆ బాధ నుంచి అతను తప్పుకునే మార్గం లేదా అంటే ఉంది. పలాయనం, కృతకశక్తులు పూజనం. ఆత్మహననం.

ఈ కావ్యంలో నేను అంటే కవి కాదు. నేటి మానవుని అనుభూతిలో అది కవితాదాత్మ్యం. స్వీయబాధ వెలువరించటం కవి పరమావధి కాదు. ప్రపంచంతో ఏకమైననాడే కవి కంఠం సరిగా పలుకగలుగుతుందని నా నమ్మకం. ప్రపంచానుభూతిలో స్వీయానుభూతి పరమైనపుడే ఉత్తమ కవిత ఉద్భవిస్తుందని నా విశ్వాసం.

పాతికేళ్ల వయస్సులోనే ‘ఆత్మల చీకటిలోకి చొచ్చుకు పోగల సాహసికుడు’ కాబట్టే

త్రోవలు రెండే రెండు త్రోవతెలియగలందులకు
నీలోనిన్ను, సర్వజగతినికూడకలియగలందులకు
ఒకటి, వెలుగుకొరకు వేచియుండి విజయఫలసాధన
రెండు, కటికచీకటిలో దూరదృష్టి సంపాదన

అనగలుతున్నాడు! ఆ తర్వాత తనువు చాలించే దాకా (1978) అంతులేని ఏకాంతంలో, స్వేచ్ఛగా బ్రతికాడు. ‘ఆగమగీతి’ మరణానంతరం వచ్చినదే. ఆ సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడెమీ (1984) అవార్డు రావడం పెద్ద విషయం కాదు.

ఆధునికుల్లో, బైరాగిలోని వ్యంగ్య వైభవం మరెవ్వరిలో లేదు, ‘ఒక సమష్టి ప్రార్థన’లో అది పరాకాష్ట నందుకుంది.

మురికి బట్టల శయ్యపై శాశ్వతంగా కనులు మూసిన తదనంతరం
మా అలసిన శరీరాలను కడిగించు ఒక్క కప్పు స్ట్రాంగు కాఫీతో,
గంధపు చెక్కలు లేకపోతే మాత్రమేమి

పేర్చమను చితిపై మేం కాల్చిన సిగరెట్టు పీకలన్నీ,
సమాధుల్లో పెట్టమను అరిగిన, పంచరు బడిన ట్యూబులు టైర్లు
చెడిపోయిన బ్యాటరీ రేడియో సెట్టు
చీకటిలో త్రోవచూపే బ్యాటరీ లైటు.
పడియుండనీ నరకంలోనో నాకంలోనో మమ్ముల నొకమూల,
వైతరణి ఒడ్డయినా పరవాలేదు, తిరిగి తిరిగి అలసి పోయాం.
సింహానికి పంజానిచ్చి ఏనుగకు దంతమిడిన మహానుభావా!
మ్యాటినీ లేనివేళ మా మొరాల కించవయ్యా ఓ దేవా!

అలాగే ఎటువంటి దుష్కర తాత్విక భావాన్నైనా కవిత్వంలోకి దింపగలడు:

ఉద్రేకాల ఆవేశాల తప్పుడు బేరో మీటర్లు
పనిచేయని దిక్సూచి వివేక మిది వాస్తవిక ప్రపంచంలో ధ్రువతార ఎక్కడున్నది?
పగిలి విరిగి చెరిగి చిరిగి ముక్కలైన చెక్కలైన ఈ జ్ఞానం ఏమిటి చెబుతుంది నీకు ?
నికరమేది, ఖాయమేది
అంశికసత్యాల ఆర్ధసత్యాల అసత్యాల ఆధిపత్యంలో
ముక్కూ చెవులూ తెగిన సత్యాన్ని గుర్తుబట్టలేవు నీవు
విప్లవాల ప్రసవ బాధల దైత్య శిశువు భస్మాసురుడు,
నిలకడగల నమ్మిక ఎలా కలుగుతుంది.
జ్యోతి ఎలా నిశ్చలమై వెలుగుతుంది
మన ప్రేమలు స్నేహాలు సౌహార్దాలు
మలినమైనవి అన్నీ చేతులుమారి రకరకాల,
కల్తీలేని సరుకులేవీ దొరకవీ అంగడిలోన
నీ ఆత్మకు ఆహారం వనస్పతి వంటకాలా?

