చాలా కొద్దిమంది అప్పుడప్పుడూ మాట్లాడినప్పుడు తప్ప జనబాహుళ్యానికి సంబంధించి దాదాపు ఒక శతాబ్దపు నిశ్శబ్దంలో ఉండిపోయిన బైరాగి అక్షరాల ఉనికికి ఇటీవలే మేల్కొన్న మానవ సముదాయంలో నేను ఒకదాన్ని.
నా ఈ కొన్ని వాక్యాలు కూడా బైరాగి కవితాత్మతో అయిన ఆ కాస్త పరిచయ అనుభవాన్నే చెప్పబోతాయి.
మొదటిసారి బైరాగిని చదివినప్పుడు తోచిన మాటలు — ఈ కవితలు పాఠకుణ్ణి అమితంగా ఆకర్షించేదీ కాస్త భయపెట్టి వికర్షించేదీ కూడా ఆయన సంస్కృతపద ప్రయోగమూ, సమాసగ్రథనము చేత. కానీ నిజానికి, అర్థాల లోతులు కనుక్కునే ఉద్దేశం వదిలేసి కేవలం పైకి చదివినా జిహ్వప్రియంగా శ్రవణపేయంగా ఉంటాయి బైరాగి కవితలు.
నాలుక మీద ఆ మాటలు నర్తించడమే నా వరకూ ఒక గొప్ప అనుభవం.
ఇక, వాటి మూలాలు, అర్థాలు, కవితలో వాటి ఔచిత్యాలను అంశంగా తీసుకుని అధ్యయనం చేసినా హీనపక్షం ఆరు పిఎచ్.డి. థీసిస్‌లకు సరిపడా వస్తువు ఉన్నది అని తెలుసుకోవటం నా రెండవ గమనింపు. అలాగని, భాషతో, దాని శబ్దాలతో మోహంలో పడి, పాఠకులకు అనటానికి, వినటానికి ఇంపుగా ఉండటం కోసమనో, వాక్యంలో తూగు కోసమో, మాటల బరువుల సమతూకం కోసమో, వాక్యాలు ఒకదానికి ఒకటి నిర్మాణంలో సమమైన నిడివితో, భావంలో ఒకే ఎత్తుతో ఉండాలని ఉద్దేశించో ఒక్క మాట కూడా ఎక్కడా అట్లా వాడలేదు.
ఉదాహరణకు ఒకచోట “పాంశు పాండుర బింబం” అంటాడు ముసలి ముఖాన్ని వర్ణిస్తూ. పాండుర అంటే చాలు కదా వృద్ధాప్యంతో రక్తహీనత వల్ల పాలిపోయిన అని చెప్తున్నట్లు. పాంశు (ధూళి) ఎందుకు మళ్ళీ, అదీ ‘పాండుర’కు ముందే? ‘పాంశు’కు అక్కడ చేయవలసిన పని, ఆ జరాకి తరువాత దశ మృత్యువును, అది దేహానికి ఏ దశ పట్టిస్తుందో స్ఫురింపజేయడం. అంతేకాదు ముసలివాళ్ళకు ఎంత శుభ్రంగా ఉన్నా వాళ్ళ ముఖాలను కమ్ముకున్నట్లు ఉండే ఒక బూదిరంగును చిత్రించటం. వాళ్ళ మసకబారిన కళ్ళకు ప్రపంచం కూడా బూదిధూళి కప్పుకున్నట్లు కనిపిస్తుందని తలపింప చేయటం కూడా.
బైరాగి ప్రతి మాటకు ఎంత ప్రాధాన్యం ఉంటుందంటే, అక్కడ ఆ స్థలంలో అది ఉండితీరాలి బహుళార్థ ప్రయోజనాన్ని నిర్వర్తిస్తూ. అంతే కాదు, ఆ ఫలానా మాట కాక మరింకే ప్రత్యామ్నాయ పదమో, సమానార్థక శబ్దమో అక్కడ నిలబడలేదు. ఇవన్నీ ఏ కవీ ప్రయత్నపూర్వకంగా చేయడు. ఇటువంటి ప్రయోగాలు కోకొల్లలు.
బైరాగి బృహత్తర భాషాకోశాగారం, కావ్యశిల్పం, అతని సాహిత్యంలో అస్తిత్వ వాదం, తాత్త్వికదృష్టి, వివిధ ఫిలాసఫీలు, బైరాగి పైన ప్రాచ్య పాశ్చాత్య కవుల ప్రభావం, వారి ప్రభావాన్నీ అధిగమించి ఆయన చేశాడంటున్న దర్శనాలు… ఇలా ఇన్ని చర్చించదగిన గొప్ప విషయాలు ఉండగానూ, ధ్యానం అనదగిన అధ్యయనం తన గూర్చి విశేషించి ఒక ఏడాదిగా జరుగుతుండగానూ, బైరాగి సాహిత్యంలో ఇంకా ఏ విశేషం మిగిలి ఉంటుంది ఒక మామూలు రీడర్‌కు, విశ్లేషణ కాకపోయినా కనీసం మెప్పుకోలు (appreciation) వంటిది ప్రయత్నించటానికైనా?
నేను ఎంచుకున్న కవితల జోలికి పోయేలోపు సంక్షిప్తంగా, (దేన్నైనా తేల్చేసి ఇది ఇంతే అని నిర్ధారించడం అతనికి మొదటగా ఇష్టం కాని పని కాబట్టి) నాకు తోస్తున్న బైరాగీయ గీతాల సారాంశం ఇదై ఉండగలదని అనుకుంటున్నది ఇది: ‘నూతిలో గొంతుకలు’లో ముగ్గురు బుద్ధిజీవుల “కిం కర్తవ్యమ్?”తో విచారణ మొదలయ్యి, ఆచరణకు ఏది సరి అయిన క్రియ అనీ, ఈ సందేహాల అంధకారలోకంలో దారి ఎవరు చూపుతారనీ అడుగుతూనే వ్యక్తి అస్తిత్వ ప్రశ్నను వ్యక్తి స్థాయిలో ఆపక, కనపడుతున్న సమస్త సృష్టి అస్తిత్వంలో స్వప్నమెంత? సత్యమెంత? అనే తాత్త్విక స్థాయికి తీసుకువెళ్ళాయి బైరాగి కవితలు. ఆగమగీతిలో కూడా నిర్వేదం ఆవహించిన ఆధునిక మానవుడు ఎంచుకున్న నిష్క్రియాధోరణికి కార్యకారణాలు వెతకటం కనిపిస్తూనే ఉంటుంది.
సదసద్విచారణను కడవరకూ జరిపిన స్వగత సంభాషణలే (series of soliloquies) బైరాగి కవితలు అని తోస్తున్నది.
నేను ఎంచుకున్న బైరాగి కావ్య వస్తువులు — “Loss of Innocence, Love and the loss of it.” అమాయకత్వాన్ని పోగొట్టుకోవటం, ప్రేమ, ప్రేమను కోల్పోవడం. అక్కడక్కడా కొన్ని రాక తప్పని సంగతులేవో వచ్చాయి.
ఆగ్రహంతో కలిసి జాలి, సంశయంతో మిళితమై నమ్మకం! ధర్మాగ్రహాన్ని పూనినట్లు భీకరంగా ప్రవహించే బైరాగి కవితాఝరి ఎక్కడైనా కాస్త నెమ్మదించిన పరుగు ఉందా ఈ పుస్తకంలో అని చూస్తుంటే, కవికి ‘మల్లెపూవులు‘ కనపడిన చోటు కనపడింది. తరువాత ‘ఒక గీతం’ ‘ప్రేమ కవితలు, ‘చెప్పనిది’. వాటిల్లోనూ బైరాగీయ సందేహాగ్రహాల ప్రశ్నలు లేకుండా ఏమీ లేవు కానీ…
“అమాయకపు మోము”ను పోగొట్టుకుని మనిషి పడే దుఃఖం, ‘చెప్పనిది’ కవితలో వస్తువు.
శీర్షికలో నేరారోపణ ఉంది కర్మణ్యర్థకంలో. కవితలో నేరుగానే, ముందే ఎందుకు చెప్పలేదు, అని అడుగుతుంటుంది ఒక స్వరం.
“అమాయకపు మోముపైన గడుసరి మచ్చలు కానరాకముందు, పగటి హంగుల అంగడులు తీయకముందు, వివిక్త వాంఛా వీధుల యుద్ధవిరమణ వేళయందు, దూరపు తీరపు పిలుపు వినిపించే వీలున్నప్పుడు… మొదటే ఎందుకు చెప్పావు కావు?” అంటూ.
ఉగ్రమైన ప్రపంచ యుద్ధాలు, ఉన్నతమైన స్వదేశీ సత్యాగ్రహాల తర్వాతైనా, స్వాతంత్ర్యం వచ్చాకైనా, దేశంలో ప్రగతి లేదు. హిరణ్యబ్రహ్మాండం పగిలి రెక్కలతో బయటకు వచ్చినా, మనిషికీ పురోగతి లేదు అనే శోకం కనపడుతుంది ఈ కవితలో.
“పాపపు లోకంలోకి తోయబడ్డాను,” అనేది ఆది మానవ శోకం.
తిరిగి పోలేనంత దూరం వచ్చి పడిఉన్నాను, “కుమారసమీరంలో తృణదీలాల పసి గుసగుసలు”, నుంచి చాలా దూరం వచ్చేశానని వాపోతుంటాడు బైరాగి మనిషి. నిషిద్ధ ఫలం తిన్న పాపం ఇచ్చిన జ్ఞానంతో చాలా ఇవతలికి వచ్చేశాడు వాడు.
ఆ ఏడుపులో కూడా “పచ్చని ముసుగులోంచి పృథ్వీ వధూమందహాసం” మీద తన దృష్టి పడకుండా పోదు. ఇది తప్పనిసరి జ్ఞానం.
ఇది చేయక తప్పని దోవతప్పిన ప్రయాణం. “పితృవాత్సల్య నీలాకాశం” పోగొట్టుకున్నాక, “లాభం లేదిప్పుడు, తిరుగుత్రోవ కనిపించదు, ప్రాతశ్శాంతి ప్రదేశానికి తిరిగి యరుగలేను నేను.”
బైరాగి మానవుడి విలపనం, ఇంకా మిల్టన్ నాటి వినష్ట స్వర్గం గురించి మాత్రమే కాదేమో.
శోకం, కోరికల పాపం తెలియని తలం నుండి వివిక్త వాంఛల వీథిలోకి వచ్చిపడి, (వివిక్త: ఇక్కడ ఏకాంతంలో తప్ప చెప్పలేనివీ, పవిత్రమైనవీ రెండూనా) అప్పుడప్పుడూ వధూమందహాసాలు పలకరించి వెళ్ళినా పెద్దగా బావుకున్నది, చెప్పుకోదగ్గదిగా చేసిందీ ఏమీ లేదే అనేదే ఆధునిక మానవుడి వేదన. సరిపోని రేషన్, ఎడతెగని ఇన్ఫ్లేషన్, చీకటివేళలు చుట్టుముట్టాక తెలిసొచ్చే ఒక విషాద సత్యం! ఇదే జరగబోయేదని ముందే ఎందుకు చెప్పలేదు అనేది అతని ప్రశ్న. ఏమిటి ఆ సత్యం? “సంభూతమొకటే నిజం! సంభావ్యం ఒక యోచన, వలసిన దేశం చివరకు బారెడు కటిక నేల”, చివరకు “హేమంతపు తడి కౌగిలిలో, శూన్య తమస్సుల చిక్కని ఉక్కని చలిలో శయనిస్తాం” అనేది మొదటే చెప్పని ఆ సత్యం. బుద్ధి అప్పుడు ఎక్కడకు పోయింది?