“అస్తిత్వవాదం లాంటి ఆధునిక తాత్విక సిద్ధాంతాలు అయన మీద పనిచేసి ఉండవచ్చు. M. N. రాయ్ ప్రభావం కూడా అయన మీద కొంత వున్నట్లు తెలుస్తుంది! యే తాత్విక సిద్ధాంతము ఆయన్ను ప్రభావితం చేసినా, వాటికీ కవితారూపం ఇవ్వగలగడం బైరాగి గొప్పతనం!” (రా. రా.)

బైరాగి వ్యక్తిత్వానికి, కవిత్వానికి పెద్దగా ఎడం లేదు. తానే మూర్తీభవించిన కవిత్వము, తత్వమూను. కావున, అతని కవిత్వం జలపాత సదృశం — భావాంతం, పదాంతం ఒకేసారి జరుగుతాయి. బైరాగి మనసు తారాఖచిత ఆకాశాన్ని ప్రతిబింబించే స్వచ్ఛ తటాకం — అతని జీవితంలో లోకాభిరామాయణానికి స్థానం లేదు, గోరా శాస్త్రి మాటల్లో:

“కవిత్వం గురించి, పుస్తకాల గురించి, దర్శనాల గురించి, తత్వ శాస్త్రం గురించి తప్ప వ్యక్తులను గురించి బైరాగి పొరపాటునైనా ఎన్నడూ మాట్లాడలేదు”

ఇటీవలి పద్యకవులు — కరుణశ్రీ, రాయప్రోలు లాంటివారితో వచ్చిన గొడవ ఏమిటంటే వారి భావనా శక్తి, భాషా పటిమ, వ్యుత్పన్నత పద్యనిర్వహణకు సరిపోవు — ఓజోగుణం లోపించి ఎందుకొచ్చిన పద్యాలు అనిపిస్తుంది. మన ప్రాచీన పద్యకవుల్లో ఈ దోషం కలికానికి కూడా కనిపించదు. అడుగడుగునా వారి డొక్కశుద్ధి తెలిసివస్తుంది. బైరాగి కూడా నిస్సందేహంగా వారి కోవకు చెందినవాడే. అచ్చ తెనుగు, గీర్వాణం పెనవేసుకున్న అరుదైన శైలి, ఆముక్త మాల్యద రచించిన రాయలవారిది. బైరాగిది కూడా ఆ చక్కని రాజమార్గమే; బైరాగిలో శైలీ పరమైన క్లిష్టత ఇక్కడ నుండే బయల్దేరుతుంది. అక్కడక్కడా భారతీయ పౌరాణిక ప్రతీకలు మెరుపుతీగల్లా సార్థకమై మెరిసిపోతాయి బైరాగి కవిత్వంలో. ఉదాహరణకు పై కవితలో — ‘శప్త జాత మృకండు సుతులం’ అంటాడు, మృకండు మహర్షి సంతాన ప్రాప్తి కోసం చేసిన తపస్సుకు మెచ్చి శివుడు — ‘అల్పాయుష్కుడైన సద్గుణ సంపన్నుడు కావాలా? దుర్గుణుడైన చిరంజీవి కావాలా?’ అన్న ప్రశ్నకు సద్గుణ సంపన్నుడే కావాలి అంటాడు మహర్షి. ఈ వృత్తాంతం తెలియక పోతే కవితలోని వ్యంగ్యం స్ఫురణకు రాదు. బైరాగి శైలి తెలియగోరేవారు ఈ కవితతో మొదలు పెట్టి తతిమ్మావి చదవడం మేలు.


2
పలు కారణాల వల్ల శ్రీశ్రీ కవిత్వం బహుళ ప్రచారంలోకి వచ్చింది. ఐతే, శ్రీశ్రీ కవిత్వాన్ని సవిమర్శకంగా చదివినవారు బహు సకృత్తు. శ్రీశ్రీ అనే కాదు, ఎవరి కవిత్వాన్నైనా ఉపరితల స్పర్శతో — పైపైన తడిమి చూసి, సిద్ధాంత చర్చలోకి దూకే ప్రబుద్ధులే ఎక్కువ. విమర్శకుల్లో అగ్రేసరుడైన అక్కిరాజు ఉమాకాంతాన్ని పూర్తిగా విస్మరించాము. రాళ్ళపల్లి, రా.రా.లు ఎవరికి కావాలి? అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ తెలుగు కవుల్లో, రచయితల్లో అవార్డుల గోల — నలుగురు కలిస్తే ఇదే చర్చ. దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకునే బాపతే గాని — ఏ సాహిత్య ప్రక్రియలోనైనా ఒక గొప్ప రచనను గౌరవించుకోవాలి అన్న స్పృహే లేదు.