కాబట్టి తనను తనే నిజాయితీతో అడగాలి మనిషి,”ముందే ఎందుకు చెప్పావు కావు?” అని అంటున్నాడా కవి.
శైశవ జాగృతి నుంచి శీతలచరమ నిద్రకు నెట్టబడే లోపు మనిషికి దొరికిన మధ్య మజిలీలో, వాడు చేసే సంభావ్యం కేవలమొక యోచనగా మిగలటమే బైరాగి మొదటి, చివరి వేదన కూడా.
క్రియగా రూపుదాల్చకమునుపే తన ఇచ్ఛ, ఆశయాలను అమ్ములపొదిలోకి విరమించుకున్న సంశయగ్రస్త ప్రాణి, నిష్క్రియనే తన దైనందిన వ్యాపకంగా చేసుకుని తన “ఆస్థ మధ్యాహ్నపు మంచులాగు కరిగి నీళ్ళుకారిపోయే” సోమరి మనుజుడు, “చాప మీద పొరలాడే నరాధముడు, త్రిశంకు స్వర్గంలో వేలాడే సాలీడుకు ఈడూ జోడు”, వీడు, నేలబారు అస్తిత్వానికి తన జీవితాన్ని వీలునామా వ్రాసి ఇచ్చేసిన నిస్సార, నిర్బల ఆత్మకు దుర్బల దేహి, “ఊషరక్షేత్రంలో” నవయుగ మానవుడు!
ఇదే ఈ కవితల్లో వినపడే ఆక్రందన.
అయితే నిజమైన కవి, శోకం ఒకటే నేర్పడు కాబట్టి, ఋషి లాగ వెంటనే ఒక ‘ఆగమనం’ కోసం నమ్మకాన్ని, ఆశంసను నిలుపుకోమని చెప్తుంటాడు.
“అరుదెంచక తప్పదతడు” అన్న ఆ నమ్మకం వినపడుతూనే ఉంటుంది. “నాక్కొంచెం నమ్మకమివ్వమని” అడుగుతూ నడవటమే మనిషి తన నమ్మకాన్ని నిలుపుకునే విధం. “అరుదెంచక తప్పని” ఆ మనిషి ఒక అవతారపురుషుడా? వాడు యుగానికి ఒకడేనా? కాదేమో, మనిషై దిగిన అందరికీ వినష్టమైన ఆ శక్తి తిరిగి దొరకగలదని నమ్మబలుకుతున్నట్టు ఉన్నాయి కవి మాటలు.
అంతదాకా మనిషి కర్మఠుడు(కృషి చేయక తప్పని వాడు).
ఇటువంటి సంశయశరపరంపరల ‘ఆగమగీతి’ మధ్య ‘మల్లెపూవులు’ ఉండటం ఎంత ఆశ్చర్యమో అంత అనుసృతం. జడివానలో ఒక తెరిపి.
సందేహాల యుద్ధం మధ్యలో ఉన్నట్టుండి ఒక మానవ మౌలిక శోకాన్ని, దానికి సమాధానాన్ని ఆలపించిన మోహనమురళీగానం ఈ కవిత.
‘మల్లెపూవులు’కు ముందు ‘త్రిశంకుస్వర్గం’లో “గాలి రాని చీకటి గదిలో మారుమూల మదిలో…”!
ఒంటరితనం భౌతికంతో ఆగదు, మది మారుమూలలకు పాకుతున్నది, తనున్న లోకం నలుమూలల్లోకి చూస్తుంటుంది “నేను విరించిని” అంటూ. ఆ ఏకాకికి సమస్త ప్రపంచపు బాధలూ కనపడుతుంటాయి, “నెత్తురులా ఎర్రబడ్డ కడ్డీపై సుత్తి దెబ్బ, పొంగిన అరచేతిబొబ్బ” నుంచి, “అంపసెజ్జపై భీష్ముడు, చైతన్యం చరమసీమ చేరుకున్న ఒక్క క్షణం”, వరకు, “జపాపుష్ప కాంతిలాగు పచ్చిపుండు వాంతిలాగు పసినెత్తురు కారుతున్న ఒక్క క్షణం” వరకూ ఈ విధంగా సాగుతునే ఉంటాయి కవి సారించిన దృష్టీ, ఇది సత్యం ఇది నిత్యం అంటూన్న అతని ఆక్రోశమూ.
ఇలా, “విసుగు విసుగు, జీవితమొక గజ్జికురుపు, మనిషొక శ్లేష్మంలో పడి తన్నుకునే ఈగ” అని రోసిన కవిని కాస్త సాంత్వన కోసమా అన్నట్లుగా ఒక వేసవి సాయంత్రం చీకటిపడేవేళకు పూవులబజారుకు తీసుకెళ్ళాయి అతని కాళ్ళు.
అప్పుడు… “పూల అంగడి లోంచి పూలు పలకరిస్తున్నవి నన్ను”, ఎలా? “జ్ఞాపకాల తేనియపిండి బ్రతుకు పులుపు విరిచినట్లు,” పులుపు పిండి పాలను విరచటం తెలుసు, కానీ తేనె పిండి బ్రతుకు పులుపు విరవటం తెలియటం! గరళం గ్రహించి, లోకానికి అమృతం మిగిల్చే శంకరుని వంటి ప్రియదైవాలు బైరాగికి పూవులు, ప్రేమను గుర్తు చేసే మల్లెలు.
“వెచ్చని వేసవి రాత్రి నగరం మీద ఒరుగుతున్న వేళ…” అంటూ మొదలైన కవిత, “పరివిధాల పరిమళాలు హఠాత్తుగా గుండెలను పట్టుకున్న” ప్పుడు, నగరం మీద “బరువుగా ఒరుగుతున్న చీకటి” అంటూ, చీకటికి ఒక శరీరం ఇచ్చింది. “జీవం కలిగి ఊపిరి పీల్చే నల్లని దేహం”, ఆ శరీరం ప్రాణం కూడా పోసుకుంది… “చెమర్చటం తెలుస్తోంది కొద్దిగా గమనిస్తే, చీకటి చలిస్తోంది మానవుల కదలికతో, ఒరుసుకుని తాకుతూ ప్రపంచాన్ని”. కోరికల శరీరాకృతి ఇలా స్ఫుటంగా పొడగట్టింది, అంత చీకట్లోనూ అది నల్లటి దేహం.
“మానవదేహాల వేనవాసనలు కూడా పూల పరిమళాలతో తేలి రావటం”లో ప్రాముఖ్యం, ఇక్కడ మానవదేహ గంధానికే. ఒత్తుకుని, తొక్కుకుని రాసుకుని భుజాలు గుచ్చుకునే జనసందోహం మధ్యలో వచ్చి నిలుచున్న ఒంటరితనానికి, ఏది ముచ్చట కలిగిస్తుంది, వెయ్యి వ్యవహారాలు జరుగుతున్న ఆ పూలబజారులో?
హృదయపు కథ విప్పి చెప్పటానికి, “ఒంటరితనాన్ని ఒంటరి చేయటానికి” మనుషుల్లా మాట్లాడే మల్లెపూవులు కావాలి అనే ముచ్చట.
పారిజాతం స్వర్గవాసి అయిన వాళ్ళ తల్లిని తలపిస్తుందిట… పూవులు ఒక్కొక్కటికీ ఒక విశేషం. మట్టిలోంచి పుట్టిన మల్లె ఒక్కటే మానవజీవితాల మృణ్మయగంధంతో “మనిషిలా మాట్లాడుతుంది”. మల్లెపూవులు మటుకే బైరాగికి దేహాన్ని ఆత్మనూ కూడా స్ఫురింజేస్తాయి. తక్కినవి కొన్ని కేవలం స్వర్గవాసులకు, కొన్ని కేవలం భౌతికం; “జాజులది సుందరాకృతి”. మల్లెలు మటుకే ఇటు సత్యాన్ని స్వప్నాన్ని మేళవించుకుని దేహాత్మల్లా వాటికవే సాధకసాధనాలు.
అటువంటి మల్లెలను పట్టుకెళ్ళిన మనిషి, గదిలో బల్లమీద మల్లెమాలను ఉంచి, సంచరిస్తాడు తాను, ఒకదాని తర్వాత ఒకటిగా ఊహాలోకాలలో, స్వప్నం లోనైనా సాహసించని స్వప్నలోకాలలో, తపోలోకాలలో; “అవ్యక్తపు వయొలిన్‌పై కదులుతున్నది కమాను”. అక్కడ బజారులో పొడగట్టినది కోరికల శరీరం. గదిలో అతను ఒంటరియై ఉన్నప్పుడు కనపడిన దేహం వేరు. ఇదెక్కడనుంచి వచ్చింది? దాని స్వరూపమేమిటి? తన ఒంటరితనం పోగొట్టమని, మరొకర్ని రా, రమ్మని ఆవాహన చేశాడు, “రా! రా! ఒకసారి రాలేవా! నా నిరర్థకాభినయ యవనికపై, నా మరచిన పాటలోని పదాల పొందికవై…”.
కవి ఏకాకీ న రమ్యతే అని మరొక రూపాన్ని కోరుకున్నాడు, “సో(అ)కామయత. “ద్వితీయమైచ్ఛత్” కల్పించుకున్నాడు, ఆ కల్పనను చూశాడు, “తదైక్షత”. కవి దృష్టి సృష్టించుకున్న జత అది.
బైరాగికి మనిషి, తనకొక జతను కల్పించుకోగల బ్రహ్మము. తను రెండుగా మారగలడు, ఆ రెండూ కలిసి ఒకటీ అవగలడు. మూడూ అవగలడు; “గాలి గర్భవతిలా బరువెక్కింది పరిమళంతో తనలో తను”
ఫాస్టస్ హెలెన్ ప్రేతాన్ని రప్పించటం కాదు ఇది.
ఇక్కడ “సత్యాన్నీ స్వప్నాన్నీ మేళవించింది” ఏది? మల్లెపూవులా? పరాన్నీ అపరాన్నీ, మోహాన్ని ముక్తిని, చావును బతుకునూ ఒక్క వాక్యంలో దాటింది ఎవరిక్కడ!
ఆత్మగా కరిగిన దేహం కాక! “ఏకమేవాద్వితీయం”ను “ఎకమ్ ఏవ ద్వితీయం” అయిన మానవ దేహం; ఆత్మకు తోడు తను వసించే దేహం!
దేహం, ఆత్మ వాటికవే ఒక జోడు అంటున్నాడా కవి. ఎక్కడికెళ్ళినా దేహాత్మల విడదీయలేని బంధం బైరాగి ప్రేమలో ఒక ముఖ్య రూపకం; “దేహాత్మలమిళిత వాంఛల” అంటాడు. అంటే, ఆత్మ ఏది ఆకాంక్షించినా, సంకల్పించినా, అది దేహం ద్వారానే సాధ్యం బైరాగికి (For any will of the spirit, body is the only way).
ఇక్కడినుంచి సంభాషణ దేహాత్మల నడుమ. “పెదవులమై, చేతులమై, కౌగిలియై, చుంబనమై, ఒక జ్యోతిర్మయక్షణమై చరిద్దాం. దేహాత్మల మిళితవాంఛల విశిష్టాద్వైతంలో ఏకం చేద్దాం”. బైరాగి విశిష్టాద్వైతం, అద్వైతంలో ఆత్మరతి; దేహాత్మల సంయోగం. ఆ సంయోగం “జీవనజలధి మథన జనిత హాలాహలాభీల జ్వాల…” అంటూ అభీలజ్వాలతో మొదలు పెట్టి మొత్తం సృష్టి ప్రకంపించే తాండవ నృత్యంలోకి దిగాక శాంతరసంగా ఉపశమిస్తుంది కవిత. “ఆ తరువాత ఏమిటని అడగకు.”