బైరాగి మూడు పదులు నిండక ముందు రాసిన ‘నూతిలో గొంతుకలు’, రిల్కే చివరి రోజుల్లో రాసిన ‘Sonnets to Orpheus’ — ఈ రెండు కావ్యాల్లో భావ తీవ్రత, తాత్విక గాఢత పెనవేసుకుపోయాయి. రిల్కే కావ్యానికి వచ్చిన అనువాదాలు అన్నీ ఇన్నీ కావు. అమెరికా సాహిత్య ప్రియుల్లో రిల్కే పేరు తెలియనివారు లేరు. మన బైరాగి పేరు తెలుగు ఎల్లలు దాటలేదు. చక్కని విమర్శ మన సాహిత్యంలోని పొట్టును పొల్లును ఎగిరిపోయేలా చేసి, గట్టి కావ్యానికి పట్టం గట్టాలి. అనువాదకులు ఆ శ్రేష్టమైన సాహిత్యాన్ని అనువదించాలి — అదీ క్రమం. తెలుగులో అది విపరీతం కావున — కవి శ్రేష్ఠులకు, మంచి రచయితలకు గుర్తింపు లేక మరుగునబడిపోతారు. అన్ని ప్రక్రియలలో ఆముదపు చెట్లు వేళ్లూనుకొని కనిపిస్తాయి. మనకు తక్షణావసరం — అమెరికా విశ్వ విద్యాలయాల్లో తెలుగు బోధన కాదు, చక్కని ప్రమాణాలతో నడుపుతున్న పత్రికలకు ఆర్థిక సాయం — తద్వారా పైన చెప్పిన పనులు జరిగి — మంచి రచనలు వెలుగులోకి వస్తాయి.

శబ్దాలతో కవాతు చేయించగలడు శ్రీశ్రీ; కవిత్వంలో ఆర్ద్రతకు పెద్ద పీట వేసినవాడు తిలక్ — వీరిద్దరి కవిత్వంలో కథనం పాలు ఎక్కువ. నిజం చెప్పాలంటే — మొదటి తరంలో కథన కవులే ఎక్కువ. తిలక్ చక్కని కథలు రాశాడు. శ్రీశ్రీ కథల్లో ఏదో ప్రయోగ ధోరణి — పెద్దగా గుర్తుండిపోయే కథలు కావు. బైరాగి రాసిన డజనుకు ఒకటి తక్కువ కథల్లో ఎంతో వైవిధ్యం ఉంది. ఎదుటి ఆఫీసు తాలూకు తెల్లని గోడని గమనిస్తూ ఉండే గూర్ఖా లక్ష్మణ సింగ్ (దరబాను),‘ఒక గంట జీవితం’లో హోటల్‌లో నవ్వుతున్న యువతులను గమనించే ఒంటరి యువకుడు,‘జేబు దొంగ’లో డబ్బు అవసరమై తీసుకున్న చేబదులు, దారిన పోయే కడు బీద పిల్లవాడు దొంగలిస్తే చూస్తూ ఉండిపోయే ప్రసాదరావు, పెద్ద నగరంలో నలతగా తప్పిపోయినట్లు తిరిగే రామారావు (దీపస్తంభం), సముద్ర కెరటాలకు ఎదురెల్లి మునిగి చనిపోయే ఒంటరి రచయిత (నాగమణి), సర్కస్‌లో పరిచయమై దగ్గరైన ఉత్తరాది పడుచుతో మళ్ళీ కలవటం కల్ల అని చెప్పి బయటపడే చిరుద్యోగి(స్వప్న సీమ) — ఇలా కథలన్నీసమూహాలకు భిన్నమైన వ్యక్తి అస్తిత్వాన్ని లోతుగా తరచి చూస్తాయి. ‘స్వప్న సీమ’ చదువుతుంటే నాకు డానిష్ తత్వవేత్త, అస్తిత్వ వాద పిత ఐన Søren Kierkegaard (1813-1855) జీవితంలోని ప్రణయోదంతం గుర్తుకొచ్చింది — తాను వలచిన Regine Olsen అన్న అమ్మాయితో వివాహం నిశ్చితార్థం ఐనాక — ఏకాంత జీవితానికి పెళ్లి అడ్డు అని చెప్పి తన వివాహ ప్రయత్నానికి స్వస్తి చెబుతాడు. మిగిలిన కథలు ‘దివ్య భవనం’ — రచయితల కీర్తి కాంక్ష మీద, కథ రాయబోతున్న ఒక అబ్బాయి మీద (బీజాక్షరి); కన్నతల్లి, తండ్రులూ-కొడుకులు-అప్పటి సామాజిక పరిస్థితులను, రాజకీయాలను లోతుగా దర్శించిన కథలు. తాతయ్య ఒక హాలీవుడ్ సినిమాని (Mutiny on the Bounty) పిల్లలకు తన సాహస గాథగా మార్చి చెప్పిన ‘కిమాని’ అన్న సరదా కథ కూడా ఉంది. ఇంకొక విషయం — బైరాగి రచన ‘పాప పోయింది’ నవల అందరూ రాయగలిగింది కాదు.