మట్టిలో పుట్టిన పూవుల మృణ్మయగంధంతో ప్రళయ సమాన ప్రణయాగ్ని శిఖలు పుట్టించుకుని దేహాత్మలు జోడుగా స్వర్గానికి చేరిన కవిత ‘మల్లెపూవులు’.
లౌకిక ప్రేమ వస్తువుగా నాల్గు కవితలు. వాటి శీర్షికలలో ‘ప్రేమ’.
కవి ఏ వస్తువును చూస్తున్నా ఒక తలంతో దాన్ని ఆగిపోనివ్వడు, స్థల కాల స్థితులు మూడింటి పూర్వాపరాలను సాకల్యంగా స్పృశించనిదే బైరాగి కవితా దర్శనం పూర్తి కాదు.
లౌకిక ప్రేమ కూడా సర్వవ్యాపకం అయిందాకా విస్తరిస్తూనే ఉంటుందని నాలుగు ‘ప్రేమ కవిత’ లలో, వాటికి ముందు వచ్చే ‘ప్రేమ-మృత్యువు’ అనే మరొక కవితలో దృష్టాంతం.
‘ప్రేమ-మృత్యువు’ ఈ శీర్షికలోని రెండు మాటలు కవలలా? మధ్యగీత కారణాన వాటిది ద్వంద్వయుద్ధమా? లేక రెండూనా? కలిసిపుట్టి ఒకదానితో ఒకటి యుద్ధం చేస్తాయా! (తర్వాత వచ్చే ‘వాలి’ ప్రస్తావన కూడా చూస్తాం.)
ప్రేమ, మృత్యువు సహజాతాలా, ఆగర్భ శత్రువులా అనే సందేహంతో మొదలవుతుంది ప్రయాణం.
‘ప్రేమ’ విషపు కోరల మిత్తవనాగు ఫణి పైన ఉండే ఒక మణి. శివుని జటాజూటంలో చంద్రకిరణంలా భాసిస్తూ పిలిచే మృత్యువు విసిరేసే వల ప్రేమ! అంటాడు కవి.
“మరణ మహాఫణి, ఫణాగ్ర దివ్యమణి. ప్రేమించటమంటే మిత్తవనాగు కాటందుకోవటమే!”
ప్రేమించడం మొదలయ్యేది, మనిషి తానొక ప్రత్యేక అస్తిత్వంగా మరణించడం మొదలు పెట్టాకనే అని చెప్తున్నాడా? అగ్నిలో దూకి మల్లెలా పైకి లేచినది కదా సీతారాముల ప్రేమ.
“కరడు గట్టిన అహాలను కరగించి, విరిగినా వంగని ఉక్కుటెడదల విడుదలకు…”. అదే కవితలో చివర అంటాడు, “నిశ్చలంగా నేను నీకు మృత్యువును మోహించటం నేర్పుతాను, నీవు నాకు ప్రేమించటం నేర్పుదువు గాని!”
బైరాగి కవితల్లోని ప్రేమ కథలు, ప్రేమకు శిక్షగా మరణాన్ని అమలు చేసేవి కాదు, మరణించటంతోటి మొదలై, మరణంతో కలిసో, మరణాన్ని వెంబడించో ప్రయాణం చేసి, అమరత్వాన్ని గెలుచుకున్న సావిత్రీ సత్యవంతుల వంటి ప్రేమ కథలు.
ప్రేమకు ఎంత శక్తి ఉండాలి అప్పుడు! ఎంత సత్యమై ఉండాలి అందుకు!
ప్రేమకు మృత్యువు శత్రువనీ, ఇద్దరికీ మధ్య పోరును మరో కవితలో పెడుతూ “మృత్యు శత్రువుబలం సగం కాజేసే వాలిలాగు” యుద్ధం చెయ్యి అంటూ ఎవరూ ఊహించలేని ప్రోత్సాహం ఇచ్చాడు ప్రేమకు బైరాగి.
“బుద్ధుడిలాగు, క్రీస్తులాగు, జాలిలాగు, వాలిలాగు” అంటూ,
మృత్యువు శక్తిలో సగం గుంజేసుకోగల ఒక ప్రాణిని సృష్టించి దానికి ప్రేమ అని పేరు పెట్టిన కవి బైరాగి ఒకడేనేమో.
నాలుగు ప్రేమ కవితల్లోని మొదటి కవితలో, ప్రేమకు ఎటువంటి మలిన అర్థం, ప్రయోజనం కల్పించుకున్నాడో సగటు మనిషి అని చెప్తూ, “పాటల నగరాంతఃపుర వర సుందరుల విసృమరకర కుణ్మలాల (చచ్చుబడిన)” అని “దుర్భర కల్మష కలుష ప్రేమ కాల్వల దుర్గంధ” దృశ్యాలను విశదంగా యేహ్యించి, చూపించి, “ఎలా పడి ఉందో మీ ప్రేమ ఛీ ఛీ” అని కూడా అంటాడు.
ఇంకా, మహత్వమైన వెలుగు నింపుకున్న మొగ్గలను నలిపేసి చరమయాత్రకు తొందరపడుతున్న పాపపంకిల పాదాలకు కూడా అంటుకుని “కల్మష కలుష ధూళివోలె అంటిన ప్రేమ వెంట వస్తానంటున్నది”, “శునకంలా రోజుకు వందసార్లు చస్తోంది”ట ఇక్కడి వ్యావహారిక ప్రేమ. వదలని బంధనం చేసుకుంటున్నారు, నిజంగా ప్రేమిస్తే విముక్తిని ఇవ్వగల ప్రేమశక్తిని కలగనని జనం.
“గాలిలాగు జాలిలాగు, నెత్తుటి క్రొవ్వొత్తిలాగు వెలిగిననాడు” కనపడుతుంది అసలైన ప్రేమ, సత్యమైన ప్రేమ, ఏడవకండి అని వెంటనే జాలిపడుతూ ఆశ్వాసిస్తాడు కూడా ప్రేమికుల్ని.
క్రీస్తు కనపడుతూ ఉండటం ప్రేమ అని బైరాగి అన్న చోటల్లా, ఇలా నెత్తురోడే కొవ్వొత్తి రూపంలో, ఒక స్ఫురణ ఇవ్వటం లేదూ అసలు ప్రేమ స్వరూపం పట్ల!
పైన వచ్చిన “శునకం” కూడా తర్వాత ఒక కవితలో స్వర్గారోహణం వరకూ “జాలిలాగు” నడిచింది.
“దేహం నుంచి వెనుదవిలి, పెనచి, కలచే మృణ్మయగంధం వంటి మోహం” దాటి లోపలకు చూడండి అంటుంది రెండవ ప్రేమ కవిత మొదటి వాక్యం.
సంఘర్షణ, విచికిత్స ప్రధానం ఈ రెండవ కవితలో, రెండు దేహాలా, రెండు ఆత్మలా ప్రేమించుకునేది అని ప్రశ్నించుకున్నట్లు మొదలై, దేహాత్మల గణితంలో చివరి శేషం ఏ “నేను?” ఈ అంతిమ అంతర్వస్తువుకు ఎన్ని తొడుగులు? దేనికి ఏది ముసుగు? ఇలా విచారణకు దిగుతుంది. “ఈ విభ్రాంత మోహాధ్వాంత కుహేళికలో మిగిలే సత్యలేశమేమిటి?” (మతిపోగొట్టే అంధకారమయమైన పొగమంచు వంటి మోహం) నీ మోహం మరో దేహం పైన అయితే నీవు అనుకుంటున్న “ప్రేమ”లో అసలు సత్యం ఏమిటి? మోహం నీ దేహం పైననే అయితే దాని ముసుగు తీసి చూడవద్దా, చూస్తే కనపడే అంతిమ సత్యం ఏమిటి? ఇలా రెండు ప్రశ్నలూ ఉన్నా, జవాబు ఒకదానికి తెలిస్తే రెండవదీ తెలిసినట్లే.
మళ్ళీ రెట్టిస్తూ మరో ప్రశ్న; చెక్కిళ్ళలోంచి మక్కువ కెంపులూ(మంకెన ఎరుపు కాదు, మక్కువను మించి ఏ రంగులు మెరవగలవు ముదిత చెక్కిలి పైన!), “శల్యావశిష్ట తనూ వల్లరి లోంచి కుంచియకందని సొంపుల ఠీవి” పోయాక “శుష్కపాండు జరాజీర్ణ దేహ యష్టి శేష మజ్జానిమజ్జిత” మైనది ఏదో తెలుసుకోవద్దా? ఇదే అసలు బైరాగి ప్రశ్న.
వయసు సొగసు పోయినా మజ్జానిమజ్జితమై నిలబడగలదే నిజమైన ప్రేమ.
అది హృదిలో దాగిన స్నేహం?
మజ్జానిమజ్జిత సత్యకిరణం?
అది తెలియాలి కదా అని గద్దిస్తుంది.
అంతే కాదు, వయసు జారిపోయేలోపు మనిషి పని లౌకిక ప్రేమ ఒకటే కాదు. అతనికొక బాధ్యత ఉంది ఈ లోకం పైన.
“దేహ యష్టి”తో ఏమి స్ఫురింపచేస్తున్నాడు కవి?
జీవితం యజ్ఞం అనీ, దేహాన్ని “staff (ధర్మము అనే దండము)” అనడంతో, ఇక్కడ ఒకదానిని “చరమఋణం”గా అర్పించవలసిన ధర్మం మానవులందరికీ ఉంది, ఈ లోకం నుండి నిష్క్రమించేలోపు, అనే స్ఫురణే కదా అది.
అందుకే నేను సైతం సృష్టిరచనకు ఒక సూర్యకిరణమై ప్రసరిస్తాను అని ఒక ప్రాణిగా సృష్టికే వాగ్దానం చేస్తున్నది కవిత; “సత్యకిరణం త్యాగం చేయవద్దా” అంటూ.
విశ్వమానవ దృష్టి
“అస్మిన్ వర్తమానకాలే భారతవర్షే భరతఖండే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే”కు పరిమితం కాక పలు విశ్వ సమూహాలకూ ఆవల ఉన్న ప్రదేశానికీ, కల్పాంతాలు ముగిసిన ఉత్తర కాలాలకు (సర్గ ప్రత్యూషం నుంచి ప్రళయావశేషం వరకూ అంటాడు కూడా ఒక చోట) తన ఉనికిని విస్తరింప చేసుకున్న కవికి, తను ఉన్న ఇప్పటి ఈ మేదినికి తనదైన ఒక సత్యకిరణం వదిలిపెట్టి ఋణం తీర్చుకోవాలని తెలుసు.
దేహంపై మోహంలో ప్రేమ ఉనికి ఎంతో చూసుకోమని హెచ్చరించిన క్రితం కవితలోని ఆ సత్యకిరణపు వెలుగు లోనే తరువాతి ప్రేమకవితలో “ప్రతి నేనుకు మరొక నీవు” తప్పనిసరి అంటాడు కవి. ఆ రెండు దర్శనాలు విరుద్ధాలు కానక్కరలేదు. పరస్పర పూరకాలు కావచ్చు కదా!
ప్రేమతో స్పందించని శూన్యాన్ని, ఎంత స్వర్ణంతో చేసినదైనా ఒక ప్రతిమనూ మనిషి ప్రేమించలేడంటాడు. “నీ ప్రేమకు దేహం ఒక వ్యవధానం, జీవం ఒక వ్యవధానం,” అంటూ ప్రేమకు దేహం పెద్ద అవకాశం అని ఉద్ఘాటించాడు.