ఈ నవల మీద ప్రముఖులు ఆవుల సాంబశివరావుగారి లఘు టిప్పణి:

“ఇందులోని కథ చాలా చిన్నది. రామారావుకు కన్న కూతురు ఎడల గొప్ప అనుబంధం ఉంది. ఆ బిడ్డే తన జీవితంగా భావిస్తాడు. అయితే ఆ పాప పోయింది. పాప పోవడంతో అతన్ని నిరాశా, నిస్పృహలు అలుముకుంటాయి. దంపతుల మధ్యే సంబంధం తారుమారవుతుంది. అయితే రామారావుది వాత్సల్యంతో నిండిన మనస్సు. ప్రేమించగల హృదయం. పోయిన తన పాపలాంటి మరో పాప కనిపిస్తుంది. ఇంటికి తెచ్చుకుంటాడు. తిరిగి ఇల్లాలును తన వద్దకు చేర్చుకుంటాడు. ఎండి, మోడై పోయిన తన బ్రతుకుకు పునరుజ్జీవనం కల్పించుకుంటాడు. ఈ సంఘటనల చుట్టూ తన తాత్విక చింతనను అల్లాడు బైరాగి. కృతకృత్యుడైనాడు. కలిగిన అనుభవాలతో మనిషి ప్రవర్తన, రీతి ఎలా మారుతూ ఉంటుందో చూడదలచుకున్న వారికి ఆసక్తి కలిగిస్తుంది. మౌలికంగా ఇది తాత్విక రచన. మనిషిని అవగాహన చేసుకోవడం శాస్త్రజ్ఞులు సదా చేస్తున్న ప్రయత్నం. ఆ అవగాహనకు ఇది ఉపకరించగలదు.”

ఇవన్నీ ఒక ఎత్తు — బైరాగి మొత్తం తెలుగు కవిత్వాన్ని హిందీలోకి అనువదించాడు. అంతే కాదు, మూల భాషల నుండి హిందీ, ఉర్దూ, బంగ్లా, పార్సీ కవులను అనువదించాడు. ఆంగ్ల మూలం ఆధారంగా జర్మన్ కవి Rilke, Guillaume Apollinaire, Paul Éluard, Jacques Prévert తదితర ఫ్రెంచి కవులను, టి. ఎస్. ఎలియట్ ప్రసిద్ధ కవితలను తెలుగు చేశాడు. తనకిష్టమైన బెంగాలీ కవి జీబనానంద దాస్ -పేరుపొందిన కవిత Banalata Sen (1942)ను సమర్థంగా తెనిగించాడు.

గురజాడలా అర్ధాయుష్కుడైనా, తెలుగులో తను అడుగుపెట్టిన అన్ని ప్రక్రియల్లో వెలుగులు నింపిన అరుదైన కవి బైరాగిని తన శతజయంతి సందర్భంగా తలుచుకోవడం మన కనీస ధర్మం.


రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి:

తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. “నిశ్శబ్దంలో నీ నవ్వులు” అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.

 ...