కాదంటుంటే “అది వంచన!” అంటాడు కూడా.
“సమస్తాన్నీ ప్రేమించు” అనే మాట కూడా మామూలు జనావళికి కాదు.
ఆ ప్రేమ వేరు; “బుద్ధుడు, క్రీస్తు, వారు వేరు, గాలిలాగు జాలిలాగు, వెలుగులాగు, వారి ప్రేమ.” అంటూ ఆ “ప్రేమ”కూ ఈ ప్రేమకూ నిష్కర్షగా సరిహద్దు రేఖలు గీచి చూపించిన నిర్మొహమాటవాది బైరాగి, “ఇచట సీమిత హృదయ నికుంజాల విరళచ్ఛాయ.” అలాటప్పుడు ఈ లోకంలో ఉంటూ తోడు దొరకని ఏకాకితనం తాలూకు దైన్యం చూడటం కష్టం. ఈ “విశృంఖల వికార, విపిన్న, విచ్ఛిన్న విశ్వంలో”, అయ్యో నీకు ఇల్లు లేదు. పోనీ సంచారి అవడానికి దారి భత్యం కూడా లేదు, నాక్కొంచెం తోడు ఇవ్వు అని ఎవ్వరినీ భిక్ష అడగలేని ఒంటరివాడివి నీవు అంటూ జత లేనివాడిని చూసి చలించిన కవి మాటలు కేవలం శబ్దాలు కావు.
ప్రేమ దేహాశ్రయం అని తీర్మానించాక, తరవాత ప్రశ్న ఆ దేహానికి కలిగే దుర్దశల సంగతి ఏమిటని.
శరీరానికి వరమూ శాపమూ రెండూ వయసే; యౌవనం లోని పూర్ణచంద్రబింబం అంతలోనే “పాంశు పాండుర బింబం” అవుతుంది. ఇలా మూడే మూడు పదాల్లో దారుణ ముదిమిని చూపిన మరో కవి షేక్స్పియర్, నలభై ఏళ్ళు వచ్చిన బిడ్డను చూసి “అయ్యో ఇందుకా నిన్ను అంత కష్టపడి కన్నది అని దుఃఖిస్తుంది తల్లి” అన్నాడతను ఒక సానెట్లో.
“నీకు చేరువయే నీరవతా చరణ స్వరంలాగు, తెలియకనే ఎద కలచే ఇరుల ఎలుగు!” కాటుక చీకటి పూసుకున్న ఒక mournful, plaintive cry బైరాగి కవితా వాక్య బాణం. ముసలివాడికి వినపడవు తన దగ్గరకు వస్తున్న అడుగుల చప్పుడైనా, ఒక గీతంలోని స్వరం అయినా, మనకు తన కేక వంటి మూలుగు వినపడుతుంది కానీ.
కవి నిరాశతో రెండడుగులు వెనక్కు నడిస్తే ఆరడుగులు నమ్మకంతో ముందుకు లంఘిస్తాడు; “అమను, ముదిమి నీది కాదు, నీకు కాదు” నాకు బుద్ధి లేకపోయింది అన్నట్టు అంటూ, వెంటనే “జరాజ్వరిత జగతిలోన నీది నిరత హరిత సుషమ” అని దీవిస్తాడు. “ఏమనగా ఆమని అంతటితో చావదు” అని మంగళాశాసనం పలికాడు బైరాగి, శంకరుడు మార్కండేయుడికి పలికినట్లుగా. కుబుసం విడిచిన మహాశేషేంద్ర వివృత శోభ అట, యౌవన కాంతి మలిగాక వెలిగే శోభ.
అప్పుడు! అప్పుడే! వెలుతురు మర్చిపోయిన నీ నయనాలలో జ్యోతిః కవాటాలు తెరుస్తుంది, నిన్ను పసికందునులా ముక్కున కరుచుకుని చిక్కులుపడిన ప్రణయార్ణవాన్ని దాటిస్తుంది.
ఎవరు?
ఎవరు ఆ తరణి?
సత్యమైన ప్రేమ కాక!
ఇక, “జ్యోతిస్నాత శూన్యంలో నీవూ నేనూ తప్ప ఎవరూ లేరు!”
ఆ ఒక నేను-నీవు లను ఎన్ని జంటలుగా చేశాడో “దిగంతాలు మన స్వేచ్ఛకు నిరంతర ప్రతిబింబాలు”; దిగంతాలను ఎదురుబొదురు అద్దాలు చేసి.
“పృథివి ఒక అదృశ్య రేణువు” అనుకునే ఎత్తులో నిలిపింది ప్రేమికులను ఈ కవితావాక్యం.
ఇంత రొమాంటిక్‌గా సూర్యచంద్రులనే మణులుగా పొదిగిన అంగుళీయాన్ని దిగంతాల మధ్య నిలబెట్టి ఆమె అనామికకు ఎటువంటి ప్రేమికుడు తొడగగలడు?
ఆ ఔన్నత్యంలో నిలబడాలంటే “సృజన స్రజంలోని పరిమళ సూత్రం కొరకు వెదకవలదా?” మరణగ్రీవానికి వేలాడే మంగళసూత్రం వంటి ప్రేమను వెదికి కనగలగాలి కదా. మృత్యుమహాఫణి కోరలు పీకిపారేసిన సావిత్రీ సత్యవంతుల, నల దమయంతుల దివ్య ప్రేమను అనుభవానికి తెచ్చుకోవాలి కదా.
బైరాగి పేజీల్లో అంతటా అమితమైన వెలుగు భాసిస్తూంటుంది.
అదీ ఎక్కువగా ఆదిత్యకాంతి. ఈ సవిచ్ఛోభ, సావిత్రీ ప్రస్తావన, నిత్యచైత్ర గాత్ర పలవరింత ఎటు చూపిస్తున్నాయి? చావు పుట్టుకల ఆవలి వైపున ఉన్న చీకటినీ దాటి ఉందంటున్న వెలుతురునా? అది చూడగల దృష్టి ప్రేమది అంటున్నాడు కవి. దాన్ని తను చూసి మానవులకు చూపిస్తున్నాడు.
నాల్గవ కవితలో, యౌవనం, ముదిమి, మరణం, దాటాక కూడా మిగలవలసిన “అనర్ఘ పుష్పమణి” వంటి ప్రేమ కనపడుతుంది. “వినీల యవనిక వెనక ఉన్నది మన కజ్ఞాతం” అంటూనే, ఇక్కడ దేశం కాలం వెరపు వయసు లేదు అనగలిగాడంటే వాక్యం సగం పాదంలోనే ఆ తెరను ఛేదించాడు బైరాగి! చీకటి ఒడ్డును చూసిన మనం, జంట చక్రవాక పక్షులమై (“జక్కవ కవలాగు”), తొలివేకువ ఘడియ నుంచి ప్రళయం ముగిసాక మిగిలే శేషం వరకూ ఉంటాం, “నీవే నా తరణివి” అంటున్నాడు.
ఆ “నీవు” ఏదైనా కావచ్చు.
ప్రియురాలు కావచ్చు! ప్రేమ, సత్యం, స్నేహం, సమస్త సృష్టి పట్ల కరుణ కూడా కావచ్చు! అటువంటి ప్రేమే గనక కనపడితే ఇంత గొప్పగా ప్రకటిస్తాడు తనకు ఔచిత్యమైన గౌరవాన్ని ఇలా: “సిరులన్నీ ఒక మానికమైతే మానికాన్ని దాస్తాను నీకోసం, విరులన్నీ ఒక కోరకమైతే, కోరకాన్ని కోస్తా నీకోసం!” ‘ఒక గీతం’ కవిత.
ఆ ప్రేమ ఎదురుపడటం అసంభవం అనలేదు కానీ అది దుర్లభమనీ, అది దొరికింది నాకు అని మనిషి సులభంగా అనగలగడం, “ఇదంతా వమ్మే కాదా”! అందుకే “కడపటి చలిలో గడగడ వణికే చేతులతో తల్లి కడుపులో పిల్లనిలా నిన్నింకా దగ్గరగా వెతుకుతాను‘‘ అనటంలో ఆ ప్రేమ సాధారణంగా మనిషికి ఎంత సుదూరమో, సరిగా చూడగలిగితే అంత సమీపము కూడా. ఒక్కోసారి కడపటి చలి కమ్మిందాకా మనిషి దాన్ని పక్కవాడికి ఇవ్వటం, తను అందుకోవటం జరగకపోవచ్చు.
అందుకే సత్యమైన ప్రేమ అంటే బైరాగికి, రొమ్ము నోటికి అందించి విషం కుడిపిన పూతనకు మోక్షం ఇచ్చిన ప్రేమ, జీవనజలధి మథన జనిత భీకర హాలాహలజ్వాలను పాలలాగు గ్రోలిన ప్రేమ, లోకపు పాపాలు నెత్తురుతో కడిగి ప్రక్షాళనం చేసే శిలువమోసే ప్రేమ, మృత్యు స్వరూపాన్ని దర్శించి తన ప్రేమకు శాశ్వత అమరత్వాన్ని వరంగా గెలుచుకున్న సావిత్రి ప్రేమ వంటిది.
అమాయకత్వాన్ని కోల్పోవటమే ప్రేమను పోగొట్టుకోవడం. Loss of innocence is loss of love; తర్కాలు, జ్ఞానాలు ‘‘నేను‘‘ అనే స్పృహను వదిలిన మనిషికే ప్రేమలోకి పునరుత్థానం! అనేమో బైరాగి చెప్పటం.
ఆ ప్రేమగీతాలే, సంశయాల ‘ఆగమగీతి’ ప్రశ్నల నడుమ వినిపించిన మురళీ గానం.
బైరాగి దృష్టి, పరిశీలన గురించి ఒకమాట మాట్లాడాలంటే — బురదనూ, మురికి అంటని దివ్యమైన మణిని, రవికిరణాన్ని, నల్లని మురికిని, మబ్బుముక్కల అంచుల్లో పడిన తడి ఎండ కిరణాల రంగుల పరివర్తనల్లో పుట్టే సౌందర్యపు హరివిల్లులనూ సమదృష్టితో చూసే చూపు. మరణవధ్యశిలపై పగులుతున్న అలల తలల హోరునూ, ఒడ్డున వాటి నురగలు నవ్వే చిరు నవ్వులనూ, (ఒక వాక్యంలో చావు, నవ్వు రెండూ చూపిస్తాడు గుప్పెట్లో మట్టిలాగ) ప్రశాంతమైన అడవులవీ, ఆకాశం అంటుతున్న కొమ్మల చివుర్లవీ, రకరకాల రంగుల్లో, వయోఅవస్థల్లో ఉన్న ఆకుల గుసగుసలను, పాటలనగరాంతఃపురాల వెర్రి కేకలనూ, వృద్ధాప్యపు శోకపు మూలుగునూ ఇలా పరస్పర విరుద్ధ శబ్దాలను ఒకే శ్రద్ధతో స్పష్టంగా వినగల శ్రవణజ్ఞానం.
బైరాగిది సమదృష్టి, సమన్వయ దృష్టి.
ఆకుల అంచులపై తుహినాన్ని తుడుస్తున్న సూర్యకిరణపు సువాసనను తెలుసుకోగల ఘ్రాణశక్తి. “కింశుక ప్రవాళ” అంటూ దుర్లభమైన ఆ మోదుగపువ్వు రంగు, పగడపు రంగుల మిశ్రమాన్ని కలిపి చిలకగల కుంచె బైరాగి ఊహాపటిమ.